మర్చిపోలేనివి

పాబ్లో నెరూడా
(అనువాదం – సుధా కిరణ్)

ఎక్కడికి వెళ్లావని అడుగుతావు నువ్వు
అది అంతేనని జవాబిస్తాను నేను
బండరాళ్ళు నలుపెక్కిన నేల గురించి
ప్రవహిస్తూ ఇంకిపోయిన నది గురించి నేను మాట్లాడాలి
పక్షులు వదిలేసిపోయిన గూళ్ళు
నేను వదిలి వచ్చేసిన సముద్రం
కన్నీళ్ళు పెట్టుకున్న నా చెల్లెలు
ఇవి మాత్రమే నాకు తెలుసు
ఎందుకు, ఇన్నిన్ని స్థలాలు
ఎందుకు, రోజు తర్వాత రోజు ఇలా కాలం దొర్లిపోవడం
ఎందుకు, పెదవుల మధ్య నల్లని చీకటి రాత్రి నిండిపోవడం?
ఎందుకు ఇందరిందరి మరణాలు?

ఎక్కడినుంచి వచ్చావని నువ్వు అడిగితే
విరిగిపోయిన వాటి గురించి
మాడి మసిబారిన వంటపాత్రల గురించి
కుళ్ళిపోయిన కళేబరాల గురించి
దుఃఖభారంతో కుమిలే నా హృదయం గురించి
నేను మాట్లాడాలి

మనం కలిసి, వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు వట్టి జ్ఞాపకాలు కారు
జ్ఞాపకం అంటే అంతా మర్చిపోయి గూటిలో నిశ్శబ్దంగా నిదురించే పసుపుకాళ్ళ పచ్చ పావురం కాదు
అవి కన్నీటి చారికల ముఖాలు
మాట పెగలకుండా గొంతు చుట్టూ బిగుసుకునే వేళ్ళు
చెట్ల ఆకుల నుంచి బరువుగా జారిపడే నీటి బిందువులు, ఇసుక రేణువులు
నెత్తురుతో, విషాదాలతో
దొర్లిపోయిన మన నిన్నటి రోజుల చీకటి నీడలు

ఇవిగో, ఇక్కడ ఊదారంగు పక్షులు, సీమ పక్షులు
చుట్టూ కనిపించేవన్నీ మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి
అందమైన అక్షరాలతో కాగితాల మీద
కాలమూ, మాధుర్యమూ కరిగిపోతాయి

అంతే, అంతకు మించి రుచి చూడాలనుకోకు
మౌనం పేరుకున్న పెళుసు పొరలని మరిమరీ కొరికి చూడకు
ఇంతకు మించి ఇంకేం ఏం మాట్లాడాలో తెలియదు నాకు
చాలామంది చనిపోయారు
ఎర్రటి సూర్యుడు బీటలు వారిన సముద్రపు గోడలు
సముద్రంలో పడవలకి తగిలే శవాల తలలు
ప్రేమగా జ్ఞాపకాలని పొదువుకునే చేతులు
ఇక్కడ నేను మర్చిపోవాల్సినవి ఎన్నెన్నో

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply