ఊరుకుతి

ఉద్యోగపర్వంలో ఊళ్ళు తిరుగుతున్న నాలో
మరుపురాని అలజడి వాన
ఎడతెగని మనాదై ఊరుమీదికి జీవిగుంజుతది

మూలం మూటగట్టిన పల్లెలో అనుభవాల యాతం బొక్కెన
ఎల్లిపారుతున్న ఎతలు తవ్వినాకొద్దీ మతిల ఉబికే ఊటమడుగు
పెద్దగుండు వాగు పారకమోలే పొర్లుతది

గలగలపారే వాగు
పాకురు గుంతల్లో జెల్లచేపల పరాచికాల మెరుపులు
ఇసుకల కట్టిన పిట్టగూళ్ళు
వేళ్ళసందున ఈలలయ్యే గవ్వల ధ్వని కెవ్వుకేక
మురిపాల మువ్వలయి చెవుల ప్రతిధ్వనిస్తుంటయి

కోడూరుబాటల రాకపోకలు
తోడిన సెలిమెల్లో మోకాల్లపై తాగిన తురితి
ఊటమడుగులో అడుగులో అడుగేస్తూ
చేతులు గాలాలయి చేపలు పట్టిన చెరగని మరుపు

మోదుగాకు దొప్పల దోసిళ్ళతో
దూపలు తీర్చుకునే కుతికి బొందితో కైలాసమంత సంబూరం
కల్లుదాగి కైలాటకం ఆడంగ మండువంత పండుగ

బాగోతులు, జులూస్‌లు, సర్కస్‌లు
కుల మతాలకతీతంగా పెద్దపట్నం ఎక్కినట్లు చావిడి
తప్షలు, శిగిష్టలు జాండ చుట్టూ తిరిగే జీవితం
సూర్యుని చుట్టు తిరిగే భూమిలాగ ఉంటది

ఊరెత్తిన బోనం చక్రవర్తి కిరీటంలోని వజ్రపు వెలుగులు
ఫకీర్ల యేషాలు, పీరీల గుండంల అసోయిదూలా ఆటలు
అలాయి బలాయిలు, వా లేకుం సలాంలు
క్రిస్మస్ వందనాలు ప్రేమ బంధనాలు

శిలలని చెక్కి శిల్పం చేసిన బోధ
గురి నూరిపోసిన బడి గురువులు
ఖండాంతరాలకు వ్యాపించిన విద్యాపరిమళం

వృత్తి ప్రవృత్తుల్లో నిలువుతో నిలివెడు
దీవెనలు కురిపించే ఊరు
మనసార పొత్తిల్లలో అదుముకునే కన్నతల్లి

సిర్రగోనె, గోటీలు, పత్తాలాట, చారుపత్తలు
మంచిల్లబాయి మోటసిమ్ముల తెట్టె నేర్పిన సాహసాలు
పొరుగూరి మీద క్రికెట్ పోర్లు సిక్స్‌లు కోహ్లీకేం తీసిపోవు
గాలిలో దూసుకొచ్చే వాలీబాల్ షాట్లు
గురుతుకొస్తుంటే మనసు కలికలి

వాగు పారకమోలే మనసుతడి హత్తుకుంటది
పెద్దగుండు వాగు ఊరిసుట్టాల కాళ్ళు కడుగుతది
దూది అంత మెత్తటి మనసులు
రేషం రోకండ్లు పలిగే రోనీ ఎండ

కల్లు మత్తు మా ఊరే గమ్మత్తు
ఎన్నీలోలే ప్రేమ ఎగజల్లుతది
తప్పులు దొర్లితే నిప్పుల కుప్ప
ఘనమైన బోలాతనం మా గోనెపల్లి
ఎంతో మందికి కల్పవల్లి

ఆపతి సంపతి తెలంగాణ లడాయిలో
మా ఊరు సుట్టూ నాలుగూల్లపెట్టు
పట్నంల ఎన్నొద్దులున్నా
పానంగుంజేది నన్ను కనిపెంచిన ఊరిమీదికే…

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply