ట్రంప్ మిత్రుడు, యూరప్‌లోని మితవాద ప్రజాకంఠకుడైన విక్టర్ ఓర్బన్ హంగేరి రాజకీయాల్లో దశాబ్దన్నర కాలానికి పైగా ప్రధానమంత్రిగా ఏకచ్ఛత్రాదిపత్యంగా పాలన కొనసాగించాడు. పార్లమెంటుకు ఈ 2026 ఏప్రిల్ 12న జరిగిన ఎన్నికల్లో యువ నాయకుడు మధ్యేవాద మితవాద పక్షం టీస్ౙా పార్టీని స్థాపించిన పీటర్ మాగ్యార్ మజాదు గెలిచి ప్రభంజనం సృష్టించాడు. దీంతో హంగేరీలో పెను మార్పులు చోటుచేసు కున్నాయి. తాజా సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్ విక్టర్ మిహలీ ఓర్బన్ నిరంకుశ పాలనకు తెరపడింది. దీంతో ఓర్బన్ 16 ఏళ్ల పాలన ముగిసి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్న జాతీయ మిత వాద రాజకీయాలకు గట్టి దెబ్బ తగిలింది. హంగేరీలో తిరుగులేని అదికారం చెలాయించిన విక్టర్ ఓర్బన్ అన్ని రాజ్యాంగ సంస్థలను తన ఆదీనంలోకి తెచ్చుకుని అబద్ధాల పునాదులపై పాలన కొనసాగించాడు. అబద్దాల పునాదులపై నిర్మితమైన నిరంకుశాధికార కోట గోడలు ఎప్పుడో ఓసారి కూలిపో తాయన్న వాస్తవా న్ని తాజాగా హంగేరీ ఎన్నికలు రుజువు చేశాయి.
విక్టర్ ఓర్బన్ నిరంకుశ పాలన :
విక్టర్ ఓర్బన్ హంగేరీలో ఒక ప్రముఖ మితవాద రాజకీయ నాయకుడు. 2010 నుండి 2026 వరకు తిరుగులేని నాయకుడిగా ప్రధాననమంత్రిగా అదికారం చెలాయించారు. ఉదారవాదిగా, దేశహితాన్ని కోరే నాయకుడిగా హంగేరీ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టిన విక్టర్ ఓర్బన్ 1998లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన ఆయన నాలుగేళ్ల తరువాత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆపై 2010లో మూడింట రెండొంతుల మెజార్టీతో మళ్లీ ప్రధానిగా ఎన్నికైన ఓర్బన్- తన పాత ఆదర్శాలకు పాతరేసి, రాజ్యాంగాన్ని మార్చేసి బలవంతుడిదే రాజ్యమన్న ఆటవిక నీతిని నెలకొల్పారు. న్యాయపాలిక స్వతంత్రతను హరించడమే కాదు, అన్ని వ్యవస్థలనూ విధేయులతో నింపేశారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. పార్లమెంట్ సీట్లను 386 నుంచి 199కి తగ్గించి, సొంత పార్టీకి కలిసివచ్చ్చే విధంగా నియోజకవర్గాలను ఇష్టారీతిగా పునర్విభజించారు. ఎన్నికల చట్టాలను తనకు అనుకూలంగా మార్చేశారు. విమర్శకులను విదేశీ ఏజెంట్లుగా తిట్టిపోసి, ప్రతిపక్ష నేతలను అసత్యారోపణలతో వ్యక్తిత్వ హననం చేసి తనకు ఎదురులేకుండా చేసుకున్నారు.
ప్రజలు తనని ఎన్నుకోవడం వరకే ప్రజాస్వామిక విధి అని, ఆ తర్వాత తాను తీసుకునే నిర్ణయాలే దేశ భవిష్యత్తును శాసిస్తాయని, ప్రజాతంత్ర, పౌర హక్కులు, స్వేచ్ఛలు తన దయాదాక్షిణ్యాలని అన్నాడు. వీటినే నమ్ముతూ నిరంకుశంగా పాలన చేశాడు.ఈ పచ్చి మితవాద నేత విక్టర్ ఓర్బన్ ను , ఆయన పార్టీని ప్రజా ప్రయోజనం లేనిదిగా భావించిన హంగేరీ ప్రజలు.. ఏ నాయకుడి విధానాలైనా ప్రజలను దీర్ఘకాలం ఏమార్చ లేవని హంగేరి ఎన్నికలు నిరూపించాయి. ఓర్బన్ ఆకర్షణీయమైన వాగ్దానాలతో భావోద్వేగాలను ఎగదోసి ప్రజలను మభ్యపెడుతూ, అదికారాన్ని నిరంకుశంగా చలాయించే నేతల ఆటలు ఎల్లకాలం సాగవన్న చారిత్రక సత్యాన్ని హంగేరీ ఎన్నికల ఫలితాలు మరోసారి చాటి చెప్పాయి. విక్టర్ ఓర్బన్‌ను పదవీచ్యుతుడిని చేస్తూ పీటర్ మాగ్యార్ సాదించిన చారిత్రాత్మక విజయం, విస్తృతమైన పాఠాలను అందించడమే కాకుండా, రష్యా, ఐరోపాలతో హంగేరి సంబంధాలలో ఒక పెద్ద మార్పునకు నాంది పలుకుతోంది.
హంగేరిలో చట్టబద్ధపాలన క్షీణించడం, అవినీతి పెచ్చరిల్లడం, ప్రజాస్వామ్య విలువలు కృషించి పోవడం, ఆర్థిక వ్యవస్థ కుంగిపోవడం, మీడియాపై అణచివేత, మైనారిటీలపై వివక్ష, రష్యా అనుకూల వైఖరులు, ఈయూ-నాటోతో సంబంధాలు తెబ్బతినడం, నైపుణ్యం గల కార్మికుల కొరత వంటివి కీలకమైన సమస్యలుగా ఉన్నాయి. అత్యవసర శాసనాల ద్వారా పాలన సాగించడం, ప్రజాస్వామ్య సంస్థలను, న్యాయ వ్యవస్థ స్వతంత్రత బలహీన పడింది. ఫలితంగా విక్టర్ ఓర్బన్‌పై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ఎన్నికలకు ముందే స్వతంత్ర సర్వేలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. ప్రజాస్వామ్య విలువలను తూలనాడుతూ, మత ఛాందసత్వాన్ని రెచ్చగొడుతూ, కుట్ర సిద్ధాంతాలతో జనంలో భయాందోళనలు పెంచుతూ స్వదేశానికి సాటిలేని రక్షకుడిగా వందిమాదిగదులతో భుజకీర్తులు తొడిగించుకున్నారు. అయినా జాతీయవాదం ముసుగులో అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతాలను పెంచిపోషించిన విక్టర్ ఓర్బన్ చిత్తుగా ఓడిపోయాడు.
జాతీయ సహకార వ్యవస్థ(ఎన్ఇఆర్) పేరుతో అనేక మార్పులు చేసి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలతో, అవినీతిని విశృంఖలం చేసిన ఫిడెస్ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు. ఆర్థిక సంస్థలు, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, అవినీతి నిరోధక విభాగం… ఇవన్నీ తన అనుయాయు లతో ఓర్బన్ నింపేశాడు. మనదేశంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా(ఎస్ఐఆర్) పేరుతో ఎన్నికల సంఘం ఓట్లను గల్లంతు చేస్తున్న రీతిలోనే అక్కడి ఎన్నికల సంఘం వ్యవహరించింది. ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన చట్టాలను మార్చి ఎన్నికల నిబంధనాలను అనుకూ లంగా మార్చుకోవడం, మీడియాను నియంత్రించడం లాంటివన్నీ దేశారు. వెరైటీస్ ఆప్ డెమోక్రసీ(వి-డెమ్) సర్వేలో ఎన్నికల నిరంకుశత్వంలో మనదేశం కంటే ముందు హంగేరి ఉంది. ఓర్బన్ పచ్చి మితవాదులకు కార్పొరేట్లకు అనుంగు మిత్రుడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు యుద్ధోన్మాది జియోనిస్టు నెతన్యాహు కూడా ఇతనికి మద్దతు తెలిపారు. ఫ్రాన్స్ లీపెన్, ఇటలీ మెలోని, రష్యా పుతిన్ లాంటి వారు కూడా ఇతని మద్దతుదార్లే.
ఔదార్యం లేని నిరంకుశ వ్యవస్థకు గొప్ప ప్రతినిధిగా చెప్పుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి విక్ట్టర్ ఓర్బన్ ఒక ‘దొంగల పాలన’ను నడుపుతున్నారనే ప్రజాబిప్రాయం ప్రజల్లో పెరిగింది. అత్యంత అవినీతిమయమైన ఈయూ దేశంగా ప్రథమ ర్యాంకు పొందింది. దానికి తోడు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ – 2025లో దాని వృద్ధిరేటు 0.4 శాతంగా ఉండటం, తూర్పు యూరోపియన్ పొరుగు దేశాలన్నింటి లోకెల్లా అత్యల్పం అయ్యింది. ఇక ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది ఆర్థిక వృద్ధి 0.4 శాతానికి దిగజారిపోయింది. నిరుద్యోగం వికటాట్టహాసం చేసింది. విద్య, వైద్యం అటకెక్కా యి. అధిక ద్రవ్యోల్బణం, ఇతరేతర ఆర్థిక సమస్యలతో తమ జీవితాలు నానాటికీ దుర్భరమవుతుండటం పై హంగేరి వాసుల్లో చోటు చేసుకున్న తీవ్రమైన అసంతృప్తి-ఓర్బన్‌ను ఇంటిదారి పట్టించింది. ఓర్బన్ అనుకూల వ్యాపార సంస్థలు మాత్రమే లాభార్జనతో కళకళలాడాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శకంలో మతవాదులతో మమేకమై మితవాద ఫాసిస్టులను అధికారంలోకి తెచ్చింది. మతాలు, జాతులవారీ విభజన, బహుళత్వం పట్ల వ్యతిరేకత, విదేశీయుల పట్ల ద్వేషపూరిత ప్రసంగాలను వినీవినీ ఓటర్లు విసుగెత్తారు. ప్రతిపక్షాలు, ప్రగతిశీలురపై కక్ష సాధింపు చర్యలు, రాజకీయ ప్రేరేపిత కేసులు, ప్రజాస్వామిక సంస్థలను, రాజ్యాంగాన్ని నీరుగార్చడం, వాక్ స్వాతంత్య్రాన్ని అణచి వేయడం వంటి నిరంకుశ ఏక పార్టీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు.
ఇదిలా ఉండగా, ఎన్నికలలో ఓటమి తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో, “ఒక రాజకీయ శకం ముగిసిం ది” అని ఓర్బన్ అంగీకరించారు. అయినప్పటికీ, ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ తాను తన పార్టీ నాయకుడిగా కొనసాగుతానని ఆయన ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, పోలాండ్, తాజాగా హంగేరీలో… పచ్చి మితవాదులను ఇంటికి పంపించారు. హంగేరి ఫలితాలు ప్రజా వ్యతిరేకులకు ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.
ఓర్బన్ ప్రభావ నీలి నీడలు:
ఓర్బన్ హంగేరికి మాత్రమే పరిమితమైన సాధారణ నాయకుడు కాదు. ఆయన్ను అధికార పీఠం ఎక్కించిన ఫార్ములా పలు దేశాల నాయకులకూ శిరోధార్యంగా మారింది. సంప్రదాయవాదాన్నీ, జాతీయవాదాన్నీ నెత్తికెత్తుకుని ప్రజల భావోద్వేగాలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లటం ఎలాగో ఓర్బన్ నేర్పారు. అమెరికాకు మాత్రమే కాదు.., ప్రపంచానికంతకూ పెను సమస్యగా మారిన ట్రంప్‌కు ఓర్బన్ మాగా (మళ్లీ అమెరికాను మహోన్నతం చేద్దాం) ఉద్యమానికి సలహా ఇచ్చాడు. ఓర్బన్‌కు ఒక వైపు ట్రంప్, మరో వైపు పుతిన్ సన్నిహితులు!
ఓర్బన్ మార్కు ఏలుబడికి ఇంటా బయటా శత్రువులు అపరిమితంగానే ఉన్నారు. వారు ఈయూ కమ్యూనిస్టులు, వలసదారులు, శతకోటీశ్వరుడు దాత జార్జి సోరోస్- ఎవరైనా కావొచ్చు. అభద్రతా భావనకూ, విదేశీ బెడదకూ, సమాజంలోని నైతిక పతనానికీ, ఇతరత్రా ప్రమాదాలకూ సర్వరోగ నివారిణి తాను మాత్రమేనని ఓర్బన్ పదహారేళ్లపాటు ప్రజల్ని నమ్మించగలిగారు. ఇదిలా ఉంటే.. ఓర్బన్ ప్రభావం, నిర్వాకం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో విక్టర్ ఓర్బన్‌పై టిస్జా పార్టీకి ఘన విజయాన్ని అందించిన పీటర్ మాగ్యార్ హంగేరిని పాలించడంతో గణనీయమైన సవాళ్లను ఎదుర్కోనున్నారు. గత ప్రభుత్వంలోని విధేయులతో నిండిన ప్రభుత్వ సంస్థలను, సైన్యాన్ని, న్యాయ వ్యవస్థను, పోలీసులను వారసత్వంగా పొందుతున్నారు. ఈ ఉచ్చునుంచి బయటపడి సజావుగా ప్రజానుకూల పాలన సాగించటం ఎన్నికల్లో గెలిచినంత సులువు కాదు.
యూరప్‌పై విక్టర్ ఓర్బన్ ప్రభావం :
విక్టర్ ఓర్బన్ యూరోపియన్ యూనియన్ అంతటా, ప్రత్యేకించి బ్రిటన్‌లో మితవాదులను ఉత్తేజపరి చాడు. అతని ఓటమి ఒక విధంగా యూరప్‌లో ప్రబలుతున్న మితవాద, అవకాశవాద శక్తులకు శరాఘాతం లాంటివి. ట్రంప్ అంతర్జాతీయ మితవాద ధోరణితో స్ఫూర్తి పొందిన విక్టర్ ఓర్బన్ యూరప్‌లో పచ్చి మితవాద పార్టీలను కూడగట్టి గత ఏడాది సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికలన్నిటిలో మితవాద శక్తుల పరమయ్యే వ్యూహాలపై చర్చ చేశారు. యూరప్ ఖండంలోని పలు దేశాలలో గత కొంతకాలంగా మితవాద పార్టీలు అది కారంలోకి రావడం, లేదా గట్టి పోటీ ఇవ్వడం ఆ నేపథ్యంలోంచే జరిగింది. అందుకు బ్రిటన్‌లోని రిఫామ్ పార్టీ, ఫ్రాన్స్ లో మెరైన్ లీపెన్ నేతృత్వం వహిస్తున్న నేషనల్ ర్యాలీ పార్టీ, జర్మనీలో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఎఎఫ్‌డి), స్పెయిన్‌కు చెందిన వాక్స్ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ విక్టర్ నిర్వహించిన సమావేశానికి తమ ప్రతినిధులను పంపాయి. గడిచిన రెండు, మూడేళ్లుగా యూరప్‌లో పచ్చిమితవాద పార్టీల పట్ల ప్రజలు చూపిస్తున్న మొగ్గుకు తాజా హంగేరీ ఎన్నికల ఫలితాల ద్వారా బ్రేక్ పడినట్లయ్యింది. అంతకుముందు డెన్మార్క్ ఎన్నికల్లో సైతం మితవాద పార్టీని అక్కడి ప్రజలు తిరస్క రించారు. ఇది ట్రంప్ అనుంగులకు యూరప్ ప్రజల తిరస్కారంగా చెప్పవచ్చు.
నాటో కూటమిలో ఉంటూ యూరప్‌కు పక్కలో బల్లెంలా విక్టర్ ఓర్బన్ తయారయ్యారు. యూరప్‌లో సభ్య దేశంగా ఉంటూ నాటోకు దన్నుగా నిలబడాల్సిందిపోయి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గట్టి మద్దతుని స్తూ ఐరోపా దేశాలకు కంట్లో నలుసులా తయారయ్యాడు. యుద్ధంలో రష్యాను దెబ్బతీసేందుకు యుక్రెయిన్‌కు భారీ స్థాయిలో సైనిక సాయం చేయాలని నాటో సభ్య దేశాలు భావించిన ప్రతిసారీ విక్టర్ తన వీటో అధికారంతో ఏకాబిప్రాయానికి మోకాలడ్డి విమర్శలపాలయ్యారు. పశ్చిమాసియా యుద్ధంలో తనతో కలిసిరాని నాటో దేశాలపై గుర్రుగా ఉన్న ట్రంప్‌తోనూ విక్టర్‌కు సత్సంబంధాలున్నాయి.
ఓర్బన్ ఓటమి చారిత్రాత్మకం :
16 ఏళ్ల నిరంకుశ పాలన తర్వాత విక్టర్ ఓర్బన్ పతనానికి నాంది పలికిన ఏప్రిల్ 12 నాటి హంగేరి యన్ ఎన్నికలు చారిత్రాత్మకం. ఐరోపా స్వేచ్ఛారాహిత్యానికి ప్రధాన రూపశిల్పి, హంగేరిలో చట్టబద్ధమైన పాలనను పాతరేసినవాడు, అంతులేని అవినీతి వ్యవస్థకు సారథ్యం వహించినవాడు, యుక్రెయిన్‌కు బహిరంగ శత్రువుగా నిలిచినవాడు చివరికి ప్రజా తిరష్కరనకు గురయ్యాడు. అయితే, ఒక్క ఎన్నిక మాత్రమే ఉదార ప్రజాస్వామ్యానికి తక్షణ పునరాగమనాన్ని తీసుకురాలేదు. ఐరోపా అంతటా ఉన్న అనుభవం చూపిస్తున్నదేమిటంటే, ఈ జాతీయ-జనరంజక ఘట్టాలు కేవలం తాత్కాలికమైనవి కావు. అవి మానడానికి సంవత్సరాలు పట్టే లోతైన గాయాలను మిగిల్చాయి. ఈ ప్రక్రియకు సమయం పడుతుందని పోలాండ్ ఉదాహరణ చూపిస్తుంది. 2023లో డొనాల్డ్ టస్క్ యొక్క సివిక్ కూటమి, లా అండ్ జస్టిస్ (పిఐఎస్) పార్టీని ఓడించినప్పుడు, ఇలాంటి ఉత్సాహమే వెల్లివిరిసింది. ఒక దేశంలో చట్టబద్ధమైన పాలనను కూల్చివేయడం కంటే, దానిని పునర్నిర్మించడానికి చాలా ఎక్కువ సమయం శక్తి పడుతుందని పోలాండ్ నిరూపించింది. మితవాదులకు నమూనాగా మారి వ్యవస్థల నన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని జాతీయవాద ఉన్మాదాన్ని రెచ్చగొట్టినా ఓటర్లు ఛీ కొట్టారు. రెండేళ్ల క్రితమే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టిస్జా పార్టీని స్థాపించిన పీటర్ మాగ్యార్ ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కోటి జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో 80 శాతం పోలింగ్ జరగడం ఇదే తొలిసారి.
పీటర్ మాగ్యార్ ప్రభంజనం :
ఓర్బన్ పార్టీ ‘ఫిడెస్ట్’లో సుదీర్ఘకాలం కొనసాగి, వివిధ ఉన్నత పదవులు నిర్వహించిన పీటర్ మాగ్యార్ (మజార్) రెండేళ్ళక్రితం లైంగిక వేదింపుల కేసులో ఇరుక్కున్న ఒకరికి తమ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటిం చడంతో ఆగ్రహించి వేరుపడ్డారు. ఆ వెంటనే మధ్యేవాద మితవాద పార్టీ టిస్జాను స్థాపించాడు. హంగేరీ రాజకీయాలను సమూలంగా ప్రక్షాళించడానికి తాను ఉద్యమిస్తున్నానని చెప్పుకున్నాడు. ఓర్బన్ విధానాల వల్ల ఈయూలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే హంగేరి ఒంటరి అయిపోయిందని, సహాయ సహకారాలు నిలిచిపోయాయని ఈ యువనాయకుడు ప్రజలను నమ్మించగలిగాడు. ఓర్బన్ ఒంటెత్తు పోకడలు, నియం తృత్వ విధానాలు ఆయన మీద జనంలో వ్యతిరేకతను పెంచాయి. ఆర్థికరంగం సవ్యంగా లేకపోవడంతో పాటు, సివిల్ సర్వీసుల ప్రక్షాళన వంటి కొన్ని నిర్ణయాలు కూడా ఓర్బన్ మీద విముఖత పెంచాయి. ‘పీటర్ మాగ్యార్ విజయ కేతనంతో హంగేరీ రాజకీయాలను మలుపు తిప్పారు. హంగేరీ పార్లమెంట్‌లో గల 199 స్థానాలలో పీటర్ మాగ్యార్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 138 స్థానాలను కైవసం చేసుకుంది. ఓర్బన్ పార్టీ ఫిడెస్ట్ కు 55, తీవ్ర మితవాద పక్షం అవర్ హోం ల్యాండ్‌కు 6 స్థానాలు లభించాయి.
పీటర్ మాగ్యార్ ముందున్న సవాళ్లు :
రెండు సంవత్సరాల పాటు ఓర్బన్‌కు వ్యతిరేకంగా పీటర్ మాగ్యార్ తన పార్టీ టీస్జాను గ్రామాలు, పట్టణ కూడళ్లు, నగరాలలో ప్రజలకు పరిచయం చేశాడు. అలాగే హంగేరిలో పాతుకుపోయిన బందుప్రీతి, అవినీతితో విసిగిపోయిన హంగేరియన్లను సమీకరించాడు. హంగేరి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇంతమంది ఓటు వేయలేదు. ఓ ఒక్క పార్టీ కూడ ఇంత బలమైన ప్రజా తీర్పును పొందలేదు. మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపొందిన మాగ్యార్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ‘సూపర్ మెజారిటీ’ వచ్చినా పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించటం టీస్జా పార్టీకి అంత సులభం కాదు. ఎందుకంటే సకల అధికార వ్యవస్థలూ ఓర్బన్ అనుకూలురతో నిండి ఉన్నాయి. ఓర్బన్ వదిలి వెళ్లిన ‘కర్కశవాద ప్రజాస్వా మ్యాన్ని’ పునర్నిర్మించాలనే కష్టతరమైన సవాలును మాగ్యార్ ఎదుర్కొక తప్పదు. ఆర్థిక సంస్థలూ, అది కార యంత్రాంగం, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక విభాగం వగైరాలన్నీ ఆయన మనుషుల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి.
హంగరీలో, పీటర్ మాగ్యార్‌కు ఎదురయ్యే సమస్యలు మరింత కఠినతరం కానున్నాయి. ఓర్బన్ తన అప్రజాస్వామికతను హంగేరియన్ రాజ్య పునాదులలో విజయవంతంగా పొందుపరిచారు. మాగ్యార్ వారసత్వంగా పొందుతున్నది ఒక “స్వాధీనంలో ఉన్న” రాజ్యం. ఇందులో విధేయులు ప్రతి ప్రభుత్వ వ్యవస్థలోనూ పాతుకుపోయి ఉన్నారు. మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుపొందిన మాగ్యార్ ముందు అనేక సవాళ్లున్నాయి. ఇన్నాళ్లూ అమలులలో ఉన్న పచ్చి మితవాద, ప్రజావ్యతిరేక విధానాలను నిలువరించి ప్రజాస్వామిక వాదిగా, ప్రజలందరి బాగుకోరే పాలనను చేపడితేనే ప్రజా నాయకుడిగా మిగులుతారు.
ఇన్నాళ్లు అమలులో ఉన్న ఓర్బన్ మితవాద ప్రజావ్యతిరేక విధానాలను నిలువరించి ప్రజాస్వామిక వాదిగా, ప్రజలందరి బాగు కోరే పాలనను చేపడితేనే ప్రజా నాయకుడిగా మిగులుతాడు. విక్టర్ ఓర్బన్‌ను పదవీచ్యుతుడిని చేసిన కొద్ది రోజులకే, పీటర్ మాగ్యార్ నాయకత్వంతో కీలక చర్చల కోసం యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికా రులు బుడాపెస్ట్ కు విచ్చేశారు. హంగేరితో ఈయూకు ఉన్న ఉద్రిక్త సంబంధా లను చల్లార్చ డమే ఈ చర్చల లక్ష్యం. కొత్త ప్రభుత్వం మే లో అది కారంలోకి రావడానికి కొన్ని వారాల ముందు ఈయూ ప్రతినిధి బృందం బుడాపెస్ట్ కు చేరుకుంది. చర్చలను ఇరుపక్షాలు ఒక కీలకమైన పునఃప్రారంభంగా పరిగణిస్తు న్నాయి. ఈ ప్రాంతీయ కూటమి యుక్రెయిన్‌కు ఇచ్చిన 90 బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి హంగేరి తన వీటోను ఎత్తివేసేలా ఒప్పించేందుకు ఈ పర్యటన ఒక అవకాశంగా నిలిచింది.
ముగింపు :
పీటర్ మాగ్యార్ హంగేరి పాలనలో సమగ్ర మార్పులు తీసుకువస్తానని హామీ ఇచ్చాడు. ప్రధానంగా అవినీతి నిర్మూలన, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడం, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం, మీడియా స్వేచ్ఛను పునరుద్ధరించడం, విద్య-ఆరోగ్యం ప్రజలందరికి అందించడం వంటివి ఉన్నాయి. 21వ శతాబ్దంలో నిరంకుశ, మితవాద భావజాలం గల పార్టీలను తిరస్కరించే ధోరణి చాలా దేశాల్లో కనిపిస్తోంది. మతాలు, జాతులవారీ విభజన, బహుళత్వం పట్ల వ్యతిరేకత, విదేశీయుల పట్ల ద్వేషపూరిత ప్రసంగాలను విని ఓటర్లు విసుగెత్తి పోయారు. ప్రతిపక్షాలు, ప్రగతిశీలురపై కక్షసాధింపు చర్యలు, రాజకీయ ప్రేరేపిత కేసులు, ప్రజాస్వామిక సంస్థలను, రాజ్యాంగాన్ని నీరుగార్చడం, వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయడం వంటి నిరంకుశ ఏక పార్టీ పాలనకు చరమగీతం పాడుతున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, పోలాండ్, తాజాగా హంగేరిలో పచ్చి మితవాదులను ఇంటికి పంపించారు. దీనికి భారత దేశం కూడా మినహాయింపేమీ కాబోదు. ఈ నేపథ్యంలోంచే.. హంగేరిలో విక్టర్ ఓర్బన్‌కి జరిగిన గుణపాఠం. దీన్ని ఇతర దేశాల పాలకులు గమనిస్తారా?!