‘ప్రపంచవ్యాప్త బాధాతప్త ప్రజలందరినీ
కూడగట్టడానికి
కాలం తనలోకి క్షణాలన్నిటిని
సంఘటితం చేసుకుంటున్నది’
-జి ఎన్ సాయిబాబా
ప్రొఫెసర్ సాయిబాబా యిప్పుడు మరణానంతరం జీవిస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో ఆయన జ్ఞాపకాల్లో దేశవ్యాప్తంగా సామాజిక సాహిత్య లోకం ఆయనను ఫాసిస్టు సందర్భంలో పోరాట చైతన్యానికి ప్రతీకగా భావిస్తోంది. గత పదేళ్లుగా ఫాసిజం సాహిత్య కళా మేధో రంగాల్లో అనేక సంక్లిష్టమైన సవాళ్లను మన ముందుకు తీసుకు వచ్చింది. ఒక సంక్షుభిత సందర్భంలో కవులు రచయితలు కళాకారులు తమ విలువలతో, ఆచరణతో సంఘటితం కావలిసిన అనివార్యమైన అవసరాన్ని ప్రొ. సాయిబాబా లాంటి బుద్ధిజీవులు గుర్తించారు. ఐక్య సంఘటనలు నిర్మించారు. అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. చావుని నిరాకరించిన సాయిబాబా జీవిత ఆచరణ హక్కుల కార్యకర్తలకు ఆదర్శమైంది. సాహిత్య జీవులకు కావ్య వస్తువైంది. కవిత్వంలో బలమైన వస్తువే బలమైన అభివ్యక్తికి హేతువు అవుతుంది అని మరోసారి సాయిబాబా మరణ సందర్భం నిరూపించింది. సాయిబాబా జీవిత ఆశయం, అంగవైకల్యాన్ని అధిగమించి పీడిత ప్రజానీకం కోసం ఆదివాసి హక్కుల కోసం చేసిన పోరాటం, పది సంవత్సరాల పాటు ఆయన యెదుర్కొన్న క్రూర నిర్బంధం, దుర్భరమైన అండా సెల్ జీవితం, స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పెనుగులాట, అమానవీయమైన అణచివేతకు పూనుకున్న రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడిన ధీరత్వం, స్వేచ్ఛకు చిహ్నమైన చక్రాల కుర్చీ.. యివన్నీ సాహిత్య సామగ్రి అయ్యాయి. సాయి సహచరి వసంత సాయి స్వేచ్ఛ కోసం పడిన ఆరాటం, కౌమారంలోనే తండ్రి వొడికి దూరమైన సాయి కుమార్తె మంజీరా తండ్రి అందించిన నినాదాన్ని అందిపుచ్చుకున్న తెగువ కవిసమయాలయ్యాయి.
‘నాకు సానుభూతి మీద నమ్మకం లేదు. నేను సంఘీభావాన్ని మాత్రమే నమ్ముతాను. నా స్వేచ్ఛ మీ స్వేచ్ఛ కూడా.’
‘అభాగ్యులకు అండగా నాతోపాటు నిలబడటానికి వస్తున్న ప్రతి ఒక్కరిలో నేను స్వేచ్ఛను పొందుతున్నాను.’
అన్న సాయిబాబా విస్పష్ట ప్రకటనని అందిపుచ్చుకొని అతని పోరాట చేతనని కాగడా చేసుకుని ‘యువకవులు రాసిన కవితలు – స్వప్నాల ప్రేమికుడు : జి. ఎన్. సాయిబాబా’.
‘స్వప్నాల ప్రేమికుడు’ సంకలనం సాయిబాబా మరణంపై సానుభూతితో రాసిన కవిత్వం కాదు. సాయి ఆశయాలను కొనసాగిస్తామని ప్రకటించిన ఉమ్మడి హామీ పత్రం. ఉడుకు నెత్తుటితో చేసిన సంతకం. సాయి నడిచిన మార్గానికి సంఘీభావం. అతని ఆలోచనలకు చేర్పు. అతని సృజనాత్మక వ్యక్తీకరణకు విస్తరణ. అతని నినాదానికి ప్ల కార్డు. అతని ఆచరణకు అనుసరణ.

స్నేహితులారా
నా హృదయంలో హృదయాల్లారా
మీ గుండె లోతుల్లో
అంత ప్రేమ ఉన్నప్పుడు
ఈ సంక్షుభిత వేళ
ఎందుకు మీ నిశ్శబ్దాన్ని బద్దలు చేయరు?
మీరెందుకు ప్రతిసారీ
కీలక సమయాల్ని
చేజార్చుకుంటారు?
మీ కనురెప్పలను కుంగదీసేంత భారం మీపై ఉన్నప్పుడు
మీరెందుకు ఈ నిశి రాత్రి
ప్రేమ గీతాలు ఆలపించరు? (ది లవింగ్ కబీర్)
అన్న సాయిబాబా ప్రశ్నలను అందుకొని నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ బహిరంగంగా కవిత్వ వీథుల వెంబడి బిగ్గరగా అరుస్తూ వెళ్తున్న యువకవుల సామూహిక నినాదమిది. ‘ఈ పురాతన దుఃఖానికి దయలేని విషాదానికి ప్రేమ ఒక్కటే మందు’ అన్న సాయి హృదయాన్ని తమలోకి వొంపుకున్న మమైకత యిది. స్పందించక తప్పని కీలక సమయంలో తిరిగి రాస్తున్న ప్రేమలేఖ యిది.
ఆజీవితం సాయిబాబా చేసిన పోరాటాల పట్ల అపరిమితమైన అభిమానంతో పరిధిలేని ప్రేమతో హాథీరాం సభావట్ సంపాదకత్వం వహించిన యీ సంకలనంలో 34 మంది కవుల స్ఫూర్తి కవితలున్నాయి. ఇది సాయిబాబా పై ఎలిజీ కాదు. అతని స్ఫూర్తిని అందుకొని ముందుకు సాగుతామని చేసిన ప్రతిజ్ఞ. ‘ప్రపంచ విప్లవ మానవుడై’న సాయిబాబా ఆచరణ పట్ల సంఘీభావం, చావుని నిరాకరించిన అతని నిబద్ధత పట్ల ఆరాధన, అతనిపై అమలైన రాజ్య హింస పట్ల వ్యతిరేకత, క్యాన్సర్ తో చనిపోయిన తల్లిని చూడటానికి కూడా అంగీకరించక సాయిని నిర్బంధించిన అన్యాయ వ్యవస్థపై క్రోధం, నిరంతర చైతన్యంతో జ్వలించిన అతని వ్యక్తిత్వం పట్ల స్వచ్ఛమైన ప్రేమ ప్రతి కవితలోనూ గోచరిస్తాయి. తరగతి గదిలో పోరు పాఠం చెప్పిన అధ్యాపకుడు అలుపెరుగని న్యాయ పోరాటం చేసిన విప్లవకారుడు కరకు రాతి జైలు గోడలపై పూలు పూయించిన కవి విద్వేష వికృతాన్ని అంతమొందించగల ప్రేమ దేవతను ఆరాధించిన విశ్వ ప్రేమికుడు అయిన సాయిబాబా పట్ల వొక రకమైన హీరో వర్షిప్ సైతం ప్రతి వాక్యంలోనూ భాసిస్తుంది. సాయి అనునిత్యం కలవరించిన విప్లవ నుడికారం ప్రతిపదంలోనూ అనునాదమై వినిపిస్తుంది.
36 కవితలు. 34 మంది కవులు. వీరిలో కొత్తగా కవిత్వం రాస్తున్న వాళ్లున్నారు, ఇప్పటికే రెండు మూడు కవితా సంపుటులు ప్రకటించిన వాళ్ళూ వున్నారు, కనీసం పదిమంది కవయిత్రులున్నారు. ఇంకా చదువుకుంటూన్న విద్యార్థులున్నారు. నిరుద్యోగులున్నారు. ఉపాధ్యాయులున్నారు. జీవిత కఠోర వాస్తవికతను యిప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వీరికి సాయిలోని రాజ్య ధిక్కార స్వభావంతో పాటు ప్రేమతత్వం యెక్కువగా నచ్చినట్టుంది. సాయిలోని విప్లవ స్వాప్నికుడు మరింతగా నచ్చినట్టున్నాడు.
అయితే యిది సాయిబాబా వొక్కడి స్వప్నమే కాదు; మనందరి వుమ్మడి కల. అతనిలా అసంఖ్యాకులు అమాయకులు యే నేరం చేయకుండా యింకా జైళ్ళలో మగ్గుతూనే వున్నారు. సాయిబాబా మరణం యీ కవుల్ని వారందరి దగ్గరకు చేర్చింది. వారి రాజకీయ ఆచరణ గురించి ఆలోచించేలా చేసింది. సొంత పౌరుల మీదే యుద్ధం ప్రకటించి దేశ సంపదని కార్పొరేట్ కు శాశ్వతంగా దోపు యిస్తున్న దళారి పాలకులు దుర్మార్గం అర్థమయ్యేలా చేసింది. దండకారణ్యం నుంచి కశ్మీర్ మీదుగా పాలస్తీనా వరకు అమలౌతున్న క్రూర హింస గురించి యుద్ధ బీభత్సం గురించి ఆలోచించేలా చేసింది. సమస్త ఆధిపత్యాలపై తిరుగుబాటుకు సమాయత్తం చేసింది. ఒక మరణం యింత మంది మీద యింతగా ప్రభావం చూపటం యిటీవల సంభవించలేదు. ఈ కవిత్వంలో యువతీ యువకులు సాయి విశ్వసించిన విప్లవ విలువలను బేషరతుగా ఆమోదించారు. ప్రపంచ పౌరుడిగా అతని ఆలోచనలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఎక్కడో కోస్తా కోనసీమ అమలాపురంలో పుట్టిన వ్యక్తి ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షలను స్వీకరించటం వీళ్లను ఆకర్షించింది. ఆదివాసుల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం పీడిత మహిళలకోసం అణచివేతకు గురైన సమస్త బాధితుల కోసం ఆయన చేసిన పోరాటాలు కవితా స్ఫూర్తినిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా బాధాతప్త ప్రజలం దరినీ కూడగట్టటానికి నిర్మించిన వుమ్మడి వేదికలు వుద్దీపన కల్గించాయి.
నిజమే; ‘అక్రమంగా పదేళ్లపాటు జైలు జీవితం గడిపి బయటికి వచ్చాక అనారోగ్యంతో అమరుడైనందువల్లనే ఈ కవులు వుద్విగ్నులై చలించిపోయి ఈ కవిత్వం రాయలేదనీ ఆయన రాజకీయ విశ్వాసాల్నీ దృక్పథాన్నీ అర్థంచేసుకున్నారనీ వాటి నుంచి ప్రజా జీవితంలో ఆయన నెలకొల్పిన విలువల్ని గుర్తించార’నీ (యువచాలనం : పాణి ముందుమాట) చెప్పడానికి కవిత్వం నిండా అనేక సాక్ష్యాలున్నాయి.
ఆంధ్రాలో పుట్టి
తెలంగాణను కోరి
కశ్మీరియత్ ప్రజల పక్షమై సాగి
దండకారణ్యం మీదుగా
పాలస్తీనాను ఎదకు హత్తుకున్నవాడివి
హద్దులు లేని ప్రపంచాన్ని కాంక్షించి
భారతదేశపు రాజధానిని
తరగతి గదిగా మార్చిన వాడివి నీవే కదా
నా ప్రియమైన సాయిబాబా (వంగల సంతోష్)
అన్నప్పుడు సాయి నడిచిన మార్గాన్ని కవి యెంత లోతుగా అవగాహన చేసుకున్నాడో యెంత నిండుగా హృదయగతం చేసుకున్నాడో చూడగలం. సాయిబాబాను యెన్నడూ చూడని వాళ్ళు కలుసుకోలేని వాళ్లు కూడా కవిత్వ మాధ్యమంగా అతని ఆలోచనలతో జత కట్టారు. అతని భావనలతో మమేకమయ్యారు. ప్రేమతో వీడని ముడి వేశారు.
‘నా ఆలోచనల జతకాపా
మన్సి నడిచే దోవలో
ముళ్ళు ముడకల్ని తొలగిస్తున్నప్పుడల్లా
నీ చక్రాల బండితో
మా పక్కనే ఉంటావు కదూ’ (పల్లిపట్టు నాగరాజు)
అని అందుకే ఆర్తితో అభ్యర్థిస్తున్నారు.
‘వీళ్లకు సాయి వీల్ చైర్ తో అండా సెల్ తో ఉన్నంత మానసిక పరిచయం ఆయన చేతులతోనే దేశమంతా అంబాడి నేర్చుకున్న నడకలు, పరుగులు స్వప్నాలకు నిర్మాణ రూపాలిచ్చిన ఉద్యమ రూపాలిచ్చిన పోరాటా రూపాలిచ్చిన ఆచరణ కాలంతో ప్రత్యక్ష పరిచయం ఉండకపోవచ్చు కానీ ఆయన ఒక కాల్పనిక గాథ వలె, లెజెండ్ వలె స్వప్నాల ప్రేమికుడిగా కవితో ఊహ చేయటానికి కొన్ని భౌతిక ప్రతీకల ద్వారా గాఢంగా ఈ చివరి రెండు మూడు నెలలు ప్రతి మనిషి మనసులో హత్తుకుపోయాడు.’ అంటారు ఫెలో ట్రావెలర్ (ముందుమాట: సాయి ‘నడిచిన’ బాట). ఇంతకుముందే చెప్పుకున్నట్టు వొక విప్లవకారుడిగా అతను యెన్నో కవి సమయాలు యిచ్చిపోయాడు. సాయి చుట్టూ అల్లిన కవి సమయాల్లో వసంతం అతని హృదయ రాణి వసంత కాదు, రుతువుల రాణి వసంతం అంతకన్నా కాదు; అది వసంత మేఘ గర్జన అన్న స్ఫురణ వీళ్ళకు ఉంది. అలాగే మంజీరా కౌమారంలోనే తండ్రి లాలనకు దూరమైన అతని కుమార్తె మంజీరా కాదు, తెలంగాణలో ప్రవహించే నదీ కాదు; అది పోరాటాల పురిటిగడ్డలో వికసించిన అనేక వుద్యమాలకు ప్రతీక అన్న స్పృహ వుంది (లావణ్య తీగల).
వంద సంవత్సరాలకు పూర్వం యెక్కడో ఇటలీలో ఫాసిస్టు పాలకులు మార్సిస్ట్ మేధావి ఆంటోనియో గ్రాంసి మెదడును పనికిరాకుండా చేయడానికి పూనుకొని నిర్బంధించారు. అలాగే యివ్వాళ యిక్కడ పాలకులు ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబా మెదడు ప్రమాదకరమని భయపడ్డారు. శరీరానికి కాకుండా మెదడుకు శిక్ష విధించారు. చీకటి కొట్లో బంధించారు. ఖైడులోనే అంతం చేయాలని అప్రకటిత ఆదేశాలిచ్చారు. కానీ వాళ్ళు అతని ఆలోచనలకు వాళ్ళు సంకెళ్లు వేయలేకపోయారు తన దేశ పౌరులతో ఆయన చేసే సంభాషణని ఆపలేకపోయారు. జైలు లోపల తన తోటి ఖైదీలకు అండగా నిలబడటాన్ని అడ్డుకోలేకపోయారు. జైలుగదినే అతను తరగతి గది చేసుకున్నాడు. చీకటిలోనే వెలుతురు ప్రణాళికలు రచించాడు. భవిష్యత్ స్వప్నాల్ని కవిత్వీకరించాడు. బయట హక్కుల కోసం పోరాడినట్లే లోపల హక్కుల కోసం కూడా తండ్లాడాడు. ప్రాణాంతకమైన కోవిడ్ రోగాన్ని జయించి న్యాయ పోరాటం చేసి వెలికి వచ్చాడు. పల్లెల్లో నగరాల్లో తనలాంటి అధ్యాపకులు తరగతిగదిలో ‘అరణ్యకాండ’ బోధిస్తున్న వేళ వాళ్ళ గొంతులో ప్రవేశించాడు(సూర్యచంద్ర). గుండెల్లో నిండు అడవిని నాటుకున్నాడు. తనువును కొవ్వొత్తిని చేసి జ్ఞాన కాంతుల్ని వెదజల్లేడు. కలల్ని నిషేధించిన రాజ్యానికి యెదురెళ్లి రాత్రులు వెలిగించాడు (జాబేర్ పాషా). జీవిత పర్యంతం ఆయన నిలబెట్టుకున్న ఆదర్శాలను ‘విలువలను ధీశక్తిని వాటి కారణమైన వర్గ పోరాట రాజకీయాలను’ యీ తరం రచయితలు గుర్తించారు. అనేక రూపాల్లో మన మధ్య చరిస్తున్న సాయిబాబాను మన కాలపు పోరాట చైతన్యానికి ప్రతీకగా భావించారు.
ఈ కవులు సాయిబాబా కళ్ళలో కబీర్ ప్రేమను చూశారు. ఆయన మెదడుని, అది చేసిన ఆలోచనని ప్రేమకీ విప్లవానికీ మధ్య వారధిలా చూశారు(శశిధర్). సాయి మెదడుకు బలమైన భుజాలు మొలిపించారు(ఉదయ్ కిరణ్). వీల్ చైర్ గమనం వేల అడుగులకు పట్టుత్వాన్ని అందించినట్లు భావించారు. సాయి రాసిన జైలు కవిత్వాన్ని గుండెల నిండా నింపుకొని అతని జీవితం నుంచి మరణం నుంచీ పోరు పాఠాలు నేర్చుకునేందుకు యెదురుచూస్తూ వున్నామన్నారు. ఆయన మన మధ్య నుంచి యెప్పటికీ నిష్క్రమించరనీ నిర్ధారించారు (హాథిరామ్). అడవి పచ్చందనంలో ఆదివాసీల ఆటల్లో పక్షుల రావాల్లో తరగతి గది పాఠాల్లో సాయి రోజు పుడుతూనే వుంటాడనీ, సంకెళ్లలోనే చావుని నిరాకరించిన వాడికి చావు ఎక్కడుంటుంది( దియా విజ్ఞేష్) అనీ విశ్వసించారు. మాటలు నేరమైన ప్రతి చోట సాయి మళ్లీ మళ్లీ మాటై పూస్తాడని నమ్మారు. కాలం అంచున చిగురించే నెత్తుటి వసంతాన్నీ కన్నీటి కాలువలో బతుకు పేజీలు తిరగేసే మంజీరాని ఆయనగా సంభావించారు. (సాత్విక ద్యాగలి). కాలిపోయిన అడవిలో సాయిని కోకిల పాటగా అభివర్ణించారు. మరణాన్ని నిరాకరించి సంఘీభావాన్ని స్వప్నించిన సాయి గతం కాదనీ జ్ఞాపకం అసలే కాదనీ అతనొక వర్తమాన విప్లవ నినాదమనీ అతనికి మరణం లేనే లేదనీ (పి సుష్మ) పదే పదే పల్లవించారు. ఆయన మళ్ళీ మళ్లీ మన మధ్య తిరుగుబాటు పిడికిలై మొలుస్తూనే వుంటాడనీ (నాగేష్ యాదవ్) జీవిత పద్యానికి స్ఫూర్తి లక్షణం అవుతాడనీ (ఉమా ఉత్పలిని) ప్రమాదకరమైన అతని మెదడు బుల్డోజర్లతో కూల్చినా కూల లేదనీ (చరణ్) దేశంలో అమలవుతున్న కుట్ర పాఠాలను అర్థం చేయించడానికి స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి తిరిగి వస్తాడనీ (తగుళ్ల గోపాల్) వర్షంలా కురుస్తాడని పువ్వులా పూస్తాడని వెన్నెల కిరణమై ప్రసరిస్తాడని (తండా హరీష్) వేచి చూస్తున్నారు. పాలకులు కార్పొరేట్ బానిసగా మారి అడవి హృదయాల్ని గోసపెడుతున్నప్పుడు గాయపడిన గొంతులో సాయి గొంతుని విన్నారు. నదుల్ని మింగుతున్నప్పడు అల్లాడిన చేపపిల్ల కన్నులలో ఆయన కళ్ళు చూశారు (పేర్ల రాము). ఈ కవితల్ని కవుల ముఖతః ప్రత్యక్షంగా విన్నప్పుడు వాళ్ల గొంతుకల్లో పెల్లుబికిన వుద్వేగం అలవికాని ఆవేశం కదిలింప చేశాయి. తటస్తులు సైతం కన్నీటి కుండలౌతారు. బిగించిన పిడికిళ్ళవుతారు.
అందుకు అవసరమైన నిర్మాణపు బిగి యీ కవితల్లో చిక్కగా పరచుకొని వుంది. చేయి తిరిగిన కవులెవ్వరికీ తీసిపోని వ్యక్తీకరణ కౌశలం అబ్బురపరుస్తుంది. అమృతరాజు కట్టిన పాటలోని పదాల ఎంపిక మౌఖిక లిఖిత రూపాల సమ్మిశ్రిత శైలి చూసినప్పుడు నాకు విస్మయం కలిగింది. అలాగే 36 కవితలకు అద్భుతమైన ముఖచిత్రం రచించిన కళాకారుడు చరణ్ పరిమిని ప్రత్యేకంగా అభినందించాలి. అండా సెల్లో బందీ అయిన వీల్ చైర్ ని, సంకెళ్లను ఛేదించుకొని చిగురెత్తుతున్న మొలకని, స్వేచ్ఛగా యెగిరి పక్షిని వొకే ఫ్రేం లో చేర్చి మొత్తం సంకలనంలోని కవితల సారాన్ని ప్రతీకాత్మకంగా బొమ్మ కట్టించిన 37 వ కవిత అది.
ఇంతకుముందు వైష్ణవి శ్రీ సంపాదకత్వం వహించిన ‘నువ్వెళ్లిన దారిలో…’ సాయిబాబా స్ఫూర్తి కవిత్వ సంకలనంలో ముప్పై ఇద్దరు కవులున్నారు. ఇక్కడ మరొక ముప్పైనాలుగు మంది. ఇద్దరు ముగ్గురు కవులు రిపీట్ అయ్యారు కానీ మొత్తం దాదాపు 60 మంది కవులు సాయి అమరత్వ సందర్భాన్ని పురస్కరించుకొని ఫాసిస్టు సంక్షోభ సమయంలో రచయితలు కవులు కళాకారులు యెక్కడ నిలబడాలో తేల్చి నిర్ధారించారు.
సాయిబాబా మరణం దగ్గర మొదలైన యీ కవులు ఆయన జీవితంలోకి, ఆయన స్వప్నించిన ఆశయాల్లోకి, ఆయన మెదడు వెదజల్లిన ఆలోచనల్లోకి, సడలని నిబద్ధతతో అంకితమైన ఆచరణలోకి, విశ్వసించిన రాజకీయాల్లోకి పయనించారు. సాయితో కవితా సంభాషణ నెరపారు. ఇప్పుడు చక్రాల కుర్చీ వదిలిన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధమయ్యారు.
చివరిగా విప్లవ స్వాప్నికుడు సాయిబాబ అంతిమ యాత్ర సాయిపై అనితర ప్రేమతో జిలుకర శ్రీనివాస్ రచించిన స్మృతి గీతం యీ సందర్భంగా తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి –
విప్లవిస్తున్న జనసంద్రంలో అతడున్నాడు
మీకు అక్కడ తప్పకుండా అతడు కలుస్తాడు
అతడిప్పుడు
వర్గకుల సమరాన్ని తీవ్రంచేసే పనిలో
దేశమంతా సంచరిస్తున్నాడు
అతడికిప్పుడు కోటికోటి పాదాలు మొలిచాయి
కోట్లాది బిగించిన పిడికిళ్లు వున్నాయి
అతడిప్పుడు నిజంగానే మార్చూరీలో నిర్జీవిగా లేడు
అతడు అత్యున్నత చేతనా కేతనమై ఎగురుతున్నాడు
తప్పకుండా మీకతడు ఆ జెండాను చేతికిస్తూ చిర్నవు చిందిస్తూ వున్నాడు
వెళ్లండి. వెళ్లి కరచాలనం చేసి
గుండెకు అద్దుకోండి.
విముక్తి కోసం పోరాడే పీడిత ప్రజలకు ప్రతి యుగానికీ తమవాడైన వొక సాయిబాబా వుంటాడు. అతడు విప్లవిస్తాడు. విజయ కేతనమౌతాడు. విద్వేషం లేని నూతన ప్రపంచాన్ని స్వప్నిస్తాడు. సృజిస్తాడు. ఆ విశ్వాసమే యీ కవితల అంతస్సారం.
(స్వప్నాల ప్రేమికుడు జి. ఎన్. సాయిబాబా, యువ కవిత్వం సంపా. హాథీరాం సభావాత్, ఎలుంగు ప్రచురణలు, జనవరి 2025,
ప్రతులకు: దొంతం చరణ్, ప్లాట్ నం. 15, ఓం గణేష్ నగర్ కాలనీ, బ్రాహ్మణపల్లి రోడ్, రాగన్నగూడ, హైదరాబాద్- 501510. ఫో. 9000215466)