మణిపూర్‌లో శాంతి మృగ్యమేనా?

బ్రిటీష్ వలస పాలకుల నుండి అధికారం బదిలీ జరిగిన తరువాత 1949 అక్టోబర్ 15 నుంచి మణిపూర్ భారత్‌లో అంతర్భాగమైంది. ఆ సమయంలో మెయితీలకు ఎస్‌టి హోదా ఇవ్వాలన్న చర్చ వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బ్రిటిష్ పాలకుల అండదండలతో కుకీలు మణిపూర్ కొండ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నాగా తెగల దాడుల నుంచి లోయ ప్రాంతాలను రక్షించే పనిలో ఉండేవారు. ఓ రకంగా బ్రిటీష్ పాలకుల కిరాయి సైన్యంగా పనిచేసేవారు. తెల్లదొరలు తమ వ్యూహంలో భాగంగా ఒక తెగకి వ్యతిరేకంగా మరో తెగని, వారికి వ్యతిరేకంగా మరో తెగవారిని ప్రోత్సహించారు. కొండ ప్రాంతాల్లో కుకీల ప్రాబల్యం పెరిగి పోవడానికి, బ్రిటీష్ వారి ప్రోత్సాహమే కారణం. నేటి ఘర్షణలకు మూలం. లోయ ప్రాంతంలో నివసించే మెయితీలు ఎస్‌టి హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంటే కొండ ప్రాంతంలో ఎస్‌టి హోదా ఉన్న కుకీలు తమకు ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం కావాలని పట్టుబడుతూ ఉండడంతో నిరంత‌రం ఘ‌ర్ష‌ణాత్మ కంగా మ‌ణిపూర్ త‌యారైంది.

 జాతి ఘర్షణలు ఏ ప్రభుత్వానికైనా క్లిష్టమైన సవాళ్లలో ఒకటి. వీటికి ఒక్క కారణం ఉండదు. చారిత్రక అసంతృప్తులు, గుర్తింపు రాజకీయాలు, ఏండ్ల‌కేండ్లుగా పేరుకుపోయిన అనుమానాలు కలిసి ఈ సమస్యల కు కార‌ణ‌మ‌వుతున్నాయి. మణిపూర్‌లో స‌రిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది. మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి హింస అప్పుడప్పుడు చెలరేగే సంక్షోభం కాదు. సులభంగా అదుపు చేయలేని స్థిరమైన ధోరణిగా మారింది. దీన్ని లక్ష్యంగా చేసుకుని హత్యలు, పేలుళ్లు, వదంతులతో చెలరేగే ఘర్షణలు.. ఏ కొత్త ఘటన జరిగినా, ఆగ్రహం, సమీకరణ, ప్రతీకార దాడులుగా మారే పాత చక్రంలోనే కలిసిపోతున్నాయి. ఇందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం హింస పునరావృతం కావడం మాత్రమే కాదు, అది క్రమంగా సాధారణంగా మారిపోవడం. రాజకీయ నాయకత్వ మార్పులు జరిగినా, కేంద్ర జోక్యం జరిగినా పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు. ఇది సమస్య మరింత లోతుగా ఉన్నదని సూచిస్తోంది. దీర్ఘకాలిక, సృజనాత్మక, నిష్పాక్షిక చర్యలు అవసరమైన ఈ ఘర్షణను ఎదుర్కోవడంలో రాజకీయ సంకల్పానికి పరిమితులు ఉన్నాయని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 

 2023 మే నెలలో హింసకు దారితీసిన ప‌రిస్థితులే ఇప్పటికీ ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి. మణిపూర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగి మూడేళ్లు కావస్తున్నా అక్కడింకా పరిస్థితులు చక్కబడలేదని తాజా ఉదంతాలు నిరూపిస్తున్నాయి. బీరేన్ సింగ్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. అది ఏడాది కొనసాగాక మొన్న ఫిబ్రవరిలో ఆ పార్టీకి చెందిన ఖేమ్‌చంద్ సింగ్ ఆధ్వర్యాన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ పరస్పర అపనమ్మకం, జాతి విద్వేషాలు ఆగింది లేదు. అవతలి పక్షంపై ఆగ్రహావేశాలు తగ్గలేదు. తరచుగా నిరసన ప్రదర్శనలు జరగటం, రహదారులను స్తంభింపజేయటం ఆగలేదు. కేంద్ర బలగాల సంఖ్యను పెంచటం, నిరంతర పహారా వంటివి హింసాత్మక ఉదంతాలను కట్టడి చేస్తున్నా ప‌రిస్థితిలో మాత్రం మార్పు ఉండ‌టం లేదు. ఇప్పటికీ విద్వేషాన్ని రెచ్చగొట్టే సందేశాలూ, తప్పుడు సమాచారం వ్యాప్తిలోనే ఉంటున్నాయి! 

 2026 ఏప్రిల్ 7న, మణిపూర్ మరో హృదయ విధారక సంఘటనకు సాక్ష్యమిచ్చింది. బిష్ణుపూర్‌లోని ఒక ఇంటిపై రాకెట్ దాడి జరగడంతో, నాలుగేళ్ల బాలుడు, అతని నవజాత సోదరి మరణించారు. ఈ దాడి అప్పటికే ఉన్న పెళుసైన ప్రశాంతతను చిన్నాభిన్నం చేసి, ఇంఫాల్ లోయ అంతటా ఆగ్రహాన్ని మళ్లీ రగిలించింది. ఆ బాంబు కుకీలు నివసిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిపడిందనీ, వారికి భద్రతా బలగాలు కొమ్ముకాస్తున్నాయనీ ప్రచారం వెల్లువెత్తడంతో జనం ఒక సిఆర్‌పిఎఫ్ శిబిరంపై దాడి చేశారు. అటుగా వాహనంలో వెళ్తున్న అస్సాం రైఫిల్స్ కు చెందిన అధికారిని గుంపు చుట్టుముట్టి దాడి చేశారు. ఆయనను భద్రతా బలగాలు రక్షించగలిగాయి. ఏప్రిల్ 17న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ముఖ్య మంత్రిని ఆందోళనకారులు అడ్డుకునేప్పుడు లాఠీచార్జి చేసినా, బాష్పవాయు గోళాలు ప్రయోగించినా ఫలితం లేకపోయింది. చివరకు హెలికాప్టర్ తెప్పించుకుని అక్కడినుంచి ఆయన బయటపడాల్సి వచ్చింది. అంతకుముందు ఒక మాజీ సైనికుడితో సహా ఇద్దరు నాగా జాతీయుల్ని మిలిటెంట్లు హత మార్చారు. 

 జూన్ 5 తెల్లవారుజామున ఆధునాతన ఆయుధాలతో వచ్చిన సాయుధ వ్యక్తుల బృందం కాంగ్‌పోక్సి జిల్లా పరిధిలోని ఓ గ్రామంపై ఆకస్మికంగా దాడి చేసింది. గ్రామంలోని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు గ్రామస్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల తర్వాత దుండగులు గ్రామంలోని కుకీ వర్గానికి చెందిన పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించి అనేక ఇల్లు పూర్తిగా దగ్దమయ్యాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో గ్రామస్థులు ప్రాణభయంతో సమీప అటవీ ప్రాంతాలకు పరుగులు తీశారు. మణిపూర్‌లో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో అశాంతి కొనసాగుతోంది. తాజాగా కాంగ్‌పోక్పి, సేనాపతి జిల్లాల్లో సాయుధుల దాడులు, పౌరుల మరణాలు, అపహర ణలు జరిగాయి. దీనికి నిరసనగా కుకీ సంఘాలు జాతీయ రహదారులపై దిగ్బంధం (షట్‌డౌన్), భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

 జాత్యహంకార ఘర్షణలతో మూడేండ్ల నుంచి మండుతున్న మణిపూర్‌లో మంటలు చల్లారడం లేదు. లోయ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉండే మైతీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ-జో-నాగ తెగల మధ్య భూ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, అటవీ వనరులు, పరిపాలనా అధికారాల విషయంలో చాలా కాలంగా విబేధాలు ఉన్నాయి. అయితే 2023లో మైతీలకు షెడ్యూల్ ట్రైబ్ హోదా కల్పించాలని వచ్చిన డిమాండ్ నేపథ్యంలో మొదలైన వివాదం క్రమంగా జాతి ఘర్షణగా మారి రక్తపాతానికి దారితీసింది. సున్నితంగా పరిష్కరించాల్సిన సమస్యను ప్రభుత్వం భద్రతా సమస్యగా చూపింది. కానీ, దీనివెనుక కేంద్ర సర్కార్ కుట్ర దాగుంది. కుకీలున్న కొండ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న విలువైన ఖనిజ నిక్షేపాలను బడా పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా కుకీలను అక్కడి నుంచి తరిమేయాలని పథకం వేసింది. ఫలితంగా ఇప్పుడు రాష్ట్రమే రెండు భాగాలుగా చీలిపోయి అగ్ని గుండం లా మండుతోంది. ఇటీవల మళ్లీ అశాంతి చెలరేగింది. ఇటీవల గుర్తుతెలియని దుండగుల దాడుల్లో ముగ్గురు కుకీలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ముమ్మాటికీ మైతీలు చేసిన హత్యలేనని కుకీలు ఆరోపించా రు. రెండు తెగల మధ్య ప్రారంభమైన వైరం దేశ రాజకీయాలనే ప్రభావితం చేస్తున్నాయి. 

 మూడేళ్ల క్రింత మెయితీలకూ, కుకీలకూ మధ్య చెలరేగిన వైరం హింసకు దారితీయగా ఇప్పుడు మెయితీల గురి నాగాలపై కూడా పడింది. ఒక పద్ధతి ప్రకారం వదంతులు వ్యాప్తిచేయటం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించటం ఆగటంలేదు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే.. ఆ వదంతుల్ని ఖండిస్తూ పోలీసులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కానీ ఉద్రిక్తల్ని ఆపటంలో అవి పెద్దగా ఉపయోగ పడటం లేదు. గతంలో బీరేన్ సింగ్ ప్రభుత్వ హయాంలో మెయితీలకు చెందిన సాయుధ మిలిటెంట్ సంస్థ ఆరంబాయ్ టెంగోల్‌ను చూసీచూడనట్టు వదిలేశారు. కుకీల ‘దురాక్రమణల్ని’ అడ్డుకునే పేరిట ఏర్పడిన ఆ సంస్థ కుకీలకూ, నాగాలకూ మాత్రమే కాదు, వారిని ప్రశ్నించే మెయితీలకు సైతం పెద్ద బెడదగా పరిణమించింది. బెదిరించటం, దౌర్జన్యం చేయటం, బలవంతంగా వసూళ్లకు పాల్పడటం ఆ సంస్థకు నిత్యకృత్యమైంది. 

 ఇప్పటికీ మ‌ణిపూర్ సమాజం చీలికలు, పేలికలుగా ఉంది. మెయితీలూ, కుకీలూ ఒకరి ప్రాంతంలోకి ఒకరు వెళ్లలేకపోతున్నారు. పనిచేయగలిగిన సత్తావుండి అది దొరుకుతుందన్న భరోసా ఉన్నచోటకు వాళ్లు లేకపోవటం, పై చదువులకు అర్హతలున్నా ఊరు కదల్లేక పోవటంకన్నా మించిన హింస ఏం ఉంటుంది? పరిమిత వనరులు, ఉపాధి లేమి, భిన్న తెగలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవటం వంటి కారణాలవల్లే అసంతృప్తి అవధులు దాటుతోంది. యువతకు ఉపాధి కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, వారికి మెరుగైన అవకాశాలు రావటానికి తగిన ప్రణాళికలు రూపకల్పన చేయటం వంటి ప్రయత్నాలు ఎక్కడా కనబడవు. కనుకనే మిలిటెంట్ సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. మౌలిక సమస్యల్ని పరిష్కరించలేని రాజకీయ నేతలు ఓట్లు రాబట్టుకోవటానికి మాత్రం ఆయా తెగల్ని శాసించ గల మిలిటెంటు సంస్థలకు సహకరిస్తున్నాయి. ఇది కొనసాగినంత కాలం మణిపూర్ నెత్తురోడుతూనే ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిస్తేనే ఆ రాష్ట్రం తెరిపిన పడుతుంది. ఈ సంక్షోభం వ్యవస్థాగతమైనది. 

 మణిపూర్ జాతుల ఘర్షణలో ఇప్పటికి రెండు వందల యాభైకి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదివేల ఇళ్లు తగులబడ్డాయి. దాదాపు అరవై వేల మంది నిరాశ్రయులయ్యారు. సాధారణ ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. అనేక‌ కుటుంబాలు ఇప్పటికీ సహాయక శిబిరాల్లోనే జీవిస్తున్నాయి. అక్కడ హింస చెలరేగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ మెయితీ వర్గానికి అనుకూల వైఖరి తీసుకోవడం సమస్యను జటిలం చేసింది. కుకీల విశ్వాసాన్ని కోల్పోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం కొద్దికాలం రాష్ట్రపతి పాలన కొనసాగింది. ముఖ్యమంత్రిని మార్చడం, రాష్ట్రపతి పాలన విధించడం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. నేటికీ హత్యలు, దాడులు, నిరసనలు కొనసాగుతుండటం సంక్షోభం పరిపాలనా స్థాయిని దాటి, రాజకీయ, సామాజిక స్థాయికి చేరుకుంది. శాంతి కేవలం సంఘటనల తర్వాత తీసుకునే చర్యలతో లేదా ప్రతీకాత్మక నిర్ణయాలతో సాధ్యపడదని అంగీకరించాలి. తక్షణ రాజకీయ లాభాల కంటే న్యాయం, సంభాషణ, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇచ్చే సమగ్ర, నిరంతర ప్రయత్నాల ద్వారానే శాంతిని సాధించవచ్చు.

 ప్రభుత్వ మార్పులతో మణిపూర్‌లో శాంతి స్థిరత్వం పునరుద్ధరించబడుతుందన్న అంచనాలు అతి ఆశావహంగా మారాయి. ముఖ్యమంత్రి మార్పు, రాష్ట్రపతి పాలన అమలు వంటి చర్యలు పాలనలో కొత్త దిశకు నాంది పలుకుతాయని, శాంతిపట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుతాయని భావించారు. అయితే హింస కొనసాగుతుండటం చూస్తే, ఈ చర్యలు ఎక్కువగా విధానపరమైనవే గానీ, మూల సమస్యలను తాకేలా లేవన్న అభిప్రాయం బలపడుతోంది. పాలనా వ్యవస్థలో మార్పులు మాత్రమే సమగ్ర రాజకీయ వ్యూహానికి ప్రత్యామ్నాయం కావు. ఘర్షణల మూల కారణాలను పరిష్కరించేందుకు నిరంతర ప్రయత్నాలు లేకపోతే, ఇటువంటి మార్పులు ప్రజలకు కేవలం ప్రతీకాత్మక చర్యల్లాగానే కనిపించే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభా నికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. తీవ్ర విభజనలతో ఉన్న సమాజంలో శాంతి సహజంగా ఏర్పడదు. సంభాషణలు, చర్చలు, పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యల ద్వారా దాన్ని నిర్మించాలి. కానీ మణిపూర్‌లో అలాంటి రాజకీయ చ‌ర్య‌ల‌కు అవకాశాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. 

 ఒక వర్గం భయాలను మరో వర్గంపైకి మళ్లించడం, సామాజిక విబేధాలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకోవడం తాత్కాలికంగా ఓట్లు తెచ్చిపెట్టవచ్చు. కానీ చివరకు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుం ది. మణిపూర్‌లో నేడు కనిపిస్తున్న పరిస్థితి అదే. పక్కపక్కనే నివసిస్తున్న ప్రజలు ఒకరినొకరు అనుమా నంతో చూసే స్థితికి చేరుకున్నారు. సామాజిక సంబంధాలు తెగిపోయాయి. ఇది కేవలం మణిపూర్‌కే పరిమితమైన సమస్య కాదు. భారతదేశం అనేక జాతులు, మతాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళన మన్న విషయాన్ని పాలకులు మరవరాదు. ఈ వైవిధ్యమే మన దేశ బలం. దాన్ని రాజకీయ లాభాల కోసం ఆయుధంగా మారిస్తే దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం. మణిపూర్ మంటలు హెచ్చరించేది అదే. ద్వేషం, విద్వేషం, విభజన రాజకీయాలు చివరకు ప్రజల ప్రాణాలను బలిగొంటాయి. పాలకులు ఈ విషయాన్ని విస్మరిస్తే, మణిపూర్ లాంటి విషాదాలు మళ్లీమళ్లీ పునరావృతమవుతూనే ఉంటాయి. వైవిధ్య భరితమైన సమాజంలో పాలన అనే భావనకే ఇది కీలక పరీక్షగా మారింది. స్పష్టమైన, సమగ్ర, నిరంతర చర్యలు ఇప్పుడు అత్యవసరం. మణిపూర్‌లో నెలకొన్న అశాంతి, హింసాత్మక పరిస్థితులు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. అక్కడ నలిగిపోతున్న సామాన్య ప్రజలకు, బాధితులకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత సమాజంపై ఉంది. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేధావులు సామాజిక శక్తులు గళం విప్పాలి. మణిపూర్ సంక్షోభం రెండు వర్గాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు. దాని వెనుక లోతైన సామాజిక, రాజకీయ కోణాలు ఉంటాయి. మణిపూర్ సంక్షోభంపై సమాజం మౌనంగా ఉండిపోవడం సరికాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యతగా ముందుకు సాగాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply