నడక నా ఉనికి

నేను మనిషిగా నుంచోటానికి
కాళ్ళు నాటుకునేంత చోటు కావాలి
నేను స్వేచ్ఛనై మాట్లాడటానికి
గొంతు దాటే మాటలు రానివ్వాలి
నేను హుందాగా నడిచేందుకు
ముళ్ళు లేని దారులు ముందుకెళ్లాలి !

నా దేహదేశం
భూమి మీద గీసిన గీతల ప్రదేశం కాదు
నేలసాళ్ళల్లో మరిగించిన రక్తమాంసాల మహోపదేశం
నా నవ నాగరిక నగరం
ఎత్తు భవనాల మత్తు వ్యాపార కూడలి కాదు
బహు సమూహాలల్లిన సామాజిక శ్రమహారం
బతుకు ఊహల ఉయ్యాల మా ఊరు
ఆసాముల ఆధీన బీడు పొలం కాదు
మట్టి జాతుల చెమట పూల పరిమళం !

నేనూపిరూదిన రాజ్యమే
నన్ను నడిరోడ్డు మీద నులిపేస్తుంది
వళ్ళంతా అక్రమ నియంత్రణ వాతలే
నన్ను నన్నుగా మాట్లాడనివ్వడు
గొంతు నిండా అధికార గునపాలే
నా దేశంలో నేను అరాచక నిషేధాన్ని
నా నగరంలో నేను అవిశ్వాస నిర్బంధాన్ని
నా ఊరిలో నేను శాసించిన బానిసత్వాన్ని
రాజధాని రహదారిలో ఉరితీయబడ్డ స్వతంత్రాన్ని!

నిలిపేసిన రాజధాని రైలులో
మూసేసిన విద్యాలయ మెట్రో స్టేషన్లో
ఆపేసిన జంతర్ ఇంటర్నెట్లో
తలుపులేసిన కన్నాట్ దారుల్లో
అలుపెరగని ఆగ్రహంతో నడుస్తూనే !

గుప్పెడు గాలి మిగలని దేశబందీ గదిలో
ఓట్లు లేని యంత్రాలమంత్ర ఎన్నికల్లో
రాజ్యాంగంలేని రాచరిక రాజ్యంలో
పోరాట హక్కులు పోగొట్టుకున్న పౌరులు
గణతంత్ర దేశమై, నిరసన నగరమై
ప్రజావేశం ఒక నడుస్తున్న రహదారై
మానవ గౌరవ జెండాని ఒళ్ళంతా కప్పుకొని!

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply