“కవిత్వం అంటే భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, సమాజాన్ని మేల్కొలిపే ఒక చైతన్య కిరణం” విశ్వ మానవతా సూత్రాన్ని ప్రబోధిస్తూ, సమకాలీన సమాజంలోని దురన్యాయాలను ప్రశ్నిస్తూ, సామాజిక వాస్తవికతను విభిన్న కోణాల్లో చూపుతూ, నేటి సమాజపు ముఖచిత్రాన్ని అక్షరాల సాక్షిగా “దుఃఖం లేని చోట” కవితల సంపుటి ద్వారా ఆవిష్కరించారు డా. కసప నరేందర్. ఇదొక కవితల పుస్తకం మాత్రమే కాదు, కవి సమాజంతో జరిపే సంభాషణ సైతం. మానవీయ విలువలను, మానవత్వాన్ని పాదుకొల్పుతూ మనిషి సామాజిక బాధ్యతను గుర్తు చేశారు కవి.
విశ్వమానవతా దృక్పథంతో, సామాజిక చైతన్యస్ఫూర్తితో, మానవ సంబంధాల పునరుద్ధరణ కోసం తపించే కవి అంతరంగావిష్కరణనే ‘దుఃఖం లేని చోట’. మొత్తం 50 కవితలున్న ఈ సంపుటిలో కవి వ్యక్తి – సమాజ సంబంధం, భారతీయ తత్త్వం, శాంతియుత జీవన విధానం, ప్రేమైక జీవన మాధుర్యం, వ్యక్తి – వ్యక్తిత్వ వికాసం, ప్రకృతి పరిరక్షణ, ఆశావాదం, మానవ మనస్తత్వం, రాజకీయ స్పృహ వంటి విభిన్నాంశాలతో ఈ కవిత్వ సంపుటిని పాఠకుల ముందుంచారు.
‘దుఃఖం లేని చోట’ కవిత్వ సంపుటి శీర్షికనే ఆసక్తికరంగా ఉంది. అసలు దుఃఖం లేని చోటు ఈ విశ్వం పైన ఎక్కడైనా ఉందా? ఉంటే బాగుండును కదా అనిపిస్తుంది. కవి కూడా ‘నాకు దుఃఖమే లేకపోతే నేను ఎలా ఉండాలనుకుంటున్నానో ఈ పుస్తకంలో ఆవిష్కరించాను’ అంటారు. అయితే ఈ దుఃఖం వారి వ్యక్తిగతం కాదు. ఉన్నవాళ్లకి, లేనివాళ్లకి సమానమైంది దుఃఖం అంటారు.
మానవ మనస్తత్వాన్ని గురించి చెబుతూ “స్వచ్ఛమైన మనసుతో మాట్లాడే మనిషి కరువైయ్యిండు”, “మనిషిని చూపించవే మనసా”, “మనుషులందరు కలిసి ఉండే వేదికను నిర్మించాలి” వంటి కవితా పంక్తులలో నానాటికి మృగ్యమైపోతున్న మానవీయ విలువల కోసం ఆరాటం కనపడుతుంది. కని, పెంచి, పెద్ద చేసి జీవితమార్గాన్ని సిద్ధం చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాక ఎలా నిరాదరణకు లోనవుతారో “వృద్ధులు” కవితలో కవి చెప్పిన తీరు హృదయాన్ని కదిలిస్తుంది. వృద్ధులు కుటుంబానికి, సమాజానికి అనుభవజ్ఞాన నిధులు. వారికి కావలసింది కాసింత ప్రేమ, రవ్వంత ఆప్యాయత అంతకంటే ఇంకేమీ కోరని వృద్ధుల కంటి తడిని తడిమి చూపుతారు కవి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ప్రేమతో చూసుకోవాలన్నది కవి ఆకాంక్ష. “అమ్మ, తల్లి ప్రేమ” కవితలు పిల్లల పట్ల మాతృమూర్తి మమకారాన్ని పట్టిస్తాయి. నేటి కాలంలో బంధాలు, బంధుత్వాలు ఎలా ఉన్నాయో చెబుతూ రాసిన కవితలు మానవ మనస్తత్వాన్ని వెల్లడిస్తాయి. “నీలాగే / ప్రపంచం / ఎందుకుండదూ?” అని “వెన్నెల” కవితలో వెన్నెలను ప్రశ్నిస్తూ… “నీవైనా చెప్పు / నీలాగా ఉండమని / నీవైనా మార్చు / నీలాగ బతకమని” అనడంలో వెన్నెలంత స్వచ్ఛమైన, చల్లని మనసున్న మనుషుల కోసం కవి ఆరాటం వ్యక్తమవుతుంది.
సామాన్యాంశాలను అసామాన్యంగా కవిత్వీకరించారు డా. కసప నరేందర్. అధ్యాపకులుగా వారి వ్యక్తిగత అనుభవాన్ని “తరగతి గది” కవితలో ఆవిష్కరించారు. ‘నేను సూర్యున్ని / చుక్కలు విద్యార్థులు / అక్షరంతో అల్లుకున్న బంధం నాది’ అని మురిసిపోయే ఉపాధ్యాయుడి లోపలి మాటలను ఇలా వ్యక్తీకరించారు.
‘పాఠం బాగా / చెప్పిన రోజు / బాగా భోజనం చేసినట్టుంటుంది / చెప్పని రోజు పస్తులున్నట్టుంటుంది / నేను పస్తులుండటానికి ఇష్టపడను’ అనడంలో ఉపాధ్యాయుడు విద్యార్థి భవిష్యత్తు నిర్మాణశిల్పిగా కనిపిస్తాడు.
ఉపాధ్యాయుడి ప్రాధాన్యతను నొక్కి చెప్పే మరో కవిత “ఉపాధ్యాయుడవు”. నిరంతరం మేధో మధనం చేస్తూ, జ్ఞానం పంచేవారు ఉపాధ్యాయులు. తరగతి గది కేవలం పాఠాలు చెప్పే స్థలం కాదు. మంచి సమాజానికి కావలసిన ముడిసరుకు పౌరులను తయారుచేసే పవిత్రస్థలం అని సంభావించారు కవి. “తరగతి గదికే కాదు / సమాజ పురోగతికి / భాస్కరుడవు” అన్న కవితా పంక్తులు అక్షర సత్యాలు.
“విశ్వగీతం” కవితలో విశ్వశాంతిని ప్రగాఢంగా కోరుతూ, ప్రపంచమంతా శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వంతో నిండిపోవాలని కాంక్షించారు. కుల, మత, జాతి, దేశ భేదాలకు అతీతంగా మానవులంతా విశ్వజనీన భావంతో జీవించాలని ప్రబోధిస్తారు.
సమీప భవిష్యత్తులో మానవ సమాజం ఎదుర్కోబోయే అతిపెద్ద విపత్తు ఒక మనిషి మరో మనిషితో సంబంధం లేని స్థితికి చేరడం. ఏ వ్యక్తికా వ్యక్తి ఒంటరి జీవితానికి అలవాటు పడి సమాజంలోనే ఉంటూ, సమాజంతో కలవకపోవడం. ఈ స్థితి మనుషుల మధ్య ఉండే మానవీయ సంబంధాలను కూల్చుతుంది.
“నాలుగు గోడలు” కవిత ఈ పరిస్థితికి అద్దం పడుతుంది. “నాలుగు గోడలకు / ఇప్పుడు డిమాండ్ / పెరిగింది /. ….. తలుపులెప్పుడు / బంధించే ఉంటున్నాయి / మనుషులు / మునులైయిండ్రు / ఏకాంతసేవకు / అంకితమైండ్రు / కనురెప్పలు / తలుపులేసుకున్నవి….” అని వాపోయారు. ఈ పరిస్థితి ఇప్పటికే మెట్రోపాలిటన్ నగర సంస్కృతిగా మనకు కనిపిస్తుంది. కవి సామాజిక స్పృహకు దర్పణం పట్టే కవితలు పొల్యూషన్, సోషల్ మీడియా, బిజీ బిజీ, ఫోన్, పబ్లిసిటీ, నిప్పుల వంతెన, బూడిద దుప్పటి. ఆధునికత పేరుతో వృత్తులు ధ్వంసం అవుతున్న విషయాన్ని ఎంతో ఆవేదనతో బూడిద దుప్పటి కవితలో చిత్రీకరించారు.
కవి వ్యక్తిగత అనుభవాలు, సామాజిక చైతన్యం మిళితమై “దుఃఖం లేని చోట”గా రూపుదిద్దుకుంది. ఈ సంపుటిలో అసాధారణమైన అంశమేది లేదు. అందరి జీవితాల్లో ఉండే జీవన వాస్తవికతను అక్షరాల్లో, భాషలోను, భావంలోనూ సరళంగా, సులభగ్రాహ్యంగా కనిపించినప్పటికి, లోతైన తాత్వికత అంతర్లీనంగా ద్యోతకమవుతుంది.
ప్రతి కవితలోనూ ఒక ఆలోచనాత్మక భావన, ఆశావహ దృక్పథం, సామాజిక మార్పు, మానవ విలువల పునరుద్ధరణ వంటి అంశాలు కనిపిస్తూ, మనసును హత్తుకున్న కొన్ని కవితా పంక్తులు పుస్తకం మూసిన తర్వాత పదే పదే జ్ఞప్తికి వచ్చి ఆలోచింపజేస్తాయి.