గాజా నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు

తీయటి ఖీర్ తాగలేక
ఈ దేశం పండగరుచి మరచిపోయింది
తోబుట్టువుల ముంజేతి గాజుల సవ్వడి లేక
గాజా వీధులు మూగబోయాయి
ఒక సుందర మానవ స్వప్నసౌందర్యం
కాలిబూడిదైపోయింది

తరగతి గదిలో పగిలిపోయిన నల్ల బోర్డంతా
బాంబుల మూర్ఖత్త్వం రాల్చిన దుమ్ము దుమ్ము
అక్కడి హృదయాల నిండా
కనికరం లేని యుద్ధసర్పం చిమ్మిన
కాలకూట విషం

రక్తపు బట్టలతో కట్టిన టెంటులలో
నడిజామున అమ్మలందరిదీ ఒకే కల
పాపాయి ఆకలి ఏడుపుతో
రేపు తెల్లవారుతుందని
త్వరగా ఇల్లు చేరగలమని
మిగిలినవారైనా కలిసి అన్నం తినాలని
బ్రతుకు పై ఆశ ఒక ఆరని దీపం

సూర్యుడు ఈ యుద్ధనేలపై
సిగ్గుతో తల వంచుకు ఉదయిస్తున్నాడు
చంద్రుడికి పిల్లలతో కలసి ఈ రేయి నిదురించాలని కోరిక

శిధిలాలూ, శిబిరాల మధ్య ఎటుచూసినా విధ్వంసపు గాయాల గాజా నగరం
మసీదు బురుజులోంచి అజా పావురమై ఈరోజు
మళ్లీ పైకెగురుతోంది

గెలుపోటముల పెనుగులాట మధ్య
ఎక్కడో గుండె మూలల్లో
ఆశ చిగురిస్తున్న పోరాటం పరిమళిస్తోంది

పుట్టినదీ, పెరిగినదీ, చదువుకున్నదీ హైదరాబాదులో. 'వచన కవితా పితామహుడు' కుందుర్తి ఆంజనేయులు గారి మనవరాలు. ఫ్రీవెర్స్ ఫ్రంట్ బాధ్యతను కొనసాగించిన కుందుర్తి సత్యమూర్తి గారి కూతురు. బాల్యం నుంచీ ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కార సమావేశాలకు వెళ్ళటం, ప్రముఖులైన కవులతో, వారి పుస్తకాలతో సంబంధబాంధవ్యాల వలనా, కవిత్వం రాయాలనే తపనతో కొంతకాలంగా కవిత్వం రాస్తున్నారు. పదిహేను వరకూ వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి. M.Com, M.B.A., P.G.D.C.A. చదివారు. ప్రస్తుతం సింగపూర్ లో నివాసం. migrant workers welfare కోసం పని చేసే ఒక N.G.O.లో పని చేస్తున్నారు. రంగవల్లికలు వేయడం, బొమ్మలు గీయడం, పెయింటింగ్ హాబీలు. డిసెంబర్ 2024లో ‘జస్ట్ ఎ హౌస్ వైఫ్’ పేరుతో తొలి వచన కవితా సంపుటి ప్రచురించారు.

One thought on “గాజా నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు

Leave a Reply