“అంటరాని వసంతం” నవల ఒక కవితాత్మక వాస్తవికత.ఒక వాస్తవికాత్మక కవిత. మాతయ్య తో మొదలైన ప్రతిఘటనా స్వరం జెస్సీ దాకా తరాలుగా ఆటలా,పాటలా,మాటలా సాగి తెలుగు సాహిత్యంలో దళిత సౌందర్య శాస్త్రానికి దారి చూపిన నవల. ఒక ప్రవహించే లావాను రచయిత దళిత దారిలో మళ్ళించాడు.అది అగ్ర వర్ణాల రీతిలో అందమైన,సుకుమారమైన, ’గౌరవ’ ప్రదమైన సాంస్కృతిక వస్తువు కాదు. కుల అణచివేతలో, ఆగ్రహంతో , ప్రజా పాటలో, కరువు బాటలో, మారిన మతంలో, చేపట్టిన ఉద్యమంలో సాయుధమైన గాథ.
కల్యాణరావు గారి నవల చదువుతుంటే అడివి బాపిరాజు, చలం ,రావి శాస్త్రి, శ్రీ శ్రీ , బుచ్చి బాబు వచన రచనల్లోనీ కవితాధార ,భారతీయాంగ్ల రచయిత భవానీ భట్టాచార్య ( So Many Hungers), కమలా మార్కండేయ ( Nectar in a Sieve) నవలలలోని కరువు బాధితుల, భూములు పోయి అలమటించే సన్న కారు రైతుల పెను విషాద ఘటనలు గోచరిస్తాయి.
నవల్లో రూతు తన జీవితంలోకి నిశ్శబ్దంగా వచ్చి అలాగే మాయమైన రూబేనును ,గతాన్ని తలచుకుంటుంది. “ అదో అంటరాని వసంతమంటుంది.” ఆ వసంతం లో సముద్ర కెరటాల ప్రచండ ఘోష ఉంది. ఓ కొనసాగింపు ఉంది. ఇది ఒక పోరాటంలో గెలుపు, ఓటముల ప్రసక్తి లేకుండా కొనసాగింపు ఉంది. పోరులో మరణం ఓటమి కాదు. బ్రతికి ఉండి బలుసాకు తినడం జీవితం కాదు.
ఎర్రెంకడి అసలు కొడుకు, అతని చెల్లెలు భూదేవి పెంచిన వాడు ,ఎర్ర గొల్లల నాటకం చూడబోతే తన్నులు తిని పారిపోయినవాడు, ప్రకృతి బాలుడు ఎల్లన్న.
కళకి లిఖిత రూపం రాకముందే క్రోమన్యాను గుహా ముఖాల్లో ఆదివాసుల వేట చిత్రీకరణలో కళ దాగుంది.వారి పాటలో, అరుపులో , సామూహిక వేట తరువాత పశుపాలన, వ్యవసాయం అన్ని దశల్లో ఉత్పత్తిలో, దాని కోసం సాగే సంబంధాల్లో కళ అంటే అంతర్భాగమైంది.
ఎల్లన్న మంట చుట్టు ఉరుముల నృత్యం చేస్తున్న వారి దగ్గర చేరాడు. ”వాస్తవం, నృత్యం, యుద్ధం, బీభత్సం,జీవితం, నాట్యంగా,గానంగా…ఉరుముల నృత్యం.”(25)
ఈ క్రమంలో కళ గురించి ,దాని పుట్టుక గురించ రాస్తూ నవలాకారుడు
“ భూమ్మీద జరిగిన ప్రతి పని లోంచి పాట పుట్టింది. నాట్లు నాటుతో, కలుపు తీస్తూ, కూలి చేస్తు,కూలి తల్లి పాట పాడింది.ఆకలిని మర్చిపోవడానికి, పాలకి కేక పెట్టే బిడ్డను మర్చిపోవడానికి, వొంగిన నడుము నొప్పినీ మర్చిపోవడానికి మూగ గొంతు లోంచి పల్లవి వినిపించింది.శ్రమలోంచి చరణాలను పంచింది ఒక కూలి తల్లి, ఒక మాల తల్లి, ఒక మాదిగ తల్లి.” (45)
పల్లవికి వందలాది మంది కోరస్ పాడగా జనించిన జానపదం.
ప్రపంచంలో అన్ని దేశాల్లో సామాజిక ఉత్పత్తి క్రమంలో కళ పుట్టింది. కానీ దోపిడీ వర్గాల, కులాల వినోద సాధనంగా మార్చారు. సౌందర్య ఉపాసన పెరిగి సామాజిక ప్రయోజన కోణం మరిచారు. మార్మిక సత్యం పేరుతో సామాజిక సత్యాన్ని నిరాకరించారు. రాజుల, మతాల కబంధ కౌగిలిలో కళ చిక్కుకు పోయింది. మోక్షం పేరుతో పరలోకం గురించి చింత ఎక్కువైంది.
ఆధునిక పెట్టుబడి దారి యుగంలో కళకు వ్యక్తివాదం కొత్త నిర్వచనం ఇచ్చింది. తొలుత పారిశ్రామిక దుష్పలితాలు పట్ల వ్యతిరేకత కాల్పనిక ఆశావాదం వచ్చింది. అయితే రచయిత, కళాకారుడు ఏదో దివ్య శక్తి అంశ కలవాడని, తన కోసమే రాసాడని, అందమే కళ చందమని, సమాజం పట్ల బాధ్యత అనేది ప్రధానం కాదని, అతడి స్వేచ్ఛ హద్దులు లేనిదని, అసలు ఎవరికీ అర్థం కావలసిన అవసరం లేదని, జనమే కిందా మీదా పడి సంక్లిష్ట కళను అర్థం చేసుకోవాలని సిద్ధాంతం ప్రాబల్యంలోకి వచ్చేలా చేశారు. రచయిత నత్త గుల్లలా మారిపోయాడు.
కళ ప్రజలకు చెందింది. కేవలం పై నున్న “పది వేల మంది” కోసం కాదు అని రష్యన్ సాహిత్య విమర్శకులు నొక్కి చెప్పారు. ఇతరేతర సమాజాల్లో Elite కళ మీద పెత్తనం చెలాయించారు.చాలా కాలం ప్రజలను చదువుకు దూరం చేసారు. మత గ్రంథాల్లో కూడా ఏముందో తెలియకుండా జనాన్ని అజ్ఞానంలో ఉంచి వక్ర భాష్యం చెబుతూ వారిని ఆర్థికంగా, సాంస్కృతికంగా తమ గుప్పెటలో పెట్టుకున్నారు. అక్కడ వర్గ ఆధిపత్యం సాగింది.ఇక్కడ ఈ దేశంలో “కళను కూడా తక్కెట్లో తూచారు. వీళ్లను మాత్రం తూకానికే కాదు.అసలు తక్కెట దాకా రాకుండా చేశారు.” (45)
ఎల్లన్న మాయం భూదేవి గుండెల్లో గాయం.ఉరుముల నాగన్న ఎల్లన్న ను తీర్చి దిద్ది తిరిగి తీసుకెళ్లాడు ఎన్నెల దిన్నికి.పెద్ద కరణం నారిగాడ్ని చంపితే వాడి తల నరికి రంగాయి కళ్ళల్లో దేవుడి గా నిలిచి మాయమయ్యాడు మాతయ్య. పెద్ద మాలను కలిసి చెప్పాడు. ఆ రాత్రిని చీకటిలో మిణుగురులా, ఏటికి ఎదురీదే చేపలతో , ఒక సాహసి గుండెల్లో ప్రతిధ్వనితో రచయిత పోల్చాడు.
యూరోపియన్ అనుకరణ అపురూపంగా చూసే అగ్ర వర్ణాల సాహిత్యం,కళలు. చిత్రకారుడు రవి వర్మకే “అందని అందాలు అంటూ రాశారు. నిజమే.ఆయనకి అందని అందాలు చాలా ఉన్నాయి. కాకపోతే అవి అంటరాని వసంతాలు. ఈ భూమ్మీద కురిసి వెలసిన వెలి కదలికలు.” (67)
ఐరోపా సాహిత్యంలో naturalism, realism, social realism, magical realism ధోరణులు తీసుకు వచ్చి రచయితలు నిజానికి అద్దం పట్టడమే కాకుండా ముందుకు నడిపించాలని యత్నించారు.అయితే కళ్యాణ్ రావు గారి నవల్లో authentic experience కథకు కవితాత్మకత కల్పించింది. చారిత్రక అవగాహన వాస్తవిక సూత్రాలు అర్థం చేసుకోవడానికి, ’అయ్యో’ అనే సానుభూతి నుంచి పోరాట అనుభూతి, నైజం, తెగింపు, నూతన సమాజం డిమాండ్ చేసే సాహసం రూపం తీసుకున్నాయి. పేలవమైన కథా రీతి కాకుండా నెత్తురు మండే , శక్తులు నిండే సైనికులు తయారయ్యే క్రమం, పోరాట కొనసాగింపు కనిపించాయి.
ఎల్లన్న, నాగన్న నరసింహ స్వామి నాటకం వేశారు. అచ్చిరెడ్డి మామ కుట్ర తో నాటకం ఆగింది. నాగన్న గుండె ఆగింది. ఎల్లన్న పాటలో నారిగాడి మరణం , మాలాడి దిబ్బ, మాతయ్య వేదన గుండె కరిగించింది.ఎన్నెల దిన్ని చరిత. ప్రజల పాట గాలిపాట అంటారు కొందరు. కానీ “సహజమైన స్పందన కు మారుపేరు గాలి పాట….గొడ్లు కాసే కుర్రాడి ఇష్టం లా మోగే పిల్లన గ్రోవిలా ..” (95)
కరువు పని కోసం వెడితే శశిరేఖ, శివయ్యలను అక్కడి పని ఇచ్చే సూపర్వైజర్ రెచ్చగొడితే తరిమి కొట్టారు మాలలని ఇతర కూలీలు. తమను తరిమిన వాళ్ళు కూలీలే. కానీ ఆకలికి, కూలి కి కూడా అంటరానితనముంది. ”ఏ లోయలో ఏ నాగరికత వురి తియ్యబడ్డదో అర్థం కాదు.మట్టి మీద ఆధిపత్యం.మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా వేరు చేసి అణచివేసిన కౌటిల్యం. “(139)
చావు బతుకుల్లోని వారిని మార్టిన్ కాచాడు. శారా చేరదీసింది. వారి మతం మారింది. బతుకు నిలిచింది. ఎల్లన్న కొడుకు శివయ్య కళ్ళ ముందు చీకటి సమాధులు.
మార్టిన్ ఆసలు పేరు చిన్నోడు. లేచి నిలవనందుకు బాగా తన్నాడు చినకాపు.
“ఈ భూమి బద్దలు కాలేదు. ఇట్లాంటప్పుడు రెండుగా చీలిపోలేదు.భూమికూడా సీతమ్మల కోసమే. రెండుగా పగులుతుంది.” (153) ఏదో బాహ్య శక్తి ఆపదలో అభాగ్యులను కాపాడుతుందని విధి వాదం కు గండి కొట్టాడు నవలా రచయిత. మారాల్సింది మనిషి. చరితని మార్చేది మనిషి కానీ అతీత శక్తులు కావు.
గొడ్డు మాంసం తిననంటే కొట్టారు అగ్రవర్ణాల వారు. మాదిగలను. పూడ్చి పెట్టిందాన్ని వెలికితీసి తినిపించారు. దాడులన్నీ అంటరాని క్రైస్తవులపై న. అగ్రవర్ణ క్రైస్తవులపై లేవు దాడులు.
బంజరు భూమి అని నిరూపించి పేదలకు సాగు హక్కు ఇప్పించాడు మార్టిన్. పేద క్రైస్తవులకు ఇప్పించడం నచ్చని చౌదరులు, రెడ్లు ఏకమయ్యారు. 24 డిసెంబరున మార్టిన్‌ను హత్య చేశారు. శవాన్ని మోసుకుని పరిగెత్తిన సీమోను
(శివయ్య) వలసపాడు చేరి వల్లకాడును చూసాడు. శారమ్మా , శశిరేఖ , ఎందర్రో ఆహుతి ఏడుస్తున్న బిడ్డను తీసుకుని పరుగు తీశాడు. ఆ తరువాతి తరం బిడ్డ రూబేను ఆసుపత్రి బోధకుడయినాడు. తన మూలం తెలుసుకున్నాడు. ఫ్రాన్సిస్ కూతురు రూతును పెళ్లి చేసుకున్నాడు.తన జీవితంలో సడి చేయక వచ్చి అలాగే పోయిన రూబేను ను తలచుకుంటున్న రూతు.
రూబేను పిల్లలు ఇమ్మానుయేలు, రోజీ లు. పిల్లడు బడిపంతులు రామనుజంతో కలిసి పోరు బాట పట్టాడు. రోజీ వందనాన్ని పెళ్లి చేసుకుని ఆనందకర జీవితం. పోరు బాటలో జనం చెర్వు నీళ్ళల్లో దిగారు. పోరులో పోలీసులు నెదిరించారు. తుపాకీ పోయిందని పల్లెకు చిత్ర హింసలు. కేసుల పాలయ్యారు. రక్తం చిందించారు ఆవలపాడు మాల పల్లి కమ్యూనిస్టులు. నిజాం వ్యతిరేక తెలంగాణా పోరు విరమణ .
కులం అన్నిటినీ ఆవరించింది.
ఈ దేశంలో పీల్చే గాలికి , తాగే నీటికి ,పంట కాల్వకి, పండే భూమికి, బాదిక్కే, గుడికి, రచ్చ బండకి, తిండికి, ఇంటికి , బట్టకు, మాటకి , సాహిత్యానికి, సంస్కృతికి , రాజ్యానికి , చట్టానికి, న్యాయానికి, న్యాయ స్ధానానికి , శవానికి, స్మశాన వాటిపైకి, దేవుడికి, దయ్యానికి కులముంది అని రచయిత రాసిన తీరు నిజాన్ని ప్రకటించడం.
సిక్కోలు పోరులో అమరుడైన ఇమ్మాన్యుయేల్ కు ఘనమైన వీడ్కోలు. రూబేను కేక.
సిక్కోలు పోరులో అమరుడైన ఇమ్మాన్యుయేల్ కు ఘనమైన వీడ్కోలు. రూబేను కేక పెట్టాడు.
“రుతువు మారింది .దాని పేరు మారింది. శిశిరం , వసంతం, గ్రీష్మం అట్టా కాదు.దోపిడీ రుతువు. దొంగల రుతువు. దౌర్జన్యాలు రుతువు . ఆకలి రుతువు. నెత్తుటి వాసన రుతువు.” (228)
రూబెను , రూతుల మనవడు జెస్సీ పెరిగాడు. తండ్రి పోరు బాట పట్టాడు , మనవరాలు రూబీ మహిళా సంగంలో కార్యకర్త. వందనం, రోజీ ల కూతురు రూబీ కవితలో చావుకి తెగించిన జెస్సీ తన కవితలో రాసుకుంది. “అతనొస్తాడు. జీవితం కన్నా దీర్ఘమైన వాడు. ప్రేమ కన్నా గాఢమైన వాడు “(243) అని రాసుకుంటుంది.
ఎల్లన్న చుక్కల్లో సుభద్రను చూస్తే, కారంచేడు దాడి చూసి కదం రంగం పట్టిన జెస్సీ చుక్కల్లో అమరుల్ని, అమరత్వాన్ని చూశాడు. రూబేను తరలి పోయాడు. రూతు ఉత్తరంలో జెస్సీకి ఇలా రాసింది.” మీ జీవితం మొలిచే మొక్క లాంటిది. పండే పంట లాంటిది. అద్భుతమైన ఆకాశ నక్షత్రం పంచె వెలుతురు లాంటిది. శాశ్వతమైంది.”(253)
సామాజిక , సాంస్కృతిక మార్పు రానిదే వ్యవస్థ మారదని , ఒక వేళ మారినా కులభూతం ఎదురు నిలుస్తుందని బొజ్జా తారకం చెప్పారు. ఈ రాజ్యాంగ వ్యవస్థలో అన్ని రంగాల్లో రాజకీయాలు, బ్యూరోక్రసీ, న్యాయస్థానం , సాంస్కృతిక రంగాల్లో ఆధిపత్య స్థాయిలోకి వెళ్లేందుకు దళిత , బహుజన, మైనారిటీ సమాజాలు తీవ్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.