నైతీ శిరస్సు చెప్పే సత్యవాక్కు కోసం కాలం నిరీక్షణ

ఇంటికీకాక, ఉద్యమానికీ కాక మధ్యలో ఉరిపోసుకున్నాడు. ఆయుధం పట్టిన చేతితోనే గొంతు నొక్కేసుకున్నాడు. ఏదాదిగా ఎన్నో విపరీతాలను చూస్తున్నాం. ఇప్పుడు ఇదీ వింటున్నాం. ఆ తుది క్షణాన నైతీ ఏమనుకొని ఉంటాడు? ఈ ముగింపులో అలక ఉన్నదా? ఆగ్రహమున్నదా? నిరసన ఉన్నదా? వైరాగ్యం ఉన్నదా? ఏదీ తేల్చుకోలేని నిస్సహాయత ఉన్నదా? ఏమో చెప్పలేం. ఇదీ అని నిర్ధారించలేం. మరో పక్క పది మంది ఆదివాసులకు జగదల్‌పూర్ న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. మేధస్సులు, శిరస్సులు ఉరికి వేలాడుతున్న తరుణమిది. ఈ కాలపు సామాజిక, విప్లవ విషాదమంతా నైతీ బలవన్నిష్క్రమరణలో ఉంది.

ఏ వయసులో, ఎన్ని కలలతో ఆయన విప్లవంలోకి వచ్చాడో మనకు తెలియదు. ఎన్ని సాహసాలు చేశాడో, ఎన్ని అద్భుతాల్లో భాగమయ్యాడో అసలే తెలియదు. చివరికి ఆత్మహత్య వార్తతోపాటే హత్యకు గురయ్యాడనే సందేహాలూ వినిపిస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 27న లొంగిపోయాడనీ, ఈ సంవత్సరం జూన్‌లో నక్సల్స్ పునరావాస కేంద్రానికి వచ్చాడని అంటున్నారు. ఈ నెల 21న నైతీ అనే ఆదివాసీ బీజాపూర్ ప్రభుత్వ పునరావాస శిబిరంలోని బాత్‌రూంలో ఉరేసుకొని కనిపించాడు.

ఈ వివరాల్లో సత్యాన్ని తెలుసుకోవడం అంత సులభం కాదు. అబద్ధాల మీద బతికే రాజ్యం చెప్పే మాటల్లో ఏ నిజాన్ని వెతుక్కోగలం? తనకేమి కావాలో, తానేమి చెప్పాలనుకుంటుందో అదే అందరితో చెప్పించగల రాజ్యం ఆవరించిన నేల మీద సత్యం ఎన్నడైనా తెలుస్తుందా? ఒకప్పుడు అక్కడ ఏం జరుగుతున్నదో నిజం చెప్పడానికి నైతీలాంటి వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లలో చాలా మంది ‘రకరకాలుగా’ మరణించారు. ఇప్పుడు ఆయనా ‘ఆత్మహత్య’ చేసుకున్నాడు. లేదా హత్యకు గురయ్యాడు.

ఈ వివరాల మీద ఆసక్తీ, వాటినిబట్టి వాదనాశక్తీ ప్రదర్శించేవాళ్లు ఎట్లాగూ ఉంటారు. అవన్నీ ఒట్టి వివరాలే. నిర్జీవ సమాచారాలే. నేరుగా వాటితో సంబంధం లేకుండా కూడా నరసు బొడ్డు అలియాస్ నైతీ గురించి ఆలోచించవచ్చు. ఆయన విషాదాంత జీవితం అంచున నిలబడి మనలోకి మనం తొంగిచూసుకోవచ్చు. మన మర్యాదస్త వైఖరిని పరామర్శించుకోవచ్చు. మనం ఎంత లౌక్యులమో, తటస్థవాదులమో తరచి చూసుకోవచ్చు. మన చేతులు మనమే కట్టేసుకొనీ, నోరు నొక్కేసుకొనీ మౌనం పాటిస్తే అన్నీ కాలంలో కలిసిపోతాయని నిష్పూచీగా బతికేయవచ్చు.

కానీ అది మామూలు మరణం కాదు. గీతకు ఆవల నిలబడి ప్రత్యర్థితో పోరాడి రాలిపోవడం కాదు. పునరావాస శిబిరంగా మారిన శతృశిబిరంలో బలన్మరణం. హత్య అయినా, ఆత్మహత్య అయినా ఆయనను అర్థాంతరంగా, అసహజంగా మృత్యువులోకి తోసివేయడమే. విప్లవంలో ఉండవలసిన వాడు పునరావాసానికి ఎలా చేరాడనే ప్రశ్న వేసుకోకపోతే నైతీ మరణం ఎన్నటికీ అర్థం కాదు.

పునరావాసం మానవీయంగా ఉండాలనీ, దారి తప్పిన గొర్రె పిల్లలను క్షమించే పెద్దమనుసుతో ఉండాలనీ, పాత శిక్షణలను, నైపుణ్యాలను తుడిచేసి, కొత్త మెలకువలు నేర్పించే కార్ఖానాగా ఉండాలనీ, నిరవధిక నిర్బంధంగా మారకూడదనీ.. చెప్పడానికి చాలా కబుర్లు ఉంటాయి. అన్నీ మంచివే. చర్చించవలసినవే. పునరావాసంలో అనుమానాస్పద మృతి కాబట్టి రాజ్యానిదే బాధ్యత అని గట్టిగా అనవలసిందే.

పునరావాసానికి వచ్చాక రాజ్యం ఏం చేయాలో, ఏం చేయకూడదో చాలా చెప్పగలం. కానీ నైతీ పునరావాసానికి ఎందుకు వచ్చాడు? ఎవరు తీసుకొచ్చాడు. తన ఆవాసం నుంచి, విప్లవ నివాసం నుంచి పునరావాసానికి ఎలా గెంటివేయబడ్డాడు? ఒకసారి అక్కడి నుంచి లాక్కొచ్చిన తర్వాత ఇక్కడ ఎంత కాలం ఉంచుకోవాలో లెక్కలేమైనా ఉన్నాయా? అడిగేవాళ్లు ఎవరైనా ఉన్నరా? అసలు ‘పునరావాసం’ అనే మాటను రాజకీయంగా చూడ్డానికి మనం సిద్ధమేనా? ఈ ప్రశ్న వేసుకోనంత కాలం నైతీ మరణాన్ని అంగీకరించినట్లే. ఆయనలాంటి వాళ్లను పునరావాసంలోకి తరలించడాన్నీ ఒప్పుకున్నట్లే.

ఆయుధం వదిలాడు కాబట్టి రాజ్యం ఔదార్యం చూపాలని కొందరు కోరుకోవచ్చు. విప్లవాన్ని వదిలేశాడు కాబట్టి మానవ హక్కులు ఇవ్వాలని ఆశించేవాళ్లు ఉండవచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్లదే పైచేయి. ఇంతకూ రాజ్యమంటే ఇంతేనా? విప్లవం చట్టానికి సంబంధించిన సమస్యనా? రాజ్యానికి ఆయుధమే అభ్యంతరమా? చట్టబద్ధంగా ఉంటే ప్రాణాపాయం లేనట్లేనా? మరి లొంగిపోయిన నక్సలైట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలు చట్టబద్ధమే కదా. మరి నైతీ ఎందుకు చనిపోయాడు? ఆయనది చట్టబద్ధ హత్య అని పోలీసులు ఎన్నటికీ అంగీకరించలేరు. కాబట్టి ఆయనది రాజకీయ హత్య.

ఆత్మహత్యో, హత్యోగాని మరణించీ ఆయన సంధిస్తున్న ప్రశ్నలు రాజకీయమైనవి. నైతీలాంటి వాళ్లు విప్లవాన్ని ఎంచుకోడానికీ, విప్లవాన్ని వదిలి లొంగిపోవడానికీ, లొంగుబాటు విప్లవాత్మక పంథాగా ఈ ఏడాదిలో సకల జనామోదం పొందిందని ఆనందించడానికీ, ఏడాది వేడుకల్లో తలమునకలుగా ఉండగానే నైతీ తల ఉరి తాడుకు వేలాడటానికీ సంబంధం ఉంది. అన్నిటినీ కలిపి చూడాలి. అప్పుడే దీని చుట్టూ ఉన్న ప్రశ్నలను వినగలం.

యుద్ధాలు ముగిశాక శరణార్థి శిబిరాల్లోని దుర్మార్గాలూ, అక్కడ మాయమైపోయిన మానవ హక్కులూ ప్రధాన చర్చనీయాంశం అవుతాయి. మంచిదే. కానీ యుద్ధ కారణాలు చరిత్రలో భాగమవుతాయి. పుస్తకాల్లోని పేజీల మధ్యలోకి వెళ్లిపోతాయి. విషాద జ్ఞాపకాల్లోకి జారిపోతాయి. ఇక అంతా భేషుగ్గా ఉందనుకుంటే శరణార్థి శిబిరాల్లోంచి వినిపించే హాహాకారాలు ‘సభ్య’ సమాజాన్ని డిస్ట్రబ్ చేస్తుంటాయి. ఇంతకూ యుద్ధం ఎందుకు జరిగిందో, ఎవరు దురాక్రమణదారో, ఎవరు తమ నేల కోసం, ఆత్మగౌరవం కోసం, జీవితం కోసం స్వేచ్ఛా సమరంలోకి దిగారో, ఎవరు దండయాత్ర చేశారో, ఎవరు వెన్నుపోటు పొడిచారో అన్నీ విస్మృతిలోకి వెళ్లిపోతాయి. రవ్వంత ఆగ్రహం లేకుండా, నిరావేశంగా, నింపాదిగా ఉండమని నిత్యం బుజ్జగిస్తూ ఉంటాయి.

ఆదివాసులకు ఆయుధం పట్టుకోమని చెప్పడం తేలిక. వదిలేయమని చెప్పడానికి ఎంత శిక్షణ ఇచ్చి ఉంటారు? ఎన్ని సిద్ధాంతాలు వల్లె వేసి ఉంటారు? మారిన పరిస్థితుల చిత్రపటాన్ని ఎన్నెన్ని రంగుల్లో భీతిల్లిపోయేలా చూపించి ఉంటారు? ‘అందరం వెళ్లిపోవలసిందే’ అనే మాటను ఒప్పించడానికి ఎంత ప్రయాసపడి ఉంటారు? ఖాళీ చేయించమని ఆ పక్క ‘కగార్‌’ చెబుతూనే ఉన్నది. ఇక మిగిలింది లొంగిపోవ‌డ‌మే. పునరావాసమే. తప్పులను దిద్దుకోవడమే పునర్నివాసం. నైతీ ఎప్పుడు లొంగిపోయినా; లొంగుబాటు, పునరావాసం ఈ కాలపు నుడికారం. ఇంత కాలం విప్లవం చేసిన ఆదివాసులు ఈ బలన్మరణాన్నీ, బలవంతపు విరమణనీ ఎలా తర్కించుకుంటున్నారో మనం తెలుసుకోవాలి. నైతీ నిశ్శబ్ద నిష్క్రమణ పునరావాసాల్లో రేపిన అలజడిని వినాలి. అక్కడి ఆదివాసుల గుండె లోతుల్లోంచి ఆలకించాలి.

నైతీ శవాన్ని దగ్గర పెట్టుకొని విప్లవానికికాని తమ పునరావాస జీవిత సంక్షోభాన్ని ఆదివాసులు తప్పక తెలుసుకొనే ఉంటారు. విప్లవంలో వేల మరణాలు చూసిన ఆదివాసులకు ఈ ఆత్మహత్య దిగ్భ్రాంతికరమే. ఒకవేళ హత్యే అయితే, హంతకుడు ఎవరో కూడా గ్రహించగలరు. ఇది ఇవ్వాల్టి విప్లవ విషాదం. విప్లవ సంక్లిష్ట స్థితి. ఈ వైపు చూడకుండా నైతీ ఆత్మహత్యను కూడా విప్లవ వైఫల్యంలో చూసేవాళ్లు ఉంటారు. రాజకీయ, సిద్ధాంత తప్పిదాల్లో వెతికేవాళ్లు ఉంటారు. చనిపోయిన నాయకులకు ఆపాదించి చేతులు దులిపేసుకొనే వాళ్లూ ఉంటారు.

ఇంతకూ ఆ చివరి క్షణాన నైతీ ఏమనుకొని ఉంటాడు? విప్లవం గురించి, లొంగుబాటు గురించి ఎలా తర్కించుకొని ఉంటాడు. ఫలనా అని మనం తేల్చలేం. అంత సులభంగా చెప్పలేం. ఇది కదా, ఈ కాలపు సాహిత్య వస్తువు!. దాన్ని గ్రహించగల వాళ్ల కోసం ఈ కాలం నిరీక్షిస్తూనే ఉంటుంది. తన తరపున అలాంటి సత్య ప్రకటన కోసం ఎందాకానైనా పడిగాపులు కాస్తూనే ఉంటుంది.

కవి, రచయిత, విమర్శకుడు, వక్త. విరసం కార్యవర్గ సభ్యుడు. గతంలో విరసం కార్యదర్శిగా పని చేశారు. రచనలు: 'కలిసి పాడాల్సిన గీతమొక్కటే' (కవిత్వం), 'అబుజ్మాడ్' (కవిత్వం), 'నేరేడు రంగు పిల్లవాడు' (కథలు), 'జనతన రాజ్యం', 'సృజనాత్మక ధిక్కారం'. రెండు దశాబ్దాలుగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలో కృషి చేస్తున్నారు.

One thought on “నైతీ శిరస్సు చెప్పే సత్యవాక్కు కోసం కాలం నిరీక్షణ”

  1. ఈ కొలిమి సంపాదకులకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, మంచి వ్యాసాన్ని కూడా కూని చేయగలరు. రచయిత ఒక వ్యాసం పంపినప్పుడు కనీసం చదివి అక్షర దోషాలు వాక్యాలు చదివి సరి చేయాలనే దిక్కుమాలిన అనారోగ్య లక్షణం లేనే లేదు. పై వ్యాసం మొత్తం ఇంతే.

Leave a Reply