నీలికళ్ల కోడికూత

కాలాన్ని
కత్తులుగట్టిన కోడిపుంజును జేసీ
నెత్తురు ఎల్లవులుగా పారుతున్నా
ఏమీ ఎరగనట్టు యేడుక చూసే
కుట్రపూరిత కంటి సైగలొకవైపు
కూలుతున్న ఇంటి పైకప్పులొకవైపు
కేవలం
దిష్టిబొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజా
మన అడుగులెటువైపు??

*

దేశభక్తిగంగ పొంగిపొర్లుతున్న కాలన
దేశభక్తిరంగు పొగరుబడుతున్న కాలన
ఆ ఇంటిమీదకాకి యీ ఇంటిమీదకి వాలదు
ఆ కంటికింద చెమ్మ యీ కంటిచూపుకి ఆనదు

మతం
దేముడు
పెనుమంటలై చుట్టుముడుతున్న బతుకుల్ని చూస్తూ
ధనపాలకులు పబ్బం గడుపుకోవడం కొత్తేమి కాదు
ఇంకా మనం నోరుమెదపకపోవడమే
ఇంకా మనం పోరుకదపకపోవడమే
బలే యింతగా వుండాది
బో చెత్తగానూ వుండాది
బతుకు బానిసత్వపు కుడితిలో బల్లిలా వుండాది

*

మతపు గాజుపెంకుల్ని గుండెలమధ్య నాటి
మనిషితనానికి పాడికడుతున్న ఏలికల దేశం
యే చీకటి గుహలల్లో చిక్కిపోతాదో
యే చితికినబొబ్బల్లో చిమిడిపోతాదో
అయినా మనకు చీమకుట్టదు
అయినా మనకు రవ్వంతైనా సిగ్గుపుట్టదు
మళ్లీ మళ్లీ అదే మురుగులో మునకలేయడానికి
మళ్లీ మళ్లీ అదే ముసురులో మునిగిచావడానికి
కుమ్ములాడుతుండాము!?

*

నోటు ముక్కలను విసిరి
తోకూపుకుంటూ నిలబడే ఓటుకుక్కను చేసి
కవణమేసినా
కక్కు ఊసినా
కళ్ళుమూసుకునితినే కల్లులేనికబోదులనుచేసి
ఆడేవాడు ఆడతుండాడు
పాడేవాడు పాడతుండాడు
కడుపుమాడే వాడు మాడతుండాడు
కడుపుకాలినోడి గడపలో నిలబడి
వొక మాట మాట్లాడేవాడే కరువైపోయాడు

*

కత్తులు కట్టిన కాలానికి కళ్ళుతెరిపించేలా
కొక్కురకో… అని వొక ఒద్దికకూత కూసేటి
నీలికళ్ల కోడిపుంజును పిలవండి
నీతిమాలిన గెద్దచూపుల నుంటి
పిల్లలని కాపాడుకునే
నీలిరెక్కల కోడిపెట్టను పిలవండి
యీ భక్తిరంగు పురుగుల్ని నుంచి
యీ దేముడుభజన పేడబురగల్ని నుంటి
మన నేలను
మన చేలను
కావిలిగాసుకుని కాపాడుకుంటాయేమో..!

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply