వలసవాద మనోరోగ వైద్యుడు ఫ్రాంజ్ ఫానన్

ఫ్రాంజ్ ఫానన్ (1925-1961) ఫ్రెంచ్ వెస్ట్ ఇండియన్ సైకియాట్రిస్టు మరియు తాత్వికుడు. వలస వాదం, దాని హింసపై ఆయన పుస్తకాలు పాలస్తీనా, దక్షిణాఫ్రికా, అమెరికా లే కాక ప్రపంచమంతా ఎంతో ఉత్తేజ పరిచాయి. ఫానన్ ఫ్రెంచ్ అధీనంలోని మార్టినీక్ దీవిలో ఫోర్ట్ డి ఫ్రాన్స్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఫెలిక్స్ కాజిమీర్ ఫానన్ కస్టమ్స్ అధికారి కాగా, తల్లి ఎల్న్వార్ మెడిలీస్ ఒక దుకాణాదారు. ఫానన్ మార్టినీక్ లోని పేరున్న సెకండరీ స్కూల్ లో చదువుకున్నపుడు ప్రఖ్యాత సిద్ధాంత కర్త ఎమే సెజైర్ ఆతని టీచర్. తాను యువకుడిగా ఫుట్ బాల్ ఆట పట్ల మక్కువ చూపాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచి సైన్యం తరఫున పోరాడాడు. ఆ సమయంలోనే మొరాకోలో జాతి వివక్ష చూసి దిగ్భ్రాంతి చెందాడు.తరువాత యూనివర్సిటీ ఆఫ్ లియోన్ లో వైద్య విద్య, సైకియాట్రీ చదివాడు. ఫ్రెంచి వలస పాలనలో అల్జీరియా లో బ్లీడా జాయిన్వెల్లె ఆసుపత్రిలో సైకియాట్రీ వార్డు అధిపతిగా చేస్తూ వలస హింసా కాండను చూసి చలించాడు. ఆ దేశ విముక్తి ఉద్యమంలో కృషి చేశాడు.కొత్త ప్రభుత్వానికి కొంత కాలం రాయబారిగా ఉన్నాడు.

ఫ్రాంజ్ ఫానన్ పుస్తకాల్లో “బ్లాక్ స్కిన్, వైట్ మాస్క్స్”, “ఏ డైయింగ్ కలోనియలిసం”, ది రెచెడ్ ఆఫ్ ది ఎర్త్” , “టూవర్డ్ ది ఆఫ్రికన్ రెవల్యూషన్”, “ఎలియనేషన్ అండ్ ఫ్రీడమ్” వలసవాద వ్యతిరేక పోరాట కారులకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఆయన రచనలపై జీన్-పాల్ సార్త్ర , లాకా, నెగ్రిట్యూడ్, మార్క్సిజాల ప్రభావముంది. తన గ్రంథాలపై పలు విమర్శనా రచనలు, జీవితంపై సినిమాలు వచ్చాయి.

ఫ్రాంజ్ ఫానన్ తన పుస్తకం “బ్లాక్ స్కిన్, వైట్ మాస్క్స్”లో ఏ విధంగా వలస దేశంలోని ప్రజలు వర్ణవాదం, మానసిక దాస్యానికి గురవుతారు చెప్పాడు. మార్టినిక్ నుంచి పారిస్ వెళ్ళి తిరిగి వచ్చిన నల్ల జాతీయులు తమ భాష యాస మార్చుకుంటారు.లేకుంటే తమ తోటి వారి దృష్టిలో చులకనగా అవుతారు. మనిషికి మనిషిగా సమానత్వం కావాలి అని, అది తెలివి , తత్వ శాస్త్రం పై ఆధారపడుతుందని చెబితే సరి కాదు. నల్ల జాతీయుడు వైద్యుడు అయినా తోటి నల్లవారితో , తెల్లవారితో మాటాడే పద్ధతిలో వాని భాష మారుతుంది. నల్ల వానితో మిశ్రమ భాషలో మాటాడితే అతన్ని తన సారానికి, తన బాధ్యత లేని ప్రత్యక్ష రూపానికి శాశ్వతంగా బందీని చేయడమే. ఒక సెనెగల్ పౌరుడు తాను యాంటిలియన్ గా చెలామణి అయ్యేందుకు మిశ్రమ భాష నేర్చుకుంటే అది పరాయీకరణ చెందటమే.

మన భారత్ లో కూడా ఎందరో ఇంగ్లీష్ నేర్చుకుని ఆత్మ న్యూనత , చులకన భావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంగ్లీషులో మాటాడితే గౌరవం, దేశీయ భాషలో మాటాడితే తక్కువగా చూసే పరిస్థితి ఉంది.

ఫానన్ వివిధ పుస్తకాలను విశ్లేషిస్తూ నల్ల జాతీయుడు అంతర్గత న్యూనతా భావం వల్ల ఎప్పుడూ తెల్ల ప్రపంచాన్ని ఆకర్షించాలని, తెల్ల వాడిలా శక్తిమంతుడు కావాలని ప్రయత్నిస్తుంటాడని చెబుతాడు నల్ల జాతి స్త్రీలు తెల్ల వారిని పెళ్లాడి తమ సొంత జాతి నుంచి విముక్తికి తహతహ లాడింది మయోట్ కేపేషియా ఆత్మ కథ మరియు Sadji నవలలోని నిని అనే పాత్ర ద్వారా చెబుతాడు. మయోట్ లాంటి వారిని వారి బాల్య ఊహల నుంచి వారిని బయటకు తేవాలి. ఐరోపా వారు రుద్దిన విభజనను నల్ల జాతీయుడు అంగీకరిస్తే ఉపశాంతి లేదు. అతడు తన్ను తాను తెల్లవానిలా ఉన్నతీకరించుకునేందుకు యత్నిస్తాడు.మరో పరిష్కారం ప్రపంచాన్ని మార్చటమే.

ఒక మలగాసీలో ఆత్మ న్యూనతా భావం సహజం కాదు. దక్షిణాఫ్రికాలో వర్ణ వాదం ఆ వ్యవస్థ వల్లనే జరిగింది. అన్ని రకాల దోపిడీకి వస్తువు మనిషి ఒకడే. ఎమే సెజైర్ చెప్పినట్లు నాజీజాన్ని కళ్ళు మూసుకుని పెంచి పోషించినవారు అందరూ దానికి బాధ్యులే. అమెరికా లో కన్నా ఫ్రాన్స్ లో తక్కువ వర్ణ వివక్ష లేదు. మార్టినిక్ లో రెండు వందల మంది తెల్ల వారు మూడు లక్షల మంది రంగు జాతీయుల్ని , దక్షిణాఫ్రికాలో ఇరవై లక్షల మంది తెల్ల వారు కోటి ముప్పై లక్షల నల్ల జాతీయులపై పెత్తనం చేసి వారిలో ఆత్మ న్యూనతా భావ కారకులయ్యారు.

ఇక్కడ కూడా దళితుల లోని ఆత్మ న్యూనత భావానికి వారు కాకుండా కుల వ్యవస్థ అణచివేత ప్రధాన కారణం.అలాగే ఉన్న వారు లేని వారి దుస్థితికి వారే కారణమని,లేదా పూర్వ జన్మ పాపమని మాటాడుతారు. అసలు నిజం ఏమిటంటే లేని వారు ఉన్నారంటే కారణం ప్రకృతి లేక దేవుడు కాదు. ఉత్పత్తి సాధనాలపై పెత్తనం కొందరికి మాత్రమే ఉండటం.

ఆకలితో అలమటించే నల్ల వాడి లేదా అరబ్ దృక్పథంలో అమూర్త విలువలు ఉండాలి అనుకోవడం ఊహ మాత్రమే. అప్పర్ నైజర్ కు చెందిన ఆఫ్రికన్ సంగీత కారుడు అయిన షూబర్ట్ కాలేక పోయినా, ఒక శ్రామికుడు తన సాయంత్ర వేళలో హిందూ సాహిత్య భావ గీతాలు చదువుతూ గడపలేక పోవడానికి లేదా శాస్త్రవేత్త ఐన్స్టీన్ లా కాకపోవడానికి హేతువు అవకాశాల లేమి మాత్రమే అంటాడు ఫ్రాంజ్ ఫానన్.

ఒక నల్ల వాడి మనిషి తనం గుర్తించక పోతే అతడు ఎలా భరిస్తాడు? అతడి పై వివక్ష చూపి, విలువను దోచి, పరాన్న భుక్కు అని పిలిచి, పశువుగా, నడిచే ఎరువుగా చూసి , తెల్ల జగానికి అనువుగా సాగ మన్నపుడు నల్ల వాడు తెల్ల వాడిగా అయ్యేందుకు యత్నిస్తాడు. నల్ల వాడు ఎన్నటికీ అలా కాలేడు అని, ఆతని లోలోతుల్లో ఆధారపడే భావం ఉందని రచయిత మనోనీ అంటాడు. లాభార్జనకై వలసవాదులు స్థానికుల్లో న్యూనత భావం, ఆధారపడే భావం సృష్టిస్తారు.
ఒక నల్లవాడు తెల్ల వాడు కావాలని అనుకుంటే అతడి లోని అచేతనను చేతనీకరణం చేసి సామాజిక వ్యవస్థను మార్చడానికి ప్రేరేపించడమే తన లక్ష్యం అని ఫ్రాంజ్ ఫానన్ రాశాడు.
ఎక్కడ తిరుగుబాట్లు వచ్చినా మిలటరీ అధికారులు రంగు జాతీయుల్ని పంపి ఇతర రంగు జాతీయుల్ని అణిచేవారు. సెనెగల్ జాతి వారిని పంపి మలగసీ లను అణిచారు.
ఈ సందర్భంగా మన దేశ చరిత్ర లోనూ బ్రిటీష్ వారు గూర్ఖా జాతిని పంపి స్వాతంత్ర ఉద్యమాలను అణిచివేయడం, మలబార్ పోలీసులు గతంలో కమ్యునిస్టు ఉద్యమాల్ని అణిచివేయడం గమనించాలి. ఇవి క్రమంగా ప్రేమ్ చంద్ నవల “రంగ భూమి” లో , ఎలమర్రు – కాటూ రు పై రాసిన శ్రీ శ్రీ రాసిన కవిత లో హృదయాన్ని కదిలించే రీతిలో వర్ణించబడ్డాయి.

షేక్స్పియర్ నాటకం “ ది టెంపెస్ట్” లో ప్రోస్పెరో తన కూతురు మిరండాను మూలవాసి కాలిబన్ మాన భంగం చేస్తాడేమోనని భీతిల్లుతాడు. అలాగే వలస వాది ఒక వైపు పితృ తరహా దృక్పథం చూపిస్తూ మరో వైపు నల్ల వాడిని చూసి అర్థం లేని భీతి చూపిస్తాడు.

20 వ శతాబ్ది లో నల్లవాడు తన ఆత్మ న్యూనతను ‘ఇతరుడు’ ఎప్పుడు నిర్ణయించింది మరిచాడు.
యాంటిలీస్ లో తెల్ల క్రియోల్స్, ములాటోలు
, నల్ల జాతి వారి మధ్య కల ఉద్రిక్తతలను మేధో పరంగా యోచించి సంతృప్తి చెందటం జరిగింది.

నల్ల వాడు క్షమించటానికి సిద్దమైనా అతడిని తెల్ల ప్రపంచం తనలో పాల్గొననీయకుండా నల్లవాడిగానే చూస్తుంది. యూదుల లాగా ఇతరులకు తన పట్ల ఉన్న ఇమేజ్ వల్ల కాక తన రూపు వల్లనే నల్లవాడిని బానిసను చేసి చూసారు. సైన్స్ పేరుతో క్రోమోజోములంటూ నర మాంస భక్షణ అతడి పై రుద్దారు. తాను రైలులో ప్రయాణిస్తుండగా ఒక తాగుబోతు ఫ్రెంచి వాడు తనని చూస్తూ విదేశీయుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తోటి వారితో అనటం ఫ్రాంజ్ ఫానన్ ప్రస్తావించాడు.
నల్ల జాతి చరిత్రలో సేగూ, జెన్నీ లాంటి నగరాలు, విద్యావంతులైన వైద్యుల, మక్కాలో ఖురాన్ గురించి చర్చ చేసిన మత వాద తాత్వికుల ఉనికి, రెండు వేల సంవత్సరాల క్రితమే వెండి, బంగారాల తవ్వకం, విజ్ఞానం, కళలు, పురాణాలు తో కూడిన సొంత నాగరికత ఉన్నాయి అని ఎమే సెజైర్ ఎప్పుడో చెప్పాడు.

పుస్తకాలు, వార్తా పత్రికలు, పాఠ్య పుస్తకాలు, ప్రకటనలు, సినిమా, రేడియో ( ఇప్పుడు టీవీ, స్మార్ట్ ఫోన్లు) మొదలగునవి ఒక కమ్యూనిటీ ప్రాపంచిక దృక్పథాన్నీ నిర్దేశిస్తాయి. ఉద్యోగాలు అన్నీ యూదులు ఆక్రమిస్తారని, నల్ల జాతికి వేరే పని లేనట్లు లైంగిక మృగాలుగా పిల్లల్ని కని దేశమంతా నింపుతారని ప్రచారం చేస్తారు. ఇక్కడ సైతం ముస్లింల పట్ల ఇలాంటి విద్వేష ప్రచారం మతోన్మాదులు సోషల్ మీడియాలో చేయటం గమనించాలి. నల్ల వాడి లైంగిక ఆధిపత్యం అపోహ వల్ల కొందరు తెల్ల మహిళల్లో నీగ్రోల పట్ల భీతి, తెల్ల మగవారిలో ద్వేషం పెంచుతుంది అని ఫ్రాంజ్ ఫానన్ ప్రస్తావించాడు.

నలుపు అంటే చీకటి, అప్రాధాన్యత, విషాదం, రాత్రి, అధో జగత్తు, చావులకు ప్రతీకగా తెలుపు అంటే వెలుగు, శాంతి, అద్భుతమైన స్వర్గ కాంతికి ప్రతీకగా చూడటం తెల్ల ప్రపంచానికి రివాజు.
యాంటిలీస్ వాసి సామూహిక అచేతన ద్వారా, వ్యక్తిగత చేతనలో చాలా వరకు శ్వేత జాతీయుడే.కానీ అతని చర్మం రంగు నలుపు. నల్ల జాతీయుడు తన ఈ ఇమేజ్ కు వ్యతిరేకంగా సదా పోరు సలపాలి. తెల్ల సమాజం దృష్టిలో బలి పశువు దాన్ని వ్యతిరేకించే నల్ల జాతీయుడు. నల్ల వాడు తనలో అంతర్గతం అయిన తోటి నల్ల జాతి వానినే బలి పశువుగా చూసే అసంబద్ధ స్థితి నుంచి విముక్తికి స్థానికత నుంచి విశ్వ జనీనతకు సాగాలి. ఫ్రెంచ్ యాంటిలీస్ ప్రాంతంలో నల్ల వాడి ఆత్మ న్యూనతా భావం, తోటి నల్ల వాడి కన్నా తాను మిన్న అనే ఇగో భావం అతడి మీద తెల్ల జాతి వ్యవస్థ, దాని సంస్కృతి రుద్దిన దాని ఫలితమే.

ఆత్మ గౌరవం, గుర్తింపు కోసం నల్ల జాతీయుడు లోని కోరిక తనలో తాను స్థితి నుంచి తన కోసం తాను ఉండే ఆదర్శ ప్రపంచం వాస్తవ రూపు దాల్చేందుకు చావు కైనా తెగిస్తుంది. మనిషి ప్రవర్తన కేవలం ప్రతిక్రియ కాక క్రియగా మారాలి. మానవీయ విలువలు కోసం ప్రేరణ కలిగించడం తక్షణ కర్తవ్యం. పెట్టుబడిదారీ సమాజం గతం, కుళ్ళు గాలితో, బతుకు లేని భావాలతో అన్వేషణ, నిజమైన ప్రగతిలను అణచివేసేది. ఫైరింగ్ స్క్వాడ్ ముందు నిలిచిన వియత్నాం ప్రజలు గతం కోసం కాక వర్తమానం, భవిష్యత్తుల కోసం చావును ఆహ్వానించారు. ఫ్రాంజ్ ఫానన్ కోరింది గతానికి పరిహారం కాదు . నల్ల జాతి మిషన్, తెల్ల జాతి భారం లేదు. తెల్ల నీతి, తెల్ల తెలివి , తెల్ల ప్రపంచం లేవు. ఇతరుడు నుంచి మనిషిలా ప్రవర్తన కోరటం తన హక్కు. తాను చరిత్ర బందీ కాదు. మనిషి ఒక సాధనం కాదు.ఒకరి పై మరొకరి అణచివేత పోవాలి.నిజమైన కమ్యూనికేషన్ కావాలి. ఫానన్ చివరి ప్రార్థన ఇదే: “ఓ నా శరీరమా ! ఎప్పుడూ ప్రశ్నించే మనిషిగా నన్ను తయారు చేయి!”

Leave a Reply