నియోరియలిజం జానర్ లో ఇరాన్ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రం “ది సాంగ్ ఆఫ్ స్పారోస్ ” (The song of Sparrows). పర్షియన్ భాషలో ఇంగ్లీష్ ఉపశీర్షికలతో వచ్చిన ఈ చిత్రానికి ఇరాన్ ప్రముఖ దర్శకుడు మాజిద్ మజిది (Majid Majidi) దర్శకత్వం వహించారు. ఆయన సహ నిర్మాత జావద్ నోరుజ్బేగి (Javad Noruzbegi). మెహ్రాన్ కషానీ (Mehran Kashani) తో కలిసి మాజిద్ మజిది దీనికి స్క్రిప్ట్ రచన కూడా చేశారు. ఈ చిత్ర నిడివి 96 నిమిషాలు.
ఇతివృత్తం
మానవ జీవితాల్లోని స్నేహం, అందం, నైతికత మొదలైన విలువలను నిలిపి ఉంచాలి గానీ ఆధునిక యుగం మానవులను ఊపిరి తీసుకోనివ్వకుండా వస్తు వ్యామోహంతో ఉక్కిరి బిక్కిరి చేయకూడదనే భావనల చుట్టూ అల్లిన ఇరాన్ గ్రామంలోని కరీం అనే ఒక వ్యక్తి జీవిత కథ.
కథ లోకి వెళ్తే కరీం, అతని భార్య నర్గీస్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో టెహ్రాన్ కి సమీపాన ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంటారు. కరీం ఒక పొలంలో ఉష్ట్ర (ఆస్ట్రిచ్) పక్షులను కాపలా కాసే ఉద్యోగంలో పని చేస్తుంటాడు. వాటికి మేత వేస్తున్నప్పుడు అబ్బాస్ అనే అతని కజిన్ వచ్చి, దారిలో కరీం భార్య కలిసి అతన్ని వెంటనే ఇంటికి రమ్మని చెప్పిందని చెప్తాడు. ఎందుకని అడిగితే కరీం పెద్దకుమార్తె హనియే తన వినికిడి పరికరాన్ని పోగొట్టుకుందని, ఎంత వెతికినా దొరకలేదని చెప్పిందని చెప్తాడు. హనియేకి త్వరలో పరీక్షలున్నాయని, ఆ పరికరం పోతే కష్టమని కరీం వెంటనే ఇంటికి బయలుదేరి వెళతాడు.
అతని కుమారుడు హుస్సేన్, స్నేహితులతో కలిసి నీటితొట్టి బురదలో వినికిడి పరికరంకోసం వెతుకుతుంటాడు. వాళ్ళని మందలించి, తానుకూడా వెతుకుతాడు. చివరికి పరికరం దొరుకుతుంది గానీ అది సరిగ్గా పని చేయడం లేదని కరీం గమనిస్తాడు. వెంటనే తిరిగి పొలానికి వచ్చేసరికి ఒక పెద్ద ఆస్ట్రిచ్ పక్షి తప్పించుకుని పారిపోతుంది. దాని వెంట కరీంతో పాటు అనేకమంది పరుగులు పెట్టినా, ఎవరికీ అందకుండా తప్పించుకుని పారిపోతుంది. దాని ఖరీదు 350,000 టోమన్లు. అంత ఖరీదైన దాని వెలను చెల్లించగల ఆర్ధికశక్తి కరీంకి లేదు కాబట్టి జరిగిన నష్టానికి అతని యజమాని కరీంని ఉద్యోగంనుంచి తొలగిస్తాడు. ఇప్పడు కరీం మూడు విధాలుగా నష్టపోతాడు. కూతురి వినికిడి పరికరం పోవడం, ఉష్ట్రపక్షి పారిపోవడం, ఉద్యోగం ఊడిపోవడం!
హనియే విరిగిన వినికిడి యంత్రాన్ని బాగుచేయించాలని అతను ఆసుపత్రికి వెళ్ళి సంప్రదిస్తే నాలుగు నెలల సమయం పడుతుందని అంటారు. వెంటనే కావాలంటే టెహ్రాన్ నగరానికి తీసుకెళ్ళమంటారు. వినికిడి పరికరాన్ని సకాలంలో పొందలేకపోతే హానియే పరీక్షలు రాయలేదని అతను ఆందోళన చెందుతాడు. ఇక చేసేదేమీ లేక అది బాగుచేయించాలనే కోరికతోనూ, జీవనోపాధికోసం ఏదైనా పని వెతుక్కోవచ్చు అని కూడా ఆలోచించి కరీం తన మోటార్ సైకిల్ పై ఇరాన్‌లోని టెహ్రాన్ నగరానికి బయలుదేరి వెళతాడు. రద్దీగా ఉన్న టెహ్రాన్ నగరపు బిజీలో, ట్రాఫిక్కూ, హోటళ్లు, బార్లు, వ్యాపారాలు ఒకటే పరుగులతో హడావిడిగా తిరిగే జనాన్ని చూస్తూ గందరగోళపడుతూ కరీం దిక్కులు చూస్తున్న సమయంలో, పరధ్యానంలో ఉన్న ఒక వ్యాపారవేత్త కరీంని మోటార్ సైకిల్ టాక్సీ డ్రైవరుగా భావించి, అతని మోటార్‌సైకిల్ వెనుక ఎక్కికూర్చుని పోనివ్వమంటాడు. గమ్యంచేరాక కొన్ని టోమన్లు చెల్లిస్తాడు. అనుకోకుండా దొరికిన ఈ కొత్త పని లాభదాయకంగానే ఉందనుకుంటాడు కరీం. ప్రతిరోజూ నగరానికి వెళ్ళి కొంత సంపాదించడం అతని దినచర్యగా మారుతుంది. టెహ్రాన్ నగరపు తళుకు బెళుకులు కరీంని విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ విధంగా కరీం మీద నగరం పట్టుబిగుస్తుంది!
భారీ ట్రాఫిక్‌లో మనుషులను, వస్తువులను కరీం ఒక చోటినుంచి మరొక చోటికి చేరుస్తుంటాడు. నగరంలో కరీం చూస్తున్న వ్యక్తులు, వస్తువులు అతని ఉదారమైన, నిజాయితీ స్వభావాన్ని మార్చడం ప్రారంభిస్తాయి. ప్రతిరోజూ చెత్తలో పారేసిన వస్తువులను అతను నగరం నుండి తన ఇంటికి తీసుకువస్తుంటాడు. రోజు రోజుకీ మరింత దురాశాపరుడుగా మారుతూ తన కూతురి వినికిడి పరికరం గురించి మర్చిపోతాడు. ఈ మార్పు అతని భార్య, కుమార్తెలను బాధిస్తుంది. ఒకరోజు అతను ఇంటికి తెచ్చిన పేరుకుపోతున్న చెత్త కుప్పను సర్దడానికి ప్రయత్నించినప్పుడు, ఆ కుప్ప అతని చుట్టూ కూలిపోయి అతని కాలు మీద బలంగా పడడంతో కాలు విరిగిపోతుంది. కాలు విరగడంతో పాటు ఇంకా కొన్ని గాయాల పాలై పని చేయలేని పరిస్థితిలో మంచానికి పరిమితమవుతాడు!
భార్యా, పిల్లలూ, ఇరుగుపొరుగు వాళ్ళు అతనికి అన్ని విధాలుగా సేవలు చేస్తారు. అతను కోలుకుంటున్న సమయంలో, అతని కొడుకు హుస్సేన్, తాను చేయగలిగిన పని చేయడం మొదలుపెట్టి కుటుంబాన్ని పోషించడానికి శక్తిమేరకు సహాయ పడతాడు. హుస్సేన్, అతని స్నేహితులు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు చేపలను కూడా కొనగలుగుతారు. అతని మామతో కలిసి స్థానిక పొలానికి కొన్ని మొక్కలను పంపిణీ చేస్తున్నప్పుడు, చేపలు ఉన్న పీపా లీక్ అవ్వడం మొదలవుతుంది. ఆ పిల్లలు దానిని తిరిగి నింపడానికి సరిచేయడానికి తీసుకువెళుతున్నప్పుడు, ఆ పీపా పగిలిపోయి చేపలన్నీ నేలపై పడిపోతాయి. అవి చనిపోవడాన్ని చూస్తూ ఊరుకోకుండా, అతని కొడుకు హుస్సేన్ ఆ చేపలను సమీపంలోని నీటిలో వదిలేస్తాడు. కరీం ఇది చూసి తన కొడుకు భూతదయ, మంచితనం, మానవత్వాల గురించి తెలుసుకొని గర్వపడతాడు. కరీం సహజ ప్రపంచాన్ని ఇంట్లో చిక్కుకున్న పిచ్చుక స్వేఛ్చగా ఎగిరిపోవడంతో గుర్తిస్తాడు. దానిని విడిపించినప్పుడు అతను తిరిగి తన సొంత స్వభావానికి తిరిగి వస్తాడని, నిజంగా మారడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రేక్షకులకు తెలుస్తుంది!
కరీం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతూ ఉంటుంది. గాయాలనుండి కోలుకుంటున్నప్పుడు, కరీం కాస్త ఆగి జీవితంలోని అందాలను తీరిగ్గా ఆస్వాదించగలుగుతాడు. ఇంతలో కరీం మాజీ సహోద్యోగి రమజాన్ ఇంతకుముందు పారిపోయిన నిప్పుకోడి తిరిగి వచ్చిందని, అతను కూడా తిరిగి ఉద్యోగంలో జాయిన్ కావచ్చునని ఒక సంతోషకరమైన సందేశంతో పాటు ఒక బహుమతిని కూడా తెస్తాడు. కరీం పొలానికి వెళ్లి కన్నీళ్లతో ఉష్ట్రపక్షి నాట్యాన్ని ఆర్ధ్రంగా చూస్తున్నప్పుడు సినిమా ముగుస్తుంది.
“ది సాంగ్ ఆఫ్ స్పారోస్” లోని సార్వత్రిక కథనం
ప్రపంచంలోనే అతిపెద్ద పక్షులతో సినిమా ప్రారంభమవుతుంది. అతి చిన్న చిట్టి పక్షులు స్వేఛ్చగా ఎగరిపోవడం ఒకరకమైన ఎరుకను, జీవిత సత్యాన్ని తెలుపుతున్నట్లుగా సినిమా చివరిలో కనిపిస్తుంది! “స్పారోస్” అనేదే సినిమా టైటిల్. ఈ స్టోరీ లైన్ ప్రపంచంలో ఎక్కడైనా జరగొచ్చు!
ఇరాన్ వేగవంతమైన రాజధాని టెహ్రాన్ – కరీమ్ నివసించే వ్యవసాయ ప్రాంతం మధ్య వ్యత్యాసం “ది సాంగ్ ఆఫ్ స్పారోస్” లో స్థిరంగా ఉంటుంది. టెహ్రాన్‌లో, భవనాలు, కాలిబాటలు, కార్లతో కాంక్రీట్ జంగల్ లా ఉంటాయి. ప్రజలు కూడా ఊపిరి సలపనట్లు నిరంతరం బిజీ, బిజీగా ఒత్తిడిలో ఉంటారు. కానీ కరీం గ్రామంలోని స్థానిక పరిసరాలలో గాలికి హొయలు పోయే పచ్చని చెట్లతో, కొండల మధ్య రంగురంగుల దుస్తులు ధరించి, కలలు నిండిన కళ్ళతో ఉన్న చిన్నారులతో జీవితం సౌందర్యంతో, నవరసభరితంగా కనిపిస్తుంది!

సినిమా అనేది ఒక సామూహిక మాధ్యమం. అలంకరణ, లైటింగ్, స్థలం, వస్త్రధారణ, కాస్ట్యూమ్స్, నటన వంటి అంశాలు – వీటిని సమిష్టిగా ‘దృశ్య విన్యాసం’ (mise-en-scene) అని పిలుస్తారు. ఈ విన్యాశాల వింగడింపుతో చిత్రనిర్మాతలు తమ ఆలోచనలు, అవగాహనలను ప్రేక్షకులకు బదిలీ చేయడానికి, సన్నివేశాలకు తగిన అర్థాలను కల్పించడానికి, అవి కీలక పాత్ర పోషించడానికి వివిధ మార్గాలను అవలంబిస్తారు. సినిమాలోని ఈ ఐదు అంశాలను నిశితంగా పరిశీలించడం, విశ్లేషించడం వలన ప్రేక్షకుడిలో చలనచిత్రం చూసే అనుభూతిని మరింత మెరుగుపరచవచ్చుఅని ప్రపంచ సినీ విమర్శకులు గుర్తించారు. ఈ చిత్రంలోని కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలలో ఈ ఐదు అంశాల గురించి ప్రపంచ సినీ విమర్శకులు చర్చించారు. కథాంశంలో వాటి ప్రాముఖ్యత, ప్రేక్షకులపై దాని ప్రభావాలను కంటెంట్ విశ్లేషణను ఉపయోగించి విశ్లేషించారు. “In the name of God” అనే టైటిల్ కార్డ్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టి ఇది ఇస్లామిక్ ధర్మాలను కీర్తిస్తుందని కొందరన్నారు. కానీ ఈ చిత్రంలో మతపరమైన కార్యక్రమాలేవీ ఉండవు, పైగా ఒక అందమైన, మనోహరమైన నైతిక విలువల కథను అందిస్తుంది. ఇది మతానికి అతీతంగా, అన్ని సంస్కృతులకూ మనుషులందరికీ విస్తరించవలసిన విశ్వజనీనమైన ఒక పాఠం.
మాజిద్ మజిదీ అసాధారణ ఊహా ప్రపంచం!
ఇరానియన్ సినిమా మంచి ప్రత్యామ్నాయ సినిమాలకు పెట్టింది పేరైతే అందులో మాజిద్ మజిది అగ్రగణ్యుడు. 1999 లో దృశ్యీకరించిన క్లాసిక్ చిత్రం “చిల్డ్రన్ ఇన్ హెవెన్”, 2000 లో చిత్రీకరించిన “ది కలర్ ఆఫ్ పారడైజ్” లతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మాజిద్ మజిదీ దర్శకుడి అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు ప్రపంచ సినీ విమర్శకులందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ కథలలోని కవితా సరళత, ఊహాశక్తి, తమ ప్రభుత్వం విధించే కఠినమైన సెన్సార్‌షిప్‌ను తప్పించుకునే తెలివైన మార్గాలకు విశ్వవ్యాప్తంగా మాజిద్ మజిదీకి సినీ ప్రియులందరూ వీరాభిమానులైపోయారు!
ఇప్పుడు కూడా ఈ “ది సాంగ్ ఆఫ్ స్పారోస్” చిత్రానికి మెహ్రాన్ కాషానీతో కలిసి అద్భుతమైన కథనం అందించాడు మాజిద్ మజిదీ. సాధారణ విషయాలను కూడా ప్రకాశవంతంగా, మనోహరంగా హృదయానికి హత్తుకునే దృశ్యాలుగా మలచడంలో ప్రాపంచిక నైపుణ్యం కలిగిన నిష్ణాతుడు. ఈ చిత్రాన్ని తన సరళమైన, సహజమైన జ్ఞానంతో, దృశ్యసౌందర్యంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంలో దిట్ట అని మాజిద్ మజిదీని ప్రపంచ సినీ విమర్శకులు కొనియాడారు!
దర్శకుడు మాజిద్ మజిదీ పిల్లల ఇతివృత్తంతో సాగే తన చిత్రాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ “ది సాంగ్ ఆఫ్ స్పారోస్” సినిమాలో మాత్రం, ఆయన ఒక తండ్రిపై తన దృష్టి సారించాడు. ఇది ఒక కరీం కథ, ఒక వ్యక్తిగా కరీం చైతన్యాన్ని సజీవంగా ఆవిష్కరించాడు. అతను జీవితం పట్ల, జిజ్ఞాస, ఆసక్తి, కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటాడు. ఒకానొక పరిస్థితిలో జీవితం తెచ్చిన మార్పుల వల్ల అత్యాశలకు, దూరాశకు లోనవుతాడు. కానీ హద్దులు దాటినప్పుడు భార్యా పిల్లలు, కొడుకు హమీద్, పొరుగువారు తమ సేవల సహాయంతో పూర్తి స్పృహలోకి రావడానికి సహాయ పడతారు. సినిమాటిక్ మాజిక్ తో మాజిద్ మజిదీ ఈ సంఘటనలను చాలా సహజంగా అందరినీ నప్పించేవిధంగా రూపొందించాడు!
దర్శకుడుగా మాజిద్ మజిదీ ఏ చలనచిత్రాన్నయినా అసాధారణ సంఘటనలతో కూడిన మెలోడ్రామాగా గానీ, అతిగా సందేశాలిచ్చే చిత్రంగా గానీ మార్చలేదు. తనకు తానుగా మాట్లాడుతున్నట్లు ఒక సాధారణమైన కథను చెప్పడం మొదలుపెడతాడు. అది మనందరి కథలాగే ఉంటుంది. “సాంగ్ ఆఫ్ స్పారోస్” భౌతికవాదం, అవినీతి ప్రమాదాల గురించి చెప్తుంది. కరీం సంపాదించిన ఆస్తుల పర్వతం చివరికి అతనిని ముంచెత్తుతుంది. అతని భార్య, పిల్లల నుండి వేరు చేస్తుంది. అది చివరికి కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత, ప్రేమ గురించి, ఇరుగు పొరుగులతో సఖ్యంగా, సౌహార్ధ్రంగా ఉండడం గురించి మాట్లాడుతుంది.
‘ది సాంగ్ ఆఫ్ స్పారోస్’ చిత్రాన్ని మానవులపట్ల, వారి వైఫల్యాలపట్ల గొప్ప కరుణ, గౌరవాలతో చిత్రించాడు. ఈ చిత్రాలలోని పాత్రలు ఇతరులతో వ్యవహరించే విధానాన్ని చూపుతాయి. కానీ అవి ఎప్పుడూ సహాజత్వపు పరిధిని దాటవు.
ఈ చిత్రం చాలా వరకు ప్రొఫెషనల్ కాని నటుల తారాగణంతో సాధారణ శైలిలో చిత్రీకరించబడింది. ఇది మట్టి వాస్తవికతను తెలుపుతుంది. కానీ ఇక్కడ కూడా మాయాజాలం పని చేస్తుంది. కరీం వ్యక్తిత్వం మనకు ఒక రకమైన కిటికీలాగా ప్రేక్షకులు తమను తాము ప్రొజెక్ట్ చేసుకునేందుకు పనికొస్తుంది. మతపరమైన అనుబంధాలకు అతీతంగా మన స్వంత జీవితాలను, పరిశీలించుకోవడానికి, జీవితపు సరళమైన అందాలను అనుభవించమని మాజిద్ మజిదీ మనల్ని ఆహ్వానిస్తాడు. పక్షి పాట ఒక్కసారిగా పొడిగా, హాస్యాస్పదంగా, లోతుగా కదిలిస్తుంది. అతి సాధారణంగా రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలతో, ఇరానియన్ కుటుంబాన్ని చూపిస్తూ పరోక్షంగా మనందర్నీ ప్రభావితం చేసే చిత్రంగా రూపొందించారు. ఇది ప్రేక్షకులను సున్నితంగా కదిలించి ఆలోచించమని విజ్ఞప్తి చేసే హృదయపూర్వక చిత్రం. ఆధునికత తెస్తున్న వస్తు మాయాజాలం పెంచుతున్న ఎడతెగని దాడి నేపథ్యంలో మానవులు తమ మంచితనాన్ని ఎలా నిలుపుకుంటారు? అని మనల్ని ప్రశ్నిస్తాడు మాజిద్ మజిదీ. చిన్ని పిచ్చుక పాటలా సున్నితంగా అందంగా తన సమాధానాన్ని కరీం ద్వారా మాజిద్ మజీదీయే మనకి అందిస్తాడు!
కానీ ఈ చలనచిత్రం ఎప్పుడూ “నగరం చెడ్డది; పల్లెటూరు మంచిది” అనే విభజనలోకి గానీ, భౌతికవాదం పర్యవసానాల గురించి గానీ చర్చించదు. జీవితం అంత సరళమైనది కాదని మాజిద్ మజిదీకి తెలుసు. నిజ జీవితంలోని హాస్యం, నాటకీయతలతో కూడిన ఈ సరళమైన కథతో పాటు, మనం ప్రతిరోజూ ఎదుర్కొనే చిన్న చిన్న నైతిక నిర్ణయాల ద్వారా, మాజిద్ మజిదీ ఇరాన్‌లోని సహజమైన మానవ జీవితాన్ని మనకు హృద్యంగా, వినోదాత్మకంగా చూపిస్తాడు.
దర్శకుడు మాజిద్ మజిదీ ఈ చిత్రం ద్వారా తాను వ్యక్తీకరించ దలచుకున్న అభిప్రాయాల గురించి ఒక ప్రకటనలో “ఆధునికీకరణ చెందుతున్న యుగం మానవాళిని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో, ఏ విధంగా తన గుప్పిట్లో బిగించి ఉంచిందో చూపించడానికి ఆధునిక ప్రపంచానికి వ్యతిరేకంగా నేటి సమకాలీన ప్రజల జీవన వాస్తవికతను ఆవిష్కరించడమే నా లక్ష్యం.” దీనివల్ల నేను ఆధునికతను వ్యతిరేకిస్తున్నాను అని అర్ధం కాదు, ఆధునీకరణ అనేది మానవాళికి ఉపయోగపడేలా, సేవ చేసేలా ఉండాలి. కానీ ప్రజలు ఆధునికత ప్రభావానికి లోనై దానికి బందీలవుతున్నారు. ఫలితంగా, రోజురోజుకూ మనం మన మానవీయ విలువలకు మరింత దూరమవుతున్నాం… ప్రేమ, స్నేహం, సహానుభూతి, మామతానురాగాలు, ఆప్యాయతలు, నైతిక విలువలు, సౌందర్యాలతో సహా అనాది నుంచి సమాజం ఏర్పరచుకున్న మంచి విలువలన్నీ రోజురోజుకూ తక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటూ నెమ్మది, నెమ్మదిగా ఒక్కొక్కటీ అంతర్ధానమవుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా, మనం మన మానవ సహజ తత్వానికి తిరిగి వెళ్లాలని, లేకపోతే భవిష్యత్తులో ఒక పెను విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడమే నా ఉద్దేశం అని పేర్కొన్నాడు.
మొత్తం మీద ‘ది సాంగ్ ఆఫ్ స్పారోస్” చిత్రాన్ని మాజిద్ మజిదీ మంచి – చెడు రెండింటినీ మధురమైన, ఉత్కృష్టమైన, కవితాత్మకమైన ఘట్టాలతో ఆమోఘంగా చిత్రిక పట్టారు. నటీ నటులందరి నుండి, ముఖ్యంగా చిన్నారి అల్లరి బాలుర నుండి గొప్ప నటనను మాజిద్ మజిదీ రాబట్టినందుకు ఎంతైనా ప్రశంసనీయులు!
ఇది మార్కెట్ సంస్కృతిలో కొట్టుకుపోతున్న ప్రజలందరికీ వర్తించేదైనప్పటికీ, మరీ ముఖ్యంగా ప్రపంచంలోని ఫస్ట్ వరల్డ్ అనబడే ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలైన అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలలో సరి కొత్త వస్తువులను కూడా సీల్ కూడా విప్పకుండా విపరీతమైన వస్తువ్యామోహంలో కొత్త వస్తువులను కొంటూ, వాటి మోజులో అప్పుడే కొన్నవస్తువులను పారవేస్తున్న కొన్నిదేశాల ప్రజలను ఈ ప్రకటన ఆలోచించేలా చేస్తుంది!
కరీంగా నాజీ మర్చిపోలేని నటన!
కరీం పాత్ర తన కోసమే ఉద్దేశించినట్లుగా నాజీ అందులో ఒదిగిపోయాడు. అన్నిసన్నివేశాలలో అతని ముఖం ఆ యా సందర్భాలకు తగ్గట్లుగా ఆనందం, విషాదం, హాస్యాలను పలికించగలిగిన అద్భుతమైన భావవ్యక్తీకరణలతో, ఆలోచనాత్మకంగా ఉండడం అతి సామాన్యంగా ఉంటూ అనన్య సామాన్యమైన నటనను ప్రదర్శించగలగడమే అతని అద్భుతమైన ప్రతిభకు తార్కాణం!

కరీం అందమైన గ్రామంలో తన చిన్నఇంట్లో ముగ్గురు పిల్లలతో, అతి తక్కువ వనరులతో, ఉష్ట్ర పక్షుల కాపలా దారుగా చిన్న పాటి ఉద్యోగంలో సరళమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేవాడు. ఇరుగుపొరుగువారితో బంధువులతో సఖ్యంగా, ప్రేమాభిమానాలతో జీవించేవాడు. పిల్లల కోసం పరితపించే వాడుగా, మొదటిసారీ టెహ్రాన్ కి బయలుదేరి వెళుతూ, హానియేను స్కూలు దగ్గర దింపుతూ ప్రేమగా, “బంగారు తల్లీ, నేను నీకు త్వరలో వినికిడి పరికరాన్ని తెస్తాన” ని చెప్తాడు.
కరీం కుటుంబానికి భౌతిక సంపద ఉదాహరణకు ఫ్రిజ్ వంటివి లేకపోవచ్చు. అలాగే వారికి కుళాయి నీటి సౌకర్యం కూడా ఉన్నట్లు కనిపించదు. అయినప్పటికీ వారు అత్యంత పేదరికంలో ఉన్నవారేమీ కాదు. టెహ్రాన్ శివార్లలోని గ్రామీణ జీవనశైలి ప్రకారం చూస్తే వారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సాధారణంగా ఒకరితో ఒకరు, పొరుగువాళ్ళతో సంతోషంగా జీవిస్తున్నారు. కానీ వారు ఎదుర్కొనే ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం అందరికి బాగా తెలిసినవే!
కరీం జంతువులపై గాఢమైన ప్రేమను కలిగి ఉంటాడు. సినిమా ప్రారంభంలో ఉష్ట్రపక్షులను దయగా సాకుతున్నట్లు కనిపిస్తాడు. ఉష్ట్రపక్షి పారిపోయినప్పుడు కరీం తన బైక్‌పై గ్రామీణ ప్రాంతాలను వెతుకుతాడు. ఉష్ట్రపక్షి దుస్తులను ధరించి, చుట్టూ తిరుగుతూ దాక్కోకుండా పక్షిని తిరిగి సంపాదించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని ప్రయత్నమేమీ ఫలించదు. ఉష్ట్రపక్షి దుస్తులలో, ఆ పక్షి లాగే కదులుతూ, అవే మేనరిజమ్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే, హాస్యాన్ని పండించే సీన్ లో నాజీ పక్షిలా తనను తాను మర్చిపోయి జీవించిన సీన్ ని ప్రేక్షకులు మర్చిపోలేరు!

కరీం స్వతహాగా దయగలవాడు, శ్రద్ధగల తండ్రి, నిజాయితీ పరుడు. కానీ ప్రతిరోజూ నగరానికి వెళ్ళి కొన్ని టోమన్లు సంపాదించడం నిత్యకృత్యమై పోతుంది. నగరం తళుకు బెళుకులు అతనిని మార్చడం ప్రారంభిస్తాయి. అతను నగరంలో పనికిరాని చెత్త వస్తువులను దూరాశతో తన ఇంటికి తెచ్చి పేర్చడంలో నిమగ్నమవుతాడు – టెలివిజన్ కోసం కొత్త యాంటెన్నా, తలుపులు, వారి ఇంటికి అవసరమనుకున్న విండో ఫ్రేమ్‌తో పాటు కొన్ని పనికిరాని చాలా వస్తువులను కూడా అత్యాశతో చేరేస్తాడు. అతని నిత్యకృత్యాలు, ప్రాధాన్యతలు నెమ్మదిగా మారిపోతుంటాయి. అతను చాలా ముఖ్యమైన వాటిని కోల్పోవడం ప్రారంభిస్తాడు. అతను ఒకప్పుడు అమూల్యంగా భావించిన విలువలను పునరుద్ధరించాల్సిన బాధ్యత ఇప్పుడు అతని భార్య, కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులపై పడుతుంది.
కరీం తెచ్చిన నీలిరంగు తలుపును నర్గేస్ పొరుగువారికి ప్రేమగా ఇచ్చినప్పుడు, అతను పనిగట్టుకుని పొరుగింటికి పోయి దానిని తిరిగి తెచ్చుకుంటాడు. అతని భార్య ఈ చర్యకు ఇబ్బంది పడుతూ పొరుగు వారిముందు అవమానం పొందినట్లు బాధపడుతుంది. ఇంట్లో ఆమాత్రం కూడా స్వాతంత్ర్యం లేనట్లుగా భావించి దుఃఖపడుతుంది.
నగరంలో సేకరించిన వస్తువుల కుప్పను సర్ధడానికి ఎక్కుతుండగా, అతను పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. మంచాన పడిన ప్పుడు, అతను తన భార్య, ఇరుగుపొరుగువారి దయపై ఎంత ఆధారపడతాడో తెలుసుకుంటాడు.

త్వరలో, అతని కుటుంబం కరీంలో మార్పులను గమనించడం ప్రారంభించింది. అతని ఉదారమైన ఇచ్చే స్వభావం (Giving Nature) భౌతిక ఆస్తులపై పెరిగిన కోరికతో అధిగమించినట్లు కనిపిస్తుంది. అతను ఒకప్పుడు ఆనందంగా అవసరమైన పొరుగువారికి ఇచ్చే వస్తువులను ఇప్పుడు విపరీతమైన స్వార్ధంతో స్వలాభం కోసం ఉంచుకుంటున్నాడు. కరీంలో ఇలాంటి దురాశలతో తన అసలు ప్రాధాన్యతలను మర్చిపోతున్నప్పుడు అతని చిన్నారి కుమారుడు హుస్సేన్ కూడా సముపార్జన స్వభావాన్ని క్రమంగా పెంచుకుంటాడు. హుస్సేన్, అతని స్నేహ బృందం పాత బావిని బాగు చేసి, చేపలు కొనడానికి డబ్బును సేకరించాలనే తపనను ప్రారంభిస్తారు. గోల్డ్ ఫిష్ చేపలతో కోటీశ్వరులు కావాలని ఆశ పడతారు. ఇది కరీం సొంత దురాశ అమాయకమైన కలలతో విభేదించడం ప్రారంభిస్తుంది!
ఒక వ్యక్తి నగరంలో తన ఆస్తులను కొత్త ప్రదేశానికి తీసుకెళ్లడంలో అతనికి సహాయం చేయమని కోరతాడు. కరీం తాను పోర్టర్‌ను కాదని నిరసించి, పట్టుదలతో స్వాభిమానంతో జీవించే వ్యక్తిగా మంచి నటనను ప్రదర్శిస్తాడు.
ఆ బురదలో చేపలు అస్సలు బతకవని విసుగుతో హుస్సేన్‌కు చెబుతూ కరీం ఆ బురదను జల్లెడ పడుతుంటాడు. కానీ కాసేపటి తర్వాత, ఇంటి పైకప్పు మీద ఉన్న టీవీ యాంటెన్నా సరైన స్థానంలో అమరిందని పిల్లలు అరిచి చెప్పగానే, సంతోషంతో అక్కడే ఉండి, కింద ఆవరణలో ఉన్న తన భార్యతో సరదాగా ముచ్చటిస్తుంటాడు. ఇదంతా అతను పడిపోడానికి ముందు సన్నివేశంలోనే!
తన ఇంటి చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలలో ఉష్ట్రపక్షి గుడ్లు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ, అతను తన మాజీ యజమాని పోగొట్టుకున్న పక్షి కోసం మళ్ళీ వెతకడు. అంతకుముందు ఉష్ట్రపక్షి వలె వేషం వేసుకుని పక్షిని కనుక్కోవడానికి అతను ప్రయత్నించే ఘట్టం, చాలా హాస్యాస్ఫోరకంగా ఉన్నప్పటికి ముందు ముందు కరీం కాలు, నడుము విరిగిపోతాయనే సూచినగా కూడా ఉంటుంది!
ఒక రోజు అతను నీటి నిల్వ షెడ్డు వద్దకు నడిచి వెళ్ళినప్పుడు, అది పూర్తిగా శుభ్రం చేయబడి, స్వచ్ఛమైన నీటితో నింపబడి ఉండటం, సన్నని పలకల మధ్య నుండి ప్రసరిస్తున్న సూర్యకిరణాల వల్ల నీటి ఉపరితలంపై నీడలు పడటం, ఒక మూలలో పిచ్చుక గూడు కట్టుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు కరీం!
హుస్సేన్, అతని స్నేహితులు తమ చేపల కలను సాకారం చేసుకునే దశకు చేరుకున్న ఆ సమయంలోనే, వారికి ఒక గట్టి దెబ్బ తగులుతుంది. చేపలున్న నీటి బకెట్ కి చిల్లు పడుతుంది. వాళ్ళు దాన్ని రిపేర్ చేద్దామనుకునే లోపు మొత్తం బకెట్ దొర్లిపోయి నేల మీద పడడంతో చేపలన్నీ కింద పడిపోతాయి. నేలమీద పడిన చేపలు చనిపోటాయేమో ననుకుని పిల్లలు భయపడిపోతారు. ఏడుస్తారు. ఇంతలో హమేద్ వాటిని నీళ్ళలోకి వదిలి రక్షిస్తాడు. ఈ దృశ్యం కరీంని మురిపిస్తుంది!
సారాంశంలో, ఈ చిత్రం మూడు సంస్కృతుల మధ్య వైరుధ్యాన్ని చూపిస్తుంది. తన కుటుంబాన్ని పోషించి, నిజాయితీగా జీవించడానికి ప్రయత్నించే వ్యక్తి కరీం, నియమాలను ఉల్లంఘించేలా అతడిని ప్రలోభపెట్టే అతని చుట్టూ ఉన్న ఆధునిక సమాజం, కష్టాల్లో ఆదుకునే ఇరుగు పొరుగుతో పాటు ఆర్ధికంగా గొప్ప సహాయకుడిగా, పెద్ద ఆరిందాలా కుటుంబానికి ఆర్ధికంగా దన్నుగా నిలబడిన చిన్నారి హమీద్! బహుశా నాలుగవ అంశం తప్పించుకున్న ఉష్ట్రపక్షి కావచ్చు, అది స్వేచ్ఛ కోసం పారిపోతుంది!
నటీనటులు
కరీంగా రెజా నాజీ (Reza Naji) నర్గీస్ గా మర్యం అక్బరి (Maryam Akbari), హనియేగా షబ్నమ్ అఖ్లాఘి (Shabnam Akhlaghi), హుస్సేన్ గా హమేద్ అఘాజీ (Hamed Aghazi) అద్భుతంగా తమ తమ పాత్రల్లో జీవించేశారు
ఈ చిత్రంలో రెజా నాజీ మాత్రమే ప్రొఫెషనల్ నటుడు.
ఈ చిత్రంలో హేతుబద్ధమైన ఆలోచనలున్న మహిళగా మర్యం అక్బరి అద్భుతంగా నటించారు. పాత్రకు సిగ్గుతో కూడిన దృఢత్వాన్ని ఇచ్చారు. మిగిలిన నటులందరూ వారి వారి పాత్రల్ని చక్కగా పోషించారు.
హుస్సేన్, అతని స్నేహితులు తమ చేపల కలను సాకారం చేసుకునే దశకు చేరుకున్న ఆ సమయంలోనే, వారికి ఒక గట్టి దెబ్బ తగులుతుంది. చేపలున్న నీటి బకెట్ కి చిల్లు పడుతుంది. వాళ్ళు దాన్ని రిపేర్ చేద్దామనుకునే లోపు మొత్తం బకెట్ దొర్లిపోయి నేల మీద పడడంతో చేపలన్నీ కింద పడిపోతాయి. నేలమీద పడిన చేపలు చనిపోతాయేమో ననుకుని పిల్లలు భయపడిపోతారు. ఏడుస్తారు. ఇంతలో హమేద్ వాటిని నీళ్ళలోకి వదిలి రక్షిస్తాడు. ఈ దృశ్యం కరీంతో పాటు ప్రేక్షకలను కూడా వారి సమయ స్ఫూర్తికి మురిపిస్తుంది!
పిల్లలు, వారు కూడా అన్ని రకాల అల్లరి పనులు చేసే వారుగా, కానీ ఆ అల్లరి అమాయకంగా, నిష్కపటంగా ఉండేలా చక్కగా నటించారు. చేపల టబ్ పడిపోయి చెనిపోతాయేమో అనుకున్నప్పుడు రెక్కలు తొడగబోతున్న తమ ఆశయం నాశనమైపోతుందనుకుని ఒక్కొక్కళ్ళూ ఏడుపు మొఖాలతో, దుఃఖపడుతున్నట్లు అద్భుతంగా నటించారు!
ఇక ఈ చిత్రం ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే ఇది మానవుల వైఫల్యాలపై గొప్ప సంవేదనను, సహానుభూతిని, గౌరవాన్ని చూపుతుంది!
సినిమా మొదలవడం “In the Name of God” అంటూ మొదలవుతుంది. వెంటనే పొడవాటి మెడలతో ఉష్ట్రపక్షులు ఎంతో అందంగా కనిపిస్తాయి. వాటిని చాలా ప్రేమగా సాకుతూ వాటికి ఆహారం వేస్తూ కరీం కనిపిస్తాడు. చీరలో కనిపించే వాటి నృత్యం చూసితీరవలసిందే! రాయడం సాధ్యం కాదు!
కొన్నిసార్లు హాస్యాస్పదంగా, విచారంగా, ఉద్వేగభరితంగా, ఉత్కంఠభరితంగా సాగే మజిదీ అద్భుతమైన కథనానికి — నాజీ అద్భుతమైన నటనకు స్పారోస్ సాంగ్ ఒక అపూర్వమైన చిత్రరాజం.
ఈ చిత్రానికి హోస్సేన్ అలీజాదే (Hossein Alizadeh) ‘తార్’ అనే ఒక రకమైన పర్షియన్ వాయిద్యంతో హృదయానికి హత్తుకునే సంగీత సౌందర్యాన్ని అందించారు. గ్రామీణ ఇరానియన్ శోభలతో అందమైన సినిమాటోగ్రఫీ ఆహ్లాదాన్నిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ అత్యుత్తమంగా ఉంది.
కరీం చేసిన తప్పులు,అతని చింతలు, సంతోషాలు సులభంగా అర్ధమై మన జీవితాలను మనమే చూస్తున్నామా అని భావిస్తాం! మన వేగవంతమైన నగర జీవితాల్లో మన ఒంటరి తనాన్ని , ఉనికిని అన్వేషించేలా మనల్ని ప్రేరేపిస్తుంది.
ఆడంబరమైన, అట్టహాసమైన వికటాట్టకాలు చేసే భారీ చిత్రాలకు భిన్నంగా సహాజత్వంతో కూడిన సినిమాను చూడాలనుకుంటే .. ఇది మీకు ఉత్తమమైన అవకాశం!
ఇది ఒక సాధారణ కథను సమర్థవంతమైన పద్ధతిలో ప్రభావవంతంగా చెబుతుంది. ఈ చిత్రంలో పాత్రలు మొదట్లో సాధారణంగా ఉండి, సినిమా సాగేకొద్దీ మరింత చైతన్యవంతంగా మారతాయి. ఈ పాత్రలను నటీనటులు అద్భుతంగా పోషించడం వల్ల ఈ సినిమా చూడటం ఆనందాన్నిస్తుంది.
ఇది దృశ్యపరంగా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆకట్టుకునేలా ఉంటుంది. కొన్నిసార్లు హృదయ విదారకంగా ఉంటుంది. కానీ ఒక్క క్షణం కూడా విసుగు అనిపించదు. ఇది ఎన్నో భావోద్వేగాలను తెలియజేసే ఒక సాధారణ కథ, ఎంతో కళాత్మకమైన, హృద్యమైన కథ, దీన్ని ఆస్వాదించడం చాలా సులభం.
‘ది సాంగ్ ఆఫ్ స్పారోస్’ ప్రతి సినిమా ప్రేమికుడు తప్పక చూడవలసిన చిత్రం!
నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ లలో ఉంది. చూడని వారు వెంటనే చూడమని మనవి చేస్తున్నా!
ఈ చిత్రం సాధించిన అవార్డులు, నామినేషన్లు
2008లో రెజా నాజీ ఉత్తమ నటనకు ఆసియా పసిఫిక్ స్క్రీన్ ప్రకటించిన అవార్డులలో విజేతగా నిలిచాడు.
2008 లో బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా రెజా నాజీ సిల్వర్ బేర్ సాధించాడు.
2008లో డమాస్కస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రెజా నాజీకి ఉత్తమ నటుడి అవార్డు సాధించాడు.
2008లో ఫజ్ర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మాజిద్ మజిది ఉత్తమ దర్శకుడి అవార్డు పొందాడు.
2008లో నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ప్రత్యేక అవార్డుతో సత్కరించింది.
81వ అకాడమీ ఆస్కార్ అవార్డుల పోటీలో “ఉత్తమ విదేశీ భాషా చిత్రం” విభాగంలో ఇరాన్ తరపున ఎంపికైంది.