మిత్రమా!
వాళ్లు ఎవరో పోసే తైలం కోసం ఎదురుచూస్తూ
తమ నీడను చూసి తామే భయపడుతూ
స్థల కాలాలకు బందీఅయ్యి వెలిగే
దీపాలు కాదు
తాము మాత్రమే వెలుగును
పంచగలమని భ్రమపడుతూ
భద్ర జీవితపు ప్రవచనాలు పలికే
బాధ్యతా రహిత భావుకులు కాదు
వాళ్లు ప్రతీ క్షణం కాగడాలై కదిలిపోతూ
తాము జీవించే కాలాన్నంతా వెలిగిస్తూ
చీకటి రోజుల్లో సైతం
వెన్నెల వర్షాన్ని హామీ పడేవాళ్లు
మనమేదో యుద్ధంలో ఉన్నామని
ఆ యుద్ధంలో వాళ్లు లేరనే నిట్టూర్పులెందుకు?
అసలు యుద్ధమంటే ఏంటో మనకర్థమయ్యిందా?
మనం చేసే కవితాక్షర విన్యాసం
నేల విడిచి సాముచేసే
గంభీర “జ్ఞాన” సిద్ధాంతాల గారడి
ఇదేనా యుద్ధం?!
నీ గెలుపూ ఓటముల
గందరగోళం చూసి
పొత్తి కడుపులోని బిడ్డ
పుట్టాలా వద్దా అని
ఆందోళన పడుతుంటే
ప్రసవ వేదనలో సైతం
తల్లి బిడ్డతో గుసగుసలాడుతోంది
“నేను నీ కోసమే జీవిస్తాను
నీ కోసమే మరణిస్తాను
నాకంటూ ఏమీ లేదు
వెండి వెన్నెల్లోకి
నిన్ను నడిపించడం తప్ప” అని
మిత్రమా…
నడిసొచ్చిన దారులను
తిరిగి తిరిగి చూడాల్సిందే
దాటలేని కొండలను, వాగులను
ఎట్లా దాటాలో నేర్చుకోవడానికి
ఆ చూపులో ఆశావాదముండాలే
కాని
నిస్సహాయ నిరాశావాదం కాదు
శత్రువు మన చుట్టూ ఉన్నప్పుడు
మనలోనూ ఉన్నప్పుడు
ప్రయాణం చేయాల్సింది
శూన్యంలోకి కాదు
స్థల కాలాలు పెట్టే
పరీక్షలోకి.
ఓడినా, గెలిచినా
ఒక విలువై నిలువడానికి
రేపటి ఆచరణగా మిగలడానికి.
అబ్బా! మనసు తేలిక పడింది ఈ వాక్యాలు చదువుతుంటే
‘భద్ర జీవితపు ప్రవచనాలు పలికే
బాధ్యతా రహిత భావుకులు కాదు’ మన ఖర్మ ఏమిటంటే భద్ర జీవితాలతో సజావుగా బతికేస్తూ పనికి మాలిన ప్రవచనాలు, నీతి సూత్రాలు పలికే వాళ్లే ఎక్కువయిపోయారు మన మధ్య. నిజమే.. యుద్ధం గురించి మనకు తెలిస్తే కదా యుద్ధం అంటే ఏంటో అర్థం కావడానికి. పోరాటాల పట్ల కనీస సానుభూతి, జరుగుతున్న నష్టాల పట్ల కనీస సహానుభూతి లేకుండా పంథాల వైఫల్యాల గురించి మాట్లాడే పోసుకోలు కబుర్లు ఆడే వారే మనలో ఎక్కువ. మనలో చాలామందికి చెంపపెట్టు లాంటిదీ కవిత.
TRUE ASHOK JI—-VODINA—GELICHINA—OKA VILUVA AYYI NILUVADANIKI
NICEONE