ఏడాది గడిచింది. విషాదకరమైన, భారమైన, గందరగోళమైన, నిరాశాభరితమైన, ద్రోహపూరితమైన ఏడాది. నమ్మకం వమ్మయిన ఏడాది. భవిష్యత్తు మీద ప్రజల ఆశ చిదిమివేయబడిన ఏడాది. ఆరు దశాబ్దాల అద్భుత కార్యాచరణకు ముగింపు పలికిన ఏడాది. ఆ కార్యాచరణలో జరిగిన లోపాలకు, స్వయంకృతాపరాధాలకు మూల్యం చెల్లించవలసి వచ్చిన ఏడాది. పాలకుల భయానక హెచ్చరికలు నిజమైన ఏడాది. ఉద్యమ పరాజయానికి గుర్తుగా ఒక్కుమ్మడిగా పది మంది ఆదివాసులకు రాజ్యం మరణశిక్ష విధించగల తెంపరితనం సంతరించుకున్న ఏడాది. అంతకు ముందు ప్రతి రోజూ రాజ్య బీభత్సానికి రాలిపోతున్న స్నేహితుల గురించీ, నాయకుల గురించీ దుఃఖించే ఆగ్రహ పరిస్థితి ఉండేది. ఈ ఏడాది ప్రతి రోజూ రాజ్య చాణక్యానికి, అగ్ర నాయకత్వపు ఆత్మ సమర్పణలు తోడై రాలిపోయిన ఆశ గురించీ నమ్మకం గురించీ దుఃఖించే ఆవేదనా పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేకంగా భారత విప్లవోద్యమ చరిత్రలో, మొత్తంగా భారత సామాజిక చరిత్రలో అత్యంత కీలకమైన, దీర్ఘకాలిక ప్రభావం ఉన్న ఘటనలూ పరిణామాలూ జరగడం మొదలై ఏడాది గడిచింది. ఏ ఘటనైనా, పరిణామమైనా హఠాత్తుగా ఏదో ఒక క్షణాన ఆకాశం నుంచి ఊడిపడదు, తప్పనిసరిగా కొన్ని నెలల పాటు, ఏళ్ల పాటు అంతర్గతంగా, అస్పష్టంగా, అదృశ్యంగా జరిగిన చిన్నా పెద్దా పరిణామాలు అటువంటి దిగ్భ్రాంతికరమైన విస్ఫోటనకు దారి తీసి ఉంటాయి. అయినా సామాజిక చరిత్ర రచన కొన్ని కొండగుర్తుల మీద, మైలురాళ్ల మీద ఆధారపడుతుంది గనుక ఏడాది కిందటి ఘటనలకు ఆ మేరకు ప్రాధాన్యత ఉంటుంది.
దేశమూ తెలుగు సమాజమూ ఆ ఘటనలకు ముందూ తర్వాతా అని గీత గీసి చెప్పగలంత లోతైన మార్పుకు గురయ్యాయి. ఆ మార్పు కొందరి జీవితాలలో ఇప్పుడే స్పష్టంగా కనిపించవచ్చు, కొందరికి ఏ మార్పూ లేదనిపించవచ్చు గాని క్రమక్రమంగా దిగజారే దేశ రాజకీయార్థిక పరిస్థితుల్లో, సామాజిక జీవనంలో ఆ మార్పు కనిపిస్తుంది. ఆ ఘటనల ప్రభావం పాలకుల పాలనా పద్ధతుల మీద, ప్రజల ప్రతిఘటన మీద, మొత్తంగా సమాజపు ఆలోచనా సరళి మీద విస్తారంగా ఉందని కాలక్రమంలో బయటపడుతుంది.
ఈ ఏడాది ఘటనల మీద మేధా ప్రపంచంలో చాలా ఎక్కువగానే వ్యాఖ్యలు వినిపించాయి. వ్యాఖ్యానాలూ, భిన్న అర్థ వివరణలూ, విశ్లేషణలూ, నిందలూ, దుర్భాషలూ, వెటకారాలూ చాలా వెలువడ్డాయి. రచ్చ జరిగినంత ఎక్కువగా చర్చ జరగకపోయినప్పటికీ, ఈ మేధా ప్రతిస్పందనల్లో కొన్ని ఒక ఆశ్చర్యకరమైన సందేహాన్ని మిగిలిస్తున్నాయి.
ఒక వ్యక్తినో, కొందరు వ్యక్తులనో, ఒక నినాదాన్నో, ఒక నిర్మాణాన్నో విమర్శిస్తున్నామని, ఓడిస్తున్నామని, గేలి చేస్తున్నామని అనుకుంటూ గౌరవనీయ మేధావులూ ఆలోచనాపరులూ అసలు చరిత్రనే, మానవ పరిణామ క్రమం గురించి మౌలికమైన అవగాహనలనే ప్రశ్నిస్తున్నారా, తుడిచేయదలచుకున్నారా అని అనుమానం వస్తున్నది. కొందరు తెలిసి చేస్తుండవచ్చు, మరి కొందరు తాము అంటున్న మాటలకు అంతిమంగా ఏ అర్థం వస్తుందో తెలియకుండా ఆ వేడిలో అంటుండవచ్చు. కొందరు తాము నమ్మిన వారు ఏ మాట అంటే ఆ మాటను యథాతథంగా పునరుక్తం చేస్తుండవచ్చు. కొందరు ఏమీ మాట్లాడక మౌనం ద్వారా యథాస్థితికే దోహదం చేస్తుండవచ్చు.
కాని ఈ క్రమాన్నంతా విశ్లేషిస్తే చేయగల నిర్ధారణలు కొన్ని ఉన్నాయి. అవి బహుశా ఈ మాటలు అంటున్నవారిలో కొందరు ఉద్దేశించినవి కూడా కాకపోవచ్చు. వారు ఒకటి ఉద్దేశిస్తే మరొకటి ధ్వనించి ఉండవచ్చు. కాని నిష్కర్షగా ఆ నిర్ధారణలు చేయడం చరిత్ర పరిణామ క్రమానికి అవసరం.
ఈ వ్యాఖ్యానాలు చేసినవాళ్లలో అనేక రకాలవాళ్లున్నారు. భిన్నమైన భావజాలాల వాళ్లు ఈ ఏడాది పరిణామాల మీద మాట్లాడారు. విప్లవ భావజాలాన్నే ప్రాథమికంగా వ్యతిరేకించేవాళ్లు విప్లవం ఓడిపోయిందని తమ గెలుపును, లేదా తాము ఇన్నాళ్లూ అంటున్న మాటల విజయాన్ని ప్రకటించుకున్నారు. ఒకరకంగా ఆ వాదనతో పేచీ లేదు. అది తెలిసిన వాదన, ఎప్పటి నుంచో వింటున్న వాదన.
తమ భావజాలమేమిటో తమకే తెలియని కలగూరగంప వాళ్లు, గాలిలో తేలివస్తున్న మాటలకు ఎటు పడితే అటు కొట్టుకుపోయే గాలిపటాల వాళ్లు, రంగు, దిక్కు మార్చదలచుకుని ఉద్దేశపూర్వకంగానే ఈ మాటలు అన్నవాళ్ల గురించి కూడా చెప్పనక్కరలేదు. అటువంటివి చరిత్ర పొడుగునా ఉన్నాయి, ఊహించగలవే.
కాని నిన్నటి దాకా విప్లవకారులుగా ఉన్నవాళ్లూ, విప్లవ భావజాలాన్ని, కనీసం ప్రగతిశీల భావజాలాన్ని సమర్థిస్తున్నామనేవాళ్లూ, తాము మాత్రమే విప్లవకారులమనుకునేవాళ్లూ, ఒకే భావజాల శిబిరంలోనే భిన్నమైన ఛాయలు ఉన్నవాళ్లూ ఈ చర్చలో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ప్రకటించారు. ఇప్పుడు తాము తీసుకుంటున్న వైఖరిని సమర్థించుకోవడానికి, సుదీర్ఘకాలంగా చరిత్ర గురించీ, సమాజం గురించీ, సామాజిక పరివర్తన గురించీ, ప్రజల ఆకాంక్షల గురించీ ఉన్న శాస్త్రీయ అవగాహనల మీద అనుమానాలు రేకెత్తించారు. ఉద్యమ, సిద్ధాంత అవసరాన్నే ప్రశ్నార్థకం చేశారు. ఆశను, ప్రశ్నను, ప్రతిఘటనను మలిపెయ్యడానికి ప్రయత్నించారు.
ఒక కొసన గట్టిగా విప్లవాన్ని, మార్పును వ్యతిరేకించే వాళ్లూ, మరొక కొసన తాము విప్లవం కోసమే ఈ మాటలూ పనులూ చేస్తున్నామని అంటున్న, అనుకుంటున్నవాళ్లూ కూడా ఒకే రకమైన మాటలు మాట్లాడడం, లేదా వాళ్ల మాటల తార్కిక పర్యవసానాలు ఒకటే కావడం ఈ సందర్భపు వైచిత్రి. ఈ రెండు కొసల మధ్యలో కూడా అనేక మంది ఉన్నారు. ఈ విశాలమైన ఇంద్రధనుస్సులో ఉన్న అందరినీ ఒకే గాటన కట్టడం కచ్చితంగా తప్పు, తొందరపాటు, అసహనం. కచ్చితంగా అటువంటి తొందరపాటు, అసహన వాదనలను కూడా ఖండించవలసిందే. కాని, ఆ తొందరపాటు వాదనలను పూర్తిగా అంగీకరించకపోయినా, ఈ ఏడాదిగా విప్లవం అసాధ్యమని, విప్లవాన్ని ఆపేయాలని, వాయిదా వేయాలని వచ్చిన మాటల్లో ఎంత భిన్నత్వం, వైవిధ్యం, సదుద్దేశం ఉన్నాయని అంగీకరించినా, ఆ మాటల అంతిమ సారాంశం ఒక్కదగ్గరికి చేరడమే విషాదం.
ఆ సారాంశం అనేక రూపాల్లో వ్యక్తం కావచ్చు. కొన్ని సందర్భాల్లో పైకి కనిపించని భావాన్ని వ్యక్తం చేస్తుండవచ్చు. ఇప్పుడు రాజ్యహింస తీవ్రంగా ఉంది గనుక విప్లవం సాధ్యం కాదు అనే దగ్గర ప్రారంభమయిన ఈ వాదనలు రాజ్యం బలమైనదనీ, దాన్ని ఎదుర్కోలేమనీ అన్నాయి. అసలు విప్లవ పరిస్థితి లేదనీ, ప్రజలు విప్లవానికి సిద్ధంగా లేరనీ అన్నాయి. ప్రజలు చాలా భ్రమల్లో ఉన్నారనీ, పోరాడే స్థితిలో, కనీసం పోరాటాలను ఆదరించే స్థితిలో లేరనీ అన్నాయి. విప్లవోద్యమం మారిన పరిస్థితులను గుర్తించడంలో విఫలమయిందనడం దగ్గర ప్రారంభించి అసలు విప్లవోద్యమం మొత్తంగా తప్పులే చేసిందనే దగ్గర తేలాయి. నష్టాలను, ముఖ్యంగా ప్రాణ నష్టాలను ఆపడానికే ప్రస్తుత విరమణ అనే దగ్గర ప్రారంభించి, ఇంకా ముందే ఈ పని చేసి ఉంటే ఎందరో విలువైన మిత్రులను కాపాడుకొని ఉండేవాళ్లమని భావోద్వేగాల్ని రెచ్చగొట్టే దగ్గర తేలాయి.
ఈ మాటలన్నిటి సారాంశం విప్లవానికి అవకాశాలు లేవని, విప్లవం వద్దని చెప్పడమే. ‘నేను విప్లవం చేయలేను’, ‘మేము విప్లవం చేయలేము’, ‘మనం విప్లవం చేయలేము’ అనడానికి ఎవరికైనా ఎప్పుడైనా హక్కు ఉంది. సిద్ధాంత విభేదం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబ బంధాల పట్ల, సాధారణ జీవితం పట్ల కోరిక కావచ్చు, బలహీనతలు కావచ్చు, సంసిద్ధత లేకపోవడం కావచ్చు. ఆరు దశాబ్దాల భారత విప్లవోద్యమ క్రమంలో, నూట అరవై సంవత్సరాల మార్క్సిస్టు సిద్ధాంత క్రమంలో, వేల ఏళ్ల ప్రజా పోరాటాలలో అటువంటి సందర్భాలు ఎన్నో సార్లు, ఎంతో మంది వ్యక్తుల, ఎన్నో సంస్థల విషయంలో వచ్చాయి. అటువంటి సందర్భాలలో తాత్కాలికంగా ఉద్రేకపూరిత ప్రతిస్పందనలు ఉండవచ్చు గాని, కాలక్రమంలో అవి కరిగిపోతాయి.
కాని సమాజంలో విప్లవం అవసరమే లేదనే భావన కల్పించడం, విప్లవ అవసరాన్ని నిరాకరించడం, విప్లవాచరణ మీద అపనమ్మకాన్ని కలిగించడం, ఎప్పటికైనా నాయకత్వం మీద అవిశ్వాసం కలిగే పరిస్థితి కల్పించడం, ప్రజల ఆకాంక్షలను తిరస్కరించడం పూర్తిగా భిన్నమైన అంశం. పైగా ఇదంతా వాస్తవ సామాజిక స్థితి మీద సరైన అంచనా అని, తమతో ఏకీభవించనివాళ్లకు సమాజ వాస్తవ స్థితి తెలియదనీ, కాల్పనిక, ఊహాత్మక భావనల్లో బతుకుతున్నారని ఎద్దేవా కూడా చేయడం పూర్తిగా భిన్నమైన అంశం. సమాజం మీద, చరిత్ర మీద, సామాజిక ఉద్యమాల మీద ఈ వాదనల దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు చాలా లోతైనవి.
ఇంకా తాము పోరాటవాదులమేనని వీళ్లలో కొందరైనా అంటున్నారు గనుక, అడగవలసిన ప్రశ్నలున్నాయి. సమాజంలో వర్గ విభజన ఉందనీ, మన సమాజంలోనైతే కుల అంతరాలు, కార్పొరేటీకరణ, సైనికీకరణ, ఫాసిజం, తప్పుడు అభివృద్ధి నమూనా, అవినీతి, నిరుద్యోగం, ఆకలి, రోగం, దుఃఖం వంటి అసంఖ్యాక సమస్యలున్నాయనీ మీరు అంగీకరిస్తున్నారా లేదా? ఆ సమస్యల పరిష్కారం విప్లవంలో కాక మరెక్కడైనా ఉందా? మరి ఆ విప్లవ భావననే బలహీనపరిస్తే సాధించదలచినది ఏమిటి? రాజ్యం బలమైనది గనుక పోరాడలేము అనే మాట చరిత్ర నుంచీ, తత్వ శాస్త్రం నుంచీ సమర్థించగలదేనా? వర్గ దోపిడీ పీడనలు మొదలయినప్పటి నుంచీ రాజ్యం ఎప్పుడూ సకల శక్తి సామర్థ్యాలు సంపాదించుకుంటూనే ఉంది, బలంగానే ఉంది. ప్రజల మీద అత్యంత దుర్మార్గంగానే వ్యవహరించింది. చరిత్ర పొడవునా పీడితులు వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని, శాస్త్రీయ పద్ధతిలో సంఘటితంగా గాని తిరుగుబాట్లు చేసిన ప్రతి సందర్భంలోనూ రాజ్యం, ఆధిపత్య శక్తుల బలమే ఎక్కువ. అయినా ప్రజలు పోరాడకుండా, ప్రతిఘటించకుండా ఉండలేదు. ఆ “బలమైన” శక్తులే కొన్నిసార్లు ఓడిపోయాయి, “బలహీనమైన” శక్తులే గెలిచాయి. గెలుపు-ఓటముల గురించి ఆలోచనే లేకుండా స్పార్టకస్ నుంచి పారిస్ కమ్యూన్ దాకా పీడితులు తమకు వీలైన మార్గాల్లో పోరాడుతూనే వచ్చారు. ఓడిపోయారు కూడా. అయినా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ పోరాడుతూనే వచ్చారు గాని, ఓటమిని చూపి, రాజ్యం బలాన్ని చూపి పోరాటాలను విరమించలేదు. ప్రాణ నష్టాలు ఆపడానికే పోరాట విరమణ అవసరమయిందనే మాట శుష్క మానవతావాదానికి, ఉదారవాదానికి సరిపోతుంది గాని, మార్క్సిస్టు చారిత్రక దృక్పథం అవుతుందా? అది సరైన వాదనే అయితే, విరమణ కొన్ని సంవత్సరాల కింద ఎందుకు, అసలు పోరాటం లేకనేపోతే ప్రాణ నష్టాలు ఉండేవే కాదు. చరిత్రను స్పార్టకస్ దాకా, మెనెప్టా దాకా వెనక్కి తీసుకువెళ్లి అన్యాయాన్ని ప్రశ్నించడమే తప్పు అనే దగ్గర తేలాలి. అయినా వ్యవస్థ దోపిడీ పీడనలకు బలై పోయేవారి ప్రాణనష్టాలు ఉండనే ఉంటాయి.
ప్రస్తుత ప్రాణ నష్టాల గురించి హృదయం ఉన్న ఎవరైనా కదిలిపోతారు. ఇవి జరగకుండా చూడడానికి ఏమి చేయాలా అని ఆలోచిస్తారు. అందులో ఏమీ తప్పు లేదు. కాని పోరాట వ్యూహం వల్లనే, విప్లవం సాధించడానికి ఎంచుకున్న పద్ధతి వల్లనే రాజ్యం విప్లవకారులను చంపుతున్నదని సూత్రీకరించడం తలకిందుల వాదన. వర్గ సమాజంలో పాలకవర్గ దుర్మార్గాన్ని తక్కువ చేసి చూపే వాదన. ప్రజల ప్రతిఘటన మీద అనుమానాలు రేకెత్తించే వాదన. బాధితుల మీదనే బండలు వేసే వాదన. అమరుల ప్రాణాల గురించి నెనరు ఉన్నట్టు నటిస్తూ, ఆ ప్రాణత్యాగాల పునాదిని రద్దు చేసే వాదన.
తప్పనిసరిగా విప్లవం కాకుండా మరొక పద్ధతిలో మార్పు సాధ్యమా, విప్లవం కూడా ఈ మార్గంలో కాకుండా మరింత తక్కువ నష్టదాయకమైన మార్గాన్ని అన్వేషించవచ్చునా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. చరిత్రలో ఆ చర్చ చాలా జరిగింది. వ్యవస్థ మార్పు వంటి పెద్ద విషయంలోనే కాదు, అతి చిన్న సంస్కరణలు, ఉపశమనాల కోసం కూడా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడవలసి వస్తున్నది. పాలకవర్గాల నుంచి చిన్నమెత్తు సడలింపు కూడా లేకుండా దుర్మార్గమైన దాడులు, విధ్వంసం జరుగుతున్నాయి. ఈ చారిత్రక అనుభవం నుంచే, వ్యవస్థ మార్పుకు బలప్రయోగం తప్పదనే శాస్త్రీయ సిద్ధాంతం రూపొందింది.
ఈ ఏడాది చర్చలలో బలప్రయోగమే తప్పని, బలప్రయోగానికి ఒక రూపమైన సాయుధ పోరాటం తప్పని, ప్రజల దగ్గర, ప్రజా ఉద్యమకారుల దగ్గర ఆయుధాల వల్లనే రాజ్య హింస జరుగుతున్నదని, పార్లమెంటరీ వ్యవస్థను, కార్పొరేట్ వ్యవస్థను ప్రజలకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దవచ్చు, దిద్దాలి అని వాదనలు వచ్చాయి. ఎప్పుడైనా ఎవరైనా ఒక పోరాట రూపాన్ని విమర్శించవచ్చు గాని విప్లవాన్నే కాదనడం కుదరదు. ప్రజలు తమ అనుభవంలో, చరిత్రలో, ప్రత్యర్థులతో ఘర్షణలో వేలాది పోరాట రూపాలు కనిపెట్టారు. వాటిలో ఏదో ఒక పోరాట రూపం అవసరమా, ప్రస్తుతం వినియోగించగలమా, దాని ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ గదా అని ఎన్ని వాదనలైనా చేయవచ్చు. కాని ఒక పోరాట రూపం పట్ల వ్యతిరేకతను మొత్తంగా ప్రజల ప్రతిఘటనకు వర్తింపజేయడానికి వీలు లేదు.
ఇప్పుడు సాయుధ పోరాటానికి అవకాశం లేదు అనే మాట భారతదేశంలో 1951 నుంచీ ఎందరో అంటున్నదే. కాని వ్యవస్థ మార్పు బలప్రయోగం ద్వారా తప్ప మరొక రకంగా జరుగుతుందనే దాఖలా ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ లేదు. ప్రజల ఆకాంక్షలు ఎంతో కొంత తీరడానికి చట్టబద్ధ పోరాటరూపాలు ఎన్నో ఉండవచ్చు. కాని వ్యవస్థలో మౌలిక మార్పు ఆ చట్టబద్ధ పోరాటరూపాల వల్ల సాధ్యం కాదు. ఈ ఏడాది చర్చలో ఈ ప్రాథమిక విషయాన్ని తారు మారు చేసే ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది.
ఒకవైపు సాయుధ పోరాటాన్ని విరమించాలనో, రద్దు చేయాలనో అన్నవాళ్లే, అప్పటివరకూ సాయుధంగా ఉన్నవారికి తప్ప ఇతరులెవరికీ ఈ విషయంలో మాట్లాడే హక్కు లేదని మరొక వాదన తీసుకువచ్చారు. నిజానికి వ్యవస్థ మార్పుకు సాయుధ పోరాటం నిర్ణాయక అంశం మాత్రమే గాని, సమాజంలోని అనేక రంగాల్లో భావజాల మార్పు కోసం, వ్యవస్థ మార్పుకు సానుకూలత సంపాదించడం కోసం అనేక రకాలుగా పోరాడవలసి ఉంటుంది. వ్యవస్థ మార్పు అనేది ఏ ఒక్క వ్యక్తికో, నిర్మాణానికో, ఉద్యమానికో పరిమితమైనది కాదు, గుత్తాధిపత్యం కాదు. అది ప్రజల అవసరం, అది ప్రజల ఆకాంక్ష. అది ప్రజల భాగస్వామ్యంతో తప్ప మరొకరకంగా జరగదు. నేరుగా సాయుధ పోరాటంలో పాల్గొనని ఎన్నో సమూహాలు కూడా ప్రజలలో భాగమే. ప్రజలలో ఒక భాగానికి చర్చలో కూడా భాగస్వామ్యం ఇవ్వడానికి నిరాకరిస్తున్నవారు తమను తాము విప్లవకారులమని అనుకోవడమే ఆశ్చర్యం.
తాము తప్ప మరొకరు మాట్లాడగూడదని, భిన్నాభిప్రాయం ప్రకటించేవారి మీద విరుచుకుపడిన వారు, ఆ భిన్నాభిప్రాయం చెప్పినవారి మీద నైతిక దాడి చేశారు. భద్రజీవితంలో ఉండి, ఇతరులను సాయుధపోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొమ్మని చెపుతున్నారని నిందించారు. ఒక మాట అంటున్నవారు ఏ స్థానంలో ఉన్నారనేది ముఖ్యమే గాని, ఆ మాట విలువను అంటున్నవారి స్థానం మాత్రమే నిర్ణయించదు. అసలు ‘పోరాటం కొనసాగాలి’ అనే మాటకు ‘ప్రాణాలు బలిపెట్టాలి’ అనే అర్థం తీయడమే విచిత్రం. పోరాటాన్ని ఆపదలచుకున్న ఆధిపత్య శక్తులు, రాజ్యం పోరాటం అంటే ప్రాణాలు పోవడమే అనే అర్థం స్థిరపరిచాయి. అన్యాయాన్ని ప్రతిఘటిస్తే చంపేస్తావా అని హంతకులను ప్రశ్నించే బదులు, మన మేధావులు, ప్రతిఘటించకపోతే మరణం ఉండదు గదా, ప్రతిఘటిస్తే మరణమే అని తెలిసో తెలియకో పాలక భాష మాట్లాడారు. రాజ్యం మీద ఎక్కుపెట్టవలసిన ప్రాథమిక హక్కుల ప్రశ్నను, ఉద్యమావసరాన్ని గుర్తించిన, ఉద్యమాన్ని సమర్థించే వ్యక్తుల మీదికి ఎక్కుపెట్టారు. ఇతరులు పోరాటం చేస్తుంటే, ప్రాణాలు బలిపెడుతుంటే, పట్టణాల్లో కూచొని కవిత్వాలూ పాటలూ ఉపన్యాసాలూ అల్లేవాళ్లు అని ఎద్దేవా చేసి, తరతరాలుగా అట్టడుగు ప్రజా పోరాటాలకు బాసటగా నిలిచిన మధ్యతరగతి సంఘీభావ సంప్రదాయాన్ని గేలి చేశారు.
మానవ కార్యాచరణతో నవలోకం వికసించడం గురించి, నూతన మానవ ఆవిర్భావం గురించి, వ్యవస్థ మార్పు గురించి చేసిన ఆశావహ ప్రకటనలూ, కల్పించిన విశ్వాసాలూ అన్నీ మాసిపోయాయి, మారిపోయాయి. రాజ్యం పడగ నీడలో నవజీవనం గురించీ, రాజ్యమూ కార్పొరేట్లూ సాగించే అభివృద్ధి గురించి మాటలు మొదలయ్యాయి. ఆరు దశాబ్దాలుగా సాగిన విప్లవ భావాల స్థానాన్ని సంస్కరణవాద భావాలు ఆక్రమించాయి. తమ అభిప్రాయం కన్నా రవ్వంత భిన్నమైన అభిప్రాయం ప్రకటించినవారి మీద ఒంటికాలిమీద లేచినవారు, రాజ్యం మీద మాత్రం పల్లెత్తు విమర్శ చేయడానికి పూనుకోలేదు. పైగా రాజ్య ఔదార్యం గురించి, పునరావాసంలో రాజ్యం మంచితనం గురించి స్తోత్రాలు మొదలు పెట్టారు. వర్గ సమాజం మొదలయినప్పటి నుంచీ చరిత్ర కూడా అక్కరలేదు, సామాజిక అక్రమాలన్నిటికీ వలస పాలనను నిందించిన చరిత్ర దాకా కూడా పోనక్కర లేదు, ఏడున్నర దశాబ్దాల వలసానంతర చరిత్రలో భారత ప్రజానీకం మీద భారత రాజ్యం సాగించిన దుండగాల ప్రస్తావనే లేదు. ఆ దుండగాలను అడ్డుకొని, ఈ రాజ్యాన్ని కూల్చి, నూతన ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తామని ఈ దేశ ప్రజలు తమకు తాము చేసుకున్న వాగ్దానాన్ని, సాగించిన కష్టభరితమైన పోరాటాన్ని గురించి ఊసే లేదు. ఆ కార్యాచరణ అంతా తప్పనో, లేదా తమ పాత్ర తప్ప మిగిలినదంతా తప్పనో తీర్పులు. లేదా ఇప్పటి తమ స్థితికి అనుకూలంగా గత ఉజ్వల చరిత్ర వక్రీకరణలు.
ఈ సందర్భంలో రాజ్యం తమ చేతిలో ప్రదర్శనకు పెడుతున్న, మహత్తరమైనదిగా ప్రచారం చేస్తున్న రాజ్యాంగాన్ని అయినా ఆ రాజ్యం గౌరవించడం లేదని కనీస సూచన లేదు. పోరాట విరమణ ప్రకటించి, “ఆత్మ సమర్పణ” ఉత్సవాలలో పాల్గొని, ఉద్యమ నిర్మాణాన్నీ, సైనిక నిర్మాణాన్నీ రద్దు చేసినప్పటికీ, తమ మీద కూడా రాజ్యం కేసులు ఎత్తివేయకపోయినా ప్రశ్న లేదు. పోరాటం ఆగిపోయిందని సంతోషిస్తున్న మేధావులకూ రాజ్యాంగ అమలు గురించి, కనీసం కేసుల ఎత్తివేత, వేధింపు ముగింపు ప్రశ్నలు లేవు. ఇంతకాలమూ పోరాట నాయకులుగా ఉన్నవారు, తమ మార్గంలో నడిచి, తమకు సహకరించినందుకు, ఆశ్రయమో, ఆహారమో ఇచ్చినందుకు, తాము చెప్పిన పనులు చేసి పెట్టినందుకు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారికోసం, వేధింపులకూ శిక్షలకూ గురవుతున్న వారికోసం ఒక్క మాట లేదు. సాయుధ పోరాటం అవసరం లేదనీ, చట్టబద్ధ కార్యకలాపాలతోనే సామాజిక మార్పు సాధ్యమనీ ప్రవచనాలు పలుకుతున్న మేధావులు, సామాజిక మార్పు అంత దూరం కూడా అవసరం లేదు, అక్రమ నిర్బంధాలు, వేధింపులు చట్టబద్ధం కావనే కనీసమైన మాట మాట్లాడడం లేదు.
ఈ తలకిందుల ప్రపంచంలో, తలకిందుల వాదనా స్రవంతిలో ఆ మాటలు అంటున్నవారి కన్నా ఆ వాదనలను తలకెత్తుకుంటున్న పత్రికల, ప్రచార సాధనాల పాత్ర మరింత ఎక్కువ. తమ అభిప్రాయాల నిజానిజాలు, ఉచితానుచితాలు తెలియకుండా వెల్లడించడానికి సామాజిక మాధ్యమాలలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు దొరికాయి. ఈ ఏడాది పత్రికలనూ, ప్రచార సాధనాలనూ, సామాజిక మాధ్యమాలనూ చూస్తే, పత్రికలు, ఛానళ్లు విప్లవోద్యమం ఆగిపోతున్నదంటే, నాయకులు ఆత్మ సమర్పణ చేస్తున్నారంటే, నాయకులే విప్లవాదర్శానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే సంతోషంగా పతాక శీర్షికలు చేశాయి. అవతలివారు ఏమన్నప్పటికీ, స్వయంగా పత్రికల, ఛానళ్లవారు పెట్టిన శీర్షికలలో విరమణ సంతోషం, ‘అమ్మయ్య’ అనే ఉపశమనం వ్యక్తమయ్యాయి. సామాజిక మాధ్యమాలలో కూడా కొందరైనా విప్లవం ఆగిపోవడాన్ని ఆహ్వానించారు. రాయగల, వ్యక్తీకరించగల, సామాజిక సంక్షోభం నుంచి ఏదో ఒక స్థాయిలో తప్పించుకోగల అవకాశం ఉన్న మధ్యతరగతి ఇది.
మరి ఏమి చేసి ఉండవలసింది అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. రోజువారీ మారణకాండ జరుగుతుంటే తప్పనిసరిగా దాని నుంచి తప్పించుకోవలసిందే. పోరాటం కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను, పద్ధతులను అన్వేషించవలసిందే. కాని పోరాటం ఆపడం ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు. తాత్కాలికం అనే సమర్థన నిజం కాదని, మొత్తంగా పోరాటం గురించీ, ఆశయం గురించీ వారు అంటున్న మాటలే రుజువు చేస్తున్నాయి. పోరాటం కొనసాగించే అవకాశం లేకపోవడం చరిత్రలో వచ్చింది, వస్తుంది. అదేమీ అసాధారణం కాదు. కాని అప్పుడు కూడా కొత్త మార్గాలలో పోరాటాన్ని వికసింపజెయ్యడానికి ప్రయత్నించడమే విప్లవ నాయకత్వపు చొరవ, ప్రతిభ, కర్తవ్యం. భారత విప్లవ నాయకత్వం ఆ పని చేయడంలో సఫలం కాలేదని చరిత్ర విషాదకరంగా నమోదు చేస్తున్నది.
ఈ మొత్తం ఆచరణల, చర్చల క్రమంలో విప్లవ భావననే – ఐడియా ఆఫ్ రెవల్యూషన్ – సమాజ జ్ఞాపకం నుంచి, సమాజ అవగాహన నుంచి, సమాజ ఆచరణ నుంచి తుడిచెయ్యదలిచారని అనుమానం వస్తున్నది. ఈ పని తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు. ఈ సమాజ యథాస్థితి ఏ ఒక్కరికీ సంతృప్తికరంగా, సంతోషకరంగా లేదు. ఈ స్థితి మారాలని, మెరుగుపడాలని కోరిక లేని వారెవరూ లేరు. ఆ మార్పుకు అనేక ప్రయత్నాలు జరగవలసి ఉంది. ఒకానొక ప్రయత్నాన్ని ఖండించడం అంటే, ఆ ప్రయత్నం హత్య చేయబడుతుంటే సంతోషించడం అంటే మొత్తంగా మార్పును వ్యతిరేకించడమే అవుతుంది.
విప్లవ భావనను తుడిచెయ్యాలని అనుకోవడం, ప్రజలకు అందివచ్చిన ఒక అవకాశాన్ని తమ తప్పిదాలకు బలిపెట్టడం ప్రజలకు, చరిత్రకు ద్రోహం. ఒక వ్యక్తికో, ఒక నిర్మాణానికో, ఒక చిన్న ప్రజా సమూహానికో ద్రోహం చేశారా లేదా అనేది పెద్ద విషయం కాదు. చరిత్ర నిర్మాణ క్రమానికి, చరిత్ర నియమానికి, ప్రజల ఆకాంక్షకు ద్రోహం ఇది. అయితే ఇది కూడా చరిత్రలో కొత్తదేమీ కాదు. చరిత్రలో కొన్నిసార్లయినా ఉద్యమ నాయకత్వాలే స్వయంగా ఇటువంటి పని చేశాయి. కాస్త ఒడిదుడుకులు వస్తాయేమో గాని చరిత్ర ముందుకే కదిలింది, కదులుతుంది. వర్గ సమాజం ఉన్నంత కాలం వర్గపోరాటం ఉంటుంది. వర్గ పోరాటాన్ని రద్దు చేయగలమనో, దాని గమనానికి ఆటంకాలు కలిపించగలమనో అనుకున్నవాళ్లు చాలా మంది ఓడిపోయారు.
‘సరే, భారత చరిత్రలోనే విషాదకరమైన ఏడాది గడిచిపోయింది, ఇప్పుడు ఏం చేయగలం’ అని ప్రజలు ఆలోచించవలసిన సందర్భం ఇది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ – 1951 అక్టోబర్ 20 – తర్వాత ఏర్పడిన స్థితి లాంటిది ఇది. నాటి పోరాట విరమణతో పోలిస్తే ఇవాళ్టి పోరాట విరమణ మరింత లోతైనది, మరింత విద్రోహపూరితమైనది, మరింత ప్రభావశీలమైనది. అయితే చరిత్ర మనకేమైనా పాఠాలు నేర్పేట్టయితే తప్పనిసరిగా 1951 అక్టోబర్ 20తో చరిత్ర అంతం కాలేదనీ, 1967 మే 25 (నక్సల్బరీ ప్రజ్వలన) వచ్చిందనీ, 1969 ఏప్రిల్ 22 (సమరశీల వర్గపోరాట నిర్వహణకూ, రాజ్యాధికార స్పృహను ఎజెండా మీదికి తేవడానికీ పూనుకున్న పార్టీ పుట్టినరోజు) వచ్చిందనీ తెలుస్తుంది. అయితే అటువంటి ప్రజా ఆకాంక్షలను సాకారం చేసే ప్రయత్నం పునరుద్ధరణ జరుగుతుందనే చరిత్ర పాఠం పాలకవర్గాలు కూడా నేర్చుకున్నాయి గనుక, ఆ అవకాశాలను చిదిమెయ్యడానికి, వేర్లతో సహా నిర్మూలించడానికి, అసలు ఆ ఆశయాన్నే కనబడకుండా చేయడానికి రాజ్యం ప్రయత్నిస్తుంది. అయితే అనివార్యంగా ఆ రాజ్య ప్రయత్నాలకు నానాటికీ పెరుగుతున్న రాజకీయార్థిక, సామాజిక సంక్షోభమే అడ్డుకట్ట వేస్తుంది. అణచివేతే ప్రతిఘటనకు దారి తీస్తుందనేది ఊహ కాదు, కోరిక కాదు, అది చరిత్ర నియమం. సమాజంలో విస్తరిస్తున్న రాజకీయార్తిక సంక్షోభం మధ్య నుంచి, దానికి ఒక ప్రతిఫలనమైన ఉద్యమ సంక్షోభం నుంచి ప్రజలను సంఘటితం చేసే కార్యాచరణ రూపొందించుకోవలసిన బాధ్యత మార్క్సిస్టులది, భారత విప్లవోద్యమాన్ని కొనసాగించాలనుకునేవారిది, విప్లవోద్యమ అభిమానులది, ప్రజలది. ప్రజలలో, ముఖ్యంగా యువతరంలో ఎంత అసంతృప్తి పేరుకు పోయి ఉన్నదో, అది ఎట్లా విస్ఫోటనం చెందే అవకాశం ఉన్నదో మన కళ్ల ముందు కనబడుతున్నది. ఒకరకంగా 1960ల కోపోద్రిక్త, కల్లోల దశాబ్దం మన కళ్లముందే ఆవిష్కృతమవుతున్నది. ఏదీ యథాతథంగా పునరావృతం కాదనే ఎరుకతో, ప్రజల సృజనాత్మకత మీద గౌరవంతో, ఈ సంక్షోభాన్ని అధిగమించవలసి ఉంది.