బోయి విజయభారతి ప్రాంగణం
తెలుగు సాహిత్యం – అంబేద్కర్ ప్రభావం
సిద్దిపేట, తెలంగాణ
వేదిక : విపంచి కళా నిలయం * తేదీలు : 2025 ఫిబ్రవరి 8 & 9
1891 ఏప్రిల్ 14న పుట్టిన అంబేద్కర్ పాతికేళ్ల వయసుకి కులం పుట్టుకను, వ్యాప్తిని విశ్లేషించటం మొదలుపెట్టాడు. మనుస్మృతి, వేదాలు, పురాణేతిహాసాలు ఆయనకు అధ్యయన విషయాలయ్యాయి. ఈ అధ్యయనం వివక్షలను ఎదిరించి సమానత్వం కోసం పోరాడాలన్న తాత్విక భూమికమీద సాగింది. అందువల్ల ప్రజాస్వామిక పరిశోధకుడిగా పదును తేలాడు. కుల మతతత్వ విశ్లేషణకు వేదస్మృతి సాహిత్యంతో పాటు భారత రామాయణాది ఇతిహాస పురాణాలను అంత విస్తృతంగానూ ఉపయోగించుకున్నాడు ఆ రకంగా అంబేద్కర్ ఎంత సామాజిక ఆర్ధిక రాజకీయవేత్తో అంత సాహిత్య విమర్శకుడు కూడా. సామాజిక, రాజకీయ ఉద్యమకారులను తన నాయకత్వంతో ప్రభావితం చేసినట్లుగానే సామాజిక చలనాలను ఒడిసి పట్టుకునే సాహిత్యకారులని కూడా తన భావజాలంతో ప్రభావితం చేసాడు.
లౌకిక ప్రజాస్వామిక విలువలని- కార్పొరేట్ ఫాసిస్ట్ శక్తులనుంచి కాపాడుకోడానికి కావలసిన నైతిక ధైర్యాన్ని పోగుచేసుకొనటానికి అంబేద్కర్ ఆలోచనలు ఉపయోగపడతాయన్న నమ్మకంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అంబేద్కర్ రచనల అధ్యయనం మొదలుపెట్టింది. డిసెంబర్ 22 నుండి ప్రతి ఆదివారం ‘అంబేద్కర్ ఆలోచనల తాత్వికత’పై రెండు ప్రసంగాలతో అంతర్జాల కార్యక్రమం ప్రారంభించింది. ఇది 2025 జూన్ వరకూ సాగుతుంది. ఈ ప్రయత్నం మరింత సమగ్రం కావడం కోసం ప్రరవే 16 వ వార్షిక సదస్సు ‘తెలుగు సాహిత్యం – అంబేద్కర్ ప్రభావం’ అన్న అంశాన్ని ఎంచుకుంది. అంబేద్కర్ ఆలోచనల వెలుగులో తెలుగు సాహిత్యాన్ని విలువకట్టటం అంటే అది ఎంత ప్రజస్వామికం అయిందో తెలుసుకొనటమే అవుతుంది.
2025 ఫిబ్రవరి 8 & 9 (శని, ఆదివారాలు) తారీకులలో సిద్దిపేటలో జరగనున్న రెండురోజుల సదస్సులో ఈ క్రింది అంశాలు చర్చకు రావాలని ప్రరవే ఆశిస్తున్నది.
- దళిత స్పృహతో- దళితులు, దళితేతరులు రాసిన సాహిత్యాన్ని విశ్లేషించే పద్ధతులు
- దళిత సాహిత్యం అంతా అంబేద్కరిస్టు సాహిత్యం అవుతుందా అన్న చర్చ
- అంబేద్కరిస్టు సాహిత్యాన్ని నిర్వచించటం, గుర్తించటం
- 1985 కు ముందు తెలుగు సాహిత్యంపై అంబేద్కర్ ప్రభావం
- 1985 తరువాత వచ్చిన గుణాత్మక పరిణామాలు
- అంబేద్కర్ పై వచ్చిన ఆరాధనా సాహిత్యంలో అంబేద్కర్ భావజాల ప్రభావం
- కుల, మత, మానవ సంబంధాల నేపథ్యంగా అంబేద్కర్ ప్రభావంతో వచ్చిన సాహిత్యం- ఏ కాలంలో, ఏ ప్రక్రియలో, ఎంత విస్తారంగా వచ్చింది.
- మహిళా జనహితం కోసం పాటుబడిన అంబేద్కర్ ఆలోచనాధారను స్త్రీలు ఏ మేరకు అందిపుచ్చుకుని ఏయే ప్రక్రియలలో ప్రధానంగా కృషి చేశారు
- మొత్తంగా అంబేద్కర్ ప్రభావం తెలుగు సాహిత్యానికి ఇచ్చిన కొత్త విలువలు
ఈ సదస్సులోప్రారంభసమావేశానికి ఆత్మీయ అతిధులు నందిని సిధారెడ్డి, అల్లం నారాయణ. కీలకోపన్యాసం ఆచార్య మధుజ్యోతి ఇస్తారు. ముగింపు సదస్సులో డా. జిలకర శ్రీనివాస్ ప్రసంగం, సిద్దెంకి యాదగిరి ఆత్మీయ భాషణం ఉంటాయి.
ఆచార్య బన్న అయిలయ్య, డా. కోయి కోటేశ్వరరావు, డా. గంధం అరుణ, డా. గుంటూరు లక్ష్మీనరసయ్య, కాత్యాయనీ విద్మహే వక్తలుగా – అంబేద్కర్ కుల విమర్శ ప్రారంభించిన 1916 నుండి 2024 వరకు వచ్చిన నూట ఎనిమిది సంవత్సరాల తెలుగు సాహిత్య అనుశీలనం జరుగుతుంది. అంబేద్కర్ ప్రభావంతో తెలుగు సాహిత్య విమర్శను అభివృద్ధి చేసిన బోయి విజయభారతి స్మారకోపన్యాస వక్త తిరునగరి దేవకీదేవి.
9 వ తేదీ జరిగే కవిసమ్మేళనానికి ప్రారంభ ఉపన్యాసకులు డా. పసునూరి రవీందర్. ప్రరవే జెండాతో ప్రారంభమయ్యే కార్యక్రమంలో కె. రంగాచార్య, నరేష్ కుమార్ సూఫీ సందేశాలు ఉంటాయి.
సిద్దిపేటలో 2025 ఫిబ్రవరి 8 & 9 తేదీలలో జరగనున్న ప్రరవే 16 వ వార్షిక సదస్సుకు సాహిత్యకారులు, అంబేద్కర్ వాదులు, సమానత్వ కాంక్షతో పోరాటాలు చేస్తున్న అందరూ అధిక సంఖ్య లో హాజరయి సభలని విజయవంతం చేయమని కోరుతున్నాం.
-ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక