నాగన్న స్మృతిలో…

పల్లవి :

గోదారి నదిలా గెంతులేసె పాట
నాగన్న పాట విప్లవాల పాటా
ఏదారి లేనోల్ల నొకటి జేసే పాటా
పేదోల్ల పాట నాగన్న నోటా
చెట్టుమీద కోయిలమ్మ కూత కూసినట్టు
చెట్టు కింద లేగ దూడ గారాము చేసినట్టు
తల్లి ఒడిలో సంటి బిడ్డ ఆడుకున్నట్టు
అడవిలో సింహమై గర్జించినట్లు ||గోదారి||

యాభై ఏళ్ళ అరుణోదయ బాటసారితోని
అల్లుకున్న గొంతులెన్నొ పదములల్లుకోని
ఖమ్మం మెట్టు కొండలల్లొ పోడు భూమిలోనా
నీ పాటలన్నీ విత్తులోలే వెదజల్లుకోని
కాలమెంత గడిసెనో కానూరితోని
రాగమైతె కలిసేనో రామారావుతోని
ఆదివాసీతోని రైతు-కూలి తోని
విద్యార్థి యువకులు వీరనారీమణులు
వేలాది అమరుల త్యాగాల చరితతోని ||గోదారి||

పోరు పాట పుట్టెనంట ఉద్యమాలతోని
నక్సల్బరి సిక్కోలు గోదావరిలోయతోని
పని పాట కల్సినట్టి జానపదులతోని
డప్పుగొట్టి ఆటలాడె ప్రజా కళలతోని
రాజారం ఊరి నుండి రాష్ట్ర ప్రజలతోని
రగల్ జెండ చేతబట్టి పోరుబాటతోని
గోదావరి లోయ నుండి సిరిసిల్లతోని
అణిచివేత చెలరేగి రాజ్యహింసతోని
ప్రతిఘటన పోరుబాట పల్లవులందుకొని ||గోదారి||

తాళ్లెక్కి కళ్ళుగీసే కూలి పనులతోనే
అక్షరాలె ఎరిగినట్టి కొద్ది సదువుతోని
శ్రీపాద శ్రీహరన్న ప్రేరణందుకోని
కదనంలో ఎదిగినట్టి కమ్యూనిస్ట్ జ్ఞాని
సహచరి లక్ష్మితోని కొడుకు అజయ్ తోని
గొంతులెన్ని సానబెట్టే వంత పాటలతోని
బుర్ర కథతోని ఒగ్గు కథతోని
కాల్ల గజ్జలతోని కంజెర డప్పుతోని
దండోరెస్తూ సాగినాడే అరుణోదయ దండుతోని

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply