ఆక్సిజన్

రుతువుల గుండెల్లోని ఇంద్రధనువుల్ని
చేజేతులా ఖననం చేసుకోవాలని
భూమి ఏ వరాన్నీ కోరుకోలేదు
స్వప్న ప్రవాహమ్మీద లంగరెత్తిన తెరచాపల్ని
సుడిలోకి లాక్కుపోతున్న నదీ లేదు

ముందే చెబుతున్నాను
దయచేసి వీళ్ళనెవర్నీ శవాలనవద్దు
ఆక్సీమీటర్లో ఇరుక్కుపోయిన వేళ్ళు
పచ్చిక మైదానాలు
ఊపిరితిత్తులు, వేచి చూసిన పక్షి గూళ్ళు

ఇష్టంగా ముట్టుకోలేకపోయినందుకిన్నాళ్ళూ
మనిషి మృదుత్వాన్ని మరచిపోయాడు
కాదనను; కానీ ఈ మృత్యు నిశ్శబ్దం,
గొంతు నరంలోంచి మెలితిరిగిన రాగం కానే కాదు
తెరిపిలేని వాన నిబ్బరిస్తుంది
మూసిన కనురెప్పలపై, నీలం మెడ నెమలి
జీవితేచ్ఛని పురివిప్పుకుంటుంది
దయచేసి వీళ్ళనెవర్నీ యుద్ధంలో ఓడిపోయారనవద్దు

సూది మొనలు దిగిన రక్తనాళాలు
ధ్రువాల్లో గడ్డకట్టిన మంచు సముద్రాలు
గొట్టాలు తొలిచిన ముక్కు రంధ్రాలు
ఒయాసిస్సుల్తో తడిచిన ఇసుక ఎడార్లు

నచ్చిన చోటుకి కాలు కదపలేకపోయినందుకిన్నాళ్ళూ
గాయపడ్డ హృదయం స్పందించడం లేదు
కాదనను; కానీ మేకతోలు కప్పుకున్న వెంటిలేటర్ పై
ప్రాణవాయువుకల్లాడిన
నా దేశపు నాడీ మండలం ఉంది
దయచేసి వీళ్ళనెవర్నీ; మనల్నొదిలి వెళ్ళిపోయారనవద్దు
విషాదాన్ని జోలపాడి, బజ్జోపెడుతున్న వాళ్ళందరూ
చందమామ యదపైని చెవుల పిల్లులు

ఇన్నేసి కన్నీళ్ళు రాలినప్పుడల్లా
ఆశల నివురుకి మళ్ళీ నిప్పంటుకుంటోంది
వెచ్చటి బూడిద రాశుల్లోంచి; జ్ఞాపకాల పూలతోట
వాడిపోని కాంతి రేఖై మెరుస్తూనే ఉంది

ఇరు సంధ్యల మధ్య, హత్యచేసిన చేతులెత్తి
శ్రద్దాంజలి ఘటిస్తున్నానని బొంక వద్దు
నీది కపట ప్రేమ, వీళ్ళు మాత్రం కారణ జన్ములు.

పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో 'కవితా ఓ కవితా' శీర్షిక నిర్వహిస్తున్నారు. 'అద్వంద్వం' తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

17 thoughts on “ఆక్సిజన్

  1. దయచేసి వీళ్ళనెవర్నీ శవాలనవద్దు—– nice line

  2. కవి చూపు మృత్యువు ను సైతం మృదువుగా చేస్తుంది.కుడోస్ శ్రీ రాం గారు

  3. నిజమే వీళ్ళని శవాలని అనలేం దేశం చూపించిన అశ్రద్ధకు బలైన వాళ్ళు. దేశం హత్య చేసింది.కానీనోరెత్తలేని తనం https://fb.watch/6tkKYjoV64/ శ్రీరాం గారు.

  4. చాలా బావుంది శ్రీరాం గారు

  5. బాబోయ్, వెంట్రుకలు నిక్కబోడుచుకొన్నాయి

Leave a Reply