అది సాధ్యమే

మహమ్మద్ దార్విష్

ఇది సాధ్యమే
కనీసం కొన్నిసార్లు
జైలు గది నుంచి ఒక గుర్రం మీద సవారీ చేస్తూ
పారిపోవడం
ప్రత్యేకించి ఇప్పుడు సాధ్యమే

జైలు గోడలు అదృశ్యమై
జైలు గది సరిహద్దులు లేని
సుదూర సుక్షేత్రం కావడం
ఇప్పుడు సాధ్యమే

నువ్వు గోడలనేం చేసావు
నేను వాటిని తిరిగి కొండలకిచ్చేసాను
మరి కప్పునేం చేసావు?
నేను దానిని (గుర్రం) జీనుగా మలిచాను
నిన్ను కట్టేసిన గొలుసు?
దానిని పెన్సిల్ గా చెక్కాను.

జైలు కాపలాదారుకు
కోపం వచ్చింది
నాతో సంభాషణ ముగించి
నాకు కవిత్వం అంటే
లక్ష్యం లేదు అంటూ
నా జైలు గది తలుపుకు తాళం వేసి పోయాడు
నన్ను చూడడానికి
మర్నాడు ఉదయం వచ్చాడు
నన్ను చూసి అరిచాడు

ఇక్కడ ఈ నీళ్లన్నీ ఎక్కడివి?
నేను నైలు గది నుంచి తెచ్చాను
ఈ చెట్లు?
డెమాస్కస్ తోటల నుంచి
ఈ సంగీతం?
నా గుండె చప్పుళ్లు
జైలు కాపలాదారుకు పిచ్చెక్కింది
నాతో సంభాషణ ముగించాడు
నా కవిత్వమంటే తనకయిష్టం అన్నాడు
నా గదికి తాళంవేసి పోయాడు
కానీ ఆ సాయంత్రమే తిరిగి వచ్చాడు
ఈ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు?
బాగ్దాద్ రాత్రుల నుంచి
సారాయి?
అల్జీర్స్ ద్రాక్ష తోటల నుంచి
మరి ఈ స్వేచ్ఛ?
నువ్వు గత రాత్రి నను బంధించిన గొలుసు నుంచి
జైలు కాపలాదారుకు
చాలా దు:ఖం వచ్చింది
నా స్వాతంత్ర్యాన్ని నాకు తిరిగి
ఇవ్వమని
అతడు నన్ను ప్రాధేయపడ్డాడు

(ఇంగ్లిష్ నుంచి : ఫెలో ట్రావెలర్)

Leave a Reply