సవాన్న లో చావని కథలు  

ఆఫ్రికన్ సాహిత్యం లో సంప్రదాయ సంస్కృతి, వలసవాద వ్యతిరేక ఉద్యమాలు, స్వాతంత్ర్య అనంతర జాతీయవాద రాజ్యం  నేతల  లొంగబాటు విధానాలు కలగలిసిపోతాయి.మండేలా ఆత్మ కథ “లాంగ్ వాక్ టు ఫ్రీడం”  జాతీయ ఉద్యమ నేపథ్యంలో ఆయన స్వాతంత్ర్య నేతగా ఎదిగిన తీరు చూపిస్తుంది. మరోవైపు బ్రిటన్ లో  స్థిరపడిన అబ్దుల్ రజాక్ గుర్నా,  అమెరికా లో ఉన్న చిమమాండ   అదీచీ లాంటి వారు ఆఫ్రికన్ సంస్కృతి, దాని అంతర్గత విభేదాలు తో పాటు  వలస జనుల బాధలను చిత్రించారు.

డాన్ ఇజేబయే రాసినట్లు యూరోపియన్ ప్రభావంతో నవల ఎన్నో కొత్త పుంతలు   తొక్కింది. పాత వివేక సంస్కృతిలో మాట, కొత్త సంస్కృతిలోనే రాత రెండు కలిసి అచెబె, గూగీ లాంటి రచయితల రాతల్లో కనిపిస్తాయి. ఆఫ్రికా స్వాతంత్ర్యం లో రాజకీయ వ్యక్తీకరణను కనుగొన్న ఆఫ్రికా యొక్క సహజాతాన్ని నొక్కి చెప్పాడు. తన నవలల్లో వాస్తవిక సంప్రదాయానికి రాజీలేని విధేయతతో సామాజిక అనుభవాన్ని ఎంపిరికల్ విలువలకు అనుగుణంగా పరిశీలించాడు. “సవాన్న లో చీమల పుట్టలు” (Anthills of Savannah)  నవలలో అచెబె గత రచనల్లోని సామాజిక సమస్యలు, రూపాల పద్ధతులతో పాటు  స్థానిక జ్ఞానం యొక్క స్థాయి , వర్తమాన ప్రాసంగికత, జాతి పరిస్థితి,నాయకత్వ స్వభావం,  లైంగిక వివక్ష,  భిన్న దృక్పథాలతో  భిన్న వర్గాలు తమ కథలు చెప్పాల్సిన అవసరం , నిరంకుశత్వం కూడా అణిచివేయలేని సమాచార  ప్రభావం ఉన్నది.

ప్రఖ్యాత రచయిత అయిన అచెబె  రచనల్లో కథలు, కవిత్వం, నవలలు ఉన్నాయి.అతని ప్రఖ్యాత నవలల్లో “థింగ్స్ ఫాల్ అపార్ట్,” “ ఏరో ఆఫ్ గాడ్,” “నో లాంగర్ ఎట్ ఈజ్,” “ ఏ మ్యాన్ ఆఫ్ పీపుల్” ఉన్నాయి. తన నాన్ -ఫిక్షన్ రచనలు “హోప్ అండ్ ఇంపెడిమెంట్స్,” “హోమ్ అండ్ ఎక్సైల్,” “ది బ్రిటిష్ ప్రొటెక్టెడ్ చైల్డ్” లలో తన వ్యక్తిగత, రచనా వికాసం, పాఠ శాలలో చదువుకున్న జాయిస్ క్యారీ మిస్టర్ జాన్సన్ లాంటి పుస్తకాలలో అంతర్గత వర్ణవాదం , నిజ జీవితంలో బస్సు ప్రయాణంలో తాను ఎదిరించిన  వర్ణవాద  ఘటనలు, భాష పైన , సంస్కృతి పైన తన అభిప్రాయాలు వెల్లడించాడు.

ఈ నవలలో వెస్ట్ ఆఫ్రికాలో  కంగాన్ అనే ఊహాజనిత దేశం( నిజానికి  నైజీరియా) ఒకే పాఠశాలలో చదివిన  ముగ్గురు స్నేహితుల్లో సామ్ మిలటరీలో చేరి ఎదిగి ఒక తిరుగుబాటులో అధ్యక్షుడు గా మారతాడు. కవి, తిరుగుబాటు స్వభావం ఉన్న ఇకెం ఓసోడి నేషనల్ గెజిట్ వార్తాపత్రిక సంపాదకుడుగా ఉండి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తాడు. మరొకరు అయిన క్రిస్ , సమాచార కమీషనర్ గా ఉండి మధ్యే మార్గంలో ఉంటాడు. క్రిస్ కు ఆత్మీయురాలు, ఇకెం స్నేహితురాలు అయిన  బియాట్రిస్ ఆర్థిక మంత్రి వర్గంలో సీనియర్ సహాయ కార్యదర్శిగా ఉంటుంది. క్రిస్టోఫర్ ఓరికో లేదా క్రిస్, ఇకెం ల మిత్రుల మధ్య  మరింత సామరస్యానికి యత్నిస్తుంటుంది. ఇకెం విమర్శలు , గతంలో రిఫరెండంలో తాను జీవిత కాలం అధ్యక్షుడుగా ఉండేందుకు సహకరించలేదు అనే  సాకుతో అధ్యక్షుడు  సామ్ ఇకెం ను పత్రికా సంపాదకుడుగా తొలగించి,   కుట్ర నేరం మోపి జైలు పాలు చేస్తాడు. క్రిస్ సైతం  సామ్ కు చిక్కకుండా పారిపోతూ ఒక సైనిక దుండగుడు నుంచి ఒక యువతిని రక్షించే క్రమంలో కాల్పులుకు గురై మరణిస్తాడు. మరో తిరుగుబాటు లో అధ్యక్షుడు  సామ్ సైతం మరణిస్తాడు.నవలలో కథనం  పాత్రల భిన్న స్వరాల్లో , రచయిత సర్వజ్ఞ గొంతుకలో కూడా చెప్పబడుతుంది.

అయితే ఈ నవలలో ఇకెం ఓసోడి తాను  సంపాదక స్థానం  కోల్పోయిన తర్వాత ప్రజలతో మాట్లాడుతూ కథలు చెప్పేవారంటే మానవ ఆత్మ స్వాతంత్ర్య హక్కు  లాక్కునే వారు  రాజ్యం, చర్చి లేదా మసీదు, పార్టీ సమావేశం,  యూనివర్సిటీ, లేదా ఎక్కడైనా సరే,  వారైనా భయపడతారని అంటాడు.అవకాశవాద కార్మిక నేతల్ని విమర్శిస్తాడు.  విద్యార్థుల ప్రశ్నలకు జవాబులిస్తూ దేశం లోపలి వారు కూడా నేటి స్థితికి కారణమని,  కార్మిక వర్గ నియంతృత్వం, ప్రజాస్వామిక నియంతృత్వం అనే పడికట్టు పదాలు వాడటం మాని  అందరూ సొంతంగా ఆలోచించాలి అని, విద్యార్థులు సైతం విశాలంగా ఆలోచించి తెగవాదం, మత తీవ్రవాదం ప్రశ్నించారా అని అడుగుతాడు. ప్రజా వ్యవహారాలు కొందరు సైనిక- రాజకీయ నేతలు, వ్యాపార , అధికార వర్గాల చేతుల్లో ఉండిపోయాయి. ప్రభుత్వ వైఫల్యం శ్రామికుల అణచివేత, నిషేధాలలో విదేశీ విధాన అనుసరణ లో కాక ప్రజలతో బలమైన సంబంధాల లేమిలో ఉంది అంటాడు.

నవలలో స్త్రీ పాత్రలు  బియాట్రిస్, ఎలేవా ల స్వతంత్ర భావాలు, ఇకెం తో ముందు గొడవ పడి తర్వాత  అతని గురించి తెలిసి క్షమాపణ కోరే కారు డ్రైవర్, బీట్రిక్ వంటమనిషి అగాధ తదితర పాత్రలు ఉన్నాయి.

 క్రిస్ స్నేహితురాలు బియాట్రిస్ ను అధ్యక్షుడు సామ్ తన రిసార్ట్ లో విందుకు పిలిచి అమెరికన్ మహిళా జర్నలిస్ట్ తో  భేటీ ఏర్పాటు చేస్తాడు. తర్వాత బియాట్రిస్  తో నృత్యం చేస్తూ దగ్గర అయ్యేందుకు యత్నిస్తాడు. ఆమె తాను వైట్హౌస్ కు వెళ్లి ప్రవేటు డిన్నర్ పార్టీలో అధ్యక్షుడు,  డిఫెన్స్ చీఫ్, డైరక్టర్ ఆఫ్ సి ఐ ఏ ను బందీ గా తీసుకోగలనా అని అడిగితే వెళ్ళిపోతాడు.తర్వాత బియాట్రిస్   తన ప్రియుడు క్రిస్ తో తన్ను అలా దూరం  పంపినందుకు నిరసన వ్యక్తం చేస్తుంది. తర్వాత కూడా తన క్రిస్ కు , తనకు  స్నేహితుడు అయిన ఇకెం ఆమె దగ్గరకు వచ్చి ఆమె  తనకు సమాజంలో స్త్రీ పాత్ర పట్ల అవగాహన కల్పించిందని  పొగుడుతాడు. అయితే ఆమె క్రిస్ ను ప్రేమించి , ఇకెం ను కేవలం  అభిమానించి సాన్నిహిత్యం మితి మీరనీయదు. చివరలో క్రిస్ పారిపోతూ తన మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న విషయం ఇతర సన్నిహితులతో ప్రస్తావిస్తుంది.

మరో సంఘటనలో ఇకెం రాజధాని బస్సా కు అధ్యక్షుడిని కలిసేందుకు వచ్చిన అబాజోన్ కు చెందిన ఒక రైతు ప్రతినిధి బృందంతో సమావేశం అవుతాడు. అక్కడ ఒక వృద్ధ ప్రతినిధి పోరాటం, కథ చెప్పటం రెండూ కావాలని, కథయే యుద్ధం, యోధుడు ముగిసిన తర్వాత నిలుస్తుంది అని , భవిష్యత్తును సొంతం చేసి , మనిషికి పశువుల నుంచి, ఇతర   మానవ జాతుల  నుంచి  ప్రత్యేకత ఇస్తుంది అని చెబుతాడు. అచెబె తన నవలలో కథన ప్రాముఖ్యతను ,  వేటగాడు కాక వేటాడబడే ప్రాణి తన కథ చెప్పాల్సిన అవసరం ఎంతో ఆసక్తికర రీతిలో చెప్పాడు.

చినువా అచెబె (1930-2013) ప్రభావం ఇతర రచయితలైన ఫ్లోరా న్వాపా, ఎలేచి  అమాది ,  అదీచీ, గూగీ తొలి రచనల పై, వోల్ షోయింకా, బెన్ ఓక్రీ, బుచి  ఎమెచెటా,  టోనీ మారిసన్ తదితరులపై ఉంది.

చినువా అచెబె ఆంగ్లంలో రాసినా, గూగీ  మొదట ఆంగ్లంలో , తర్వాత    తన సొంత భాష  స్వాహిలి లో రాసినా అవినీతిమయం గా మారిన జాతీయ వాద రాజ్యాల పాలకులు వారిని క్షమించలేదు. గత శతాబ్దిలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలపై నయా సామ్రాజ్యవాదుల, వారి ఆర్థిక సంస్థల ప్రభావంతో  అవినీతి పెరిగింది. కానీ దీనిని పాశాత్య దృక్పథం  ఆఫ్రికా వాసుల  సహజ, అసమర్ధ స్వభావంగా, ఆ దేశాలు ప్రజాస్వామ్య సంస్కృతికి  అనర్హం అంటూ కథనం ప్రచారం చేసింది.

ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో పలు స్వతంత్ర దేశాలు అటు అమెరికా అనుసరణా లేక ప్రత్యామ్నాయ మార్గమా  ఒక సందిగ్ధ స్థితిలో పడ్డాయి. కానీ  నయా సామ్రాజ్యవాద పరోక్ష పట్టు మాత్రమే కాక ప్రత్యక్ష సైనిక దాడులకు తెగబడటం ఇరాక్, వెనిజులా మొదలగు దేశాల చరిత్రలో స్పష్టమే. నైజీరియా రచయితల తీరులో  భారత దేశంలో ప్రాంతీయ భాషల్లో స్థానిక స్థాయిలో తప్ప జాతీయ స్థాయిలో  బయటపడిన నేత- బాబూల ఆర్థిక అవినీతి కుంభకోణాలు, నిరంకుశత్వ పోకడలను ఎండగట్టే  నవలలు తక్కువగా ఉండటం ఆలోచనీయం.

Leave a Reply