పోరాట స్ఫూర్తిని నింపే పుస్తకం

శివరాత్రి సుధాకర్ 2026, సెప్టెంబర్, 18న ఆర్ట్స్ కాలేజీకి వచ్చినప్పుడు దాదాపు 30 నుండి 45 నిమిషాల వరకు మాట్లాడుకున్నాం. ఆ సమయంలో తమ్ముడు నీకోసమే అంటూ “అరుణతార” మాసపత్రికతో పాటు ప్రసిద్ధ అనువాద నవల “ఎర్రమందారాలు” ను నాకు అందించారు. సమయాభావం వల్ల అప్పట్లో వాటిని చదవలేకపోయాను. కొంత ఆలస్యమైనా తప్పకుండా చదవాలనుకుంటున్నాను. ఆ పుస్తకాలను అన్న జ్ఞాపకాలుగా భద్రంగా దాచుకున్నాను.

అరుణోదయకు 52 ఏళ్లు, విమలక్క పాటల ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2026 సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కళల జాతరలో రెండో రోజు, సెప్టెంబర్ 27న, సుధాకర్ విమలక్కను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ముగించుకుని వెళ్తూ వెళ్తూ నాకు మరో పుస్తకాన్ని అందించారు.

అదే ఈ పుస్తకం. “ఫాసిజాన్ని ఓడించడం ఎట్లా? ఆంటోనియో గ్రాంసీ జీవితం, ఆలోచనలు, అనుభవాలు” అశోక్ రచించిన పుస్తకం.

ఈ పుస్తకం ఫాసిజం, ప్రజాస్వామ్యం, ప్రతిఘటన, మేధోపోరాటం వంటి అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది.

ఈ 54 పేజీల పుస్తకాన్ని అక్టోబర్ 14 – 17 వరకు చాలా క్షుణ్ణంగా చదివాను.

పాణి రాసిన ముందుమాటలో ‘హెజిమొని’ అనే పదం దగ్గర ఆగిపోయాను. ఆ పదానికి అర్థం ఏమిటో తెలియలేదు. దాని ముందు, వెనుక ఉన్న వాక్యాలను రెండు, మూడుసార్లు చదివినా అర్థం కాలేదు. చివరికి గూగుల్‌లో వెతికాను.

హెజిమొని అనగా ఒక వర్గం తన నాయకత్వాన్ని, భావజాలాన్ని సమాజం ఆమోదించేలా చేసి, తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రక్రియ అని తెలుసుకున్నాను.

ఆ ముందుమాట ముగించి పుస్తకంలో అశోక్ తనను తాను పరిచయం చేసుకునే విధానం చదువుతుంటే ఎంతో సంతోషం కలిగింది. ‘ఇదేంటి.. ఇద్దరి ఆలోచనలు ఇంత దగ్గరగా ఉన్నాయి!’ అనిపించింది.

పుస్తకం రాసిన అశోక్ ఆలోచనా విధానం, ఆచరణ పద్ధతుల్లో నా ఆలోచనలను, నా గతాన్ని చూసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అశోక్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాజ పాఠాలు వింటే
నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాజపు పాఠాలు విన్నాను.SVK లో ఏ కార్యక్రమం జరిగినా బస్ పాస్ జేబులో పెట్టుకుని వెళ్లేవాడిని. నేను పుట్టిన కమ్యూనిస్ట్ ప్రాంత ప్రభావం వల్ల కావచ్చు అనేక సిద్ధాంతపరమైన చర్చల పట్ల ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన మాత్రం ఉండేవి. క్లాస్‌రూమ్‌లో పాఠాల కంటే ఇలాంటి సమావేశాల్లో వినే పాఠాలే ఎక్కువగా ఉండేవి. ఫ్రెండ్స్ అంత ఇలాంటి మీటింగ్ లకు సమయం వృథా చేసుకోవడం ఎందుకు సూచన చేసేవారు. అలాంటి మీటింగ్ లకు వెళ్తే ఏమొస్తుంది? చదువుకోవచ్చుగా అనే వారు. నేను ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేవాడిని. ఈ పుస్తక రచయిత అశోక్ నిజాం కాలేజ్ కి ఎదురుగా ఉన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏ మీటింగ్ ఉన్నా వదిలేవారు కాదట.

తనకు కూడా మొదట్లో ‘హెజిమొని’ అనే పదానికి అర్థం తెలియదని, తాను హాజరైన సమావేశాల్లో ఆ పదాన్ని తరచుగా వినేవాడినని అశోక్ చెప్పడం మరింత దగ్గరగా అనిపించింది.

ఒకప్పుడు సమావేశాల్లో విన్న మాటలకు అర్థాలు వెతుక్కుంటూ, కొత్త ఆలోచనలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించిన నా ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాను. అశోక్ అనుభవంలో నా అనుభవాన్ని చూసుకున్నాను.

ఇగ పుస్తకంలోకి ప్రవేశించగానే గుండెను పిండేసిన గ్రాంసీ తొలినాళ్ల జీవితం. పుస్తకంలో గ్రాంసీ బాల్యాన్ని చదువుతున్నంతసేపూ మనసు కలత చెందింది. తీవ్రమైన పేదరికం, అనారోగ్యం మధ్య ఆయన బాల్యం గడిచింది. చిన్న వయసులోనే వెన్నెముకకు సంబంధించిన సమస్యతో శారీరక వైకల్యాన్ని ఎదుర్కొంటూ, గూని వీపుతో జీవించాల్సి వచ్చింది. శారీరక బాధలతోపాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆయన జీవితాన్ని మరింత కష్టతరం చేశాయి.

గ్రాంసీ కి ఏడేళ్ల వయసున్నప్పుడు ఆయన తండ్రి ఫ్రాన్సిస్కో గ్రాంసీ భూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన వ్యవహారానికి సంబంధించిన కేసులో జైలుపాలయ్యాడు. దీంతో కుటుంబంపై ఆర్థిక భారం మరింత పెరిగింది. కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో, తీవ్రమైన శారీరక బాధలను భరిస్తూనే గ్రాంసీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫైళ్లు మోసే పనిలో చేరాడు. తండ్రి విడుదలైన కొంతకాలం తర్వాత తిరిగి చదువుకోవడం ప్రారంభించాడు.

ఒకవైపు శారీరక వైకల్యం, మరోవైపు ఆకలి, పేదరికం, కుటుంబ బాధ్యతలు ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య పెరిగిన వ్యక్తి తన జీవితాన్ని వ్యక్తిగత ఎదుగుదలకే పరిమితం చేయకుండా సమాజాన్ని అర్థం చేసుకునే దిశగా ప్రయాణించడం అసాధారణమైన విషయం.

గ్రాంసీ జీవితంలోని ఈ తొలినాళ్ల అనుభవాలను చదువుతుంటే,
చదువుతున్న కొద్దీ గ్రాంసీ జీవితం నన్ను వెంటాడింది. ఆయన ఎదుర్కొన్న పేదరికం, అనారోగ్యం, కుటుంబ బాధలు, రాజకీయ నిర్బంధం ఒకవైపు మనసును కలచివేసాయి.
గ్రాంసీ జీవితాన్ని ఈ కోణంలో పరిచయం చేయడం పుస్తకంలోని ముఖ్యమైనది.

సార్దీనియా నుంచి టూరిన్ వరకు: ఆలోచనలకు పునాది

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు హైదరాబాద్ సంస్థానం ప్రత్యేక రాజకీయ అస్తిత్వంతో కొనసాగి, 1948లో భారత యూనియన్‌లో విలీనమైన చరిత్ర మనకు తెలిసిందే. అదే విధంగా 1861లో ఇటలీ యూనిఫికేషన్ ముందు సార్దీనియాకు కూడా ప్రత్యేకమైన రాజకీయ, సామాజిక చరిత్ర ఉంది. అయితే ఈ రెండు చారిత్రక పరిణామాలను పూర్తిగా ఒకే రకమైనవిగా చూడలేం. వాటి వెనుక ఉన్న ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకోవడం అవసరం.

సార్దీనియాలోని ఆర్థిక వెనుకబాటు, భాషాపరమైన భేదాలు, సాంస్కృతిక అణచివేతలు, ప్రాంతీయ అసమానతలు గ్రాంసీ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపాయి. అక్కడి ప్రజల జీవితాల్లోని సమస్యలను అర్థం చేసుకున్న గ్రాంసీ, విస్తృతమైన సామాజిక, రాజకీయ వ్యవస్థలో భాగంగా చూడటం ప్రారంభించాడు.

1911లో ఉన్నత విద్య కోసం టూరిన్‌కు వెళ్లిన గ్రాంసీకి అక్కడ పూర్తిగా భిన్నమైన ప్రపంచం కనిపించింది. అప్పటికే పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతున్న టూరిన్‌లో పరిశ్రమలు, కార్మికులు, ఉత్పత్తి సంబంధాలు, యజమానులు, కార్మిక వర్గం మధ్య వైరుధ్యాలు స్పష్టంగా కనిపించేవి. ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధి ఉంటే, మరోవైపు ఆ అభివృద్ధిలో పనిచేసే కార్మికుల జీవితాల్లో అసమానతలు కనిపించేవి.

సార్దీనియా అనుభవాలు ఆయనలో ప్రాంతీయ అసమానతల పట్ల అవగాహనను పెంచితే, టూరిన్ నగరంలోని పారిశ్రామిక జీవితం వర్గ సంబంధాలపై అవగాహనను పెంచింది.

ఈ అనుభవాలే గ్రాంసీని మార్క్సిస్టు ఆలోచనల వైపు మరింతగా నడిపించాయి.

ఈ పరిణామాన్ని పుస్తకం ఆసక్తికరంగా వివరిస్తుంది.

తను పుట్టి పెరిగిన సార్ధనీయ ప్రజల కష్టాలను సమస్యలను “అవంటి” పత్రికకు విశ్లేషణాత్మకమైన వ్యాసాలు రాసేవారు. అలా విశ్లేషణకు మెచ్చి “అవంటి” పత్రిక యాజమాన్యం జర్నలిజంలో గ్రాంసీ కి ఉద్యగమిచ్చింది.

గ్రాంసీ కి జర్నలిజం కేవలం ఉపాధి సాధనం కాదు. సమాజంలోని అసమానతలను ప్రశ్నించడానికి, కార్మికుల సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడానికి, ఆధిపత్య భావజాలాన్ని విమర్శించడానికి అది ఒక సాధనంగా మారింది. క్రమంగా ఇటాలియన్ సోషలిస్టు ఉద్యమంతో ఆయన అనుబంధం పెరిగిన కొద్దీ రచనల ద్వారా ప్రజా సమస్యలను విశ్లేషించడం ప్రారంభించాడు. సోషలిస్టు పత్రిక అవంటి తో ఆయనకు ఏర్పడిన అనుబంధం, ఆ తర్వాత ఆయన చేసిన మేధోపోరాటం గ్రాంసీ రాజకీయ జీవితంలో కీలకమైన మలుపులు.

జర్నలిజం పేరుతో దోపిడీ వ్యవస్థలకు కొమ్ముకాయకూడదనే భావన గ్రాంసీ రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలో ఏం జరుగుతుందో నివేదించడం మాత్రమే కాదు; ఎందుకు జరుగుతోంది, దాని వెనుక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ పరిస్థితులను మార్చడానికి ప్రజలు ఏం చేయాలి అనే ప్రశ్నలను లేవనెత్తడం గ్రాంసీ రచనా విధానంలోని ప్రత్యేకత.

గ్రాంసీ జీవితాన్ని పరిశీలిస్తే రచయితకు సామాజిక బాధ్యత ఉంటుందని, మేధావి తన చుట్టూ జరుగుతున్న అన్యాయాల పట్ల తటస్థంగా ఉండలేడని అర్థమవుతుంది.

గ్రాంసీ, ముస్సోలిని: ఒకే రాజకీయ వేదిక నుంచి భిన్నమైనదారులు

గ్రాంసీ రాజకీయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే బెనిటో ముస్సోలిని ఎదుగుదలను కూడా పరిశీలించాలి. ఒకప్పుడు సోషలిస్టు ఉద్యమంతో సంబంధం కలిగి, అవంటి పత్రికకు సంపాదకుడిగా పనిచేసిన ముస్సోలిని తర్వాత జాతీయవాదం, ఫాసిజం వైపు మళ్లాడు. గ్రాంసీ మాత్రం కార్మిక వర్గ రాజకీయాలు, కమ్యూనిజం, ప్రజా విముక్తి దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

ఒకే రాజకీయ వాతావరణంలో ఉన్న వ్యక్తులు కాలక్రమంలో ఎంత భిన్నమైన మార్గాలను ఎంచుకోవచ్చో ఈ పరిణామం తెలియజేస్తుంది.

1919లో ముస్సోలిని ఫాసిస్టు ఉద్యమానికి పునాది వేసి, తన అనుచరులతో కలిసి ‘ఫాసిస్టు పోరాట దళాలను’ ఏర్పాటు చేశాడు. ‘నల్ల చొక్కాలు’ ధరించే ఫాసిస్టు మూకలు సోషలిస్టులు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామిక శక్తులపై దాడులకు పాల్పడ్డాయి. అనంతరం ఫాసిస్టు ఉద్యమం “నేషనల్ ఫాసిస్ట్ పార్టీ” రూపంలో బలపడింది.

ఇటలీ ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఉపయోగించుకుంటూ ముస్సోలిని తన రాజకీయ శక్తిని పెంచుకున్నాడు. 1922లో “మార్చ్ ఆన్ రోమ్” ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషించాడు. రాజు విక్టర్ ఇమ్మాన్యుయేల్-III ముస్సోలిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం ఇటలీ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది.

ఫాసిజం తొలినాళ్లలో ప్రజాస్వామిక వ్యవస్థలో భాగంగా కనిపించినప్పటికీ, అధికారాన్ని కేంద్రీకరించుకోవడం, ప్రతిపక్షాలపై దాడులు చేయడం, స్వేచ్ఛను అణచివేయడం ద్వారా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.

స్వేచ్ఛ, సమానత్వం, కార్మికుల హక్కుల గురించి మాట్లాడే ప్రజలను శత్రువులుగా చిత్రీకరించడం ఫాసిస్టు రాజకీయాల్లో ప్రధాన లక్షణంగా మారింది. ప్రజల నిజమైన సమస్యలకు పరిష్కారాలు చూపడానికి బదులుగా, ఒక నిర్దిష్ట సమూహాన్ని శత్రువుగా ప్రకటించి ప్రజల అసంతృప్తిని ఆ దిశగా మళ్లించడం ద్వారా ఫాసిజం తన పునాదులను బలోపేతం చేసుకుంది.

గ్రాంసీ ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కేవలం సిద్ధాంతపరమైన విమర్శ సరిపోదని, ప్రజలను విస్తృతంగా ఐక్యం చేసే రాజకీయ కార్యాచరణ అవసరమని తెలియజేసాడు.

ఐక్య పోరాటాల అవసరం

ఇటలీలో ఫాసిజం బలపడుతున్న సమయంలో గ్రాంసీ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధాలను పెంచుకున్నాడు. 1922లో మాస్కోకు వెళ్లి, 1923 వరకు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో జూలియా షుచ్ట్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తర్వాత వారు వివాహం చేసుకున్నారు.

ఇటలీకి తిరిగి వచ్చిన అనంతరం కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో, ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ పోరాటంలో గ్రాంసీ కీలక పాత్ర పోషించాడు. అయితే కమ్యూనిస్టు ఉద్యమంలోని అంతర్గత విభేదాలు, ఇతర ప్రజాస్వామిక శక్తులతో ఐక్యత సాధించడంలో ఎదురైన సమస్యలు ఫాసిజాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలను బలహీనపరిచాయి.

ఈ చారిత్రక అనుభవం నుంచి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఎదురైనప్పుడు ప్రజా ఉద్యమాల మధ్య ఉన్న భేదాలనే ప్రధానాంశంగా చేసుకుంటే, ఉమ్మడి శత్రువును ఎదుర్కొనే శక్తి బలహీనపడుతుంది. ప్రజల హక్కులను, స్వేచ్ఛను, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటానికి విస్తృత ఐక్యత అవసరం.

1926లో గ్రాంసీని ఫాసిస్టు ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికీ నిర్బంధానికి గురయ్యాడు. తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పటికీ జైలులో నిర్బంధించబడ్డాడు. ఆయన రాజకీయ కార్యకలాపాలను అడ్డుకోవడమే కాకుండా, ఆయన ఆలోచనా శక్తిని కూడా అణచివేయాలనే ప్రయత్నం జరిగింది.

అయితే జైలు గోడలు ఆయన మేధోపోరాటాన్ని పూర్తిగా ఆపలేకపోయాయి. జైలు జీవితంలోనే ఆయన తన ప్రసిద్ధ ప్రిజన్ నోట్‌బుక్స్ రచనను కొనసాగించాడు. సంస్కృతి, రాజకీయాలు, ఆధిపత్య భావజాలం, మేధావుల పాత్ర, ప్రజల సమ్మతి వంటి అంశాలపై ఆయన చేసిన విశ్లేషణలు తర్వాతి తరాలకు విలువైన మేధో సంపదగా నిలిచాయి.

కాలం మారినా సారంలో ఫాసిజం మారడం లేదు. గ్రాంసీ నుంచి ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా వరకు అదే ఫాసిస్ట్ ధోరణి ను ప్రభుత్వం అమలుచేసింది.

గ్రాంసీ శారీరక వైకల్యంతో బాధపడుతూ జైలు జీవితం అనుభవించాడని చదువుతున్నప్పుడు నా హృదయం మరింత బరువెక్కింది. వెంటనే నా మదిలోకి వచ్చిన వ్యక్తి ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా.

గ్రాంసీని నిర్బంధించిన ఫాసిస్టు ప్రభుత్వ ఉద్దేశం ఆయన రాజకీయ ప్రభావాన్ని అడ్డుకోవడం మాత్రమే కాదు; ఆయన ఆలోచనలు సమాజంపై చూపే ప్రభావాన్ని కూడా అణచివేయడం. ఆయన మేధస్సుకు ఆటంకాలు సృష్టించాలి అనే ఉద్దేశం, ఫాసిజానికి మేధో స్వేచ్ఛ పట్ల ఉన్న భయాన్ని ప్రతిబింబిస్తాయి.

ఇదే ప్రశ్న ప్రొఫెసర్ సాయిబాబా జీవితాన్ని పరిశీలించినప్పుడు కూడా మన ముందుకొస్తుంది. తొంభై శాతానికి పైగా శారీరక వైకల్యంతో వీల్‌చైర్‌పై ఆధారపడి జీవించిన ఆయనను దీర్ఘకాలం జైల్లో నిర్బంధించారు. ఆయనపై నమోదైన కేసులు, విచారణలు, నిర్బంధం భారతదేశంలో పౌరహక్కులు, న్యాయవ్యవస్థ, రాజకీయ అసమ్మతి వంటి అంశాలపై విస్తృతమైన చర్చకు దారితీశాయి.

గ్రాంసీ జైలు గోడల మధ్య ప్రిజన్ నోట్‌బుక్స్ ద్వారా తన మేధోపోరాటాన్ని కొనసాగిస్తే, సాయిబాబా కూడా నిర్బంధంలో ఉన్నప్పటికీ కవిత్వం, ఉత్తరాలు, రచనల ద్వారా తన ఆలోచనలను వ్యక్తం చేశాడు.

ఈ ఇద్దరి జీవితాల మధ్య చారిత్రక, రాజకీయ పరిస్థితుల్లో తేడాలున్నప్పటికీ, శారీరక నిర్బంధం ద్వారా ఆలోచనా స్వేచ్ఛను అణచివేయవచ్చా? అనే ప్రశ్న మాత్రం ఉమ్మడిగా కనిపిస్తుంది.

మనిషి శరీరాన్ని నిర్బంధించవచ్చు. అతని కదలికలను నియంత్రించవచ్చు. అతని స్వేచ్ఛను హరించవచ్చు. కానీ ఆలోచనలను పూర్తిగా బంధించడం అంత సులభం కాదు. గ్రాంసీ, సాయిబాబా జీవితాలు ఈ విషయాన్ని మనకు గుర్తుచేస్తాయి.

గ్రాంసీ జైల్లో ఉండి తన తల్లికి రాసిన ఉత్తరాలను చదువుతున్నప్పుడు నా మనసు మరింత కలత చెందింది. నమ్ముకున్న ఆశయాల కోసం జైలుకే కాదు, అవసరమైతే ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిద్ధమనే ఆయన నిబద్ధత ఒకవైపు ఆశ్చర్యపరిస్తే, మరోవైపు ఆ నిర్ణయం తన తల్లికి కలిగించే బాధ మనసును పిండేసింది.

ఈ సందర్భంలో నా జీవితంలోని ఒక సంఘటన గుర్తుకొచ్చింది.

మా ఊరిలో నీళ్లు రాకపోవడంతో నేను రెడ్డి సర్పంచ్‌ను ఎదిరించాను. ప్రజలకు కనీస అవసరమైన తాగునీరు అందడం లేదని ప్రశ్నించడమే నా తప్పయింది. అప్పుడు సర్పంచ్ మా నాన్నతో, “ఏం రా సైదిగా?, నీ కొడుకు అప్పుడే నాకు ఎదురుతిరుగుతున్నాడు” అన్నాడు.

దానికి మా నాన్న, “వానికి తెల్వదులే పటేలా, నేను చెప్తాలే వానికి , తప్పయింది పటేలా” అంటూ నన్ను కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు.

మా అమ్మ ఏడ్చింది.

“అందరిలా ఉండొచ్చు కదరా! నీకెందుకురా ఇవన్నీ? ఎవరెటు పోతే నీకెందుకు? నీకు ఇంట్లోకి నీళ్లు తేవడానికి నేను ఉన్న కదరా! ఇప్పుడు నాన్నతో దెబ్బలు తిన్నావు.. సర్పంచ్‌తో మాటలు పడ్డావు” అంటూ నన్ను ఓదారుస్తూనే తను ఏడ్చింది.

అమ్మ మాటల్లో భయం ఉంది. తన కొడుకు ఎలాంటి ఇబ్బందుల్లో పడకూడదనే తపన ఉంది. సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించకుండా ఉంటే తన బిడ్డ ప్రశాంతంగా జీవిస్తాడనే ఆశ ఉంది.

అప్పుడు మా అమ్మ కళ్లలో కనిపించిన కన్నీళ్లు, ఈ రోజు గ్రాంసీ తన తల్లికి రాసిన ఉత్తరాలను చదువుతున్నప్పుడు మళ్లీ నా కళ్లముందు కదిలాయి.

గ్రాంసీ తల్లి తన కొడుకు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ఎంత బాధపడి ఉంటుందో!!

తన తల్లి చనిపోయిందన్న విషయం తెలియక 2 సంవత్సరాల పాటు తన తల్లికి గ్రాంసీ ఉత్తరాలు రాశాడు. ఇది మరింత విషాదం.

నా తల్లి కన్నీళ్లు, గ్రాంసీ తల్లి పట్ల నా మనసులో కలిగిన అనుభూతి ఈ రెండూ వేర్వేరు కాలాలకు, వేర్వేరు దేశాలకు చెందినవైనా, అన్యాయాన్ని ప్రశ్నించే వ్యక్తుల కుటుంబాలు ఎదుర్కొనే మానసిక వేదనలో ఒక మానవీయ సంబంధాన్ని చూపించాయి.

చరిత్ర పొడవునా ఫాసిజం ప్రజల్లో భయాన్ని, నిరాశను నింపింది. ప్రజాస్వామిక హక్కులను అణచివేసింది. ఉద్యమాలను విచ్ఛిన్నం చేసింది. మేధావులను నిర్బంధించింది. ప్రజల మధ్య విభజనలను పెంచింది. అదే చరిత్ర ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, ప్రజల ప్రతిఘటనను, నియంతృత్వాల పతనాన్ని కూడా నమోదు చేసింది.

గ్రాంసీతో ముడిపడిన ప్రసిద్ధ భావన “బుద్ధి నిరాశావాదం.. సంకల్పం ఆశావాదం” ప్రపంచంలోని గందరగోళాన్ని, అసమానతలను, అణచివేతలను, రాజకీయ వాస్తవాలను బుద్ధితో నిశితంగా విశ్లేషించాలి. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఆ పరిస్థితులను మార్చగలమనే సంకల్పాన్ని కోల్పోకూడదు. ఈ భావనలోని అంతరార్థం నాకు ఎంతో ముఖ్యమైనదిగా అనిపించింది. గ్రాంసీ ఆలోచనలు మనకు అందించే ప్రధానమైన పాఠాల్లో ఇదొకటి.

సమకాలీన భారతదేశంలో గ్రాంసీని ఎందుకు చదవాలి?

ప్రస్తుతం భారతదేశంలో పెరుగుతున్న హిందుత్వ రాజకీయ ఆధిపత్యం, మతపరమైన ధ్రువీకరణ, చరిత్రను తమకు అనుకూలంగా మార్చి చెప్పే ప్రయత్నాలు, భిన్నాభిప్రాయాలపై దాడులు వంటి పరిణామాల నేపథ్యంలో గ్రాంసీ ఆలోచనలను గుర్తుచేసుకోవడం అవసరం.

సంఘ్ పరివార్ తన భావజాలాన్ని సమాజంలో విస్తరించడానికి సంస్థాగత నిర్మాణాలను, ప్రచార సాధనాలను, విద్యా-సాంస్కృతిక రంగాలను వినియోగిస్తోంది. ఈ ఆధిపత్య భావజాలాన్ని బలోపేతం చేసే క్రమంలో రాజకీయ, సామాజిక మైనారిటీలను, భిన్నమైన అభిప్రాయాలు కలిగిన సమూహాలను లక్ష్యంగా చేసుకునే ధోరణులపై విమర్శలు వస్తున్నాయి.

ఈ పరిణామాలను అర్థం చేసుకోవడానికి గ్రాంసీ భావజాల ఆధిపత్యం (Hegemony) అనే భావన ఉపయోగపడుతుంది. ఆధిపత్యం ఎప్పుడూ సంపూర్ణమైనది కాదు. దానికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యాన్ని నిర్మించవచ్చు. ప్రత్యామ్నాయ భావజాలాన్ని అభివృద్ధి చేయవచ్చు. రచయితలు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ప్రజల అనుభవాలను, ఆకాంక్షలను, హక్కులను ముందుకు తీసుకురావచ్చు.

ఫాసిజాన్ని ఎదుర్కోవడం అంటే కేవలం అధికారంలో ఉన్న రాజకీయ శక్తిని విమర్శించడం మాత్రమే కాదు. ప్రజల ఆలోచనల్లో ఏర్పడుతున్న ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవడం, దాని మూలాలను విశ్లేషించడం, ప్రజాస్వామిక విలువలను బలోపేతం చేయడం, విస్తృతమైన ఐక్య పోరాటాలను నిర్మించడం కూడా.

ఈ సందర్భంలో గ్రాంసీని గుర్తుచేసుకోవడం అంటే చరిత్రను స్మరించుకోవడం, వర్తమానాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తు కోసం కార్యాచరణను రూపొందించుకోవడం.

ముంచుకొస్తున్న రాజకీయ, సామాజిక ముప్పులను అర్థం చేసుకోవడంలో మేధావులు, రచయితలు, కళాకారులు, ప్రజాస్వామ్యవాదుల పాత్ర ఎంతో కీలకం.

గ్రాంసీ దృష్టిలో మేధోపోరాటం అనేది సమాజానికి దూరంగా జరిగే కేవలం సిద్ధాంత చర్చ కాదు. ప్రజల జీవితాలతో సంబంధం కలిగి ఉండే ఆచరణాత్మక ప్రక్రియ.

ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం అనేది ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ చేయాల్సిన పని మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే విస్తృతమైన శక్తులు తమ తమ స్థాయుల్లో ప్రతిఘటనను నిర్మించాల్సిన అవసరం ఉంది.

ఫాసిజం ఓడిపోతుందనే చారిత్రక విశ్వాసం

ముస్సోలిని ఫాసిస్టు పాలన చివరకు పతనమైంది. 1945లో ఇటలీ ప్రజలు ఫాసిజానికి వ్యతిరేకంగా సాగించిన ప్రతిఘటన చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. ముస్సోలిని మరణం, ఆయన మృతదేహాన్ని ప్రజల ముందు తలకిందులుగా వేలాడదీసిన ఘటన ఫాసిస్టు పాలన ముగింపుకు ప్రతీకగా నిలిచింది.

అధికారం శాశ్వతం కాదని, ప్రజల స్వేచ్ఛను అణచివేసే వ్యవస్థలు ఎప్పటికీ కొనసాగవని చరిత్ర గుర్తుచేస్తుంది. అయితే ఫాసిజం పతనం దానంతట అదే సంభవించలేదు. దాని వెనుక ప్రజల ప్రతిఘటన,
కార్మిక ఉద్యమాలు, విస్తృతమైన ఫాసిస్టు వ్యతిరేక శక్తుల కృషి ఉన్నాయి.

ఫాసిజం తాత్కాలికంగా భయపెట్టవచ్చు. ప్రజల్లో నిరాశను నింపవచ్చు. ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక చైతన్యం, ఐక్యత, సంఘటిత పోరాటం కొనసాగితే తప్పకుండా మార్పు వస్తుంది.

ఫాసిజం తప్పక ఓడిపోతుందనే విశ్వాసం కేవలం భావోద్వేగ నినాదంగా కాకుండా, ఆ విశ్వాసానికి చారిత్రక అవగాహన, సిద్ధాంతపరమైన స్పష్టత, ప్రజా ఐక్యత, నిరంతర ఆచరణ తోడవ్వాలి.

ఈ పుస్తకం గ్రాంసీ జీవితాన్ని తెలుసుకోవాలనుకునేవారికి మాత్రమే కాకుండా, సమకాలీన రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలనుకునేవారికి కూడా ఉపయోగపడుతుంది.

ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నా మనసును ఎక్కువగా కదిలించినవి గ్రాంసీ బాల్యంలోని బాధలు, జైలు జీవితంలోని వేదనలు, తల్లికి రాసిన ఉత్తరాల్లో కనిపించే మానవీయ భావనలు. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా జీవితం గుర్తుకు రావడం, మా అమ్మ కన్నీళ్లతో ముడిపడిన నా వ్యక్తిగత అనుభవం మళ్లీ కళ్లముందు నిలవడం ఈ పఠనాన్ని నాకు మరింత ప్రత్యేకతను చేకూర్చాయి.

అదే సమయంలో గ్రాంసీ భావజాల ఆధిపత్యంపై చేసిన విశ్లేషణ, ప్రజా ఉద్యమాల మధ్య ఐక్యత అవసరం, మేధావుల సామాజిక బాధ్యత వంటి అంశాలు వర్తమాన రాజకీయ పరిస్థితులను పరిశీలించడానికి కొత్త దృక్పథాన్ని అందించాయి.

గ్రాంసీ ఆలోచనలను చదవడం అంటే ఫాసిజం చరిత్రను తెలుసుకోవడంతోపాటు, అది సమాజంలో ఎలా పాతుకుపోతుంది, దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు ఎలా సంఘటితం కావాలి అనే అంశాలను ఆలోచించడం.

ఇపుడున్న పరిస్థితుల్లో రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు తప్పక చదవాల్సిన పుస్తకమిది. ముఖ్యంగా ఫాసిజాన్ని ఎదుర్కోవాలంటే భావజాల స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ, రాజకీయ స్థాయిలోనూ ఐక్య పోరాటాలను నిర్మించాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం మనకు గుర్తుచేస్తుంది.

గ్రాంసీ జీవితం మనకు బాధను కలిగిస్తుంది. ఆయన ఆలోచనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆయన పోరాటం మనకు స్ఫూర్తినిస్తుంది.

ఇండ్ల ఉపేందర్ S/O సైదులు. పుట్టిన గ్రామం : ఇందుగుల.  మండలం: మాడుగులపల్లి.  జిల్లా: నల్గొండ

చదువు: తెలుగు పరిశోధక విద్యార్థి . ఉస్మానియా విశ్వవిద్యాలయం

Leave a Reply