ఓ బుద్ధిజీవీ
నువు బొద్దింకవే
చెరపట్టడం, చెరపడమే చరిత్రైన చోట
చెదలు తొలుచుకుంటూ
సత్యాన్వేషణ చేస్తున్నందుకు
ఓ బుద్ధిజీవీ
నువు బొద్దింకవే
ఇందుకలదు అందులేదని
విశ్వమంతా ఎగబాకిన
కుల మలం కుత్తికకు
కలం కత్తెర వేస్తున్నందుకు
మతమౌఢ్య
విశ్వ గురువును
మనిషిగా మారమంటున్నందుకు
ఓ బుద్ధిజీవీ
నువు బొద్దింకవే
బొడ్డు తెగినప్పటినుండీ
బొందలకు పొయ్యేదాకా
పై నుండి కిందికి
మట్టి మనుషుల
పట్టి పీడిస్తున్న
పరాన్నజీవుల ఆశలకు
గండికొడుతున్నందుకు
ఓ బుద్ధిజీవీ
నువు బొద్దింకవే
బురదజల్లినా
బుల్డోజర్లను పంపినా
కగార్లొచ్చినా
కాల్చి చంపినా
ఉక్కుపాదం మోపి
ఉన్మాదుల దించినా
ఉపాలొచ్చినా
ఊకదంపుడు ప్రవచనాలొచ్చినా
కుతికెల మీద కత్తి పెట్టినా
కాలాన్ని, గళాన్ని ఎత్తిపట్టినందుకు
ఓ బుద్ధిజీవీ
నువు బొద్దింకవే
ఓ బుద్ధిజీవీ
బొద్దింక చీకట్లో చీకటై
ఆకలిదప్పులు మాని
అలుపెరుగక పనిచేసే
అంటరాని ప్రకృతి శ్రమజీవి
అది అణుబాంబులు పడ్డా
చావదట
కానీ జ్ఞానం పుట్టే ప్రయోగశాలల్లో
నవ్వుతూ ప్రాణమిస్తుందట
ఓ బుద్ధిజీవీ
బొద్దింకలా
విస్ఫోటనాలను తట్టుకుంటేనే బతుకు
ప్రగతి ప్రయోగాలు చేస్తూనే బతుకు
బుద్ధిజీవులు జిందాబాద్
మూఢజీవులు ముర్దాబాద్