విషం!

పుట్టలో పట్టనన్ని పాములు! సర్దితే అడవికి సరిపోయినన్ని పాములు! ఆఫీసు నిండా ఫైళ్ళన్ని పాములు! ఒక పుంజిడు కాదు! రొండు పుంజాలు కావు! ఏకంగా పది పుంజాలు! మొత్తం నలభై పాములు?!

బుస్సుమన్నాయి! బుసలుకొట్టాయి! పరుగులెత్తాయి! పడగలెత్తాయి! తాటించాయి! తలలాడించాయి! నీరు పల్లమెరిగినట్టు నిజం దేవుడెరిగినట్టు పాములు పగనెరిగినట్టు పలుదిక్కుల ప్రవహించాయి?!

అది గవర్నమెంటు ఆఫీసులా లేదు! స్నేక్ పార్కులా వుంది! సిబ్బంది యిబ్బంది పడ్డారు! కుర్చీల్లో కూర్చోకుండా పాముల్ని గౌరవిస్తున్నట్టు కూర్చున్న చోటనే లేచి నిలబడ్డారు! టేబుళ్ళ మీదికి యెక్కి తైతక్కలాడారు! దూకి పారిపోబోయారు! అప్పటికే తలుపులు మూసి బైటనుండి గడియ పెట్టారు రైతులు?!

నిజానికి యింతకు ముందూ రైతులు తిండి గింజలో పప్పులో ఫలములో యేవో… యేవి పండితే అవి.. గోనె సంచుల్లో తెచ్చి అయ్యగార్లకి యిచ్చారు! అడిగినవీ అడగనివీ యిచ్చి మొక్కు చెల్లించారు! చెప్పులు కాదు, కాళ్ళు అరిగేలా ప్రదక్షిణలు చేశారు! అడిగినంత దక్షిణ వేశారు! మొక్కి మొక్కి చేతులు మొండయిపోయేంత వరకూ దండాలు పెట్టి నీల్దార తీశారు! తాము పస్తులూ వుపవాసాలూ వుండి మరీ తీర్ధప్రసాదాలు ధారపోశారు! అయినా సర్కారు దేవుళ్ళు కనికరించలేదు.. కరుణించలేదు… కనీసం కన్నెత్తి కూడా చూడలేదు?!

కంచం లేని యిల్లు వుంటుందని తెలుసును! లంచం లేని ఆఫీసు వుండదనీ తెలుసును! నెలనెలా తీసుకున్న జీతాలు యెలా జీర్ణమవుతాయో తెలీదు! ఎవరికి చెపితే పని జరుగుతుందో తెలీదు! ఏమి చేస్తే పని అవుతుందో తెలీదు! ఇంత విషం తాగి చస్తే బాధల నుండి బంధవిముక్తి అని తెలుసును! ఆనక పెళ్ళాం బిడ్డలు యేమవుతారో వాళ్ళ అతీ గతీ తెలీదు?!


ఆ యిద్దరు రైతులు పుట్టలో చేతులు పెట్టారు! పాము పొడిస్తే బతుకు విడుస్తామని ఆశ పడ్డారు! మెత్తగ తగిలింది! మన్నో తెలీదు! పాము వెన్నో తెలీదు! భయం దొడ్డది! గుణం చెడ్డది?!

చెడుని చెడుతోనే చెడుగుడు ఆడాలి! ముల్లుని ముల్లుతోనే తియ్యాలి! విషానికి విషమే విరుగుడు! విషప్పురుగులకు విషప్పురుగులతో చెపితేనే అర్థమవుతుంది! దెబ్బకి దెయ్యం దిగుతుంది! దిగితీరాలి! చేతులు తడపమన్నప్పుడల్లా చెడ్డీలు తడిచిపోవాలి?!

మూడు గోనె సంచుల నిండా పాములు పట్టి తెచ్చి ఆఫీసులో కుమ్మరించారు రైతులు! ఎప్పటిలాగే ‘నావాటా… నావాటా’ అని వురికి వచ్చిన సిబ్బంది వచ్చిన దార్నే వెనక్కి తగ్గి పరుగులు తీశారు! సినిమాల్లోనూ సీరియళ్లలోనూ గ్రాఫిక్స్ పాములు చూసిన వాళ్ళకి అసలు సిసలు పాములు చూస్తే ప్రాణమాడలేదు! నోట మాట రాలేదు! తెప్పరిల్లి తేరుకున్నాక- కాపాడమని రక్షించమని దేవుడ్ని కోరలేదు! రైతుల్నే కోరారు! బుద్దొచ్చిందని, తలుపులు తియ్యమని, మీ పని చేసి పెడతామని, మేం మీ సేవకులమని అరచి గీ పెట్టి గోలగోల చేశారు!

‘ఇంకెప్పుడూ లంచం అడగరా?’ తలుపుల అవతలి నుంచి వుగ్గబట్టి వుప్పెనైన రైతుల గొంతులు! ‘అడగం… అడగం..’ ముక్తకంఠంతో సిబ్బంది! ‘మా దగ్గరే కాదు, యెవరి దగ్గరా అడక్కూడదు’ రైతుల హెచ్చరిక! ‘అడగం… అడగం..’ సిబ్బందిది దుఃఖంలోనూ వొకే గొంతుక! ‘జీవితంలో మళ్ళీ లంచం ముట్టుకోమని చెప్పి రాసి యివ్వండి’ రైతులు ఆదేశిస్తున్నట్టు అడిగారు! ఈసారి సిబ్బంది నుండి యెటువంటి సమాధానమూ రాలేదు! గూడుకడుతున్న నిశ్శబ్దానికి అనుమానమొచ్చిన రైతులు తలుపులు తెరవకుండా కిటికీ దగ్గరకు వెళ్ళి తొంగి చూశారు!

రైతులు కన్నార్పకుండా చూస్తున్నారు! తాము చూస్తున్నది నిజమో కాదో అర్థంకాక వొకర్ని వొకరు గిల్లుకున్నారు! ముఖా ముఖాలు చూసుకున్నారు! మళ్ళీ కిటికీ లోంచి లోపలకు చూశారు! సిబ్బంది వొక్కొక్కడూ వొక్కో కృష్ణుడు! అది ప్రభుత్వ కార్యాలయం కాదు, పక్కా కాళింది మడుగు! ఒక్కో పాము వొక్కో కాళీయుడై తలలాడిస్తున్నాయి!

పడగల మీద పద విన్యాసాలు లేవు! తలల మీద యెక్కి తొక్కడాలు తన్నడాలు లేవు! తాడవల మీద తాండవ నృత్యాలూ లేవు! ఆయుధాలు అసలే లేవు! హింసకు తావులు లేవు! అన్నీ ధర్మానికి దారులే! అహింసా పరమో ధర్మః?!

‘పాముల్లారా… పాముల్లారా… మీరు కాటేయొచ్చు.. మేం మిమ్మల్ని నెత్తి బద్దలుగొట్టి చంపేయొచ్చు! నురగలు కక్కుకుంటూ యిటు చావు.. నెత్తురు కక్కుకుంటూ అటు చావు! ఎటయినా చావు చావే! నష్టం నష్టమే! కాబట్టి ముందు మనం బతుకు గురించి మాట్లాడుకుందాం! ఎవరి బతుకు వాళ్ళకే ముఖ్యం… యెవరి ప్రాణం వాళ్ళకే ప్రాణం! అంచేత మనం వొకళ్ళనొకలు గౌరవించుకోవడం యిరు పక్షాలకూ లాభం!’

చెవుల్లేని పాములు వొళ్ళంతా చెవులు చేసుకు వింటున్నాయి! అంతర్ చెవులు తెరచుకోవడానికి లేకపోయినా వాటి అంతరాత్మ తలుపులు తెరచుకున్నాయి! దవడల సాయంతో గాలిలోని ప్రకంపనల్ని గ్రహించాయి! రవ్వంత శబ్దాన్ని కూడా జారిపోనివ్వడం లేదు! నాదస్వరం వూదుతున్నట్టు పాములు తన్మయంతో తలలాడిస్తూ తాగినట్టు వూగుతున్నాయి! మాటల మంత్రాలకు కట్టుబడిపోయాయి! బుద్ధజీవులై బందీ అయిపోయాయి?!

రైతులు వుస్సు అన్నా లేదు! ఇస్సు అన్నాలేదు! పాములు కస్సు లేదు! బుస్సు లేదు! ఏమన్నా యేమీ అనకపోవడంతో మనం తెచ్చినవి పాములేనా అని రైతులు అనుమానపడ్డారు! కనికట్టు గాని జరిగిందా అనుకున్నారు! ‘సెరుపా.. సిల్లంగా?’ అని ఆందోళన పడ్డారు!

‘మేం పుట్టిన నుండి పెట్టుబడులు పెట్టి బడుల్లో చేరాం! ఏళ్ళకు యేళ్ళు యెంతో ఖర్చు చేసి కాలేజీల్లో కోచింగుల్లో చదువుకొన్నాం! పోటీలు పడి లంచాలు పెట్టి వుద్యోగాలు కొనుక్కున్నాం! పెట్టిన పెట్టుబడికి తగ్గ ఆర్జన వుండొద్దా… అసలూ వడ్డీ రావద్దా? సర్కారీ కొలువులో వుండి సంపాదించుకోకపోతే అది అవమానమా కాదా… మా ముఖాన తుప్పున వుమ్మేయరా? పైరాబడి లేకుండా యీ రోజుల్లో జీతం మీద బతకడం సాధ్యమయ్యే పనేనా? అయినా పైనుండి కిందివరకూ అందరికీ యెవరి పర్సంటేజీలు వారికి యిచ్చుకోవద్దా?’

పాములు ఔననలేదు! కాదనలేదు! కదలలేదు! మెదలలేదు! పాములు మనుషులతో కాక తోటి పాములతో వున్నట్టే వున్నాయి! మంతనాలు ఆడుతున్నట్టే వున్నాయి! మతులు పోయినట్టే వున్నాయి?!

‘అసలు మీరు వొత్తి పుణ్యానికి కాటెందుకు వెయ్యాలి? ఉచితంగా కాటేస్తే ఆ కాటుకు విలువుంటుందా? ప్రాణ భయంతో కాటు వేస్తే కనీసం అర్థం వుంటుంది! అదంతా కాదు, అసలు మీకు మీ విషం విలువ తెలుసా? అదెంత కాస్ట్లీనో తెలుసా? అదెంత సంజీవనీ ఔషదమో తెలుసా? కోట్లు పెడితేకాని రాని విషం వొత్తికొత్తినే వృధా చేసి పారెస్తారా?’

‘లేదు పారెయ్యం…’ అన్నట్టుగా పాములు అడ్డంగా తలలాడించాయి! తాము ప్రాణాలు తీస్తామన్న నిందను మొయ్యడమే తెలుసు! ప్రాణాలు పోస్తామన్న నిజమే తెలీదు! తాము కక్కే విషం మనుషులకు అమృతం కావడం వింటే అంతా అయోమయంగానే కాదు, అన్యాయంగానూ అనిపించింది! అవసరానికి వొకలా ఆపదకి వొకలా వుండబట్టే పుట్టలో పాలు పోసి పూజించే మనుషులే బడిత పూజలతో బతుకుల్ని ఆర్పేసిన అనుభవాలు కళ్ళముందు కదలాడాయి! తాతలూ తండ్రులూ కళ్ళముందు కదలాడినాక కాటేయకుండా పాములు భయంతో వొకదాన్ని వొకటి వాటేసుకున్నాయి! పాములిప్పుడు సరీసృపాలు కాదు, సాదు జంతువులు?!

‘పాముల్లారా… పాముల్లారా… ఆ రైతులిద్దరూ మీకేమయినా పెంచారా? పోషించారా? కానుకలిచ్చారా? గిట్టనివాళ్ళూ భాషాభావం అర్థంకానివాళ్ళూ కానుకల్ని లంచాలు అంటే అననీ! ఏమిచ్చారని ఆ రైతులకు మీరు తెలిసో తెలియకో సాయపడుతున్నారు? మాకు జరిగే అపకారం అన్యాయం సంగతి అటుంచి యిందులో మీకు జరిగే న్యాయమేమిటి? మీకేమి లాభమని… మీకేమి సంబధమని… మీరెందుకు బలై పోవాలి?’

పాములు పడగలు దించాయి! పాదాక్రాంతమైపోయాయి! సాష్టాంగ పడ్డట్టు నేలకు తలలు ఆన్చాయి! గీత వింటున్న అర్జున పార్థ కిరీటి లయిపోయాయి! తమ అజ్ఞానానికి సిగ్గు పడ్డాయి! మనుషుల్ని చూసి నేర్చుకోవాల్సింది యెంతో వుందని కూడా అనుకున్నాయి! మనుషులందరూ పండితులని పాములన్నీ పామరులనీ కూడా అప్పటికప్పుడు తెల్చేసుకున్నాయి!

రైతులు నోళ్ళు తెరిచారు! నొసలు చిట్లించారు! ఎందుకో పాముల కన్నా తోటి మనుషుల్ని చూస్తే భయం వేసింది! వెన్నులో వొణుకు పుట్టింది! ఒళ్ళంతా చెమట పట్టింది! పాపం పాములు అని కూడా అనిపించింది! ఇన్నాళ్ళూ తలలో విషం వున్నా బతికేశాయి… యిప్పుడు మనుషులు చిమ్మిన విషంతో యెలా బతికి చస్తాయో అని దుఃఖమొచ్చింది రైతులకి!

‘మీకు తలలోనే విషము! మాకు నిలువెల్లా విషమే! విషమే జ్ఞానము! జ్ఞానమే విషము! అనివార్యమైన యీ విషయం గురించి శోకింప తగదు! మీ విషాన్ని మీరే నమ్ముకోండి! మీ విషాన్ని మీరే అమ్ముకోండి!’

మనుషులకు వున్నవిలువ తమ పాములకు యెందుకు లేదో కొద్దికొద్దిగా అర్థమవుతున్నట్టు ఆలోచనగానూ అంతే అయోమయంగానూ చూశాయి! ఈ జ్ఞానం మొదటినుండి వుండి వుంటే తమ జాతి యిలా అంతరించిపోయే దుస్థితి దాపురించి వుండేది కాదని కూడా పాములు గ్రహించాయి! మనం న్యాయానికో ధర్మానికో కట్టుబడి వుండడం కన్నా మన స్వలాభానికి మనం కట్టుబడి వుండడం మనకీ మన జాతికీ మేలు అని తెలుసుకున్నాయి! ఉత్కృష్టమైన మనిషి అడుగుజాడల్లో నడవడం వల్ల తమ జాతి నికృష్టమైన స్థితి నుండి బయటపడుతుందని భావించాయి! అందుకే పాములు కాటు వేయడం మరచిపోయాయి! అటవీశాఖాధికారులూ సిబ్బంది వస్తే చేతులిచ్చి లొంగిపోయాయి! తిరిగి గొనె సంచుల్లో బంధించబడ్డాయి పాములు!

ఊపిరి తియ్యడం మర్చిపోయి కాళ్ళూ చేతులూ ఆడక కిటికీ దగ్గరే నిలబడిపోయారు రైతులు! అచేతనులై వున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు! ఊచలు లెక్కబెట్టడానికి జీపెక్కించారు! పిచ్చి పాముల్ని తలచుకొని నవ్వుకునారు ఆ యిద్దరు రైతులు! ‘పాగల్ హే క్యా’ అని పోలీసులు తిట్టారు! రైతుల మీద కేసులు బుక్ చేస్తుంటే- వాళ్ళలా పిచ్చివాళ్ళలా నవ్వుతుంటే- గోడెక్కిన జాతిపిత చిత్రంగా తాను కూడా నవ్వాడు!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

3 thoughts on “విషం!

  1. చాలా సంవత్సరాల క్రితం ఇలా పాములు ఆఫీసులో వదలడం నిజంగానే జరిగింది. కొత్త ఆలోచన. కానీ రాటుతేలిన ప్రభుత్వ ఉద్యోగులు అన్నిటినీ ఎదుర్కోగలరు. దేశం లోని అన్నిసమస్యలకీ కారణం లంచాలే. అవి ఎప్పటి కీ పోవు. పోవు.. పోవు…

  2. బజారా గారూ మెదయిన ప్రత్యేక శైలిలో చాలా బాగా రాశారు. ప్రస్తుత పరిస్థితిని బాగా చూపించారు

Leave a Reply