హిందీ : సిద్ధార్థ్ రాము
“హిందూత్వ రాజకీయాన్ని, అలాగే హిందూత్వలో భాగంగా పరిగణించే కుల వ్యవస్థను నేను ఖండిస్తున్నాను. అందుకు విమర్శకులు నా మీద ‘హిందూ వ్యతిరేకి’ అని ముద్ర వేస్తారు. కానీ, ఒక సామ్యవాద సమాజాన్ని నిర్మించడానికి బసవన్న, అంబేద్కర్ లు ప్రారంభించిన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత అని నేను నమ్ముతున్నాను, నా శక్తిమేరకు నేను ఆ పని చేస్తున్నాను.”
గౌరీ లంకేశ్ (ఇంటర్వ్యూ- సింథియా స్టీఫెన్)
“బహుజనుల సంపన్నమైన సాంస్కృతిక చరిత్రను మనువాదులు తమకు అనుకూలంగా మార్చి, వక్రీకరించి చెప్పారు. ఈ చరిత్రపై పడిన దుమ్ము ధూళిని మనం తుడిచిపారేయాలి, పౌరాణిక అబద్ధాల ముసుగును తొలగించాలి. మన ప్రజలకు, మన పిల్లలకు నిజానిజాలు చెప్పాలి. మన నిజమైన చరిత్రపైన హక్కు సాధించడానికి మనముందున్నఏకైక మార్గం ఇదే.” గౌరీ లంకేశ్ (బెంగళూరు మిర్రర్ వెబ్ పోర్టల్‌లో, 29 ఫిబ్రవరి 2016)
“లింగాయతులు బసవన్న, శరణులను అనుసరిస్తారు. వారి తత్త్వము, ఆలోచనలు వేలాది వచనాలలో వ్యక్తమవుతాయి. వేదాలను, శాస్త్రాలను, స్మృతులను, ఉపనిషత్తులను ఈ వచనాలు తిరస్కరించాయి. వర్ణ వ్యవస్థపైన ఆధారపడిన కుల వ్యవస్థను కూడా బసవన్న తిరస్కరిస్తారు. ఆయన కర్మఫల సిద్ధాంతాన్ని, దాని ఆధారంగా ఉన్న పాప-పుణ్యాల భావనను కూడా తిరస్కరిస్తారు. దీనితో పాటు, ఈ పాప-పుణ్యాల సిద్ధాంతం ఆధారంగా ఉన్న స్వర్గ-నరకాల భావనను కూడా అంగీకరించరు. గుడులను, విగ్రహారాధనను ద్వేషిస్తారు. శివుని లైంగిక లింగ సంకేతాన్ని తిరస్కరించి, దాని స్థానంలో వ్యక్తి అంతఃకరణకు ప్రతీక అయిన ‘ఇష్టలింగాన్ని’ స్వీకరిస్తారు. ఆయన శ్రమనే (కర్మనే) పూజగా భావిస్తారు. కుల, లింగ భేదాలను ఆయన వ్యతిరేకిస్తారు. మూఢనమ్మకాలంటే అసహ్యం. చాలా కొద్దిమందికి మాత్రమే అర్థమయ్యే సంస్కృత భాషను పక్కనపెట్టిన బసవన్న ప్రజలకు అర్థమయ్యే కన్నడ భాషలో సంబోధించారు. నిజం చెప్పాలంటే, బసవన్న, శరణులందరూ కూడ హిందూ మతంలోని ప్రతి అంశాన్ని తిరస్కరించారు; దానిపైన తిరుగుబాటు చేశారు.”
“మన ప్రధాని (మోదీ) నోరు విప్పితే అబద్ధాలే చెబుతారు” (గౌరీ లంకేశ్ మోదీని ‘బూసీ బూసియా’ [అబద్ధాలకోరు] అని రాసేవారు)
“అబద్ధాల ఫ్యాక్టరీలను ఎక్కువగా మోదీ భక్తులే నడుపుతున్నారు”
(గౌరీ లంకేశ్ పత్రిక చివరి సంపాదకీయం)
“కర్ణాటకను తగలేయడానికి వచ్చిన కాషాయధారి బోడిగుండు (అమిత్ షా) కథ”
(30 ఆగస్టు 2017, గౌరీ లంకేశ్ పత్రిక కవర్ స్టోరీ)
2017 సెప్టెంబర్ 5నాడు గౌరీ లంకేశ్ హత్యతో ఉత్పన్నమైన దుఃఖం, ఆగ్రహం, క్షోభ, నిరాశల నుండి బయటపడిన తర్వాత, చాలామంది మనస్సులలో ఒక ప్రశ్న తలెత్తింది—ఆఖరికి కొందరు వ్యక్తులకు హత్య చేయించడం లేదా హత్య చేయడం తప్ప వారికి వేరే మార్గం కనిపించనంత ప్రమాదకరంగా లేదా ద్వేషపాత్రురాలిగా గౌరీ లంకేశ్ ఎందుకు మారారు? ఈ ప్రశ్నకు సరియైన సమాధానం గౌరీ లంకేశ్ ఆలోచనలు, ఆమె చేసిన పనులు, ఆమె వ్యక్తిత్వాన్ని పరిశీలించడం ద్వారా మాత్రమే ఇవ్వగలము.
ముందుగా గౌరీ లంకేశ్ ఆలోచనా విధానం ఎలాంటిదో చూద్దాం. మొదటిది, హిందూత్వానికి సంబంధించి ఆమె ఆలోచనలను పరిగణనలోకి తీసుకుందాం. ఆమె కేవలం హిందూత్వ రాజకీయాన్ని వ్యతిరేకించడమే కాదు, హిందూ మతాన్ని పూర్తిగా తిరస్కరించేవారు. ఆమె హిందూ మతం, హిందూ సంస్కృతి, హిందూ సామాజిక వ్యవస్థలను సంపూర్ణంగా తోసిపుచ్చారు. ఈ విషయంలో ఆమె పూర్తిగా బసవన్న, ఫూలే, అంబేద్కర్ ఆలోచనల వైపే నిలబడ్డారు.
కర్ణాటకలో 12వ శతాబ్దంలో బసవన్న హిందూ మతాన్ని పూర్తిగా తిరస్కరించి, లింగాయత్ ధర్మాన్ని ప్రచారంలోకి తెచ్చారని మనందరికీ తెలిసిందే. లింగాయతులు ఏ రూపంలోనూ తమను హిందూ మతం, సంస్కృతి లేదా సామాజిక వ్యవస్థలో భాగంగా భావించలేదు. వారు హిందువుల ఏ శాస్త్రాన్ని, దేవుళ్లను/దేవతలను, కర్మఫల సిద్ధాంతాన్ని, పాప-పుణ్యాలను, స్వర్గ-నరకాలను నమ్మలేదు. వారు గుడులను, విగ్రహాలను ద్వేషించారు. హిందువుల మూఢనమ్మకాలను ఎద్దేవా చేసేవారు. కుల వ్యవస్థకు తీవ్ర విమర్శకులుగా ఉండేవారు. స్త్రీ-పురుష సమానత్వాన్ని బలపరిచారు. కులాంతర వివాహాలను, కులాంతర భోజనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఈ ఉద్యమం ఎంతటి లోతైన ప్రభావాన్ని చూపిందంటే, అత్యధిక సంఖ్యలో జనాభా హిందూ మతాన్ని, సంస్కృతిని, సామాజిక వ్యవస్థను పరిత్యజించింది. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, ఇలా చేసినవారిలో అన్ని కులాలకు చెందిన ప్రజలు ఉన్నారు.
గౌరీ లంకేశ్ లింగాయత్ సంప్రదాయానికి పూర్తిగా మద్దతునిచ్చారు. కర్ణాటకలో ‘లింగాయతులు హిందూ మతంలో భాగమా కాదా?’ అనే వివాదం నడుస్తున్నప్పుడు తమను హిందూ మతంలో భాగంగా భావించే వీరశైవులతో లింగాయతులకు ఎలాంటి సంబంధమూ లేదని గౌరీ స్పష్టంగా ఇలా రాశారు.
గౌరీ లంకేశ్ 2017 ఆగస్టు 8న ఇలా రాశారు:
“లింగాయతులు బసవన్న, శరణుల అనుయాయులు. వారి తత్త్వము, ఆలోచనలు వేలాది వచనాలలో వ్యక్తమవుతాయి. ఈ వచనాలు వేదాలను, శాస్త్రాలను, స్మృతులను, ఉపనిషత్తులను తిరస్కరించాయి. వర్ణ వ్యవస్థపైన ఆధారపడిన కుల వ్యవస్థను కూడా బసవన్న తిరస్కరిస్తారు. కర్మఫల సిద్ధాంతాన్ని, దాని ఆధారంగా ఉన్న పాప-పుణ్యాల భావనను కూడా తిరస్కరిస్తారు. దీనితో పాటు, ఈ పాప-పుణ్యాల సిద్ధాంతం ఆధారంగా ఉన్న స్వర్గ-నరకాల భావనను కూడా అంగీకరించరు. బసవన్న గుడులను, విగ్రహారాధనను ద్వేషిస్తారు. శివుని లైంగిక లింగ సంకేతాన్ని తిరస్కరించి, దాని స్థానంలో వ్యక్తి అంతఃకరణకు ప్రతీక అయిన ‘ఇష్టలింగాన్ని’ స్వీకరిస్తారు. శ్రమనే (కర్మనే) పూజగా భావిస్తారు. కుల, లింగ భేదాలకు వ్యతిరేకం. మూఢనమ్మకాలంటే అసహ్యం. చాలా కొద్దిమందికి మాత్రమే అర్థమయ్యే సంస్కృత భాషను పక్కనపెట్టిన బసవన్న, సామాన్య ప్రజలకు అర్థమయ్యే కన్నడ భాషలో సంబోధించారు. నిజం చెప్పాలంటే, బసవన్న, శరణులందరూ హిందూ మతంలోని ప్రతి అంశాన్ని తిరస్కరించారు, దానిపై తిరుగుబాటు చేశారు.”
(మేకింగ్ సెన్స్ ఆఫ్ లింగాయత్ వర్సెస్ వీరశైవ డిబేట్, 8 ఆగస్టు
ఫూలే, అంబేద్కర్ల వ్యక్తిత్వాలను గౌరీ లంకేశ్ విప్లవాత్మకమైనవిగా గుర్తుచేసుకుంటారు. ఈ ఇద్దరు ఆలోచనాపరులు కూడా లింగాయతుల వలెనే హిందూ మతాన్ని మానవ వ్యతిరేక మతంగా భావించారు. ఫూలే, అంబేద్కర్ చేసిన భారతీయ సాంస్కృతిక చరిత్ర వ్యాఖ్యానంతో ఆమె ఏకీభవిస్తూ; “మనువాదులు బహుజనుల సంపన్నమైన సాంస్కృతిక చరిత్రను తమకు అనుకూలంగా మార్చి, వక్రీకరించి చెప్పారు. ఈ చరిత్రపై పడిన దుమ్ము ధూళిని మనం తుడిచిపారేయాలి, పౌరాణిక అబద్ధాల ముసుగును తొలగించాలి. మన ప్రజలకు, మన పిల్లలకు నిజానిజాలు చెప్పాలి. మన నిజమైన చరిత్రపైన హక్కు సాధించడానికి మనముందున్న ఏకైక మార్గం ఇదే” అని స్పష్టంగా చెప్పారు. (బెంగళూరు మిర్రర్ వెబ్ పోర్టల్‌లో 29 ఫిబ్రవరి 2016).
అక్కడితో ఆగక, లింగాయతులు, ఫూలే, అంబేద్కర్ చూపిన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, హిందూ దేవుళ్లు, దేవతల పౌరాణిక నిజరూపాన్ని ముందుకు తెచ్చారు. ఈ విషయంలో అంబేద్కర్‌ను తన కథానాయకుడిగా వర్ణిస్తూ ఆమె ఇలా రాశారు—”తమ దేవతలను అత్యంత జాలిపడాల్సిన పిరికివారి సమూహంగా” చిత్రీకరించారని అంబేద్కర్ బ్రాహ్మణులను పరిహసిస్తారు. హిందువుల పురాణాలన్నీ అసురుల వధ విష్ణువు లేదా శివుని ద్వారా కాకుండా, దేవీల ద్వారానే జరిగిందని చెబుతాయని ఆయనంటారు. దుర్గ (లేదా కర్ణాటక సందర్భంలో చాముండి) మహిషాసురుడిని చంపితే, కాళి నరకాసురుడిని సంహరించింది. శుంభ-నిశుంభ అనే అసుర సోదరుల వధ దుర్గ చేతిలో జరిగింది. బాణాసురుడిని కన్యాకుమారి చంపింది. మరొక అసురుడైన రక్తబీజుడిని దేవి శక్తి సంహరించింది. ‘దేవుళ్లు అసురుల చేతుల్లో తమను తాము కాపాడుకోలేక, తమను రక్షించుకోవడం కోసం తమ భార్యలను పంపించినట్లు అనిపిస్తుంది’ అని అంబేద్కర్ ఈసడింపుగా అంటారు. – గౌరీ లంకేశ్ (బెంగళూరు మిర్రర్ వెబ్ పోర్టల్‌లో, 29 ఫిబ్రవరి 2016, రి క్లైమింగ్ మహిషాసుర)
అంతేకాక, హిందూత్వ శక్తుల ఆధిక్యాన్ని తిరస్కరించడానికి ఆమె పౌరాణిక గాథలను పునర్వ్యాఖ్యానించారు కూడా. ఈ క్రమంలోనే ఆమె ‘రిక్లెయిమింగ్ మహిషాసుర’ అనే వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో ఆమె మహిషాసురుడిని అనార్యులు, ద్రవిడుల మహానాయకుడిగా చిత్రీకరించారు.—”ఒక రాక్షసుడు లేదా తన ప్రజలను దోపిడీదారులు-హంతకులైన ఆర్యుల నుండి రక్షించిన ఒక గొప్ప ఉదారవాద ద్రావిడ పాలకుడు; మహిషాసురుడు అనేది సహజంగానే ప్రజలను తనవైపు ఆకర్షించే వ్యక్తిత్వం కలిగిన పేరు. ఆయన పేరు మీదనే మైసూర్ అనే పేరు వచ్చింది. హిందూ పురాణాలు ఆయనను రాక్షసుడిగా చిత్రీకరించి, చాముండి ఆయనను వధించడాన్ని సమర్థించినప్పటికీ, జానపద కథలు దీనికి పూర్తిగా భిన్నమైన కథను చెబుతాయి. బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే వంటి విప్లవాత్మక ఆలోచనాపరులు కూడా మహిషాసురుడిని దోపిడీదారులు-హంతకులైన ఆర్యుల (సురుల) నుండి తన ప్రజలను రక్షించిన ఒక గొప్ప ఉదారవాద ద్రావిడ పాలకుడిగానే చూస్తారు.”
ఇదంతా రాస్తూ, మాట్లాడుతు, అందుకోసం పోరాటం చేస్తూ, ఆమె స్పష్టమైన పదాలలో తనను తాను బసవన్న, అంబేద్కర్ సంప్రదాయంతో జోడించుకున్నారు. వారి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. హిందూత్వ రాజకీయాన్ని వ్యతిరేకించడాన్ని కూడా ఈ బాధ్యతలో భాగంగానే భావిస్తూ ఆమె”నేను హిందూత్వ రాజకీయాన్ని, అలాగే హిందూత్వంలో భాగంగా పరిగణించే కుల వ్యవస్థను ఖండిస్తున్నాను. దీని వల్ల నా విమర్శకులు నన్ను ‘హిందూ వ్యతిరేకి’ అని ముద్ర వేస్తారు. కానీ, ఒక సమతావాద సమాజాన్ని నిర్మించడానికి బసవన్న, అంబేద్కర్ ప్రారంభించిన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత అని నేను నమ్ముతున్నాను, నా శక్తిమేరకు నేను ఆ పని చేస్తున్నాను.” (ఇంటర్వ్యూ, సింథియా స్టీఫెన్).
బసవన్న, అంబేద్కర్లతో పాటు, ఆమెకు లోహియా ఆలోచనల వారసత్వం తన తండ్రి పి. లంకేశ్ నుండి సంక్రమించింది. కులాన్ని, పితృస్వామ్యాన్ని భారతీయ సమాజపు అతిపెద్ద రోగాలుగా లోహియా భావించేవారు. ఆయన ఇలా రాశారు… ‘హిందువుల మేధస్సు కులం, యోని అనే బోనులో బంధించబడి ఉంది. కుల ఆధిక్యత పేరిట శూద్రులను, అస్పృశ్యులను; పురుషాధిక్యత పేరిట స్త్రీలను అవమానించడంలో, నిర్లక్ష్యం చేయడంలో, తొక్కిపెట్టడంలో, వేధించడంలో “ఉన్నత కులాలు”, పురుషులు గర్వాన్ని అనుభవిస్తారు. శూద్రులను, స్త్రీలను, బలహీనులను అణచివేయడంలో వారి అహంకారానికి తృప్తి లభిస్తుంది.’
లింగాయతుల సంప్రదాయం ఉన్న కర్ణాటకలో లోహియా కుల, పితృస్వామ్య సంబంధిత ఆలోచనలు బాగా నాటుకుపోయాయి, అలాగే సామ్యవాదానికి (సోషలిజానికి) కూడా స్థానం లభించింది.
గౌరీ లంకేశ్ పితృస్వామ్యానికి చెందిన అన్ని రూపాలనూ తిరస్కరించేవారు. స్త్రీ-పురుషుల మధ్య వివాహానికి ప్రేమ తప్ప వేరేది ఏదీ ఆధారం కాకూడదని ఆమె నమ్మేవారు. ఆమె లింగాయత్, ఫూలే, అంబేద్కర్, లోహియాల స్త్రీ-పురుష సమానత్వ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారు. స్త్రీల సమగ్ర స్వేచ్ఛ, సమానత్వాన్ని బలపరిచారు. స్త్రీల శరీర స్వేచ్ఛకు సంబంధించిన ఆమె ఒక పోస్ట్ పెద్ద కలకలమే రేపింది. ఈ పోస్ట్ జవహర్ లాల్ విశ్వవిద్యాలయంలో వచ్చిన ఒక వివాద సందర్భంలో వచ్చింది. ‘ఒక స్త్రీ తన జీవిత భాగస్వామిని లేదా సెక్స్ పార్ట్నర్ను ఎంచుకోవడానికి స్వతంత్రురాలా, కాదా?’ అనే అంశంపైన వివాదం నడుస్తోంది. దీనిని వ్యతిరేకించేవారికి తీవ్రమైన సమాధానమిస్తూ, ఆమె “ఒకవేళ ఏ వ్యక్తి అయినా తన సెక్స్ పార్ట్నర్ను ఎంచుకునే స్వేచ్ఛ లేని స్త్రీకి జన్మించి ఉంటే, అతడు/ఆమె బలాత్కారానికి (లైంగిక దాడికి) పుట్టినవారై ఉండాలి లేదా వేశ్యకు పుట్టినవారై ఉండాలి” అని నిర్భయంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ మాట ప్రగతిశీలవాదులకు కూడా మింగుడుపడకపోవడం సహజమే, కానీ ఇది చెరిపేయలేని నిగ్గుతేలిన నిజం. ఈ పచ్చి నిజాన్ని చెప్పే ధైర్యం గౌరీకి ఉంది. ఆమె మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి చెప్పే బలహీనమైన మేధావి కాదు; ఆమె ఏమి ఆలోచిస్తే అది చెప్పేవారు, ఏమి చెబితే అది చేసేవారు. స్త్రీ-పురుష సంబంధాల గురించిన ఏ మాటలైతే గౌరీ లంకేశ్ 21వ శతాబ్దంలో చెబుతున్నారో, 12వ శతాబ్దంలోనే వీటికంటే మరింత బలంగా బసవన్న తన వచనాలలో చెప్పారు.
‘చన్నయ్య ఇంట్లో పనివాడి కొడుకు,
కాక్కయ్య ఇంట్లో పనిమనిషి కూతురు
ఇద్దరూ కలిసి పొలంలో పేడ ఏరడానికి వెళ్లారు,
ఒకరినొకరు ప్రేమించుకున్నారు,
ఆ తర్వాత ఒక బిడ్డ జన్మించాడు—ఆ బిడ్డను నేనే’
కులం, పితృస్వామ్యాలకి సంబంధించిన ఆమె ఆలోచనల కారణంగా హిందూ మతమూ, హిందూత్వ రాజకీయాలూ ఆమెను తిట్టని బూతులు లేవు. వాటిని ఇక్కడ చెప్పలేము. నిజం చెప్పాలంటే గౌరీ లంకేశ్ హిందూత్వ మూలాల పైననే వేటు వేసే ఒక జర్నలిస్టు, కార్యకర్త. హిందూ రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికనైతే నిర్మించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందో, ఆ ఆర్ఎస్ఎస్ ప్రాతిపదిక పునాదులనే కూల్చేస్తున్నారు.
ఇక్కడ మనం అత్యంత సంక్షిప్తంగానైనా సరే కల్బుర్గిని గుర్తుచేసుకోవాలి. ఆయన కేవలం బసవన్న వచనాల మూల రూపాలను మాత్రమే సేకరిస్తున్నారు; ప్రాథమికంగా ఆయన ఒక అధ్యయనకారుడు; పరిశోధకుడు, కానీ ఆయన హిందూత్వవాదులకు ఎంతో ప్రమాదకరంగా మారారు. ఎందుకంటే బసవన్న మూల వచనాలు హిందూ మతాన్ని పూర్తిగా తిరస్కరిస్తాయి; ఇది హిందూ రాష్ట్రపు మొత్తం ప్రాజెక్ట్‌కే వ్యతిరేకంగా వెళ్తుంది. ఇది హిందూ ఐక్యతా మూలస్తంభాన్నే సవాలు చేస్తుంది. గౌరీ లంకేశ్ హిందూ మత విమర్శను హిందూత్వ రాజకీయ వ్యతిరేకత వరకు తీసుకెళ్లారు.
ఆమె ‘లంకేశ్ పత్రిక’ సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించినప్పుడు (2000 సంవత్సరంలో), కర్ణాటకలో హిందూత్వ రాజకీయం, హిందూత్వ శక్తుల ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామసేన వంటి సంస్థలు వేగంగా పుట్టుకొచ్చాయి. ఏ ఏ ప్రాంతాల్లో ఆమెకు భజరంగ్ దళ్, తదితర హిందూత్వ సంస్థలతో నేరుగా ఘర్షణ జరిగిందో మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. కర్ణాటకలో హిందూత్వ శక్తులు మతపరమైన సౌహార్ద్రతను దెబ్బతీసే చర్యలను వేగంగా పెంచిన కాలం ఇది.
గౌరీ లంకేశ్ కేవలం ఒక జర్నలిస్ట్‌గా మాత్రమే కాక, ఒక కార్యకర్తగా కూడా నిజాలను వెలికితీస్తూ, సత్యం వైపే నిలబడ్డారు. ఆమె బహిరంగంగానే అల్పసంఖ్యాకులకు తోడుగానూ, అన్యాయానికి గురైన బాధితుల పక్షాన నిలబడ్డారు. ఆమె ప్రతిరకమైన అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు, అందుకే ఆమె విమర్శకులు ఆమెను ‘నక్సలైట్’ అని కూడా పిలిచేవారు. ఒక నక్సల్ మద్దతు వ్యాసాన్ని ప్రచురించాలా వద్దా అనే విషయంలో ఆమెకు తన సోదరుడితో తీవ్ర విభేదాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ నక్సల్ మద్దతు వ్యాసాన్ని ప్రచురించడానికి ఆమె సోదరుడు నిరాకరించారు.
ఈ విభేదం ఎంతటి స్థాయికి చేరిందంటే, ఆమె ‘లంకేశ్ పత్రిక’ను వదిలేసి 2005లో ‘గౌరీ లంకేశ్ పత్రిక’ను ప్రారంభించాల్సి వచ్చింది. దీనితో పాటు, దేశం ముందు పొంచి ఉన్న ఫాసిస్ట్ ప్రమాదాన్ని ఆమె ముందుగానే గుర్తించారు. ఆమె పత్రికలోని వ్యాసాలు, కవర్ స్టోరీలు, సంపాదకీయాలను చూస్తే, ఆమె ప్రధాన లక్ష్యం మోదీ, అమిత్ షాల జంట చెబుతున్నా అబద్ధాలు, చేస్తున్న మోసాలే అని స్పష్టమవుతుంది. తన చివరి సంపాదకీయంలో ఆమె సంఘ్ (ఆర్ఎస్ఎస్), దాని అనుబంధ సంస్థలు; మోదీ అబద్ధాలను, బూటకపు వార్తలను ఎండగట్టారు. ఆమె మోదీని ‘బూసీ బూసియా’ అని రాసేవారు; అంటే ‘ఈ వ్యక్తి నోరు విప్పితే చాలు, అబద్ధాలే చెబుతాడు’ అని అర్థం. దీనికి ముందు ఆమె అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని ఒక కవర్ స్టోరీ కూడా చేశారు, దాని శీర్షిక—”కర్ణాటకను తగలేయడానికి వచ్చిన కాషాయధారి బోడిగుండు (అమిత్ షా)”.
గౌరీ లంకేశ్ కేవలం తన భావజాల వారసత్వ విషయంలో మాత్రమే కన్నడ ప్రగతిశీల సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ల లేదు; ఒక చింతకుడు, రచయిత, ఆలోచనాపరుడు లేదా జర్నలిస్టు తమ ఆలోచనలకు మద్దతుగా కేవలం రాయడమే కాకుండా, ఆ ఆలోచనల కోసం సాగుతున్న పోరాటాలలో చురుగ్గా పాల్గొనాలని నమ్మే సంప్రదాయ రూపానికి కూడా ఆమె తీవ్రంగా కట్టుబడి ఉన్నారు. గౌరీ నిర్భయమైన విలేకరి అవడంతో పాటు, భయమెరుగని కార్యకర్త కూడా. ఆమె క్రియాశీలక భాగస్వామ్యం లేని ముఖ్యమైన ఉద్యమం కానీ, పోరాటం కానీ దాదాపుగా లేదనే చెప్పాలి. తమ ఆలోచనలను వ్యక్తీకరించడంతో పాటు, వాటి కోసం ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా సరే పోరాడటాన్ని భాగం చేసిన బసవన్న, ఫూలే, అంబేద్కర్, లోహియా సంప్రదాయాన్ని ఆమె ముందుకు తీసుకెళ్ళడానికి ఆమె ఏ మూల్యమైనా చెల్లించడానికి సిద్ధపడ్డారు.
వాస్తవాలతో, తర్కంతో కూడిన ఆలోచనల వైపు నిలబడటానికి మూల్యం చెల్లించుకోక తప్పదు; ఏ మూల్యాన్నీ చెల్లించకుండా సత్యం, న్యాయం పక్షాన నిజమైన అర్థంలో నిలబడలేము. గౌరీ లంకేశ్ దీనికి మూల్యం చెల్లించారు, చివరికి హంతకుల తుపాకీ గుళ్లకు బలైపోయారు, కానీ ఇది ఆఖరి మూల్యం మాత్రమే. తన తండ్రి చనిపోయాక ‘లంకేశ్ పత్రిక’ సంపాదకత్వ బాధ్యతలను చేపట్టాలని నిర్ణయించుకున్న రోజు నుంచే ఆమె తన ఆలోచనలకు మూల్యం చెల్లించడం ప్రారంభించారు. ఆమె దేశంలోని ప్రముఖ పత్రికారంగ సంస్థ అయిన ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్’ నుండి జర్నలిజం చదివారని మనందరికీ తెలిసిందే. ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘సండే వీక్లీ’లతో పాటు తెలుగు టీవి ఛానెల్ ‘ఈనాడు’ ఈనాడు టీవీ కొరకు కూడా ఆమె పనిచేశారు.
ఆమె ఒక స్థిరమైన కెరీర్‌ను వదులుకుని ప్రజల పక్షాన నిలిచే జర్నలిజం చేయాలని నిర్ణయించుకున్నారు, 2000వ సంవత్సరంలో ఆమె తన లోహియావాది సాహిత్యవేత్త అయిన తండ్రి పి. లంకేశ్ ప్రారంభించిన పొలిటికల్ కన్నడ ట్యాబ్లాయిడ్ ‘లంకేశ్ పత్రిక’ బాధ్యతలను స్వీకరించారు. అదే రోజున ఆంగ్ల భాషా సహవాసాన్ని వదిలి, సామాన్య ప్రజల భాష అయిన కన్నడలో జర్నలిజం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు రేయింబవళ్లు ఎలాంటి జీవితం, కెరీర్ గురించి కలలు కంటారో, దాని కోసం ఎలాంటి రాజీకైనా సిద్ధపడతారో, అవన్నీ వదిలేసి గౌరీ లంకేశ్ ప్రజల పక్షాన్ని ఎంచుకున్నారు.
ఒక్కసారి పక్షాన్ని ఎంచుకున్నాక, ఆమె దానికే కట్టుబడి ఉన్నారు; బెదిరింపులను ఎదుర్కొన్నారు, పరువునష్ట దావా కేసులో శిక్ష పడింది, అసభ్యకరమైన తిట్లు విన్నారు, కానీ ఒక నిర్భయ యోధురాలిలా పోరాట మైదానంలో నిలబడ్డారు. హంతకుల తుపాకీ గుళ్లకు బలైపోయి… సత్యం, న్యాయం పక్షాన నిలబడటానికి మూల్యం చెల్లించక తప్పదనే సందేశాన్ని ఇచ్చి వెళ్లారు.
ఈరోజు ఆమె అమరత్వం చెందిన సందర్భంగా ఆమెను గర్వంగా స్మరించుకుంటూ, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయడానికి సంకల్పించాలి; దానికోసం ఏ త్యాగానికైనా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.
**
అనువాదం : పద్మ కొండిపర్తి
ఈ వ్యాసాన్ని సిద్ధార్థ్ రాము గారు హిందీలో తమ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు…
ఈ వ్యాసాన్ని సిద్ధార్థ్ రాము గారు హిందీలో తమ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు…నేను అనువాదం చేసాను