9 ఆగస్టు 2014 నాడు ‘సదాశివం’ నిద్రలేచినప్పటి నుంచి మొదలైన నవల ఫిబ్రవరి 2020 లో సదాశివం శాశ్వత నిద్రలోకి వెళ్లి పోయినప్పుడు ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో నవల అనేక అస్తిత్వాలను చర్చకు పెడుతూ, ప్రశ్నిస్తూ, సమాధానం చెబుతూ, ఎన్నో సంఘటనల వైపు నుండి, ఎన్నో అస్తిత్వాలవైపు నుండి, ఎన్నో వేదనల వైపు నుండి, ఎన్నో విధ్వంసాల వైపు నుండి, ఎన్నో అమరత్వాల వెైపు నుండి, ఎన్నో త్యాగాల వెైపు నుండి సాగిపోతుంది. ముఖ్యంగా నవల కథానాయిక సాధన ద్వారా అనేక అస్తిత్వాల ప్రశ్నల చిక్కుముడులకు సమాధానం చెప్పిస్తాడు పాణి. నిజానికి పాణి ఈ నవల రాయడం పెద్ద సాహసమే అనవచ్చు. చిన్న కరపత్రం కూడా చదివే ఓపిక లేని, కొంచెం పెద్ద వ్యాసం లాంటివి వాట్సాప్ గ్రూప్ లలో వస్తే కూడా చదవగలిగిన వారు లేని తరంలో నిలబడి 833 పేజీల నవల రాయడం సాహసమే (ముందుమాటలు చివరి మాటలు కలిపితే 864 పేజీలు). హుస్సేన్ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల ఉత్తర తెలంగాణ ‘పీపుల్స్ వార్’ చరిత్రను ‘సింగరేణి కార్మిక సమాఖ్య’ రోమాంచిత చరిత్రను మన ముందు ఉంచితే, ఈ నవల (అనేక వైపుల) కర్నూలు పట్టణాన్ని కార్యస్థలంగా చేసుకొని నల్లమల ఉద్యమాన్ని చర్చించుకుంటూ, దండకారణ్యం దాకా సాగిపోయి పాఠకుని అనేక ప్రశ్నలకు సమాధానం అక్కడ చూపిస్తుంది.
2014 జూన్ లో తెలంగాణ ఏర్పడ్డాక సాధన కర్నూల్ పోతుంది. అక్కడ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కొనసాగిస్తున్న సుదర్శన్ సార్, వెంకట్రెడ్డిలతో కలిసి రాయలసీమ సమస్యలపై పోరాటాలు మొదలపెడుతుంది. సాధన పాత్రను పాణి చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో మలిచాడు. ‘గ్రామాలకు తరలండి’ లో భాగంగా కర్నూలు పట్టణంలో పీపుల్స్ వార్ ఆర్గనైజర్ గా రఘు మాదిగ వాడలో ఆశ్రయం పొందుతూ అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేస్తుంటాడు. నిజానికి భారతదేశంలో అన్ని ఉద్యమాలను ఉద్యమకారులను తమ కడుపులో పెట్టుకొని చూసుకున్నది సామాజికంగా అట్టడుగున ఉన్న మాదిగ మాలవాడలే. రఘు ద్వారా చైతన్యవంతమైన మేరి కూడా సాయుధ పోరాటానికి సిద్ధపడి, నల్లమలలో దళంలో చేరిపోయి సుజాతగా, నాయకురాలుగా ఎదిగి రఘుతో జీవితాన్ని పంచుకుంటుంది. వారిద్దరికి పుట్టిన బిడ్డనే సాధన. బిడ్డ పుట్టిన రెండు నెలలకే ఉద్యమ సానుభూతిపరులైన సత్యం- సుధల దగ్గర వదిలి దండకారణ్యం వైపు వెళ్లి పోతారు. సాధనకు ఆరేళ్లప్పుడు సుధా అరెస్టు అయితే మళ్లీ శ్రీనివాసులు విజయలక్ష్మి దగ్గర పెరుగుతుంది సాధన. శ్రీనివాసులు విజయలక్ష్మిలు సొంత తల్లిదండ్రుల ఆలోచనలకు, ఆచరణకు, అనుగుణంగానే అదే అవగాహనతో సాధనను పెంచుతారు.
ఉద్యమకారులు పిల్లలను బయట సానుభూతి పరుల దగ్గర వదిలి వారు పోరుబాటలోకి పోవడం అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో చాలా సంఘటనలు ఉన్నాయి. చాలామంది పెంచిన తల్లిదండ్రులు తమ ఆలోచనల ప్రకారం పెంచి, ఆ పిల్లలకు వారి కన్నతల్లిదండ్రుల ఉద్యమం గురించి, వారి త్యాగాల గురించి కూడా తెలియకుండా పెంచినవారు ఉన్నారు. కనీసం వారి నీడ కూడా ఈ పిల్లల మీద పడకుండా పెంచినవారు కూడా ఉన్నారు. పెంచిన తల్లిదండ్రులకున్న డాలర్ మోజులో ఆ బిడ్డల సొంత తల్లిదండ్రుల చరిత్ర కూడా పిల్లలకు తెలియజేయుని కుటుంబాలను నేను చూశాను. సాధనను చూసిన తర్వాత ఉద్యమకారుల పిల్లలను వారి ఆశయాలకు అనుగుణంగా ఎలా పెంచాలో మనకు అర్థమవుతుంది. సాధనకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు శ్రీనివాసు ఏదో పని ఉందని చెప్పి అడివిలోకి తీసుకుపోతాడు. అప్పటికే మేరీ అలియాస్ సుజాత అమరురాలు అయి ఉంటుంది. రఘు మాత్రమే కలుస్తాడు. అప్పుడు అక్కడ సాధనకు మొదటిసారి సొంత తండ్రి గురించి, ఆయన కార్యారంగం గురించి తెలుస్తుంది. సాధన తండ్రిని కలుసుకునే సన్నివేశంలో సాధనతో పాటు మనము (పాఠకుడు) కూడా అడవిలోకి వెళ్ళిపోయి, ఆ ఉద్విగ్న క్షణాలను అనుభవిస్తాం. విప్లవం ఎంత గొప్పది ఎన్ని త్యాగాలు, మాతృత్వాన్ని వదులుకోవడము, పితృత్వాన్ని వదులుకోవడము, పిల్లలు తల్లి ముఖం, తల్లి పిల్లల ముఖం చూడకుండానే అమరత్వం పొందడము, ఎంత గొప్ప కమిట్ మెంట్. అమ్మ ఎలా ఉంటుందో కూడా సాధనకు తెలియదు. రఘు జేబులోనుండి మేరి ఫోటో తీసి సాధన తో పోల్చుకునే సన్నివేశం, మొదటిసారి తల్లి ఫోటో చూసిన సాధన మానసిక స్థితికి మన గుండె కింద తడి కదిలి కళ్ళ ద్వారా బయటకు వస్తుంది. ఇలాంటి సన్నివేశాలు నవలలో అనేకం ఉంటాయి. చదువుతూ చదువుతూ మనం కదిలిపోతాం. ఆ కదలికలు మనల్ని నిద్రలో కూడా వెంటాడుతాయి.
సాధన శ్రీనివాసులు విజయలక్ష్మి ప్రతిభ (శ్రీనివాసులు చిన్న కూతురు) రామస్వామి సంకమ్మల ఇంటికి పోతారు. సాధనను, ఆమెను పెంచిన తల్లిదండ్రులను చూసి రామస్వామి సంకమ్మ లు చాలా ఆనందపడతారు. మాటల సందర్భంలో విజయలక్ష్మి రామస్వామిని ‘నాయనా ‘ అని పిలుస్తుంది. దానికి రామస్వామి కదిలిపోతాడు. ఆయన కదలికల ప్రకంపనలు మనకు కూడా తాకుతాయి. పాణి ఈ నవలలో మొత్తం సమాజం మోసుకు తిరిగే దుఃఖాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ‘వాడు రామస్వామి గాడు, మాదిగోడు’ అని పిలిపించుకున్న రామస్వామి ఇవాళ గొప్ప చదువులు చదువుకున్న, తెలియని వ్యక్తులు ‘నాయనా’ అని పిలవడానికి కారణం తమ బిడ్డ మేరమ్మనే కదా అనుకుంటాడు. ఈ దేశంలో మనిషి మనిషిగా ఏనాడు గుర్తించబడలేదు. అంటరానివాడిగా, మాదిగోడిగా, మాలోడిగా, కుమ్మరోడిగా, చాకలోడిగా, ఇలా కులం అస్తిత్వంలోనే గుర్తించబడ్డాడు. రామస్వామి కూడా అలాగే ‘మాదిగ రామస్వామి గాడు’ గా గుర్తించబడ్డాడు. 2014 తర్వాత మతం అనే అస్థిత్వం ముందుకు వచ్చింది. అది విపరీత పోకడలు పోతూ తురుకోడిగా, కిరస్థానివాడిగా, అవమానకరమైన గుర్తింపుగా ముందుకు వచ్చింది. అందుకే బిస్మిల్ చాంద్ ను ఇస్మాయిలును ఉద్దేశించి సాధనతో మొదట వాళ్ల గడ్డాలు తీయించు రాయలసీమైన ఏదైనా తర్వాత అన్నప్పుడు మతం ఎంతగా మన నర నరాల్లో ఇంజక్ట్ చేయబడిందో అర్థం అవుతుంది. బిడ్డలు ఉద్యమంలోకి పోయిన తర్వాత అలా గౌరవింపబడే అనేక మాల మాదిగ కుటుంబాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేకం ఉంటాయి. రామస్వామి తన బిడ్డ మేరి రూపాన్ని సాధనలో చూసుకుంటాడు. సాధన ప్రేమలో రఘు కనిపిస్తాడు సంకమ్మకు. రఘు అలియాస్ నల్లా ఆదిరెడ్డిని నేను చూడలేదు కానీ ‘తల్లులు బిడ్డలు’ నవల చదివిన తర్వాత ఆయన పని విధానం ఆయన అవగాహన ఆచరణ తెలిసింది. సరిగ్గా ‘అనేక వైపుల’ నవల లో కూడా రఘు గురించి చదువుతున్నప్పుడు మనకు నల్లా ఆదిరెడ్డి గుర్తుకొస్తాడు.
నంద్యాల ప్రాంతం నుండి దండకారణ్యం లోకి పోయిన ‘రసూల్’ వాళ్ళమ్మ సుల్తానా జ్ఞాపకం వచ్చిన ప్రతి సందర్భంలో తన అనుభవాల గురించి, ఉద్యమంలో జరుగుతున్న సంఘటనల గురించి, అమ్మకు చెబుతున్నట్లుగా డైరీ రాసుకుంటాడు. దాన్ని సాధన సుల్తానకి ఇస్తుంది. ఆ డైరీ ని సుల్తానా కన్న కొడుకు లాగే అపురూపంగా చూసుకుంటుంది. ఆ డైరి ద్వారా మనకు దండకారణ్య ఉద్యమాన్ని అక్కడ ‘జనతన సర్కారు’ స్వరూపాన్ని చెబుతాడు రచయిత. జనతన సర్కారు గురించి వినడమే కానీ దాని నిర్మాణం తెలియదు. రసూల్ రాసిన ఉత్తరాల ద్వారా అక్కడ సర్కారు ఎలా పని చేస్తుంది? ఎవరెవరు ఉంటారు? చాలా బాగా అర్థమవుతుంది. ‘నందే’ లాంటి ఆదివాసి ఆడవి బిడ్డ డాక్టర్గా సేవలందించే అద్భుతమైన దృశ్యం మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతుంది. కలెక్టర్ ని కిడ్నాప్ చేసిన సంఘటన గురించి రసూల్ వాళ్ళ అమ్మకు సవివరంగా తెలియజేసిన విధానం మావోయిస్టు పార్టీ యొక్క మానవత్వపు మాధుర్యం మనకు తెలుస్తుంది. నక్సలైట్లు ప్రభుత్వాన్ని శత్రువుగా చూడరు కానీ ప్రభుత్వ విధానాలను మాత్రమే చాలా సీరియస్ గా వ్యతిరేకిస్తారు. ఇది చాలామందికి అర్థం కాదు. ఇవాళ మధ్య భారతంలో అడవిలోని ఆదివాసీల కాళ్ళ కింద నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను తవ్వుకోవడానికి బహుళ జాతి కంపెనీలకు అప్పగించింది భారత ప్రభుత్వం. ఈ దేశ సంపదను అలా విదేశీ కంపెనీలు దోచుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. దానికి ప్రభుత్వం వారిపై చివరి యుద్ధం (ఆపరేషన్ కాగార్) ప్రకటించింది. ఆ యుద్ధంలో కలెక్టర్ కు ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే వైపు ఆయన నిలబడ్డారు. అటువంటి కలెక్టర్ వారికి దొరికితే అతనితో ఎంతో మానవీయంగా వ్యవహరించి వదిలిపెట్టిన సంఘటన చాలా వివరంగా చెపుతాడు రసూల్. 2021 లో రాఖేశ్వర్ సింగ్ మన్హాస్ అనే పోలీస్ కమాండర్ దొరికితే కూడా వదిలిపెట్టారు. ఈ రాఖేశ్వర్ సింగ్ అయితే వారిని చంపడానికే ఛత్తీస్ ఘడ్ పోయాడు. శత్రువుగా భావించక, చంపకుండా వదిలిపెట్టారు. అదొక యుద్ధనీతి. శత్రు శిబిరంలో ఉన్న వారిని వదిలిపెట్టగలిగే మానవీయ కోణం ఉన్నవారు వారితోపాటు ఉండి వారితో కలిసి నడిచిన బంటి రాధ అలియాస్ నీల్సోను చంపారంటే నిజంగానే ఆమె చేసిన ద్రోహం బహుశా శత్రువు కంటే ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తుంది. నాకు రసూల్ రాసిన కలెక్టర్ సంఘటన చదువుతున్నంతసేపు బంటి రాధనే గుర్తుకొచ్చింది. గతంలో నక్సలైట్లు కిడ్నాప్ చేసిన దాసరి శ్రీనివాసులు అనే ఐఏఎస్ ఆఫీసర్ ను ఏదో ఒక టీవీ ఛానల్ ఇంటర్వు చేస్తూ నక్సలైట్ల పైనా మీ అభిప్రాయం చెప్పండి అన్నప్పుడు ఆయన వాళ్ళ కంటే మానవత్వం వున్నవాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండరు అన్నాడు. ఆ మానవత్వపు మాధుర్యాన్ని మనం నవల చదువుతూ అనుభవిస్తాము.
“…ఘటనా స్థలం నుంచి విప్లవకారులు రాశారు. ఆ వేగానికి కొంతమంది దిగ్భ్రాంతి చెందారు. యుద్ధం మధ్యలో నుంచి నివేదికలు…” అని ఒక దగ్గర రాస్తాడు పాణి. సరిగ్గా నేను ఈ నవల చదువుతున్నప్పుడే 5000 మంది బలగాలతో పోలీసులు మావోయిస్టులపై దాడి జరిపి భీకర యుద్ధం జరుగుతుందని అందులో 12 మంది చనిపోయారని పోలీసులు ప్రకటించారు. సరిగ్గా యుద్ధం మధ్యలో నుంచి ఒక పత్రికా ప్రకటన దూసుకొచ్చింది అది మావోయిస్టు పార్టీ పేరు మీద. యుధ్ధం మధ్యలోనుంచే కదా? “నిత్యం పదిమంది 15 మంది 30 మంది కుప్పలుగా శవాలు. శత్రువు అంతగా చొచ్చుకు పోతున్నాడు. అడవుల్లోకే కాదు, స్థావరాల్లోకే కాదు, ప్రజల ఆంతరంగిక జీవితాల్లోకి” అంటాడు ప్రధాన్ ఒక సభలో సరిగ్గా ఇవాళ ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్న మారణహోమం చూస్తుంటే నవల గతం చెబుతున్నట్లుగా ఉంది కాని వర్తమానాన్ని ఆవిష్కరిస్తున్న భవిష్యత్తు కూడా. ఇంకా ప్రధాన్ (గంటి ప్రసాదం పాత్ర కావచ్చు) ఏమంటాడంటే “…ఈ యుద్ధం దుర్మార్గమైనది అనుకోవడం లేదు. పాలకవర్గము అలాంటి యుద్ధం చేసే దశకు విప్లవోద్యమం ఎదిగింది అంటాడు. నేడు జరుగుతున్న యుద్ధాన్ని మనం కూడా అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. సాధన పాత్ర అనేక అస్థిత్వ ఉద్యమాలు ముందుకు తెస్తున్న ప్రశ్నలకు సమాధానంగా ఉంటే, ప్రధాన్ పాత్ర అస్తిత్వ ఉద్యమాలకు విప్లవోద్యమానికి వారధిగా ఉంటూ ప్రతి సమస్యను విప్లవోద్యమానికి అనుసంధానం చేసుకుంటూ అక్కడి నుండే పరిష్కారము ఆలోచిస్తాడు. “…పేచీలు ఉన్నట్లే కలిసేవి కూడా ఉంటాయి కదా” అన్న సాధన మాట ఎంతో గొప్పది. బహుజన వాదానికి విప్లవశక్తులకు పేచీలు, అంతరాలు ఉన్నాయి. అంతమాత్రాన శత్రువులు కాదు కదా? వారిలో కలిసిపోయే అంశాలను మనం చూడాలి కదా. సరిగ్గా ఇక్కడ నాకు పౌరహక్కుల పురుషోత్తం గుర్తుకొచ్చాడు. ఆయన కూడా అలాగే ఆలోచించేవాడు ఎవరిని దూరం చేసుకునేది లేదు. అవతలి వ్యక్తి ఏ మేరకు పని చేయగలిగితే ఆమేరకు చేయమని చెప్పేవాడు. అందరితో కలసి పోయేవాడు. అందుకే ఆయనను అన్ని అస్థిత్వాల ప్రజలు ఇష్టపడతారు. ‘అర్బన్ నక్సలైట్ ‘ అన్న పదాన్ని కూడా పాజిటివ్ గా చూస్తుంది సాధన. ఈ మాట చదివాక నాకు 2003లో నా మీద మా మిత్రుడు మద్దిలేటి మీద నక్సలైట్ల ఫోటోలతోపాటు మా ఇద్దరి ఫోటోలు పెట్టి పోస్టర్లు వేశారు. పోలీసులు మమ్మల్ని పీపుల్స్ వార్ సెంట్రల్ ఆర్గనైజర్స్ అని ప్రచారం చేశారు. సరిగ్గా అప్పుడు నేను వేరే గ్రామానికి బదిలీపై వెళ్లాను. మా పాఠశాల చుట్టుపక్కల బస్టాండ్ దగ్గర ఈ పోస్టర్స్ వేశారు. నిజానికి పోలీసులు నన్ను బ్లేమ్ చేయాలనుకున్నారు. కానీ ఆ గ్రామంలో ఆ సంఘటన తర్వాత గౌరవం పెరిగింది. ప్రజలు చాలా ప్రేమగా చూసుకున్నారు.
నవల రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్య లోతులను కూడా వివరిస్తుంది. సుదర్శన్ సార్ ద్వారా, వెంకటరెడ్డి ల ద్వారా రాయలసీమ సమస్యలను, ప్రత్యేక రాయలసీమ ఆవశ్యకతను ముందుకు తీసుకువస్తాడు పాణి. ఎలాగైతే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కుదుర్చుకున్న”పెద్ద మనుషుల” ఒప్పందం ఉల్లంఘనకు గురయిందో సరిగ్గా రాయలసీమ కూడా శ్రీ భాగ్ ఒప్పందం ఉల్లంఘనకు గురయింది. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ కాబట్టి, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కలిగి ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం కాగలిగింది. రాయలసీమలో కూడా ఆ డిమాండ్ కొంతమంది మేధావులు “రాయలసీమ విద్యావంతుల వేదిక” చేస్తున్నప్పటికీ బలమైన ఉద్యమ నిర్మాణం జరగలేకపోయింది. అలా జరగకపోవడానికి రాయలసీమకి ప్రత్యేకమైన ఫ్యాక్షనిజం అనే అస్థిత్వం కూడా కారణం కావచ్చు. రాయలసీమ నుండి నీలం సంజీవరెడ్డి, దామోదర సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్, లాంటి వాళ్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టి తెలంగాణలో టిఆర్ఎస్ లాగా ఒక ఊపు తెద్దామని ప్రయత్నించినప్పటికీ ఆయన పైన ప్రజలకు ఉండే అభిప్రాయం వలన అది కూడా సఫలం కాలేదు. పైగా ఆయనకు ఆర్డీఎస్ సెట్టర్లు పగలగొట్టిన ఘన చరిత్ర ఉంది. కనుక ప్రజలు నమ్మలేదు. ఈ మొత్తం సమస్యలను నవల చాలా వివరంగా చర్చకు పెడుతుంది. తెలంగాణ ప్రజలకు మొదటి నుండి రాయలసీమ వెనుకబాటం తనం పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, తెలంగాణ ఉద్యమం సీరియస్ గా మొదలైన ప్రతిసారి ప్రత్యేక రాయలసీమ ఉద్యమం గురించి మాట్లాడడం వల్ల తెలంగాణా లో చాలామంది మా ఉద్యమాన్ని ఐసోలేషన్ చేయడానికే రాయలసీమను ముందుకు తెస్తున్నారని ఇది రెండున్నర జిల్లాల ఆంధ్రనాయకుల కుట్ర అనే అభిప్రాయం ఏర్పడింది. పౌర హక్కుల సంఘంలో కూడా ఈ చర్చ మొదలైన ప్రతిసారి ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విషయంలో ప్రొఫెసర్ శేషయ్య చాలా వివరణాత్మకంగా రాయలసీమ కరువు గురించి, వెనకబాటు తనం గురించి, నీళ్లు లేక ఎండిపోతున్న భూమి గురించి, నెర్రలు బారి నోళ్లు తెరిచిన పొలాల గురించి, ఆవేదనతో గుండెలు పిండేసే సంఘటనలు చెప్పి వివరించేవాడు. కానీ తెలంగాణకు సంబంధించిన మొత్తం పౌర హక్కుల సంఘం క్యాడరు దాన్ని సానుభూతిగా అర్థం చేసుకుంటూనే తెలంగాణా ఏర్పాటు ఉద్యమము జరుగుతున్నప్పుడే మీరు ఎందుకు రాయలసీమను ముందుకు తెస్తారు అని మాట్లాడేది.
‘అనేక వైపుల’నవల చదివిన తర్వాత ప్రజాసంఘాలలోని వ్యక్తులు తోటి వ్యక్తుల పట్ల, సంఘాల పట్ల, ఎలా ఉండాలి ఎలా అర్థం చేసుకోవాలి స్పష్టంగా అర్థం అవుతుంది. దళిత ఉద్యమాలలో సీరియస్ గా తిరుగుతూ చర్చలలో పాల్గొన్న ప్రతిసారి సాధనను, సాధన నమ్మే సిద్ధాంతాన్ని వ్యతిరేకించి మాట్లాడే జెన్ని ని సాధన ఏనాడు వ్యతిరేకించదు. అందుకే జెన్నితో పేచీలు ఉన్నట్లే కలిపేవి కూడా ఉంటాయి కదా అనుకుంటుంది. జెన్ని లాంటి హార్డ్ కోర్ దళితవాది కూడా సాధన ను ఇష్టపడుతుంది. సాధన ఒక సందర్భంలో జెన్ని ఇంటికి పోతుంది. జెన్నీ ఆశ్చర్య పోతుంది. అమితంగా సాధనను ప్రేమిస్తుంది. నేడు పనిచేస్తున్న ప్రజా సంఘాల నాయకులు అందరూ ప్రధాన్ ను, సాధనను వాళ్ళ ఆచరణను, అవగాహనను, అర్థం చేసుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వ్యక్తులను దూరం చేసుకోవడం లాంటి విషయాలు లేకుండా చూసుకోవాలి. నేడు ప్రజా సంఘాలు చిన్నచిన్న పేచీలను ముందుకు తీసుకువచ్చి పెద్దగా చూసి, కలిసిపోయే అంశాలను చిన్నగా చేసి దూరం చేసుకుంటున్న క్రమంలో నుండి బయటపడాలంటే తప్పక ‘అనేక వైపుల’ నవల చదవాల్సిందే. అందులో ఇటువంటి వాటికి అన్నిటికి సాధన ద్వారా ప్రధాన్ ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. అందరూ తప్పక చదవాలని గట్టిగా కోరుకుంటూ…
రాజానందం గారు నవల నాడీ వ్యవస్థను సూక్ష్మ స్థాయిలో పట్టుకున్నారు. సాధన ప్రధాన్ లో దగ్గర ప్రతి ప్రశ్నకు తర్కబద్ధమైన సమాధానం లభిస్తుంది . విప్లవాన్ని కేవలం రాజకీయ ఆచరణగా మాత్రం గాక తాత్వికార్థంలో నిర్వచించిన మంచి నవలపై చక్కటి సమీక్ష అందించినందుకు కృతజ్ఞతలు.