అర్రొకటి కావాలి

ఆకాశంలో సగానికి బహిర్భూములు రాసిచ్చిన దేశంలో
ప్రకృతి పిలుపులు ఇక్కడి అమ్మలకు మృత్యు తలుపులు
శునకాలు సూకరాలతో పంచుకునే క్షేత్రపాలికలు
మసక చీకట్లల్ల క్రిమికీటకాలతో నిత్యం పోరాడే వీరయోధులు
హద్దులెరగని దేహస్రావాల యుద్ధవీరులు వీరు
ఉన్మత్త ప్రేమికునిలా ఉరికిచ్చే కడుపు
దేశ సరిహద్దులో శత్రు సైనికుల్లా నిఘాపెట్టే జనం
ఎక్కడా సుఖంగా కూసోను తావు లేనితనం
గొంతు తడప వీలు లేని బళ్ళలో
తడి కడుక్కోను దాపులేని సవాళ్ళు
నీరులేని మరుగు గదులు
సకల రోగాల సంతలు

ఆరడుగుల నేల అవసరం చచ్చిన తరువాత
బతకుండగా రెండడుగుల మరుగు కావాలె
అప్రకటిత యుద్ధాల పొత్తికడుపు
నెలనెలకూ ఉరిమిపడే చక్రవడ్డీ వంటి మైల
ఆకురాలే కాలంలో ముట్లుడిగినా
ముదిమి మీదికొచ్చేకొద్దీ- కళ్ళు కీళ్ళు కాళ్ళతోపాటు మాటినని నీరుడు సంచి
నీళ్ళెలిసే కొత్తకుండ – చీలికపడ్డ పాత పఠవ

భావప్రకటనా స్వేచ్ఛంటూ గోల పెట్టేవాళ్ళకు
మూత్రప్రకటన స్వేచ్ఛలేని వాళ్ళ గోడు పట్టదు ఎందుకు

అసమర్థ మంత్రులున్న అసెంబ్లీ వంటి తనువు
చర్చల్లేకుండా బహిష్కరించి బయటికి వచ్చినట్టు
అనుమతి లేకుండా స్రవించే సకల ధారాలు
ఆక్రమణల అత్యాచారాల పర్వాలకు
పగిలిన టమాటా రసాలు చితికిన కోడిగుడ్డు సొనలు

విసర్జనకు కూడా లింగ వివక్షున్న చోట
చీకటి కోసం ఎదురు చూసే గుడ్లగూబలు
జాలారుకు వేళ్ళాడే గబ్బిలాలు వాళ్ళు
చెట్లు పుట్టలు ఒర్రెలు వంకలు వెతుక్కుంటూ
ఉగ్గపట్టిన ఉపద్రవాల నీరుడాపలేని నిస్సహాయులు

అతిపెద్ద పటేల్ బొమ్మ వందడుగుల విగ్రహాలు అవసరం లేని వాళ్ళకు
ప్రతిఇంట ప్రతి కూడలిలో వాటా కావాలి
మరుగు అర్ర కావాలె ఒక అర్ర కావాలె

జననం: ఖమ్మం జిల్లా, గార్ల మండలం పెద్ద కిష్టాపురం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. కవయిత్రి. రచనలు: కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం), సుదీర్ఘ హత్య-2009(కవిత్వం), ఆత్మాన్వేషణ -2011(కథలు), అగ్ని లిపి-2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం), జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు), సంపాదకత్వం: పరివ్యాప్త-2007(స్త్రీవాద కవిత్వం), రుంజ - 2013(విశ్వకర్మ కవుల కవిత్వం), ఖమ్మం కథలు - 2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు), అక్షర పుష్పాలు-భావ సౌరభాలు - 2016 (ఖమ్మం బాల కవుల రచనల సంకలనం), ఓరు - 2017(జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన). పనిచేసిన సాహితీ సంస్థలు: 'మట్టిపూలు', 'రుంజ', 'అఖిల భారత రచయిత్రుల సంఘం', 'దబరకం', 'తెలంగాణ విద్యావంతుల వేదిక'. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు చేస్తున్నారు.

Leave a Reply