“అర్జున్ గారి భార్య హాస్పిటల్‌లో ఉన్నారట. అందుకే ఆయన అయిదు రోజుల్నుంచి ఆఫీసుకు రావట్లేదు”. సీట్లో కూర్చోబోతున్న నన్ను చూస్తూ అరుణ చెప్పింది.
“అరే ఏమయింది” ఆదుర్దా నా గొంతులో.
“ఏమో మరి ఫోన్‌లో ఆయన నాతో ఏమీ చెప్పలేదు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. మేము వచ్చి చూస్తాం అండీ అంటే వద్దంటున్నారు”.
ఏదో అలజడి నా మనసులో..
“అర్జున్‌గారితో క్లోజ్‌గా మూవ్ అయే రంజిత్, శర్మగార్లు మధ్యాహ్నం కిమ్స్‌కి వెళ్లి చూసిరావాలని అనుకుంటున్నారు” అంటూ అసిస్టెంట్ మేనేజర్ కేబిన్‌లోకి వెళ్లింది అరుణ.
అర్జున్ మా బ్రాంచ్ మేనేజర్. ఆయన భార్య లీల నారాయణగుడ ఎస్.బి.ఐ. లో మేనేజర్. వీరిద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు అంతా. లీల ఆఫీస్ ఫంక్షణ్లప్పుడు అర్జున్‌తో పాటు వస్తుంటుంది. అందరిలోనూ ఎంతో ప్రత్యేకంగా కనిపించే వీరి జంట అంటే ఆఫీస్‌లో అందరికీ ఇష్టం. అర్జున్ పుట్టిన రోజు నాడు లీల స్వయంగా అందరికీ స్వీటు హాటు చేసి స్పెషల్‌గా పేరు పేరున పాక్ చేసి పంపిస్తుంటుంది. అందుకే ఆమె పట్ల అందరికీ ప్రత్యేక శ్రద్ద. వారి అన్యోన్య దాంపత్యం గురించి చెప్పుకోనిదే రోజు గడవదు లేడీస్ స్టాఫ్‌కి. ఆమెకు ఏ ఆరోగ్య సమస్యా లేదు అని అందరికీ తెలుసు.
వారం క్రితం నేను వెళ్లిన పెళ్లి రిసెప్షన్ గుర్తుకు వచ్చింది. అక్కడ నన్ను పట్టి పట్టి పరీక్షగా చూసిన లీల మొహం గుర్తుకు వచ్చింది. మనసులో భయం మొదలయింది. పక్క కెబిన్‌లో ఉన్న రాధిక వైపు చూసాను. నన్నే చూస్తున్న ఆమె చప్పున కళ్లు దించుకుంది. అనుమానం బలపడింది నాలో. అరచేతుల్లో చెమట పడుతుంది. పక్కన ఉన్న సీసాలోనించి నీళ్లు గటగటా తాగేసాను.
మధ్యాహ్నం కిమ్స్‌కి వెళ్లిన వారితో అరుణ కూడా వెళుతూ నన్ను రమ్మని పిలిచింది. మనసులో వెళ్లాలని ఉన్నా పని ఉందని తప్పించుకున్నాను. రాధిక ఎక్కడా కనపడలేదు. బహుశా ఇంటికి వెళ్ళిపోయిందేమో. ఆ రాత్రి ఎలా గడిచిందో తెలియదు. అరుణకి ఫోన్ చేసి వివరాలు అడుగుదాం అనిపించినా, ఆ పని చేయలేకపోయాను. చెదిరిన మనసుతోనే ప్రొద్దున్న ఆఫీసుకు వచ్చి కూర్చున్నాను. నా కళ్లు అరుణ కోసం వెతుకుతూనే ఉన్నాయి.
అరుణ పదిన్నరకు వచ్చింది. ఆఫీసులో అంతా మౌనం. అరుణ నా వైపు చూస్తుంటే ఆ కళ్లలో అనుమానం కనిపించింది. రాధిక భయం భయంగానే పనులు చేసుకుంటుంది. ఓ గంట అయిపోయి కస్టమర్లు పలచబడ్డాక అరుణ నా దగ్గరకు వచ్చింది.
“లీల గారు సూసైడ్ అటెంప్ట్ చేశారట. ఔట్ ఆఫ్ డేంజర్ కాని కోలుకోవడానికి టైం పడుతుంది అంటున్నారు” అంది.
అదిరిపోయాను నేను… ఆమె వైపు చూస్తూ ఉండిపోయాను.
అరుణ నన్ను పరీక్షగా చూస్తూ “ఏం జరిగింది శారదా? అర్జున్ మమ్మల్ని చూసి భయపడ్డారు. లోపలికి వెళ్లి ఒక్క సారి చూస్తాం అన్నా మమ్మల్ని వెళ్లనివ్వలేదు. అక్కడ పని చేసే నర్స్ నా కజిన్. ఆమె చెబితే అది సూసైడ్ ఎటెంప్ట్ అని తెలిసింది. లీల వాళ్ళ బ్రదర్స్, అమ్మా నాన్నా అందరూ మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. లీల అన్నగారు వచ్చి శారద మీరేనా అని నన్ను అడిగితే నాకు అర్ధం కాలేదు. నీకు లీల గారి మధ్య పెద్దగా స్నేహం లేదు. మరి నీ గురించి వాళ్లెందుకు ఎంక్వయిరీ చేస్తున్నారు” నా కళ్ళలోకి చూస్తూ అడిగింది అరుణ.
కళ్లు మూసుకుని ఐదు నిముషాలు కూర్చున్నాను. మూడు నెలలుగా జరుగుతున్నవన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఎదురుగా లెడ్జర్ అడ్డం పెట్టుకుని ఉన్న రాధికని చూసాను. ఆమె కళ్లల్లో నీళ్లు.
ప్రమాదం ముంచుకొస్తుందనే అనుమానం ఉన్నప్పుడు కలిగే భయం, ఆ ప్రమాదం మీద పడ్డాక దాన్ని ఎదుర్కోవలసినప్పుడు నాలో మాయం అవుతుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి అన్న దిశగా నా మనసు పని చేస్తూ ఉంటుంది. ఒక్కసారి బ్రాంచ్‌లో అందరి వైపు చూసాను. అందరి చూపుల్లోనూ అనుమానం. మామూలుగా నా ముక్కుసూటి తనానికి వాళ్ళకి నేనంటే కాస్త జంకు. ఇప్పుడు మాత్రం, నేను ఏదో ఇబ్బందిలో పడబోతున్నాననే ఆనందం కనపడింది.
ఏది జరగకూడదని ఇన్నాళ్లు అనుకున్నానో అదే జరిగింది. ఇక నేను మౌనంగా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. బ్యాగ్ తీసుకుని అరుణ వైపుకి తిరిగి, “లీల అన్నగారి పేరేంటి” అడిగాను.
“కుమార్ అట శారదా. ఆయన నీ గురించి అడిగినప్పుడు చాలా కోపం కనపడింది. స్టాఫ్ అందరం షాక్ అయ్యాం. విషయం ఎవరికీ అర్ధం కాలేదు” అంది అరుణ.
గాఢంగా ఊపిరి తీసుకున్నాను. సెల్ తీసుకుని అర్జున్‌కి ఫోన్ చేశాను. అరుణ చూస్తూనే ఉంది. అర్జున్ ఫోన్ ఎత్తలేదు. వాట్శప్ మెసేజ్ పెట్టాను. అతను చూసుకుంటాడని నాకు తెలుసు. కార్ కీస్ తీసుకుంటూ ఓకే, నేను కిమ్స్ కి వెళుతున్నాను. అంటూ బైలుదేరాను.
నాలో ఒక నిశ్చయం. శ్రీనుకి ఫోన్ చేశాను. శ్రీను నాకు ఉన్న అతి కొద్ది మంది స్నేహితులలో ఆప్తుడు, ముఖ్యుడు. ఈ సంగతంతా తెలిసినవాడు. బ్యాగ్ తీసుకుని బైలుదేరబోతున్న నన్ను చూసిన రాధిక మొహంలో భయం. వెంకటేష్ గారితో హాప్ డే లీవ్ అని చెప్తూ గుమ్మం దాటుతున్న నన్ను చూస్తూ అరుణ “ఆగు శారదా నేనూ వస్తున్నాను” అంటూ వెంకటేష్ గారి కేబిన్ దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పి తన బ్యాగ్ తీసుకుని నాతో కలిసింది. ఆమెను రావద్దని అనాలనుకున్నాను. కాని ఆలోచించి ఆగిపోయాను.
కిమ్స్ హాస్పిటల్ బేస్మెంట్ పార్కింగ్‌లో కారు దిగి, లిప్ట్ దగ్గరకు వచ్చాం. “రూం 1089” చెప్పింది అరుణ. లిప్ట్‌లోకి ఎక్కుతున్నప్పుడు వచ్చింది అర్జున్ నుండి ఫోన్. అతని గొంతులో కంగారు. “శారదా మీరు దయచేసి హాస్పిటల్‌కు రాకండి” అంటున్నాడు. అరుణకు అది వినిపిస్తూనే ఉంది. “సారి అర్జున్ నేను లిప్ట్‌లో ఉన్నాను.” అంటూ కాల్ డిస్కనెక్ట్ చేశాను.
పదో ఫ్లోర్‌లోకి వెళ్లడానికి ఇరవై నిముషాలు పట్టింది. లిప్ట్ దగ్గరకు ఆతృతగా వచ్చాడు అర్జున్. నాతో అరుణను చూడగానే అతని కళ్లల్లో అసహనం. ఓ గాడ్ అంటూ క్రాఫ్ సవరించుకుంటున్నాడు.
అప్పుడే మెట్ల వైపు నుండి వస్తూ కనిపించాడు శ్రీను. అతను కనిపించగానే నా మొహంలో నిశ్చింత. శ్రీనుని చూసిన అర్జున్ కళ్ళలో భయం. అందరం కారిడార్ వైపుకి నడిచాం.
అర్జున్ వైపుకు తిరిగి “ఎలా ఉంది లీల” అడిగాను.
అర్జున్ కళ్లల్లో నీళ్ళు. “షీ ఈజ్ ఓకే కాని..” అంటూ మాట మింగేసాడు.
“ఏం జరిగింది” అర్జున్ వైపు చూస్తూ అడిగాను.
నా వైపు చూడలేకపోతున్నాడు. “అర్జున్, సమస్యను పెంచుకోవడం మంచిది కాదు. చెప్పండి ఏం జరిగింది” అడిగాను.
“లీలకు మీ గురించి తెలిసిపోయింది” అర్జున్ గొంతు జీరబోయింది.
అతన్ని చూస్తూ ఉండిపోయాను. “ఎలా తెలిసింది” గద్దించి అడిగాను.
“నాకే చెప్పక తప్పలేదు. ఆమెనెలా సైలెంట్ చేయాలో తెలియలేదు. ఆ ఇంటరాగేషన్ ఎదుర్కోలేకపోయాను. మీ గురించి చెప్తే ఇక ఆ విషయం ఎత్తదనుకున్నాను. కాని ఇలా చేస్తుందనుకోలేదు” అన్నాడు.
“బ్లడీ…” పైకి తిట్టలేకపోయాను.
“ప్లీజ్ శారదా లోపలికి వెళ్లకండి. మీకు తెలుసు..” అర్జున్ పెదవులు వణుకుతున్నాయి.
అతన్ని చూస్తుంటే అసహ్యం వేసింది. మూసి ఉన్న ఆ వార్డ్ తలుపులు చూస్తుంటే విరక్తిగానూ అనిపించింది.
నర్స్ బైటకు వచ్చింది. “సార్ అమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు” అంది అర్జున్‌తో.
అర్జున్ నా వైపు బ్రతిమిలాడుతున్నట్లు చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు.
అప్పుడే కారిడార్‌లోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకతను కాస్త పరిచయం ఉన్నట్లుగానే అనిపించాడు. అతన్ని చూపిస్తూ అరుణ అంది “ఇతనే లీల అన్నగారు. నిన్న నీ గురించి అడిగారు”.
అతను మమ్మల్ని చూసి ఆగాడు. చూడగానే పోల్చుకున్నాను. కుమార్, నాతో కలిసి రామకృష్ణా మిషన్‌లో స్పానిష్ కోర్స్ చేసిన నా క్లాస్‌మేట్. అరుణ అతనికి నన్ను చూపిస్తూ “ఈవిడే శారద” అంది.
కుమార్ కళ్ళల్లో ఆశ్చర్యం. “శారదా నువ్వా. లీల పదే పదే కలవరించేది నీ పేరా? లీల ఈ స్థితికి రావడానికి కారణం నువ్వా?” అతని చేతులు బిగుస్తున్నాయి.
శ్రీను కుమార్ భుజంపై చేయి వేస్తూ “బ్రదర్ వీ నీడ్ టూ టాక్” అన్నాడు.
కుమార్ శ్రీనుని గాజు కళ్ళతో చూస్తూ నిలబడిపోయాడు. అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడో నాకు అర్ధం అయింది. జాలి వేసింది.
“కుమార్ నువ్వు లీల అన్నవని నాకు తెలియదు. నిజానికి నాకు చాలా నిశ్చింతగా ఉంది నిన్ను ఇక్కడ చూడడం. వీ నీడ్ టూ టాక్. కాని ఇక్కడ కాదు. లీలని నేను చూడడానికి రాలేదు. లీల అన్నగారితో మాట్లాడాలనే వచ్చాను. ఇప్పుడు కుదురుతుందా” అడిగాను.
“బ్రదర్, విషయం ఇంత దాకా రాకూడదనే మేము చాలా ప్రయత్నించాం. కాని ఇప్పుడు ఆమెను కాపాడుకోవలసిన భాద్యత మనందరిదీ. దయచేసి విషయం పూర్తిగా తెలుసుకోండి. ఈ సంఘటనతో నాకు కూడా కొంత సంబంధం ఉంది. అందుకే కూర్చుని మాట్లాడుకుందాం. క్రింద ఫుడ్ కోర్డ్ ఉంది. అక్కడకు వెళదాం”. శ్రీను కుమార్ చేయి పట్టుకుని అడిగాడు.
కుమార్ మౌనంగా మమ్మల్ని అనుసరించాడు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్‌లో కూర్చున్నాం అందరం. శ్రీను టోకెన్ తీసుకుని రావడానికి వెళ్లాడు.
కుమార్ ఇంకా అపనమ్మకంగా నన్ను చూస్తూనే ఉన్నాడు.
కుమార్ కళ్ళలో సందేహం నాకు అర్ధం అవుతూనే ఉంది. అతని వైపు చూసి “లీల ఎలా ఉంది కుమార్” అడిగాను.
“హార్పిక్ బాటిల్ మొత్తం తాగేసింది. భయంతో అర్జున్ బలవంతంగా వామిట్ చేయించడంతో లోపల యూసోఫేగస్ డేమేజ్ అయింది. బ్రీథింగ్ ప్రాబ్లం మొదలయింది. నాకు ఫోన్ వచ్చిన వెంటనే తెలిసిన డాక్టర్ ఉండడంతో ఇక్కడకు తీసుకువచ్చాను. ఐదు రోజులు ఐ. సీ. యు లో ఉంది. మొదటి మూడు రోజులు ఇక తను దక్కదనే అనుకున్నాం. బైటపడింది. కాని పూర్తిగా కోలుకోవడానికి నెలపైగా పడుతుంది. లీగాలిటీస్ అంటూ ఇంకొన్ని సమస్యలు.”
“శారదా అర్జున్ లీలలది ఎంత కంపాటబిల్ జంటో అందరికీ తెలుసు. అర్జున్‌కి లీల అంటే ప్రాణం. లీలకు కూడా అంతే. పెళ్ళయిన ముప్పై రెండేళ్ళలో మా ఇంటికి ఒంటరిగా తను వచ్చింది లేదు. కుమార్‌ను వదిలి అస్సలు ఉండలేదు. డబ్బు, హోదా, ప్రేమ, దేనికి లోటు లేని జీవితం తనది. పిల్లలిద్దరూ ఫారిన్ లో పెద్ద చదువులు ఉద్యోగాలతో సెటిల్ అయ్యారు. దాని జీవితం పూల పాన్పు. ఇప్పుడు మా కందరికీ ఇది ఊహించని దెబ్బ” కుమార్ కళ్లల్లో నీళ్ళు.
“సూసైడ్ అటెంప్ట్ కారణం ఏంటని చెప్పలేదా”… శ్రీను ఫ్రూట్ జ్యూస్ అందరి ముందు పెడుతూ అడిగాడు.
“అదే అర్ధం కావట్లేదు. ఏం అడిగినా చెప్పదు. డాక్టర్లు ఆమె ఎగ్జయిట్ అవకూడదని అంటుంటే మేమూ ఆమెనేమీ అడగలేకపోతున్నాము. అర్జున్‌ని అడిగితే భోరుమని ఏడుస్తున్నాడు. అసలు అర్జున్‌ని ఏమని అడగగలం. తన కారు ముందు సీట్లో లీలను తప్ప ఎవరినీ కూర్చోనివ్వని పిచ్చి ప్రేమ అతనిది. లీల లేకపోతే ఆ సీటు ఖాళీగా ఉండాలి తప్ప మరెవరూ తన పక్కన కూర్చోకూడదని ఖచ్చితంగా చెప్పే అతన్ని మేము ఇప్పటికీ అల్లరి చేస్తూ ఉంటాం. అంత ప్రేమించిన కుమార్ లీలను ఈ స్థితిలో చూసి రాత్రి పగలు కుమిలిపోతున్నాడు. లీల ఏదన్నా మానసిక సమస్యతో బాధపడుతుందా అన్నది డాక్టర్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు”… చెబుతూ మధ్యలో ఆగాడు కుమార్.
“మరి శారద గారి కోసం అడిగారెందుకు” అరుణ గబుక్కున అడిగేసింది.
“అర్జున్ ఆఫీస్ కొలిగ్స్ వచ్చి చూసారా అని అరడజను సార్లు అడిగింది లీల. శారద వచ్చిందా అని ఆమె మెల్లిగా అర్జున్‌ని అడుగుతుంటే వింటూనే ఉన్నాను. శారదను లోపలికి రానివ్వద్దు అంటూ ఒకటే ఏడుపు. అర్జున్ ఆమెను సముదాయిస్తున్నాడు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, లీల నిర్ణయం వెనుక శారద పాత్ర ఉందని” అంటూ రోషంతో నా వైపు చూసాడు కుమార్.
శ్రీను ఇప్పుడే మాట్లాడవద్దని నాకు సైగ చేస్తూ.. “శారద ఎవరని అర్జున్‌ని అడగలేదా మీరు” అంటూ కుమార్ వైపు చూశాడు. అతని గొంతులో గాంభీర్యం, ఇక విషయంలోకి వద్దాం అన్న సూచన ఉంది.
“అడిగాను. షీ ఈజ్ ఏ కొలిగ్. ఆమె అంటే మొదటి నుండి లీలకు ఇష్టం లేదు. షీ ఈజ్ ఏ డామినెంట్ కారెక్టర్. సింగిల్ వుమన్. అహంకారి. అస్సలు ఎవ్వరినీ లెక్క చేయదు. ఎవ్వరమూ ఆమెను అంతగా ఇష్టపడమూ. ఎప్పుడూ తానే గొప్ప అనుకుంటూ ఇతరులని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. లీల హేట్శ్ హర్ అని చెప్పాడు. నేను లీలను ఒంటరిగా కలిసినప్పుడు కూడా శారద వచ్చి నన్ను ఇలా చూసి వెళ్లిందా అని జాలిగా అడిగింది. నా చెల్లెలు అంత బేల అవడం నేను ఎప్పుడూ చూడలేదు. శారదతోనే ఏదో జరిగింది. అందుకే లీల ఈ పని చేసింది. చెప్పు శారదా నీకు లీలకు ఏం సంబంధం” కుమార్ గొంతులో మళ్లీ కోపం.
“అంటే అర్జున్‌కి శారదకి ఏదన్నా సంబంధం ఉందేమో అని మీ డౌటా” శ్రీను అడిగాడు.
“నో అర్జున్ ఈజ్ ఏ జెంటిల్ మెన్. అతను లీలను ఎంత పిచ్చగా ప్రేమిస్తాడో మా అందరికీ తెలుసు. అతను లీలని మోసం చేయడు. సింగిల్ వుమన్ ఇన్సెక్యూరిటితో శారదే ఆ దంపతుల మధ్య ఏదో అలజడి సృష్టించి ఉంటుంది. లీల అర్జున్ లేకపోతే బ్రతకలేదు. అది పిచ్చిది. ఏదో జరగకపోతే లీల అంత డిస్టర్బ్ అయ్యేదే కాదు’. ఆవేశంగా అన్నాడు కుమార్.
కుమార్ అన్న మాటలు నాకు బాధనిపించలేదు. శ్రీను వైపుకు నిర్లిప్తంగా చూసాను. శ్రీను మొహంలో కోపం, నన్ను చూస్తున్న కళ్లల్లో బాధ. సింగిల్ విమెన్ ఇన్సెక్యూరిటీ అంటూ కుమార్ అన్న మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
శ్రీను తన సెల్ ఫోన్ తీసాడు. “ఓకే కుమార్ గారు మీ బావగారిపై, మీ చెల్లెలిపై అతనికున్న ప్రేమ పట్ల మీకున్న నమ్మకానికి సంతోషం. నిజానికి ఇలాంటి రోజు రాకూడదని శారద, చాలా ప్రయత్నించింది. నేను ఎన్నోసార్లు తనతో చెప్పాను. తనకి సంబంధం లేని విషయాలలో ఇన్వాల్వ్ అవ్వవద్దని. కాని శారద చాలా మొండిది. ఇలా తప్ప మరోలా ఉండలేదు. ఆమెపై మీకు కోపం రావడానికి ఆమె సింగిల్ స్టేటస్ చాలా పెద్ద కారణం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాని ముందు ఒక్కసారి ఇది చూడండి” అంటూ కుమార్ వైపుకు చేతిని చాచాడు శ్రీను.
నా కళ్ళల్లో ఆశ్చర్యం చూస్తూ “శారదా ఇవన్నీ డిలీట్ చేయమని అన్నావు. కాని చేయలేదు. ఐ యాం నాట్ సారీ ఫర్ దట్. ఇలాంటి రోజు రావచ్చని జాగ్రత్తపడ్డాను. అంతే తప్ప నాకే దురుద్దేశం లేదు” అంటూ సెల్ ఓపెన్ చేసి కుమార్ కి అందించాడు శ్రీను.
చూస్తున్నకుమార్ మొహంలో రంగులు మారుతున్నాయి. మొహంలో అపనమ్మకం. కళ్ళకు దగ్గరగా పెట్టుకుని ఆ వీడియో చూస్తున్నాడు. తలెత్తి నా వైపు చూసాడు మళ్ళీ స్క్రీన్‌ని. అరుణకు ఏమీ అర్ధం కావట్లేదు. మరో సారి నావైపుకి చూస్తున్న కుమార్‌తో “అందులో ఉన్న స్త్రీ శారద కాదు. కాని ఆ మగవాడు మీ చెల్లెలి భర్త అర్జున్” అన్నాడు శ్రీను.
కుమార్ నుదుటిపై చెమటలు పట్టాయి. “నో ఇది అబద్దం. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో. దిసీజ్ నాట్ పాసిబుల్” అంటూ స్క్రీన్‌ను పదే పదే గట్టిగా తుడుస్తున్నాడు. అది తుడిస్తే పోయే మరకా?
“మీకు అది షేర్ చేయగలను. టెస్ట్ చేసుకోండి. కొన్ని ఆడియోలు ఉన్నాయి. అవి కూడా మీతో షేర్ చేస్తాను వినండి” అన్నాడు శ్రీను.
“ఇవి చూపించి లీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా యూ బిచ్” ఆవేశంతో లేవబోయాడు కుమార్.
“హోల్డ్ యువర్ టంగ్ కుమార్. మీ షాక్ నేను అర్ధం చేసుకోగలను. కాని మాట మీరితే సహించం. ఈ వీడియోలను శారదతో షేర్ చేసినదే అర్జున్. లేకపోతే ఇవి మా దగ్గరకు ఎందుకు వస్తాయి” గట్టిగా అన్నాడు శ్రీను.
“వాట్.. ఆమెతో ఇలాంటివి షేర్ చేసే అంత స్నేహమా ఇద్దరి మధ్య,.” కుమార్ కళ్లలో కోపం.
“అది స్నేహం కాదు కుమార్, అవసరం. మీ చెల్లెలి భర్త ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న నాటకం ప్రపంచానికి తెలిసి అతని జీవితం చెల్లాచెదురయి పోకుండా ఉండడానికి సహాయం చేయమన్న అభ్యర్ధన. అతని ప్రేమ, అతని కన్నీళ్ళు, మీరందరూ మురిసిపోయే అతని ప్రవర్తనలో ఎంత నిజాయితీ ఉందో నాకు తెలియదు కాని ఇది అతనిలోని మరో కోణం. మీ బావమరిదిలో మీకెవ్వరికీ తెలియని మరో ముఖం ఉంది. భార్యపై ప్రదర్శించే ప్రేమ మాటున ప్రపంచానికి అది కనిపించకుండా ఇన్నేళ్లూ జాగ్రత్త పడ్డాడు. అది బైటపడుతుందేమో అన్న భయంతో శారద సహాయం కోరాడు” బదులిచ్చాడు శ్రీను.
“వారిద్దరు ఒకరికొకరుగా బ్రతుకుతున్నారు. ఒకరు లేకపోతే మరొకరు ఉండలేరు. ఇదంతా అబద్దం. వారి ప్రేమ ఎందరి జెలసీకో కారణం అయింది. అర్జున్ లీలకు చెప్పకుండా పెన్ కూడా కొనలేడు. వారిద్దరు శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అన్నట్లు ముప్పై రెండేళ్లు కాపరం చేసారు. ఎందుకు వారి మధ్య ఇప్పుడు దూరం పెంచుతున్నారు” కుమార్ కంఠంలో అపనమ్మకం.
కుమార్‌ని చూస్తున్న శారద మనసులో జాలి. అతనికి ఇదెంత దెబ్బో ఆమెకు అర్ధం అవుతూనే ఉంది. కాని ఇంత దాకా వచ్చాక అన్నీ వివరంగా తెలపకపోతే లీలను కాపాడుకోలేం అన్నది ఆమెకు తెలుసు.
“కుమార్ ఆ వీడియోలో ఉన్నది మా బ్రాంచ్ లో పని చేసే కాంట్రాక్ట్ ఎంప్లాయి రాధిక. ఆమె వయసు ఇరవై నాలుగు. అర్జున్ కూతురు కన్నా ఐదేళ్లు చిన్నది. పేద కుటుంబం. కంపాషనేట్ గ్రౌండ్శ్ లో రెండేళ్ళ క్రితం ఉద్యోగంలో చేరింది. అర్జున్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ లోబర్చుకున్నాడు. యాభైలలో కూడా అతని చార్మ్ అందరినీ ఆకట్టుకుంటుంది. భర్తను పోగొట్టుకుని చిన్న బిడ్డతో తల్లి తండ్రుల పంచన ఉండే రాధిక అతనికి ఎట్రాక్ట్ అయింది. పైగా అది ప్రేమ అని నమ్మి అతని పిచ్చిలో గర్భం దాల్చింది. బ్రాంచ్ కి ప్రొద్దునే ఎనిమిదికే వచ్చేవారిద్దరూ. లీల కొన్ని సార్లు రాత్రి ఏడు దాకా తన బ్యాంక్‌లో ఉండిపోయేది. అప్పుడు రాధికని ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అర్జున్. ఆ ఇల్లు ఆమెకు స్వర్గంలా అనిపించేది. అక్కడ కొంత సేపు గడిపి ఆమెను పంపించి లీలని పిక్ చేసుకోవడానికి ఆమె బ్రాంచ్‌కి వెళ్ళేవాడు.”
“పల్లెటూరిలో పుట్టి చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది రాధిక. ఆమె భర్త వాచ్మెన్. అతను ఆక్సిడెంట్ లో మరణిస్తే కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం ఇప్పించాడు అర్జున్. ఆమెకు అర్జున్ నివసించే ప్రపంచం భూతల స్వర్గం. లీల పంచుకునే మంచం, కంచం తాను పంచుకోవడం తన అదృష్టం అనే మోహంలో ఉంది రాధిక. కొన్నాళ్ళకు గర్భం దాల్చిన రాధిక ఈ విషయం చెప్పినప్పుడు ఆమెపై ఆసక్తి పోయింది అర్జున్‌కి. అబార్షన్ తో పాటు, ఆ బంధం ముగించడానికి ఆమెకు ఇంకొంచెం డబ్బు ఇవ్వచూపాడు అర్జున్. కొంతమంది అలా డబ్బు తీసుకుని వెళ్లిపోయిన వాళ్లు అర్జున్ జీవితంలో ఉండి ఉండవచ్చు. కాని రాధిక తనను లీల స్థానంలో ఊహించుకుంది. అర్జున్ పట్ల పొజెసివ్‌నెస్ పెంచుకుంది. అందుకే అర్జున్ ఉంపుడుగత్తెగానన్నా సరే ఉండిపోతానని గొడవ చేసింది. ఆ బిడ్డను వదిలించుకున్నా అర్జున్‌ని దూరం చేసుకోనని మొండికేసింది. ఇది అర్జున్‌కి తలనొప్పిగా మారింది.”
“ఈ విషయం బైటకి చెప్తానని రాధిక బెదిరిస్తే తనకున్న ఇమేజ్ కారణంగా ఎవరూ ఇది నమ్మరని, ఏ అండా లేని ఆమెనే తప్పు పడతారని కాన్పిడెంట్‌గా చెప్పాడు అర్జున్. దీనితో రాధిక ఆలోచనలో పడింది. ఈ విషయంలో సంధి కుదిర్చుకోవడానికి ఓ మధ్యాహ్నం లీల ఆఫీసుకి వెళ్లాక రాధికని ఇంటికి పిలిపించాడు అర్జున్. అక్కడ వారిద్దరూ బెడ్రూంలో ఉండగా జరిగేదాన్ని రాధిక తన సెల్ ఫోన్‌లో వీడియో తీసింది. అర్జున్‌కి తనకు నడిచిన ఫోన్ కాల్స్‌ని అప్పటికే రికార్డ్ చేసి పెట్టుకుంది. దానితో అర్జున్ తనకు దూరం కాకుండా ఉంటాడని ఆమె అనుకుంది. ఈ విషయంలో తన అన్న రఘు సహాయం కోరింది. అతను దీన్ని డబ్బు సంపాదించుకునే మార్గంగా మర్చుకున్నాడు. బ్లాక్ మెయిల్ మొదలయింది. తట్టుకోలేక ఆ విషయంలో సహాయం చేయమని శారదని అడిగాడు అర్జున్”.
“శారదనే ఎందుకు” కుమార్ కంఠంలో కోపం.
“శారద లీల ఇద్దరూ కొన్నేళ్ళ క్రితం సిద్దిపేట్‌లో పని చేశారు. లీల మనస్థత్వం శారదకు బాగా తెలుసు. ఈ సంగతి తెలిస్తే లీల ఎలా రియాక్ట్ అవుతుందో ఆమె ఊహించగలదు. పైగా రఘు ఒక సారి అరెస్ట్ అయితే అతన్ని విడిపించి గార్డ్‌గా పని చూపించి ఆ కుటుంబాన్ని శారద ఆదుకుందని అర్జున్‌కు తెలుసు. రఘు శారద మాట జవదాటడని అతని నమ్మకం” శ్రీను జవాబిచ్చాడు.
“సో ఇదంతా లీలకు తెలిసి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కాని ఇది బైటికి రాకుండా సహాయపడిన శారదపై ఆమెకు కోపం దేనికి” కుమార్ అడిగాడు.
కొన్ని క్షణాలు మౌనంగా దొర్లాయి.
“కుమార్ మీ చెల్లెలు స్వభావం మీకు తెలుసు. కొంత సేపు మీ అహం పక్కకు పెట్టి ఆలోచించండి. లీల సూసైడ్ అటెంప్ట్ చేసింది భర్త చేసిన మోసం తెలిసి కాదు. అది ఆమెకు రెండు నెలల క్రితమే తెలిసింది. చాలా బాధపడింది. షాక్ అయింది. భార్య భర్తల మధ్య పిల్లల కోసం ఒక ఒప్పందం కూడా కుదిరింది. వారి మధ్య బంధం బీటలు వారింది. కాని ఆమె చనిపోవాలనే నిర్ణయానికి రాలేదు. ఆమె ఈ నిర్ణయానికి రావడానికి కారణం పరోక్షంగా నా ఉనికే ” శారద మాటలతో అరుణ, కుమార్ ఇద్దరూ ఆమె వైపు చూసారు.
“లీల నేను సిద్దిపేట్‌లో కొన్నాళ్లు కలిసి పని చేసాం. లీల ప్రతి దాంట్లోనూ తనే బెస్ట్ అనుకునే వ్యక్తి. నా సెలక్షన్ సూపర్. నేను కట్టిన చీర మరొకరు కట్టలేరు, నాకున్నంత కళాత్మకత మరెవరిలోనూ లేదూ, నేను చాలా స్పెషల్. అందరూ నా ముందు తక్కువే అనుకోవడం ఆమె నైజం.”
“ముగ్గురు అన్నల మధ్య ముద్దుగా పెంచుకున్నాం మా చెల్లెల్ని. ఆమె నిజంగా స్పెషల్” కుమార్ బదులిచ్చాడు.
“సారి కుమార్. కొన్ని నిజాలు కటువుగా ఉంటాయి. ఆమెను అపురూపంగా పెంచుకున్నాం అనుకుంటున్న మీరు ఆమెను నేను స్పెషల్ అనే భావంలో ఉంచడమే ప్రేమ అనుకున్నారు. కాని అది ఆమెలో పెరిగి పెరిగి ఇతరులు నా కన్నా తక్కువలోనే ఉండాలనే పంతంలోకి దారి తీసింది. సిద్దిపేట్‌లో పని చేస్తున్నప్పుడు మీ ఫామిలి బ్యాక్ గ్రౌండ్, మీ పేరెంట్శ్ వచ్చి వెళ్ళే కార్, ఆమె కోసం మీ ప్రత్యేక ఏర్పాట్లు అక్కడ జనాలలో ఆమె ఓ యువరాణి అన్న భావన కలగజేసాయి. ఆమె అలా అందరిపై అధారిటీ చూపేది. అది ఆమెకు అందరి వద్దా సాగింది. దానికి అడ్డుకట్టగా నేను ప్రవేశించాను”.
“పని విషయంలోను సబ్జెక్ట్ విషయంలోనూ నేను డామినెంట్ గా ఉండేదాన్ని. ఎలాంటి పని అయినా ఈమె చేయగలదు అన్న పేరు నాకు కొన్నాళ్లలో వచ్చింది. పైగా జనంతో తిరగడం, సోషల్ ఆక్టివిటీస్‌లో పాలు పంచుకోవడం, సాహిత్య సభలు, మీటింగ్‌లు ఇవన్ని నా జీవితంలో భాగం. ఇవి నన్ను అక్కడి వారికి దగ్గర చేసాయి. కొంత పాపులారిటీ సంపాదించాను. లీల నన్ను తన ప్రత్యర్ధిగా మార్చుకుంది. నేను తనకంటే తక్కువ అని చూపెట్టడానికి విపరీతంగా కష్టపడేది. పై ఆఫీసర్‌లకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడం, తన కుటుంబంలోని వ్యక్తుల గురించి చెప్పడం, తన హోదా ప్రదర్శించడం మొదలెట్టింది. సాధారణంగా ఉద్యోగస్తులు హోదాకు పడిపోతారు. అందరూ ఆమెను భయంతో చూసే వాళ్లు. కాని నన్ను అభిమానించే మరో సాధారణ వర్గం కూడా అక్కడే ఉండేది. వారిని ఆకట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించేది లీల. అందులో విజయం సాధించేది కూడా. నా ప్రమేయం లేకుండానే నన్ను తన ప్రత్యర్ధిగా ఆమె నిర్ణయించుకుంది”.
“అప్పుడే మా ఇద్దరి వివాహాలు జరిగాయి. కుమార్ గొప్ప అందగాడనే పేరు ఉండనే ఉంది. అతను బ్రాంచ్‌కి ఎప్పుడు వచ్చినా ఓ ఈవెంట్‌లా ఉండేది. సినిమా హీరో హీరోయిన్లను మించిన రొమాన్స్ పండించేవారు ఇద్దరూ. డబ్బు అందం తోడవడంతో వారిదో ఐడియల్ కపుల్ అన్న నానుడి మొదలయింది”.
“నా వివాహం ఫెయిల్ అయింది. నా జీవితంలో గడ్డు రోజులు అవి. లీల వాటన్నిటికి ప్రత్యక్ష సాక్షి. ఓ స్త్రీగా నాకు ఆమె తోడుగా ఉండడం పోయి, తన అదృష్టాన్ని, భర్త తనపై చూపే ప్రేమను, నా ముందు ప్రదర్శించడానికి ఎక్కువ ఉత్సాహం చూపేది. వాళ్ల పర్సనల్ విషయాలు కూడా నేను ఉన్నప్పుడు నాకు వినిపించేలా నలుగురికి చెపుతూ నా రియాక్షన్ చూడడం ఆమెకు ఆనందం. నీ కన్నా జీవితంలో నేను ఎంతో ఎత్తులో ఉన్నాను సుమా అన్న భావం నన్ను చూడగానే ఆమెలో సహజంగా కలిగేది. తను స్పెషల్ అన్న భావం మీరు కలిగిస్తే దాన్ని ఆమె అయుధంగా మార్చుకుని నాతో పాటు ఎందరినో మానసికంగా బాధించింది”.
“నేను మొండిగా బ్రతుకుతూ నా పద్దతిలో చదువు, బైట కార్యక్రమాలలో భాగం పంచుకుంటూ నాదనే ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటూ పోయాను. భర్త అనే ఒక్క ఖాళి తప్ప అన్ని విషయాలలోనూ పరిపూర్ణమైన విజయాన్ని సంపాదించుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను. లీల ఆ ఖాళీని నాకు గుర్తు చేయడానికి ఎంతో శ్రమించేది. సిద్దిపేట్ వదిలినా హైదరాబాద్ లోనూ ఏదో ఓ విధంగా కలిసే మేం పని చేయాల్సి వచ్చింది. తరవాత అర్జున్ పని చేస్తున్న బ్రాంచ్‌కే నాకూ ట్రాన్స్ఫర్ అయింది. అదే ప్రత్యర్ధి భావంతో లీల నా ముందు తన హోదా ప్రదర్శిస్తూ పోయింది. నేను ఆమెను పట్టించుకోవడం మానేసి చాలా ఏళ్లయింది. అది కూడా ఆమెకు మింగుడు పడలేదు. నా జీవితంలో ప్రొఫెషనల్ విజయాలు కొన్నిచేరాయి. సొసైటీలో నా పరిధిలో ఓ స్టేటస్ ఏర్పడింది. మొదటి నుంచి నాది ఓటమిని అంగీకరించని మనస్థత్వం. అందుకే నా సింగిల్ స్టేటస్ నాకు అడ్డంకి కాలేదు. నా దగ్గర లేనిది లీల దగ్గర ఉన్నది ఆ భర్త నీడే. తనను ఆరాధించే భర్తని ఓ ట్రోఫీలా నా ముందు ప్రదర్శించేది. ఎప్పుడు అర్జున్‌తో ఎదురైనా, అతనిపై వాలిపోవడం, ఇద్దరూ కొత్త ప్రేమికులుగా వ్యవహరించడం చేసేవారు. లీలలోని ఈ పోటీతనం అర్జున్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆమెకు కావల్సిన ఆనందాన్ని ఆమెకు ఇస్తూ ఆమెను అంధకారంలో ఉంచుతూ తన దారితో తాను ఎంజాయ్ చేస్తూ గడిపేసాడు. రాధిక విషయం నా దాకా వచ్చేదాకా, నాకు అర్జున్‌లోని ఈ కోణం నిజంగా తెలియదు.”
“పాతిక లక్షలకు బ్లాక్ మెయిల్ కాల్ వచ్చాక అర్జున్ నన్ను తన చేంబర్‌కి పిలిచి విషయం చెప్పాడు. నిజంగా షాక్ అయ్యాను. అప్పటి దాకా వారిది అపురూప దాంపత్యమే అని నేనూ అనుకున్నాను. ఈ విషయం లీలకు తెలిస్తే బ్రతకదని సహాయం చేయమని కన్నీళ్ళతో అర్జున్ వేడుకున్నప్పుడు, భార్యలోని ఆ పోటీతత్వాన్ని అతను తన స్వార్ధం కోసం పెంచి పోషిస్తూ, సమాజంలో మంచి భర్త అనే పేరు సంపాదించుకోవడానికి ఎంత నాటకం ఆడాడొ అర్ధం అయింది. కాని లీల అంటె తనకు ప్రాణం అని, ఇలాంటి అఫేర్లు జస్ట్ తన బలహీనతని లీలకేమన్నా జరిగితే తానూ చనిపోవలసిందే అని అర్జున్ బ్రతిమాలిన తర్వాత, ఇదంతా రఘు వెనుక ఉండి ఆడిస్తున్నాడని తెలిసాక నేను మధ్యలోకి రాక తప్పలేదు.”
“రఘు పని చేసేది శ్రీను కంపెనిలోనే. అందుకే అతనికి విషయం అంతా చెప్పి, అతని ద్వారా రఘుని పిలిపించి మాట్లాడి ఆ వీడియోలు, ఆడియోలు తీసుకుని రాధికకు పది లక్షలు ఇప్పించి ఈ మాటర్ సెటిల్ చేసాం. రఘు ఇక అర్జున్ జోలికి రానని రాసి ఇచ్చాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న శ్రీను స్నేహితుడు కూడా రఘుతో మాట్లాడాడు. అతని సమక్షంలోనే ఒకరి జోలికి మరొకరు రాకూడదని పరిష్కారం చేసాం.”
“అంత పెద్ద మొత్తం ఒకేసారి అకౌంట్ నుంచి అర్జున్ డ్రా చేసాడని తెలిసి లీల గొడవ చేయడంతో కొంత విషయం చెప్పవలసి వచ్చిందని అర్జున్ కొన్ని రోజుల తరవాత నాకు చెప్పాడు. బ్లాక్ మెయిల్ ప్రెషర్ లేకపోవడంతో, ఏదో కథ అల్లి కొంత విషయం దాచి, కొంత చెప్పి లీలను మళ్లీ తన దారికి తెచ్చుకున్నాడు.”
“పోయిన వారం సిద్దిపేట్‌లో మా పాత కొలిగ్ మోహన్ కొడుకు పెళ్లికి నేను వేళ్లాను. లీల కూడా అక్కడకు వచ్చింది. నేను మామూలుగా పెళ్ళిల్లకు అటెండ్ అవ్వను కాబట్టి నేను అక్కడకు రానని ఆమె అనుకుని ఉంటుంది. జరిగిన సంఘటనలతో డిస్టర్బ్ అయిన తను అక్కడకు రాదని నేను అనుకున్నాను. ఇద్దరం ఒకరికొకరం ఎదురుపడ్డాం. Something broke in her. I sensed it. కాని నేను రాధిక అర్జున్‌ల విషయంలో కలగజేసుకున్నానని ఆమెకు తెలిసి ఉంటుందని నేను కనిపెట్టలేకపోయాను. అర్జున్ కి నాతో లీలకున్న పోటీ గురించి పూర్తిగా తెలుసు. అందుకే ఆ విషయం తనకు చెప్పి ఉండడని అనుకున్నాను. తనతో మామూలుగా మాట్లాడాలనే ప్రయత్నించాను. కాని లీల నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమె మనసులో ఏదో యుద్దం జరుగుతుందని నాకు అర్ధం అవుతూనే ఉంది. కాని స్పష్టంగా అంచనా వేయలేకపోయాను” ఆగాను నేను.
“ఆ పెళ్ళిలో తనను చూసి మౌనంలోకి జారుకుని లీల త్వరగా వెళ్లిపోయిందని శారద నాకు చెప్పింది. నిజానికి ఆమెకు అనుమానంగానే ఉంది. ఎన్నో సార్లు తాను ఇన్వాల్వ్ అయినట్లు లీలకు తెలియకూడదని అర్జున్‌కి చెపుతూనే ఉంది. నాకు అప్పుడు అది అర్ధం కాలేదు. ఇప్పుడే శారద కన్సర్న్ వెనుక నిజం తెలుస్తుంది నాకు. లీలకు దీనంతటిలో శారద ప్రమేయం ఉందని తెలిసింది. తనను ఫేస్ చేయలేక ఈ పని చేసింది” అన్నాడు శ్రీను.
“లీల జీవితకాలం ప్రత్యర్ధి స్థానంలో నన్ను ఊహించుకుంటూ గడిపేసింది. ఇప్పుడు ఆమె జీవితంలోని చీకటి కోణానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఇది ఆమె ఊహించని దెబ్బ. భర్త చేసిన మోసాన్ని కూడా అంగీకరించగల ఆమె స్త్రీ మనసు, సాటి స్త్రీ తన ఓటమికి సాక్షి అన్న నిజాన్ని భరించలేకపోయింది. ఆమె ఆత్మహత్యా ప్రయత్నం వెనుక ఉన్నది దెబ్బ తిన్న ఆమె అహం. ఇది మీకు అర్ధం కావాలి కుమార్. ఆమెకు సహాయపడాలంటే మీకు ఈ విషయం తెలియాలి.
“నాకిదంతా అర్ధం అవుతూ అవనట్లు ఉంది శారదా. లీలలో కొంత ఎగ్జిబిషనిజం ఉన్న మాట వాస్తవం. మా చుట్టాల మధ్య కూడా తాను గొప్పగా ఉండాలనే తాపత్రయం, అన్నీ గొప్పగా జరగాలనే కోరిక ఆమెలో మా పెంపకం కారణంగానే పెరిగి ఉండవచ్చు. ఆమెకు అన్నీ అలా కలిసి వచ్చాయి కూడా. కాని మీతో ఆమె పెట్టుకున్న ఈ కాంపెటీషన్ వెనుక మీ ప్రమేయం లేదంటారా. నిజం చెప్పండి” సూటిగా ప్రశ్నించాడు కుమార్.
“ఖచ్చితంగా ఉంది కుమార్. లీల గొప్పతనాన్ని, అదృష్టాన్ని ప్రదర్శనకు పెడుతున్నన్ని రోజులు అవి నన్ను బాధించకుండా ఉండడానికి నేను వేటికీ రియాక్ట్ కాకుండా మొండితనాన్ని పెంచుకున్నాను. నిజానికి అది నా సర్వైవల్ టెక్నిక్. ఈ ప్రపంచంలో అడుగడుగుకీ ఒంటరి స్త్రీని తక్కువ చేస్తూ చూసే మనుష్యుల మధ్య జీవించడానికి నేను వేటినీ లెక్కచేయని వ్యక్తిగా మారాను. నాకు అది తప్పని అవసరం. అలాగే నేను నమ్ముకున్న ఆదర్శాల కోసం బ్రతకడానికి సంఘర్షణలకు అలవాటు పడ్డాను. అందుకే చాలా మంది నన్ను ప్రత్యర్థి స్థానంలోనే నిలబెట్టారు. కాని ఇది ఎవరినో గాయపరచడానికి కాదు, నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఎన్నుకున్న విధానం. ఎంత ప్రయత్నించినా తనను నా ప్రత్యర్ధిగా నేను ఎంచకపోవడమే లీలను భాదించిన విషయం. అందుకే ఈ విషయం నాకు పూర్తిగా తెలియడం, దాన్ని సరిదిద్దడానికి నేను చేసిన ప్రయత్నం ఆమెకు తన ఓటమిగా అనిపించాయి.”
“లీల తన హోదా, భర్త ప్రేమలే తన బలం అనుకుంది. వాటితో నాలాంటి వారిపై గెలవాలని యుద్దం చేసింది. పరిమితికి లోబడిన ఆమె బలాలు నీటి మీద రాతలని ఆమెకు అర్ధం అయ్యాక, తాను ప్రత్యర్ధిగా భావించిన నేను నైతికంగా ఆమెపై గెలిచానని తనకు తానే నిర్ధారించుకుని అది ఒప్పుకోలేక ఈ ప్రయత్నం చేసింది. నిజానికి ఈ పోటీ ఆమెకు ఆమే ఏర్పరుచుకుంది. అంతా ఆమె ఆలోచనలోనే ఉంది. అలా బ్రతకడం తప్పని, మనం మనలా బ్రతకడం నేర్చుకోవాలని ఎవరూ ఆమెకు చెప్పలేదు. హోదా, పరపతి, సక్సెస్, ఫాల్స్ ప్రిస్టేజ్ లే జీవితానికి ఆధారం అని నమ్మేవాళ్ల మధ్యనే ఆమె జీవించింది. ఆ విలువలనే వంట పట్టించుకుంది. దానికి పరువు, స్టేటస్ అన్న పేర్లు పెట్టుకుని వాటి మధ్యన నలిగిపోయింది.”
“లీల గురించి పూర్తిగా తెలిసిన నేను ఆమె కోసమే ఈ విషయంలో చొరవ తీసుకున్నాను. నేను ఆమెను ఎప్పుడూ ప్రత్యర్థిగా చూడలేదు. లీల లాంటి వ్యక్తుల పట్ల జాలి తప్ప మరో భావం ఉండదు. నాలో అసూయ, అసహనం, అభద్రత చూడాలనుకున్న లీల నాలోని ఈ జాలిని సహించలేకపోయింది. ఆమె లాంటి స్త్రీలను తయారు చేసే ఈ వ్యవస్థ వారికి ఇలాంటి ఒంటరితనాన్నే ఇస్తుంది. ఈ విషయంలో సాయం కోరుతూ వచ్చింది అర్జున్ తప్ప నాకై నేను ఈ సమస్యలోకి వెళ్లలేదు. అర్జున్ కి ఎవర్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో తెలుసు. లీలనూ, రాధికను, నన్ను అతను చాలా ఆలోచించే ఉపయోగించుకున్నాడు. లీల భర్తను తన అవసరం కోసం క్షమించడానికి సిద్దపడింది. భార్య స్థానంతో రాధికపై గెలిచాననే అహంతో తృప్తి పడింది. కాని నా ఉనికే ఆమెను బాధపెట్టింది. అందుకే భర్త మోసం, అక్రమ సంబంధం కన్నా నాకు ఈ సంగతంతా తెలిసిందని అర్ధం అయి నన్ను ఫేస్ చేయలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది..
లీలను నేను ఎలా కాపాడుకోవాలి శారదా” అడిగాడు కుమార్.
“ దానికి రెండే మార్గాలు కుమార్. ఒకటి, నాకు ఈ విషయంలో ఎటువంటి పాత్రా లేదని ఆమెను నమ్మించగలగాలి. దానికి నా వంతు సహాయం ఏం చేయమన్నా చేస్తాను. అర్జున్ తో మాట్లాడి విషయం కనుక్కుని ఆ నమ్మకం ఆమెలో నాటుకునేలా ప్రయత్నించండి. నేను ఇంకా ఆమె ప్రత్యర్ధి స్థానంలోనే ఉన్నానని, ఆ స్థానానికి ఢోకా లేదని ఆమెను మభ్యపరచండి. ఇక రెండవది జీవితంలో ఈ అహాలను, ఫాల్స్ ప్రెస్టీజ్, ఆమె ఏర్పరుచుకున్న కొలమానాలను వదులుకొగలిగే స్థాయి, పరిపక్వత ఆమెకు చేకూరేలా ప్రయత్నించండి. మీరు ఏ మార్గాన్ని ఎన్నుకోవాలన్నది, ఆమె మానసిక స్థితిని, ఈ అనుభవంతో ఆమెకు కలిగిన అవగాహనను బట్టి నిర్ణయించుకోండి. ముందు అర్జున్‌ని బ్రాంచ్ ట్రాన్స్ఫర్‌కు అప్లయ్ చేయమనండి. రాధికను మరో బ్రాంచ్‌కి మార్పించే ప్రయత్నం నేను చేస్తాను. ”
“ఇక వెళ్దాం” అంటూ లేచాడు శ్రీను. బైటికి వెళ్తున్న మమ్మల్ని మౌనంగా చూస్తూ ఉండిపోయాడు కుమార్. శ్రీను తాను ఇంకో ఫ్రెండ్‌తో వచ్చానని. అతను బైట మెయిన్ రోడ్‌పై వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి హడావిడిగా వెళ్లిపోయాడు. మెత్తగా నవ్వుతూ నా భుజం తట్టి వెళుతున్న అతన్ని చూస్తూ ఉండిపోయిన అరుణతో “పద మనం క్రిందకి వెళ్లాలి” అని గుర్తు చేసాను.
కారు స్టార్ట్ చేసి హాస్పిటల్ బైటకు వచ్చాం. “అరుణా ఈ విషయం”… అంటూ ఆగాను.
అరుణ నా వైపుకి తిరిగి “నా వల్ల మాత్రం ఇవేవీ బైటికి రావు శారదా ట్రస్ట్ మీ” అంది.
‘ట్రస్ట్’.. నమ్మకం.. అది తప్ప మరేం ఉంది భవిష్యత్తులోకి ప్రయాణించడానికి…