వెట్టితనం (Bonded Labour / Forced Labour) అంటే వేతనం లేకుండా లేదా అతి తక్కువ వేతనంతో బలవంతంగా పని చేయించుకోవడం. ఇది ఒక సామాజిక దురాచారం. దీనిని వెట్టి చాకిరీ అని కూడా పిలుస్తారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన మరియు చట్టవిరుద్ధం. నిజాం కాలంలో వెట్టి చాకిరీ భయంకరమైన వ్యవస్థ. వెట్టి రద్దు చేసినా అది కాగితాలకే పరిమితమైంది. ఇది నాటి గ్రామ సమాజంలో ఒక క్రూరమైన దోపిడీ. వెట్టి చాకిరీ వ్యవస్థలో శారీరక మరియు మానసిక హింస సాధారణంగా కనిపించేది. భూస్వాములు, పటేళ్ళు మాలమాదిగలను చిన్నచిన్న కారణాలకే కొట్టడం, భయంకరంగా హింసించి నియంత్రించేవారు. నిజాం వెట్టిని రద్దు చేసినా దొరలు, భూస్వాములు, జమీందార్లు యథేచ్ఛగా కొనసాగించారు. ఈ పరిస్థితి స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగింది. భారత ప్రభుత్వం వెట్టి చాకిరీని నిర్మూలించడానికి భారతదేశంలో ప్రత్యేక చట్టాలు (Bonded Labour System Abolition Act, 1976) వచ్చాయి. అప్పటి వరకు వెట్టి కొనసాగింది. 1. నిర్బంధం, 2. జీతం లేకపోవడం, 3. శ్రమ దోపిడీ — వెట్టితనం లక్షణాలుగా 1976 చట్టం చెబుతుంది. మాదిగలు మాయితనం (వ్యవసాయ సంబంధ పనులు), తాళ్ళు పట్టడం, చెప్పులు చేయడం, డప్పు కొట్టడం మొదలైనవి చేస్తారు. మాలలు కావలి కాయడం, సుంకరితనం (మస్కూరి), బేగారి పనులు మొదలైన చేస్తారు. అవసరాన్ని బట్టి పై రెండు కులాలు చేస్తాయి.
నిజాం కాలంలో సమాజమంతా నిశ్శబ్ద అణచివేతలో కొనసాగింది. ఆనాటి పరిస్థితులను చిత్రించిన కథ 'వెట్టి మాదిగ.' దీనిని అజ్ఞాతవాసి పేరిట భాగ్యరెడ్డి వర్మ 'భాగ్యనగర' పత్రికలో 1932లో ప్రచురించారు.
‘వెట్టి మాదిగ’ కథలో రామిరెడ్డి పాత్ర అత్యంత క్రూరత్వానికి, ఫ్యూడల్ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని “అన్నమో రామచంద్రా” అని విలపించే స్థితికి తీసుకెళ్తాడు. రామిరెడ్డి అంటే ఆ గ్రామస్థులందరికీ భయం. రామిరెడ్డి ఉత్తరం పంపించాల్సి ఉంది. వంతు మాదిగను పిలిపించాలని తలారిని పంపిస్తాడు. అదే రోజున మరొక భూస్వామి ఆరు నెలలు చేసిన పనికి ధాన్యం ఇస్తానని చెప్పడం వలన, ఆ రోజు వెళ్ళకపోతే ఆరు నెలల గాసం ఇవ్వరు. అందువల్ల ఆ మాదిగ ఆ రోజు రావడం వీలు కాదని రేపు వస్తానని తలారికి చెప్పగా పటేల్ కి అట్లే చెప్తాడు. రామిరెడ్డి చెప్పుతో కొట్టి తలారిని అవమానిస్తాడు. పటేలు “వెట్టి చేయడం కష్టమట! ఇక వీళ్ళ కొంపలు నాశనం చేస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను” అని గర్జిస్తాడు . అంతలో తలారి వచ్చి మల్లన్నను తిడుతూ, కొడుతూ పటేలు వద్దకు ఈడ్చుకెళ్తాడు. మల్లన్న తలకు బలమైన గాయం తగిలి రక్తస్రావం అవుతుంది. స్పృహ కోల్పోతాడు. రక్తస్రావం గమనించిన రామిరెడ్డి కొంత శాంతించి, తలారిని ఇద్దరు అనుచరులతో కలిసి అతన్ని ఇంటికి పంపిస్తాడు. అయితే గాయాల వలన మల్లన్న దీర్ఘకాలం వ్యాధిపీడితుడై కుటుంబం ఆహారాలేమితో కష్టాలు పడుతుంది. ఆరు నెలలు శవంలా బాధపడిన తరువాత మల్లన్న మరణిస్తాడు. దళితుల జీవితం కడు దుర్భరమైంది. స్వాతంత్ర్యం లేని జీవితం దళితులదని తెలుస్తుంది. ఆరు నెలల గాసం సంగతేమో కానీ మల్లన్న ఆయువే పోయింది. హింసకు అద్దం పడుతుంది.
మూడు తరాల నుంచి చేసినా తీరని అప్పు మాకా? అని జీతగాళ్ళుగా ఉన్న నాల్గవ తరానికి చెందిన పెంటయ్య కొడుకు రాములు వెట్టి చేయనని హెచ్చరిక చేసిన బోయ జంగయ్య కథ 'ఎచ్చరిక' (1983). నర్సిరెడ్డి తాతాల నాటి ఆస్తి పది రెట్లు పెరిగింది. పెంటయ్య అప్పులు పెరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా చేసిన కష్టం ఏమైంది? 'మీకు ఆస్తులు పెరిగితే మాకు అప్పులు ఎందుకు పెరిగాయని, మా లెక్క సరిగా తేలితే సరేసరి. లేకుంటే పనికి రానే రాం' అని తండ్రీ కొడుకులు వెళ్ళిపోతారు. తెలంగాణ పల్లెల్లో ఉన్న అన్యాయాలను, అక్రమాలను, వెట్టి చాకిరీని చిత్రించిన కథ చదవడం ద్వారా ఆనాటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. దిక్కులేని దళితుల పట్ల ఎవరూ కాసింత కనికరం చూపలేదు. దళితులు కష్టపడి పని చేసి ఆకలిమంటల్లో ఆహుతి అయ్యారు. దళితుల బతుకులు దుర్భరంగా నిజాం రాజ్యంలో ఉన్నాయని, ఈ వెట్టి పరంపర అలాగే కొనసాగిస్తూ దుర్భరంగా మార్చారని వెట్టి కథలు తెలుపుతున్నాయి.
గూడ అంజయ్య రాసిన 'భీరుపూరి' కథలో చలిజ్వరంతో బాధపడుతున్నమాదిగ మల్లయ్యను గొరగొర లాక్కుపోయాడు. 'మాల మాదిగులు పటేళ్ళు, పట్వారీలు అవుతారా? రాజులవుతారా?' అని గోపాల్‌రావు దొర తిడతాడు. "అయ్యా! నా ప్రాణం మంచిగైనాక పనికొస్తాను" అని చెప్పినా దొర వినలేదు. సుంకరోళ్ళతో బండలు ఎత్తించాడు. జ్వరంతో బాధపడ్తున్న మల్లయ్య చల్లని చెమటలతో కనుగుడ్లు కిందికి మీదికి చేసుకుంటూ జీవిడిసాడు. మల్లయ్య కొడుకే భీరుపూరి. కొన్నాళ్ళకు భీరుపూరి మీద దొంగతనం కేసు పెట్టిస్తాడు దొర. అవ్వల్‌దారు విపరీతంగా కొడతాడు. దాచింది చెప్పనని చెట్టెక్కాడు. అందరూ చెట్టు పైకి చూస్తున్నారు. గోపాల్‌రావు దొరను కసీదీర తిట్టాడు. మలమూత్ర విసర్జన చేయడం వల్ల చెట్టుకింద తొక్కిసలాటలో రాయలింగు దొర కాళ్ళలో కాళ్ళు పెట్టి పడగొట్టాడు. భీరుపూరి ఉరేసుకొని చనిపోయాడు. ఈ కథలో వెట్టి చిత్రణ దుర్మార్గం కనబడుతుంది. మాలమాదిగులు లెక్కలేనివారిగా కనబడుతారు. కారా మాస్టార్ ‘యజ్ఞం’ కథలో విముక్తి కోసం తండ్రి కొడుకును చంపితే ఈ కథలో పీడించడం వలన తండ్రి, తిరుగుబాటు చేసి కొడుకు చనిపోతారు. వెట్టికి ప్రతినిధి గోపాల్ రావు దొరను పడగొట్టడం కొంత ప్రతీకారం కనబడుతుంది.
వెట్టి రద్దయినా ఆ ఆనవాళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయన్న చేదు నిజాన్ని, వెట్టి పన్నులు చెల్లించే విధానాన్ని వివరించే గుండె డప్పు కనకయ్య కథ 'కుక్కపన్ను'. సంఘాల పంతులు కథతో పోల్చదగిన కథ. ఏనంక (వీణవంక ) సుధాకర్ రెడ్డి దొరకు కోపం రాకముందే కుక్కను పెంచడం కోసం పన్ను కట్టాలే. పన్ను కట్టడానికి వెళ్ళిన సంజీవుని లోపలకు పోనివ్వరు. కుక్క పన్ను కట్టాడు. కోళ్ళను పెంచుతున్నందుకు కోడిపుంజును అప్పగించాడు. 'ఈ ముట్టుడేందో? అంటు ఏందో? నేను వేసిన ఎంగిలి తిన్నది. మా పెంట తిని, బలిసిన కోడి బహుమంచిగా ఉందిరా' అని దొర అంటాడు. మా వాడను ఆనుకొని దొర పొలాలు. వాళ్ళతో వచ్చిన కుక్కలు మా కంపు తింటాయి. వాటిని చేరదీస్తారు. మీద ఎక్కించుకుంటారు. కుక్కలకు ఉన్న విలువ మనుషులకు లేకపోయే. ఆ బసి కుక్కలను చంపే రోజు వస్తుందని అనుకుంటూ ఇల్లు చేరుతాడు సంజీవ. వెట్టి భరించలేని వ్యక్తుల ఆలోచనలో మార్పులు మొదలవుతున్నాయని చిత్రించిన పరిస్థితులు 'కుక్కపన్ను' కథలో ఉన్నాయి.
మాదిగోని భార్యను పక్కలోనుంచి లాక్కెళ్ళిన ఉదంతాన్ని మామ సమ్మయ్య చావు నాడు వలపోతల్లో మేనకోడలు తెలుసుకున్న చేదు నిజమే జూపాక సుభద్ర కథ ‘పగిలిన పచ్చి పుండ్లు’. దుర్మార్గం ఎలా ఉండేదో కళ్ళకు కట్టిన బతుకును చదువుతుంటే పాఠకుడు విస్ఫోటనమై శకలాలుగా పడతాడు. సమ్మయ్యను కొట్టాడు. మల్లత్త ఎనిమిది నెలల గర్భిణిని దొర గుంజుకుపోయాడు. బావి వద్ద గుడిసెలో ఉంచాడు. అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు లేరు. ఇప్పటికీ పటేలు ఉంచుకున్న మాదిగదనే పేరు పోయినదని తల్చుకు తల్చుకు ఏడుస్తూ చెప్పుతుంటే ఆ రాత్రంతా ఆ ఎత రచయిత్రిని నిద్రపోనివ్వలేదు. చనిపోయిన మనిషి మా మామ. బతుకుతూ చనిపోయిన మనిషి ఆమె అని నిర్ధారించుకుంది.
చెరువు అంటే పరువు. అన్నీ జీవులకు ఆదరువు. కన్నా తల్లిలాంటి చెరువు కండ్లల్లో కరిగిపోతున్న కల. కళ తప్పుతున్న చెరువు మీది రంది ఎలా విషాదాన్ని తెలిపే గుడిపల్లి నిరంజన్ కథ ‘నీరటిగాడి కల’. నిద్రలో పచ్చని కల కళ తప్పుతుంది. చెరువున్న చోట కరువుండదని పాలకులకు తెలియకపోయే. పూడ్చని గండి పెద్దపులిలా నోరు తెరిచింది. నీళ్ళు నిలవడం లేదు. బావులు, బోర్లు ఎండుతున్నాయి. “…పుట్టెడు దుఃఖాన్ని ఆపాలే… చెరువును బతకనివ్వండా…” చెరువును పట్టించుకోని వ్యవస్థ మీద కోపం. కళ్ళలో ఉక్రోషం, ఉద్వేగం పెరిగింది. రక్తప్రసరణ ఉప్పెనైంది. నరాలు చిట్లాయి. కల శాశ్వత నిద్రలో కలిసింది. తెల్లారి నీరటిగాడు చెరువు మట్టి వాసన కొట్టాడు. చెరువుతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని పతాకస్థాయిలో చిత్రించిన కథ.
జీతం గింజలు అడిగినందుకు కొట్టబడిన కట్టుబానిస బతుకును చిత్రించిన దాసరి లింగస్వామి కథ ‘జీతం’. దెబ్బలను చూసిన కోడెదూడ నర్సయ్య వీపును నాకింది. ‘భీమా! నీకున్న పేమ లేదురా గీ కాపాయనకు, పుట్టి బుద్ధెరిగిన కాన్నుంచి నేను, నా పోరలు, పెండ్లాం మొత్తం బానిసలమైనం. అయినా కనికరం లేదు’ అని తన సొదను చెప్పుకుంటూ కుమిలిపోయాడు. పంచాయతీ పెట్టినా పటేలు దిక్కే మాట్లాడుతాడు పటేళ్ళందరూ. చివరకు ఆ పటేలుకే జీతం చేయాలని తీర్మానం చేస్తారు. జీతగాడికి, అతని కుటుంబానికి స్వేచ్ఛ లేదు. అణిచివేత. పేద వాడిని, కట్టుబానిసను ఎవరు కనికరించగలరని చెబుతుందీ కథ.
మాయితనం చేయడం వలన ప్రతి ఆపత్కాలంలో ఆదుకున్న ఆపద్బాంధవుల్లా మసులుకున్న తప్పెట ఓదయ్య కథ 'మల్లక్క'. కష్టపడి అంకితభావానికి మెచ్చిన గొల్ల మల్లక్క అయ్యకు పక్షవాతం వచ్చినప్పుడు తోడుగా ఉంది. పైసలు లేక తండ్లాడుతున్న ప్రతిసారి రచయితకు ఆదుకుంది. బి.ఎడ్. చేస్తున్నప్పుడు అప్పు ఇచ్చింది. పెళ్ళికి నిలబడి సకులం సాయం అందించింది. సంతానం కలుగుతున్నప్పుడు ఆర్థికంగా తోడుగా ఉంది. పంచాయతీలలో ఆసరాగా ఉంది. తన ఇంటిలో పండుగైనా చుట్టంలా పిలుచుకుంటుంది. రచయిత ఇంటిలో ఆమె లేకుండా పండుగ జరగదు. కొన్ని చోట్ల వెట్టి అణచివేస్తే మరికొన్ని చోట్ల ఆదరించినదీ మరవ వద్దు. ఇది మాదిగ వృత్తి సంబంధం తెచ్చిన వెట్టి మాయితనం వలన ఆత్మీయతలు కూడా ఉన్నాయని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ.
తెలంగాణ దళిత కథలు నిజాం కాలం నుంచి గ్రామీణ సమాజంలో నెలకొన్న వెట్టి వ్యవస్థ దారుణ స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భూస్వాముల దోపిడీ, అప్పులు, హింస, మానసిక అణచివేతలే. తిండి, స్వేచ్ఛ, గౌరవం లేకుండా తరాల తరబడి బానిసత్వం అనుభవించిన దళితుల వేదనే ఆనాటి సామాజిక చరిత్రకు నిజమైన సాక్ష్యం. వెట్టి చాకిరీ వ్యవస్థ దళితులపై జరిగిన ఘోర దోపిడీకి ప్రతీక. ఆ బాధను, అవమానాన్ని, అణచివేతను స్పష్టంగా ప్రతిబింబించిన కొన్ని కథలు మాత్రమే..
( ఇంకా ఉంది. )