అగ్రహారంలో అలజడి రాగం

వితంతు వివాహాలకు, స్త్రీవిద్యకు సమర్థనగా సంఘ సంస్కరణల తొలిరోజుల్లో వీరేశలింగం పంతులు చేసిన వాదనలను ఇప్పుడు చదువుతుంటే ఉత్తి చాదస్తంగా తోస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే స్త్రీస్వేచ్ఛ, నిర్ణయాధికారం, విముక్తి …ఇలాంటి మాటలేమీ అక్కడ కనబడవు.

వేదాల్లో, సనాతన ధర్మశాస్త్రాల్లో వితంతు పునర్వివాహం ఆమోదనీయమేనని, ఆడవాళ్ళను చదువుకోనిస్తే కుటుంబాలను మరింత చక్కగా దిద్దుకునే నూతన పతివ్రతలుగా తయారవుతారనీ సంప్రదాయ బ్రాహ్మణ సమాజాన్ని కన్విన్స్ చేసేందుకు ఆయన చాలా ప్రయాస పడ్డాడు.

ఆ సర్దుబాటు వ్యవహారం గురజాడకూ, చలానికీ చిరాకు పుట్టించింది. సంస్కర్తలు నడిపే బాలికా విద్యాలయాలు “రోజుకు మూడు డోసుల పాతివ్రత్యాన్ని” బోధించేవని గురజాడ వెటకరించాడు. వితంతువులకు పెళ్ళిళ్ళు చెయ్యటమే పనిగా పెట్టుకుని దొరికిన దౌర్భాగ్యుడికల్లా ఇచ్చి చేశాడని చలం తప్పుపట్టాడు. మరి అప్పారావుగారి కమలిని మాత్రం, ‘డాన్సింగర్ల్స్’ మోజులో పడిన భర్తను వదిలేసి పోయిందా… పోతానని ఉత్తుత్తిగా బెదిరించి ఇల్లు నిలబెట్టుకుందిగానీ!

ఇక, చలంలోని రెబెల్ ఎలా మొదలయ్యాడు? వరసకాని అమ్మాయిని పెళ్ళాడటానికి శంకరాచార్యుల అనుమతి కోరిన పధ్ధతైన బాల్యకాల పోరాటం సంగతి సరే- లోకాన్నంతా సృష్టించిన వాడివి, లోకవిరుద్ధమైన మనుషుల సృష్టికి మాత్రం బాధ్యత పడవా? అంటూ బ్రహ్మసమాజపు ఏకేశ్వరుడితో ఎన్ని పంచాయితీలు? ఈ లాజిక్ చలాన్ని సులభంగా వదిలినట్టు లేదు. లేకపోతే, అన్ని గోడలనూ పగలగొట్టి స్వేచ్ఛా మైదానంలోకి అడుగుపెట్టిన రాజేశ్వరికి, అదొక “పుణ్యభూమివలె,” “ఈశ్వరుడికి మంగళ హారతి వలె” తోచటమేమిటి ? “నేను మీ పతివ్రతలకు తీసిపోతానా?” అంటూ పోలిక ఏమిటి?

ఇవన్నీ కాస్త పాతబడిన సంగతులే కానీ, కొండేపూడి నిర్మల “బొట్టు” కవిత నిన్నటిదే! దాన్నిరాసినందుకు బూతులు తిడుతున్న వాళ్ళతో, “నేనూ హిందూ స్త్రీనే. కానీ ఈ బొట్టు చుట్టూ నా మతం అల్లిన రాజకీయాలు అన్యాయం,” అని కదా ఆమె వాదించింది? నిర్మల బొట్టును విమర్శించినా, తస్లీమా నస్రీన్ నుదుటిపై బొట్టు పెట్టుకున్నా తమ మతాల రాజకీయాలపై ప్రతీకాత్మక నిరసనలే కదా?

ఇవాళ టి. ఎం.కృష్ణ అనే ఈ కర్ణాటక సంగీత విద్వాంసుడు కోరుతున్నది కూడా తన మతంలో, తాను స్థిరపడిన సంగీత ప్రపంచంలో కొన్ని సంస్కరణలే. తాను తన్మయత్వంతో గానం చేసే త్యాగరాజ కీర్తనలు చిత్రించిన రాముడిని, తన మతం దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించాడు. వివిధ కులాల వృత్తి నిపుణులు, కళాకారులూ కలిసి సృష్టించిన ఈ సామూహిక కళపై తన కులం పెత్తనం చెలాయించడం అన్యాయమన్నాడు. ఈ సంగీతాన్ని, అందులోని భక్తి భావాన్నీ ఆరాధిస్తున్నామని చెప్పుకునే సమూహాలు మతం పేరిట, దైవం పేరిట అమలవుతున్న అన్యాయాలను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించాడు. కృష్ణ మీద విమర్శల దాడి చేస్తున్న వాళ్ళు అంటున్నట్టుగా ఆయన రాముడిని, భక్త కవులను దూషించలేదు. మతాన్ని నిరాకరించలేదు. వాళ్ళు చెబుతున్నట్లుగా అతడు కమ్యూనిస్టు కాదుకదా, ద్రవిడ ఉద్యమకారుల వలె తీవ్ర నాస్తికవాదిగా కూడా తోచడు. ఒకరకంగా చెప్పాలంటే, గాంధీలోని మతసహనం , ఉదారవాద దృక్పథం ఛాయలే ఎక్కువ.

*

పైన చెప్పుకున్న ఉదాహరణలు అన్నిటిలోనూ ఒక సామ్యం ఉన్నది. కరడుగట్టిన ఆధిపత్య వ్యవస్థలలో మార్పులను కోరుకుని, వాటిని ప్రశ్నించిన వ్యక్తులు వాళ్ళందరూ. అయితే వాళ్ళు వాటికి వెలుపలి మనుషులు కాదు. ఆ కులమో, మతమో, కుటుంబమో… ఆ నిర్మాణాలతో భౌతికంగానో, భావాల ద్వారానో భాగంగా ఉన్నలోపలి మనుషులు. ఈ ఆధిపత్య వ్యవస్థల వల్ల పీడితులైన వాళ్ళు చేసే తిరుగుబాట్లవలె ఇవి తీవ్రధ్వనితో నినదించవు. సమూల విధ్వంసానికి పూనుకోవు. పీడితులు అడుగుతున్న ప్రశ్నల వెలుగులో తాము అనుభవిస్తున్న ఆధిపత్యాల గురించి సెన్సిటైజ్ అవుతూ స్వచ్ఛందంగా వారితో గొంతు కలుపుతున్న పోరాటాలు వీరివి. నిజానికి ఇవి వాళ్లకు తక్షణ జీవితావసరాలు కావు. అమానవీయమైన ఆధిపత్యాలనుండి తమను తాము విముక్తి చేసుకునే సాధనాలు. కొన్ని సైద్ధాంతిక దృక్పథాలో, వైయక్తిక జీవితానుభవాలో వారికి ఈ ప్రేరణను ఇస్తాయి.

ఈ లోపలి మనుషుల పోరాటాలు ఒక విధంగా సంక్లిష్టమైవి కూడా! వీళ్ళను వెలుపలి వాళ్ళు అనుమానంతో, లోపలివాళ్లు ఆగ్రహంతో చూస్తారు. సొంత సమూహంలో ఒంటరులుగా, అవుట్ సైడర్స్ గా నిలబడేందుకు సిద్ధపడాలి. ఆ ప్రాసెస్ లో కొన్ని పరిమితులు, సర్దుబాటు ప్రయత్నాలు, వైరుధ్యాలు ఏర్పడవచ్చు కూడా. ఐనప్పటికీ ఆధిపత్య నిర్మాణాల లోపలి వాతావరణాన్ని శుభ్రపరచడంలోనూ, వెలుపలి పోరాటాలకు సహానుభూతిని కూడగట్టటంలోనూ వీరి పాత్ర విలువైనదే. సొంత వ్యవస్థలు వీళ్ళను ద్రోహులుగా చూస్తాయేతప్ప క్షమించవు. బయటి ప్రపంచానికి చిన్న విషయాలుగా కనబడే ఈ సంస్కరణ ప్రయత్నాలకు కూడా లోపలి వ్యవస్థల నుండి తీవ్రమైన దాడులను ఎదుర్కొన్న వాళ్ళే వీళ్ళందరూ.

*

టి.ఎం. కృష్ణ మీద మొదటి దాడి అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాహ్మణీయ సమాజం నుండి, కర్ణాటక సంగీత సమూహం నుండి జరగటాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతడు దళిత, హిందూయేతర మతాల సాహిత్యాన్ని గానం చెయ్యటం వాళ్లకు ఆగ్రహ కారణమైంది. స్థిరపడిన మూసలను దాటి సంగీతంలో ప్రయోగాలు చెయ్యటం అపచారంగా కనబడింది.

నిజానికి ఈ పనులు చెయ్యటం కృష్ణతో ప్రారంభం కాలేదు. త్యాగరాజు, పురందర దాసు వంటి వారే పాశ్చాత్య సంగీతంతో ప్రభావితులయ్యారనీ, ఆ దేశాల సంగీత వాద్యాలను తమ కచేరీల్లో భాగం చేశారనీ కర్ణాటక సంగీత చరిత్ర చెబుతోందట. మరెందుకీ దాడి?

వ్యవస్థీకృతమైన అన్ని రంగాలనూ ఈనాడు ఒక నియంతృత్వ రాజకీయం ఆవరించిన స్థితి స్పష్టంగా కనబడుతున్నదే. అసలే సంప్రదాయ బ్రాహ్మణ ఆధిపత్యంతో నిండిన కర్ణాటక సంగీత రంగాన్ని ఆక్రమించుకోవటం దానికి మరింత సులభమైంది. ఆ రాజకీయాలను కృష్ణ తన సంగీతంతోనూ, సామాజిక ఆచరణతోనూ ప్రశ్నిస్తున్నాడు. అందువల్లనే ఈ వివాదం సంగీతేతర సమూహాలకు కూడా సంబంధించినదిగా మారింది. ఆధ్యాత్మికతకు, హిందూత్వ రాజకీయ ఎజెండాకూ ఉన్న భేదాన్ని నిరూపించటానికి తాను ఆలపించే త్యాగరాజ కీర్తనలనే ఆధారంగా తీసుకున్నాడు కృష్ణ షాహీన్ బాగ్ ఆందోళనల మీద, వ్యవసాయదారుల నిరసనల మీదా దాడులు; సిఎఎ, రామజన్మభూమి… ఇవన్నీ ఆ రాజకీయాల్లో భాగమేనని విశ్లేషించి, నిరసించాడు. వివిధ మతాల ప్రార్థనా గీతాలను గానం చేశాడు. సంగీతాభిమానుల ముసుగులో అతడిపై హీనమైన నిందలకు, దాడులకు దిగుతున్నవాళ్ళ అసలు సమస్య అతడి రాజకీయ అభిప్రాయాలే. వాటిలో కొన్ని పరిమితులు ఉండవచ్చు. అవి ఎలాపరిణమిస్తాయో కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే అతడొక వ్యక్తిగా ఈ పని ప్రారంభించాడు. అత్యంత బలవత్తరమైన రాజకీయ శక్తితో ఘర్షణకు తలపడ్డాడు. దారులు మూసుకున్న అగ్రహారం వంటి సంగీత ప్రపంచంలో ఒక కదలిక కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మరి కొందరికి ప్రేరణగా మారినా మంచిదే.

ఎటువంటి వైవిధ్యాన్నీ బతకనివ్వని నియంతృత్వ వాతావరణంలో అతడిదొక భిన్నమైన గొంతు. దాన్ని కాపాడుకుందాం.

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

4 thoughts on “అగ్రహారంలో అలజడి రాగం

Leave a Reply