ఊరవతలి ఆ పాత ఇంట్లో
రెండు శవాలు పడి ఉన్నాయి
ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు
వాళ్ళ కనురెప్పలు తెరిచే ఉన్నాయి
వాళ్ళ దేహాల మృత్యు వాసన
ఇల్లంతా పరుచుకుంది
ఇల్లు కన్నీరు పెడుతున్నది

వాళ్ళ జీవితంలోకి ఒంటరితనం
అదాటున ఏమీ రాలేదు
వాళ్ళు వృద్ధులయ్యే కొద్దీ
అది నిశబ్దంగా జొరబడింది
వాళ్ళని మనుషులు వదిలేస్తున్నప్పుడల్లా
వాళ్ళలా ఏకాకులయ్యారు
ఇంట్లోని గది గదిలో వదిలి వెళ్ళిపోయిన
వాళ్ళ మాటల పిలుపుల మధ్య
అమ్మా నాన్నల కాలం ముసలిదై పోయింది

వాళ్ళు వెళ్ళిపోయాక
ఒంటరిగా ఎలా ఉండాలో
ఇల్లు వాళ్ళ నుంచే నేర్చుకుంది
లేదా వాళ్ళిద్దరూ ఇంటికి నేర్పించారు
తాము మరణించాక ఇల్లు బేజారు కావద్దని

వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు
లోకం విడిచిన రోజు తలుపులు తెరిచి
చావు కబురు ఇంటి బయటకు చేరవేయడానికి కూడా ఎవరూ లేరు
ఒంటరైన ఇల్లెంతగానో విలపించింది

వాళ్ళిద్దరిలో అమ్మ మరణం భరించలేక
నాన్న కూడా చనిపోయినట్లు
ఇంటికి అర్థం అయింది.
ఇల్లు వాళ్ళ ఒంటరితనాన్ని చూసింది
బిడ్డల కోసం వాళ్ళ ఎదురుచూపుల్ని, కన్నీళ్లను చూసింది.
కోపంగా వాళ్ళని కసిరింది
ఇంత నిలువెత్తు మనిషిని నేనున్నాను కదా అంటూ
వాళ్ళని దగ్గరికి తీసుకుని
ఇల్లు హృదయానికి హత్తుకుంది

బహుశా ఇంటి ముందరి జనాలకి తెలియాలని
గోడమీద గడియారం గడియ గడియకి
మృత్యు గంట మోగిస్తున్నది
ఎవరైనా వస్తారేమోనని, తలుపులు, కిటికీలు
కొట్టుకుని కొట్టుకుని ఆగిపోయాయి
మందుల కోసం పెట్టుకున్న అలారం మోగినప్పుడల్లా
ఫోన్ స్క్రీన్ మీద పిల్లల ఫోటోలు నవ్వుతున్నాయి
తిరిగి బతికారేమో అని సూర్య చంద్రులు
వంతుల వారీగా వచ్చి చూసిపోతూనే ఉన్నారు
పెరటి మొక్కలు అమ్మ వచ్చి నీళ్ళు తాగిస్తుందేమో అని
కలవరంగా కదులుతూనే ఉన్నాయి
ఇంట్లోపలి ప్రతి వస్తువూ వీడ్కోలు దుఃఖాన్ని ఆపుకోలేక
నిస్సహాయంగా ఏడుస్తున్నది
గోడల మీది చనిపోయిన బంధువుల ఫొటోలు
వాళ్ళకి విషాదంగా స్వాగతం చెబుతున్నాయి

ఇంటి అణువణువులో పిల్లలతో వాళ్లిద్దరి జ్ఞాపకాలు
తెరలు తెరలుగా కదులుతున్నాయి
వంటింట్లో సగం తిన్న అన్నం కంచాలు
ఆకలి వాసన వేస్తున్నాయి
ఆస్తులు పంచుకుని, ఒకడు విదేశాలకెళ్ళిపోయాడు
ఒకడు పట్నం పారిపోయాడు
బిడ్డని అత్తారింటివాళ్ళు రానివ్వరు
ఎవరూ లేని ఇల్లు,
వదిలి వెళ్ళిపోయినవాళ్ళ ప్రేమల, అహాల, నిర్లక్ష్యాల, స్వార్థాల, ఆశ నిరాశల వెక్కిరింతల బరువుతో కుంగిపోతున్నది

అమ్మా నాన్నలు పోయాక
ఇల్లు అనాథ అయింది
దూర దేశాన ఉన్న పిల్లలకి కబురెలా వెళ్లాలని
ఇల్లు కలవర పడింది
ఇరుగు పొరుగు వారిని మూగగా పిలిచి పిలిచి అలసిపోయింది

విషాదంతో నిశ్శబ్ద సంతాపాన్ని
ఇల్లు లోపలికి వచ్చిపోయే గాలితో పంచుకున్నది
ఇంటిలోపల మృత్యువు పొరలు పొరలుగా కదలబారుతున్నది
ఇంటిలోపల గదుల మధ్య కాలం ఆగిపోయింది
ఎదురు చూసే వాళ్ళు, వచ్చేవాళ్ళూ లేరని
అర్థం అయ్యాక, ఊపిరితిత్తుల్లోని ప్రాణాన్ని వదిలేసి
వాళ్ళు లోకం విడిచిపోయాక
విషాదాన్ని తట్టుకోలేక ఇల్లు కూడా
మెల్ల మెల్లగా శిథిల మవుతుంది
ముడుచుకు పోతుంది
హృదయం పగిలి నెర్రలు వారుతుంది
నొప్పితో ఏడ్చి, ఏడ్చి చెమ్మ బారుతుంది
తనని తాను ఒంటరిగా చూసుకుంటూ భయపడి పోతుంది
కుళ్ళిపోతున్న శవాల జాడను బయటి లోకానికో,
సుదూరదేశాల్లోని పిల్లలకో చెప్పమని
తనమీదుగా వీచే గాలిని బ్రతిమి లాడుకుంటుంది
వాళ్ళు చనిపోయారు
కానీ ఇల్లు బతికే ఉంది
ఇల్లెప్పుడూ మరణించదు
అమ్మేస్తున్నప్పుడో,
పిల్లలు పంచుకుని వదిలి వెళ్ళిపోయినప్పుడో,
అమ్మానాన్నలను వెళ్లగొడుతున్నప్పుడో,
ఖాళీ చేస్తున్నప్పుడో,
చనిపోయాక కూడా విదేశాలనుంచి పిల్లలు రానప్పుడో,
తమ బదులు అంత్యక్రియలకు
అద్దె కొడుకులను పంపినప్పుడో
నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్నప్పుడో,
తన వొడిలో పుట్టి పెరిగిన మనుషులు గుండెల మీద తన్నినప్పుడో,
మనుషులు నయవంచన చేసినప్పుడు మాత్రమే,
ఇళ్లు వికలమై ఆత్మహత్యలు చేసుకుంటాయి
అమ్మా నాన్న లతో సహా ఈ లోకపు గడప దాటుతాయి
లేకపోతే ఇళ్లెప్పుడూ మనుషుల్లా మరణించవు
మనుషులు పోయాక కూడా పురాజ్ఞాపకాలని మోస్తూ,
అమ్మానాన్నలను తలుస్తూ
చివరి శిథిలపు శకలం దాకా
అమర స్తూపాల్లాగా నిలిచి ఉంటాయి

(అమ్మా నాన్నలు పోయాక కూడా చివరి చూపు కోసం కూడా రాకుండా, దహన సంస్కారాల కోసం డబ్బులిచ్చి అద్దె కొడుకులని పంపే విదేశీ కొడుకుల మీద నిరసనగా ఈ కవిత. ఈ మధ్య తండ్రి పోతే రావడానికి సమయం లేదని, రాకుండా దహన సంస్కారాలు చేసేయ్యమని అద్దె కొడుకుని పంపిన కొడుకుని చూసి దుఃఖంతో తల్లడిల్లిపోయిన ఒక తల్లి బాధకు స్పందనగా…)

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 1. ఆమె అడవిని జయించింది, 2. పాదముద్రలు, 3. లక్ష్మి (నవలిక), 4. బచ్ఛేదాని (కథలు), 5. ప‌హెచాన్‌ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 6. పాలమూరు వలస బతుకు చిత్రాలు (కథా సంకలనం), 7. హస్బెండ్ స్టిచ్ (స్త్రీల విషాద లైంగిక గాథలు), 8. అరణ్య స్వప్నం (కవిత్వం), 9. ఇల్లొక రాజకీయం (రాజకీయ కవిత్వం).

Leave a Reply