అడవి మల్లె

కొత్తపల్లె
10 జూన్‌, 2014.
‘‘అక్కా… మన ఊరికి ఎప్పుడు వస్తావు? ఏడాది దాటింది తెలుసా!, నువు ఇంటికి రాక. త్వరగా రా అక్కా. నిన్ను చూడాలనీ, నీతో మాట్లాడాలనీ రోజూ అనుకుంటున్న. నువ్వేమో అక్కడ రీసర్చు గీసర్చు అనుకుంట ఆన్నే వుంటున్నవు. త్వరగా రా అక్కా. నువు లేక ఎండకాలం తెచ్చిన ముంజలన్నీ వేస్టయినై. ఈసారి దొనబండపై తాటిపండ్లు కాల్చుకొని తిందాం. నీతో ఎల్లెలుకల కూర, ఉడుం కూర, కౌజు పిట్టల కూర, అడివి పంది మాంసం తినిపిస్త. కూరదినను, గీర దినను అని ఒద్దన్నవనుకో, ఈపు మీద ఈత బరిగెలు ఇరుగుతై మల్ల. వచ్చేటపుడు నాకోసం ‘మున్నీ’ని తీసుకురా’’ పోస్ట్‌కార్డులో అందమైన చేతిరాత. కంది గింజల్లాంటి అక్షరాల వరుస. తంగేడు పూలలా మెరుస్తున్న అక్షరాలు. అక్షరాల్లోంచి ఊపిరిలో వ్యాపించిన తాటిపండ్ల వాసన. మత్తెక్కించే వాసన. చినుకూ చినుకూ కురిసి తడిశిన మట్టి వాసన.
‘‘మంగా… ఇంకో రెండు వారాల తర్వాత వస్తనే. నువు తెమ్మన్న ‘మునెమ్మ’ నవల తీసుకొస్త. వచ్చేటపుడు మా నానకు కాల్‌చేసి చెప్త. నువు వర్షను తీసుకొని ఎర్రబాడు బస్టాండ్‌ కాడికి రండి. అక్కణ్నించి మన ఊరికి నడుచుకుంటూ పోదాం’’ అని రిప్లై రాసిన. కానీ దాన్ని పోస్ట్‌ చేయడం వీలుకాలేదు. మైసూరు యూనివర్సిటీలో ఓ సెమినార్‌కు వెళ్లాల్సి వచ్చింది. పదిహేను రోజులూ అక్కడే. ఆ తర్వాత మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో ‘ఆదివాసీల భాషా సంస్కృతుల వికాసం’ అంశంపై సెమినార్‌. అక్కడ మరో వారం.
ఈ పరిశోధన అనేది మన రక్తం తాగే జలగ. మన సమయాన్నంతా కాజేసే మాయావి. శిథిలమైన లైబ్రరీల్లో తిరగడం, దుమ్ముపట్టిన పుస్తకాల్ని చదవడం, డేటా కలెక్షన్‌, పరిశోధన, ఫీల్డ్‌ వర్క్‌, సిద్ధాంత గ్రంథం రాయడంలో మునిగి అందర్నీ మర్చిపోయిన ఫీలింగ్‌ వచ్చింది. ఎక్కడ ఉన్నా, ఏ పనిచేస్తున్నా లోలోపల రాయాల్సిన పని గురించే మెదులుతున్నది. దీన్నుంచి తొందరగ బయటపడాల్నని ఎన్నిసార్లు అనుకున్ననో!
దీనికితోడు ఏడాది కాలంగా పోటీ పరీక్షలు, పేపర్‌ లీకేజీలు, పరీక్షల రద్దు, మళ్లీ కొత్త నోటిఫికేషన్‌లు… ఈ లొల్లిలబడి ఊరినే మర్చిపోయినట్టయింది. మంగకు పోస్టు చేయని ఉత్తరంలా.
నిన్న రాత్రే అమ్మ ఫోన్‌చేసింది. ‘‘ఇంకెప్పుడొస్తవమ్మా… ఇంటికి! ఆ పట్నంల ఇంకెన్నేండ్లు ఉంటవ్‌? రేపు పొద్దుగాల బస్కెక్కి రా. నెల తర్వాత బోదువు గని’’ అన్నది.
నిజమే కదా! అమ్మనీ, నాయిననీ, అన్న బిడ్డల్నీ, నా చిన్నారి దోస్త్‌ మంగనీ… ఇంతకాలంగా నేనెంత మిస్సయిన్నో తలుచుకుంటేనే గుండె బరువెక్కుతున్నది.
నిన్న సాయంత్రం సుల్తాన్‌ బజార్‌ ‘నవోదయ’ నుంచి నాన కోసం, మంగ కోసం తెచ్చిన కేశవరెడ్డి, మహాశ్వేతాదేవి పుస్తకాలన్నీ బ్యాగులో సర్దుకున్న. పొద్దున్నే ఎంజీబీఎస్‌ల సూర్యాపేట బస్కెక్కిన.
రెండేళ్ల తర్వాత మా ఊరికి బయలుదేరిన.
అది వానకాలం. నాకెంతో ఇష్టమైన కాలం. నాకే కాదు, మా అన్న బిడ్డలకూ, వాళ్ల దోస్తులకూ చాలా ఇష్టమైన కాలం. రోజూ వానల్లో తడవడం, ఎండల్లో ఆరడం, చెట్టూ చేమలు, అడవుల్లో కలెదిరగడం ఇష్టం. మంగతో కలిసి మంచెపై కూసోని పాటలు పాడటం ఇష్టం. వెన్నెల్లో చిన్నపిల్లలతో కలిసి ఆడటం ఇష్టం. రాత్రుల్లో వెన్నెలా వానా కలిసి పెనవేసుకున్న దృశ్యాన్ని చూడటం ఇష్టం.
బస్సు ఎర్రబాడులో ఆగింది. నాకోసం ఎవ్వరూ రాలేదు. వర్షా లేదు. నా మంగా లేదు. నేనొక్కదాన్నే నోకియా 23230 సెల్‌ఫోన్‌లో గద్దర్‌ పాటలు వింటూ నడుచుకుంటూ ఇంటిదారి పట్టిన. ఐదు కిలోమీటర్ల నడకలో మూడుసార్లు ఎదురైంది వాన. తడుస్తూ ఆరుతూనే ఇంటికి చేరుకున్న. స్నానం చేశాక, తెచ్చిన పుస్తకాలన్నీ మంచంపై పరిచిన. గద్దర్‌ పాటలు, వేమన పద్యాలు, కేశవరెడ్డి నవలలు అన్నీ. వాటిని చూడగానే నాన కళ్లల్లో వెలుగు. పట్టలేని ఆనందం. పుస్తకాలొక చేతా, నన్నోచేతా పట్టుకొని గుండెకు హత్తుకున్నడు. నుదిటిపై ముద్దుపెట్టిండు.
మునెమ్మ నవల చూపించి, ‘‘నానా… ఇది మంగ కోసం తెచ్చిన. దానికి ఇష్టం, ఈ నవల. ఈ పుస్తకం తెమ్మని రెండేళ్ల క్రితం చెప్పింది. అప్పట్లో ఓసారి పోస్టు కార్డులో కూడా మునెమ్మను గుర్తుచేసింది’’ అన్న.
నాన ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నడు. నా పనుల్లో నేనున్న. నాన ఏవేవో విషయాలు చెప్తున్నడు. పట్నం నుంచి తెచ్చిన వస్తువుల్లో ఏదో మిస్సైందని వెతుకుతున్న. ఈ లోకంలో లేను. ఇంతలో నాన గొంతు వణుకుతున్నట్టు వినిపించింది. అంతకుముందే ఏదో మాట చెప్పిండు. కానీ నేనీ ధ్యాసలో లేను. ఆ మాటేదో సరిగా వినిపించలేదు.
నానవైపు తలెత్తి చూసిన. కళ్లల్లోంచి ఉబికి వస్తున్న కన్నీళ్లు. ఆ పుస్తకం కవర్‌ పేజీపై టపటపా రాలుతున్న కన్నీళ్లు.
‘‘ఏమైంది నానా? ఎందుకేడుస్తున్నవ్‌? ఏమైందే? పిచ్చా నీకు? ఈ కన్నీళ్లేంది? అసలేమైంది నీకు?’’ అని నాన కన్నీళ్లు తుడిచిన.
‘‘ఏం లేదు బిడ్డా. నేను పొలం కాడికి పోతున్న. పొద్దున మోటర్‌ వెట్టొచ్చిన. మడులన్నీ నిండినయి కావొచ్చు. మోటర్‌ బందువెటొత్త’’ అంటూ భుజంపై తువ్వాలేసుకొని సైకిలెక్కిండు.
అమ్మ దగ్గరికి వెళ్లి అడిగిన, నానకేమైందని.
అమ్మ మాట్లాడలేదు. చాలాసేపూ మౌనం.
వీళ్లిద్దరూ ఇట్లెందుకున్నరో అర్థం కాలేదు. ఏదో జరిగే వుంటది అనిపించింది. అదేందో తెల్వదు. ఇంట్ల వున్ననని మాటే గానీ, మంగను ఎప్పుడు కలవాలా అనే ఆలోచనే మెదులుతున్నది. ఆమెకోసం తెచ్చిన లంగా ఓణీ, ‘మునెమ్మ’, ‘అతడు అడవిని జయించాడు’, చలం ‘అమీనా’ నవలలు తీసుకొని ఇంటినుంచి బయిటికి ఒచ్చిన.
నింగినిండా మబ్బులు. చుట్టూ మసక కమ్మింది. పొద్దట్నించీ సూరీని జాడేలేదు. రోడ్డెక్కిన. ఎర్రజెండా గద్దె కాడికి రాంగనె నీలమ్మ పలకరించింది. నదియా గుండెకు హత్తుకొని అలైబలై ఇచ్చింది. ఎనభై ఏండ్ల మొగులమ్మ ఊతకర్రతోటి ఎదురొచ్చింది. ఇట్లా రోడ్డుపొడవునా ఎదురయ్యే పలకరింపులతో పడమటి దిక్కు నడిచిన. మంగమ్మ ఇంటి తొవ్వబట్టిన.
చెరువు అంచున ఉన్న ఎరుకల వాడలో మంగ ఇల్లు. సీసీరోడ్డు దిగి కుడిపక్క తిరగంగనె ఓ బురద దారి కనిపించింది. ఆ దారికి రెండు పక్కలా పందుల గుడిసెలు. కుడితి తొట్లు. నేలపై ఒలికిన కుడితి నీళ్లు. నీళ్లింకిపోయి బురదల తేలిన తౌడు. జాలారి నీళ్లల్లకు పారుతున్నది. ఆ దారంతా పందుల డెక్కల గుర్తులు. చిత్తడి చిత్తడి. కొద్దిదూరంలనే పెద్ద చింతచెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఓ గుడిసె. పందుల గుడిసె కంటె కొంచెం పెద్దది. గుడిసెపై జమ్ము పరిచివున్నది. వెనకవైపు కప్పుమీద టార్పాలిన్‌ కప్పివున్నది. నెర్రెలువారిన మట్టిగోడలు. గోడల కింద చుట్టూ ఎర్రమట్టి అలుకుపూత. నాంగార ముద్దలతోటి పెట్టిన తెల్లటి సుక్కల ముగ్గు. గుడిసె ముంగట అసుంటని కట్టెలపొయ్యి మండుతున్నది. పొయ్యిలోంచి పొగ లేస్తున్నది. ఇనుప గొట్టంతోటి పొయ్యిలకు గాలిఊదుతున్న ఓ నలభై ఏళ్ల మహిళ కనిపించింది. ఆమె మంగ తల్లి.
‘‘అమ్మా…’’ అని పిలిచిన.
దిగ్గున ఇటు చూసింది. కండ్లు నలుసుకుంటూ పైట కొంగుతోటి మొకం తుడుసుకున్నది.
‘‘మంగ లేదా అమ్మా! ఎటుపొయింది?’’ అని అడిగిన
కొన్ని క్షణాల మౌనం.
ఒక్కసారిగా ఆమె కండ్ల నుంచి జలజలా రాలుతున్న కన్నీళ్లు. పక్కటెముకలు ఎగబోస్తున్నది. ఛాతీ అదురుతున్నది. మనిషంతా తల్లడం మల్లడం ఐతున్నది.
‘‘ఓ… విడ్డా…’’ అంటూ నన్ను కావలించుకుని, ఏడుస్తున్నది. నా భుజమంతా ఆమె కన్నీళ్లతో తడిచింది. రెండుచేతులా ఆమె ముఖం పట్టుకొని ఓదార్చిన. ఆమె ఏడుపు ఆగలేదు. కొన్ని క్షణాల్లోనే ఆ శోకం చుట్టుపక్కల ఇండ్లను తాకింది. పందుల గుడిసెల మధ్య నుంచి ఒక్కక్కరుగా తరలివస్తున్నరు. ఈతాకు సాపలల్లుతూ కొందరు. సగం అల్లిన బుట్ట పట్టుకొని కొందరు. గోగునార పగ్గమేస్తున్న ముసలివాళ్లు. పశువుల ముక్కుశిక్కం అల్లుతూ ఓ ఇద్దరుముగ్గురు పెద్దమనుషులు. సగం లాగు శినిగిన చీమిడిముక్కు పిల్లలు… నాలుగు వైపుల నుంచీ అక్కడికి వస్తున్నరు.
‘‘మంగ లేదు విడ్డా… నా విడ్డ పేరుమాషి పదిరోజులాయె విడ్డా…’’ అంటూ గుండెలు బాదుకుంటూ నేలపై పొర్లి ఏడుస్తున్నది. ఆమెను ఓదార్చడం ఎవ్వరివల్లా కావట్లేదు.

‘‘ఆ దేవుని గుల్లె మన్నువొయ్యా… నా విడ్డను తీస్కపొయిండు. ఆని గుల్లె జిల్లెల్లు మొలువా… ఎత్తేడు దోసిల్లు ముంచి మూడు దోసిల్ల మన్నువోద్దూ… సక్కదనా ల విడ్డను గొంటవొయిండూ… ఉన్నొక్కబిడ్డని దూరంజేసె… ఆనికి అగ్గిదల్గ’’ అంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నది.
ఆమె ఏడుపు చూసి, నా కాళ్లకింద నేల నిలువునా పగిలినట్టనిపించింది.
నా చేతుల్లోని పుస్తకాలు కిందపడి చెల్లాచెదురైనై.
మంగకోసం తెచ్చిన లంగా ఓణీ బాక్సు పక్కనపడ్డది.
ఆ గుడిసె ముందట వాకిట్లో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న బక్కమ్మను చూసి అందరి కండ్లల్లోనూ ఆగని కన్నీళ్లు.
మెల్లగ ఆమెను లేపి గుడిసె వాలుకు ఉన్న తుమ్మ మొద్దుమీద కూసబెట్టిన. శెంబెడు నీళ్లు తాపిన. దూపతీరలేదు కావొచ్చు, ఇంకో శెంబెడు కావాల్నని సైగజేసింది. శెంబు తీసుకొని గుడిసెలకు పోదామని ఇటు తిరిగిన. అంతే. గుడిసె లోపల ఎనగర్రకు ఏలాడుతున్న మంగ ఫొటో. నుదుట ఎర్రని కుంకుమబొట్టు. ఫొటోకు బంతిపూలు, మల్లెపూల దండలు. పూలమధ్య వెన్నెల్లా నవ్వుతున్న మంగ. రెండేండ్ల క్రితం మేమిద్దరమూ కలిసి దిగిన ఫొటో అది. నా కండ్లు బైర్లు కమ్మినయి. ఒక్కసారిగా నేలకూలిన.
పగ్గం అల్లుతున్న ఓ తాత గుడిసెలకు ఉరికొచ్చి, నన్ను లేబట్టి బయిటికి తీసుకొచ్చిండు. బక్కమ్మ పక్కన ఉన్న చెక్కపీటమీద కూసబెట్టి. మొకాన నీళ్లు చల్లిండు.
బక్కమ్మ ఏడుపు ఇంకా ఆగలేదు. ‘‘ఎప్పుడూ నవ్వుకుంట తిరిగే సక్కదనాల విడ్డ సూస్తండంగనె మాయమయింది. దాని మనుసుల ఏ బాదయిందో ఎన్నడూ శెప్పకపాయె. ఏం దిగులుందో ఎవ్వలితోటీ శెప్పకపాయె. సందమావసొంటి బిడ్డ, మా బతుకు అమాసపాలు జేసిపాయె.’’ బిడ్డను గుర్తుచేసుకుంటూ ఏడుస్తున్నది.
గుడిసెలకు తొంగిచూసిన. దుగూట్లె మంగ పుస్తకాలు. అప్పుడెప్పుడో ఆమె పరిచయమైన కొత్తల నేనిచ్చిన పుస్తకాలు కూడా ఉన్నయి, దాంట్లె. ‘అతడు అడవిని జయించాడు’, ‘ఎల్లి’ నవల, భగత్‌సింగ్‌ ‘నేను నాస్తికుడిని ఎందుకయ్యాను?’, మరికొన్ని పుస్తకాలు ఒక పక్కకు ఉన్నై. వాటిని చూడంగనె మనసుల కలుక్కుమన్నది. ఆమెకు ప్రేమతో ఇచ్చిన పుస్తకాలు అవి. ఒక్కో పుస్తకం చదువుతూ ఎన్నెన్ని మాటలు చెప్పేదో! ఆ అక్షరాల్లో తనను చూసుకొనేది. తన జాతి బతుకుని వెతుక్కొనేది. లోకాన్ని కొత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. ఇంత చిన్న వయసుల ఎంత జ్ఞానం! ఆమెది. ఆశ్చర్యం అనిపించేది. అద్భుతం అనిపించేది. ఎరుకల వాడల పూసిన అడవిమల్లె, మంగ. తనతో మాట్లాడిన జ్ఞాపకాలు, ఆటలాడిన జ్ఞాపకాలు, పాటపాడిన జ్ఞాపకాలు, వాగువంకల్లో ఈదులాడిన జ్ఞాపకాలు… ఒక్కొక్కటీ గుర్తొచ్చి గుండెనెవరో మెలిపెట్టి నంత బాధయింది. ఇంతలోనే ఎట్లా మాయమైంది, మంగ! ఎట్లా మరవడం?
ఐదేండ్ల పరిచయంలోనే జీవితమంతా ఉత్తేజం నింపిన పిల్ల. లేడిపిల్లలా గంతులేస్తూ ఎదురొచ్చే పిల్ల. నవ్వే పూలవానలా, పొంగే వాగులా ఎదురొచ్చి గుండెలకు హత్తుకునేది. శిగలో మోదుగుపూలు పెట్టి ఎంత అందంగా నవ్వేదని! వెన్నెల విరిసినట్టుగా, వానచినుకై నవ్వినట్టుగా. కవులు చెప్తారే… తేనె చుక్కలూ పూలరెక్కలూ కలిసిన అందమని! అంతకుమించిన అందం, మంగది.
ఎట్లా వచ్చింది! నా పరిచయంలోకి. ఎట్లా వచ్చింది! నా జీవితంలోకి. ఒక్కో జ్ఞాపకమూ నిలువెల్లా కుదిపేస్తున్నది.
సరిగ్గా ఐదేండ్ల క్రితం ఇదే రోజుల్లో ఎదురైంది. కురిసే వానల్లో. మెరిసే మెరుపై.
అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్న. ఇదే వానల్లో కొత్తపల్లెకు వచ్చిన. రాత్రంతా అమ్మానాయినలతో ముచ్చట్లు. సందె కాడ మొదలైన వాన, రాత్రంతా ఎడతెగక కురుస్తూనే వున్నది.
రాత్రి నుంచీ కుండపోత వాన. ఇంకా తెలవారకముందే బస్తా సంచీ కొప్పెర పెట్టుకుని పదేండ్లు దాటిన ఓ అమ్మాయి, మా ఇంటికొచ్చింది. ఆగక కురిసే వానలో. మెరుపులా. అప్పటికే బాగా తడిశింది. గజగజా వణుకుతున్నది.
‘‘తాతా… గేటు తియ్యి’’ (మా నానని ఉద్దేశించి) అంటూ పిలిచింది. నాన ఛెత్రీ పెట్టుకొని పోయి గేటు తీసిండు. నిలువెల్లా తడిశిన అమ్మాయి. ఆమె రెండు చేతుల్లో నల్లని పాలిథిన్‌ కవర్లు.
‘‘తాతా… కూర కావాల్న?’’ (మాంసాన్ని ‘కూర’ అంటరు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో) అని అడిగింది.
‘‘గింత పొద్దున్నే ఏం కూర!?’’ అన్నడు నాన.
‘‘రాత్రి శికారు(వేట)కు వొయినం తాతా. అడివి పంది, కుందేళ్లు పడ్డయ్‌. తెల్లారకముందే కోసినం’’ అన్నది.
మాట్లాడుతూనే వణుకుతున్నది. ఇంట్లోకి పిలిచి తువ్వాలిచ్చిన, తుడుచుకొమ్మని. చాయిచ్చిన. తాగింది. ఆ పిల్ల అంతరంగాన్ని తెలుసుకోవాలన్పించింది.
‘‘పేరేంది?, ఏం చదువుతున్నవ్‌?’’ అని అడిగిన. సమాధానమిస్తున్నదన్న మాటే గానీ, ఆమె మనసంతా ఎక్కడో ఉంది. ఆ చూపుల్లో ఏదో శూన్యం.
‘‘అక్కా… నేన్‌ వోతున్న. వానెక్కువైతంది’’ అంటూ గేటు తీసుకొని కుంటుతూ బయటికి పోయింది. బయట వానలో ఆమె సైకిల్‌. హ్యాండిల్‌కు పెద్ద సంచీ.
‘‘ఏందా సంచి!’’ అని అడిగిన.
‘‘అదంతా కూరే అక్కా… ఈ వానజెయ్యవట్టి ఎవ్వలూ ఇంటిదాక రాట్లేరు. నేనే ఇల్లిల్లూ తిరిగి ఇచ్చొత్త’’ అంటూ ఆ జోరు వానలోనే ఆ బురదలో సైకిల్‌ తొక్కుతూ వెళ్లిపోయింది.
ఆ పిల్ల వెళ్లిపోయాక మనసంతా బాధ. ఆగని కన్నీళ్లు.
‘‘ఆ అమ్మాయి ఎవరి బిడ్డ? వాళ్ల ఇల్లెక్కడ?’’ అని నానని అడిగిన. చెప్పిండు. చెరువు ఒడ్డున ఉన్న ఎరుకల వాడ అని.
వాళ్లు మా ఊరికి ఐదారేండ్ల కింద బతకడానికి ఒచ్చిండ్రు. మహబూబాబాద్‌ ప్రాంతం నుంచి. మా ఊరికి రావడానికి ముందే వాళ్ల నాన్న ఏదో భూమి గొడవల్లో ఒకర్ని పొడిచిండట. ఆ హత్య కేసులో అతను జైలుకు పోయిండు. అప్పటికి ఈ పిల్లకు నాలుగేండ్లు.
ఒకవైపు బడి. మరో వైపు వాళ్ల అమ్మతో కలిసి కూలి పనులు. అప్పుడప్పుడూ రాత్రుల్లో పెద్దవాళ్లతో కలిసి శికారుకు పోవడం. బడిలో ఆమెకు దోస్తుల్లేరు. ఆమె పక్కన ఎవరూ కూర్చోకపోయేది. ఎరుకలోల్ల పిల్ల అనే వివక్ష. వెలివేత. చుట్టాలూ లేరు. ఆమెకు అమ్మే అన్నీ.
ఆ రాత్రంతా ఆమె ఎన్నెన్ని పొదల్లో, కంపల్లో తిరిగిందో! కాళ్లూ, చేతులూ కంపతో చీరుకపోయిన గీతలు. నెత్తుటి గీతలు. పాదాల్లో గుచ్చుకున్న ముళ్లు.
పువ్వులా వికసించాల్సిన లేలేత జీవితం బుక్కెడు బువ్వకోసం నెత్తురోడుతోంది. వానలో నిలువెల్లా తడుస్తూ వెళ్లిపోయిన ఆమె రూపం నా కన్నీళ్లలో కరిగిపోయింది.
**
మళ్లీ రెండుమూడు రోజుల తర్వాత ఎదురైంది. మా ఇంటి ముందునేంచే స్కూలుకు పోయేది. ఆ రోజు సాయంత్రం బడి నుంచి వస్తున్న ఆ పిల్లను పిలిచిన. బెదురుతూనే వచ్చింది. మాట్లాడుతున్నంతసేపూ నిలబడే ఉన్నది. కూర్చోమని ఎన్నిసార్లు చెప్పినా అట్లనే నిల్చున్నది. మూడు గంటలపాటు మా ఇంట్లోనే ఉన్నది. అన్నీ అడిగిన. అమ్మ గురించీ నాన గురించీ, చదువు గురించీ దోస్తుల గురించీ, ఆమె ఇష్టాయిష్టాల గురించీ… అన్నీ తెలుసుకున్న. చదువంటే ప్రాణమని అర్థమైంది.
‘‘అక్కా… చీకటైతాంది. ఇంటికివోత’’ అన్నది.
‘‘కాసేపు ఆగురా. పోదువులే. నేనూ ఒస్త, మీ ఇంటిదాక’’ అని చెప్పి ఆపిన.
‘‘నువు శికారుకు పోతవా? మగవాళ్లతోటి శికారుకు పోవడం అంటే భయం కాదా? శికారంటె ఏమేం చేస్తరు? ఎట్ల చేస్తరు? జంతువులను చంపుతుంటె బాధ అనిపించదా?’’ అడిగిన
నవ్వింది. వేలాది పున్నాగ పూలు రాలినట్టుగా. జలపాతంలాంటి నవ్వు.
‘‘పిచ్చి అక్కా… ఇవేం ప్రశ్నలు?’’ అన్నట్లుంది, ఆ చూపు.
ఆ నవ్వుతో నేనూ కలిసిన.
‘‘అక్కా… చీకటైతాంది. ఇంటికివోత’’ అన్నది, మళ్లీ.
సరే. పోదువులే, ఆగు అని ఇంట్లకు పోయి హైదరాబాద్‌ నుంచి తెచ్చిన డ్రైఫ్రూట్స్‌ పాకెట్‌ ఇచ్చిన.
‘‘ఎండిన పండ్లా! అక్కా…’’ అని నవ్వింది.
‘‘అవును. తినురా. ఆరోగ్యానికి మంచిది’’ అని చెప్పిన.
మళ్లీ నవ్వింది.
‘‘రోజూ అడివిపొంటి పొయి శింతపలక పండ్లు, బలుసు పండ్లు, ఇసుక తప్పడి పండ్లు, అడివి దొండ పండ్లు, అల్లనేరేడు పండ్లు, తునికి పండ్లు, ఇరికి పండ్లు, రేగు పండ్లు, కలెం కాయలు, మారేడు కాయలు, ఈత పండ్లు, జిట్టీత పండ్లు, బ్రహ్మజెముడు పండ్లు, ఇప్ప పూలు, తాటి గేగులు, ఈతగూజు, ఎండకాలమొస్తె తాటి ముంజలు. వానకాలమొస్తె తాటిపండ్లు కాల్చుకొని తింటం. తేనె తాగుతం… ఇట్లా రకరకాల పండ్లు తింటం.’’ అంటూ నవ్వింది.
నవ్వుతూనే చెప్పింది, ‘‘ఇవక్కా ఆరోగ్యం పెంచేటివి. గా పట్నం పండ్లు గాదు’’
అంటూ నవ్వింది. అల్లరి పిల్ల.
‘‘సరే. ఇప్పడైతే ఇవి తీస్కపోమ్మా. నువు అడివికి పోయేటపుడు నన్ను సుత ఎంటబెట్టుకపో. ఈ పండ్లన్నీ తినిపించు. తేనె తాపించు’’ అని నవ్విన.
‘‘శికారుకు సుత తీస్కపోత, ఒస్తవా అక్కా?’’ అన్నది.
లోలోపల భయం ఉన్నా, వస్తనని చెప్పిన.
ఇంతలో చీకటి కమ్మింది.
‘‘అక్కా… చీకటైంది. ఇంటికివోత’’ అంటూ వెళ్లిపోయింది.
రాత్రి అన్నం తిన్నంక నా ప్రాజెక్టు పనిలో మునిగిపోయిన. తెల్లారి అమ్మమ్మను చూడటానికి కుసుమవారిగూడెం పోవాల్సి వచ్చింది. అక్కన్నే వారం రోజులున్న.
ఇంటికి తిరిగొచ్చినంక చెప్పింది అమ్మ, ‘‘ఆ మంగ నీకోసం శానాసార్లు ఇంటికొచ్చింది.’’ అని.
మరుసటి రోజు ఇంటికి వచ్చింది, మంగ. చాలా విషయాలు మాట్లాడుకున్నం. నేను చిన్నప్పుడు చదువుకున్న చందమామ పుస్తకాలు, వేమన పద్యాలు, సుభాషితాలు పుస్తకాల్లోంచి కొన్ని తీసి మంగకు ఇచ్చిన. ‘‘ఇవి చదువురా. నీ జ్ఞానం ఇంకా పెరుగుతది’’ అని చెప్పిన.
అట్లా మా ఇద్దరి స్నేహం మంచి అనుబంధంగా మారింది. హైదరాబాద్‌ నుంచి నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆమెకోసం పుస్తకాలు తెచ్చేది. పదోతరగతిలోకి వచ్చేనాటికే చాలా పుస్తకాలు చదివింది. వాటి గురించి చర్చించేది. వాటిలో తనను, తన జాతి జీవితాలనూ వెతుక్కొనేది.
పదో తరగతి మొదలైన తొలి రోజుల్లో ‘అతడు అడవిని జయించాడు’ నవల చదివింది. ఆ నవల గురించి ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పేది.
‘‘ఆ నవలలో సుక్కల పంది కోసం, దాని పిల్లల కోసం అడవిలో వెతికిన ఆ ముసలివాడు నేనే అక్కా. కేశవరెడ్డి నా పేరు రాయబోయి ముసలోని పేరు రాసిండు’’ అని గొల్లున నవ్వేది.
అర్ధవార్షిక పరీక్షలు అయిపోయినంక మా బాయి కాడికి వచ్చింది. చింతచెట్టు నీడలో కూసొని ఎన్నెన్నో పాటలు పాడిరది. తీరొక్క పిట్టలతో గొంతుకలిపి కోరసిచ్చేది. నవ్వేది. తన ముచ్చట్లతో నవ్వించేది.
అదే రోజు అడిగిన, ‘‘పదో తరగతి ఐపోయినంక ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్‌ తీసుకుంటవు, మంగా… పెద్దయ్యాక నువ్వేమైతవు?’’ అని.
తడుముకోకుండా చెప్పింది, ‘‘డాక్టర్‌ ఐత’’ అని.
ఆ మాట చెప్తున్నపుడు ఆమె కళ్లల్లో తడి. మెరుపు.
‘‘డాక్టరే ఎందుకు కావాలనుకున్నవు? ఇంకా చాలా ఉన్నయి కదా?’’ అన్న.
‘‘ఉన్నయి. కానీ, నేను ఇదే ఐత అక్కా’’ అని చెప్పింది.
కన్నీళ్ల మధ్యే చెప్తున్నది. చేతిలో డబ్బుల్లేక, సరైన వైద్యం అందక కండ్లముందే తన నాయినమ్మ చనిపోయిన సంగతి… ఎరుకల వాడకు వైద్యం చేయడానికి డాక్టర్లెవరూ రాని సంగతి… కూలో నాలో జేసి పైసలిస్తమని చెప్పినా, వైద్యం చేయని డాక్టర్‌ల సంగతి.. అన్నీ చెప్పింది.
‘‘మేమూ అందరిలెక్క మనుషులం కాదా అక్కా? మాకు మనసుండదా అక్కా. ఎక్కడ చూసినా వివక్షే. ఎక్కడ చూసినా వెలివేతే. వెలివాడలకే వెలివాడ మాది. ఇయన్నీ చూస్తుంటె నేనే మంచిగ చదువుకొని డాక్టరైతే మా ఎరుకలోళ్లందరికీ నేనే వైద్యం చేయొచ్చు కదా అక్కా. మావాళ్లందరి ప్రాణాలూ కాపాడొచ్చు కదా?’’ అని చెప్పింది.
తన గుండె గాయాల గురించి చెప్పింది. చెప్తూనే ఏడుస్తున్నది. కన్నీళ్లూ, ఎగపోతల మధ్యే చెప్పింది.
సెలవుల్లో అమ్మతో కలిసి, కూలిపని చేస్తూనే రాత్రంతా చదివేది. పదో తరగతిలో జిల్లా స్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. ఎండా కాలం తర్వాత సూర్యాపేటలోని ఓ కార్పొరేట్‌ కాలేజీ వాళ్లు మంగ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిండ్రు. ఇంటర్మీడియెట్‌ రెండేళ్లపాటూ ఎలాంటి ఫీజూ లేకుండా తమ కాలేజీలో చేర్పించుకుంటమని చెప్పిండ్రు. ఎంసెట్‌ కోచింగ్‌ కూడా ఉచితంగ ఇస్తమన్నరు.
ఈ సంగతంతా నాకు ఉత్తరం రాసింది. ఆ కాలేజీలో చేరాలా? వద్దా? అని అడిగింది.
‘‘నీ లక్ష్యం డాక్టర్‌, అన్నవు కదా! ఇంటర్‌ మంచిగ చదివి, ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధిస్తేనే నీ లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ఆ కాలేజీలో జాయినవ్వు’’ అని రిప్లై రాసిన.
ఆ కార్పొరేట్‌ కాలేజీలో చేరింది. ఇంటర్మీడియెట్‌లో టాపర్‌గా నిలిచింది. సెకండ్‌ ఇయర్‌లోనూ మంచిగనే చదువుతున్నా అని ఉత్తరాలు రాసేది.
అమ్మ గుర్తొచ్చి ఏడుపొస్తున్నదనీ, ఒకవేళ మంచి ర్యాంకు సాధించకపోతే డాక్టర్‌ కాలేను కదా! ఎట్లా? ‘‘నీకోసం ఇంత ఖర్చుపెట్టి ఫ్రీగా చదువు చెప్తున్నం. నువు ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోకుంటె మంచిగుండదు. బాగా చదువు’’ అంటూ కాలేజీ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌లు నాపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నరు. ఒక్కోసారి ఊపిరాడట్లేదు. టెన్షన్‌ ఐతాంది. చెమట పడుతున్నయి. గుండె దడ వస్తాంది’’ అంటూ చాలా విషయాలూ రాసింది, ఆ ఉత్తరాల్లో.
నేను ధైర్యం చెప్పేదాన్ని, ‘‘అది సాధించకపోతే వేరో కోర్సులో జాయిన్‌ కావచ్చు. భయపడకు. ధైర్యంగా ఉండు. నువు తప్పక సాధిస్తవ్‌. ఒకవేళ సాధించకపోయినా బాధపడొద్దు. అమ్మను బాధపెట్టొద్దు. బీ కూల్‌ మంగా…’’ అంటూ రిప్లై ఇచ్చేదాన్ని.
**
బక్కమ్మ ఏడ్చీఏడ్చీ సొమ్మసిల్లింది. పక్క గుడిసెలోంచి వచ్చిన ఎల్లమ్మ బక్కమ్మకు జావతాపించింది.
కాసేపైనంక గుడిసెలకు పోయింది, బక్కమ్మ. ఓ గుడ్డ సంచీలోంచి ఓ లాంగ్‌ నోట్‌బుక్‌ బయిటికి తెచ్చి, నా చేతిల పెట్టింది. తెరిచి చూస్తే, అందులో ఉత్తరాలు. హైదరాబాద్‌ నుంచి అప్పుడప్పుడూ నేను మంగకు రాసిన ఉత్తరాల కట్ట అది.
‘‘ఏం జరిగిందమ్మా? మంగకు ఏమైందసలు? ఎందుకు చనిపోయింది?’’ అని బక్కమ్మను అడిగిన.
‘‘మంగకు ఏమీ కాలేదమ్మా. శిన్నప్పటి సందీ సుక్కపొద్దుకాడ లేశి మంచిగ సదువుకొనేది. మంచి మార్కులొచ్చేది. ఎవ్వలి సోపతికీ పొయేది కాదు. బడి, సదువే లోకం. నువు కల్సినంకనే ఆ కతల పుస్తకాలు సదువుడు, జర లోకం తీరు ఆలోచించుడు అల్వాటైంది, బిడ్డా. ‘అమ్మా… నేను డాక్టరయిత’ అని ఎప్పుడూ చెప్పేది. డాక్టర్‌ కోర్సుల చేరే పరీక్ష రాసి ఇంటికొచ్చింది. ఆ రాత్రి అడవి పంది మాంసం తెచ్చిండు, మా మరిది కొడుకు. అన్నం తినమని ఎంత బతిమాలినా తినలేదు, మంగ. ‘ఆకలిగ లేదమ్మా. తర్వాత తింట. నువు తిని పండుకో అమ్మా’ అన్నది. నేను నాట్లేసే కూలికి పొయొచ్చిన. కాల్లు, ఒల్లంత నొప్పులే. బువ్వ తినంగనె పొంటె సేపట్లనే నిద్ర ముంచుకొచ్చింది. పండుకున్న. సుక్కపొద్దుకాడ లేసిన, బువ్వుడుకబెడుదామని. నా పక్కల జూత్తె, మంగ లేదు. కాలుమడి పొయిందేమో అనుకున్న. గుడిసె ఎనుకకుబొయి సూశిన. కనపల్లేదు. ఇంతల తడక జరిపి గుడిసెలకు బొయిన. అంతే. గుడిసె ఎనగర్రకు ఏలాడుతాంది, నా బిడ్డ. దీపం దగ్గెరబెట్టి సూశిన. నాలికె బయిటికొచ్చింది. కనుగుడ్లు తేలేసింది. పాత శీరెతోటి ఉరివెట్టుకున్నది…’’ చెప్తూనే బక్కమ్మ ఏడ్పుల వాగైంది. ఆమె ఏడుపును ఆపడం ఎవరివల్లా కాలేదు. ఏడ్చీఏడ్చీ గొంతు బొంగురుబొయింది. మాట ఎక్కడో లోయల్నించి వస్తున్నట్టు అనిపించింది.
కాసేపైనంక అడిగిన, ‘‘మంగను ఎక్కడ బొందపెట్టిండ్రు’’ అని.
‘‘సూపిత్త పా అక్కా…’’ అంటూ ఓ పదిహేనేండ్ల పిలగాడు నా పక్కకు ఒచ్చిండు.
బక్కమ్మనూ, ఆ వాడలోని పిల్లల్నీ, ఆడవాళ్లనూ వెంటబెట్టుకొని ఆ గుడిసెల్లోంచి బయిటికి వచ్చిన. ముందు ఆ పిలగాడూ, వెనక మేమూ… చెరువు కట్ట మీదుగా దొనకొండ తొవ్వల రెండు కిలోమీటర్ల దూరం పొయినం. ఏటి ఒడ్డున రెండెకరాల్లో విస్తరించి ఉన్న బండ అంచునే ఓ గోరీ కనిపించింది. ఇంకా రంగులు కూడా వేయలేదు.
అక్కడికి పోగానే గోరీ మీద పడి భోరున ఏడ్చింది, బక్కమ్మ.
మా అందరిలోనూ ఆగని దుఃఖం.
నా సంచీలోంచి మంగకోసం తెచ్చిన లంగా ఓణీ, కొన్ని పుస్తకాలూ బయిటికి తీసి, సమాధి మీద పెట్టిన. బండపక్కనే ఉన్న తంగేడు చెట్టు నుంచి గుప్పెడు పూలు కోసి మంగ గుండెలపై ఉంచిన.
తిరిగి వస్తుంటే లోలోపల సుళ్లు తిరిగే దుఃఖం.
చెలరేగుతున్న ప్రశ్నలు.
మంగను చంపిందెవరు? ఈ భూమి నుంచి తరిమిందెవరు? మంగ చనిపోయేలా చేసిందెవరు? ఏయే కష్టాలు ఆమె ప్రాణం తీశాయి? ఇట్లా ఎన్నెన్నో ప్రశ్నలు.
ఇంటికి వచ్చి రాక్‌లో ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే, మంగ నాకు రాసిన ఉత్తరాలు కన్పించినై. ఓ ఉత్తరం ఓపెన్‌ చేసిన. ఆ అక్షరాల వెంట వెళ్తుంటే ఆమె శరీర పరిమళం, నవ్వులూ కలిసి నా ఊపిరిలోకి ప్రవహించినట్టయింది. ముత్యాల్లాంటి అక్షరాలు. ‘‘అక్కా… మీ తెలుగు సాహిత్యం, సమాజ శాస్త్రాల్లో మా ఎరుకలోల్ల గురించి ఎవరైనా ఏదైనా రాసిండ్రా అక్కా? నీకు దొరికితే జర జిరాక్సయినా తీస్కరా అక్కా. మా జాతి గురించి తెలుసుకోవాలనుంది’’ అనే వాక్యాలు.
చదువుతుంటే నాకు తెలియకుండానే ఆ ఉత్తరంపై టపటపా కన్నీళ్లు రాలినై.

కవయిత్రి, పరిశోధకురాలు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ.(తెలుగు సాహిత్యం), ఎం.ఏ.(సమాజ శాస్త్రం); పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి అప్లైడ్‌ లింగ్విస్టిక్స్‌లో మాస్టర్స్‌ చదివింది. ‘విమల రచనల్లో సామాజికార్థిక విశ్లేషణ’ అంశంపై ఎం.ఫిల్‌. పరిశోధన చేసింది. రచనలు : 1. మోదుగుపూల వాన (కవిత్వం : 2018), 2. విమల రచనలు`సామాజికార్థిక విశ్లేషణ (ఎం.ఫిల్‌. సిద్ధాంత వ్యాసం : 2024), 3. ఎరుక (ఆదివాసీ సంచార తెగ ఎరుకల కథలు) సంపాదకత్వం : 2024; 7. స్త్రీవాదం-భిన్న దృక్పథాలు (సంపాదకత్వం : 2024)

 

Leave a Reply