ఆర్తి కథలు

సహచరులు ఇక్బాల్ కథల పుస్తకం ‘నల్ల రేగళ్ళు’ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రామిక జనుల ఆరాట పోరాటాలకు సంబంధించినది. ఇందులోని పది కథలు ప్రథమపురుషలో రచయితే తన లోతైన గాఢమైన, మమేకత్వంతో ఆర్తితో రాసిన కథలు.
ఒక కథ ప్రఖ్యాత ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో కథను ఇంగ్లీషు నుండి తెలుగులో అనువాదం చేశారు. మÖడు కథలు ముస్లిం గ్రామీణ జీవన నేపథ్యంలో, మరో నాలుగు కథలు విధ్వంసమౌతున్న గ్రామీణ జీవితంలోనుండి పట్టణాలకు వలసపోవడం; ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలను గ్రామీణ ప్రాంతపు పంట పొలాల్లో దుర్మార్గంగా, మాయోపాయాలతో ఏర్పాటు చేయడం వలన జరిగే విధ్వంస, విస్తాపనల గురించిన కథలు. ఒక కథ సేవక వృత్తికి సంబంధించినది- మరోకథ గ్రామీణ ప్రాంతాలల్లో కరడుగట్టిన భూస్వామ్యం ముందు రాజ్యాంగం, కోర్టులు, చట్టాలు ఏమీ చేయజాలవని ప్రజలు తమ మీద జరిగిన పీడన, హింసల ద్వారా గ్రహించిన సత్యం కథ. మరో కథ చదువువలన పరాయీకరణ చెంది మధ్యతరగతిగా మారిన ‘క్లాస్‌మేట్స’ కథ. అనువాద కథ పాకిస్థాన్, భారత్ క్రూరమైన విభజన నేపథ్యంలో అతలా కుతలమైన ముస్లిం యువతి జీవిత కథ.

మొత్తంగా అతిపురాతన బ్రాహ్మణీయ భూస్వామిక భారతీయ సమాజం- తొలుత వలస, అర్ధవలస అర్ధభూస్వామిక సమాజంగా మారినా కూడా- భూస్వామిక హింసాత్మాక ఉత్పత్తి విధానం, ఉత్పత్తి సంబంధాలు విధ్వంసకరంగా మారి మరింత దోపిడి పీడనకు ప్రజలను గురించేశాయి. ఉత్పత్తి శక్తులు తమకు అవరోధంగా మారిన ఉత్పత్తి సంబంధాల సంకెళ్ళను బద్దలు కొట్టే ప్రజా పోరాటాలు సుదీర్ఘకాలంగా విముక్తి దిశగా జయాపజయాల మధ్య పురోగమిస్తున్నాయి. అలాంటి పోరాటాలల్లో తమ వంతు కర్తవ్యంగా అధ్యయనం, అర్థం చేసుకోవడం, తమ స్థల కాలాల నేపథ్యంలో ప్రజాపోరాటాలల్లో భాగంకావడం 1970నుండి విప్లవ రచయితల సంఘం చేస్తున్నది. సమాజాన్ని గతితార్కికంగా, చారిత్రికంగా, శాస్త్రీయంగా అర్థం చేసుకునే మార్క్సిజం – లెనినిజం – మావోయిజం ప్రాపంచిక దృక్పథం కల్గిన రచయితల సంఘం విరసం. ఇక్బాల్ విరసం సభ్యులుగా అలాంటి ప్రాపంచిక దృక్పథంతో తన అనుభవనేపథ్యంతో – తనచుట్టూ ఉన్న సామాజిక జీవితాన్ని తను అర్థం చేసుకున్న, తాను అందులో భాగమై చిత్రించిన ఈ పది కథలు చదవడం ; అనేక పోరాటాలకు ఊపిరులూదిన మహబూబ్ నగర్ జీవితాన్ని అవగాహన చేసుకోవడమే. ఈ పది కథలలో చిత్రించిన జీవితం గురించి రేఖామాత్రంగా చెప్పుకోవాలంటే…
నలుభై కుటుంబాలు – పూరిగుడిసెలు లేని మిద్దెలు, బంగళాలు గల ఊరు, వ్యాపార వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, అధిక దిగుబడులు సాధించిన ఊరు – అదే ఊరిలో కొందరు బతుకులేక పొట్టసేతబట్టుకొని బొంబాయి, పునా, బెంగుళూరు వెళ్లి మాయదారి రోగాలతో ఊరు చేరిన దీన జనాలు – ఇలాంటి ఊరిలో బడిపంతులుగా చేరిన ఇక్బాల్ జీవితంలో మర్చిపోని వెంటాడే పసి బాలుడు నర్సిం మనలను వెంటడుతాడు. నర్సిం తల్లికి ఏడ్సు వ్యాదున్నదనే అపోహతో నర్సింను వెలివేసిన గ్రామం. అనాధలుగా ఊరు విడిసి వెళ్ళిపోయిన తల్లీ కొడుకు. భారత దేశ అర్ధ వలస అర్ధ భూస్వామిక విధ్వంసకర హింసాత్మాక అభివృద్ధి నమÖనా ఈ కథ.
అలాంటి విస్తాపనకు సబంధించిన మరో కథ ఉరిడిసి బతుక పోయిన మేషన్ జానీ కథ – బొంబాయిలో ఆ మహానగర సౌందర్యాన్ని తీర్చిదిద్దే నిర్మాణ పనుల్లో కనుమరుగై కరోనా బారిన పడి శవంగా సైతం దక్కని అనాధగా చనిపోయిన విషాద కథ. కరోనాకు కారణభూతమైనదని న్యూయార్కు టైమ్స్ కథనాలలో అభియోగాలు ఎదుర్కున్న ‘బ్లాక్ స్టోన’ అమెరికా కంపెనీ ప్రపంచ వ్యాపితంగా లక్షలాది మరణాలనుండి 13.5 ట్రిలియన్ల సంపద కెదిగింది.

ప్రపంచీకరణ నేపథ్యంలో రసాయన విషపదార్థాల ఉత్పత్తి సామ్రాజ్యవాద దేశాలు అర్ధవలస అర్ధభూస్వామ్య దేశాలకు మార్చాయి. గ్రామాలల్లో పంట భూములను బలవంతంగా గుంజుకొని ఇథనాల్ ఫ్యాక్టరీలు మహబూబ్ నగర్ జిల్లాలో నెలకొల్పడం – రైతులు తమ పంట భూముల విస్తాపనకు వ్యతిరేకంగా ఉద్యమాలు – అలాంటి ఉద్యమాలల్లో పాలమూరు అధ్యయన వేదిక తరఫున తన సహచరులతో కలిసి ఇక్బాల్ పాల్గొనడం చిత్రించిన కథలు రెండు. ‘గెలిసి తీరుతం’, ‘చలనం మొదలయ్యింది’. ఈ కథల్లో పర్యావరణ అవగాహనతో విషరసాయనాల పర్యవసానాలు – దానివెనుక ఉన్న దళారీ పెట్టుబడిదారులు – వారికి అండగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం, యంత్రాంగం, చట్టాలు చిత్రించారు.

ఉపాధ్యాయుడిగా – ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్లోనూ, ఆతరువాత ఏర్పడిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లోనూ నాయకుడుగా పనిచేసిన ఇక్బాల్, ఆ తరువాత కూడా ప్రజాస్వామిక ఉద్యమాలల్లో లాయర్‌గా పని చేయడానికి పదవీవిరమణ తరువాత ఎల్ ఎల్ బి చదివి ప్రాక్టీసు మొదలు పెట్టారు.ఈ అనుభవంతో రాజ్యాంగం, చట్టాలు, కోర్టులు పని చేసే తీరు – కరడుగట్టిన భూస్వామిక ఉత్పత్తి సంబంధాలుగల గ్రామీణ సమాజంలో పాతుకుపోయిన భూస్వామిక హింస గురించిన కథే ‘ీVAషియార’- తన భర్తను భూస్వామి గుండాలు చంపినా కూడా – తను అదే భూస్వామ్య వ్యవస్థలో బతకాలి కనుక ఒక నిరుపేదరాలు కోర్టులో తన భర్తను ఎవరూ ‘చంపలేదని’ చెబుతుంది. ఆపేదరాలు గుండెల్లో ఎన్ని దుఃఖావేషాలు గడ్డకట్టుకు పోయాయో ఈ కథ చెబుతుంది. స్వంతాస్తిని రద్దుచేయని, భూస్వామ్యాన్ని రద్దుచెయ్యని రాజ్యాంగ చట్టాలు పేదవాళ్లకు సమాన హక్కులు ఇచ్చినట్లు ప్రకటించినా దాన్ని అందుకోజాలరని ఈ కథ నిరూపిస్తుంది.
అట్లాగే పేదవాడి అప్పులగురించి అర్థం చేసుకున్న జడ్జి కథ ‘నిరీక్షణ’.

చదువు తమని ప్రభుత్వ యంత్రాంగం….ఎట్లా మలిచిందో…. తాము ప్రజలకు, రాజ్యానికి మధ్య వర్తులుగా మారిపోయి – రాజ్యం చేసే దోపిడి, పీడనల్లో ఎట్లా భాగస్వాములైపోయారో – ఏ విధంగా పరాయీకరణ చెందారో ‘స్పర్శ’ కథలో పాత ఇంటర్ విద్యార్థుల సమావేశం సందర్భంగా చిత్రించారు.
‘జాఫర్ సాబ’ కథ ఇంట్లో దీపం పొరపాటున కిందపడి అంటుకున్న మంటల్లో కాలి చనిపోయాడని చిత్రింపబడ్డ ఆత్మీయుడిని ఆర్థంగా, దుఃఖంగా తలుచుకోవడం కథ – గ్రామంలో హిందూ ముస్లిం విభేదాలు లేకుండా పేద వాళ్ళు తమ సుఖ దుఃఖాలల్లో ఎట్లా కలిసి బతుకుతారో చెప్పే కథ ‘జిందే రిష్తే’.
మంగలి వారి వృత్తిలోని శ్రమ, ఒకప్పటి వృత్తిపని వాళ్ళ పనిని కార్పొరేటు శక్తులు ఎట్లా కబలిస్తున్నాయో చిత్రించిన కథ ‘రిషీ సెలూన’.
అత్యంత దుర్మార్గమైన, విశాదభరితమైన ఇండియా పాకిస్తాన్ విభజన వలసాధిపతులైన బ్రిటన్ – భారతదేశంలోని బ్రాహ్మణీయ దళారీ బుర్జువా వర్గం చేసిన కుట్ర. ఈ విశాదం మీద అనేక కథలు రాసిన సాదత్ హసన్ మంటో కథ ‘ఢిల్లీ అమ్మాయి’ తప్పక చదువతగిన కథ.

ఇక్బాల్ ఇప్పుడు పామూరు అధ్యయన వేదిక కన్వీనర్‌గా ఉన్నారు. విరసం, ప్రజాతంత్ర ఉపాధ్యాయ సంఘాల సభ్యుడిగా, నాయకుడిగా సమాజ చలనం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ తనవంతు కర్తవ్యంగా ప్రజా ఉద్యమాలాల్లో చురుకైన కార్యకర్తగా ఎన్నో కథలు రాయగలిగిన అనుభవం ఆచరణ కల్గినవారు. 2011లో ‘కఫన’ పేరిట మొదటి కథా సంపుటిగా ఏడు కథలతో పుస్తకాన్ని ప్రచురించారు.తాను రచనకన్నా ఆచరణకే ప్రాముఖ్యం ఇవ్వడంవల్లనో మరెందుచేతనో పదంటే పదే కథలు అత్యంత ఆర్తితో మమేకత్వంతో రాశారు.

ఇది కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజల జీవిత కడగళ్ళు ప్రతిబింబించే ఇక్బాల్ రెండవ కథా సంపుటి ‘నల్లరేగళ్ళు’. “కమ్యూనిస్టుకు ఏం కావాలి? ద్రవించగల్గిన హృదయం ఉండాలి. ఎన్ని కన్నీళ్లు వచ్చినా ఈ దరిద్రం పోదు. విప్లవం చేయాలి. కనుక తాత్కాలికంగా నైనా నీహృదయం రాయి చేసుకోవాలి. ఇది తాత్కాలిక విషయం. తాత్కాలికంగా అవసరం కోసం ఏర్పడింది. నీహృదయం శాశ్వతంగా ద్రవించేటటువంటిది. కష్టాలు చూసి బాధపడేటటువంటిది. కష్టాలమీద కోపం వచ్చేటటువంటిది.. అని కనుక మర్చిపోతే మనం కమÖ్యనిస్టులం కాలేము. కమÖ్యనిజాన్ని రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి. గతితార్కిక దృష్టి అంటే అదే – అది అక్కర లేదు. అది వుంటే ఇది అక్కరలేదని కాదు” అంటారు కొండపల్లి సీతారామయ్య గారు ‘కమÖ్యనిస్టు ఉద్యమ చరిత్ర’ అనే పుస్తకంలో –
అందరు – ముఖ్యంగా ఈ నాటి యువకులు తప్పక చదువ వల్సిన పుస్తకం.
ఇలాంటి మంచి కథలను ప్రచురిస్తున్న పాలమూరు అధ్యయన వేదికకు అభినందనలు.

  • 22-11-2025

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply