నల్లజాతీయుల ‘బైసికిల్ థీవ్స్’: ది వాగనర్

అట్లాంటిక్ మహా సముద్రతీరంలోని, దక్షిణాఫ్రికా ప్రధాన భూభాగంలోని రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్ నుంచి, ఫ్రెంచ్ భాషలో వచ్చిన ఒక గొప్ప లఘు చిత్రం “బోరోమ్ సారెట్” (Borom Sarret- ఇంగ్లీషులో The Wagoner). 1963 లో “నల్ల ఆఫ్రికన్ చిత్ర నిర్మాతల పితామహుడు” గా ప్రసిద్ధికెక్కిన ఉస్మాన్ సెంబెన్ (Ousmane Sembene) రచించి, దర్శకత్వం కూడా నిర్వహించాడు. తెలుపు నలుపులలో నిర్మించబడిన ఈ చిత్ర నిడివి 20 నిమిషాలు!

రోమన్ సంకేతంలో 1960 సంఖ్యను MCMLX అంటారు. ఈ రోమన్ MCMLX చరిత్రలో ఒక పరివర్తనాత్మక సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనిని “ఆఫ్రికా సంవత్సరం” అని పిలుస్తారు. ఈ సంవత్సరంలో 17 ఆఫ్రికా దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.

ఇతివృత్తం: ఈ చిత్రం సెనెగల్ రాజధాని డాకర్ నగరంలోని ఒక బండి నడిపుతూ జీవనోపాధి పొందేందుకు ప్రయత్నించే ఒక నిరుపేద గిరిజన వ్యక్తి కథను ఆవిష్కరిస్తుంది. వలస పాలన తర్వాత అతని ఒక రోజు జీవితంలో జరిగిన సంఘటనలను, నగర జీవిత వాతావరణాన్ని హృద్యంగా చూపించడం ద్వారా ఆఫ్రికాలోని దుర్భరమైన పేదరికాన్ని వివరిస్తుంది. ఫ్రెంచ్ పాలన నుండి ఆఫ్రికన్ ప్రజలు పొందిన స్వాతంత్ర్యం అక్కడి ప్రజల సమస్యలను ఏమాత్రం పరిష్కరించలేదనే విషయాన్ని కళ్ళకు కడుతుందీ చిత్రం. బోరోమ్ సారెట్ అంటే వాగనర్ లేదా బండి నడిపే వ్యక్తి అని అర్ధం. అతనికి ఈ సినిమాలో ప్రత్యేకమైన పేరేమీ ఉండదు!

కథలోకి వెళ్తే, పేరులేని ఒక కథానాయకుడు, ‘అల్బౌరా’ అనే ముసలి గుర్రం లాగే చక్రాలు లేని ఒక గుర్రపు బండిని పూన్చుకుని డాకర్ నగరంలో పేదలకు అందుబాటులో ఉండడానికి వీలుగా తన బండిని తయారు చేసుకుని, ఉదయాన్నే బయలుదేరుతాడు. డాకర్ నగరంలోని వివిధ ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు అతనికి అనేకమంది స్థానికులు ఎదురవుతారు. ఒక వృద్ధురాలిని, ఒక నిరుద్యోగిని ప్రయాణానికి ఎక్కించుకోవడంతో తన రోజును ప్రారంభిస్తాడు. తన బండిలో ప్రయాణించే వారి గురించి అతను వ్యాఖ్యానిస్తుంటాడు. వీరిలో చాలామంది నిత్య ప్రయాణీకులే. కొందరు ప్రయాణికులు డబ్బుకి బదులుగా తినడానికి కోలా గింజలు (స్థానిక ఆహారం) ఇస్తుండగా, మరి కొందరు మాత్రం ఎలాంటి కృతజ్ఞతా భావం చూపకుండా ఒక్క పైసా కూడా చెల్లించకుండా వాళ్ళు తమ పేదరికాన్ని సాకుగా చూపి, బండెక్కి దిగిపోతుంటారు. ప్రయాణీకుల్ని వారి వారి గమ్యస్థలాలకు చేరుస్తున్నప్పుడు వాగనర్ తన ఉపాధి కోసం ఎంతో కొంత డబ్బు ప్రతిఫలంగా ముడుతుందని ఆశిస్తాడు. కానీ సాధారణంగా వారిలో కొంతమందికి అసలు ఆదాయమనేదే లేకపోవడం వల్ల ఏమీ చెల్లించే పరిస్థితిలో ఉండరని కూడా అతనికి తెలుసు. ఆ తర్వాత అతను ఎక్కించుకున్న ప్రయాణికులతో కొన్ని చిన్న చిన్న సంఘటనలను చూస్తాం. ఒక మధ్యతరగతి భవన నిర్మాణ కార్మికుడు, ప్రసవ వేదనతో ఉన్న తన భార్యను వైద్య సంరక్షణ కోసం హడావిడిగా తీసుకువెళ్తున్న భర్త, వాగనర్ కి కొంత చిన్న మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. తర్వాత తన మరణించిన పసికందును కఫన్ తో కప్పి దుఃఖిస్తున్న ఒక తండ్రి ప్రయాణించడం చూస్తాం. పసికందు దేహాన్ని ఆప్యాయంగా, బండిలో ఉంచి స్మశానవాటికకు వెళ్ళబోతుండగా, సరైన పత్రాలు లేవనే కారణంతో కాపలాదారుడు అతనిని లోపలికి అనుమతించడు. ఆ వ్యక్తి విలపిస్తూ ఉండిపోయినప్పుడు, వాగనర్ శిశువు దేహాన్ని గేటు దగ్గర నేలపై ఉంచి వెళ్ళిపోతాడు. ఒక వ్యాపారి, వికలాంగుడైన ఒక భిక్షగాడు, ఒక గ్రియోట్ (వృత్తిపరమైన కథకుడు), ఆఫ్రికన్ ఉన్నత వర్గానికి చెందిన ఒక మోసకారి యువకుడు, ఒక పోలీసు అధికారి కూడా ఆరోజు అతనికి తటస్తపడతారు.

భోజన విరామం కోసం ఆగి, అక్కడ కోలా గింజలు తింటుండగా, ఒక గ్రియోట్ (జానపద గాయకుడు) గంభీరమైన స్వరంతో పాడుతున్న ప్రాచీన కాలపు గాథలను వింటూ ఆ వాగనర్ పరవశించిపోతాడు. ఆ గాథలు, దీనస్థితిలో ఉన్న అతనికి తనకు సంబంధించిన గొప్ప పూర్వీకుల కుటుంబం, ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఒక అవివేకపు ఆలోచనతో, ఆకలితో అలమటిస్తున్న తన కుటుంబాన్ని ఒక్క క్షణం పాటు మరచిపోయి, ఉదయం తనకు ప్రయాణాల నుండి వచ్చిన డబ్బును పరవశంతో ఆ కథకుడికి ఇచ్చేస్తాడు!

తర్వాత సన్నివేశంలో, మంచి దుస్తులు ధరించి, గొప్పగా కనిపించిన ఒక వ్యక్తి తనను, స్వాతంత్ర్యం రాకముందు యూరోపియన్ల నివాస స్థలాలైన “ఫ్రెంచ్ క్వార్టర్” కి తీసికెళ్ళమని అడుగుతాడు. ఫ్రెంచ్ క్వార్టర్ లోపలికి తన బండిని అనుమతించరు కాబట్టి వాగనర్ అతనిని అక్కడికి తీసికెళ్ళడానికి ఇష్టపడడు. కానీ మళ్ళీ మధ్యాహ్నం తను చేసిన తప్పును గ్రహించి, కాస్త డబ్బు వస్తుందని మనసులో కక్కుర్తి పడతాడు. అయినా సందేహంగానే ఉంటాడు. అదీగాక తనకున్న విస్తృత పరిచయాలవల్ల ఆ నిబంధనను పాటించవలసిన అవసరం తనకు లేదని సదరు వినియోగదారుడు వాదించి వాగనర్ ని ఒప్పిస్తాడు. అయితే, బండి బయలుదేరి ఫ్రెంచ్ క్వార్టర్ కి వెళ్ళాక, తన బండిని ఒక మూల దాచిపెట్టి, తనను నమ్మించిన కస్టమర్ కోసం ఎదురుచూస్తుండగా, ఒక పోలీసు వారిని ఆపి, వాగనర్ లైసెన్స్ పత్రాలను అడుగుతాడు. వెంటనే కస్టమర్ తన ప్రయాణ ఛార్జీలు చెల్లించకుండా, బండి నడిపే వ్యక్తికి చిన్నపాటి సమర్ధన కూడా ఇవ్వకుండా, అక్కడినుంచి దొంగలాగా తన వాహనం మీద ఉడాయిస్తాడు. వాగనర్ తన లైసెన్స్ ని పోలీసుకి చూపించడానికి బయటకు తీస్తున్నప్పుడు, ఫ్రెంచ్ సైన్యంలో అతని సేవకు గుర్తుగా ఇచ్చిన సైనిక పతకం జారి నేల మీద పడిపోతుంది. వెంటనే పోలీసు దానిమీద కాలు వేసి వాగనర్ ఎంతగానో ఇష్టపడే సైనిక పతకాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇది సమాజంలో అతని హోదాను మరింత తగ్గిపోవడాన్ని నొక్కి చెప్తుంది.

తర్వాత సన్నివేశంలో, జరిమానాకు బదులుగా తన బండిని జప్తు చేయడంతో, వాగనర్ దగ్గర కేవలం అతని గుర్రం మాత్రమే మిగులుతుంది. చివరికి అధికారులు అతని బండిని స్వాధీనం చేసుకుని, అతని ప్రాథమిక జీవనోపాధిని కూడా దూరం చేస్తారు. వాగనర్ అధికారులు, వినియోగదారుల దోపిడీని సహించి, దినమంతా చేసిన కఠోర శ్రమ తర్వాత పైసా సంపాదన కూడా లేకుండా ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వస్తాడు.

వాగనర్ ఇంటికి చేరుకుని, తన దగ్గర డబ్బు లేదని, ఈరోజు ఏమి సంపాదించలేకపోయానని భార్యకు చెబుతాడు. అప్పుడతని భార్య వారి బిడ్డను అతనికి అప్పగించి, “ఈ రాత్రి నువ్వు తప్పకుండా తింటావని నేను వాగ్దానం చేస్తున్నాను” అని భరోసా ఇచ్చి ఆ పరిసరాలను వదిలిపెట్టి బయటకు వెళుతుంది. ఈ సన్నివేశంతో సినిమా ముగుస్తుంది!

కథ ఇంతే గానీ ఉస్మాన్ సెంబెన్ 20 నిమిషాల లఘు చిత్రంలో ఒక పెద్ద 70 ఎమ్ ఎమ్ స్క్రీన్ మీద, మూడు గంటలలో పొందుపరచదగిన గొప్ప స్కోపున్న విషయాలను దృశ్యీకరించాడు. వినడానికి ఎంత సరళంగా అనిపించినా, పేదరికం, నిరుద్యోగం, మతం, దురాశ, జీవితం, మరణం, ఉనికిలోని పరమ నిష్ప్రయోజకత్వం వంటి అనేక అంశాలను ఇందులో వివిధ స్థాయిలలో ప్రస్తావించాడు. పాశ్చాత్యులు తమ సినిమాల ద్వారా తమ మీద వాళ్ళ సంస్కృతిని రుద్దారనే కోపం, చమత్కారం, స్పష్టత, ఆరోగ్యకరమైన, నిష్కపటమైన నిరసనలతో కూడిన సందేశం వంటి అన్ని లక్షణాలను చిత్రంలో ఇముడ్చుకున్నాడు ఉస్మాన్ సెంబెన్. ఆయన క్లోజప్‌లను వాడకుండా, తాను చెప్పాలనుకున్నది చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

ఉస్మాన్ సెంబేన్ ప్రత్యేక వ్యక్తిత్వం
ఉస్మాన్ సెంబెన్ (Ousmane Sembène 1923 – 2007) సెనెగల్‌లోని ఒక మత్స్యకార గ్రామంలో ముస్లిం వోలోఫ్ కుటుంబంలో జన్మించాడు. అతన్ని చెంపదెబ్బ కొట్టిన ఫ్రెంచ్ ఉపాధ్యాయుడిని తిరిగి కొట్టడం వల్ల ఆయనను ప్రాథమిక పాఠశాల నుండి బహిష్కరించారు. కౌమారదశ నుంచే పని చేయడం మొదలుపెట్టి, ఆకలి బాధ నుండి తప్పించు కోవడానికి పందొమ్మిదేళ్ల వయసులో ఫ్రెంచ్ సైన్యంలో చేరాడు. 1934 నాటి ఫ్రెంచ్ వలస పాలనలో ఉన్న ప్రాంతాల ప్రజలు తమకు సంబంధించిన “చలనచిత్ర దృశ్యాలను గానీ, ధ్వని రికార్డింగ్‌లను గానీ ” రూపొందించడానికి వీల్లేదని “లావల్ డిక్రీ” (Laval Decree) ఉత్తర్వు విధించింది. తన సైనిక సేవ ముగిసిన తర్వాత, 1947 నాటి డాకర్ రైల్వే సమ్మెలో పాల్గొని, ఈ సమ్మె ఇతివృత్తంతో ఆయన “God’s Bits of Woods” అనే నవలను 1960 లో రాశాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడైన సెంబెన్, పారిస్‌లోని సిట్రోయెన్ (Citroën) కర్మాగారంలోనూ, మార్సెయిల్స్ రైల్వేలోనూ పనిచేసి, కార్మిక సంఘాల కార్యకలాపాలలో పాల్గొంటూ ఫ్రాన్స్‌ లో ఒక దశాబ్దానికి పైగా కార్మిక జీవితాన్ని గడిపాడు. తన మొదటి నవల ‘Le Docker Noir’ (1956) తర్వాత, 1950ల చివరలోనూ 60ల ప్రారంభంలోనూ ఫ్రెంచ్ భాషలో అనేక పుస్తకాలను ప్రచురించాడు. ఏ వలసవాదిని కూడా ఆయన సానుకూల దృక్పథంతో చూపలేదు. 1961లో మాస్కోలోని గోర్కీ స్టూడియోస్‌లో మార్క్ డాన్స్‌ కోయ్ (Mark Donskoi), సెర్గీ గెరాసిమోవ్ (Sergei Gerasimov) వంటి ప్రముఖ చిత్రనిర్మాతల వద్ద చలనచిత్ర నిర్మాణాన్ని అభ్యసించాడు. ఆఫ్రికాకు తిరిగి వచ్చిన తర్వాత, స్థానిక భాషలకు ప్రాధాన్యతనిస్తూ, నయా-వలసవాదం, పేదరికం, ఆఫ్రికన్ బూర్జువాలపై విమర్శ, ఆఫ్రికాలో వలసరాజ్యం, వలసానంతర సమస్యలపై దృష్టి సారించాడు.

వాగనర్ చిత్ర ప్రత్యేకతలు
“బోరోమ్ సారెట్” లఘు చిత్రం పశ్చిమ ఆఫ్రికాలోని తొలి దేశీయ చిత్రాలలో ఒకటిగా, ఒక నల్లజాతి ఆఫ్రికన్ దర్శకుడు తీసిన మొదటి చిత్రంగా విస్తృతంగా ప్రసిద్ధి గాంచింది. తదుపరి ఆఫ్రికా చిత్రాలకు ఉస్మాన్ సెంబెన్ ను మార్గదర్శిగా, భావి చలన చిత్ర పథనిర్ణేతగా నిలబెట్టింది. 1960లో ఫ్రాన్స్ నుండి సెనెగల్ స్వాతంత్ర్యం పొందిన కొద్ది కాలానికే అంటే 1963 లో సెనెగల్‌లోని వర్గ విభజనలను, నూతన వలసవాద వాస్తవాలను చూపే లక్ష్యంతో “బోరోమ్ సారెట్‌” చిత్రం రూపుదిద్దుకుంది. సాంప్రదాయ-వలసరాజ్యాల అనంతర సమాజాల మధ్య కాలంలో ప్రజలు కోల్పోయిన సామాజిక జీవితాలను అత్యంత తెలివిగా, ఖచ్చితంగా చిత్రిక పట్టిన చిత్రాలలో దీనిని ఒకటిగా ప్రపంచ సినీ విమర్శకులు పరిగణించారు.

ఈ చిత్రంలో సెనెగల్ నూతన స్వాతంత్ర్యంతో, సార్వభౌమాధికారంతో ముడిపడి ఉన్న సందర్భంలో కూడా ఆర్థిక నిర్మాణాలు మాత్రం ఫ్రెంచ్ ప్రభావానికి కట్టుబడి ఉండడం చూస్తారు ప్రేక్షకులు. ఉస్మాన్ సెంబెన్ ప్రపంచ దృష్టికోణం, మార్క్సిస్ట్ అవగాహన, యూనియన్, సోవియట్ శిక్షణల ద్వారా పొందిన అనుభవాలను సంతరించుకుని వాణిజ్య వినోదం కంటే కూడా ప్రజా చర్చకు ఒక సాధనంగా ఈ చిత్రం ఉపయోగపడుతుంది.

ఈ చిత్రం నగరాన్ని దుర్బలమైన పేదరికం, నిరాశ, నిష్ఫలత కొనసాగే స్థానిక మెదీనా – అపరిమితంగా పోగైన సంపద, ప్రజల బహిష్కరణకు ప్రతీకగా నిలిచే ఎత్తైన యూరోపియన్ శైలి భవనాలతో నిండిన ప్లాటూ ప్రాంతంగా విభజిస్తుంది.

2008లో లింకన్ సెంటర్‌లో “గత స్మృతులు, భవిష్యత్ స్మృతులు: న్యూయార్క్ ఆఫ్రికన్ ఫిల్మ్ ఫెస్టివల్ 20 ఏళ్లు” అనే నినాదంతో ప్యానెల్ చర్చ జరిగింది. అందులో డెలోర్మ్‌ అనే ప్రముఖ రచయిత్రి ఉస్మాన్ సెంబెన్ ని ఇంటర్వ్యూ చేసింది. ఆమె రచనలు, స్పష్టమైన సంబంధాలు లేని విభిన్న ప్రపంచాలను ప్రశ్నించి, వాటిని ఒకచోట చేర్చి ఊహించని సంబంధాలను వెల్లడించడంలో విజయం సాధించాయి. ఆమె తన ఇంటర్వ్యూలో “బోరోమ్ సారెట్” లఘు చిత్రంలో భార్య ఉద్దేశించిన గమ్యస్థానం వ్యభిచారమని వ్యాఖ్యానించింది. ఎందుకంటే ఆ రోజుల్లో పేదరికం, ఆకలి బాధలనుంచి ఉపశమనం పొందడానికి వ్యభిచారాన్నే మార్గంగా ఎంచుకున్నారనే చర్చ ఉందని బాధాకరంగా చెప్పింది. అందువల్లేనేమో ఈ చిత్రాన్ని నర్మగర్భంగా ముగించాడు ఉస్మాన్ సెంబెన్!

నల్లజాతి ‘బైసికిల్ థీవ్స్’!
ఈ సినిమాని విట్టోరియా డి సికా ‘బైసికిల్ థీవ్స్’ తో పోలుస్తూ, ఇది నల్లజాతీయుల ‘బైసికిల్ థీవ్స్’ అని ప్రశంసించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ విమర్శకులు.

ఈ రెండు చిత్రాల వాస్తవిక సౌందర్యం కొన్ని పోలికలకు దారితీస్తుంది. రెండు కథనాలను నీతి కథల వలె నిర్మించారు. రెండూ పేద మనుషుల కథలే! వారి జీవనోపాధి మార్గాలను (ఒక సైకిల్, ఒక బండి) కోల్పోవడం వల్ల వారి దురదృష్టం మరింత తీవ్రమవుతుంది. ఇద్దరిలోని పురుషులు నిరాడంబరంగా, అమాయకంగా ఉంటారు. రెండింటిలోనూ నటులు కాని వారిని ఉపయోగించారు. అంతేగాక నగరాలలోని నిజమైన వీధుల్లో చిత్రీకరించారు. మరీ ముఖ్యంగా రోజువారీ జీవితంలోని ఆచరణాత్మక విషయాలను ఎదుర్కోవడంలో ఈ ఇద్దరు పురుషుల కంటే వారి భార్యలే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారు!

ఉస్మాన్ సెంబెన్ ఆకట్టుకునే చిత్ర నిర్మాణ శైలి!
ఉస్మాన్ సెంబెన్ “బోరోమ్ సారెట్” చిత్రాన్ని సహజమైన, డాక్యుమెంటరీ తరహా శైలిలో చిత్రీకరించాడు. ఈ చిత్రంలో చాలా తక్కువ సంభాషణలు ఉంటాయి, అవి కూడా వాగనర్ ఆలోచనలను గట్టిగా చెప్పడం ద్వారా రూపొందుతాయి.

సాహిత్య పరిమితులను గుర్తించిన ఉస్మాన్ సెంబెన్, అధిక నిరక్షరాస్య జనాభాను చేరుకోవడానికి సినిమాను ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు. ఇటలీ న్యూ వేవ్ స్ఫూర్తితో విలక్షణంగా, నిదానంగా, అందంగా, జంప్ కట్స్ తో వాగనర్ ప్రయాణాన్ని మనసుకి హత్తుకునేలా చిత్రీకరించాడు.

వలసవాదం కింద రోజువారీ జీవితంలో నిరుపేదల అణచివేతను పరిపూర్ణంగా దృశ్యీకరించే ఉస్మాన్ సెంబెన్ సునిశీతమైన, సరళమైన సినిమా నిర్మాణ విధానం మనపై తీవ్రమైన తక్షణ ప్రభావాన్ని చూపుతుంది.

స్వాతంత్ర్యం పొందినప్పటికీ అణగారిన వర్గాలు ఎంత నిస్సహాయ జీవితాలను గడుపుతాయో ఈ చిత్రం శక్తిమంతంగా చూపిస్తుంది. రాజకీయ వ్యవస్థ ఎంత అవినీతిమయం అయిందో, పౌరుషం కోల్పోయి, భవిష్యత్తుపై ఆశ లేకుండా, గతాన్ని తిరిగి చూసే మార్గం లేకుండా మిగిలిపోయిన అణచివేతకు గురైన ప్రజలు ఎంతగా ఓడిపోయారో తెలియజేసే ఒక సరళమైన చిత్రం ఇది!

ఫ్రెంచ్ క్వార్టర్‌లోని నల్లజాతి ఉన్నత వర్గాల విముక్తి వాగ్దానాలు, అహంకారపూరిత నిర్లక్ష్యాలు – వాగనర్ శ్రామిక వర్గ యాతనలు, ఈ రెండిటినీ ఎదురుబొదురుగా నిలిపి ప్రేక్షకులను ఆలోచించమని ఈ చిత్రం చర్చకు పెడుతుంది.

ఉస్మాన్ సెంబేన్ తన కెరీర్ పొడవునా అనేక రూపాలలో పురుషాహంకారాన్ని విమర్శించాడు. కానీ చాలా ఉత్సాహంగా “బోరోమ్ సారెట్” ముగింపు భాగం, కుటుంబాన్ని పోషించవలసిన భర్త తన ఓటమిని అంగీకరించడం, అయ్యో , తన కుటుంబాన్ని ఎలా దారికి తీసుకురావాలి, ఎలా పోషించాలి అనే దానిపై ఒక పసిబిడ్డకు తల్లి కూడా అయిన భార్య దాదాపు అప్రయత్నంగా ప్రదర్శించే ఆచారణాత్మకత చుట్టూ చాలా ఉత్సాహంగా సాగుతుంది. కానీ వాగనర్ కి ఆమె ప్రణాళికాలు అస్పష్టంగా తోస్తాయి. తన భార్య తలుపులోనుంచి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతుండగా, పసికందుని పట్టుకుని, పసిపిల్లాడిలా, “కానీ తినడానికి ఏమి లేదు!” అని అడిగే అమాయకమైన ఆగ్రహాన్ని ఉస్మాన్ సెంబేన్ రెండు షాట్ల సామర్ధ్యంతో దృశ్యీకరించిన తీరును బట్టి చూస్తే, ఈ హాస్యంలోనే ఎన్నో చీకటి కోణాలు కూడా ఉన్నాయి.

భావవ్యక్తీకరణపై ఆయన పట్టు ఎంత సరళంగా కనిపిస్తున్నప్పటికీ, అది ఏమాత్రం తక్కువ నైపుణ్య చిత్రీకరణ కాదు. సినిమా అంతా అతని పట్ల స్పష్టమైన, నిష్కపటమైన కరుణను రేకెత్తించిన తర్వాత కూడా ఉస్మాన్ సెంబేన్ మనల్ని ఈ వ్యక్తి అచ్చేతనత్వాన్ని చూసి నవ్వేంత దగ్గరకు సాహసోపేతంగా తీసుకువస్తాడు.

అదే సమయంలో నిశ్శబ్దంగా, ధైర్యంగా ఉండే భార్యతో సహా ఈ పాత్రలలో ఏ ఒక్కరూ కూడా విపరీతమైన అసమానతలతో ఉన్న సమాజపు సవాళ్ళను ఎదుర్కోలేరనే కీలకమైన అంతర్దృష్టిని ఎప్పటికీ విడిచి పెట్టడు. ఇదంతా సున్నితంగా రూపొందించిన 20 నిమిషాలలో చమత్కారంగా జరిగిపోతుంది. బోరోమ్ సారెట్ తేలికగా ఇతరులను మెప్పించేవాడిగా, రాజకీయంగా చురుకైనవాడిగా, స్పష్టమైన జ్ఞానిగా కనిపిస్తాడు. అతని చిత్రీకరణ ఆగ్రహాన్ని, చమత్కారాన్ని సమానస్థాయిలో రేకెత్తిస్తుంది.

సాంస్కృతిక – వలసానంతర విశేషాలు
“బోరోమ్ సారెట్” చిత్రంలో తన మాతృభాష వోలోఫ్ ను ఉపయోగించి నిర్మించి తన సాంస్కృతిక స్వయంప్రతిపత్తిని ఉద్దేశపూర్వకంగా నొక్కి చెప్తాడు ఉస్మాన్ సెంబెన్.

“జీవితం విసుగు పుట్టిస్తుంది కదా?” (Life Gets Tedious-Don’t it) ఎందుకంటే, జీవిత పరిస్థితులే అధోగతిలో ఉండి విజయానికి అడ్డుపడుతుంటే, ఎంత ప్రయత్నించినా పురోగతి సాధించలేరు కదా” అంటూ ఉస్మాన్ సెంబెన్ జీవితం పట్ల తన వాస్తవిక దృక్పథాన్ని ఎంతో వేదనతో వాగనర్ పాత్ర ద్వారా వివారిస్తాడు. అతను తనలో తాను గొణుక్కుంటాడు కానీ ఎవరినీ నిందించడు, ఎవరినీ నిరాకరించడు. వాగనర్ తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బును వీధుల్లో తిరుగుతూ కథలు చెప్పే గ్రియోట్‌ (జానపద కథకుడు) అని వాళ్ళు పిలుచుకునే అతనికి ఇచ్చేస్తాడు. ఒక సందర్భంలో డైరెక్టర్ తన గురించి తానే, “ నేను నా ప్రజల రహస్య స్పందనను వ్యక్తీకరించే ఒక కథకుడిని” అని అన్నాడు.

మరచిపోలేని ఒక సన్నివేశంలో, ఒక వ్యక్తి తన చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించబోగా, పత్రాలు సరిగ్గా లేకపోవడంతో స్మశానవాటిక వాళ్ళు గేటు లోపలికి పోవడానికి అనుమతించరు. ఆ సమయంలో ఆ వ్యక్తి ముఖంలో కనిపించే, నిగూఢమైన నిందాభావం వెయ్యి మాటలకు సమానం. ఆ వ్యక్తికి, కాపలాదారునికి మధ్య వాదన జరుగుతుండగా, వాగనర్ మౌనంగా బండిలోంచి ఆ పసికందు మృతదేహాన్ని తీసి, స్మశానవాటిక గేట్ల ముందు నేలపై పెట్టి వెళ్ళిపోతాడు. వాగనర్ దుఃఖిస్తున్న ప్రయాణీకుడిని వదిలివేసి, ఏమీ పట్టనట్లు వెళ్ళిపోవడం ప్రేక్షకులకు అన్యాయం అనిపిస్తుంది. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని అతని పరిస్థితిని అర్ధం చేసుకోమని ప్రేక్షకులను అభ్యర్ధిస్తాడు దర్శకుడు ఉస్మాన్ సెంబెన్. ఆర్థిక అస్థిరత స్వీయ నిర్ణయాధికారం కంటే నిస్పృహను పెంచే సమాజాన్ని ప్రతిబింబిస్తుందని స్పష్టం చేస్తాడు. అలాగే పత్రాలపరమైన అడ్డంకుల కారణంగా ఒక వ్యక్తిని తన మరణించిన బిడ్డను స్మశానవాటిక గేటు లోపలికి పోవడానికి అడ్డుకోవడాన్ని మానవ బాధలపట్ల అధికార యంత్రాంగపు ఉదాసీనతను, అన్యాయమైన క్రూరత్వాన్నీ హృద్యంగా చిత్రీకరించి వలసానంతర రాజ్యాల దుర్మార్గాన్ని స్పష్టంగా అర్ధం చేయిస్తాడు ఉస్మాన్ సెంబెన్!

“బోరోమ్ సారెట్” లో తన వాయిస్-ఓవర్ కథనం ద్వారా పశ్చిమ ఆఫ్రికా సమాజాలలో ప్రబలంగా ఉన్న మౌఖిక కథన సాంప్రదాయమైన గ్రియోట్‌ను ప్రతిధ్వనిస్తాడు. అధిక నిరక్షరాస్యత వల్ల స్థానిక ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డ్రమ్స్, గానం వంటి శ్రవణ సంకేతాలను ఉపయోగిస్తాడు. పేద ఆదివాసీ ప్రాంతాలలోని సాంప్రదాయ సెనెగలీస్ సంగీతానికి వ్యతిరేకంగా వాగనర్ ఫ్రెంచ్ క్వార్టర్ కి వెళ్ళినప్పుడు సంపన్న ప్రాంతాలలోని యూరోపియన్ శాస్త్రీయ సంగీతాన్ని సౌండ్‌ట్రాక్ మార్పులతో ప్రభావవంతంగా వ్యక్తీకరించి, ఈ వలసవాద ప్రభావాలు స్థానిక సామాజిక ఐక్యతను ఎలా విచ్ఛిన్నం చేస్తాయో హైలైట్ చేస్తాడు.

ఉస్మాన్ సెంబెన్ విమర్శనాత్మక స్పందన
“బోరోమ్ సారెట్” లఘు చిత్రంలో ఉస్మాన్ సెంబెన్ తన కఠోర విమర్శతో బాధితుడి మనస్తత్వాన్ని, పనిలో పనిగా పేదల నిష్క్రియాత్మకతను, దాస్యభావాన్ని నిర్మొహమాటంగా తీవ్రంగా ఎండగడతాడు. ఉదాహరణకు, కథానాయకుడు వాగనర్ ప్రయాణపు ఛార్జీలు వసూలు చేయకుండా పదే పదే దోపిడీకి గురవడాన్ని నిరసిస్తాడు. వ్యవస్థాగత ఆర్థిక బలహీనతలు వాగనర్ వంటి వ్యక్తులను అప్పులు, నిరాశ అనే విషవలయాల్లో బంధించినప్పటికీ, వాళ్ళు స్వీయ జ్ఞానాన్ని, సామాజిక స్పృహను పెంచుకోకుండా మతం ఉచ్చులో ఉండిపోవడాన్ని తప్పు పడతాడు. పాతుకుపోయిన సామాజిక వ్యవస్థను ప్రశ్నించి తీరాలని, లేకపోతే సాధించిన స్వాతంత్ర్యం ఒక డొల్ల విజయమేనని బలంగా చిత్రిస్తాడు ఉస్మాన్ సెంబెన్!

నటులు, సాంకేతిక వివరాలు
లి అబ్దులీ(Ly Abdouly) తన ఆమోఘమైన నటనతో అందర్నీ మెప్పించాడు.
అల్బౌరా (Albourah) అనే గుర్రం కూడా ఈ చిత్రంలో ఒక నటిగా మెప్పించిన విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి.
సినిమాటోగ్రాఫర్ గా క్రిస్టియన్ లాకోస్ట్ (Christian Lacoste), ఎడిటర్ గా ఆండ్రే గౌడియర్ (André Gaudier) నైపుణ్యంగా చేసిన పని ఈ చిత్రానికి చక్కగా అమిరాయి.

సాధించిన బహుమతి, ప్రదర్శనలు
1963 లో టూర్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మొదటి బహుమతిని గెలుచుకుని, అనేక ప్రశంసలందుకుంది.
అంతే గాక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో, కేన్స్ క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శించారు
ఈ చిత్రం ప్రధానంగా ఫ్రాన్స్, సెనెగల్‌లోని చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించారు
“బోరోమ్ సారెట్’” ఆఫ్రికా వెలుపల విస్తృతంగా ప్రదర్శింపబడిన మొట్ట మొదటి చిత్రంగా చారిత్రక ప్రాముఖ్యతను పొందింది.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply