(అతడు నల్లమల అంచున వెల్లువైన పొలికేక. పాలమూరు పసినవ్వుల నెలవంక. ఊరిచివరి గుడిసెలో పూసిన మంకెనపువ్వు. పల్లెటూరి పిల్లగాడు. పసులగాసిన మొనగాడు. రాత్రిబడిలో నేర్చిన అక్షరాలు అతనిలో నిప్పురవ్వల్ని రాజేసినై. లందల్ల పొడిసే పొద్దును ఆవాహన చేసుకున్నడు. ‘తెలంగాణ జనసభ’ల్లో నడకలు నేర్చిండు. పాలమూరు వలస బతుకుల గాయాల్ని పాటలల్లిండు. బతుకులు మారే దారిలో నడుస్తున్నడు. రెండు దశాబ్దాలుగా అతని మాట తెలంగాణ. పాట తెలంగాణ. రాత తెలంగాణ. ప్రజాస్వామిక తెలంగాణను పలవరిస్తున్నడు. కలవరిస్తున్నడు. యూనివర్సిటీలో తరగతి గదుల్ని ప్రశ్నించే కెరటాలుగా మారుస్తున్న అలుపెరగని సంద్రమతడు. అతడు ప్రొఫెసర్ చింతకింది కాశీం.)
మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
మాది ఉమ్మడి పాలమూరు జిల్లా. ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం అంబట్పల్లిలో పుట్టాను. అమ్మ ఈరమ్మ. నాన్న ఊశన్న. మాది దళిత కుటుంబం. మాదిగ కుటుంబం. అమ్మా నాన్న వ్యవసాయ కూలీలు. పేదరికంతో పాటు సామాజిక విషయాల పట్ల స్పందించే ఒక గుణం మా కుటుంబంలో భాగంగా ఉన్నది. 1970ల కాలంలోనే మా నాన్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)లో సభ్యుడు. నాపై ఆ సామాజిక, రాజకీయ నేపథ్యం, చుట్టూ జరుగుతున్న ఉద్యమాల ప్రభావం ఉన్నది.
చిన్నప్పుడు చదువుకుందామనే ఒక ఆశ ఉండేది. మాకుండే కొన్ని పశువుల్ని, చిన్నపాటి వ్యవసాయాన్ని చూసుకోవడానికి ఇంకెవరూ లేకపోవడం మూలంగా అనివార్యంగా బడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. మా ఇంటికి దగ్గర్లోనే స్కూలుండేది. బాల్యంలో పశువుల్ని కొట్టుకొని చెలక్కాడికి పోతున్నప్పుడు బడి బయట వేపచెట్టుకింద పిల్లల్ని కూర్చోబెట్టి ఓ టీచర్ పాఠం చెప్తుండేవాడు. “ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లలో పాలు పెరుగు మననీయడమ్మా” అనే పద్యం చదివేవాడు. వినసొంపుగా ఉన్న ఆ పద్యం వింటూ ఉండేవాణ్ని. ఈ క్రమంలో కొన్నాళ్లకు నేనుకూడా ఈ పిల్లల్లా చదువుకుంటే బాగుండేదనిపించేది. కానీ ఆ అవకాశం లేదు.
ఆ రోజుల్లో రాత్రిపూట బడులుండేవి. పదేళ్ల వయసు వచ్చాక రాత్రి బడిలో చేరిన. వయోజన విద్యలో పెద్దýతో పాటు కలిసి చదువుకున్న. అక్కడే కొన్ని అక్షరాలు, అంకెలు నేర్చుకున్న. ప్రాథమిక విద్య పూర్తియిందని అనిపించాను. పద్ధతి ప్రకారం స్కూల్‌కి వెళ్లింది మాత్రం ఐదో తరగతి నుంచే. నా విద్య అక్కణ్నించి మొదలైంది. ఐదో తరగతిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరిన. ఇంటర్మీడియెట్ కూడా అదే సొసైటీలో చదివిన. డిగ్రీ కోసం హైదరాబాద్ నిజాం కాలేజీకి వచ్చిన. అక్కడ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి నాకొక ప్రాతిపదిక దొరికింది. ఈ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, అర్థంచేసుకోవడం, నా జీవితంలో, నాలాంటి కోట్లాది మంది ప్రజల జీవితంలో దుఃఖం, సంఘర్షణ ఎందుకున్నాయన్నది నిజాం కాలేజీ జీవితంలో అర్థమైంది. ఆ నేపథ్యం నుంచి ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ, రీసెర్చ్ పూర్తిచేసుకుని 2004లో ఉద్యోగంలోకి(అధ్యాపక వృత్తి) వచ్చాను. వందేళ్లు పూర్తిచేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు శాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఇదీ స్థూలంగా నా నేపథ్యం.
మీకు సాహిత్యం ఎట్లా పరిచయమైంది?
నేను మౌఖిక సాహిత్యం నుంచి వచ్చినవాణ్ని. అల్లిక వారసత్వం నుంచి ప్రేరణ పొంది సాహిత్యం వైపు వచ్చాను. నాకు బాల్యంలో కోలాటం పాటలంటే చాలా ఇష్టం. కోలాటం వేయడమంటే ఇష్టం. మా నాన్న కూడా కోలాటం వేసేవాడు. మా నాయిన గుంటుక కొట్టేటప్పుడు ఆ గుంటుకమీద నన్ను కూర్చోబెట్టుకొని పాడేవాడు. అట్లా పాటలు నా జీవితంలో భాగమయ్యాయి. అల్లిక వారసత్వంలో పాట వినడం, కథ వినడం అనేది నేను ప్రారంభం చేసినప్పుడు అందులో సాహిత్య విలువలు ఏం ఉన్నాయనే ఆలోచన లేకుండానే వాటిని అర్థం చేసుకోవడం, తిరిగి పాడటమనేది ఉండేది. అట్లా కొన్ని పాటల్ని అనుకరిస్తూ మరికొన్ని పాటల్ని అల్లేవాళ్లం. అట్లా బాల్యంలో నాపై అల్లిక వారసత్వ ప్రభావం పడింది. ఆ రోజుల్లో జన నాట్యమండలి పాటలు చాలా విస్తృతంగా ప్రచారంలో ఉండేవి. అవన్నీ బాల్యంలో ప్రభావం వేశాయి. జననాట్య మండలి పాటలు వింటూ, వాటిని అనుకరిస్తూ భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ ఎనిమిది, తొమ్మిది తరగతుల్లోనే పాటలు రాసేవాణ్ని. అప్పటికి నిర్ధిష్టమైన సాహిత్య అధ్యయనం లేదు. మౌఖిక సాహిత్యం ప్రభావం ఉండటం మూలంగా రచన అనే ఒక ప్రాసెస్‌లోకి ప్రయాణంచేశాను. మా చుట్టూ ఉన్న సామాజిక ఉద్యమాలు మమ్మల్నట్లా రూపొందించాయి.
నేను చదువుకున్న లింగాల ప్రాంతంలో తిరుపతి అనే కరాటే మాస్టర్, (కె.టి. తిరుపతి), లింగస్వామి అనే టీచర్ ఉండేవాళ్లు. వాళ్లిద్దరూ ‘మహాప్రస్థానం’లోని ఒక పొయెమ్ను బట్టీ పట్టించి, నేర్చుకొమ్మని చెప్పారు. ఒక మీటింగ్‌లో చదవడం కోసం. ఎనిమిదో తరగతిలో మహాప్రస్థానంలోని ఒక పొయెమ్ను బట్టీ పట్టాను. అది కవిత చదవడం మొదలు. ఇంటర్మీడియెట్‌లో రోజూ రాత్రిపూట మహాప్రస్థానాన్ని చదివి పడుకోవడం జీవితంలో ఒక భాగమైంది. అట్లా సాహిత్యంపై ఇష్టంపెరిగింది. ఈ నేపథ్యం నుంచి సాహిత్య ప్రపంచంలోకి వచ్చాను.
మీరు మొట్టమొదటిసారిగా రాసిన కవిత ఏది? దానికి నేపథ్యం?
నిజానికి అల్లిక వారసత్వంలో ఏముంటుందంటే, తమ జీవితాన్ని అల్లుకోవడం ఉంటుంది. ఎక్కణ్నో ఉన్న అలవైకుంఠపురంలో వ్యక్తుల గురించి, అమూర్త భావనలో ఉన్న వ్యక్తుల గురించి అల్లిక వారసత్వంలో ఉండవు. ఉన్నా వారి జీవితానికి సంబంధించి సమన్వయం చేసుకుంటూనే పాటలు అల్లుతారు. అల్లిక వారసత్వంలో పాట వస్తువు, కథా వస్తువు తమ జీవితంలో భాగం. తమ శ్రమ, తమ దు:ఖం, తమ సంతోషం, తమ ఆనందం, ప్రేమలు అల్లిక వారసత్వంలో ఉంటాయి. కనుక నేను కవిత్వం రాయాలి, అక్షరం రాయాలనే ఆలోచన వచ్చినపుడు అది కవిత్వంగా ఉందా లేదా అనే స్పృహ కూడా లేనప్పుడు మొట్టమొదట హత్నూర అనే గ్రామంలో 1994లో ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు ‘సమత’ అనే కాలేజీ మ్యాగజీన్ తీసుకొచ్చేవారు. అది గురుకుల సొసైటీ నడుపుతున్న కాలేజీ. ఆ మ్యాగజీన్‌కు కవిత రాయాల్సి వచ్చినపుడు మా జీవితాన్నే కవితగా రాస్తే బాగుంటుందనిపించింది. మా కాలేజీలో డ్రస్ కోడ్ ఉండేది. ఎక్కడ చూసినా తెల్లగా కన్పిస్తుండేవాళ్లు మా పక్కన్నే పంట పొలాలుండేవి. ఆ పొలాల్లో కరిగట్టు చేస్తున్నప్పుడు కొంగలు వాలేవి. మేం వేసుకున్న షర్ట్స్ తెల్లగా ఉండేవి. మా మనసు ఎంతో తెల్ల, ప్రకృతి తెలుపు. ‘తెలుపుదనం’ అనే శీర్షికతో ఒక కవిత రాశాను. అది మార్చిలో అచ్చయింది. నేను రాసిన కవితను అచ్చులో చూసుకోవడం అదే మొదటిది. అది నా జీవితం గురించి, మా విద్యార్థుల జీవితం గురించి రాసుకున్నది.
మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన రచయితలెవరు?
నాకు కవిత్వమంటే చాలా ఇష్టం. ప్రజా కవులు అంటే అల్లిక కవులు నామీద వేసిన ప్రభావం వల్ల పాటలు వినడం, పాడటం అనే ఇష్టం నుంచి కవిత్వం చదవడం మొదలుపెట్టిన. మొట్టమొదట మహాప్రస్థానం చదివాను. తెలుగు పాఠ్యపుస్తకాల్లో విశ్వనాథ, దాశరథి గురించి ఉండేది. కానీ అవేవీ నా జీవితంతో సంబంధం లేని విషయాలుగా ఉండేవి. కానీ మహాప్రస్థానం చదివినపుడు మాత్రం కొన్ని పొయెమ్స్ మా జీవితంతో దగ్గర సంబంధం ఉన్నదని అర్థమైంది.
“పొలాలనన్నీ హలాలదున్నీ
ఇలా తలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ” అనే కవిత గాని,
“వస్తున్నాయ్ వస్తున్నాయ్
జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్…” ఇట్లాంటి కవితలు అన్నీ మా జీవితాల్లో భాగంగా ఉన్నాయనిపించి అట్రాక్ట్ అయ్యాను. కవిగా నన్ను ప్రభావితం చేసింది శ్రీశ్రీ. ఆ తర్వాత పేరు తెలియకుండా ప్రభావితం చేసింది గద్దర్. గద్దర్ పేరు తెలువదు మాకు. కానీ గద్దర్ పాట తెలుసు. ఈ పాట గద్దరే రాశాడనే విషయం కూడా తెలువదు. గద్దర్ పాడిన ప్రతి పాటా మా జీవితంలో భాగమే. ఆయన అంటరానితనం, విప్లవం, సామాజిక ఘర్షణ, సామాజిక సమస్యలు, స్త్రీల మీద రాసిన అన్ని పాటల్నీ రాత్రికి రాత్రి టేప్రికార్డర్లో వినేవాళ్లం. పాడేవాళ్లం. పశువులకాడికి పోయినపుడు జననాట్యమండలి పుస్తకం పట్టుకొని వెళ్లి ఒంటరిగా పాడుకునేవాళ్లం. అట్లా శ్రీశ్రీ, గద్దర్ యవ్వనంలో ప్రభావం వేసిన కవులు.
డిగ్రీకి వచ్చాక సాహిత్యం తెలిసి చదవటం అనేది ప్రారంభమైంది. డిగ్రీలో నాకు పరిచయమైన రెండో కవి అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ పుస్తకాన్ని బ్యాగులో పెట్టుకొని కాలేజీకి పోయేవాణ్ని. కవిత్వాన్ని గట్టిగా చదవడం, ఒంటరిగా చదవడం, దాన్ని అనుకరిస్తూ మళ్లీ వేరే కవితలు రాయడం ఇట్లాంటివి చాలా చేస్తుండేవాళ్లం. ఆ తర్వాత అత్యధికంగా ప్రభావితం చేసిన కవులు చెరబండరాజు, శివసాగర్. కవిత్వ నిర్మాణం అనేది ఎట్లా ఉంటుంది? ఆ కవిత్వ ఉన్నత స్థాయి ఎట్లా ఉంటుందనేది వాళ్లిద్దరి కవిత్వం ద్వారా అర్థంచేసుకున్నాను. వేదికపై శివసాగర్ గారు కవిత్వం చదువుతుంటే విని పరవశించిపోయేవాణ్ని. డిగ్రీ దాకా ఈ ఐదారుగురు కవులు విస్తృతంగా ప్రభావితం చేశారు. ఆ ప్రభావంతో, కవిత్వంలో ఉండే ప్రేమతో కవిత్వంలోకి వచ్చాను.
మీకు మార్క్సిజం, అంబేద్కరిజం ఎట్లా పరిచయమయ్యాయి?
మొదలు ఇది మార్క్సిజం అని తెల్వకుండానే మార్క్సిజం పరిచయమైంది. మా ఇంట్లో కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలుండేవి. మా నాన్న కరపత్రాలు తెచ్చేవాడు. దొరలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొనేవాడు. అట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను సమీకరించేవాడు. మా ఊర్లో వీరన్న గౌడ్ అనే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త ఉండేవాడు. ఆయన ప్రభావం బాల్యంలో బలంగా ఉన్నది.
1991లో అంబేద్కర్ శతజయంతి సంవత్సరం. స్కూల్ డే సందర్భంగా ఉపన్యాసం, వ్యాస రచన పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది. మా టీచర్ ఎస్.ఎన్ రాజు, లైబ్రేరియన్ ప్రభాకర్ గారు ‘అంబేద్కర్ జీవిత చరిత్ర’ పుస్తకం ఇచ్చారు. పశువులను తోలుకొని చెలక్కాడికి పోయినప్పుడు చెట్టుకింద కూర్చొని ఆ పుస్తకం చదివాను. ఈ దేశంలో కులం ఉన్నది. అది మనుషుల్ని సమానంగా చూడదనేది అప్పుడర్థమైంది. మా ఊరిలో గుడిలోకి పోయే పరిస్థితిలేదు. గుడిలోకి ఎందుకుపోలేం? నేనే కాదు, నాలాంటి వాళ్లు చాలామంది పోలేరు కదా అనేది అంబేద్కర్‌ని చదివినప్పుడు అర్థమైంది. బాల్యంలో అంబేద్కర్‌ని చదివాను. యవ్వనపు స్వప్నాల్లో మార్క్స్‌ను చదువుకున్నాను. స్పష్టంగా మార్క్స్ నాకు అర్థమైంది నేను డిగ్రీకి వచ్చాకనే. నిజాం కాలేజీకి వచ్చిన తర్వాతనే. ‘మార్క్సిజం’ అని ఉపన్యాసాలిస్తుంటే అర్థమయ్యేది కాదు. నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్‌ని. ఫస్ట్ ఇయర్లో పొలిటికల్ థియరీస్ ఉంటాయి. కాబట్టి అప్పుడు మార్క్సిజాన్ని సీరియస్‌గా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అట్లా ఆనాటి నుంచీ ఈనాటి వరకూ విశేషంగా ఒకవైపు అంబేద్కర్, మరోవైపు మార్క్స్ నా జీవితంలో భాగమయ్యారు.
విప్లవ సాహిత్యోద్యమంలోకి ఎట్లా వచ్చారు?
విరసం ఇరవై ఐదేళ్ల సందర్భంగా ఒక పెద్ద సభ జరిగింది. హైదరాబాద్ రాణాప్రతాప్ ఫంక్షన్ హాల్లో. ఆ సభకు గోరటి వెంకన్నతో పాటు కలిసివచ్చాను. ఆయనది మా పక్క ఊరే. నాగర్ కర్నూల్లో ఉండేవాడు. మా పక్క ఊర్లో విష్ణు అని మా బాబాయి ఉండేవాడు. విష్ణుతో కలిసి హైదరాబాద్ వచ్చాను. నేను అటెండ్ అయిన మొదటి విరసం సభలు. ఆ సభలో ఎందరో కవులున్నారు. ఉపన్యాసకులున్నారు. గాయకులున్నారు. పాటలు పాడుతున్నారు. కవిత్వం చదువుతున్నారు. శివసాగర్, గద్దర్ ఉన్నారు. వీళ్లందర్నీ చూశాక అక్కడంతా మా జీవితాలే ఉన్నాయి. అంటే ఈ దేశంలో సాహిత్యమ అనేది ఇట్లా సమాజం గురించి ఆలోచిస్తుందనేది అర్థమైంది. కవులు ఈ సమాజం గురించి ఆలోచిస్తారనే విషయం నాకర్థమైన తర్వాత మెల్లగా విప్లవ రచనలు చదవటం, విప్లవ సాహిత్యాన్ని చదవటం, ఆనాటి నుంచి విప్లవ రచయితల సంఘం సభలు ఎక్కడ జరిగినా వెళ్లటం అనేది ఒక పనిగా పెట్టుకున్నాను. తర్వాతి కాలంలో తర్వాత కాలంలో నేను చాలా స్పష్టంగా అధ్యయంచేసి, అర్థంచేసుకొని విరసంలో 1998లో అప్లికేషన్ పెట్టుకొని ఆ సంస్థలో భాగమయ్యాను. అప్పట్నించి విప్లవ సాహిత్యమన్నా, విప్లవ రచనలన్నా కేవలం చదవడం మాత్రమే కాకుండా, దాన్ని రాయడం, మాట్లాడటం అనేది ప్రాసెస్‌లో భాగంగా ముందుకు వెళ్తున్నాను.
విప్లవోద్యమ సాహిత్యం తాత్విక భూమిక ఏమిటి?
విప్లవ సాహిత్య ఉద్యమం 1970లో నిర్మాణం అయినపుడు ఒక ప్రణాళిక బద్ధంగా నిర్మాణమయ్యారు. ప్రపంచంలో చాలా రచయితల సంఘాలున్నాయి. కానీ, ‘విప్లవం’ అనే పేరు మీద తెలుగు నేల మీద ఏర్పడిన విప్లవ రచయితల సంఘమే మొదటిది. ఈ సంఘం విప్లవాన్ని తన లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ప్రాతిపదిక మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం. మార్క్స్ వర్గ పోరాటం గురించి చెప్పాడు. దోపిడీ వర్గం కూలిపోవాలని, దోపిడీకి గురయ్యే వర్గం అధికారంలోకి రావాలని, అది కార్మిక వర్గమని ఆయన స్పష్టంగా 1848లో తన సిద్ధాంతం చెప్పాడు. ఆ సిద్ధాంతం ప్రపంచంలో ఉన్న బుద్ధిజీవులందర్నీ ప్రభావితం చేసింది. అందుకే ఆ ప్రభావంలో భాగంగానే ఒకవైపు లెనిన్, మరోవైపు మావో ఈ ప్రపంచంలో చాలామంది మేధావులు దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. మార్క్సిజం వర్గపోరాటం సిద్ధాంతం. లెనినిజం మార్క్సిజాన్ని ఆచరించి సామ్యవాద విప్లవాన్ని విజయవంతం చేసిన దేశమది. దానికి నాయకత్వం వహించిన వ్యక్తి లెనిన్. వ్యవసాయిక దేశాల్లో మార్క్సిజాన్ని ఎట్లా అన్వయించి విజయవంతం చేయవచ్చో చెప్పినవాడు మావో. భారతదేశం వ్యవసాయికదేశం. కనుక మార్క్సిజం వర్గపోరాట సిద్ధాంతం ప్రపంచంలో ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఆ వర్గపోరాట సిద్ధాంతాన్ని ఆయా దేశాలకు సృజనాత్మకంగా అన్వయించడం కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అందుకే విప్లవ రచయితల సంఘం భారతదేశంలో విప్లవం రావాలంటే రచన ఎట్లా ఉండాలి? వర్గ పోరాట రచనగా ఉండాలి. వర్గపోరాటాన్ని ప్రచారం చేసే రచనగా ఉండాలి. అది మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావోయిజాన్ని ప్రచారం చేసేదిగా ఉండాలి. సాహిత్యం ద్వారా, కళల ద్వారా. ఆచరణాత్మకమైన విషయాలు ఏమైనా ఉండవచ్చు. ఆయా పార్టీలు తమ ఎత్తుగడల్ని తమ వ్యూహాల్ని ఏమైనా అల్లుకోవచ్చు. అవి వాటి పద్ధతిలో పనిచేస్తుంటాయి. కానీ ఒక రచయితగా మాత్రం ఈ దేశం, ఈ ప్రపంచం మారాలనుకున్నప్పుడు ఈ దేశం మార్పులో ప్రధాన భాగస్వామ్యం తీసుకోవాల్సిన వ్యక్తి రచయిత. ఆ రచయితకు ప్రజా పక్షపాతం భూమికగా ఉండాలి. ప్రజా పక్షపాతం లేని ఏ రచయిత కూడా గొప్ప రచయిత అయినట్టుగా ప్రపంచంలో మనం చూడలేం. అందుకోసమే ఆ ప్రజాపక్షపాతం ఉండాలంటే విప్లవ రచనకు మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనేది భూమికగా ఉందని చెప్పుకోవచ్చు.
విప్లవ కవిత్వం 1980ల్లోనే ఆగిపోయిందనే విమర్శపై మీ స్పందన?
సాహిత్యం మీద అనేక విశ్లేషణలున్నాయి. సంప్రదాయ, అభ్యుదయ, స్త్రీవాద, దళిత సాహిత్యంపైన అనేక విమర్శలున్నాయి. ఏ సంబంధం లేకుండా రాసే మానవతా వాదంపై కూడా అనేక విశ్లేషణలున్నాయి. ఎవరైనా ఏ అభిప్రాయాలైనా స్వేచ్ఛగా వ్యక్తంచేయొచ్చు. కానీ, ఏ విమర్శకుడైనా అభిప్రాయం చెప్పేటప్పుడు తన కళ్లముందటి సాహిత్యాన్ని సమగ్రంగా చదివి అభిప్రాయం చెప్పాలి. సమగ్రంగా చదవకుండా అభిప్రాయం చెప్పడం అనేది ఇటీవల అంటే 80ల తర్వాత ఒక ఫ్యాషన్‌గా మారింది. పుస్తకాన్ని, సాహిత్యాన్ని, ఉద్యమాన్ని ఆధారం చేసుకొని విమర్శ ఉండాలి. అప్పటికే ముందస్తుగా కొన్ని అభిప్రాయాల్ని మనసులో ఏర్పాటు చేసుకొని ఒక అభిప్రాయం చెప్పడంగా ఉండొద్దు. విప్లవం అంటే వీళ్లు కేవలం సాహిత్యంతో సంబంధం లేకుండా ఏవో నినాదాలు రాస్తారనే ఒక అభిప్రాయంతో 1980ల తర్వాత విప్లవ సాహిత్యం లేదనే ఒక తప్పుడు అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. ఇదైతే నేను స్పష్టంగా తప్పుడు అభిప్రాయంగా చెప్పదలుచుకున్నాను.
విప్లవ కవిత్వంలో ప్రత్యేకతలు ఏమిటి?
1980ల తర్వాత విప్లవ సాహిత్యం పురివిప్పింది. సృజనాత్మకంగా మారింది. భిన్నమైన గొంతులకు అది వేదికగా మారింది. 1970ల నుంచీ 1980ల వరకూ ఆ పది సంవత్సరాల కాలంలో విప్లవ సాహిత్యాన్ని రాసింది ఒక శివసాగర్ మినహాయిస్తే ఎక్కువగా ఎగువ వర్గాల నుంచి వచ్చిన వాళ్లు. లేదా సమాజంలో అగ్రకులాల నుంచి వచ్చినవాళ్లు. వాళ్లు రాసిందాన్ని సాహిత్యం అంటారు. 1980ల తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రచయితలుగా వచ్చారు. కలం చేతబట్టి సాహిత్యాన్ని సృష్టించారు. మరి వాళ్లు సృష్టించిన సాహిత్యంపట్ల ఈ విమర్శకులకు సదభిప్రాయం లేకపోవడం. కనుక ఒక కుల దృక్పథంతో అభిప్రాయాన్ని వ్యక్తంచేసి 1980ల తర్వాత కవిత్వం లేదన్నారు. 80ల తర్వాత కలేకూరి ప్రసాద్, సలంద్ర, కౌముది, సముద్రుడు… వీళ్ల కవిత్వాన్ని కవిత్వం కాదనేవాళ్లెవరైనా ఉన్నారా? ఇంతమంది కవిత్వం రాశారు. వీళ్లందరి కవిత్వం అద్భుతంగా ఉంది. ఎంతో మంది లబ్ధప్రతిష్టులైన శివారెడ్డిలాంటి కవులు మందుమాట రాసి అద్భుతమైన కవిత్వమని చెప్పారు. కానీ బయట విమర్శకులేమో కవిత్వం లేదు అన్నారు. కనుక తప్పుడు అభిప్రాయాల మీద చరిత్ర నిర్మాణం చేయకూడదు. ఒక నిర్ధిష్టమైన, న్యాయబద్ధమైన అభిప్రాయాలు సాహిత్యంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి విమర్శకులైనా దాన్ని గుర్తించి, గమనించాలని ఈ సాహిత్య సమాజానికి, ముఖ్యంగా విమర్శకులకు నా విజ్ఞప్తి.
విప్లవ కవులు సామాజిక అస్తిత్వాలను పట్టించుకోలేదనే విమర్శపై మీ స్పందన?
నిజమే. విప్లవ కవులు, విప్లవ సాహిత్యోద్యమం ఆయా సందర్భాలలో సామాజిక ఉద్యమాలను ఒక ఎజెండాగా మార్చుకొని పనిచేయని మాట వాస్తవమే. అనేక సందర్భాలలో విప్లవ సాహిత్యోద్యమం ప్రజల ముందు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తన నిజమైన చిత్తశుద్ధి కలిగిన ఆత్మ విమర్శను ప్రకటించింది. అట్లనే పూర్తిగా సామాజిక అస్తిత్వాలపట్ల మౌనంగా మాత్రం ఉండలేదు. ఆ సామాజిక అస్తిత్వాలను ఎజెండాగా తీసుకొని పోరాటం చేయని ఒక పరిస్థితి అయితే ఉందిగానీ, అసలు విప్లవమే సామాజిక నిర్మాణంలో వచ్చే ప్రతి సమస్యను డీల్ చేయడం. విప్లవ రచనంటే ప్రజల సమస్యల్ని సాహిత్యంలో తీసుకురావడం. కనుక ప్రజల సమస్యల్లో అది కులమైనా, మతమైనా, ప్రాంతమైనా, స్త్రీలైనా, ఆదివాసీల సమస్యలైనా విప్లవ కవులు, రచయితలు పట్టించుకున్నంతగా ఇతర ఏ కవులూ పట్టించుకోలేదు. ఏ కవులూ రాయలేదు. అందుకే ఒక లక్ష్యంగా రాయడం వేరు. ఒక సందర్భంగా రాయడం వేరు. ఒక లక్ష్యంగా రాయలేని పరిమితి ఆనాటి విప్లవ సాహిత్యోద్యమానికి ఉండింది. తర్వాత దాన్నుంచి బయట పడి విస్తృతంగా సామాజిక అస్తిత్వాల గురించి రాశారు. గద్దర్ పాటలో కానివ్వండి, శివసాగర్ రచనలో కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన చాలామంది కవులు కానివ్వండి… వాళ్లందరూ అన్ని సమస్యల మీద విస్తృతంగా రాసివున్నారు.
1990ల తర్వాత విప్లవ కవిత్వంలో వచ్చిన మార్పులేవి?
1990లో ప్రపంచంలో గ్లోబలైజేషన్ వచ్చింది. బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది. చుండూరులో దళితుల మీద దాడులు జరిగాయి. సమాజం పరిణామంలోకి వెళ్తున్నపుడు, ఒక స్థితినుంచి మరో స్థితిలోకి మారుతున్నప్పుడు ఆ సామాజిక సమస్యలను సరిగ్గా పట్టించుకొని కవిత్వం రాయాల్సిన అవసరాన్ని విప్లవ కవులు గుర్తించారు. దానిమీద దృష్టిపెట్టి అనేక రచనలు చేశారు. అయితే ప్రధాన స్రవంతి విమర్శకులు ఏనాడూ వీటిని పట్టించుకోలేదు. డాలర్ ఈ సమాజంలోకి ప్రవేశించి సృష్టించిన విధ్వంసాన్ని వివిధ నాటకాలు, కథలు, కవిత్వం, పాటలు, నవలల రూపంలో విప్లవ కవులు 90ల తర్వాత విస్తృతంగా రాశారు. నేను చెప్పదలుచుకున్నదేమిటంటే వైవిధ్యం ఉన్నది. 1970`80లలో విప్లవాన్ని మాత్రమే ప్రచారం చేయడం ఆనాడు ఒక కార్యక్రమంగా ఉంది. 80ల నుంచి 90ల వరకు ప్రభుత్వం, విప్లవోద్యమానికి ఘర్షణ జరిగి ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు వాటి మీద కవిత్వం రాయడం, వాటి మీద పాటలు రాయడం, స్మృతి కవిత్వం రాయడమనేది ఉన్నది. కానీ 90ల తర్వాత సమాజంలో వస్తున్న అనేక రకాల సమస్యలను కవితా వస్తువులుగా ఎంపిక చేసుకొనే విస్తృతిని, కవితా వైవిధ్యాన్ని, సాహిత్య రచనా వైవిధ్యాన్ని, వస్తు వైవిధ్యాన్ని విప్లవ కవులు సాధించారు.
కవిగా, మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడిగా ‘విప్లవ కవితా సౌందర్యాత్మకత’ మీద మీ స్పందన?
విప్లవమే సౌందర్యాత్మకమైనది. ఆ మాటనే సౌందర్యాత్మకమైనది. ఎందుకు సౌందర్యాత్మకమైనది అంటున్నానంటే సమాజంలో శ్రమ సౌందర్యాత్మకమైనది. శ్రమను మించిన సౌందర్యం ఇంకేమీ లేదు. శ్రీశ్రీ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని అన్నాడు. కనుక శ్రమైక జీవనమనేది ఎట్లా సౌందర్యాత్మకమైనదంటే ఇంత అందమైన ఈ భూమిలో విత్తనాలను చల్లి, ఆ మట్టిని ఈ మునివేళ్లతో ముద్దాడి, ఆ నల్లటి మట్టి నుంచి మల్లెపూవులాంటి మెతుకుల్ని తీయడమే ఒక అద్భుతమైన సౌందర్యం. ప్రకృతే సౌందర్యాత్మకమైనది. పుష్పించే పువ్వు, కూసే కోయిల, జొన్న కంకి, వరి ఎన్ను…ఇవన్నీ ప్రకృతిలో సౌందర్యమే. కనుక ఈ సౌందర్యాన్ని సృష్టించేవాళ్లెవరు? మనుషులు. ఈ మనుషులెవరు? పేద ప్రజలు. దోపిడీకి గురయ్యే ప్రజలు. ఈ ప్రజల గురించి రాయడమంటేనే సౌందర్యం రాయడమని అర్థం. కనుక విప్లవం సౌందర్యాత్మకమైన వ్యక్తీకరణ. అందుకే ఆ సౌందర్యాత్మకమైన వ్యక్తీకరణ అనేది ఈ ప్రపంచంలో ప్రతి అంశాన్నీ తాకింది. ప్రతి అంశాన్ని బయటికి తీసుకొచ్చింది.
“పొయి మీద కుండెక్కలేదు
బాలింత పాలివ్వలేదు
అంబా అంటూ లేగలరువలేదు…” ఎంత సున్నితమైన దృశ్యాన్ని ఆ కవి కవిత్వంలోకి తీసుకొచ్చాడో చూడండి.
“దుక్కిని దున్నిన రైతు చేతులకు బేడీలెందుకురో రన్నా
బేడీలెందుకురో
మొక్కలు నాటే కూలీలనెందుకు జైల్లో బెడుతుండ్రోరన్నా…
జైల్లో బెడుతుండ్రో..” ఇది సౌందర్యాత్మకం. ఇంత సౌందర్యాత్మకమైనటువంటి ఈ విప్లవాన్ని కవిత్వమయం చేసిన కవులు సాహిత్యంలోకి తీసుకొచ్చి ఈ ప్రపంచం ముందుపెట్టారు. కానీ సాహిత్య విమర్శకులు ఆ సున్నితమైన భావాలను విశ్లేషించే శక్తి సామర్థ్యాలను సంపాదించుకోలేక విప్లవ కవిత్వం మీద అనేక నిందలు మోపారు.
విప్లవ సాహిత్యంలో వచన కవిత, పాటల్లో దేని పాత్ర ఎంత ఉన్నది?
విప్లవ కవిత్వంలో పాట పాత్రనే అగ్రగామి. 1970లో విరసం ఏర్పడ్డాక విరసంలో భాగమైన కవులందరూ లబ్ద ప్రతిష్టులైన వచన కవులు. శ్రీశ్రీ, వరవరరావు, చెరబండరాజు, కె.వి. రమణారెడ్డి వచన కవిత్వం రాశారు. 1965 నుంచి 1970ల వరకూ చెరబండరాజు కూడా వచన కవిత్వం రాశాడు.1970లో విరసం ఏర్పడిన తర్వాత… విప్లవం ఎవరికోసం? విప్లవం ప్రజల కోసం. ప్రజలకు విప్లవాన్ని కమ్యూనికేట్ చేయాలి. ప్రజల సమస్యలను కావ్యంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రజల భాషలో, ప్రజల బాణీలో ప్రజల కోసం చెప్పాలి. ప్రజల నుంచి తీసుకొని తిరిగి ప్రజలకు చెప్పాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఆనాడు పాటనే ప్రధానంగా వచ్చింది. విప్లవ కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన వాడు చెరబండరాజు.
“రాయి రప్పకు చెప్పనా నా గోడు
నేనె రాయయిపోదునా…” అనే పాట విన్న తర్వాత గద్దర్ పాటలు రాశాడు. చెరబండరాజు ప్రభావానికి గురయ్యానని చెప్పాడు. విప్లవ సాహిత్యంలోకి ప్రవేశించాడు. అప్పటి వరకు ఉన్న విప్లవ సాహిత్యం వేరు. గద్దర్ ప్రవేశించిన తర్వాత చరిత్ర వేరు. అది పాటైనా. అది కవితైనా. ఏ రూపం తీసుకున్నా సరే. దాన్ని శిఖరాగ్ర స్థాయిలో నిలబెట్టిన లెజెండ్ గద్దర్. విప్లవ సాహిత్య చరిత్ర, కవిత్వ చరిత్ర రాయవల్సివస్తే గద్దర్ తర్వాత ఒక చరిత్ర. గద్దర్ ముందు ఒక చరిత్ర. అట్లాంటి చరిత్ర నిర్మాణం చేశారు.
వచన కవిత అనేది మధ్యతరగతి జీవులకు సంబంధించిన వ్యవహారం. పాట అనేది ప్రజలకు సంబంధించినటువంటిది. ఆ పాటను కూడా సాదాసీదాగా తీసుకుపోవడం కాదు, కవితాత్మకమైన విలువలతో ఒక దృశ్య కావ్యంగా మలిచి తీసుకెళ్లడమనేది గద్దర్, వంగపండు ప్రసాద్, గూడ అంజయ్య, గోరటి వెంకన్నలు కృషిచేశారు. జయరాజు విప్లవ కవిత్వాన్ని ఉన్నత కాల్పనికంగా మలిచి రాసిన పాటలెన్నో ఉన్నాయి. జయరాజు విప్లవ కవిత్వాన్ని సృజనాత్మక సాహిత్యంగా మలిచాడు.
నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. వచన కవులు వేరు. పాట కవులు వేరు. పాట కవులకు రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు. వీళ్లంతా పూర్తిగా ఉత్పత్తి కులాల నుంచి వచ్చారు. ఎక్కువగా దళిత కులాలు, కొద్దిగా బీసీ కులాల నుంచి పాటలు రాసే రచయితలు వచ్చారు. వాళ్ల పాటను విశ్లేషించే శక్తి సామర్థ్యాలు అగ్రకుల విమర్శకులకు లేవు. దీంతో పాట వెనకబడిపోయింది. విప్లవ కవిత్వమంటే నా ఉద్దేశంలో పాటే. ఇంకొకటి కాదు.
‘విప్లవ కవిత్వంలో వస్తువు తప్ప శిల్పం లేదనే’ విమర్శపై మీ కామెంట్?
మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా పరిశీలించకపోవడం మూలంగా విమర్శకులకు అప్పటికే పెట్టుకున్న కొన్ని కళ్లద్దాలుంటాయి. ఆ కళ్లద్దాలతో చూసిన చాలామంది విప్లవ కవిత్వం మీద ఇటువంటి అపవాదు మోపారు. శిల్పమంటే ఏమంటున్నాం మనం? కవితా శిల్పం. అసలు వస్తువు అనేది ఎప్పుడైనా సరే. విడిగా విప్లవ వస్తువు ఉండదు. ఏ సాహిత్య వస్తువు విడిగా ఉండదు. ఏదైనా సాహిత్యం అంటున్నామంటే అది సౌందర్యాత్మకంగా ఉంటేనే సాహిత్యమంటున్నాం. అదొక కళ. ఒక కళారూపం. కనుక మనిషి జీవితంలో కళ నిర్మాణం కావడమనేది శిల్పాత్మకంగా నిర్మాణమైతేనే అది ఎదుటివాళ్లను ఆకర్షిస్తుంది. ఎదుటివాళ్లకు సందేశాన్ని చేరవేస్తది. అందుకే విప్లవ కవిత్వం, కథ, నవల ఏదైనా వస్తువును ఆశ్రయించుకొనే వుంటుంది. మనం శరీరాన్ని ఆశ్రయించుకొని మన బట్టలెట్లా ఉంటాయో శరీరానికి సరిపోయే, రంగుకు కుదిరే బట్టల్ని ఎట్లా వేసుకుంటామో, అట్లాగే విప్లవ సాహిత్యంలో శిల్పమనేది దాన్ని ఆశ్రయించి ఉంటుంది. దానిలో సంలీనమై ఉంటుంది. ప్రాచీన ఆలంకారికులు చెప్పినా, ఆధునిక విమర్శకులు చెప్పినా శిల్పం అంటే ఏమంటున్నారు? వర్ణనలు, ప్రతీకలు, భావచిత్రాలు, భాష, ఉపమానాలు… ఇవే కదా శిల్పమంటే. విప్లవ కవిత్వంలో ఎన్ని ఉపమానాలు చెప్పొచ్చు. ఎన్ని ప్రతీకలు చెప్పొచ్చు!.
“ఓల్గా ఘనీభవించెను.
యాంగ్సీ నది ఉప్పొంగెను…” అని రాశాడు శివసాగర్. దీన్ని విశ్లేషించడానికి ఏ విమర్శకుడూ ముందుకు రాలేదు. అసలు ముందు ఆ విమర్శకునికి ప్రతీకను పట్టుకొని ఓల్గా అనే నదిని పట్టుకొని, యాంగ్సీ నదిని పట్టుకొని రెండు పాదాలతో రెండు దేశాల చరిత్రను చెప్పే ఒక అద్భుతమైన విమర్శ గ్రంథమే రాయొచ్చు. కానీ తెలుగు సాహిత్య విమర్శకులకున్న పరిమితి ఏమిటంటే, వాళ్లు కొన్ని ప్రమాణాలు పెట్టుకొని ఆ ప్రమాణాల నుంచే చూస్తూవుంటారు.
తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ పండుగ సందర్భంలో గద్దర్ అద్భుతమైన పాట రాశాడు. కొడుకు అంగి కుట్టించమని తల్లిని అడిగాడు. కుట్టించలేకపోయింది.
“దసర పండుగ దగ్గరుంది
దర్జివాడు కుట్టడానీ
తమ్మునికి షర్టుతెస్తం
నీకు ప్యాంటూ తెస్తనంటే
ఏది వద్దని జిద్దుజేస్తివి
అలిగి అన్నం తినకపోతివి
తెల్ల ప్యాంటూ ఎర్ర షర్టూ
తెచ్చి కుట్టీ పెట్టినామÖ
పాలపిట్టయి సూసిపోతారా మా బిడ్డలు
జమ్మి ఆకయి కలిసిపోతారా మా బిడ్డలూ…” ఇంతకన్నా గొప్పగా చెప్పే ప్రతిభావంతమైన, శిల్పాత్మకమైన కవులెవరండీ?
“కట్టినా ఆ తెల్ల ఆవును
కంటిపాపల సూసుకుంటం
పచ్చగడ్డీ పిండిపెట్టీ
ప్రాణమోలే సూసుకుంటం
పురిటి నొప్పులు దానికొస్తే
కాన్పుజేసీ కావలుంటం
తల్లి లాగను నాకుతుంటే
మా తల్లిప్రేమలు గురుతుకొచ్చే
మా పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలూ
మీరు మల్లి జన్మయి మాకే పుడతారా మా బిడ్డలూ…” ఇంత గొప్పగా రాసే కవులెవరున్నారండీ! తెలుగు సాహిత్యంలో. ఒక గొప్ప దృశ్యకావ్యం రాశాడాయన. ఆ మొత్తం పాటను విశ్లేషిస్తే ఒక దృశ్యకావ్యం. ఇట్ల మీకెన్ని ఉదాహరణలయినా చెప్పొచ్చు. కథలో చెప్పొచ్చు. నవలలో చెప్పొచ్చు. శిల్పం ఎట్లా ఉంటుందనేది. కనుక అదొక తప్పుడు అభిప్రాయం కలిగివున్న వాళ్లు వేసిన అపవాదు మాత్రమే.
విప్లవ కవిత్వంలో విప్లవ కాల్పనికతను ప్రవేశపెట్టిన కవులెవరు?
తెలుగు సాహిత్యంలో కాల్పనిక సాహిత్యం 1910నుంచి ప్రారంభమైందని ఒక చర్చ చేస్తున్నారు. భావ కవిత్వమంటాం దాన్ని. లిరికల్ పొయెట్రీ. కృష్ణశాస్త్రి దానికి నాయకత్వం వహించాడని ప్రధాన స్రవంతి భావకవిత్వాన్ని బోధించేటప్పుడు చెప్తుంటాం. అయితే అసలు సాహిత్యమే దానికదిగా కాల్పనికమైంది. సౌందర్యాత్మకమైందని అనుకుంటున్నాం. మౌఖిక సాహిత్యంలో కాల్పనికత ఉంటుంది. ఆ మౌఖిక సాహిత్యంలో ఉన్న కాల్పనికతను అనుసరించి భావకవులందరూ కవిత్వం రాశారు. నండూరి, బసవరాజు, విశ్వనాథ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని పాటలు, కృష్ణశాస్త్రి రాసిన పాటల మూలాలు మౌఖిక సాహిత్యంలోనే ఉన్నాయి. ప్రజా సాహిత్యంలో ఒక మరదలి గురించి పాడుకోవడం, బిడ్డ గురించి పాడుకోవడం, మొక్కగురించి పాడుకోవడం ఇవన్నీ ఉంటాయి. వీటిని అనుసరించి వీళ్లంతా రాశారు.
విప్లవ సాహిత్యంలో కూడా ‘కాల్పనికత’ అనే భావాన్ని, ‘విప్లవ కాల్పనికత’ను ప్రవేశపెట్టిన వాడు నా దృష్టిలో శివసాగర్. శివసాగర్ దళిత కుటుంబం నుంచి ఎదిగినవాడు. విస్తృతమైన అధ్యయనం. ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదువుకున్నవాడు. అటు గురజాడనూ, ఇటు శ్రీశ్రీని, కాడ్వెల్నూ, షెల్లీని చదువుకున్నవాడు. విప్లవ కవిత్వం, విప్లవమంటే ఎంత సౌందర్యాత్మకమైందో సమాజానికి అందించడం కోసం ఆయన ఒక చెట్టు మీద, ఒక పుట్టమీద, ఒక మనిషి మీద, ఆదివాసీ మీద ఒక చిలుక మీద… అన్నిటినీ కవిత్వంలోకి తీసుకొచ్చాడు. అంతకుముందు విప్లవ కవిత్వం రాసిన కవులందరూ ప్రకృతిలో భాగమైన కవులు కాదు. వారికి విప్లవం మీద ప్రేమ ఉన్నది. విప్లవం రావాలనే బలమైన ఆకాంక్ష ఉన్నది. కానీ వాళ్లు విప్లవకర వర్గాలు కారు. విప్లవకర ఉత్పత్తి కులాల నుంచి రాలేదు. అందుకని వాళ్లు పండిత భాష చదువుకొని, కావ్యాలు చదువుకొని విప్లవం రాశారు. విప్లవానికి సంబంధించిన సంకేతాలను కవిత్వంలో వినిపించారు. కానీ శివసాగర్ అట్లా కాకుండా…
“తోటరాముని తొడకు తూటా తగిలిందానీ
చిలుకా చీటీ తెచ్చేరా ఓ విలుకాడా
ఓ చెలికాడా..” అని రాశాడు. ఇట్లాంటి ‘విలుకాడ’, ‘చెలికాడ’, ‘చిలుక’, ‘చీటీ’, ‘తోట రాముడు’ అనే పదాలను కవిత్వంలోకి అలలలాగా ప్రవేశపెట్టినవాడు శివసాగర్. ఆయన ఫీనిక్స్ పక్షినై అని రాశాడు ఒకదగ్గర. ప్రియురాలి మీద రాశాడు.
“గోరింటాకుతో ఎరుపెక్కిన
నీ మునివేళ్లను
నా పెదాలతో ముద్దిడుతా” అని రాస్తూ… గోధూళి వేళ. గోధూళిని సాహిత్యంలోకి ఇంత సౌందర్యాత్మకంగా తీసుకొచ్చాడు. విప్లవాన్ని చెప్పడానికి ఒక ప్రాతిపదికను ఏర్పాటుచేసుకొని చదివే పాఠకుడయినా, వినే శ్రోతయినా తన గుండెల్లోకి విప్లవాన్ని చొప్పించడానికి శివసాగర్ అట్లాంటి కాల్పనికత తీసుకొచ్చాడు.
“అమ్మా నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు
పొలాలలో పరిగె గింజ
ఏరుకొనే వేళలందు
గరికపూల పాన్పుపైన
పక్షుల రాగాల నడుమ
అమ్మా నన్ను కన్నందుకు
విప్లవాభివందనాలు…” ఇది విప్లవ కాల్పనికత.
అయితే కృష్ణశాస్త్రి గారు…
“దిగిరాను దిగిరాను
దివి నుండి భువికి
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
వృక్షమయ్యెద పక్షినయ్యెద
మధుపమయ్యెద” అని కాదు ఇది. నిజ జీవితంలో ఉన్న కాల్పనికతను కవిత్వంలోకి తీసుకొచ్చి, విప్లవ కాల్పనికతని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత దీన్ని కొనసాగించినటువంటివాళ్లు కౌముది, సముద్రుడు, జయరాజు మొదలైనవాళ్లు.
విప్లవ సాహిత్యంలో నిబద్ధత, నిమగ్నత గురించి మీ అభిప్రాయం?
కవి కవిత్వానికి నిబద్ధుడై ఉంటాడు. ఉండాలి కూడా. ఎందుకంటే కవి రాసే ప్రతి అక్షరానికీ అతడు కట్టుబడాలి. సమాజాన్ని కట్టుబడేటట్టు ప్రభావితం చేయాలి. అది కవి లక్షణం. కనుక మార్క్సిజం అనేది ప్రపంచంలోకి వచ్చింతర్వాత సమాజాన్ని అర్థంచేసుకోవడం మాత్రమే కాదు, ప్రతి మనిషి ఉన్నతమైన మానవీయమైన మనిషిగా మారడమెట్లా అనే చర్చ ప్రపంచంలో మొదలైంది. అందుకే మాట్లాడే మాట, రాసే అక్షరం, జీవించే జీవితం, ఆచరించే ఆచరణ. ఇవన్నీ భిన్నమైనవి కావు. మనిషి జీవితంలో ఇవన్నీ ఒకటే. ఒకే పునాది మీద నడుస్తుంటాయి. అందుకోసమే రాసే అక్షరానికీì, ఆచరించే ఆచరణకీ భిన్నత్వం ఉండకూడదని ఆ గీతను చెరిపేసినటువంటింది మార్క్సిజం. అంతకన్న ముందు ప్రపంచంలో రాజుల గురించీ, పెట్టుబడిదారుల గురించీ, విప్లవాల గురించి రాసినటువంటి కవులు చాలామంది ఉన్నారు. ఫ్రెంచి విప్లవం గురించీ, అమెరికన్ విప్లవం గురించీ లేదా ఇంగ్లండ్ విప్లవం గురించీ రాసిన కవులున్నారు. కవిత్వం రాసి తమ జీవితాన్ని కూడా అంతే నిమగ్నమైన సందర్భం చాలా తక్కువ కన్పిస్తది. కానీ మార్క్సిజం నిబద్ధత, నిమగ్నత అనేది సమాజంలోకి, రాజకీయార్థిక శాస్త్రంలోకి తీసుకొచ్చింతర్వాత తెలుగు నేల మీద విస్తృతమైన చర్చ జరిగి, కవి రాసే అక్షరానికి తాను కట్టుబడి ఉండాలి. ఆ అక్షరాన్ని ఆచరించాలి. ఎంత నిబద్ధుడై ఉంటాడో, ఆ నిబద్ధుడై ఉన్న అక్షరం ఆచరిస్తున్నప్పుడు అందులో నిమగ్నమై ఉండాలి. అందుకే తెలుగు నేలపై సుబ్బారావు పాణిగ్రాహి తన నిబద్ధతను ప్రదర్శించాడు. విప్లవంలో నిమగ్నుడయ్యాడు. ఆ విప్లవంలో చనిపోయాడు. అట్లే శివసాగర్ తన నిబద్ధతను ప్రదర్శించాడు. విప్లవంలో నిమగ్నంగా ఉద్యమంలో భాగంగా ఆయన కవిత్వం రాశాడు. సముద్రుడు, కౌముది, వీరస్వామి.. వీళ్లందరూ ఈ క్రమాన్ని తెలుగు సాహిత్యంలో కవి అంటే ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి అని మొత్తం తెలుగు సాహిత్య ప్రపంచం మీద ప్రభావం వేసి, ముద్రవేసినటువంటి చరిత్ర విప్లవ సాహిత్యానికుందే తప్ప ఇంకే సాహిత్యానికీ అట్లాంటి చరిత్ర లేదు.
యాభై ఏళ్ల విప్లవ కవిత్వంలో మూడు తరాల్ని ప్రభావితం చేసిన కవులెవరు?
మూడు తరాల్ని ప్రభావితం చేసినటువంటి ఈ యాభై ఏళ్లలో ఒక వరుసలో శ్రీశ్రీ, చెరబండరాజు, వరవరరావు. ఇది మొదటి తరం. ఈ మొదటి తరంలో భాగంగా అత్యధికంగా సాహిత్య ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి శివసాగర్, గద్దర్. వీళ్లంతా మొదటితరం. ఈ మొదటితరం కవులు ఆనాడు సాహిత్య ప్రపంచాన్ని, సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేశారు. ఆ తర్వాత 1980లో మరో తరం సాహిత్యంలోకి ప్రవేశించింది. అట్ల ప్రవేశించినటువంటి వీరిలో మనం నిర్ధిష్టంగా అందరి పేర్లు చెప్పుకోం గానీ, సందర్భవశాత్తూ కొన్ని
పేర్లను మాత్రం ప్రస్తావన చేసుకుంటే సముద్రుడు, ఎంఎసఆర్, కౌముది ఆ వరుసలో ఉన్నారు. ఇది రెండో తరం. ఇక మూడో తరం 2000ల సంవత్సరం తర్వాత విస్తృతంగా రాస్తున్న యువకవులు విప్లవ సాహిత్యంలో ప్రముఖంగా ఉన్నారు. శివసాగర్ ప్రారంభంలో విప్లవ సాహిత్యంలోకి కాల్పనికతని ప్రవేశపెట్టి, ఆ కాల్పనికతని ఎంత అద్భుతంగా సాహిత్యంగా మలిచాడో, విప్లవ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడో మళ్లీ అట్లాంటి కలాలు ఇవాళ మూడోతరంలో విప్లవ సాహిత్యంలో మొదలయ్యాయని అనిపిస్తుంటుంది. మూడోతరంలో ఉదయభాను, చంద్రయ్య, శివరాత్రి సుధాకర్, సూర్యచంద్ర లాంటి వాళ్లు ఇట్లాంటి ఒక తరం. చాలా ఫ్రెష్‌గా తమ కవిత్వాన్ని ముందుకు తీసుకొచ్చి, కొత్త ప్రతీకలతో రాస్తున్నారు. అర్థం కాకుండా, సంక్లిష్టంగా ఇప్పటికీ విప్లవ కవిత్వంలో కొందరు రాస్తున్నమాట నిజమే గానీ, అర్థమయ్యేటట్లు నేరుగా సందేశాన్ని తీసుకెళ్లే ఆనాటి శివసాగర్ వారసత్వాన్ని, ఆ ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్లే కవులు ఈనాడు తయారయ్యారు. నేను ఇరవై ఐదేళ్ల నుంచి విప్లవ సాహిత్యాన్ని, సాహిత్యోద్యమాన్ని చాలా దగ్గరగా చూస్తున్న. ఈ క్రమంలో చూసినప్పుడు మొదటి కాలంలో శివసాగర్లాగా, గద్దర్లాగా కవిత్వం రాసే కవులు ఇవాళ మళ్లీ విప్లవ సాహిత్యంలోకి ఇంత ఫ్రెష్‌గా వచ్చినటువంటి స్థితి ఇంకే సాహిత్య ఉద్యమాల్లో కూడా కనిపించదు. అందుకోసం మూడు తరాల కవులు సజీవంగా విప్లవ సాహిత్యాన్ని నడిపిస్తున్నారనే నమ్మకం నాకు ఉన్నది.
మీ కవిత్వంలో వస్తురూప వైవిధ్యాన్ని ఎలా సాధించారు?
నేను మొదలే చెప్పినట్టు వస్తువు మా జీవితం. ఎక్కడో మాకు సంబంధంలేని వస్తువును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. మా కన్నీళ్లు, మా అంటరానితనం, మా పూరిగుడిసె, కూలిపోయిన గోడలు, మా ఎద్దులు, మా నాగలి, మా దుక్కి, ఎండిపోయిన మా పంట. ఇది మా జీవితం. ఘర్షణ. ఎదుటోడితో ఘర్షణ. బడికి పోవాలంటే ఘర్షణ. గుడికి పోవాలంటే ఘర్షణ. తాగడానికి నీళ్లు తెచ్చుకోవాలంటే ఘర్షణ. ఇది మా జీవితం. కనుక జీవితం సజీవంగా ఉన్నది. జీవితంలో ఘర్షణ సజీవంగా ఉన్నది. మా జీవితమే వస్తువుగా మారింది. అట్లే వస్తువుతో పాటు రూపాన్ని, శిల్పాన్ని సాధించడం అనేది ప్రత్యేకంగ పనిగట్టుకొని అలంకార శాస్త్రాల్ని చదివి శిల్పాన్ని పొందవలసిన అవసరం లేదు. మా జీవితాల్లో ముఖ్యంగా ఇవాళ రాస్తున్న కవులు, ఈ నేపథ్యం నుంచి వచ్చిన కవులందరి జీవితం కూడా అంతే.
మా జీవితంలో అల్లిక వారసత్వం ఉన్నది కనుక కవిత్వాన్ని అల్లటం ఎట్లో, శిల్పాన్ని రూపొందించడం ఎట్లో, ఒక వడ్డెర శిల్పాన్ని చెక్కినపుడు ముక్కూ మొఖం లేని రాయిని తీసుకొచ్చి గుడిలో అందమైన దేవుడిగా మార్చిన ఉలి అంత శిల్పాత్మకంగా చేసింది. అంతకన్న గొప్ప శిల్పం ఎక్కడుంటుంది? మట్టి ముద్దను తీసుకొచ్చి సారెమీద పెట్టి అందమైన కుండను తయారుచేసి సమాజానికిచ్చారు. అంతంటె శిల్పాత్మకం ఏముంటుంది? చెట్టును కొట్టుకొచ్చి అందమైన కుర్చీని తయారుచేసినవాళ్లున్నారు. ఇట్లా సబ్బండ వృత్తులు. సమస్త కులాలు. వీళ్లందరు కూడా వాళ్ల జీవితాన్ని అద్భుతంగా, శిల్పాత్మకంగా మార్చుకుంటుంటారు. అవన్నీ నిత్యజీవితంలో చూస్తుంటాం. నేను వ్యక్తిగతంగా అవన్నీ దగ్గరగా చూశాను. కవిత్వంలో భాగంగా సాహిత్యాన్ని చదువుకున్న మాట న్పుిమే. ఎంత సాహిత్యం చదువుకున్నా, ఎంత అలంకారశాస్త్రం చదువుకున్నా, ఎంత విమర్శ చదువుకున్నా చిట్టచివరికి కవిత్వం రాయవల్సివచ్చినప్పుడు మాత్రం అనుభవిస్తున్న, పొందిన ఈ జీవితాన్ని వ్యక్తంచేసేటప్పుడు తిరిగి మళ్లీ మా అల్లిక వారసత్వంలో ఉండే ఆ శిల్పమే గుర్తుకు వస్తుంటది. అందుకే కవులెవరైనా సరే. మొట్టమొదలు మీ జీవితం నుంచి మీరు రాయండి. ఎవరినీ అనుకరించి రాయకండి. ఎవర్నో అనుసరించి రాయకండి. ఎవరిలాగనో మీరు రాయకండి. కోకిల తనలాగ తాను కూసినట్లు. మనం మనలాగ రాస్తే కచ్చితంగా అది అద్భుతమైన వస్తువు, అద్భుతమైన శిల్పం ఈ రెండింటి కలనేతగా మంచి కవిత్వం వ్యక్తమవుతుందని నా అభిప్రాయం.
ప్రస్తుత తెలుగు కవిత్వం ఎట్లా వుంది? ఎట్లా ఉండాలని భావిస్తున్నారు?
ఇవాళ తెలుగు కవిత్వం కొంత విషాదంగానూ ఉన్నది. కొంత ఆశాజనకంగానూ ఉన్నది. అయితే ఇది సమాజం యొక్క ప్రత్యేక స్థితి. ముఖ్యంగా తెలుగు నేలలో కవిత్వం అంటే తెలంగాణలోనే అని నా ఉద్దేశం. కోస్తాంధ్ర ప్రాంతంతో ఈ తరంలో కవిత్వం రాసేవాళ్లే లేకుండా పోయారు. వాళ్లందర్నీ సాహిత్యానికి దూరం చేసి డాలర్ల వేటలో అమెరికా పంపించేశారు. వారికెవరికీ సాహిత్యంపై అభిలాష లేదు. ఆసక్తి లేదు. ఏమైనా కవిత్వం వస్తుందంటే తెలంగాణ ప్రాంతంలోంచే కవిత్వం వస్తోంది. తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న కవులు, రాసే కవిత్వం ఉద్యమ కాలంలో వచ్చినటువంటివాళ్లు వీళ్లంతా. ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ ఉద్యమం కాలం నుంచి వచ్చారు. అందుకే ఈ కవులు రాసే కవిత్వం ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో, ఎంత స్పష్టంగా ఉంటుందో ప్రతీకలైనా, ఉపమానాలైనా, భావచిత్రాలైనా. దానితో పాటు రెండోవైపు, రాసిందల్లా కవిత్వంగా సమాజంలోకి తీసుకొచ్చే ఒక విషాదమైన పరిస్థితి కూడా కన్పిస్తుంది. అయితే ఉద్యమం నేర్పిన పాఠాల వల్ల ‘ప్రతి ఒక్కరం రాయగలం’ అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కలం పట్టారు. ఆ కలం పట్టిన ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది. అట్లా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే మంచి కవిత్వం, సారవంతమైన కవిత్వం వస్తది. అయితే ఇంకో సమస్య కూడా ఉన్నది. మంచి కవిత్వం ఎప్పుడు నిలబడుతుందంటే మంచి విమర్శ ఉన్నప్పుడు నిలబడుతుంది. మనకు 60వ దశకం, 70వ దశకం, 80వ దశకం, ఆధునిక సాహిత్య విమర్శ మొదలైన కాలంలో చూసినప్పుడు ఆనాడు విమర్శకులు కవిత్వాన్ని పట్టించుకొని, విశ్లేషించి ఆ కవిత్వంలో మంచి చెడుల్ని పాఠకుల ముందుంచారు. ఇవ్వాళ విమర్శ లేదు. మంచి విమర్శ లేదు. విమర్శకుడు తాను విశ్లేషించే పుస్తకం తన వాడైతే, తన కులం వాడైతే, తన ప్రాంతంవాడైతే, తనకు దగ్గరి మిత్రుడైతే అందులో కవిత్వం లేకపోయినా అది గొప్పదని నిలబెట్టడం మూలంగా కొందరేమనుకుంటున్నారంటే ఇంత గొప్ప విమర్శ దీనిమీద చేశారు, ఇది గొప్ప పుస్తకం అని చెప్పారు గనుక ఇట్లా రాయడమే కవిత్వం, ఇట్లా రాయడమే కథ అని అనుకునే ప్రమాదం ఏర్పడింది సమాజంలో. దాన్ని మనం బ్యాలెన్స్ చేసి, మంచి విమర్శని అభివృద్ధిచేస్తే కచ్చితంగా తెలంగాణ సమాజంలో ఇంకొక యాభై ఏళ్లు తెలుగు కవిత్వం బతుకుతుందనే ఒక ఆశ, ఒక దృక్పథం నాకుంది.
- హైదరాబాద్,
4 డిసెంబర్, 2021,
సాయంత్రం : 6:51.