ఇరవయో శతాబ్ది మలి అర్ధభాగంలో తెలుగు సమాజ చైతన్యానికి ప్రతిబింబంగా, దిక్సూచిగా నిలిచి వెలిగిన ఆధునిక సాహిత్య వేదిక సృజనకు ఈ నవంబర్ కు అరవై ఏళ్లు.
1966 నవంబర్ లో పుట్టి, 1992 డిసెంబర్ దాకా నడిచి తెలుగు సాహిత్యంలో చరిత్ర సృష్టించిన సృజన చరిత్ర ఇంకా రాయవలసే ఉంది. సామాజిక చైతన్యానికీ, సాహిత్యానికీ, విప్లవోద్యమానికీ, మొత్తంగా సమాజానికీ ప్రతిబింబంగా, ప్రతిఫలనంగా, సహప్రయాణికురాలిగా సృజన అందించిన కానుకల గురించి ఇంకా రాయవలసే ఉంది.
సుదీర్ఘమైన చరిత్రలో సృజన నడిచిన కాలం తక్కువే కావచ్చు. అది మధ్యలో రెండుసార్లు నాలుగన్నరేళ్లు విరామంతో మొత్తం ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే నడిచింది. 200 సంచికలు వెలువడింది గాని అప్పుడప్పుడు రెండు మూడు సంచికలు కూడా కలిసి రావడంతో మొత్తం వెలువడినవి 173 సంచికలే. అంటే ఎక్కువలో ఎక్కువ పన్నెండు వేల పేజీలు.
కాని ప్రచురించిన అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ సృజన అద్భుతాలు సృష్టించింది. సమాజ సాహిత్య సంబంధాలలో వినూత్న, విప్లవ ఒరవడిని సృష్టించింది. ఇరవై ఆరేళ్ల జీవితంలో కనీసం ఇరవై రెండేళ్ల పాటు విప్లవోద్యమంతో పాటు నడిచింది. నవీన్ ‘అంపశయ్య’, అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’ వంటి నవలలకు, శివసాగర్ కవితలకు, గద్దర్ పాటలకు, 1960, 1970, 1980 దశకాలలో కళ్లు తెరిచిన కవితలకు, కథలకు సృజనే వేదిక. త్రిపురనేని మధుసూదన రావు, జెసి, కె బాలగోపాల్ వంటి సాహిత్య విమర్శకులు సృజన ద్వారానే పరిచయమయ్యారు. ‘నాకుటుంబం’, ‘ఉప్పెన’ వంటి అద్భుతమైన నవల అనువాదం సృజన కాకుంటే మరే పత్రికైనా ప్రచురించగలిగేదా అనుమానమే. కవిత్వం, పాట, కథ, నవల, సాహిత్య విమర్శ, రాజకీయార్థిక-సామాజిక-సాంస్కృతిక విమర్శ, సంపాదకీయం – ప్రతి ప్రక్రియలోనూ సృజన నెలకొల్పిన ప్రమాణాలు అపురూపమైనవి.
దేశంలో, తెలుగు సీమలో సాగిన అపూర్వమైన ప్రజా ఉద్యమానికి సాహిత్య వేదికగా నిలిచింది సృజనే. సాహిత్యానికి ‘ట్రిగర్ మీద వేళ్లతో రా’ అనడం నేర్పింది సృజనే. అట్టడుగు మనుషుల జీవితాలను, ఆరాటాలను, పోరాటాలను అక్షరబద్ధం చేసింది సృజనే. సృజన కనిపెట్టిన, అన్వేషించిన, వెలికితీసి మొదటిసారి అచ్చువేసిన, సృష్టించిన కవులూ రచయితలూ అసంఖ్యాకం.
సృజన స్థానానికి, విజయానికి ఆ పత్రిక నిర్వహించిన ఎవరో కొందరు వ్యక్తులు మాత్రమే పూర్తి కారణం కారు. సృజన కాలం కన్నబిడ్డ. సృజన తన సమకాలీన చరిత్ర సృష్టించిన, నడిపించిన అద్భుతం. సృజన నిర్వహించిన సాహితీమిత్రుల సంప్రదాయాన్ని, ఆ బృందానికి చుక్కానిగా ఉండిన వరవరరావును, ఆ బృందం మొత్తం విశ్వసించిన ప్రజా ఉద్యమ చైతన్యాన్ని అర్థం చేసుకోకుండా సృజనను, సృజన సాధించిన విజయాలను అర్థం చేసుకోలేం. ఆ విజయాలకు, సృజనకు మూలాలు తెలుగు సాహిత్య వాతావరణంలో, తెలుగు సమాజంలో, దేశవ్యాప్తంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ విస్తరించిన ఆనాటి యుగస్వభావంలో ఉన్నాయి.
మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ విద్రోహం (1951 అక్టోబర్ 20), తెలుగుసీమ కమ్యూనిస్టులలో మిగిలిన చివరి ఆశలను కూడా ధ్వంసం చేసిన ఆంధ్ర రాష్ట్ర ఉప ఎన్నికలు (1955 ఫిబ్రవరి), వయోజన వోటు హక్కు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి మాయలతో వర్గ పాలనకు, ఇతర రూపాల్లో వలస దోపిడీ పీడనలు కొనసాగడానికి పాలకవర్గం పన్నిన వ్యూహం (1947 నుంచి 1960లదాకా), వర్గపోరాటాన్ని వదిలి శాంతియుత సహజీవనం, శాంతియుత పోటీ, శాంతియుత పరివర్తన అని వర్గ సామరస్య రాజీ సూత్రాన్ని ప్రకటించిన సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ ఇరవయ్యవ మహాసభ (1956 ఫిబ్రవరి) – ఇవీ 1950 దశకమంతా చీకటి కమ్మడానికి జరిగిన ప్రయత్నాలు. ప్రజా ఆకాంక్షల మీద, పోరాటాల మీద నీళ్లు చల్లడానికి జరిగిన ప్రయత్నాలు.
ఆ దశకానికి స్పందనగా 1960ల దశకం, ముఖ్యంగా ఆ దశాబ్దిలో మేల్కొన్న యువతరం ప్రపంచవ్యాప్తంగా ఆ దశాబ్దిని కోపోద్రిక్త యువతరపు దశాబ్దంగా, ఆంగ్రీ సిక్స్టీస్ గా మార్చింది. ఆ దశాబ్దంలో వీచిన గాలి, ఆనాటి యుగస్వభావం అనేక దేశాల్లో అనేక రూపాల్లో వ్యక్తమయింది. సృజన సందర్భంగా తెలుగు సాహిత్యం గురించి మాత్రమే చెప్పుకుంటే రాత్రి కవితా సంకలనం (1964 మే), దిగంబర కవులు మొదటి సంపుటం (1965 మే), సివి రాసిన ‘విషాద భారతం’ (1965 జూలై), ‘కారుచీకటిలో కాంతిరేఖ’ (1966 అక్టోబర్) ఆ యుగస్వభావాన్ని పట్టుకున్న సీస్మోగ్రాఫ్ లు. ఇవేవీ సమన్వయంతో, ఒకరితో ఒకరు కూడబలుక్కుని, ఒకరి గురించి మరొకరికి సమాచారంతో, చర్చలతో జరిగినవి కావు. ఇవన్నీ ఆ కాలపు సహజ సృజనాత్మక యువ సంచలనాలు.
సరిగ్గా అందులో భాగమే సృజన. హనుమకొండలో వేణుముద్దల నరసింహారెడ్డి అనే కవి ఇంట్లో 1966 మేలో కలుసుకున్న నలుగురు వరంగల్ యువకులు గంట రామారెడ్డి, దొంగరి మల్లయ్య (అంపశయ్య నవీన్), పెండ్యాల వరవరరావు ‘ఆధునిక తెలుగు సాహిత్య వేదిక’గా ఉండే ఒక పత్రికను పెట్టాలనుకున్నారు. ఆ నలుగురిలో ఇద్దరికి ఇరవై ఆరేళ్లు, ఒకరికి ఇరవై ఏడు, మరొకరికి ఇరవై ఐదు – అంటే సగటు వయసు ఇరవై ఆరు. ఆ నలుగురూ అప్పుడప్పుడే అప్పటికి తెలంగాణలో ఉండిన ఏకైక విశ్వవిద్యాలయం ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో, అర్థశాస్త్రంలో, తత్వశాస్త్రంలో ఎం ఎ చేసినవారు. వారి సంకల్పానికి సాక్షులుగా ఉన్నవారు వరంగల్ పెద్ద దిక్కు కాళోజీ, ఈ నలుగురికీ నాలుగు సంవత్సరాల సీనియర్ జి రాజలోచన్. అంతకు ముందే 1964-65లో హైదరాబాద్ లో సెవెన్ స్టార్ సిండికేట్ కవిత్వ పత్రికగా ప్రారంభించిన, ఏడు సంచికలతో ఆగిపోయిన ‘నవత’తో వరవరరావుకు తెగిపోయిన సంబంధం ఉంది.
నిజానికి అంతకు ముందు నుంచే ఈ సాహితీ మిత్రులు ఒక పత్రిక గురించి ఆలోచిస్తున్నారనడానికి సాక్ష్యం మొదటి సంచిక సంపాదకీయంలో “ఏడాది క్రితం ఇట్లా ఆధునిక సాహిత్యం కొరకు ఒక పత్రిక స్థాపించాలనుకొంటున్నాము అని కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ కు రాశామ”ని చెప్పుకోవడం. అంటే 1965 చివరి నుంచీ సాగుతున్న ఆలోచన మే 1966లో వాస్తవరూపం ధరించింది. జూలైలో తిలక్ చనిపోయారు. ఇక “ఒక broad-based standard of literature కు మనం ఒక incentive నీ ఒక forum నీ కల్పించాలి” అని ఆయన రాశారని గుర్తు తెచ్చుకుంటూ “ఆ ప్రయత్నంలో మేముండగానే ఆయన కన్ను మూయడం మాకొక సవాల్ గా మిగిలిపోయింది. మా ప్రయత్నానికి కాలం గీటురాయి” అని రాశారు.
కాలం కన్నబిడ్డ, కాలం గీటురాయిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
బాలగంగాధర తిలక్ స్మృతి సంచికగా 1966 నవంబర్ లో వచ్చిన మొదటి సంచికలో ఉన్న పదమూడు రచనలూ (ఐదు కవితలు, ఎనిమిది వ్యాసాలు) అన్నిటికన్నీ తిలక్ గురించే. అవి కాక ఉన్న ఒక్క పేజీ సంపాదకీయం పత్రికకు మార్గ నిర్దేశనం చేసింది. శ్రీశ్రీ, కాళోజీ, కుందుర్తి, కెవి రమణారెడ్డి, సోమసుందర్, అద్దేపల్లి రామమోహనరావు, మల్లవరపు విశ్వేశ్వరరావు, నిడమర్తి ఉమారాజేశ్వరరావు, రవిబాబు, అనుముల కృష్ణమూర్తి, గిరీశం, పరిగి రాధాకృష్ణ, వరవరరావు ఈ మొదటి సంచిక రచయితలు.
తనను తాను ‘ఆధునిక సాహిత్య వేదిక’గా ప్రకటించుకున్న సృజన “ఆధునిక సాహిత్యమంటే – శాస్త్రీయ దృక్పథం, హేతువాదం, సమకాలీన సమాజం – వీని ప్రభావం వ్యక్తి జీవితంలోని అన్నీ అంశాల మీద కొద్దో గొప్పో ఉందని గుర్తించడం. ఈ గుర్తింపు ఉన్న రచనని ఆధునిక సాహిత్యంగా నిర్వచించవచ్చు. ఇతరమైన విలువల్ని విస్మరించకుండా.
ఇది ఒక సాహస ప్రయోగం. ఇది పత్రికా? కాదు; మారుతున్న కాలాన్నీ విస్తృతమౌతున్న జాగృతినీ ప్రతిబింబించే అనువదించే ఒక forum. దీనికి సంపాదకుడు లేడు, సాధకులే తప్ప. ప్రయోగశీలత్వం, సృజనాత్మక శక్తి, ఆధునిక దృక్పథం – ఈ forum పునాదులు” అని చెప్పుకున్నారు.
“మాకేమీ గొప్ప కలలు లేవు, కాని మూడు నెలలకొక సంచిక తేవాలన్న సంకల్పం మాత్రం ఉన్నది” అని కూడా అన్నారు.
పత్రిక అనాలా వద్దా అనే అనుమానం ఉండిందేమో మొదటి సంచికకు సంపాదకుడి పేరు లేదు. ముద్రాపకుడు, ప్రచురణకర్తగా కాళోజీ పేరు ఉంది. నిర్వహణ ‘సాహితీ మిత్రులు’ అని ఉంది. వివరాలకు, ప్రత్యుత్తరాలకు వరవరరావు (జడ్చర్ల), వే నరసింహారెడ్డి (హనుమకొండ) చిరునామాలు, ప్రతులకు వరంగల్ లో రెండు పుస్తకాల దుకాణాల చిరునామాలు ఉన్నాయి.
కాని రెండో సంచిక (ఫిబ్రవరి – ఏప్రిల్ 1967) నాటికి సంపాదకుడుగా, ముద్రాపకుడుగా, ప్రచురణకర్తగా సాహితీమిత్రుల తరఫున వరవరరావు పేరు ప్రారంభమయింది. శ్రీశ్రీ, దాశరథి, ఆరుద్ర, సంజీవదేవ్, కెవి రమణారెడ్డి, అద్దేపల్లి రామమోహనరావు, సోమసుందర్, వేగుంట మోహన్ ప్రసాద్, నిఖిలేశ్వర్, చెరబండరాజు – 1967 నాటి తెలుగు సాహిత్యలోకపు హూ ఈజ్ హూ కనబడుతుంది. ఆ సంచిక మాత్రమే కాదు, 1966-1992 కాలపు తెలుగు సాహిత్య హూ ఈజ్ హూ సృజన.
మూడో సంచిక (మే – జూలై 1967) వచ్చేసరికి ముఖచిత్ర కవితే ‘రక్తచలన సంగీత శ్రుతి’ అని కొత్త భాష ప్రారంభించింది. ‘నేను భవిష్యత్తు మనిషిని రేపు కనిపిస్తాను’ అని ప్రకటించింది. పదో సంచిక (ఫిబ్రవరి-ఏప్రిల్ 1969) నాటికి శ్రీకాకుళ విప్లవోద్యమ స్పర్శతో ‘ట్రిగర్ మీద వేళ్లతో రా’ అని మరింత స్పష్టత ను ప్రకటించింది. పదిహేనో సంచిక (మే 1970) ముఖచిత్రంగా ‘మేడే’ కవితతో యుగస్వభావ ప్రతిఫలనం విస్పష్టమయింది. ఈలోగా ఐదో సంచిక బుచ్చిబాబు, ఏడో సంచిక చలం, తొమ్మిదో సంచిక భారతీయ సాహిత్య పరామర్శ, పదమూడో సంచిక కథల సంచిక, పద్నాలుగో సంచిక శ్రీశ్రీ షష్టిపూర్తి ప్రత్యేక సంచిక ఆధునిక సాహిత్య వేదిక అనే మాటను సార్థకం చేఉకుంటూ వచ్చింది.
శ్రీశ్రీ షష్టిపూర్తి సభలతో తెలుగు సాహిత్యం ఎటువంటి గుణాత్మక పరిణామానికి లోనయిందో కొత్తగా చెప్పనక్కరలేదు. ‘రచయితలారా మీరెటు వైపు’ అని విశాఖ విద్యార్థులు ప్రశ్నించారు. సాహిత్యలోకంలో అత్యధికభాగం, ముఖ్యంగా కోపోద్రిక్త యువతరం, శ్రీకాకుళ పోరాటం వైపు, ప్రజల వైపు ఉంటామని ప్రకటించింది. ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరిగిన సభ నుంచి జూలైలో హైదరాబాద్ లో అభ్యుదయ సాహిత్య సదస్సు బహిష్కరణ, విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం దాకా సాగిన సంచలనాత్మక, చరిత్రాత్మక పరిణామాలలో సృజన అవిభాజ్య కీలక భాగమయింది. విశాఖపట్నం సభ నాటికి వరంగల్ నుంచి వెలువడిన ‘తిరుగబడు’ కవితా సంకలనంలో సృజన సాహితీమిత్రులున్నారు.
సృజన పదహారో సంచిక విప్లవ రచయితల సంఘం ఆవిర్భావాన్ని హృదయపూర్వకంగా స్వాగతించింది. తానూ విరసంలో భాగమయింది. విప్లవ రచయితల సంఘానికి వార్షిక సంచికలు మినహా 1977లో అధికార పత్రిక అరుణతార వచ్చేంతవరకూ పత్రిక లేదు. సృజనే విరసం అనధికార అధికార పత్రిక అయింది. ఆనాటి తీవ్రమైన విప్లవ భావ సంఘర్షణలో త్రైమాసికగా ఉంటే నడుస్తున్న చరిత్ర వేగాన్ని అందుకోవడం కష్టం గనుక మాసపత్రికగా మారింది. అప్పటి నుంచి ఎమర్జెన్సీ ప్రీసెన్సార్షిప్ తో ఆగిపోయేదాకా శ్రీకాకుళ విప్లవోద్యమ తాత్కాలిక వెనుకంజ సమయంలో ఆశను నిలబెట్టడంలో, విప్లవోద్యమాన్ని ఎత్తిపట్టడంలో, విప్లవ సాహిత్యాన్ని ప్రచురించడంలో, విప్లవ భావన వైపు మధ్యతరగతి, సాహిత్య పాఠక లోకాన్ని ఆకర్షించడంలో సృజన నిర్వహించిన పాత్ర అసాధారణమైనది. అందువల్లనే సృజన సంచికలను ప్రభుత్వం నిషేధించడం ప్రారంభించింది. సంపాదకుడిని అరెస్టు చేశారు. కోర్టు విడుదల చేస్తే, తర్వాత సికిందరాబాద్ కుట్రకేసు అనే తప్పుడు కేసు బనాయించి, మళ్లీ అరెస్టు చేశారు. ఎమర్జెన్సీలో మీసా కింద అరెస్టు చేశారు. సంపాదకుడి అరెస్టుతో పత్రిక ఆగిపోదని, ఆగిపోగూడదని వరవరరావు సహచరి పి హేమలత ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్ బాధ్యతలు చేపట్టారు. సాహితీమిత్రుల నిర్వహణ యథావిధిగా కొనసాగింది. సంపాదకురాలుగా హేమలత కూడా నిషేధించబడిన సంచికలకు గాను కోర్టు కేసులను, జైలు శిక్షలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఎమర్జెన్సీ అనంతరం తిరిగి ప్రారంభమయిన సృజన ఆనాటి దేశవాపిత ప్రజాస్వామిక వెల్లువకు, ప్రత్యేకించి తెలంగాణలో ప్రారంభమయిన జగిత్యాల సిరిసిల్ల రైతాంగ పోరాటాలకు, కరీంనగర్ ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలకు, క్రమంగా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించిన విద్యార్థి, యువజన, రైతాంగ, కార్మిక, మహిళా ఉద్యమాలకు, మొత్తంగా విప్లవోద్యమానికి గొంతుక అయింది, వాహిక అయింది, మార్గదర్శి అయింది. తెలుగు సీమలో విప్లవోద్యమ చరిత్రలో సృజన ప్రభావం అరుణారుణ అక్షరాలతో లిఖించవలసినది. అందువల్లనే 1985 ఆట పాట మాట బంద్ లో భాగంగా సృజన మీద దాడి పెరిగింది. వరవరరావు మీద రాంనగర్ కుట్రకేసు మాత్రమే కాదు, హత్యా ప్రయత్నాలు, సాహితీమిత్రులలో ఒకరైన డా. రామనాథం హత్య, ఇతర సాహితీమిత్రులకు బెదిరింపులు, దాడులు, కేసులు, 1980 నుంచీ సృజన సాహితీమిత్రులలో ఒకరు, సృజనలో దాదాపు ప్రతి నెలా రాసిన రచయిత కె బాలగోపాల్ మీద హత్యా ప్రయత్నాలు, ఆయన వరంగల్ వదిలి వెళ్లక తప్పని స్థితి – ఈ స్థితిలో సృజన 1985 నవంబర్-డిసెంబర్ సంచిక నుంచి 1990 జనవరి వరకు మరొకసారి బలవంతపు విరామాన్ని అనుభవించవలసి వచ్చింది.
అప్పటికి వరంగల్ లో కొనసాగించలేని స్థితిలో హైదరాబాద్ నుంచి ప్రచురించడం, హైదరాబాద్ లో సాహితీమిత్రుల నిర్వహణలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, 1992 మేలో విప్లవోద్యమ నిర్మాణం మీద, ఆరు ప్రజా సంఘాల మీద నిషేధం – ఇక సృజన పూర్తిగా ఆగిపోక తప్పని స్థితి వచ్చింది. సృజన 200 సంచిక (జూన్ – డిసెంబర్ 1992) తో ఆగిపోయింది.
పదిహేడో సంచిక నుంచి రెండు వందల సంచిక దాకా సృజనా విప్లవ సాహిత్యమూ విప్లవ రచయితల సంఘమూ అవిభాజ్యంగా కలిసి సాగాయి. రాష్ట్రమంతటా, దేశమంతటా విప్లవ సాహిత్యానికి చిరునామా సృజన అయింది. రైతాంగ పోరాటాల నుంచి పెల్లుబికిన విస్తారమైన సాహిత్యానికి సృజన వేదిక అయింది. ప్రజా ఉద్యమాలకు విప్లవ సందేశం చేర్చడానికి సృజన వాహిక అయింది. 1970 నుంచి 1992 దాకా సృజన చరిత్రనూ విప్లవోద్యమ చరిత్రనూ విడదీసి రాయడం అసాధ్యం.
మొత్తం 1966-92 ప్రయాణంలో సృజన కనీసం 600 కవితలు అచ్చువేసి ఉంటుంది. 1960ల నుంచి 1980ల మధ్యకాలంలో కవిత్వం రాయడం ప్రారంభించి, తర్వాత కవులుగా లబ్ధప్రతిష్ఠులైన వారందరూ సృజనలోనే తొలిసారి అచ్చు కావడమో, ఎక్కువగా అచ్చుకావడమో, సృజనలో రావడం ఒక క్రెడిట్ గా భావించడమో జరిగింది. అంతకు ముందే కవులుగా ప్రసిద్ధులైన శ్రీశ్రీ, ఆరుద్ర, కెవి రమణారెడ్డి, సి. వి., దిగంబర కవులు వంటి అనేకులతో పాటు, వేగుంట మోహన్ ప్రసాద్, శివారెడ్డి వంటి అప్పుడే ప్రారంభించిన కవులకు సృజన వేదిక అయింది. శివసాగర్, ఎన్ కె, కె రామ్ మోహన్ రాజు, విమల, అల్లం నారాయణ వంటి ఎందరో కవులు సృజన ద్వారానే పరిచయమయ్యారు. శివసాగర్ కవిత్వం, గద్దర్ పాటలు ప్రచురణ సృజనలోనే మొదట జరిగింది. శివసాగర్ కవిత్వంలో అత్యధిక భాగం సృజనలోనే అచ్చయింది. శివసాగర్ మొదటి మూడు కవితా సంపుటాలు సృజన ప్రచురణగానే వెలువడ్డాయి. విప్లవ సందేశాన్ని విప్లవ ప్రజానీకం దగ్గరికి తీసుకుపోవడానికి ప్రధాన సాధనం పాటే అని విప్లవ సాహిత్యోద్యమం గుర్తించాక పాట సృజనలో అనివార్య భాగమయింది. పాట అచ్చుకాని సంచిక లేదంటే అతిశయోక్తి కాదు. శివసాగర్ చెల్లి చెంద్రమ్మ, గద్దర్ పాటల్లో అత్యధిక భాగం, అల్లం వీరయ్య సుప్రసిద్ధమైన ‘ఎర్రజెండెర్రజెండెన్నియలో’ వంటి వందకు పైగా పాటలు సృజనలోనే వెలువడ్డాయి.
సృజన రెండో సంచికలో తిలక్ కథ ‘ఆశాకిరణం’ దగ్గరి నుంచి ఆఖరి 200 సంచికలో తుమ్మేటి రఘోత్తమ రెడ్డి (పి శశిధర్ పేరుతో) కథ ‘జాడ’ వరకూ సృజన కథా ప్రక్రియలో నిజంగా ఆధునిక సాహిత్య వేదికగా నిలిచింది. పదమూడో సంచిక కథల ప్రత్యేక సంచికగా రావడంతో పాటు, ప్రతి సంచికలోనూ కనీసం ఒక కథతో నూట డెబ్బైకి పైగా కథలను సృజన ప్రచురించింది. తొలిదశలోనే పింగళి రంగారావు ‘వినడానికో కథ’ కథా సంపుటాన్ని సృజన ప్రచురణగా ప్రచురించింది. కాళీపట్నం రామారావు, ఎన్ ఎస్ ప్రకాశ రావు, తాడిగిరి పోతరాజు, బి టి రామానుజం వంటి 1970ల తొలినాళ్ల కథకుల నుంచి, ఎమర్జెన్సీ అనంతర రైతాంగ పోరాటంలో నుంచి వికసించిన అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, బి ఎస్ రాములు, కె రామ్ మోహన్ రాజు వంటి కథకులెందరినో సాహిత్య లోకానికి పరిచయం చేసింది సృజనే. ఎన్నో అనువాద కథలను కూడా సృజన ప్రచురించింది.
నవలా ప్రక్రియలో నవీన్ ప్రయోగాత్మక నవల ‘అంపశయ్య’ను సీరియల్ గా ప్రారంభించి, 1969లోనే సృజన ప్రచురణగా వెలువరించింది. 1979లో అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’ కూడా అలాగే సృజనలో సీరియల్ గా, సృజన ప్రచురణగా తీసుకొచ్చింది. చైనీస్ నవలలు టావ్ చింగ్ రాసిన ‘నాకుటుంబం’, చౌలిపో రాసిన ‘ఉప్పెన’ సృజనలోనే సీరియల్ గా వచ్చి పుస్తకాలుగా వెలువడ్డాయి.
విప్లవ సాహిత్యోద్యమం ప్రభుత్వం వైపు నుంచి భౌతిక దాడి ఎంతగా ఎదుర్కొన్నదో, సాంప్రదాయ సాహిత్యవేత్తల నుంచీ, వర్గ సామరస్యవాద సాహిత్య, రాజకీయవేత్తల నుంచీ అంతగా భావజాల దాడిని ఎదుర్కొన్నది. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, కెవి రమణారెడ్డి, పాములపర్తి సదాశివరావు వంటి ఎందరో పూర్వ సాహిత్య విమర్శకులకు వేదిక కల్పించినట్టుగానే, త్రిపురనేని మధుసూదన రావు, చలసాని ప్రసాద్, వరవరరావు, నోముల సత్యనారాయణ, జెసి, కె బాలగోపాల్ వంటి కొత్త తరం సాహిత్య విమర్శకులను సృజనే పరిచయం చేసింది. సాహిత్య విమర్శ కూడా వర్గపోరాట సాధనమే అని నిర్ధారించింది.
శుద్ధ సాహిత్య వాదాన్ని తోసివేస్తూ, సమాజ సాహిత్య సంబంధాల అన్వేషణలో సృజన అనేక రాజకీయార్థిక, తాత్విక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక వ్యాసాలు – మౌలికంగా తెలుగులో రాసినవీ, ఇతర భాషల నుంచి అనువదించినవీ – ప్రచురించింది. సాహిత్య పత్రికగా గుర్తింపు పొందిన భారతి సిఐఎ ఆధ్వర్యంలో ప్రచ్ఛన్న యుద్ధ కాలపు కమ్యూనిస్టు వ్యతిరేక వ్యాసాలు, “నాగా, మిజో విద్రోహుల” గురించిన వ్యాసాలు ప్రచురించినప్పుడు రాని అభ్యంతరాలు, సృజన ఆధునిక సాహిత్య వేదిక అంటూ ఈ రాజకీయార్థిక వ్యాసాలు ఏమిటని వచ్చాయి. కాని ప్రజాదరణ ఆ అభ్యంతరాలను తోసివేసింది. సృజన పోరాట ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పత్రిక అయింది. సృజన సంపాదకీయాలు సమకాలీన సామాజిక, రాజకీయ, సాహిత్య పరిణామాల మీద అవసరమైన వెలుగులు పంచాయి.
ఇరవై ఆరు సంవత్సరాల సృజన ప్రయాణం, నిర్వహణ అది ఎంచుకున్న రాజకీయ, సాహిత్య విశ్వాసాల వల్ల నల్లేరు మీద బండి నడకలా ఏమీ సాగలేదు. ముఖ్యంగా 1970 తర్వాత సృజన నిర్వహణ ఆర్థికంగానూ, నిర్వహణాపరంగానూ, ప్రభుత్వ కక్ష వల్లనూ కష్టభరితంగా సాగింది. మొత్తం జీవితంలో సృజనకు ఒక కార్యాలయం లేదు. వరవరరావు ఇల్లే కార్యాలయం. 1970ల తొలిరోజుల్లో కొద్ది నెలలు మినహా సృజన నుంచి జీతభత్యాలు తీసుకునే ఉద్యోగులు/ ఉద్యోగి ఎప్పుడూ లేరు. పత్రికకు సంబంధించిన అన్ని పనులూ సాహితీమిత్రులు, అందరికన్నా ఎక్కువగా వరవరరావు స్వచ్ఛందంగా, తమ సొంత ఆదాయాన్నీ, కాలాన్నీ, ఆరోగ్యాన్నీ ఖర్చు పెట్టి సాధించినవే. సృజనతో పాటే ప్రారంభమయిన సాహిత్య పత్రికలు రాచమల్లు రామచంద్రా రెడ్డి సంవేదన, సోమసుందర్ కళాకేళి, కె శివారెడ్డి వేకువ ఆగిపోయినది కూడా ఆర్థిక, నిర్వహణా కారణాల వల్లనే కావచ్చు. కాని ప్రజా ఉద్యమ నిబద్ధతే పునాదిగా సృజన నిలదొక్కుకుంది, నడిచింది, నడిపించింది. పాఠకుల నుంచి, సాహిత్యకారుల నుంచి, విప్లవోద్యమం నుంచి అపారమైన ప్రేమాభిమానాలను చూరగొన్నది సృజన. అదే విధంగా పాలకుల కన్నెర్రకు కూడా గురయింది. మొత్తంగా ఆరు సంచికల నిషేధం, ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్ ఇంటిపై సోదాలు, దాడులు, కేసులు, జైలు శిక్షలు, హత్యా ప్రయత్నాలు, దుష్ప్రచారాలు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిఫలం.
సృజన 200 సంచిక 1992 జూన్ లో రావలసింది. ప్రత్యేక సంచికగా మూడు వందల పేజీలతో తేవాలని అనుకోవడం, అందుకు అవసరమైన ఆర్థిక వనరుల కొరత, విప్లవోద్యమం మీద నిషేధం వంటి అనేక సమస్యలతో డిసెంబర్ దాకా ఆ సంచిక వెలుగు చూడలేదు. రెండు వందల సంచికల్లో వచ్చిన ఎంపిక చేసిన రచనలతో “ఈనాటి సాహిత్య సాంస్కృతిక అవసరాల దృష్ట్యా, ఒక తరంపై ఇరవై ఐదు సంవత్సరాల నక్సల్బరీ ప్రభావం – సృజనలో ప్రతిఫలించిన తీరుని ఒకచోట చదువగల రెండువందల సంచికల సృజన మంజూష మూడు వందల పేజీలయినా రావచ్చు” అని అది తేవాలనే ఆకాంక్షను, అది తేవడానికి ఆర్థిక వనరులు లేవనే వాస్తవ స్థితిని ప్రకటిస్తూ ఆ సంచిక చివరి అట్ట మీద ‘సృజన పాఠకులకు సంజాయిషీ – విజ్ఞప్తి’ ఒక పేజీ నోట్ అచ్చయింది. సృజన అలా ఒక నెరవేరని ఆకాంక్షతో, ప్రకటించకుండానే ఆగిపోయింది. భారత ప్రజానీకపు అనేక నెరవేరని ఆకాంక్షల లాగనే….
(తన ఇరవై ఆరో ఏట సృజన స్థాపించి, సంపాదకులుగా కొనసాగిన సాహితీమిత్రులు వరవరరావు ఎనబై ఆరో పుట్టినరోజు నవంబర్ 3 సందర్భంగా ఈ అరవై ఏళ్ల సృజన చరిత్ర శకలం ఒక కానుక)