ఇంటా బయటా ట్రంప్‌ ప్రకంపనలు

సామ్రాజ్యవాదం, దుందుడుకువాదం కలబోసిన మితవాద రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, వ్యాపారవేత్త, డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న బాధ్యతలు స్వీకరించాడు. ఆయన గెలుపు అమెరికాలో బూర్జువా ఉదారవాద ప్రజాస్వామ్యం కోలుకోలేని పతనాన్ని సూచిస్తోంది. మితవాద రాజకీయాలను అనుసరించే అమెరికా దేశీయ, విదేశాంగ ప్రస్తుత విధానాల నుంచి సమూలంగా వైదొలగనున్నట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రకటించాడు. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రికరించాడు. సామాన్య పౌరుల సంరక్షుకుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్నాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ట్రంప్‌ దూకుడు పెంచాడు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పొరుగు దేశాలకు వణుకు పుట్టిస్తున్నాడు. అప్పుడే అనేక దేశాల్లో కలవరం మొదలైంది. ఇక ప్రపంచ రాజకీయాల్లో కొత్త భౌగోళిక రాజకీయ దశ ప్రారంభం కానుంది. ప్రపంచ ఆర్థికం, వ్యాపారాలపై గణనీయమైన ప్రభావం పడవచ్చు. ప్రపంచంలో సంప్రదాయానికి భిన్నమైన అనిశ్చితి, అనూహ్యమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

ట్రంప్‌ రెండవసారి ఎన్నిక కావడంతో అమెరికన్‌ ఒలిగార్కీ కొత్త రూపాన్ని ప్రతిబింబిస్తోంది. ఇక అమెరికన్‌ బిలియనీర్లు గత ప్రజాస్వామ్య ఉదార విలువలకు స్వస్తి చెప్పి మితవాద రాజకీయాలను అనుసరించే ప్రమాదం కన్పిస్తోంది. ట్రంప్‌ చేసిన మొదటి ప్రసంగంలో పై ఛాయలన్నీ కనిపించాయి. ఆయన తన తొలి ప్రసంగంలో అమెరికా ఫస్ట్‌, అమెరికా ది గ్రేట్‌ అగైన్‌, ఇక స్వర్ణయుగమే, తీవ్రవాద సంస్థల మెడపై కత్తులు అంటూ ఉద్వేగంతో ప్రసంగించాడు. గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ప్‌ ఆఫ్‌ మెక్సికో’ను ‘గల్ప్‌ ఆఫ్‌ అమెరికా’గా ట్రంప్‌ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. ఆయన ప్రసంగం, తీసుకున్న నిర్ణయాలు, సభకు హాజరైన వందిమాగధుల, కార్పొరేట్‌ శక్తుల ఆహా ఓహోలు అన్నీ… ఊహించినవే. పచ్చి మితవాదిగా, కళంకితుడిగా, తెంపరిగా ఇంటాబయటా విమర్శలు మూటగట్టుకున్న ఆయన మళ్లీ ఎన్నికై, అధ్యక్ష పగ్గాలు చేపట్టడం పట్ల ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

అలాగే గ్రీన్‌లాండ్‌ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని, కెనడాను అమెరికాలో విలీనం చేయాలన్నాడు. పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించాడు. మెక్సికో అఖాతం(గల్ఫ్‌) వంటి సంచలన అంశాలు ప్రకటించాడు. హెచ్‌ 1బి వీసాలు, అమెరికాలో పుట్టిన వారికిచ్చే పౌరసత్వ రద్దు, వలసలపై ఉక్కుపాదం మోపే ఆయన విధానం ఆందోళనకరంగా ఉంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో సామాజిక ఆర్థిక రంగాల్లో ట్రంప్‌ ఆధిపత్య విధానాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్‌ క్రిష్టో టోకెన్‌ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్లు లబ్ధి పొందాడనే ఆరోపణలు అప్పుడే అమెరికాలో గుప్పుమంటున్నాయి.

ఇవాళ అమెరికా సమాజం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆలోచనలపరంగా రెండుగా చీలిపోయింది. సులభమైన భాషలో చెప్పాలంటే ఒకటి పై తరగతి, రెండు కింది తరగతి. ట్రంప్‌ ఇచ్చిన మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా) నినాదం అమెరికా అగ్రరాజ్య ప్రయోజనాలను పరిరక్షిస్తూనే, మరొక వైపు ఈ కింది తరగతి ప్రయోజనాలకు సంబంధించినది. ఈ రెండింటికి ప్రాధాన్యత నిచ్చే వారి పూర్తి మద్దతు వల్లనే ట్రంప్‌ ఈసారి గెలవటంతో పాటు రిపబ్లికన్‌ పార్టీకి కాంగ్రెస్‌ ఉభయ సభలలోనూ అసాధారణమైన రీతిలో ఆధిక్యత లభించింది. ఈ పరిస్థితులలో ఆయన తన చర్యల ద్వారా అమెరికా అగ్రరాజ్య లేదా సామ్రాజ్యవాద, ప్రయోజనాలను పరిరక్షిస్తూ, పైన పేర్కొన్న దిగువ తరగతి మేలు కోసం పాలించవలసి ఉంటుంది. మరి ట్రంప్‌ చర్యలు, విధానాలు అందుకు అనుకూలంగా ఉంటాయా? ట్రంప్‌ ఉత్తర్వులు ఆ లక్ష్యాలను నెరవేర్చగలవా? అన్నది ప్రధానమైన ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్‌ మస్క్‌ అండతో అధికారం అందుకోగలిగిన కుబేరుడైన ట్రంప్‌… అలాంటి బిలియనీర్ల ప్రయోజనాల కోసం.. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను నడపబోతున్నారు… ట్రంప్‌ ‘స్వర్ణయుగం’ ప్రారంభమైందన్నది వారి కోసమే| ‘రారాజు’ తిరిగి వచ్చాడంటూ ఎలాన్‌ మస్క్‌ సహా ట్రిలియనీర్ల ప్రశంసలు, హర్షధ్వానాలు… కార్పొరేట్‌ శక్తులు మరింత విజృంభణకు సూచిక. ట్రంప్‌, ఆయన మంత్రివర్గం సంపద 400 బిలియన్‌ డాలర్లు. అంటే 172 దేశాల జిడిపితో సమానం.

కార్యనిర్వాహక ఉత్తర్వులు :

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే.. ట్రంప్‌ తన మార్క్‌ పాలన ఎలా ఉంటుందో చూపేట్టెందుకు దూకుడుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి అనేక ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. అందులో ప్రధానమైనవేమంటే 100 సంవత్సరాలుగా అమలులో ఉన్న జన్మత పౌరసత్వం హక్కుపై వేటు వేశాడు. మగ, ఆడ తప్ప మూడో లింగమనేది గుర్తించబోమనేది మరో తిరోగామి చర్య. అమెరికా సామాజికంగా సాధించిన ముందంజను ఇది ధ్వంసం చేస్తుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి సమయంలో 06 జనవరి 2021 రోజున క్యాపిటల్‌ భవనంపై దాడి చేసిన దాదాపు 1,000 మంది ట్రంప్‌ అభిమానులు లేదా అనుచరులపై పెట్టిన కేసులను తొలగించి, వారిని దేశభక్తులుగా విడుదల చేస్తామని ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు. కృత్రిమ మేథ విస్తరిస్తే మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకోకుండా, బైడెన్‌ విధించిన ఆంక్షలను తాజాగా ట్రంప్‌ తొలగించారు. కీలకమైన అంశాలపై లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలు… ఏవీ లేకుండా వచ్చీరాగానే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడం ఆయన తొందరపాటుకు నిదర్శనం.

ప్రపంచమే అగ్నిగుండం అయిపోతున్నది. కార్చిచ్చులు, మంచు తుఫానులు, అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. భూతాపం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. పారిస్‌ ఒప్పందానికి లోబడి కార్బన్‌ ఉద్గారాల వాడకాన్ని తగ్గించి విద్యుత్తు వాహనాలకు పట్టం కట్టాల్సి ఉంది. అధిక కార్బన్‌ ఉద్గారాలకు కారణమైన అమెరికా లాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ ప్రతికూల మార్పులకు చెక్‌పెట్టడానికి నిర్దిష్ట ప్రణాళికలను అమలు చేయాల్సి ఉన్న తరుణంలో ట్రంప్‌ ప్రభుత్వం పర్యావరణానికి సంబంధించి పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగడం జరిగింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి కూడ అమెరికా ఉపసంహరించుకుంది. ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఉపసంహరించుకుంటూ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు గురవుతున్నది. ఇది విశ్వవేదికలపై సభ్యదేశంగా అమెరికా తన బాధ్యతల నుంచి తప్పుకోవడం తప్ప మరోకటి కాదు. అదుపు తప్పి అదే పనిగా పేలుతున్న తుపాకీలోంచి తూటాలు వెలువడినట్టుగా ఆయన అధ్యక్ష ఫర్మానాలను శరపరంపరగా వెలువరించారు. ఒకటి కాదు, రెండు కాదు 100 ఫర్మానాలు. బరబరా వాటిపై సంతకాలు గెలికేసి, ‘తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి’ అన్నట్టుగా పెన్నులను సభికుల పైకి విసిరేశారు. ఒక్కో ఫర్మానా ఒక్కో సంచలనం. అన్నీ సుదూర పర్యవసానాలు కలిగినవే.

దూకుడుగా విదేశీ విధానం:

తాను గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చూస్తానని, 100 రోజుల్లో యుక్రెయిన్‌-రష్యా యుద్ధ ముగింపుకు ప్రయత్నిస్తానని, గాజాలో శాంతికోసం ప్రయత్నిస్తానని ప్రగల్భాలు పలికాడు ట్రంప్‌. కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరాలని లేకుంటే 25 శాతం పన్నులు విధిస్తానని బెదిరిస్తున్నాడు. పనామా కాలువ తమదేనంటూ కొద్ది రోజులుగా ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోష్‌ రౌల్‌ ములినో తీవ్రంగా ఖండించాడు. చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. పనామా కాలువను ఎట్లాగైనా స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నాడు. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్దమని స్పష్టం చేయడమే. పర్యావరణ విపరిణామాలతో అర్కిటిక్‌ మంచు ఫలకాలు కరుగుతున్నా ఉపేక్షిస్తూ అక్కడున్న గ్రీన్‌ల్యాండ్‌ను నియంత్రణలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన వెనుకా అదే కన్పిస్తుంది. అక్కడున్న అరుదైన లోహాలు, చమురు సంపదపై ధ్యాసతో పాటు సైనిక ప్రయోజనాలే లక్ష్యంగా గ్రీన్‌ల్యాండ్‌ స్వాధీనం కోసం అడుగులు పడుతున్నాయి.

గాజాను ప్రక్షాళన చేస్తా అంటూ విధ్వంసాన్ని ఆపేందుకు బైడెన్‌ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్‌కు భారీగా బాంబులు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. రెండు వేల పౌండ్ల బాంబుల సరఫరాకు ఆమోదతం తెలిపారు. ట్రంప్‌ తాజా నిర్ణయంతో సుమారు 1,800 ఎంకే 84 బాంబులు ఇజ్రాయెల్‌కు చేరుకోనున్నాయి. రష్యా యుక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోతే మరిన్ని ఆంక్షలతో పీల్చి పిప్పిచేస్తానని అధికారంలోకి వచ్చీ రాగానే డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికలకు రష్యా తాపీగా, శాంతంగా ప్రతిస్పందించింది. చర్చలకు తాము సిద్ధమేననీ, కానీ ఆంక్షలకే ట్రంప్‌ అత్యుత్సాహపడుతుంటారని క్రెమ్లిన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించారు. యుక్రెయిన్‌ నాటోతో కలిసి తన నెత్తినెక్కే అవకాశాలు లేనప్పుడే రష్యా దిగివస్తుందని స్పష్టం చేశాడు. ట్రంప్‌ బృందం ప్రతిపాదనలకు యుక్రెయిన్‌ సరేనంటే, అది ఐదోవంతు భూభాగాన్ని రష్యాకు వదులుకోవలసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్‌ విదేశాంగ విధానంలో కొంత గందరగోళం ఉంటుందన్నది విస్పష్టం. ఇందుకు చైనా అధ్యకక్షుడు జీ జిన్‌పింగ్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత దౌత్యంతో ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు కానీ, అమెరికాకు ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనా మెడలు వంచడం అనుకున్నంత సులభమేమీ కాదు.

యూరప్‌ గుండెల్లో ట్రంప్‌ దడ :

దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరానికి వీడియో సెషన్‌ ద్వారా ట్రంప్‌ తమ విధానాలు వివరించాక, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ మరీ బెంబేలు పడుతున్నాయి. ఆర్థికంగా శక్తిమంతమైన యూరప్‌ దేశాలకు ఎందుకీ దడ? యూరప్‌ ఇప్పటికే ఆర్థిక మందగమనంలో ఉంది. ట్రంప్‌ ప్రకటనతో అది దీర్ఘకాలం కొనసాగుతుందని భావిస్తున్నారు. అమెరికా, యూరప్‌ రాజ్యాలతో కూడిన నాటో కూటమి రక్షణ వ్యయంలో అత్యధిక భాగం అమెరికా భరిస్తున్నది. ట్రంప్‌ తమ మొదటిటర్మ్‌లో హెచ్చరిక చేసినా యూరప్‌ దేశాలు తమ రక్షణ వ్యయాన్ని జిడిపిలో 2 శాతానికి పెంపు చేయలేదు. ట్రంప్‌ ఇప్పుడు దాన్ని 5 శాతానికి పెంపును డిమాండ్‌ చేస్తున్నారు. ట్రంప్‌ అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుండే యూరప్‌ అంతటా ఆత్మావలోకనం మొదలైంది. ఆయన అమెరికా ఫస్ట్‌ సిద్ధాంతం, ఇయూ సరుకులపై సుంకాలు పెంచుతానన్న హెచ్చరికలతో అమెరికాతో పెరుగుతున్న ఆర్థిక అగాధాన్ని ఎలా పూడ్చుకోవాలి, అదనపు మిలటరీ వ్యయాన్ని ఎలా భరించాలి అని యూరప్‌ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది. అనేక అమెరికన్‌ కంపెనీలు యూరప్‌లో పరిశ్రమలు పెట్టి, అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ తమ ఉత్పత్తులను అమెరికన్‌ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు ఆ కంపెనీల ఎగుమతిపై సుంకాలు విధిస్తాం అని ట్రంప్‌ దావోస్‌లో హెచ్చరించాడు. అమెరికాకు వచ్చి స్వదేశంలో పరిశ్రమలు పెట్టవలసిందిగా వాటిని కోరాడు.

అమెరికాలో క్విడ్‌ ప్రోకో! :

అమెరికాలో వారం రోజులు తిరగక ముందే క్విడ్‌ ప్రోకో వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం కోసం భారీగా విరాళాలు కురిపించిన వివిధ చమురు కంపెనీల అధినేతలు ఇప్పుడు కీలక పదవులు దక్కించుకుంటున్నాయి. పైగా ఈ కంపెనీలన్నీ కూడా పర్యావరణానికి హాని చేసే కర్బన వ్యర్థాలను వెదజల్లే శిలాజ ఇంధన పరిశ్రమలు కావడం గమనార్హం. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్రమణ కూడా ఈ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకేనన్న విమర్శలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. ప్రపంచమంతా హరిత ఇంధనం కోసం చూస్తుంటే ఆర్కిటిక్‌ ప్రాంతంలో కోటీ 60 లక్షలు ఎకరాల్లో చమురు తవ్వకాలపై నిషేధాన్ని ఎత్తేశాడు. చమురు, గ్యాస్‌, బొగ్గు పరిశ్రమలకు చెందిన వారిలో కొంతమందిని పర్యావరణం, ఇంధనం, ప్రభుత్వ భూముల పర్యవేక్షణలకు సంబంధించిన కీలక పదవుల్లో ట్రంప్‌ నియమించారు. వాతావరణ మార్పులపై పోరాటాలను, ప్రచారాలను వ్యతిరేకించే మాజీ రిపబ్లికన్‌ లీ జెల్దిన్‌కు పర్యావరణ పరిరక్షణ సంస్థను నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పారు. ట్రంప్‌ ఇప్పటికే ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ను విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. పర్యావరణ నిబంధనలను బలహీనపరుస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను రద్దు చేస్తున్నారు. కొత్త పవన విద్యుత్‌ ప్రాజెక్టులను నిలుపు చేస్తున్నారు. చమురు పరిశ్రమ పెద్దలు వ్యతిరేకించిన చర్యలన్నింటినీ ఇప్పుడు ఎత్తివేస్తున్నారు.

బ్రిక్స్‌ దేశాలపై అధిక సుంకాలు :

అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించే ఎవరిపైనైనా అధిక సుంకాలు విధిస్తానని అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించారు. ”విదేశాలను సుసంపన్నం చేసేందుకు మన పౌరులపై పన్నులు విధించే బదులు మన ప్రజలను సుసంపన్నులు చేసేందుకు విదేశాలపై పన్నులు విధించాలి” అని ట్రంప్‌ పేర్కొన్నారు. ”ట్రంప్‌ ఆర్థిక నమూనా ప్రకారం, ఇతర దేశాలపై విధించే సుంకాలు పెరగాలి. అమెరికన్‌ కార్మికులపై, వ్యాపారులపై విధించే పన్నులు తగ్గాలి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు స్వదేశానికి రావాలి” అని ట్రంప్‌ పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాలపై వంద శాతం టారిఫ్‌లు విధించాలని ట్రంప్‌ గతంలో వ్యాఖ్యానించారు. టారిఫ్‌లను నివారించాలని భావించినట్లైతే అమెరికాకు వచ్చి తయారీ యూనిట్లు పెట్టాల్సిందిగా ట్రంప్‌ కంపెనీలను కోరారు. ”పన్నులు లేదా టారిఫ్‌లు చెల్లించరాదని మీరు భావించినట్లైతే, అమెరికాలో మీరు ప్లాంట్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్లీ మన దేశానికి ఉత్పత్తిని తీసుకురావాల్సి ఉంద”న్నారు.

“గతంలో అమెరికా రోజుకు ఒక ఓడ తయారుచేసిన రోజులు ఉన్నాయి, కానీ ఈనాడు మనం ఓడను నిర్మించలేకపోతున్నాం, ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. అన్నీ ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లిపోయాయ”ని ట్రంప్‌ అన్నారు. అమెరికన్‌ కుబేరులపై ఆస్తి పన్ను రద్దు చేసే అంశాన్ని ట్రంప్‌ పరిశీలిస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్‌ విధానం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లుటిఒ) ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉంది. అందువల్లనే వాణిజ్య యుద్ధాల వల్ల అంతర్జాతీయ అభివృద్ధికి తీవ్రమైన పర్యవసానాలు కలుగుతాయని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ నాగొజి ఇవేలా ఒకోంజో హెచ్చరించారు. అమెరికా వాణిజ్య విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా అన్నారు.

వలసదారులపై ఉక్కుపాదం :

అందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెదొక దారి అన్నట్టుగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు. రెండవసారి అధ్యక్ష పీఠాన్నధిష్టించిన ట్రంప్‌ మొదటి వారం రోజుల్లోనే పచ్చిగా తన మితవాద అజెండాను ముందుకు తెచ్చాడు. అందులో ముఖ్యమైనది వలసదారులను దేశం నుంచి అవమానకరమైన రీతిలో పంపించేయడం. దూకుడుతనానికీ, దుందుడుకు స్వభావానికి డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టింది పేరు. అలా ఉండటమే తనకు రెండోసారి అధ్యక్ష పదవిని కట్టబెట్టిందని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తారు కూడా. అమెరికా పూర్వవైభవ పునరుద్దరణ నినాదంతో గెలిచిన ట్రంప్‌ శరణార్థులను ప్రత్యేకించి లక్ష్యంగా చేసుకుంటారనే అనుమానాలు నిజమయ్యాయి. మెక్సికో సరిహద్దులకు సైన్యాన్ని తరలించి మరీ కట్టుదిట్టం చేశారు. ఇంతకాలం అమెరికా ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన వలసదారులను వెలివేయాలని చూడడం తెలివితక్కువతనం అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? అతి తక్కువ జీతాలతో రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసిన వలసదారులను దేశం పైకి దండెత్తిన ఆక్రమణదారులుగా చిత్రించడం ట్రంప్‌కే చెల్లింది. అమెరికాలో తిష్టవేసిన ఆక్రమ వలసదారులంటూ కొందరిని గుర్తించి, అమానవీయంగా వారి కాళ్లకు, చేతులకు బేడీలు వేసి, అంతర్జాతీయ నేరస్తుల వలె వారివారి దేశాలకు అమెరికన్‌ మిలటరీ విమానాల్లో తరలించడం లేదా డిపోర్టెషన్‌ కూడా చూస్తున్నాం. డిపోర్టెషన్‌ చేస్తున్న సైనిక విమానాలను అనుమతించేది లేదని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న బ్రెజిల్‌, మెక్సికో, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్‌, ఎల్‌సాల్వడార్‌ లాంటి దేశాలను టారీఫ్‌ ఆంక్షల బెదిరింపులతో లొంగదీసుకోవడం జరుగుతుంది.

రెడ్‌ ఇండియన్లను తరిమేసి యూరప్‌ తదితర దేశాలకు చెందిన శ్వేత జాతీయులు అక్కడ పాగా వేశారు. ఆఫ్రికన్‌ దేశాల నుంచి బానిసలను తీసుకొచ్చి వారితో వెట్టిచాకిరీ చేయించుకున్న చరిత్ర అమెరికాది. అమెరికాలో దాదాపు 35 కోట్ల జనాభాలో మూడు కోట్ల మంది వరకూ వలసదారులే. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ తాత ఫ్రెడరిక్‌ ట్రంప్‌ కూడా బవేరియా, జర్మనీ మూలాలుండి వలస వచ్చిన వాడే. విద్వేష విషం చిమ్మే మితవాదమే అజెండగా కలిగిన రిపబ్లికన్‌ పార్టీ తరపున ఎన్నికైన ట్రంప్‌… మహా కుబేర సామ్రాజ్యాన్ని సృష్టించేందుకు వలసదారుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. వలసదారులను తీవ్ర అభద్రతకు గురిచేసి, తద్వారా మరింత కారుచౌకగా వారి శ్రమను కార్పొరేట్‌ సంస్థలు దోచుకోవడం అంతర్లీనంగా ఉన్న పన్నాగం. అక్కడి కార్మిక, ఉద్యోగ సంఘాలు సైతం ట్రంప్‌ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అమెరికా ప్రపంచ పోలీస్‌ పెత్తనాన్ని సహించేది లేదని మెక్సికో, కెనడా, బ్రెజిల్‌ ఇప్పటికే స్పష్టం చేశాయి.

భారత్‌కు ట్రంప్‌తో చిక్కులు తప్పవు:

ట్రంప్‌ ఎన్నిక కాగానే చైనాతో పాటు భారత్‌ నుండి వచ్చే వస్తువులపై సుంకాలను పెంచుతానని చెప్పడం, బ్రిక్స్‌ దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని ప్రోత్సహిస్తే ఆయా దేశాల సంగతి చూస్తానని బెదిరించడం వంటి చర్యలు సహజంగానే భారత్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతూ వస్తోంది. ఈ విషయంలో సరికొత్త సమస్యలు ఎదుర్కోవడం భారత్‌కు పరీక్షాకాలమే. ఈ పరిస్థితుల్లో మన దేశానికి ఒనగూడే ప్రయోజనాలు, నష్టాలపై విస్తృతంగా సాగుతున్న చర్చకు ట్రంప్‌ 2.0లో అనుసరించబోయే విధానాలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల విషయానికొస్తే మోడీ-జో బైడెన్‌ హయాంలో ఇరుదేశాల మధ్య బంధం మున్నెన్నడూ లేనంతగా బలోపేతమైంది. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడన్న నానుడిని నిజం చేస్తూ ఇరు దేశాలకూ సవాలుగా మారిన చైనా.. ఈ రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు బలపడటానికి కారణమైంది.

ట్రంప్‌ విదేశాంగ విధానంలో కొంత గందరగోళం ఉంటుందన్నది విస్పష్టం. ఇందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత దౌత్యంతో ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు కానీ, అమెరికాకు ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనా మెడలు వంచడం అనుకున్నంత సులభమేమీ కాదు. మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ అని లెక్చర్లిచ్చే మోడీ ప్రభుత్వం అమెరికా పట్ల లొంగుబాటు వైఖరిని విడనాడి స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించాలి. వలసదారుల విషయంలో అంతర్జాతీయ చట్టాలు, న్యాయ నియమాలను అమెరికా గౌరవించేలా ఒత్తిడి తీసుకురావాలి.

ఉద్యోగులపై ట్రంప్‌ కత్తి :

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్‌ సర్కారు బైఅవుట్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఒక ఈమెయిల్‌ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్చందంగా ఉద్యోగాలు వదులుకుంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని దానిలో వెల్లడించారు. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్‌ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓవైపు ఫెడరల్‌ నిధులు, రుణాలు నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు, నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలపై దీని ప్రభావం ఉండనుంది.

ట్రంప్‌ దూకుడు.. తెంపరితనం :

ఇండియా సహా బ్రిక్స్‌ దేశాలు డాలర్‌ను పక్కన పెట్టే ఆలోచనను ఆచరణలో పెడితే వంద శాతం టారిఫ్‌ పెంచుతాననేది మరో దుందుడుకు నిర్ణయం. వీటన్నిటి వల్ల భారత స్టాక్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడి ఒక్కరోజే లక్షల కోట్ల సంపద ఆవిరి కావడం గమనార్హం. అమెరికన్‌ డాలర్‌ను అంతర్జాతీయ ద్రవ్యంగా గుర్తించకపోతే లేదా అలాంటి ఆలోచనలు చేస్తే ఆ దేశాల అంతుచూస్తానని ట్రంప్‌ ఆవేశపడుతున్నాడు. మేం ఏంచేసినా ప్రపంచదేశాలు తలవంచుకొని వినాల్సిందే అంటూ ప్రత్యక్షంగానే హెచ్చరిస్తున్నాడు. ట్రంప్‌ తీసుకున్న తీవ్ర నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా, యూరోపియన్‌ యూనియన్‌ ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులను తప్పు బట్టాయి. అవి రక్షణవాద వాణిజ్య విధానాల కిందకు వస్తాయని విమర్శించాయి. అమెరికా పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగానే అంతిమంగా ట్రంప్‌ వ్యవహరిస్తాడు.

ముగింపు :

ట్రంప్‌ ఆర్థిక, సామాజిక రంగాలలో తీసుకుంటున్న చర్యలు ఇంటా బయట అనేక సమస్యలు సృష్టించగలదు. ఆయన అనాలోచిత చర్యలు దారుణ పరిస్థితులకు దారితీయక తప్పదు. ఆయన రాగల రోజులలో ఏమి చేయవచ్చునన్నది అట్లుంచి ఈ తొలి పది రోజులలో ఇచ్చిన ఉత్తర్వులను, చేసిన ప్రకటనలను గమనించినప్పుడు వాటిలో కొన్ని ‘మాగా’ లక్ష్యాలకు ఉపయోగపడుతూనే హాని చేసేవి కూడా ఉన్నాయి. మరికొన్ని పూర్తిగా హాని చేసేవి ఉన్నాయి. నెరవేర్చటం అసాధ్యమయ్యేవి ఉన్నాయి. గమనించదగిన విశేషం ఏమంటే, ట్రంప్‌ తను చెప్పిన దానిని తానే సవరించుకుంటున్న ఉదాహరణలు సైతం ఇవే పది రోజులలో కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘మాగా’ నినాద సారాంశం ఆర్థికంలో ఉంది. అమెరికా ఫస్ట్‌ నినాదంలో ట్రంప్‌ జాతి ఆధిక్యతా-న్యూనతా భావాలను పెంచి పోషిస్తున్నాడు. ఆయన దుందుడుకు చర్యలతో పర్యావరణ పరిరక్షణపై నిబద్ధత పలచబారిపోతుంది. ఇంటాబయటా వైవిధ్యాలను ఆక్షేపించే ఉపద్రవాన్ని తెస్తుంది. అసమానతలపై ఉపేక్షతను ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ సంస్థల మనుగడకు ప్రమాదం వస్తుంది. శరణార్థులకు చోటు కరువవుతుంది. భిన్న లైంగిక ప్రవర్తన బలిపీఠం ఎక్కుతుంది. అబార్షన్‌ హక్కుకు విఘాతం కలుగుతుంది. జాతీయవాదానికి స్వార్థమే పరమార్థమవుతుంది. చివరకు ఉదార ప్రజాస్వామ్యమే కుదేలవుతుంది! ట్రంప్‌ దూకుడుకు ఎప్పటికప్పుడు పగ్గాలు చేయాల్సింది అమెరికా చట్ట సభలే.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply