కాదల్ – ది కోర్

“యిదంతా నేను నా వొక్క దాని కోసమే చేశాననుకుంటున్నావా యేoటి? నీ కోసం కూడా కదా? యెన్నాళ్ళు నువ్విలా రహస్యంగా నీ బంధంలో వుంటావు” – ఓమన. ‘కాదల్ – ది కోర్’లో. సినిమాని చూస్తున్నవాళ్ళు ఆలోచనలో పడతారు.

సమాజం యెన్నో విషయాల్లో ముందుకెళ్ళింది. కానీ భిన్న అస్తిత్వాలకి కొన్ని సర్కిల్స్ లో ఆమోదం వున్నా, చట్టంలో కొన్ని మార్పులు వచ్చినా వారి చుట్టూ వున్న ప్రపంచంతో వారికి నిత్యం ఘర్షణే. ఆమోదం వుండదు. పైపైకి మర్యాద కోసం పలకరించినా లోలోపల విసుగు… అసహ్యపు అమర్యాద.

వో స్త్రీల కాన్ఫెరెన్స్ లో తమ లైంగికత్వాన్ని చెప్పుకొని, విషయాల్ని చర్చకు పెట్టినప్పుడు ఆ ప్రాంగణం ఆమోదించేవారు, ఆమోదించని వారితో రెండుగా చీలిపోయిన సంఘటన జరిగి యిప్పటికి దాదాపు ముప్పై యేళ్ళు. యిప్పుడు సంఘీభావంగా అందరూ వొక్కటై మాటాడగలుగుతున్నారు. యిది సంతోష ఆశ్చర్యజనకమే కదా. అలానే వొకప్పుడు భిన్న లైంగికతని సామ్రాజ్యవాద కుట్రా అన్నవాళ్ళు యిప్పుడు తామే నడుం బిగించి సంఘీభావంగా ముందుకు దూకుతున్నారు. యిది గొప్ప మార్పు.

ఫిలడల్ఫియా, Brokeback Mountain, ఆస్కార్ వచ్చిన మూన్ లైట్ యిలా యెన్నో సినిమాలు హాలీవుడ్ లో LGBTQ అంశం మీద వచ్చాయి. అలాగే బాలీవుడ్ లో యీ విషయం మీద సినిమాల్ని తీస్తున్నారు. వెబ్ సీరీస్ లోనూ ప్రధాన పాత్రల చుట్టూ వున్న ముఖ్య పాత్రలు భిన్న అస్తిత్వాలతో వుంటున్నాయి.

పోయిన వారం నందిని జెయస్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘యిన్స్పెక్టర్ రిషి’ లోని వో యిన్స్పెక్టర్ చిత్ర లెస్బియన్. చిత్రా కొలీగ్, స్నేహితుడు అయ్యనార్ కి ఆమె లెస్బియన్ అని తెలిసిన క్షణంలో ఆమె కళ్ళలోకి చూడటానికి యిబ్బంది పడుతుంటాడు. కొద్ది సంభాషణ తరువాత “నేనో ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. యిదంతా అర్ధం చేసుకోడానికి, ఆమోదించడానికి కొంత సమయం పడుతుంది నాకు” అంటారు యిన్స్పెక్టర్ అయ్యనార్. మెల్లగా అయ్యనార్ ఆమెతో మునుపటిలానే స్నేహంగా వుంటారు. ఆ సీరీస్ లోనే వో చిన్ని పల్లెలో మరో అమ్మాయి లెస్బియన్. కుటుంబం ఆమెని ఆమోదించలేకపోతుంది. యిలా విజువల్ మీడియా
భిన్నఅస్తిత్వాల పట్ల సెన్సిటివ్ గా సెన్సిబుల్ గా ప్రేక్షకుల్లో చక్కని అవగాహనకి దారులు వేస్తున్నారు. యిందులో తెలుగు సినిమా, వెబ్ సీరీస్ లేవని ప్రత్వేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

యిద్దరమ్మాయిల మధ్యనున్న లైంగిక సంబంధం మీద 1996 లో దీపా మెహత “ఫైర్” వచ్చినప్పుడు బోలెడంత గొడవ జరిగింది. ఆ సినిమాలో మరిన్ని అంశాలూ వున్నాయి. యీ మధ్యనే జో బేబీ గారి దర్సకత్వం లో వచ్చిన ‘కాదల్ – ది కోర్’ గే రిలేషన్ షిప్ మీద. యీ సినిమాని ప్రేక్షకులు స్వాగతించారు.

వో చిన్ని పల్లెలో వో చక్కని యిల్లు. మాథ్యూ, ఓమన, వారిద్దరి కూతురు, మాథ్యూ తండ్రి ఆ యింట్లో వుంటారు. ఆ యేడాది లోకల్ యెలక్షన్స్ లో మాథ్యూ ని పోటీలో నిలబెడుతుంది పార్టీ. మాథ్యూ ని పార్టీ యెన్నికల్లో నిలబెడటానికి రెండు నెలల ముందే ఓమన, తన భర్త మాథ్యూ హోమోసెక్సువల్ అని, తనకు విడాకులు కావాలని కోర్టు కి వెళ్ళిన విషయం మాథ్యూకి యీ సమయంలో తెలుస్తుంది. యెలక్షన్స్ కి ముందే యీ కేస్ క్లియర్ అయిపోవాలని కోర్ట్ లో యీ కేస్ ని ముందుకు జరుపించమని మాథ్యూ తన లాయర్ గారికి చెపుతారు.

మాథ్యూ, ఓమన వొకే యింట్లో వుంటూనే, యిద్దరూ కోర్ట్ కి కలిసి వెళ్లి యింటికి తిరిగి కలిసే వస్తుంటారు. కోర్ట్ బోనులో ఓమన మొదటి సారి నిల్చోబోయేటపుడు హాండ్ బాగ్ తో బోన్ లోకి వెళ్లకూడదని కోర్ట్ అభ్యంతరం చెపుతుంది. అప్పుడు ఆ బాగ్ ని బోన్ పక్కనే నిలబడి వున్న మాథ్యూ అందుకుంటారు. ఆమె మాట్లాడటం అయ్యే వరకూ ఆ బాగ్ ని పట్టుకొని వుంటారు. వారిద్దరి స్నేహబంధంలో అంతటి సహృదయత వుంటుంది. అంతటి మెచ్యురిటీ వున్నమాథ్యూ తను హోమో సెక్సువల్ కాదని, తనకసలు అలాంటి అవగాహనే లేదనీ చెప్తారు కోర్టులో. యెంత మెచ్యురిటీ వున్న వ్యక్తిత్వం వున్న వారినైనా కుటుంబ, సమాజ భయాలు వెంటాడతాయి.

ఓమన మాత్రం తనని తాను నిలబెట్టుకుంటూ అతన్ని నిలబెట్టటానికి ప్రత్నిస్తూ యీ యిరవై యేళ్ళలో నాలుగు సార్లు మాత్రమే శారీరకంగా కలిసామని కోర్ట్ లో చెపుతారు ఓమన. తనే సంతానం కావాలని మాథ్యూ ని అడిగానని, అలా తమకి కూతురు పుట్టిందని చెపుతారు ఓమన. యిక తన వల్ల కాదనీ విడాకులిప్పించమని కోర్టుకి చెపుతారు ఓమనా.

యిన్నేళ్ళూ ఓమన విడాకులు అడగకపోవటానికి కారణమేమై వుంటుంది? అప్పటి వరకూ మాథ్యూ లైంగికతను చట్టం అసహజంగానూ, నేరపూరితంగానూ చూసింది. అందుకే ఓమనా విడాకులు అడిగితే మాథ్యూ లైంగికతకు శిక్షార్హుడవుతారు. తాను యిబ్బంది పడినా మాథ్యూ శిక్ష విధించవలసిన నేరం యేదో చేస్తున్నాడని ఓమనా అనుకోలేదు. ఓమనా విడాకులు అడగక పోవటంలో యెంత సహృదయత వుందో విడాకులు కావాలి అని అడగటంలోనూ అంతే సహృదయత వుంది. ఆమె ధ్యేయం తమ విముక్తి. అతన్నిశిక్షించటం కాదు. చట్టం గేలకి వ్యతిరేకం కాకపోవటంతో తమందరి మధ్యా వున్న యిరుకుని తొలగించాలనుకుంటారు ఓమన. అతని పట్ల ఆమెకి పూర్తి గౌరవం వుంది.వాళ్ళిద్దరూ వొకరిపట్ల వొకరు సెన్సిబుల్ గా వుంటారు.

యిరవై యేళ్ళ పాటు మరో పురుషుడితో మాథ్యూకి వున్నరహస్య సంబంధాన్ని గౌరవిస్తూ ఓమన మౌనంగా వుంటారు. తన ఫిజికల్ నీడ్స్ తీరకపోవటం మీద ఆమె కంప్లైంట్ చెయ్యరు. వొకే యింట్లో యిరవై యేళ్ళు కలిసి వున్నారు. యిప్పుడు ఆ బంధం నుంచి బయటపడటానికి ఆమె చేస్తున్న ప్రయత్నం ఆమెకి దుఖం కలిగిస్తుంది. అతనూ దుఖ పడతాడు. వోరోజు యిద్దరూ కన్నీటివరదలవుతారు.

పంచాయితీ యెన్నికల్లో అతను పోటీ చేస్తున్న సమయంలో యీ కేసు బయటికి వస్తుంది. అయినా పార్టీ మాథ్యూ ని అభ్యర్థి గానే వుంచుతుంది. యెదుటి పార్టీ వాళ్ళు కాస్త చులకన గా మాట్లాడతారు.
యెవరూ అతన్ని పెద్దగా గేలి చేయరు. బంధువుల్లో, స్నేహితుల్లో కూడా యెవరూ యేమీ అనరు. టీనేజ్ కూతురు నాన్నని, అమ్మనూ అర్థం చేసుకుంటుంది. మాథ్యూ తండ్రికి కోడలు అడుగుతున్నదాంట్లో న్యాయముందని అర్ధమవుతుంది.

మాథ్యూ గే అయి ఓమనాని పెళ్ళి చేసుకోవటం వల్ల కలిగిన మానసిక సంఘర్షణలో నలుగుతున్నది వారిద్దరే కాదు. వారిద్దరి కుటుంబాలు కూడా. మామగారు యివన్నీ ఆలోచించి కోడలు విడాకులు కోరటం న్యాయమేననుకుంటారు.
మరోవైపు యీ విషయం బయటకి రావటంతో మాథ్యూ పార్టనర్ Thankan తోబుట్టువు, మేనల్లుడూ చికాకులు పడుతుంటారు. డ్రైవింగ్ నేర్పించటం అతని వృత్తి. తను గే అని తెలిసాక పెద్దవాళ్ళు డైవింగ్ నేర్చుకోవటానికి యెక్కువగా అమ్మాయిలనే పంపుతున్నారని Thankan చెపుతారోసారి. యీ కేసు వల్ల వీరి విషయం బయటకి పొక్కటంతో అతను కొన్ని బాడ్ టేస్ట్ జోక్స్ ని యెదురుకుంటారు.

“యిదంతా నేను నా ఒక్క దాని కోసమే చేశాననుకుంటున్నావా యేoటి? నీ కోసం కూడా కదా? యెన్నాళ్ళు నువ్విలా రహస్యంగా నీ బంధంలో వుంటావు” – ఓమన.
యిది అసలు విముక్తి. అప్రసడ్ రిలేషన్ షిప్ వున్న సందర్భంలో వొకళ్ళకే విముక్తి అన్నది యెప్పుడూ వుండదు. యెవరికి విముక్తి అంటే యిద్దరికీ అని తెల్సిపోతుంది.

‘కాదల్ – ది కోర్’ వో చిన్నివూరు. ఆ సమాజంలోనూ, కుటుంబంలోనూ యీ పరిస్థితి యెలా వుంటుందో చెప్పటంలో వో లోచూపు వుంది. ప్రతీ పాత్రకీ ఆంతగంగిక జీవనం వుంటుందనే జ్ఞానం వుంది. ప్రతి పాత్రకీ సన్నివేశానికీ చరిత్ర వుంటుందనే అవగాహనా వుంది. ప్రేక్షకునికి మెదడుని వుపయోగించి ఆలోచించడానికి అవకాశం యివ్వాలనే యెరుక వుంది. బుర్రని వుపయోగించే అవకాశం వుండకపొతే ఆ కళకి డెప్త్ వుండదనే చూపూ వుంది. యీ సినిమాలో పాత్రల నడుమ వున్న మౌనం, నిశ్శబ్దం, చూపులు ఆ పాత్రలన్నీ ఆలోచిస్తున్నాయని వాళ్ళకో ఆంతరంగిక జీవనం వుందని తెలుస్తుంటుంది. ప్రతి సీను దర్శకునికి ప్రేక్షకుల మీదున్న నమ్మకం, గౌరవం కనిపిస్తుండటంతో డైరెక్టర్ మీద బోలెడంత గౌరవం కలుగుతుంది. లోతుగా హృద్యంగా మలిచారు ప్రతీ పాత్రనీ. సన్నివేశాన్ని. ఘర్షణని.

సమాజం ఆమోదం లేని తమ అస్తిత్వాన్ని వొప్పుకోడానికి చుట్టూ వున్న పరిస్థితుల వల్ల చాల మందికి ధైర్యం వుండదు. చిన్నవూర్లలో మరీ కష్టం. వెలిని తట్టుకోవటం యేమంత తేలిక కాదు. యీ సోషల్ స్టిగ్మా మీద తీసిన ‘కాదల్ – ది కోర్’ లో లైంగికతని దాచి జీవించటంలోని యిరుకుని కుదురుగా సంభాషించుకునే వోపిక, వొకరినొకరు వినే సహనాన్ని యీ పాత్రల మధ్య చూస్తాం. యెక్కడా వోవర్ టోన్స్ వుండవు.

భిన్నలైంగికతలని అర్ధం చేసుకోవటానికి సమాజంలో వున్న టూల్స్ యేమిటి? వీటిని విధ్యలో, సాహిత్యంలోనూ, సినిమాల్లో, సంస్కృతిలోనూ యిలా ప్రతీ చోట సభ్య సమాజంలో భాగం చెయ్యటం అత్యంత అవసరం. ప్రజాహితం కోరే క్రియేటర్స్ కొంతమంది యీ విషయాలపై సినిమాలు తీస్తున్నారు. పంటి బిగువున బిగపట్టి తమ లైంగికత్వంని దాచి పెట్టాల్సిన పరిస్థితి సమాజంలో వుండకూడదు.

లైంగికత మీద యేళ్ళుగా మాటాడుతున్నా యీ విషయం మీద స్పష్టమైన అవగాహనున్నవాళ్ళ కంటే లేనివవాళ్ళే యెక్కువ. అవగాహన లేమితో గేలి చేసేవాళ్ళు అధికం. మన కోసం మనం లైంగికతను పూర్తిగా సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాలి. రిజిడ్ గా వుండే సామాజిక బంధాలు జీవవంతంగా వుండాలంటే వ్యక్తికీ సంఘానికీ మధ్య వున్నగోడల్ని ప్రజాస్వామికంగా కూల్చటం యెలానో ‘కాదల్ – ది కోర్’ చూస్తే అర్ధమవుతుంది. ఆ పనిని యెంతో కళాత్మకంగా సున్నితంగా సమాజానికి అందించిన సినిమా ‘కాదల్ – ది కోర్’.

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

3 thoughts on “కాదల్ – ది కోర్

Leave a Reply