‘ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి చిరునామా మేమే’ అని ప్రగల్భాలు పలికే అమెరికా చరిత్రంతా రక్తసిక్తమే. అది రూపంలో ఎట్లా కనిపించినా, సామ్రాజ్యవాదం దాని ఆత్మ. స్వేచ్ఛ, భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ దాని నాటకరంగ సాధనాలు. దాని రాజకీయ, ఆర్థిక దాహాన్ని తీర్చుకోవడానికి ప్రపంచంలో ఏ మూలకైనా పోతుంది. ఎంత నెత్తురైనా తాగుతుంది. ఒక్కోసారి ఒక్కో ముసుగులో పోతుంది. కానీ, ఈసారి చాలా నగ్నంగా ప్రపంచ వీధుల్లో కలియ తిరుగుతున్నది. నిజానికి ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాతే అమెరికా అసలు రూపం, సారం ప్రపంచానికి ఇంకా బాగా అర్థమవుతున్నాయి. ట్రంప్ తనకు తాను ఒక రాజుననే అనుకుంటున్నాడు. తాను ఏదైనా చేయగలనని చెబుతున్నాడు. ట్రంప్ ను చూస్తుంటే హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ రాసిన “The Emperor’s New Clothes” అనే కథలోని రాజు గుర్తుకు వస్తున్నాడు.
ఆ కథలో తనను తాను చూసుకుని మురిసిపోయే ఒక గర్విష్టి రాజుకు ఇద్దరు నేతగాళ్ళ రూపంలో వచ్చిన మోసగాళ్లు తాము రాజుకు అద్భుతమైన బట్టలు నేసి, కుట్టి ఇస్తామని నమ్మబలికారు. ఆ బట్టల ప్రత్యేకత ఏమంటే… అవి మూర్ఖులకు, అసమర్థులకు కనబడవు. కేవలం బుద్ధిమంతులకు, మేధావులకు మాత్రమే కనబడుతాయని చెబుతారు. దానికి ఆశ్చ్యర్యపడిన రాజు వాళ్ళకు కావాల్సిన రంగులు, ఆ బట్టల్లో జతచేయడానికి కావాల్సిన బంగారం ఇచ్చాడు. వాటిని తమ సంచుల్లో నింపుకున్న ఆ నేతగాళ్ళు బట్టలు తయారుచేసినట్లు నటించారు. బట్టలు నేయడం, కుట్టడం పూర్తయిందని రాజుకు చెప్పడంతో ఆయన ఒకరోజు వాటిని వేసుకొని నగర వీధుల్లో ఊరేగింపుగా పోవాలనుకున్నాడు. నేతన్నలు రాజును తాను అప్పటికే వేసుకున్న బట్టలు తీసివేస్తే తాము కుట్టిన బట్టలు తొడుగుతామని చెప్పారు. ఇక రాజు వాళ్ళముందు నగ్నంగా నిలబడ్డాడు. వాళ్ళు తాము కుట్టిన ఉత్తుత్తి బట్టల్ని రాజుకు తొడిగినట్లు చేశారు. రాజు చుట్టూ ఉన్న మంత్రులకు, పరివారానికి రాజు నగ్నత్వం కనబడుతున్నా ఎవ్వరూ చెప్పే ధైర్యం చేయలేదు. ఎందుకంటే, తమకు బట్టలు కనబడటం లేదని చెప్తే తాము మూర్ఖులమని, అసమర్థులమని ప్రపంచానికి తెలిసిపోతుందనే భయం. ఇక రాజు ఊరేగింపుగా బయలుదేరాడు. రాజు “అద్భుతమైన” బట్టల గురించి తెలుసుకున్న ప్రజలు కూడా “ఆహా…., ఓహో….” అంటూ లేని బట్టలను పొగిడారు. అలా నడి వీధుల్లో సాగుతున్న నగ్న ప్రదర్శనను చూసిన ఒక పిలగాడు ధైర్యంగా, ‘‘రాజుకు బట్టలు లేవు” (The emperor has no clothes) అని గట్టిగా అన్నాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఆడుతున్న నాటకం బయటపడింది. తామెంత అబద్దాలకోరులో, భయస్తులో వాళ్ళకు అర్థమయింది.

అమెరికన్ సామ్రాజ్యవాదం కూడా తన ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధత, నైతికత, సామర్థ్యం గురించి చేసే ప్రకటనలు ఎంత గంభీరంగా ఉన్నా, లోపల ఉన్నదంతా డొల్లనే. కానీ, దోపిడీ వర్గాలు, అది పెంచి పోషించే మీడియా, మేధావి వర్గం మాత్రం అవి నిజమని నటిస్తూ, ప్రపంచాన్ని నమ్మబలుకుతాయి. కానీ, చివరికి ఒక వియత్నాం, ఒక క్యూబా, ఒక ఇరాన్ సామ్రాజ్యవాద నగ్నత్వాన్ని బయటపెడుతాయి. నిజానికి, ఇప్పుడు అమెరికన్ ప్రజలే “నువ్వు రాజువు కాదు”, “నీ నగ్న ప్రదర్శన ఇక ఆపు” అని లక్షల్లో రోడ్ల మీదికి వచ్చి నినదిస్తున్నారు. కానీ, ట్రంప్ అనే వాడు ఒక మూర్ఖ రాజు. ఒక నార్సిసిస్టిక్ సోషియోపాత్ (అతిస్వార్థంతో తనను మాత్రమే గొప్పగా భావిస్తూ ఇతరుల భావాలను పట్టించుకోని వ్యక్తి).
ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని కేవలం ట్రంప్, నెతన్యాహుల వ్యక్తిత్వానికి పరిమితం చేసి చూస్తే మనకు అసలు విషయం పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే, తన ప్రయోజనాల కోసం అమెరికా ఇలాంటి దురాక్రమణ యుద్ధాలు చరిత్రలో ఎన్నో చేసింది. తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చి తాను చెప్పినట్లు వినే కీలుబొమ్మ ప్రభుత్వాలను నెలకొల్పడం అమెరికా విదేశీ విధానంలో అతి ముఖ్యమైనది. తాను ఏ ప్రభుత్వాన్ని కూల్చినా అక్కడ “కమ్యూనిజం నియంత్రణ,” “జాతీయ భద్రత,” లేదా “ప్రజాస్వామ్య పరిరక్షణ” వంటి అంశాలను ప్రచారం చేసి తన జోక్యానికి సమ్మతిని కూడగట్టుకునే పని చేస్తుంది. ముందు భావజాలంతో దాడి చేస్తుంది. ఆ తర్వాత బాంబు దాడులు చేస్తుంది. ఇది చరిత్ర పొడవునా జరిగింది. వాస్తవానికి రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటగా ఇరాన్ (1953) తోనే ప్రభుత్వాల మార్పు ప్రక్రియ మొదలుబెట్టింది. (ఈ విషయాన్ని తర్వాత లోతుగ పరిశీలిద్దాం). ఆ తర్వాత 1954లో గ్వాటెమాలాలో, 1961లో క్యూబాలో విఫల ప్రయత్నం, 1963లో వియత్నాంలో ప్రయత్నించి ఓడిపోవడం, 1973లో చిలీలో తన లక్షాన్ని సాధించింది. ఈ దేశాలన్నింటిలో సోషలిస్టు దిశలో ప్రయాణించే ప్రభుత్వాలను అణచివేసి పెట్టుబడిదారి వ్యవస్థ ఆధిపత్యాన్ని స్థిరపరచడం కోసమే అమెరికా ప్రయత్నించింది.
ఆఫ్రికా ఖండంలో ఈ జోక్యం ఎక్కువగా పరోక్ష రూపంలో కొనసాగింది. 1960లో కాంగో, 1966లో ఘనా, అంగోలా అంతర్యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంది. ఈ దేశాల్లో నయా-వలస రాజకీయార్థిక నిర్మాణం ద్వారా ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది. ఇక ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం ఈ సామ్రాజ్యవాద జోక్యం మరింత బహిరంగ సైనిక రూపాన్ని దాల్చి, 1989లో పనామా, 2003లో ఇరాక్‌లో ప్రత్యక్ష సైనిక చర్యల ద్వారా ప్రభుత్వాలను తొలగించింది. ఇక 21వ శతాబ్దంలో “మానవతా జోక్యం,” “ఉగ్రవాద వ్యతిరేక పోరాటం” వంటి కొత్త వాక్యరూపాలు ప్రవేశపెట్టింది. 2001లో ఆప్ఘనిస్తాన్ పై ప్రత్యక్ష సైనిక దాడిచేసి, రెండు దశాబ్దాలకు పైగా ఆ దేశాన్ని తన ఆక్రమణలో ఉంచుకుని చివరికి తాలిబాన్లకు అధికారం అప్పజెప్పి, ఓటమి అవమానంతో పారిపోయింది. 2011లో లిబియా, సిరియాలను యుద్ధభూమిగా మార్చేసింది. కొన్ని లక్షల మరణాలకు కారణమయింది.
కేవలం ప్రత్యక్ష, పరోక్ష సైనిక చర్యల మూలంగానే కాదు, అమెరికా తన మాట వినని దేశాలపై విధించే ఆర్థిక ఆంక్షల మూలంగా ఏటా లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ వైద్య పత్రిక The Lancet లో జులై 2025లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం అమెరికా విధించే ఏకపక్ష ఆర్థిక ఆంక్షల మూలంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,64,000 మంది చనిపోతున్నారు. ఇన్ని లక్షల హత్యలకు కారణమైన అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద తీవ్రవాద దేశం కాకపోతే మరేమవుతుంది?
1
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అంతర్జాతీయ రాజకీయ-ఆర్థిక వ్యవస్థలో వేగంగా నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి. యుద్ధం యూరప్ ఆర్థికవ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. వలసవాదంపై ఆధారపడి తన శక్తిని నిలబెట్టుకున్న బ్రిటన్, యుద్ధానంతర పునరుద్ధరణలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పశ్చిమ ఆసియాలోని చమురు వనరులు బ్రిటన్‌కు అత్యంత కీలకమైనవిగా మారాయి. ఆంగ్లో–ఇరానియన్ ఆయిల్ కంపెనీ (AIOC) బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రధాన ఆధారంగా నిలిచింది. AIOC లాభాలు బ్రిటిష్ ఖజానాకు పెద్దమొత్తంలో చేరుతుండగా, ఆ సంపదను సృష్టించిన ఇరాన్ మాత్రం పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలు వంటి రంగాల్లో తీవ్రంగా వెనుకబడిపోయింది.
దీంతోపాటు, యుద్ధానంతర కాలంలో అమెరికా అగ్రశ్రేణి శక్తిగా ఎదగడానికి నిర్ణయాత్మక దిశలో ముందుకు సాగింది. 1944లో ఏర్పాటైన Bretton Woods వ్యవస్థ ద్వారా అమెరికా ఆధిపత్యం గల అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను రూపొందించారు. (Bretton Woods వ్యవస్థ అంటే ప్రపంచ ద్రవ్య వ్యవస్థకు ఏకరీతిని తీసుకురావడానికి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్థిక చట్రం. ఇందులో 44 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు స్థాపనకు రూపకల్పన జరిగింది. ఈ సంస్థలకు సభ్యదేశాలు “quota contributions” ద్వారా నిధులు సమకూరుస్తాయి. కోటా ఎక్కువగా ఉన్న దేశాలకు ఓటింగ్ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా అమెరికా, యూరోపియన్ దేశాలు IMF, ప్రపంచ బ్యాంకులో అతిపెద్ద కోటాలను కలిగి ఉన్నాయి. IMF లో అమెరికా వద్ద సుమారు 17 శాతం ఓటింగ్ శక్తి ఉండటం వల్ల ముఖ్య నిర్ణయాలపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిని కూడా పరంపరగా అమెరికా ప్రతిపాదిస్తుంది. ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు వాషింగ్టన్ D.C.లో ఉన్నాయి).
Bretton Woods వ్యవస్థలో IMFను చెల్లింపుల సమతుల్య సమస్యలను (అంటే ఒక దేశం దిగుమతులు, ఎగుమతులు, విదేశీ అప్పులు, విదేశీ ఆదాయాల మధ్య తాత్కాలిక అసమతుల్యం ఏర్పడి కరెన్సీపై ఒత్తిడి వచ్చినప్పుడు) ఎదుర్కొనే దేశాలకు తాత్కాలిక ఆర్థిక సహాయం అందించే సంస్థగా, అలాగే వరల్డ్ బ్యాంక్‌ను పునర్నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలకు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే సంస్థగా ఏర్పాటు చేశారు.
ఈ వ్యవస్థలో ప్రధాన దేశాల కరెన్సీలు అమెరికా డాలర్‌కు అనుసంధానించబడ్డాయి (అంటే ప్రతి దేశం తన కరెన్సీ విలువను డాలర్‌తో పోల్చి ఒక నిర్ధిష్ట శ్రేణిలో ఉంచాలి. దీనిని fixed exchange rate arrangement అంటారు.) దీని వల్ల అమెరికాకు కలిగిన లాభం ఏమిటంటే: ప్రపంచ వాణిజ్యంలో డాలర్‌కే ఎక్కువ ప్రాధాన్యం రావడం, డాలర్ డిమాండ్ పెరగడం, అమెరికా తక్కువ ఖర్చుతో అప్పు తెచ్చుకోవడం, అలాగే ఇతర దేశాలు డాలర్‌ను నిల్వ కరెన్సీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడటం.
డాలర్‌ను నేరుగా బంగారంగా మార్చే హక్కు కేవలం అమెరికా ప్రభుత్వానికే ఇవ్వబడింది (అమెరికా తీసుకుంది అనడం సరైంది). ఎందుకంటే, అప్పట్లో ప్రపంచ బంగారు నిల్వలలో సుమారు 65–70 శాతం వరకూ అమెరికా వద్ద ఉండేది. దీనివల్ల డాలర్‌ను “as good as gold” అనే స్థాయిలో నమ్మదగిన కరెన్సీగా ప్రపంచానికి చూపించే సామర్థ్యం అమెరికాకే లభించింది. ప్రపంచం డాలర్‌పై ఆధారపడేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇదే సందర్భంలో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ఆర్థిక వ్యవస్థ సాపేక్షికంగా ప్రపంచంలో అత్యంత బలంగా ఉండడంతో, యూరప్, ఆసియా దేశాలు డాలర్‌పై ఆధారపడే స్థితికి చేరుకున్నాయి. దీనితో అంతర్జాతీయ వాణిజ్యం, ద్రవ్య ప్రసరణపై అమెరికా పట్టు మరింత బిగిసింది.
ఇదే సమయంలో 1947లో అమెరికా ప్రవేశపెట్టిన మార్షల్ ప్లాన్ (అంటే యూరప్ యుద్ధానంతర పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయడం, కమ్యూనిజం ప్రభావాన్ని తగ్గించడం, యూరప్ ఆర్థిక వ్యవస్థలను అమెరికాతో మరింతగా అనుసంధానించడం అనే ఉద్దేశ్యంతో రూపొందించిన కార్యక్రమం) యూరప్ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ, యూరప్–అమెరికా మధ్య పరస్పర ఆర్థిక ఆధార సంబంధాలు పెంచింది. ఈ ప్రణాళిక ద్వారా యూరప్ దేశాలు తమ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకోగలిగాయి. అయితే అదే సమయంలో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కూడా ఏర్పడింది. ఈ సహాయాన్ని పొందడానికి యూరప్ దేశాలు అమెరికా వస్తువులు కొనుగోలు చేయడం, తమ వాణిజ్య నియమాలను అమెరికా ఆర్థిక విధానాలకు అనుగుణంగా మార్చడం, అలాగే విదేశాంగ విధానంలో అమెరికా భద్రతా లక్ష్యాలను అనుసరించడం అవసరమైంది.
Bretton Woods వ్యవస్థ, మార్షల్ ప్లాన్ కలిసి డాలర్ ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. ఫలితంగా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా స్థిరపడింది. అంతర్జాతీయ సరుకుల వ్యాపారం (ప్రత్యేకించి చమురు వ్యాపారం) డాలర్ ఆధారంగా మారింది. దీనితో అమెరికా ద్రవ్య విధానాలు ప్రపంచ మార్కెట్లపై ఇంకా ప్రభావం చూపే స్థాయికి చేరాయి.
ఈ అంతర్జాతీయ రాజకీయార్థిక నిర్మాణంలో చమురు ప్రపంచ పారిశ్రామీకరణ, సైనిక వ్యవస్థలు, రవాణా, ఆర్థిక అభివృద్ధికి పునాది కావడంతో, చమురు సరఫరాపై పట్టు సాధించడం అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ప్రధాన అంశమైంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలోని విస్తృత చమురు నిల్వలు, ప్రధాన సముద్ర మార్గాలను కలిపే జియోపొలిటికల్ మార్గాలు (అంటే విమాన మార్గాలు, నావికా మార్గాలు, ఇతర వ్యూహాత్మక రవాణా మార్గాలు), అలాగే పెర్షియన్ గల్ఫ్ నౌకాయాన మార్గాలు అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యతను పొందాయి. ఈ మార్గాల మీద నియంత్రణ కలిగి ఉన్న దేశాలు ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేయగలవు. అందువల్ల ఈ ప్రాంతం ప్రపంచ రాజకీయాల్లో కీలక స్థానంగా మారింది.
ఇరాన్ ఈ ప్రాంతంలో భౌగోళికంగా కేంద్రస్థానాన్ని ఆక్రమించడంతో, ఇరాన్ చమురు పరిశ్రమపై నియంత్రణ అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద శక్తులకు ముఖ్య భద్రతా అవసరంగా మారింది. ముఖ్యంగా అబాదాన్ చమురు శుద్ధి కేంద్రం అప్పటి ప్రపంచ చమురు శుద్ధి సామర్థ్యంలో అత్యంత పెద్ద వాటాను కలిగి ఉండి, అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థకు కీలక జీవనాడిగా ఉండింది. అయితే AIOC లాభాలు ప్రతి ఏటా భారీగా పెరుగుతున్నప్పటికీ, స్థానిక ఇరాన్ ప్రజలకు లభించిన ఆర్థిక ప్రయోజనాలు చాలా తక్కువగా ఉండటం, పెట్టుబడి–లాభాల పంపిణీలో తీవ్ర అసమానతలు కనిపించడం, నిర్ణయాల్లో ఇరానీయుల పాత్ర లేకపోవడం వంటి కారణాల వల్ల ఇది నయా వలసవాద దోపిడీగా మారిపోయింది.
2
ఈ రాజకీయ–ఆర్థిక సందర్భంలో, ఇరాన్‌లో 1925లో పహ్లవి వంశాన్ని స్థాపించిన రెజా షా పహ్లవి రూపొందించిన కేంద్రీకృత రాజ్యాధికారం 1941లో ఆయన రాజీనామా చేయడంతో ఆయన కుమారుడు మొహమ్మద్ రెజా షా పహ్లవి చేతుల్లోకి వచ్చింది. మొహమ్మద్ రెజా షా ఒక రాజ్యాంగ చక్రవర్తి (constitutional monarch) అయినప్పటికీ, ఆయన పాలనలో తన అధికారాన్ని మరింత బలపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాడు. అయితే 1906 రాజ్యాంగం ప్రకారం ఇరాన్ ఒక రాజ్యాంగబద్దమైన రాజ్యం కావడంతో, ఎన్నికైన ప్రతినిధులతో నడిచే మజ్లిస్ అనే పార్లమెంట్ వ్యవస్థ కూడా అమల్లో ఉన్నది. మజ్లిస్‌కు చట్టాలు రూపొందించే, ప్రభుత్వాన్ని పర్యవేక్షించే, ప్రధానమంత్రి వంటి పదవులను ధృవీకరించే రాజ్యాంగపరమైన అధికారాలు ఉన్నాయి. ఈ కారణంగా దేశ పాలనలో రెండు విభిన్న ధ్రువాలు స్పష్టంగా కనిపించేవి. ఒకవైపు షా ఆధ్వర్యంలోని కేంద్రీకృత రాజ్యాధికారం, మరోవైపు మజ్లిస్ ప్రాతినిధ్యం ఆధారంగా పనిచేసే పరిమిత ప్రజాస్వామ్యం. షా తీవ్రంగా తన ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తుంటే, మజ్లిస్ ప్రజాస్వామిక సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఫలితంగా, 1940ల చివరి నుండి 1953 వరకూ ఇరాన్ రాజకీయ వ్యవస్థలో రాజ్యాధికార కేంద్రీకరణ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం మధ్య ఒక నిరంతర ఉద్రిక్తత కొనసాగింది.
ఈ కాలంలో నగర వ్యాపార వర్గాలు, బజార్ నెట్వర్కులు (నగరాల్లోని వాణిజ్య కేంద్రీకరణతో ఏర్పడిన సంప్రదాయ వ్యాపార, మతపెద్దల ఆర్థిక నెట్వర్కులు), షియా మతపెద్దలు, కార్మిక వర్గాలు, విద్యార్థులు, మధ్యతరగతి మేధావుల సమ్మేళనం ఒక విస్తృతమైన జాతీయవాద–ప్రజాస్వామ్య రాజకీయ చైతన్యాన్ని నిర్మించడం మొదలుపెట్టాయి. వీరు దేశీయ వనరులపై విదేశీ కంపెనీల నియంత్రణను, ముఖ్యంగా AIOC ఆధిపత్యాన్నిఅన్యాయంగా భావించారు. ఇలాంటి రాజకీయ వాతావరణంలో మహ్మద్ మోసాదేఘ్ ఒక ప్రముఖ జాతీయవాద నాయకుడిగా ఎదిగాడు. ఆయన ఒక రాజ్యాంగవాది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న నాయకుడు. 1951లో ఇరాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆ వెనువెంటనే చమురు జాతీయీకరణ చట్టం తెచ్చాడు. ఆయనకు చమురు జాతీయీకరణ ఒక సాధారణ ఆర్థిక సంస్కరణ మాత్రమే కాదు. అది ఇరాన్ దేశాధికారాన్ని పునర్నిర్మించడాని కోసం చేపట్టిన నిర్మాణాత్మక మార్పు. విదేశీ గుత్తాధిపత్యాన్ని ఆపి, దేశపు సహజసంపదలను దేశీయ అభివృద్ధి, సామాజిక సంక్షేమం, ఆర్థిక స్వతంత్రత కోసం వినియోగించాలని ఆయన వాదించాడు.
అయితే చమురు జాతీయీకరణ ఇరాన్ అంతర్గత రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయ బల సమీకరణాల్లో కూడా ఒక కీలక మలుపుగా మారింది. అది పాశ్చాత్య చమురు కంపెనీల ఆధిపత్యానికి సవాలు చేసిన తొలి పెద్ద చర్యగా నిలిచిది. అంతేకాదు, ఇరాన్ ప్రజలలో విస్తృతమైన జాతీయ గర్వాన్ని, రాజకీయ చైతన్యాన్ని పెంచింది. బ్రిటన్, అమెరికాకు మాత్రం మోసాదేఘ్ చమురు జాతీయీకరణ మొత్తం పశ్చిమాసియా భౌగోళిక, ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదంగా అనిపించింది. తమ చమురు సరఫరా స్థిరత్వాన్ని దెబ్బకొట్టే పరిణామంగా కనిపించింది. దీనికి తోడు, అమెరికా మోసాదేఘ్‌కు ప్రజల నుంచి లభిస్తున్న విస్తృత మద్దతును చూసి, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అది సోవియట్ ప్రభావం పెరగడానికి అవకాశం కల్పించవచ్చని అనుమానించింది . (ఇటువంటి సందర్భాన్ని అంతర్జాతీయ సంబంధాల సిద్ధాంతంలో “సెక్యూరిటీ డైలమా” అంటారు. ఒక దేశం తన స్వాధీన హక్కులను బలపరచడానికి తీసుకునే చర్యను, మరో దేశం తన భద్రతకు ముప్పుగా అర్థం చేసుకుని ప్రతిస్పందించడం. ఏ దేశం బాగుపడినా అమెరికా సహించలేకపోవడం ఏ నాటి నుండో ఉంది). ఇరాన్ చమురు జాతీయీకరణ తర్వాత అమెరికా, బ్రిటన్ అటువంటి సెక్యూరిటీ డైలమానే ప్రదర్శించాయి.
ఈ విధంగా, ఒకవైపు ఇరాన్ జాతీయ స్థాయిలో తీసుకున్న సార్వభౌమ నిర్ణయం, మరోవైపు కోర్ కాపిటలిస్ట్ శక్తుల బాహ్య ప్రయోజనాలు పరస్పరం ముఖాముఖి ఢీకొన్నాయి. ఈ సంఘర్షణ వ్యక్తిగత నాయకుల నిర్ణయాల వల్ల కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, బలాబలాల అసమానతలు, గ్లోబల్ కాపిటలిజం పని విధానాల వల్ల కలిగిన సంఘర్షణ. అందుకే సామ్రాజ్యవాద శక్తులు ఇరాన్ లో రాజకీయ అస్థిర పరిస్థితులను తీసుకురావాలని అనుకున్నాయి. మోసాదేఘ్ ను పదవి నుండి తొలిగించి తమ తొత్తులను గద్దె ఎక్కించాలని నిర్ణయించుకున్నాయి.
దాని కోసమే1953లో TP-AJAX/Operation Boot అనే రహస్య ఆపరేషన్‌ను అమెరికా కేంద్ర గూఢచారి సంస్థ CIA (Central Intelligence Agency), బ్రిటిష్ గూఢచారి సంస్థ MI6 (Secret Intelligence Service) సంయుక్తంగా నిర్వహించాయి. ఆపరేషన్లో భాగంగా మోసాదేఘ్ ప్రభుత్వం మీద పత్రికల్లో దుష్ప్రచారం చేయడం, ప్రభావశీల రాజకీయ నేతలు, మతపెద్దలు, సైనికాధికారులకు లంచాలు ఇవ్వడం, బీభత్సం సృష్టించేందుకు అద్దె గుంపులను వీధుల్లోకి దింపడం వంటి పనులు చేశారు. ఈ ఒత్తిడి నడుమ రాజ్యాంగ రాజు షా ప్రధాని మోసాదేఘ్ ను తొలగించే ఉత్తర్వుపై 1953 ఆగస్టు 13న సంతకం చేసి, కొత్త ప్రధానిగా జనరల్ ఫజ్లోల్లాహ్ జాహెదీని నియమించాడు. (జాహెదీ ఇరాన్ ఆర్మీలో ఉన్న ఉన్నతాధికారి. బ్రిటన్, అమెరికా గూఢాచార వర్గాలకు అనుకూలంగా ఉన్న నాయకుడు.)
అయితే మొదటి కుట్ర ప్రయత్నం ఆగస్టు 15 రాత్రి విఫలమైంది. ఎందుకంటే మోసాదేఘ్ ఈ పన్నాగాన్ని ముందే తెలుసుకుని తన అనుకూల సైనిక అధికారులను అప్రమత్తం చేయగా, షా పంపిన రాజాజ్ఞను రాజ్యాంగ విరుద్ధమని తిరస్కరించాడు. పైగా ప్రజల్లో పెద్దఎత్తున మోసాదేఘ్‌కు మద్దతు రావడంతో CIA ప్రణాళిక పూర్తిగా చెదిరిపోయింది. ఆ పరిస్థితుల్లో భయపడ్డ షా 1953 ఆగస్టు 16 ఉదయం ఇరాన్‌ను విడిచి బాగ్దాద్‌కు విమానంలో పారిపోయి, అక్కడి నుంచి రోమ్‌కు చేరాడు. అతను పారిపోయాక CIA–MI6 రెండో కుట్రను వేగంగా రచించి, 1953 ఆగస్టు 19న తిరిగి చర్య ప్రారంభించింది. ఆ రోజు CIA నిధులతో ప్రభావితమైన సైనిక బలగాలు, పోలీసు విభాగాలు కీలక కమ్యూనికేషన్ కేంద్రాలు, రేడియో స్టేషన్లు, ప్రభుత్వ భవనాలు ఆక్రమించగా, అద్దె గుంపులు రాజధానిలో భారీ హింసను సృష్టించడంతో ప్రభుత్వ నియంత్రణ చేజారిపోయింది. చివరకు మోసాదేఘ్ ఇంటిని సైన్యం ముట్టడించగా ఆయన లొంగిపోయాడు. ఆ విజయంతో షా ఆగస్టు 22న ఇరాన్‌కు తిరిగి వచ్చి సంపూర్ణ అధికారాన్ని చేపట్టి తన నియంతృత్వ పాలనను మరింతగా కొనసాగించాడు. అతని పాలనను రక్షించుకునేందుకు రహస్య గూఢచారి సంస్థ SAVAK (Sazeman-e Ettela’at va Amniyat-e Keshvar, జాతీయ ఇంటెలిజెన్స్ భద్రతా సంస్థ)ను 1957లో అమెరికా, బ్రిటన్ సహాయంతో స్థాపించాడు. దీని స్థాపన, శిక్షణ, ఆపరేషనల్ మోడళ్ల రూపకల్పనలో CIA, మొసాద్ (ఇజ్రాయిల్ గూఢాచార సంస్థ) కీలక పాత్ర పోషించాయి.
ఈ రాజకీయ పరిణామాల సందర్భంలో జాతీయ నాయకుడిగా ఎదుగుతున్న అయతుల్లా రూహొల్లా ఖోమేనీని షా ప్రభుత్వం 1964లో అరెస్టు చేసి టర్కీకి పంపి, తరువాత ఇరాక్ (నజఫ్)లో 14 సంవత్సరాల పాటు ప్రవాసంలో ఉంచింది. 1978లో ఇరాక్, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అతను ఫ్రాన్స్‌లోని ప్యారిస్ కు వెళ్లి అక్కడినుంచి ప్రపంచవ్యాప్తంగా తన ఆలోచనలు వ్యాప్తి చేశాడు.
3
ఇక షా తన పాలనను “మోడర్నైజేషన్” పేరుతో ముందుకు నడిపించాడు. చమురు ద్వారా వచ్చిన భారీ ఆదాయం (పెట్రో రెంట్) తో రోడ్లు, పరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టినా, అదే సమయంలో ఆయన రాజకీయ హక్కులను కఠినంగా అణచివేశాడు. ప్రతిపక్షం, పౌర స్వేచ్ఛలు, ప్రజాస్వామ్య హక్కులు రద్దు చేశాడు. ఈ అణచివేతకు ప్రధాన సాధనం SAVAK. ఈ సమయంలో ఇరాన్ rentier stateగా మారింది (అంటే ప్రభుత్వం ప్రజల పన్నులపై కాకుండా చమురు ఆదాయాలపై ఎక్కువగా ఆధారపడింది). దీనివల్ల ప్రభుత్వం ప్రజల మద్దతు కోసం లేదా వారి హక్కులను గౌరవించడానికి కాకుండా, సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహాలు, భద్రతా యంత్రాంగం ద్వారా రాజకీయ నియంత్రణ సాధించింది. ప్రజలకు ఆర్థికంగా కొన్ని లాభాలు వచ్చినా, రాజకీయ హక్కులు తగ్గిపోవడం, అణచివేత పెరగడం వల్ల అసంతృప్తి పెరిగింది. మరోవైపు అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలకు ఈ rentier వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా మారింది. ఎందుకంటే ఇది చమురు సరఫరా నిలకడగా కొనసాగడాన్ని, పశ్చిమాసియాలో తమ ప్రాబల్యం కొనసాగించడానికి ఉపయోగపడింది. కానీ ఈ విధమైన పాలన ఎంతో కాలం నిలవలేకపోయింది. చివరకు కార్మికులు, విద్యార్థులు, బజార్ వ్యాపారులు, మతపెద్దలు వంటి వర్గాల్లో అసహనాన్ని పెంచి, వీళ్లంతా కలిసి ఒక పెద్ద ప్రతిఘటనకు దారితీసే పరిస్థితిని సృష్టించింది.
1978 జనవరి 7న కామ్ (Qom) నగరంలోని ఒక మతపరమైన పత్రికలో ఖోమేనీపై అవమానకర వ్యాసం ప్రచురించారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలకు ఈ వ్యాసం ఒక ప్రతిఘటనా సందర్భంగా మారింది. జనవరి 9న దేశ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. వాటిపై భద్రతా దళాలు కాల్పులు జరిపి 20–30 మంది నిరసనకారులను చంపివేశాయి. అయితే ఇరాన్ షియా సాంప్రదాయం ప్రకారం 40వ రోజు జరిగే సంస్మరణ సభలలో మళ్ళీ నిరసనలు చెలరేగాయి. వీటిపై ప్రభుత్వ బలగాలు మళ్ళీ బలప్రయోగం చేయడంతో నిరసనల–దమనకాండల–40 రోజుల సంస్మరణ సభల చక్రం దేశవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ ఆచారం మతపరమైనదిగా మాత్రమే కాకుండా, ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపే శక్తివంతమైన రాజకీయ మొబిలైజేషన్ సాధనంగా మారింది (ఇరాన్ షియా సాంప్రదాయంలో ఎవరైనా చనిపోయిన 40 రోజులు పూర్తయ్యే రోజు “చెహెలుం” లేదా 40వ రోజు సంస్మరణ సభ నిర్వహించడం ఒక ప్రధాన ఆచారం. ఆ రోజు కుటుంబ సభ్యులు, మతపెద్దలు, సమాజం కలిసి చనిపోయిన వ్యక్తిని స్మరించడానికి, అతని కోసం ప్రార్థనలు చేయడానికి, శోకాన్ని వ్యక్తం చేయడానికి ఒక పెద్ద సమూహంగా కూడుతారు. షియా సంప్రదాయంలో 40వ రోజు శోక వలయం ముగిసే ప్రత్యేక దశగా భావిస్తారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగించే రోజు అనేది వాళ్ల నమ్మకం).
ఇదే సమయంలో ఆర్థిక రంగంలో, ముఖ్యంగా చమురు పరిశ్రమలో, భారీ సమ్మెలు ప్రారంభమయ్యాయి. వీటి వలన ప్రభుత్వ ఆదాయ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలో ప్రజా నిరసనలు ఉధృతమయ్యాయి. 8 సెప్టెంబర్, 1978న (బ్లాక్ ఫ్రైడే) టెహ్రాన్ లోని జాలెహ్ స్క్వేర్‌లో పోగైన నిరసనకారులపై సైన్యం, భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం మరణాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం చేయబడినప్పటికీ, అకడమిక్ పరిశోధనలు, స్వతంత్ర నివేదికలు సుమారు 100 నుండి 300 మంది నిరసనకారులు చంపబడినట్లు అంచనా వేశాయి. ఈ సంఘటన ప్రజా ప్రతిఘటనను అత్యంత తీవ్రస్థాయికి చేర్చింది. 1978 చివరి నాటికి చమురు కార్మికుల సమ్మెలు ప్రభుత్వాన్ని ఆర్థికంగా స్తంభింపజేయగా, రాజకీయ పరంగా సైన్యంలో కూడా విభేదాలు పెరిగాయి. 1979 జనవరి కల్లా పాలనా యంత్రాంగానికి అవసరమైన భద్రతా బలం గణనీయంగా బలహీనపడింది.
ఈ సంక్షోభ వాతావరణంలో, 1979 ఫిబ్రవరి 1న అయతుల్లా రూహొల్లా ఖోమేనీ ప్రవాసం నుండి ఇరాన్‌కు తిరిగి రావడం నిర్ణాయక ఘట్టమైంది. ఆయన టెహ్రాన్ చేరుకున్నప్పుడు సుమారు ముప్పై నుండి యాభై లక్షల మంది ప్రజలు ఆయనకు స్వాగతం పలికినట్లు అనేక ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ స్వాగతం ప్రజా భావజాలం ఒకే నాయకత్వం కింద ఏకీకృతమైందనే సంకేతాన్ని ఇచ్చింది. ఫిబ్రవరి 9–11 మధ్య టెహ్రాన్‌లో జరిగిన సాయుధ ఘర్షణలు, గస్తీ దళాల తిరుగుబాట్లు, రాజుకు రక్షణగా ఉండే సైనిక యూనిట్లు కూలిపోవడంతో ఫిబ్రవరి 11న సైన్యం తటస్థతను ప్రకటించింది. దానితో పహ్లవి షా రాజరికం అధికారికంగా అంతమయ్యింది. తక్షణమే ప్రతిఘటనా శక్తులు తమ కొత్త రాజ్య నిర్మాణాన్ని ప్రారంభించాయి.
ఈ పరిణామాలు కేవలం ప్రభుత్వ మార్పుగా కాకుండా, సామ్రాజ్యవాద వ్యతిరేక రాజ్య నిర్మాణం (anti-imperialist state formation) అనే గాఢమైన చారిత్రక ధోరణిలో భాగంగా అర్థం చేసుకోవాలి. “విప్లవ ప్రభుత్వం” అమెరికా, పాశ్చాత్య దేశాలతో ఉన్న సైనిక, ఆర్థిక ఒప్పందాలను తిరిగి రాసింది. విదేశీ సైనిక బేస్‌లను తొలిగించింది. ప్రధాన పరిశ్రమలను జాతీయీకరించడం వంటి చర్యల చేపట్టి దేశ సార్వభౌమత్వాన్ని పునర్నిర్వచించింది. ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరి ప్రత్యేకంగా అమెరికా ఆధిపత్యానికి ప్రత్యక్ష నిరాకరణగా మారింది. 1953లో దొంగచాటుగా రాజ్యాన్ని కూల్చడంతో ప్రజల్లో విదేశీ ఆధిపత్యంపై తీవ్ర అనుమానాన్ని, స్వతంత్ర్యంపై గాఢమైన కోరికను పెంచితే, 1979 “విప్లవం” ప్రత్యామ్నాయ రాజ్య నిర్మాణానికి సామాజిక, రాజకీయ పునాది వేసింది. మొత్తంగా, 1978–79 విప్లవం ఇరాన్ రాజకీయ, ఆర్థిక చరిత్రలో ఒక సాధారణ పాలనా మార్పు కాకుండా, విదేశీ ప్రభావాన్ని తగ్గించడం, సామాజిక న్యాయాన్ని ప్రతిష్ఠించడం, దేశ స్వాతంత్య్రాన్ని పునర్నిర్వచించడం అనే దీర్ఘకాలిక చారిత్రక ప్రాజెక్టు పరిపక్వ రూపంగా నిలిచింది.
ఈ మార్పుతో పశ్చిమాషియాలో కొత్త ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌కు తీవ్ర వ్యతిరేకంగా నిలబడింది. అలాగే హిజ్బుల్లా, హమాస్ వంటి ప్రాంతీయ మిత్ర బలగాల ద్వారా తన ప్రభావాన్ని విస్తరించింది. దానికి ప్రతిగా అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు, దౌత్య ఒత్తిళ్లు, భద్రతా చర్యలను పెంచుతూ, ఇజ్రాయెల్‌ను తన ప్రధాన ప్రాంతీయ భద్రతా భాగస్వామిగా మరింత బలాన్ని సమకూర్చింది.
4
ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ తన సంస్కరణలతో సామ్రాజ్యవాద దేశాలకు మాత్రమే కాదు, ఇరాక్ కు కూడా దడ పుట్టించింది. సద్దాం హుస్సేన్ ఇరాన్ దూకుడు తన దేశ భద్రతకు, ప్రాంతీయ ఆధిపత్యానికి ముప్పుగా భావించాడు. దీనికి తోడు షత్త్ అల్-అరబ్ జలమార్గంపై ఉన్న సరిహద్దు వివాదం, అలాగే ఇరాన్ విప్లవం వల్ల ఇరాక్‌లోని షియా జనాభా అసంతృప్తి పెరుగుతుందనే భయంతో ఇరాక్ మొదటిగా 1980లో ఇరాన్‌పై దాడి చేసింది. సద్దాం, ఇరాన్ బలహీనమైందని, త్వరగా విజయం సాధించవచ్చని అనుకున్నాడు. కానీ, యుద్ధం అతను ఊహించినంత సులభంగా జరగలేదు. ఇరాన్ త్వరగా తేరుకుని తీవ్రంగా ప్రతిఘటించింది. ఫలితంగా ఆ యుద్ధం ఎనిమిదేళ్లు కొనసాగింది. సద్దాం హుస్సేన్ పౌర ప్రాంతాలపై రసాయన ఆయుధాలను ఉపయోగించాడు. 1988 మార్చ్ 16న హలబ్జా పట్టణంపై జరిగిన దాడి ఈ యుద్ధంలోనే కాదు, 20వ శతాబ్దంలోని అత్యంత భయంకరమైన రసాయన నరమేధాల్లో ఒకటిగా నిలిచిపోయింది. సుమారు 3,200 నుంచి 5,000 మంది మరణించగా, 7,000 నుంచి 10,000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు రికార్డ్ చేశాయి. మస్టర్డ్ గ్యాస్, సారిన్ వంటి నర్వ్ ఏజెంట్ల (నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదకరమైన రసాయనాలు) వినియోగాన్ని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఎన్జీఓలు ధృవీకరించాయి. మొత్తంగా ఇరాన్, ఇరాక్ రెండూ ఆర్థికంగా, సైనికంగా, సామాజికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది మరణించారు లేదా గాయపడ్డారు. నగరాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ మరింత సైనికీకృత దిశగా నడిచింది. దానికి పాశ్చాత్య దేశాలపై పూర్తిగా నమ్మకం పోయింది. ఇరాక్ మాత్రం భారీ అప్పుల్లో కూరుకుపోయి, తర్వాతి కాలంలో మరింత అస్థిరత వైపు వెళ్లింది.
ఈ యుద్ధంలో అమెరికా, మరికొన్ని పాశ్చాత్య దేశాలు ఇరాక్‌కు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చాయి. ఎందుకంటే వాళ్లు ఇరాన్ విప్లవాన్ని తమ ప్రాంతీయ ప్రయోజనాలకు ముప్పుగా చూశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌ను పెద్ద ముప్పుగా భావించి, కొన్ని దశల్లో ఇరాక్‌కు పరిమిత సహాయం అందించినట్లు మిలిటరీ విశ్లేషణలు చెబుతున్నాయి. అందుకే ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, అది ప్రచ్ఛన్నయుద్ధ కాలంలోని పెద్ద శక్తుల వ్యూహాలు, ప్రాంతీయ భద్రతా లెక్కలు, సామ్రాజ్యవాద రాజకీయాల ప్రభావంతో నడిచిన దీర్ఘకాలిక యుద్ధం.
1988లో ఇరాన్–ఇరాక్ యుద్ధం చివరి దశలో, పర్షియన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్రంగా ఉన్న సమయంలో, ఒక దుర్మార్గమైన సంఘటన జరిగింది. 1988 జూలై 3న Iran Air Flight 655 అనే ప్రయాణికుల విమానాన్ని అమెరికా నౌకాదళానికి చెందిన USS Vincennes యుద్ధ నౌక కాల్చివేసింది. ఈ దాడిలో విమానంలోని 290 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. తరువాత జరిగిన అధికారిక దర్యాప్తులు (ముఖ్యంగా Fogarty Report, అమెరికా రక్షణ శాఖ నివేదికలు) ఈ ఘటన తప్పుగా గుర్తించడం (misidentification) మూలంగా జరిగిందని నిర్ధారించాయి. అమెరికా ప్రభుత్వం ప్రారంభంలో ఈ చర్యను “స్వీయ రక్షణ” (self-defense)గా సమర్థించుకుంది. కానీ, తర్వాత దశలో బాధిత కుటుంబాలకు ఆర్థిక పరిహారం చెల్లించినప్పటికీ, అధికారికంగా క్షమాపణ చెప్పలేదు. ఇరాన్ మాత్రం దీనిని అమెరికా బరితెగింపు చర్యగానే చూసింది.
హలబ్జా రసాయన నరమేధం, Iran Air Flight 655 కూల్చివేత సంఘటనలు, ఇరాన్ భద్రతా, విదేశాంగ ఆలోచనలో కీలకమైన మార్పులకు దారితీశాయి. ఈ అనుభవాలు “బాహ్య ముప్పుల పట్ల నిరంతర అప్రమత్తత”, “సార్వభౌమత్వం రక్షణ”, అమెరికా–ఇజ్రాయెల్ కూటమిని వ్యూహాత్మక ప్రత్యర్థిగా పరిగణించే దృక్పథాలను నిర్మాణాత్మకంగా మరింత బలపరిచాయి. యుద్ధం ముగిసిన తరువాత కూడా ఈ సంఘటనలు ఇరాన్ జాతీయ భద్రతా సిద్ధాంతం, ప్రాంతీయ వ్యూహాత్మక అంచనాలు, విదేశాంగ విధానంపై లోతైన, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపించాయి. అందువల్ల, 1980–88 కాలంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం పశ్చిమాసియాలో అంతర్జాతీయ సంబంధాలను పునర్నిర్మించిన ఒక కీలక చారిత్రక మలుపు (macro-historical inflection point)గా పండితులు విశ్లేషిస్తారు.
ఇరాన్ పై కేవలం సైనిక దాడులే కాదు, ఆర్థిక, వాణిజ్య, బ్యాంకింగ్ రంగాల్లో కూడా తీవ్రమైన ఆంక్షలు విధించబడ్డాయి. ఈ ఆంక్షలను మొదటగా అమెరికా అమలు చేసింది. తరువాత యురోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా వాటిని అనుసరించాయి. ఈ ఆంక్షలు 1979లో టెహ్రాన్‌లో జరిగిన బందీల సంక్షోభంతో (hostage crisis) మొదలయ్యింది. ఈ సంఘటనలో అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిని ఇరానియన్ విద్యార్థులు 444 రోజుల పాటు బందీలుగా ఉంచారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా, ఇరాన్‌కు చెందిన బయిటి ఆస్తులను నిలిపివేసి, వాణిజ్యాన్ని, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పూర్తిగా నిషేధించింది.
1990లలో ఈ ఆంక్షలను మరింత విస్తరించి, ఇరాన్‌ను ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా ప్రకటించింది. దాని ద్వారా ఇరాన్ ప్రభుత్వ సంస్థలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశాన్ని పరిమితం చేసింది. అదేవిధంగా, అణు, క్షిపణి, రసాయన ఆయుధాల అభివృద్ధికి ఉపయోగపడే పరికరాలు, సాంకేతికత, పదార్థాలపై ద్వంద్వ వినియోగ (dual-use అంటే ఒక వస్తువు సాధారణ పనులకు ఉపయోగపడినా, అదే వస్తువు ఆయుధాల తయారీలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటే) నిషేధాలు విధించింది. చమురు, గ్యాస్ రంగాల్లో విదేశీ పెట్టుబడులను నిరోధించే ఆంక్షలు అమల్లోకి తెచ్చి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది.
2006 నుండి 2010 వరకు, ఇరాన్ అణు కార్యక్రమంపై పెరిగిన అంతర్జాతీయ ఆందోళనల నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1737, 1747, 1803, 1929 వంటి కీలక తీర్మానాలను అమలు చేసింది. ఈ తీర్మానాలు ఇరాన్ అణు ఇంధన చక్రంలోని అన్ని దశలను (యురేనియం తవ్వకం, మార్పిడి, సాంద్రీకరణ, మరియు ఇంధన తయారీ) లక్ష్యంగా జరిగాయి. అదనంగా, ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థ, చమురు ఎగుమతులు, నౌకాయాన రవాణా, అంతర్జాతీయ ధన లావాదేవీలకు కీలకమైన SWIFT (Society for Worldwide Interbank Financial Telecommunication. ఒక దేశాన్ని SWIFT నుండి తొలగిస్తే, ఆ దేశం అంతర్జాతీయ వాణిజ్యం చేయడం చాలా కష్టం అవుతుంది) వంటి వ్యవస్థల విస్తరణను పరిమితం చేయడం ద్వారా ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. ఈ విధంగా, ఈ ఆంక్షలు కేవలం ఆర్థికరంగానికే పరిమితం కాకుండా, ఇరాన్ అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రభావితం చేసే సమగ్ర వ్యూహాత్మక సాధనాలుగా అమెరికా మార్చగలిగింది.
5
ఈ బలమైన ఆంక్షల ఒత్తిడి నేపథ్యంలో, 2013 నుండి “అణు పరిమితులు–తనిఖీలు–ఆంక్షల సడలింపు” అనే చర్చా నిర్మాణం రూపుదిద్దుకుంది. ఈ రూపకల్పన ప్రకారం, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి, International Atomic Energy Agency (IAEA)కు విస్తృత తనిఖీలను అనుమతించాలి. దీనికి ప్రతిగా అమెరికా, యురోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన ఆంక్షలను సడలించాలి. ఈ చర్చా ప్రక్రియ ఫలితంగా 2015లో Joint Comprehensive Plan of Action (JCPOA) అనే సమగ్ర అణు ఒప్పందం కుదిరింది. ఇందులో ఇరాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్ భాగస్వాములుగా ఉన్నారు.
అయితే, 2018లో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని “అసంపూర్ణం”గా పేర్కొంటూ, తనిఖీ విధానాల్లో లోపాలు ఉన్నాయని, ఇరాన్ ప్రాంతీయ అస్థిరతను పెంచే కార్యకలాపాలను ఇది నియంత్రించలేదని వాదిస్తూ, ఒకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగింది. వెంటనే “గరిష్ట ఒత్తిడి విధానం” (maximum pressure policy) పేరిట అన్ని ఆంక్షలను మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ రాజకీయ, నైతిక తిరోగమనానికి ప్రతిస్పందనగా, ఇరాన్ 2019 నుండి 2023 వరకు దశలవారీగా ఒప్పంద ఉల్లంఘన దిశగా ముందుకు సాగింది. ఇందులో యురేనియం నిల్వ పరిమితులను అతిక్రమించడం, సాంద్రీకరణ శాతాన్నిపెంచడం, అధునాతన సెంట్రిఫ్యూజులను వినియోగంలోకి తేవడం, అణు తనిఖీలకు అనుమతులను పరిమితం చేయడం వంటి చర్యలు ఉన్నాయని ఇరాన్ మీద అమెరికా ఆరోపణలను లేవనెత్తింది.
ఈ పరిణామం 2023–2025 కాలంలో మరింత తీవ్రతను సంతరించుకుంది. అణు నిర్మాణం అనేది తమ సార్వభౌమత్వాన్ని నిర్వచించే, కాపాడే ప్రపంచంలో ఉన్నామని ఇరాన్ గుర్తించింది. అందుకే ఈ సమయంలో ఇరాన్ యురేనియం సాంద్రీకరణను సుమారు 60% స్థాయికి పెంచుకోగలిగింది. కొన్ని అణు స్థావరాల్లో IAEA పరిశీలకులకు తాత్కాలికంగా ప్రవేశాన్ని పరిమితం చేసింది. ఎక్కువ పరిమాణంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను సమీకరించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై ఇరాన్ “అణు ఆయుధ సామర్థ్యానికి అత్యంత సమీప దశ”లో ఉందనే ఆందోళనలు వెల్లువెత్తాయి. అదనంగా, IAEA కొన్ని స్థావరాల్లో గుర్తించిన ప్రకటించని యురేనియం కణాలపై ప్రశ్నలు లేవనెత్తగా, వాటికి ఇరాన్ సమగ్ర సాంకేతిక వివరణలు అందించలేదని పేర్కొనడం పరిస్థితిని మరింత వివాదాస్పదంగా మార్చింది.
ఈ ఆరోపణలకు ఇరాన్ గట్టిగా ప్రతిస్పందిస్తూ, IAEA వ్యాఖ్యలను “రాజకీయ ఉద్దేశ్య ప్రేరితమైనవి”గా విమర్శించింది. ప్రకటించని యురేనియం కణాలు పాతకాల పారిశ్రామిక ప్రయోగాల అవశేషాలు కావచ్చని వాదిస్తూ, తన అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత స్వభావమున్నదేనని పునరుద్ఘాటించింది. అంతేకాక, IAEAతో సహకారం కొనసాగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నప్పటికీ, పాశ్చాత్య దేశాలు ఈ అంశాలను ఒత్తిడి సాధనంగా ఉపయోగిస్తున్నాయని పేర్కొంది. 60% సాంద్రీకరణను కూడా అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగా తీసుకున్న అవసరమైన చర్యగా సమర్థిస్తూ, ఆంక్షలు ఎత్తివేస్తే మళ్ళీ ఒప్పంద పరిమితులకు లోబడతామని బహిరంగంగానే ప్రకటించింది.
2024–2026 మధ్య భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఇరాన్ అణు సమస్యను మరింత సంక్లిష్టం చేశాయి. ముఖ్యంగా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన ప్రత్యక్ష, పరోక్ష క్షిపణి దాడులు ప్రాంతీయ భద్రతా పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ దాడులు కేవలం సైనిక స్థాయిలోనే కాకుండా, ఇరాన్ అణు మౌలిక వసతుల చుట్టూ భద్రతా ఆందోళనలను పెంచాయి. అణు స్థావరాలు, శుద్ధి కేంద్రాలు వంటి కీలక వనరులు యుద్ధ లక్ష్యాలుగా మారే ప్రమాదం ఉందనే భావన అంతర్జాతీయ వేదికపై ప్రధానంగా చర్చించబడింది. ఇదే సమయంలో, జూన్ 2025లో అమెరికా చేపట్టిన కొన్ని లక్ష్యిత వైమానిక దాడులు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. అమెరికా ఈ దాడుల ద్వారా ఇరాన్ అణు నిర్మాణ సామర్ధ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించుకుంది. కానీ, ఈ దాడులు ప్రత్యక్షంగా అణు సదుపాయాలపై కాకపోయినా, అణు కార్యక్రమానికి అనుబంధంగా భావించబడే సైనిక మౌలిక వసతులు, వ్యూహాత్మక కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల, అణు స్థావరాల భద్రతపై అనిశ్చితి పెరిగింది. ఫలితంగా “అణు ప్రమాదం” అనే అంశం మళ్లీ అంతర్జాతీయ వేదిక మీదికి వచ్చింది.
ఈ మొత్తం దశలో అంతర్గతంగా ఇరాన్‌లో రాజకీయ, ఆర్థిక పరిస్థితుల పరస్పర ప్రభావం గణనీయంగా కనిపించింది. 2018లో Joint Comprehensive Plan of Action (JCPOA) నుంచి అమెరికా వైదొలిగి ఆంక్షలను మళ్లీ అమలు చేయడంతో, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. కరెన్సీ పతనం, ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల తగ్గుదల వంటి పరిణామాలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశాయి. ఈ ఒత్తిడి 2019–2020లో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. వీటిని ప్రభుత్వం స్థిరత్వానికి ముప్పుగా భావించి భద్రతా దళాల సహాయంతో కఠినంగా అణచివేసింది. అయితే ఈ పరిణామాలను ఒక సరళమైన కారణ ఫలిత క్రమంగా మాత్రమే చూడటం సరైనది కాదు. దేశీయ పరిపాలనా లోపాలు, పారదర్శకత కొరత, చమురు ఆదాయాలపై అధికంగా ఆధారపడటం, మౌలిక వసతుల బలహీనత, సమాజంలో మారుతున్న విలువలు, అన్నింటిని మించి అమెరికా, ఇజ్రాయిల్ పెంచి పోషించిన కృత్రిమ ఉద్యమాలు (ఈ పని అమెరికా పునాదిలోనే ఉన్నది) ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి.
2021లో ఇబ్రాహీం రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, రాజకీయ వ్యవస్థలో అతివాద వర్గాల ప్రభావం పెరిగింది. పత్రికా స్వేచ్ఛ, విమర్శనాత్మక స్వరాలు, పౌరహక్కులపై నియంత్రణలు మరింత ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి ప్రజా అసంతృప్తిని సామాజిక, రాజకీయ రూపాల్లో వ్యక్తం చేయించింది. ఈ నేపథ్యంతో 2022లో ఉద్భవించిన “మహిళ, జీవితం, స్వేచ్ఛ” ఉద్యమం కేవలం ఒక నిరసన మాత్రమే కాకుండా, పాలనా విధానం, హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలపై సమాజంలో ఉన్న లోతైన అసంతృప్తిని బయటపెట్టిన కీలక మలుపుగా మారింది. ఈ నిరసనల అనంతరం ప్రభుత్వం భద్రతా యంత్రాంగాన్ని మరింత కఠినతరం చేసి, డిజిటల్ నియంత్రణను పెంచి, సామాజిక మద్యమాలపై పర్యవేక్షణను పెంచింది. అయినప్పటికీ, 2025 చివరి నుండి 2026 ప్రారంభం వరకు కొత్త తరహా నిరసనలు కొనసాగాయి. కొందరు ఈ పరిస్థితిని 1979 విప్లవంతో పోల్చినా, సంఘటిత నాయకత్వం లోపించడం, ప్రత్యామ్నాయ రాజకీయ దిశ స్పష్టంగా లేకపోవడం, సమాజంలోని వర్గాల మధ్య విభేదాలు ఉండడం వల్ల ఈ నిరసనలు తక్షణ రాజకీయ మార్పును తీసుకురాలేకపోయాయి.
6
ఇటువంటి అంతర్జాతీయ, ఆంతరంగిక పరిస్థితులను అమెరికా, ఇజ్రాయెల్ తమకు అనుకూలంగా ఉపయోగించుకొని యుద్ధానికి సిద్దమయ్యాయి. అయితే ఈ సందర్భంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న “ప్రత్యేక సంబంధం” అర్థం చేసుకోకపోతే చాలా విషయాలు అర్థం కావు.
ఈ సంబంధం కేవలం మత పరమైన అనుబంధం మాత్రమే కాదు. దీని వెనుక లోతైన రాజకీయ, భద్రతా, ఆర్థిక పరమైన పరస్పర సంబంధం ఉంది. జియోనిస్ట్ గ్రేటర్ పాజెక్ట్ నిర్మాణం ఉంది. (జియోనిజం అనేది 19వ శతాబ్దం చివర్లో అభివృద్ధి చెందిన ఒక రాజకీయ, జాతీయ ఉద్యమం. జియోనిజం ప్రధాన లక్ష్యం మొదట యూదుల కోసం ఒక స్వదేశాన్ని ఏర్పాటు చేయడం. ఇది 1948లో ఇజ్రాయెల్ స్థాపనతో సాధ్యమైంది. తరువాత, దాని విస్తృత దిశ మూడు ప్రధాన అంశాలపై కేంద్రీకృతమైంది. దేశ భద్రతను బలపరచడం, అంతర్జాతీయ వేదికపై గుర్తింపును, దౌత్య సంబంధాలను విస్తరించడం, పశ్చిమాసియాలో తన వ్యూహాత్మక ప్రభావాన్ని నిలబెట్టుకోవడం. ఈ విధంగా జియోనిజం ఒక స్థిరమైన లక్ష్యంగా కాకుండా, ఇజ్రాయెల్ భద్రత, గుర్తింపు, ప్రాంతీయ స్థానాన్ని కాపాడే ఒక మారుతూ ఉండే వ్యూహాత్మక దిశగా అభివృద్ధి చెందింది).
అమెరికా సందర్భంలో, జియోనిజం అనేక స్థాయిల్లో పనిచేస్తుంది. మొదటగా, ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో యూరప్ నుండి వచ్చిన యూదు వలసదారుల ద్వారా అమెరికాలో వ్యాపించింది. ఈ సమూహాలు యూదుల భద్రత కోసం ఒక స్వదేశం అవసరమనే ఆలోచనను ప్రచారం చేశాయి. రెండో ప్రపంచ యుద్ధం, హోలోకాస్ట్ (అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, నాజీ జర్మనీ పాలనలో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో యూదులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన వ్యవస్థపూర్వక సామూహిక హత్యలు) అనంతరం, ఈ భావనకు మరింత నైతిక, భావోద్వేగ బలం లభించింది. దీంతో అమెరికా సమాజంలో ఇజ్రాయెల్‌కు మద్దతు గణనీయంగా పెరిగింది.
అమెరికా ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా వేగంగా గుర్తించినప్పటికీ, అరబ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలన్న ఆలోచనతో ప్రారంభ దశలో ఆయుధ సరఫరాను పరిమితంగా ఉంచింది. అయితే ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రం అయినకొద్దీ, నాసర్ నాయకత్వంలోని ఈజిప్ట్ వంటి అరబ్ జాతీయవాద ప్రభుత్వాలు సోవియట్ ప్రభావానికి లోనయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని అమెరికా అంచనా వేసింది. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ రాజకీయంగా స్థిరంగా, సోవియట్ వ్యతిరేక వైఖరిపై నిలిచిన, సైనికంగా సామర్థ్యం గల భాగస్వామిగా అమెరికాకు కనిపించింది. జాన్ కెన్నడీ తరువాత లిండన్ జాన్సన్ పాలనా కాలంలో అమెరికా ఆయుధ సహకారం విస్తరించబడింది. ముఖ్యంగా 1967 “ఆరు రోజుల యుద్ధంలో” ఇజ్రాయెల్ విజయం సాధించిన తరువాత, అది సోవియట్ మద్దతు పొందిన శక్తులను సమర్థంగా ఎదుర్కొనే ప్రాంతీయ శక్తిగా అమెరికా దృష్టిలో స్థిరపడింది.
1970లు, 1980లలో ఈ వ్యూహాత్మక అవగాహన మరింత బలపడింది. ఇజ్రాయెల్ అమెరికాకు మూడు కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని అందిస్తుంది. విస్తృత గూఢచార సహకారం అందించడం. అమెరికన్ ఆయుధ వ్యవస్థల యుద్ధపరీక్షలకు వేదికగా మారడం. పశ్చిమాసియాలో విశ్వసనీయ కేంద్రంగా పనిచెయ్యడం. దీనికి ప్రతిగా, అమెరికా ఆధునిక ఆయుధాలు, అంతర్జాతీయ వేదికల్లో దౌత్య రక్షణ, ఆర్థిక-సైనిక సహాయాన్ని అందిస్తుంది.
కాలక్రమేణా ఈ “ప్రత్యేక సంబంధం” మరింత సంస్థాగత రూపాన్ని సంతరించుకుంది. దీర్ఘకాలిక అమెరికా–ఇజ్రాయెల్ సైనిక సహాయ అవగాహన పత్రాలు (MoUs) ద్వారా నిధుల ప్రవాహం స్థిరంగా మారి, ప్రభుత్వ బడ్జెట్‌లో భాగమైంది. ఈ సహాయం ప్రధానంగా అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే Foreign Military Financing ద్వారా ఇజ్రాయెల్‌కు అందించబడుతుంది. దీని ద్వారా ఇజ్రాయెల్ అమెరికాలో తయారైన ఆయుధాలు, రక్షణ సేవలను కొనుగోలు చేస్తుంది.
1948 నుండి ఇప్పటివరకు, అమెరికా విదేశీ సహాయం అత్యధికంగా అందుకున్న దేశం ఇజ్రాయెల్. ప్రస్తుత 2019–2028 అవగాహన పత్రం ప్రకారం, అమెరికా 38 బిలియన్ డాలర్ల సహాయానికి అంగీకరించింది. దీనిలో 33 బిలియన్ సైనిక ఫైనాన్సింగ్‌కు, 5 బిలియన్ క్షిపణి రక్షణ కార్యక్రమాలకు కేటాయించబడింది. అంటే ప్రతి సంవత్సరం సుమారు 3.3 బిలియన్ డాలర్లు సైనిక గ్రాంట్ల రూపంలో, సుమారు 500 మిలియన్ డాలర్లు ఐరన్ డోమ్ (చిన్న దూర రాకెట్లను గాల్లోనే అడ్డుకునే వ్యవస్థ), డేవిడ్ స్లింగ్ (మధ్య దూర క్షిపణులను అడ్డుకునే శక్తివంతమైన వ్యవస్థ), ఆరో (దూరదూరం నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను ఆకాశంలోనే నాశనం చేసే అధునాతన వ్యవస్థ) వంటి రక్షణ వ్యవస్థల అభివృద్ధికి వెచ్చించబడుతున్నాయి. 2023 అక్టోబర్ 7 తరువాత పాలస్తీనాలో జరిపిన మారణహోమం నేపథ్యంలో, ఈ సహాయం మరింత పెరిగి, అవగాహన పత్రం కంటే అధికంగా అదనపు నిధులను అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.
రెండోది, ఈ సంబంధం స్థిరంగా కొనసాగడానికి అమెరికాలోని అంతర్గత రాజకీయ నిర్మాణాలూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా American Israel Public Affairs Committee (AIPAC) వంటి లాబీయింగ్ సంస్థలు కాంగ్రెస్‌లో ద్విపాక్షిక (డెమోక్రాట్ల, రిపబ్లికన్ల) మద్దతును నిలబెట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అందుకే అనేక మంది డెమక్రాట్లు కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలబడుతాము (We Stand With Israel) అని తమ ఆఫీసులకు బోర్డు తగిలించుకుంటున్నారు. వాషింగ్టన్‌లో అత్యంత ప్రభావవంతమైన విదేశాంగ లాబీలలో AIPAC ముందు వరుసలో ఉంటుంది. అది కాంగ్రెస్ (పార్లమెంట్) సభ్యులతో సంబంధాల పెంచుకొని, విధాన పత్రాల రూపకల్పనను ప్రభావితం చేస్తుంది. 2021 తరువాత, ఇది ఎన్నికల నిధుల సేకరణలో నేరుగా ప్రవేశించి PACలు, Super PACలు ద్వారా ఇజ్రాయెల్‌కు అనుకూల అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం, విమర్శాత్మక అభ్యర్థులను ఓడించడం కోసం విస్తృతంగా ఖర్చు చేయడం వంటి చర్యలను చేపట్టింది.
మూడవది, మతపరమైన అంశం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. ముఖ్యంగా కొన్ని క్రైస్తవ ఇవాంజెలికల్ సమూహాలు ఇజ్రాయెల్‌ను మతపరంగా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన దేశంగా భావించి దానికి బలమైన మద్దతు అందించాయి. ఈ మతపరమైన మద్దతు కూడా అమెరికా విదేశాంగ విధానాలపై ప్రభావం చూపింది.
నాలుగోది, జియోనిజం ప్రజాభిప్రాయం, మీడియా స్థాయిలో కూడా పనిచేస్తుంది. వార్తా ప్రసారం, సాంస్కృతిక చిహ్నాల నిర్మాణం, ప్రజా చర్చల ద్వారా ఇజ్రాయెల్‌ను ఒక ప్రజాస్వామ్య దేశంగా, పశ్చిమాసియాలో భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న దేశంగా చిత్రీకరించడం జరుగుతుంది. దీని వల్ల అమెరికా ప్రజల్లో ఇజ్రాయెల్ పట్ల అనుకూల దృక్పథం పెరిగింది. అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి చేసే అన్ని దుర్మార్గాలకు ఇంకా మద్దతు అందుతుంది.
7
ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని కేవలం సైనిక ఘర్షణగా చూడటం సరిపోదు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక పోరాటం. అందులో ఇరాన్ తన బలహీనతలను బలాలుగా మార్చుకుంటూ, అమెరికా, ఇజ్రాయెల్ ల సైనిక ఆధిక్యాన్ని నిర్మాణాత్మకంగా సవాల్ చేస్తున్నది. సంప్రదాయ యుద్ధంలో ఇరాన్ ఈ శక్తులతో సమానంగా ఉండకపోయినా, ఇది అసమాన యుద్ధం (asymmetric warfare) అనే వ్యూహాన్ని అవలంబించి, యుద్ధ నియమాలను మార్చేసింది.
ఇరాన్ వినియోగిస్తున్న తక్కువ ఖర్చు– అధిక ప్రభావం (low-cost, high-impact) సాంకేతికతలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వేల సంఖ్యలో తయారు చేయగల డ్రోన్లు, మధ్య, దీర్ఘ దూర క్షిపణులు, స్వదేశీ ఎలక్ట్రానిక్ యుద్ధ పద్ధతులు ఇవి అన్నీ కలిసి ఒక కొత్త రకమైన యుద్ధాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు, అమెరికా ఇజ్రాయెల్ ప్రతి దాడిని అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన క్షిపణులను వినియోగించాల్సి వస్తే, మరోవైపు ఇరాన్ కేవలం వేల డాలర్లతో తయారు చేసిన డ్రోన్లతో అదే ప్రభావాన్ని కలిగిస్తోంది. ఇది యుద్ధాన్ని కేవలం సైనిక పోరాటం కాకుండా ఆర్థికంగా క్షీణింపజేసే పోరాటంగా (economic attrition) మార్చుతోంది.
ఇరాన్ “యుద్ధాన్ని లాగడం” అనే వ్యూహం అత్యంత కీలకం. త్వరిత విజయం సాధించాలన్నది దాని లక్ష్యం కాదు. ప్రత్యర్థిని అలసిపోయే వరకు, ఖర్చు పెరిగే వరకు, రాజకీయ ఒత్తిడి పెరిగే వరకు యుద్ధాన్ని కొనసాగించడం దాని వ్యూహం. మిలిటరీ విశ్లేషణలు సూచిస్తున్నట్లుగా, ఇరాన్ తన దాడులను అమెరికా, ఇజ్రాయెల్ కు సహాయం చేస్తున్న ఇరాక్ తో సహా అన్ని గల్ఫ్ దేశాలకు (సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతార్, కువైట్, ఒమాన్, బహ్రెయిన్) యుద్దాన్ని విస్తరించి, శత్రువుల రక్షణ వ్యవస్థలను క్రమంగా ఖర్చు చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. నిజానికి, ఇరాన్ అంతర్జాతీయ గెరిల్లా యుద్ధం చేస్తుంది. ఇది వియత్నాం యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ కూడా శక్తివంతమైన అమెరికా సైన్యం ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక యుద్ధం చివరకు రాజకీయ పరాజయంగా మారింది.
ఇరాన్ వికేంద్రీకృత కమాండ్ లేదా కేంద్రీకరణ లేని ఆదేశ వ్యవస్థ (decentralized command), “హైడ్రా మోడల్” వ్యూహం దానిని పూర్తిగా కూల్చివేయడం కష్టతరం చేస్తోంది. వికేంద్రీకృత కమాండ్ అంటే యుద్ధ నిర్ణయాలు ఒకే కేంద్రంలో మాత్రమే కాకుండా, అనేక స్థాయిల్లో తీసుకునే విధానం. కేంద్ర నాయకత్వం ప్రధాన వ్యూహాత్మక దిశను నిర్ధారించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఉన్న విభాగాలు లేదా యూనిట్లు తమ పరిస్థితులకు అనుగుణంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటాయి. దీని వల్ల శత్రువు ఒక కేంద్రాన్ని లేదా నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నా, మొత్తం వ్యవస్థ కూలిపోదు. యుద్ధ సామర్థ్యం కొనసాగుతుంది. అంతేకాదు, ఈ విధానం వేగవంతంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
“హైడ్రా మోడల్” వ్యూహం అనే ఉపమానం గ్రీకు పురాణంలోని హైడ్రా అనే జీవి నుండి వచ్చింది. దాని ఒక తలను కోస్తే, మరో రెండు తలలు పెరుగుతాయి. యుద్ధ వ్యూహంలో దీని అర్థం ఏమిటంటే, ఒక భాగాన్ని లేదా నాయకత్వాన్ని నాశనం చేసినా, దాని స్థానంలో కొత్త భాగాలు లేదా నాయకత్వాలు అంతే వేగంగా పుట్టుకొస్తాయి. ఇరాన్ సందర్భంలో, ఇది అనేక స్వతంత్రంగా పనిచేసే నెట్వర్క్‌లు, మిత్రబలగాలు, ప్రాంతీయ భాగస్వాముల ద్వారా అమలు చేయబడుతుంది. కాబట్టి, శత్రువు ఒక లక్ష్యాన్ని ధ్వంసం చేసినా, మొత్తం వ్యవస్థ బలహీనపడకుండా, తిరిగి పునరుద్ధరించబడే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఇరాన్ భౌగోళిక పరిస్థితి దానికి ఎంతగానో కలిసొచ్చే అంశం. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిపై దాని ప్రభావం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు అత్యంత కీలకం కావడంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే దాని ప్రభావం కేవలం ప్రత్యర్థి దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచానికి వెళ్లే చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ చిన్న అంతరాయం జరిగినా చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసులు దెబ్బతినడం, ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడం వంటి పరిణామాలు వెంటనే కనిపిస్తాయి.
రాజకీయ పరంగా ఈ పరిస్థితి ప్రత్యర్థి దేశాలకు (ప్రత్యేకంగా అమెరికా, ఇజ్రాయెల్‌కు) ద్వంద్వ సవాలుగా మారుతుంది. ఒకవైపు వారు ప్రాంతీయ భద్రతను కాపాడాల్సిన అవసరం ఉంటుంది; మరోవైపు యుద్ధం విస్తరించకుండా నియంత్రించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ, ఆ సమతుల్యతను సాధించడం చాలా క్లిష్టం. ఎందుకంటే దాడి–ప్రతిదాడి చక్రం విస్తరించినప్పుడల్లా అది ఇతర గల్ఫ్ దేశాలు, అంతర్జాతీయ మిత్రబలగాలు, సముద్ర మార్గాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ రాజకీయాల్లో అనిశ్చితి పెరిగి, కూటముల మధ్య ఉద్రిక్తతలు కూడా అధికమవుతాయి. ముఖ్యంగా, అమెరికా మిత్రదేశాల మధ్య కూడా ఈ అంశంపై పూర్తి ఏకాభిప్రాయం కనిపించడం లేదు. కొన్ని యూరోపియన్ దేశాలు సైనికీకరణ కంటే దౌత్యపరమైన పరిష్కారాలను ప్రాధాన్యం ఇవ్వడం, అమెరికా కూటమి నిర్మాణంలో విభేదాలను సూచిస్తుంది. కొన్ని యురోపియన్ దేశాలు “ఇది మా యుద్ధం కాదని” ట్రంప్ మొహం మీదనే చెబుతున్నాయి. ఈ పరిస్థితి, అమెరికా ఆధిపత్యం కేవలం సైనిక శక్తిపై మాత్రమే ఆధారపడదని, అది మిత్ర బలగాల సమ్మతి, దౌత్య నమ్మకం, రాజకీయ సమన్వయంపై ఆధారపడుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఒకరకంగా ఇరాన్ ఈ యుద్ధం అధారంగా అమెరికాను ప్రపంచం ముందు అవమానపరచడమే కాదు దాని ఆధిపత్యానికి గండికొడుతుంది. (humiliation and exhaustion of hegemony) .
గల్ఫ్ దేశాల చుట్టూ రక్షణ బేస్ లను నిర్మాణం చేసి “మేమే మిమ్ముల కాపాడగలుగుతామని” హామీపడిన అమెరికా ఆ పని చేయడంలో విఫలమయింది. అమెరికా భద్రతా హామీ మునుపటిలా నమ్మదగినది కాదని గల్ఫ్ దేశాలు భావించడం ప్రారంభిస్తే, దాని ప్రభావం కేవలం రక్షణ రంగానికే పరిమితం కాదు. అది రాజకీయ కూటములు, పెట్టుబడి సర్క్యులేషన్, చమురు ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆధిపత్యంపైకి విస్తరిస్తుంది. ఇటీవల రాయిటర్స్ నివేదికలు చెప్పినట్లు, ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల్లో ఒక ముఖ్యమైన పునర్విమర్శను ప్రారంభించింది. అమెరికా స్థావరాలు, రాడార్లు, సైనిక సహకారం ఉన్నప్పటికీ, ఆ దేశాలను ఇరానియన్ ప్రతిదాడులకు ప్రధాన లక్ష్యాలుగా మార్చాయని భావన బలపడింది.
ఈ సందర్భంలో రాజకీయ పరంగా గల్ఫ్ దేశాల ప్రతిస్పందన మూడు దిశల్లో సాగవచ్చు. మొదట అవి అమెరికాతో సంబంధాలను పూర్తిగా తెంచుకోకపోయినా, “ఒకే భద్రతా ఆధారం” అనే నమూనా నుంచి “బహుళ భద్రతా భాగస్వామ్యాల” వైపు కదలవచ్చు. అంటే, అమెరికాతో సైనిక సంబంధాలు కొనసాగుతూనే, చైనా, టర్కీ, యూరోపియన్ దేశాలు, అవసరమైతే ఇరాన్‌తో కూడ పరిమిత వ్యవహారాత్మక సంబంధాలను పెంపొందించవచ్చు. రెండోది, ప్రాంతీయ ఉద్రిక్తతల నుంచి తమను తాము కొంత దూరంగా ఉంచుకోవడానికి, తమ భూభాగాన్ని ప్రత్యక్ష దాడుల కోసం వినియోగించరాదనే విధానాన్ని తీసుకోవచ్చు. మూడోది, భద్రతా వ్యవస్థను స్థానికీకరించే ప్రయత్నం చెయ్యవచ్చు. అంటే స్వదేశీ క్షిపణి రక్షణ, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, సైబర్ భద్రత, ప్రాంతీయ సమన్వయంపై మరింత పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మార్పు అమెరికా వ్యతిరేకత కంటే, అమెరికా రక్షణ సామర్థ్యం, అమెరికా వల్ల వచ్చే ప్రమాదం రెండింటినీ ఒకేసారి లెక్కించే యథార్థవాద రాజకీయ దిశగా అర్థం చేసుకోవాలి.
ఆర్థికంగా, ఈ పరిస్థితి ఇరాన్‌కు ఒక వ్యూహాత్మక ఆధిక్యంగా మారుతుంది. చమురు ధరలు పెరిగినప్పుడు, ఆంక్షలున్నప్పటికీ ఇరాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. అంతేకాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగినప్పుడు, ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే దేశాలు తమ అంతర్గత ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఇరాన్‌పై కఠిన విధానాలను కొనసాగించడం వారికి కష్టతరం అవుతుంది.
డాలర్ ఆధిపత్యం ఇప్పటికీ బలంగా ఉన్నప్పటికీ, ఆంక్షల రాజకీయీకరణ, చమురు వాణిజ్యంలో అస్థిరత పెరగడం వల్ల, కొన్ని దేశాలు (ముఖ్యంగా చైనా, రష్యా) ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాలను అన్వేషించే దిశగా కదులుతున్నాయి. ఇది తక్షణ పతనాన్ని సూచించకపోయినా, డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నెమ్మదిగా పెరుగుతున్న నిర్మాణాత్మక ఒత్తిడిని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో, ఇరాన్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు, కరెన్సీ వ్యవస్థలను ప్రయోగాత్మకంగా వినియోగించడం ద్వారా, ప్రస్తుత ఆర్థిక క్రమానికి పరిమితంగానైనా ప్రతీకాత్మక సవాలును విసురుతున్నాయి.
ఇంకా ఒక ముఖ్య అంశం, ఇరాన్‌కు ఉన్న ప్రాంతీయ మిత్రబలగాల నెట్వర్క్ (లెబనాన్, సిరియా, యెమెన్, రష్యా, చైనా). ఈ నెట్వర్క్ ద్వారా ఇరాన్ వివిధ ప్రాంతాల్లో ఒత్తిడిని సృష్టించగలదు. దాని వల్ల ప్రత్యర్థి దేశాలు ఒకేసారి అనేక మార్గాల్లో ప్రతిస్పందించాల్సి వస్తుంది. ఫలితంగా వారి వనరులు విభజించబడి, వ్యూహాత్మకంగా బలహీనపడే అవకాశం ఉంటుంది.
ఇరాన్ వంటి సంక్షోభాలు అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి అవసరమైన ఖర్చును పెంచుతున్నాయి. మిత్ర బలగాల ఐక్యతను పరీక్షిస్తున్నాయి. ప్రపంచ రాజకీయ వ్యవస్థలో బహుళ శక్తి కేంద్రాల ఆవిర్భావాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఈ దృష్టిలో, ఇది ఒక తక్షణ పతనం కాదు. కానీ, ఆధిపత్యం క్రమంగా మారుతున్న, విభజితమైన, సవాళ్లతో కూడిన ఒక కొత్త ప్రపంచ క్రమానికి మార్పును సూచించే ప్రక్రియగా అర్థం చేసుకోవాలి.
అత్యంత ముఖ్యంగా, ఇరాన్‌కు ఉన్న ప్రజా మద్దతు, జాతీయ, మత సమ్మతమైన ఈ యుద్ధాన్ని కేవలం ప్రభుత్వ యుద్ధంగా కాకుండా, ఒక సామూహిక ప్రతిఘటనగా మారుస్తున్నది. బాహ్య దాడులు దేశంలో అంతర్గత విభేదాలను తగ్గించి, “రక్షణ యుద్ధం” అనే భావనను బలపరుస్తాయి. ఇది వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ వంటి యుద్ధాల్లో కూడా కనిపించిన అంశమే.
అందువల్ల, ఈ యుద్ధం ఒక ముఖ్యమైన పాఠాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది: ఆధునిక యుద్ధంలో విజయం కేవలం సైనిక శక్తితో నిర్ణయించబడదు. వ్యూహం, కాలవ్యవధి, ఖర్చు, ప్రజా మద్దతు ఇవి అన్నీకలిసి ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఈ దృష్టిలో చూస్తే, ఇరాన్ కేవలం యుద్ధాన్ని ఎదుర్కొనడం లేదు. దాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది.
బహుశా ఈ యుద్ధం తర్వాత అమెరికా ఆధిపత్యం మొన్నటిలా ఉండకపోవచ్చు. కేవలం ఉపమానంగా “సామ్రాజ్యవాదం కాగితం పులి” అనే వాళ్ళం. కానీ, అది నిజంగానే కాగితం పులని తేలిపోయింది. “పెద్ద తుపాకి, చిన్న తుపాకి” అని పిట్ట కథలు చెప్పేవాళ్ళకు ప్రజాశక్తి ఏం చెయ్యగలదో ఇరాన్ నిరూపించి చూపింది. బలవంతుడినని విర్రవీగుతూ బలుపు యుద్ధాలు చేసే అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని నగ్నంగా నడి వీధిలో నిలబెట్టగలిగింది.