కౌమారమా… క్షమించు

పిల్లల్ని ప్రేమించడం మరిచిపోయిండ్రు
తల్లిదండ్రులు, ప్రభుత్వం
చందమామ పాటనుంచే రంగం సిద్ధం
చందమామ రావే ర్యాంకులు తేవే
ఎంట్రన్సులు రాయవే ఫారిన్కు పంపవే

ఫెయిలయిన పిల్లలకు మేమున్నామనే
భరోసా యివ్వని అమ్మానాన్న‌లు
చదువంటే అదొక సాగరలంఘనం చేసిపెట్టింది వ్యవస్థ
తోకపీకుడె గాని బతికే తొవ్వ చూపెట్టని ఎడ్యుకేషన్ సిస్టం
అవమానంట అయ్యవ్వలకు, ఖర్చువేస్టట కన్నోల్లకు
పిల్లల్ని కన్నపుడే వాళ్ళ డిగ్రీలు, ఉద్యోగాలు నిర్ణయం ఇండ్లల్లో

పిల్లలకు ఏం కావాలో అన్నీ తెలిసిన మేధావులు
వాళ్ళు మరణం ఎందుకు కోరుకున్నారో తెలుసా?
ఎంత బాగ ఏలుతున్నారో తెలిసిన నేతలకు
పిల్లల చదువులిట్ల ఎట్ల తగులబడ్డయో తెలువదు

ఒక దూరాలోచన లేదు,
వ్యవస్థలో కమీషన్ల ఆలోచన తప్ప
పిల్లలు మానవజాతి భవిష్యత్తు కదా
మీకింకా వాళ్ళు పెట్టుబడుల లెక్కనే కనిపిస్తున్నరా

ప్రతి శిశువు తన కలలతో, తనదైన అవగాహనతో, తన సృజనలతోనే జన్మిస్తుంది
నిప్పుమీది నివురూదడమే కద
తల్లిదండ్రులు, టీచర్లు చేయాల్సింది
జ్వలిస్తున్న స్వప్నాలకు ప్రకాశమివ్వాలె వ్యవస్థ
పిల్లల కోసం ఈ సమాజం ఎట్లాంటి మైదానాన్ని సిద్ధపరచింది?
పిల్లల్ని ప్రేమించడం కోసం ఏ తపస్సులు చేయించాలి జననీ జనకులను

పువ్వుల్లా వికసించాల్సిన వసంతాల యవ్వనాలు
స్వప్నాల పల్లకీల్లో ఊరేగాల్సిన పల్లవ జీవనాలు
ఉరితాళ్ళకు ఊగుతున్నై
వందేండ్లు జీవించాల్సిన దేశ భవిష్య రుతువులు
ఇరవైలోపే కరువైపోతున్నై

కడుపుకోతలకు కారణమెవరు?
ధర్మపీఠం మీద ఎవరు?
బాధ్యులెవరు?

ఇంకా కండ్లు తెరువని మేధావితనాలకు
నిప్పంటిద్దాం రండి…

ఆలేరు, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా. విశ్రాంత ఉపాధ్యాయుడు, చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు. పుస్తకాలు: మట్టి పొత్తిళ్ళు, మూలకం, రెండు దోసిళ్ళ కాలం(కవితా సంకలనాలు), పాడాలని(పాటలు), ఆలేటి కంపణం, ఠాకూర్ రాజారాం సింగ్ (చరిత్ర రచనలు), సాహిత్య వ్యాసాలు, కథలు, నాటికలు.

Leave a Reply