బ్లాక్ ఆండ్ వైట్

చేస్తున్న పనిని ఒక కొలిక్కి తెచ్చి, కంప్యూటర్ స్క్రీన్ లాక్ చేసింది పద్మ. వెంటనే సీతాకోకచిలుక రెక్కలను మృదువుగా తాకబోతున్న పాప ఫొటో తెరపైకి వచ్చింది. ఫొటో తీస్తున్నప్పుడే కెమెరావైపు చూసినందుకు తన కళ్లల్లోకి చూస్తున్నట్లు అనిపిస్తుంది. పాపనూ, సీతాకోకచిలుకనూ చూస్తూ ఒక్కక్షణం లోకం మరచిపోయింది పద్మ. “నా బుజ్జి తల్లులు” అనుకుంటూ, సెల్ ఫోన్, బ్యాడ్జ్ తీసుకుని ఆఫీస్ బిల్డింగ్ బయటకు నడిచింది.

నిజానికి ఆ రోజు ఎవరితో మాట్లాడాలని లేదు. కానీ అర్జంటుగా మాట్లాడాలని రూప మెసేజ్ పెట్టింది.
కాసేపు ఒంటరితనంలోకి వెళ్లిపోవాలనిపించే దిగులు పొగను విదిలించుకుంటున్నట్లు గబగబా నడిచింది.

పదిహేనేళ్ల క్రితం అమెరికాలో ఎమ్. ఎస్ చేశాక ఉద్యోగం వేటలో ఉన్నప్పుడు కలిశారు ఇద్దరూ. ఇద్దరికీ ఒకే కంపెనీలో వేరు వేరు డిపార్ట్మెంట్లలో ఉద్యోగం దొరికింది. కొన్నాళ్ళు ఒకే అపార్టుమెంటులో రూమ్మేట్స్ గా ఉన్నారు. రూప అప్పటిదాకా డబ్బు సంపాదించడం, అలంకారాలు, వంటావార్పులు నేర్చుకుని, అమ్మానాన్న కుదిర్చిన తమ కులంలోని అబ్బాయినే పెళ్లి చేసుకుని సెటిల్ అవడం గురించీ ఆలోచించేది. పద్మను కలిసాక కొత్త లోకం పరిచయమయ్యింది రూపకు. పద్మ దగ్గరున్న పుస్తకాలను ఇష్టంగా చదివేది. సాహిత్యం గురించీ, సామాజిక విషయాల గురించీ ఎక్కువ మాట్లాడుకునేవాళ్లు. శని ఆదివారాలు వాలంటరీ వర్క్ చేసేవాళ్లు. రూప ఎంత మారిందంటే వాలంటరీ వర్క్ లో పరిచయమైన ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇద్దరూ పెళ్లిళ్ల తరువాత ఎప్పుడో గాని కలుసుకునేవాళ్లు కాదు. కలిసినప్పుడు గంటల కొద్దీ కబుర్లు చెప్పుకునేవాళ్లు. పద్మకు పాప పుట్టిన నాలుగేళ్లకు భర్త నుంచి విడాకులు తీసుకుని వేరే దూరంగా ఉన్న ఊరికి బదిలీ చేయించుకుంది. రూప పిల్లల కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాక దత్తత తీసుకోవడానికి వచ్చిన రెండుమూడూ అవకాశాలు చివరి నిమిషంలో వెనక్కి వెళ్లాక, ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంది.

పిల్లవాడి తల్లి నల్లజాతీయురాలు. టీనేజర్. డ్రగ్స్ కు అలవాటుపడి, ప్రొబేషన్ను ధిక్కరించినందుకు, పిల్లవాడి క్షేమం కోరి పురిటిలోని పసిపాపను ఫోస్టర్ కేర్ లిస్టులో లైన్లో ఉన్న రూపకు ఇచ్చేశారు. రెండేళ్ల తరువాత బాబు తల్లి తన పద్ధతులు మార్చుకుని, బాబు కావాలని వెనక్కి వస్తే వాడిని ఆమెకు ఇచ్చెయ్యవలసి రావచ్చు అని వాళ్లు హెచ్చరించినా వాడిని ప్రేమగా తీసుకుంది రూప. తను చేసిన పనికి పద్మ అబ్బురపడింది.

బాబు తల్లి రెండేళ్లకు వెనక్కి రాలేదు గానీ, ఐదేళ్లకు చైల్డ్ సర్వీసెస్ లోని సోషల్ వర్కర్ ద్వారా రూపను కాంటాక్ట్ చేసింది. బాబు కోసం ఆమె పూర్తిగా మారిపోయింది. డ్రగ్స్ పూర్తిగా మానేసింది. ఒక కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పని చేస్తూ కాలేజీలో చదువుకుంటోంది. తన మీద తనకు నమ్మకం కుదిరాక, బాబు కావాలని వెనక్కి వచ్చింది. వాడిని వెనక్కి ఇచ్చే ప్రసక్తి లేదని, కావలంటే తన ఇంటికి వచ్చి బాబుతో కాసేపు గడిపి వెళ్లవచ్చని చెప్పింది రూప. అందుకు ఆమె సంతోషంగా వప్పుకుంది. ఒక ఆదివారం మధ్యాహ్నం వాడితో గడిపింది. బాబుకు అప్పటికే చదవడం, రాయడం వచ్చేసింది. పియానో వాయించడం కూడా నేర్చుకుంటున్నాడు. ఆ ఇంటి పరిసరాలూ, బాబు తెలివి తేటలూ, రూపా, ఆమె భర్తా బాబును ప్రేమగా చూసుకుంటున్నది చూసిన ఆమె ఎంతో సంతోషించింది. అదంతా బాబు అదృష్టం అని కూడా చెప్పింది. అప్పుడప్పుడు బాబును కలవడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంది.

ఆమె పట్ల రూపకు ఏం అనుమానం కలిగిందో ఏమో, మళ్లీ రావొద్దని సోషల్ వర్కర్ తో చెప్పించింది. ఆమె మీద రిష్ట్రైనింగ్ ఆర్డర్ కూడా తెప్పించింది. పిల్లవాడు బాగుంటే చాలనీ, బాబు జోలికి వెళ్లననీ ఆమె ఏడుస్తూ చెప్పిందని రూపకు సోషల్ వర్కర్ చెప్పింది. తన భయాలు తనకు ఉండొచ్చు కానీ ఆ తల్లికి అంత క్షోభను ఇవ్వడం పద్మకు బాధ కలిగించింది. ఎంతోమంది ఓపెన్ అడాప్షన్ ను పాటిస్తున్నారని, పిల్లవాడి కోసం అంత మారిన ఆమె గురించి భయపడక్కర్లేదనీ, దత్తత తీసుకున్న తల్లిగా తన హక్కులు తనకు ఉంటాయని పద్మ ఎంతో చెప్పి చూసింది. ఆఖరికి తన భయమేమిటో చెప్పమని అడిగింది పద్మ.

“ఈ నల్లవాళ్లను నమ్మలేం.” ఒక్క మాటలో తేల్చేసింది రూప.

“అంత ఘోరంగా మాట్లాడకు. ఆమె ప్రవర్తన వల్లనో లేక ఆమె పిల్లవాడిని ఎప్పుడైనా ఎత్తుకెళ్లిపోతుందన్న భయమో ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ కేవలం నల్లజాతీయులని…”

“ఆపు ఇంక, వాళ్ల గురించి తెలుసుకొమ్మనీ, హిస్టరీ చదవమని చెప్తావు అంతే కదా.”

“అవును. ఇట్లాంటి ప్రిజుడిస్ పెట్టుకుని వాడిని ఎలా పెంచుతావు? నువ్వు మార్జినలైజ్ చేసినట్లు బాబు కూడా నల్లవాడే. నీ ప్రవర్తనతో తన మీద తనకే రెస్పెక్ట్ పెంచుకోవడానికి బాబు చాలా కష్టపడాల్సి వస్తుంది.”

“…”

“నువ్వు ఇలా ఆలోచించడం నాకు అర్థం కావట్లేదు. కులమతాలూ, ఫ్యామిలీ స్టేటస్ లూ దాటి నీ భాగస్వామిని ప్రేమించావు. అలాంటి నిన్ను చర్మం రంగు ఇలా కట్టిపడేసిందేమి?” బాధగా అడిగింది. ఇక అక్కడ ఉండలేక వచ్చేసింది పద్మ.

ఆ గొడవ తరువాత వాళ్ల మధ్య బాగా దూరం పెరిగింది కానీ అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లు. తల్లి మీద చూపించిన ప్రిజుడిస్ ను బాబుమీద పెట్టలేదు రూప. బాబు అల్లరి గురించీ, తెలివి గురించీ గొప్పలు చెప్పేది. కానీ తనను తక్కువ చేసి మాట్లాడిందని కోపం పెట్టుకున్నట్లుంది రూప. ఎప్పుడు మాట్లాడుకున్నా పద్మ ఒంటరితనం గురించీ, మాజీ భర్త గురించీ మాట్లాడుతుంది. సంవత్సరానికొకసారి మాట్లాడుకున్నా తనతో మాట్లాడిన తరువాత ఏదో చేదు మాత్ర మింగినట్లు కొన్ని రోజుల పాటు వికారంగా ఉంటుంది పద్మకు.

సెల్ ఫోన్ లో టైం చూసుకుంది. ఇంకో ఐదు నిమిషాల్లో కాల్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని ఒక క్షణం అనిపించింది. కానీ రూప ఎందుకు కాల్ చెయ్యబోతోందో పద్మకు తట్టింది. రూప పనిసేస్తున్న ఊర్లో ఆఫీస్ మూసేసి అక్కడ పని చేస్తున్నవాళ్లను పద్మ వాళ్ల ఆఫీసుకు బదిలీ అవాలని మేనేజ్మెంట్ చెప్పింది. రూప పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ను పూర్తిగా తీసేసి వేరె కంపెనీకి ఆ పని అప్పగిస్తున్నారు. రూప వేరే డిపార్ట్మెంట్ అయినా, ఉపయోగించే సాఫ్ట్వేర్ ఇద్దరిదీ ఒకటే. తన డిపార్ట్మెంట్ లో పని ఎలా ఉంటుందో కనుక్కోవడానికి కాల్ చేస్తోందని పద్మ గట్టి నమ్మకం.

అనుకున్న టైంకే కాల్ చేసింది రూప.

కాసేపు క్షేమసమాచారాలు తెలుసుకున్నాక, “సరే, అసలు విషయానికి రా. ఏంటి విషయం చాలా రోజులకు గుర్తొచ్చాను?” అడిగింది పద్మ.

“మన కంపెనీలో మార్పుల గురించి తెలుసు కదా. మీ డిపార్ట్ మెంట్లో పని ఎలా ఉంటుందో కనుక్కుందామని చేశాను. నువ్వైతే ఏం దాచుకోకుండా చెప్తావు. మిగతా వాళ్లతో కొంచెం కష్టం. వాళ్ల పని ఎత్తుకుపోతానేమో అన్నట్లు సగం సగం సమాచారం ఇస్తారు.”

“ఏం చెప్పాలో తెలీకపోవచ్చులే. నాక్కూడా తెలీదు. ట్రైనింగ్ మెటీరియల్ అంతా మన లర్నింగ్ వెబ్సైట్ లోనే ఉంటుంది. నీకు లింక్స్ పంపిస్తాను. ఎప్పుడైనా, ఏవైనా సందేహాలుంటే అడుగు, నాకు తెలిసిన మేరకు చెప్తాను.”

“థ్యాంక్యూ. ఏవైనా పుస్తకాలుంటే కూడా చెప్పు.”

“తప్పకుండా. నా దగ్గర ఉన్న పుస్తకాలు కంపెనీ మెయిల్ ద్వారా పంపిస్తాను.”

“యు ఆర్ గ్రేట్.”

“అఫ్ కోర్స్.”

ఇద్దరూ నవ్వారు. వాళ్ల మధ్య ఉన్న ఏదో గాజు పలక పగిలిపోయినట్లైంది.
“పాప ఎలా ఉంది?” హఠాత్తుగా అడిగింది రూప.

“బాగుంది. పెద్దదైంది. తన పనులు తాను చేసుకుంటుంది. రాత్రి నిద్రపోయేప్పుడు, పొద్దున్న లేవగానే మాత్రం కాసేపు అమ్మాపాప కబుర్లు ఉండాల్సిందే.”

“గుడ్. వాళ్ల నాన్నను ఎప్పుడైనా అడుగుతుందా?”

ఈ టాపిక్ ఇక్కడే ఆగితే బాగుండు అనుకుంటూ నిట్టూర్చింది పద్మ. “రెండు వారాలకొకసారి ఓ రెండు రోజులు వాళ్ల నాన్నతో గడుపుతుంది. రోజూ స్కైప్ చేస్తుంది. హ్యాపీగా ఉంది. ఇంతకీ మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? పియానో ఎలా సాగుతోంది?”

“బాగున్నాడు. నాన్న కూచి. ఎంతైనా పిల్లలకు తండ్రి ఉంటే బాగుంటుంది కదా. పాప వాళ్ల నాన్న…”

“బాబు పియానో ఎంతవరకు వచ్చింది చెప్పలేదు? తనకు చిన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం కదా. చేర్పించావా?”

“మ్. కరాటే లో ఉన్నాడు. బాబు సంగతి వదిలెయ్. బాగున్నాడు. నా దిగులంతా నీ గురించే.”

“నా గురించి ఏం దిగులు రూపమ్మా? నేను బాగోలేనని నీకు ఎవరు చెప్పారోయ్?”

“ఒక్కదానివే ఎలా ఉంటావు? రేపు పాప కాలేజీకి వెళ్లిపోయాక ఇక తన జీవితం తనది కదా. నువ్వు పిలిచినా తను రాకపోవచ్చు. ”

“…”

“నీ ఒంటరితనం తన మీద రుద్దలేవు కదా?”

“…”.

“ఒక్కదానివి ఎలా ఉంటావు పద్మా? ఎవర్నైనా చూసుకోవచ్చు కదా?”

“ఎవరన్నా ఎత్తి చూపితే గాని ఒక్కదాన్ని అన్న ఫీలింగ్ రాదు రూప.” గొంతులో చిరాకు దాచుకోలేకపోయింది పద్మ, “ఈ వారాంతంలోగా నీకు డిపార్ట్ మెంట్ ట్యుటోరియల్ లింక్స్ పంపిస్తాను. ఉండనా మరి?”

“ఆగాగు. ఈ మధ్య సుజయ్ అని ఒకతన్ని కలిసావట కదా…”

“అవును. నీకెలా తెలుసు?”

“తను మా పిన్ని కొడుకు. నీకు చెప్పేదాన్ని కదా. నీలాగే తనకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.”

“అవును. పుస్తకాలు కూడా బాగా చదువుతాడు. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఇంట్లో కలిశాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. గంటలు గంటలు. చాలా రోజుల తరువాత చాలా సంతోషంగా గడిచింది. కానీ ఎందుకో ఈ-మెయిల్ చేస్తే రిప్లై లేదు. పనిలో ఉన్నాడేమో డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని మళ్లీ ఈ-మెయిల్ చెయ్యలేదు.”

“నీకు కాస్త పిచ్చి పద్మ. సుజయ్ ని ఆ ఫ్రెండ్ ఇంటికి నేనే పంపించాను. నిన్ను పిలవమని ఆ ఫ్రెండ్ కీ చెప్పాను.”

“అలా ఎందుకు? డైరక్ట్ గా నన్నే కలవమని చెప్పొచ్చు కదా. మధ్యవర్తులు ఎందుకు?”

“ఐ వాంటెడ్ టు సెట్ యూ బోత్ అప్. తను తోడు కోసం చూస్తున్నాడు. నీగురించి తనకు చెప్పాను కానీ, నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను.“

“రూపా!” కరుకుగా అంది పద్మ, “అతను చూస్తున్నాడేమో. నేను చూడడం లేదు. ఎవరు పరిచయం అయితే వాళ్లు తోడుగా ఉంటారేమో అని వెదకడం లేదు. నీకు అర్థమవుతుందో లేదో అని చెప్తున్నాను. ఆ విషయంలో జోక్యం చేసుకోకు.”

“సర్లేవోయ్. గంటలు గంటలు సంతోషంగా గడిచిందని ఇప్పుడే అన్నావు?”

“ఎన్నో విషయాలు పంచుకోగల స్నేహితుడు పరిచయం అయ్యాడని సంతోషించాను. అతనూ అలాగే బిహేవ్ చేశాడు. నన్ను పరీక్షిస్తున్నాడని తెలుసుకోలేకపోయాను. నా ఈ-మెయిల్ కు రిప్లై ఇవ్వలేదంటే నేను పరీక్షలో ఫేలైనట్లుందే. గుడ్”

“పెద్ద గుండు సున్నా వచ్చింది నీకు. పాప గురించి ఎందుకు మాట్లాడావు? చివరికి పాప తప్ప నీకు వేరే లోకం లేదన్నట్లు మాట్లాడావని చెప్పాడు.”

పగలబడి నవ్వింది పద్మ.

“ఎందుకే అట్లా నవ్వుతున్నావు. చేసిన నిర్వాకం చాలక. పాప గురించి మాట్లాడకపోయుంటే ఎంత బాగుండేది. తనకు నువ్వు చాలా నచ్చావు. సరిగ్గా తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకున్నాడో నువ్వు అలా ఉన్నావని చెప్పాడు.”

“రూపా, రూపా. ఇంక అతని గురించి చెప్పకు. ఒక సాయంత్రం సంతోషంగా గడిపిన జ్ఞాపకాన్ని ఇంత చేదుగా మార్చకు.”

“పాప ఉండడం ఇష్టం లేదని కాదు. తనకు పిల్లలంటే ఇష్టమే.”

“….”

“అంత మంచివాడు మళ్లీ దొరకడు. నేను తనకు సర్ది చెప్తాను. ఈసారి కొంచెం పాప గురించి ఎక్కువ మాట్లాడకు, ప్లీజ్.”

“….”

“వింటున్నావా? అలా సైలెంట్ అయిపోతే మనం మాట్లాడుకునేదెలా?”

“మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పాలిటిక్స్, హిస్టరీ, అస్ట్రానమీ, ట్రావెలింగ్, శాంతీ స్వాతంత్ర్యాల కోసం జరిగిన పోరాటాలూ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పిల్లలూ, ప్రపంచం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడు తెలీలేదు గానీ, నీతో మాట్లాడుతుంటే ఇప్పుడు తెలుస్తోంది. ఆ అన్ని విషయాల కన్నా నా పాప గురించి మాట్లాడడమే నాకు అత్యంత ఇష్టం. నాతో స్నేహం చెయ్యడానికి కూడా పరీక్ష పెట్టే వాళ్ల కోసం నాకు అత్యంత ఇష్టమైన విషయం గురించి మాట్లాడకుండా నేను ఉండను.”

“మాట్లాడుకో, కానీ కొంచెం ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తరువాత. నాకోసం చెయ్యవే ప్లీజ్. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదు. నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు.”

“ఇదెక్కడి గొడవే రూపా. మరీ ఇంతలా చాదస్తమేమిటి నీకు? సరే నీ భయాన్ని తీసి గట్టున పెట్టు. నేను ఒంటరితనంతో బాధ పడట్లేదు. నేను, పాప కలిసి ఇంకెవరి అభిప్రాయాల్ని లెక్క చెయ్యకుండా మా బతుకులు మేం సంతోషంగా బతుకుతున్నాం. మా జీవితాల్లోకి వస్తే స్నేహాలూ, ప్రేమా వస్తే సంతోషమే గానీ, పరీక్షలు పెట్టే మీ సుజయులను మీ దగ్గరే ఉంచుకోండి. మాకు అక్కర్లేదు. వీ ఆర్నాట్ లుకింగ్!”

“అబ్బా, సరే తనకి చెప్తాను. నువ్వు స్నేహం మాత్రమే కోరుకుంటున్నావని. హి కన్ బి ఎ గుడ్ ఫ్రెండ్.”

మళ్లీ నవ్వొచ్చింది పద్మకు, “స్నేహానికి కూడా రెకమెండేషనా? ఈ-మెయిల్ కు రిప్లై ఇచ్చేంత రెస్పెక్ట్ కూడా లేదు. నా స్నేహాన్ని అతనికెందుకు ఇస్తాను? అన్ని పుస్తకాలు చదివి, అన్ని దేశాలు తిరిగి, అతను సంపాదించుకున్న బుద్ది ఇంత కుత్సితమైనదా?”

“అబ్బా అలా తిట్టకు. పాపం తన తప్పు లేదు. నిన్ను కలవమని పంపింది నేనే కదా. నన్ను తిట్టు. ”

విసుగ్గా అనిపించింది పద్మకు. కొన్ని బంధాలంతే. ఒకచోట దాకే మనగలుగుతాయి. జీవితంలో డక్కామొక్కీలు తిన్న తరువాత, కొన్ని స్నేహాలను ఒదులుకోవలసిందే అని నిర్ణయానికి వచ్చింది పద్మ. మనుషుల్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. కానీ కొంతమంది తమ జీవితాల్నే కాక పక్క వారి జీవితాల్నీ జీవించెయ్యాలని ప్రయత్నిస్తారు.

“సారీ రూపా. మళ్లీ మాట్లాడ్తాను. నేనిక వెళ్లాలి.”

“సరే, సరేనే పెద్దమ్మా! బాబు గురించిన ఒక్క మంచి విషయం విని వెళ్లు.”

“చెప్పు.”

“బాబు కన్నతల్లి బార్బరా గుర్తుందా?”

“బాగా గుర్తుంది. ఎప్పుడైనా దిగులేసినప్పుడు నన్ను ఇన్స్పయర్ చేసే వ్యక్తుల్లో తన గ్నాపకం ఒకటి. ఎలా ఉందో పాపం.”

“బాగుంది. పెళ్లి చేసుకుంటోంది. రిజిస్టర్ మ్యారేజ్. చాలా కొద్దిమందిని మాత్రమే పిలుస్తోంది. నిన్ను పిలవమంది.”

“నన్నా?” ఆశ్చర్యంగా అడిగింది పద్మ.

“మ్.. నిన్నే. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అంతకంటే తనకు ఎక్కువ ఇష్టం.”

“నాకు ఏమీ అర్థం కావట్లేదు. తనకు నేనెలా తెలుసు? నీకు తను అంత క్లోజ్ గా ఎలా తెలుసు?”

“తనను బాబు దగ్గరికి రానివ్వకుండా చేశానని కోప్పడి వెళ్లిపోయావు కదా. నేను చాలా ఆలోచించాను. చాలా సంవత్సరాలే ఆలోచించాను. పోయిన ఏడాదే బాబును ఒక ఆర్ట్ ఎక్సిబిషన్ కు తీసుకెళ్లాను. అంత మంది జనంలో ఎవరో మమ్మల్నే గమనిస్తున్నారని అనిపించింది. చూస్తే బార్బార. దూరం నుంచే బాబును చూస్తోంది. ఎందుకో ప్రాణం కలుక్కుమంది. ఆ క్షణంలో నువ్వు నాపక్కనే ఉండి, నన్ను తనవైపుకు తోస్తున్నట్లు అనిపించింది. నేను తన పట్ల చేసినదానికి ఎంత కోప్పడుతుందో అనుకున్నాను. ఆ కోపంలో నన్నేమన్నా చేస్తుందేమోనని కూడా భయంవేసింది. అయినా దగ్గరికి వెళ్లాను. నేనలా వెళ్లడం ఆమెకు కూడా ఆశ్చర్యంగా అనిపించినట్లుంది. ‘బాగున్నారా?’ అంటూ మెల్లగా అడిగింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె చేతులు పట్టుకున్నాను. అంతే నన్ను హగ్ చేసుకుంది. మరీ అంత క్షమాగుణమా పద్మా. నాకు ఏడుపు ఆగలేదు. తనే ఓదార్చింది. రిస్ట్రైనింగ్ ఆర్డర్ వెనక్కి తీసుకుంటాననీ, తనకు ఇష్టమైతే బాబును చూడడానికి ఎప్పుడైనా రావచ్చనీ చెప్పాను. నా చేతులు గట్టిగా పట్టుకుని కూర్చుంది. తన గుండెని నా చేతుల్లో పెట్టినట్లు అనిపించింది పద్మా. అక్కడే తన బాయ్ ఫ్రెండ్ ఎరిక్ ను పరిచయం చేసింది. నాలో ఆ మార్పు ఏమిటని అతనే అడిగాడు. నువ్వు వెళ్లిపోతూ అన్నమాట గురించి చెప్పాను. నువ్వు అలా అనకపోయి ఉంటే నాలో మార్పు వచ్చేది కాదని చెప్పాను. అప్పట్నుంచి నిన్ను కలవాలని అడుగుతూనే ఉంది. అప్పుడే ఈ సుజయ్ సీన్ లోకి వచ్చాడు. కొంచెం ఓవర్గా, సినిమాటిక్ గా ఆలోచించి మీ ఇద్దర్నీ కలపి, ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి బార్బరా గురించి కూడా నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నా.”

“రూపా. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నిజ్జంగా ఊపిరాడట్లేదు. పెళ్లెప్పుడు?”

“వచ్చే నెల మొదటి శుక్రవారం పొద్దున పదిన్నరకు అపాయింట్మెంట్.”

“సరే. పాప ఒకరోజు బడి ఎగ్గొట్టేస్తే ఏం కాదులే. ఇద్దరం వస్తాం.”

“ఆ వీకెండ్ మా దగ్గర ఉండరాదూ? సుజయ్ ని కూడా పిలుస్తాను. ఇద్దరికీ సెకండ్ ఛాన్స్ ఇచ్చుకున్నట్లు ఉంటుంది కదా?”

“లేదు రూపా. ఇది సెకండ్ ఛాన్స్ లు ఇచ్చుకునే స్నేహం కాదు. నా స్నేహానికి గానీ, పాప పట్ల నాకున్న ప్రేమకు గానీ అతను గౌరవం ఇవ్వలేదు.”

“మీ అభిప్రాయాలు అంతలా కలిశాయి. నీకు పాప ఉన్న ఒక్క తేడా తప్పితే, మీ జీవితాలతో ఏం చెయ్యాలనుకుంటున్నారో అదీ ఒకటే. కొంచెం ఇగోని పక్కన పెట్టి ఆలోచించు.”

“ఇందులో ఇగో ప్రసక్తి అనవసరం. డివోర్స్ తరువాత ఒకచోట కుదురుకోవడానికి నేనూ పాపా కష్టపడ్డాం. నాకూ, వాళ్ల నాన్నకు మధ్య ఉన్న దూరంలో మా ఇద్దరి పట్ల తనకున్న సంబంధంలో పాప కుదురుకున్నది. ఆ తరువాత వచ్చిన ఎంతో ఎమోషనల్ డిస్ట్రెస్ తరువాత మేం ఇలా సెటిల్ అయ్యాం. ఇప్పుడు తనను డిస్టర్బ్ చెయ్యడం నాకు ఇష్టం లేదు.”

“పాప కోసం నీ జీవితాన్ని త్యాగం చెయ్యక్కర్లేదు పద్మా. చిన్నపిల్ల, తనకు కావలసిన అటెన్షన్ ఇస్తే త్వరగానే అడ్జస్ట్ అవుతుంది.”

“మా చిన్న జీవితాలకు ఏవేవో ట్యాగులు అతికించేస్తున్నావే రూపా. పాప కోసం నేనేమీ త్యాగం చెయ్యట్లేదు. నాకోసం తను త్యాగం చేస్తుందేమోనని ఎప్పుడన్నా అనిపిస్తుంది. కానీ అతనితో ఉన్నప్పుడు మా మధ్య ఉన్న టెన్షన్ పాప మీద రిఫ్లెక్ట్ అయ్యేది. ఆ సంబంధం నన్నెలాగూ కుంగదీస్తోంది, పాప ఎదుగుదల మీద కూడ ప్రభావం చూపించేసరికి డివోర్స్ కు అప్లై చేశాను. ఇప్పుడు నాకు ఇష్టమైన ఎన్నో పనులు చేసుకోగలుగుతున్నాను, పాపకు ఇష్టమైన యాక్టివిటీస్ లో పెట్టగలిగాను. జీవితం పట్ల బాధ్యత తెలుసుకుంటున్న తనను చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో. పాపతో నా జీవితాన్ని చాలా ఇష్టపడుతున్నాను రూపా. అయితే నాకంటూ వేరే జీవితం ఉంది. ఎస్, నా దిగుళ్లూ, భయాలు నాకు ఉన్నాయి.”

“అదే అంటున్నా. అవేవీ లేకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా?”

“అప్పుడప్పుడు నాలో నేను ముడుచుకోవడానికి కూడా స్పేస్ లేదన్నది కూడా విడాకులు తీసుకోవడానికి ఒక కారణం. నా మనసిక పరిస్థితిని కప్పిపెట్టి ఎప్పుడూ నవ్వుతూనో, లేకపోతే కొట్లాడుతునో ఉండక్కర్లేదు.. నా స్నేహాలూ, నా కలలూ, నా ప్రయాణాలూ – ఇలా నాకు నేను ఒక్కదాన్నే చేసుకునేవి ఉన్నాయి. నాకు తోడు ఎవరూ లేరనీ, ఒక్కదాన్నే చేసుకోవాలనీ నాకు నేను సర్ది చెప్పుకుని ఇలాంటి మానసిక స్థితికి చేరుకోలేదు. నా కంటూ స్పేస్ ఉండడం నాకు ఇష్టం. కొండలూ గుట్టల మధ్య తిరగడం ఇష్టం. ఇంకో ఐదారేళ్లల్లో నా చిన్నారికి రెక్కలొచ్చి ఎగిరిపోతుందని కూడా తెలుసు. తన రెక్కల్ని కట్టేసి నా చుట్టే తిప్పుకోవాలనో, లేక నా రెక్కల్ని కట్టేసుకుని తన చుట్టే తిరగాలనో నాకు లేదు. జీవితం ఎదురొచ్చి ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు తనకోసం నేను ఉంటాను, తను ఉండాలని నేను ఆశించుకోవడం లేదు. చెప్పొచ్చేదేమంటే, వి ఆర్ సెటిల్డ్. మా జీవితాల్లోకి అంతే సాఫీగా రాదల్చుకున్న వాళ్లతో స్నేహం చెయ్యడానికి నాకు ఏ ఇబ్బందీ లేదు. ఆ స్నేహం జీవితాంతం దాకా కలిసి ఉండే రిలేషన్షిప్ కు దారి తీస్తే దాన్ని అడ్డుకోవాలనీ లేదు. అయితే దాని కోసం వెతకనూ, ఆశించుకోనూ, నా ఆత్మాభిమానాన్నీ వదులుకోను.”

“సరే. తన ప్రసక్తి ఇక తీసుకురాను. ప్రామిస్. ఇలాంటి పిచ్చి పనులు మళ్లీ చెయ్యను. మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు. మీ ఇద్దరితో ఓ రెండురోజులన్నా గడపాలని ఉంది. మీరైతే వీకెండ్ మాతో ఉండండి.”

“సరే. ఆదివారం వెనక్కి వచ్చేస్తాం.”

“ఓకే. శనివారంరోజు పొద్దున ఇంటిద్దర ఆర్ట్ సెంటర్లో బ్లాక్ లైవ్స్ మాటర్స్ వాళ్లది పొయెట్రీ రీడింగ్ ఈవెంట్ ఉంది. అక్కడికి తప్పకుండా వెళ్దాం. బార్బరా తను రాసిన ఒక కవిత చదువుతోంది. చాలా బాగా రాస్తుంది తను.”

“భలే! అమేజింగ్ పర్సన్ తను. తన గురించి చెప్తుంటే నీ గొంతులో గర్వం. వింటుంటే ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేను. మన కొత్తస్నేహం రోజులు గుర్తొస్తున్నాయి.”

“అదే నువ్వు, అదే నేను. మధ్యలో తలలోని కొంచెం తుప్పు విదిల్చుకోవడాలు. సరెసరే మరి.. తొందరగా వచ్చెయ్. బై బై మై బటర్ ఫ్లై”

“బై బై మై డ్రాగన్ ఫ్లై”. పాత పిలుపులతో బై చెప్పుకున్నాక గుండెనిండా నవ్వుతూ ఫోన్ పెట్టేసింది పద్మ. పాత కొత్త స్నేహితురాల్లను కలుసుకోబోతున్న ఉత్సాహంతో ఆఫీసులోకి అడుగుపెట్టింది.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

One thought on “బ్లాక్ ఆండ్ వైట్

  1. మీ కథ సందేశ్మకంగా ఉంది. హృదయపూర్వక అభినందనలు

Leave a Reply