“పొద్దు పొడిచినప్పటి నుండి పొద్దుపోయేవరకూ”- ఒక అంతంటూ లేని బండ చాకిరీతో అల్లాడిపోయే కార్మిక వర్గానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజకీయ డిమాండ్ “పనిగంటల తగ్గింపు”. ప్రప్రధమంగా 8 గంటల పని తగ్గింపుకై సాగిన సమరశీల కార్మిక పోరాటాలు ప్రపంచంలోని అన్ని మూలల్లో ఉన్న శ్రమజీవులందరినీ ఒక అరుణపతాకం కిందికి తెచ్చింది. ఈ మే డే పుట్టుక గురించి, మహత్తర “మే డే” చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సందర్భమిది!
మొదటగా ‘ఎనిమిది గంటల పని ఉద్యమం’ అమెరికాలో ప్రారంభమైంది. 1866, ఆగస్టు 20 న బాల్టిమోర్ నగరంలో 60 కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమై ‘నేషనల్ లేబర్ యూనియన్’ (జాతీయ కార్మిక సంఘం) అనే సంస్థను స్థాపించుకున్నారు. ఈ సంస్థ నిర్మాణానికి కృషి చేసిన యువ నాయకుడు విలియం హెచ్ సిల్విన్ ‘మౌల్డర్స్ యూనియన్’ (పొతపోసే కార్మికుల సంఘం) లో పని చేస్తూ, లండన్ లోని ‘మొదటి ఇంటర్నేషనల్’ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఆనాటి కార్మిక నాయకులలో ప్రముఖుడుగా ఎదిగాడు. ఆయన ప్రభావం వల్ల నేషనల్ లేబర్ యూనియన్, 1867 లో జరిగిన సదస్సులో అంతర్జాతీయ కార్మికోద్యమంతో ఐక్య సంఘటన కట్టడానికి ఆమోదం తెల్పింది. కానీ ‘నేషనల్ లేబర్ యూనియన్’ సదస్సు జరగడానికి కొంచెం ముందుగా విలియం హెచ్ సిల్విన్ అకాల మరణం పాలయ్యారు. ఇంటర్నేషనల్ సాధారణ సమితి తీర్మానంలో ‘అసమాన శక్తి సామర్ధ్యాలు కలిగిన కార్మిక వర్గ సేనాని విలియం హెచ్ సిల్విన్ కి ఘన నివాళులర్పించారు. తర్వాత త్వరలోనే నేషనల్ లేబర్ యూనియన్ అదృశ్యమైంది. దీనికి గల కారణాలలో సిల్విన్ ఆకస్మిక మృతి ఒకటి.
బోస్టన్ నగరంలో మెషినిస్టుగా పనిచేసే ‘ఐరా స్టెవార్డ్’ నేతృత్వంలో ఈ నేషనల్ లేబర్ యూనియన్ సాగించిన ఆందోళనలు చేసిన అనేక పోరాటాల ఫలితంగా దేశమంతటా ‘ఎనిమిది గంటల పని సమితులు’ ఏర్పడ్డాయి.
తొలినాటి కార్యక్రమాలు, విధానాలు చాలా ప్రాధమికమైనవి. అయినా సరే, మొదటి అడుగులు కష్టతరమైనవి కాబట్టి ఈ నాయకుల్ని మానందరం స్మరించుకోవలసిందే! స్పార్టకస్ ఒక్కక్షణం తీరిక దొరికినప్పుడు దుష్ట యజమానుల కెదురు నిలిచి పోరాడవచ్చనే మెరుపు లాంటి ఆలోచన తెచ్చుకున్నట్లే, వెట్టి చాకిరీ నుంచి తెప్పరిల్లుకుని పనిగంటల్ని తగ్గించుకోవడానికి సహచరులతో కలిసి సామూహిక పోరాటాలు చేయవచ్చని తలపోసి, భావి తరాలకు పోరాటమార్గానికి దారులు వేసిన మన పూర్వులకు మనం సదా కృతజ్ఞులమై ఉండాలి!
ఎనిమిది గంటల పని ఉద్యమాల గురించి మార్క్స్ అభిప్రాయం
1866 సెప్టెంబర్ లో జెనీవాలో జరిగిన “మొదటి ఇంటర్నేషనల్ మహాసభ, ఎనిమిది గంటల పని దినం న్యాయమైనది. అది ఒక ప్రాధమిక షరతు. ఆ షరతే లేకుండా పోతే కార్మిక వర్గం తన జీవన పరిస్థితుల మెరుగుదలకోసం, విమోచనకోసం చేసే సర్వ విధాలైన కృషికీ, చేపట్టబోయే అన్ని కార్య కలాపాలకూ ఎటువంటి ఫలితమూ లేకుండా పోతుంది. కాబట్టి ఎనిమిది గంటల పని దినాన్ని చట్టం చేసే దిశగా పోరాట మార్గాలు చేపట్టాలని పతిపాదించింది”.
1866 ఆగస్టు 20 న బాల్టిమోర్ లో జరిగిన ‘అమెరికా జాతీయ కార్మిక సంఘం’ సదస్సు ఎనిమిది గంటలపని దినాన్ని డిమాండ్ చేసింది. రెండు వారాల తేడా తోనే స్విట్జర్లాండ్ లోజరిగిన అంతర్జాతీయ జెనీవా మహాసభకూడా అదే డిమాండ్ ఎనిమిది గంటల పని దినాన్నే డిమాండ్ చేసింది. ఏక కాలంలో జరిగిన ఈ రెండు సంఘటనల ప్రాముఖ్యతను మార్క్స్ మన దృష్టికి తీసుకొచ్చారు.
1867 లో ప్రచురితమైన “పెట్టుబడి” మొదటి సంపుటంలోని ‘పని దినం’ అనే అధ్యాయంలో అమెరికా కార్మిక సంఘం సాగించిన ఎనిమిది గంటల పని ఉద్యమ ప్రారంభం పట్ల దృష్టి పెట్టవలసిందిగా మార్క్స్ పిలుపిచ్చారు.
“ఉత్పత్తి యాదృచ్చిక పెరుగుదలకు కావలసిన పరిస్థితులు దండిగా గల అట్లాంటిక్ సముద్రాని కిరువైపులా ఉన్న కార్మికోద్యమం అదే ఎనిమిది గంటల పని పరిమితి ఉద్యమాన్ని ఆమోదించింది – ఈ డిమాండ్ ను యావత్ ప్రపంచ కార్మికుల సార్వత్రిక వేదికగా ఈ మహాసభ మారుస్తున్నది”- అని తీర్మానించారు.
మే డే కోసం కార్మికుల పోరాటాలు- అమెరికా ప్రభుత్వ కుట్రలు
సమ్మెల్ని కౄరంగా అణచివేసేందుకు సైన్యాన్ని మోహరించిన అమెరికా ప్రభుత్వానికీ, కార్పొరేట్లకూ వ్యతిరేకంగా 1877 నాటి రైల్వే, ఉక్కు కార్మికులు చేసిన మహోజ్వల పోరాటాలు ప్రపంచ కార్మికోద్యమంపై చెరగని ముద్ర వేశాయి. ఇది అమెరికన్ కార్మిక వర్గం చేపట్టిన గొప్ప ప్రజా సామూహిక చర్య. కార్పొరేట్ శక్తుల చేతిలో ఓడిపోయినప్పటికీ అగ్నిపరిక్షల పోరాటాల్లో శ్రమజీవులు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. కేంద్ర కార్మికసమాఖ్య ఈ ఎనిమిది గంటల పని ఉద్యమానికి మద్దతు నివ్వమని శ్రామిక వీరుల సంఘానికి విజ్ఞప్తి చేసింది. సంఘటిత సంఘాలు, సమితులు, సంస్థల సభ్యత్వం రోజు రోజుకీ విపరీతంగా పెరగిపోవడం ప్రారం భించింది. 1881 నుంచి సమ్మెలు, లాకౌట్లు, ఫ్యాక్టరీల మూసివేతలు గణనీయంగా జరిగాయి. 1885లో 2467 కంపెనీలు మూత పడగా, తర్వాతి సంవత్సరానికి 11562 కంపెనీలు మూత పడ్డాయి. శ్రామిక వీరుల సంఘనాయకులు వెన్నుపోటు పొడిచినప్పటికీ చికాగో నగర కార్మికులు దీటుగా నిలబడ్డారు. చికాగోతో పాటు న్యూయార్క్, బాల్టిమోర్, మిల్ నెకీ, సిన్సినాటీ, సెయింట్ లూయిస్, పిట్స్ బర్గ్, డెట్రాయిట్ మొదలైన అనేక నగరాల్లో ఉత్పత్తి పనిముట్లను పక్కన పడేసి, కర్మాగారాలను వదిలి, సమ్మెలు చేసి అద్భుతమైన మిలిటెన్సీని ప్రదర్శించాయి. ఈ సమ్మెల్లోకి విశాల ప్రజానీకంలో ఉన్న అసంఘటితంగా అనేక రంగాలలో పనిచేసే శ్రామికులు, కార్మికులు విశేషంగా తండోపతండాలుగా సమీకృతులయ్యారు. ఆ కాలంలో సానుభూతి సమ్మెలు విశేషంగా జరిగాయి. ఎల్లెడలా తిరుగుబాటు తత్వం, విప్లవస్ఫూర్తి వ్యాపించాయి. ఈ సమ్మెల్లో పాల్గొన్న కార్మికుల్లో సగంమంది తమ డిమాండ్లను సాధించుకున్నారు! కొందరు తమ పని గంటలను తగ్గించుకోగలిగారు!
చికాగో హే మార్కెట్ సమ్మె
చారిత్రాత్మకమైన 1886 మే ఒకటి న చికాగో సమ్మె మహోద్వేగంగా, మహోజ్వలంగా, బహుముఖాలుగా విస్తరిస్తూ సాగింది. సమరశీల కార్మిక బృందాల మద్దతుతో కేంద్ర కార్మిక సంఘం నాయకత్వంలో ఎనిమిది గంటల పని ఉద్యమం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
తర్వాత కార్మికవర్గ శత్రువులు, కార్మికులను చిత్రహింసలకు గురి చేశారు. మే 3 న సమ్మె చేస్తున్న కార్మికుల సభపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురు కార్మికుల్ని పేల్చివేశారు. మే 4 న కార్మికులు నిరసన తెలుపుతూ జరుపుకుంటున్న సభపై పోలీసులు మళ్ళీ దాడి చేశారు. బాహా బాహీ పోరాటంలో భీకరమైన రక్తపాతం జరిగింది. ఆ యుద్ధంలో నలుగురు కార్మికులూ, ఏడుగురు పోలీసులూ చనిపోయారు. అల్బర్ట్ పార్సన్, ఆగస్టు స్పైస్, ఆడాల్ఫ్ ఫిషర్, జార్జ్ ఏంగెల్స్ అనే నలుగురు మిలిటెంట్ కార్మిక నాయకులను ఉరికంబా లెక్కించి, హత్యలు చేశారు! ఇతర చికాగో కార్మిక నాయకులను జైళ్ళ పాలు చేశారు!
అంతర్జాతీయ – మే డే ఎంగెల్స్
1893 లో స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లో జరిగిన మహాసభకి ఎంగెల్స్ హాజరయ్యారు. సామాజిక మార్పు ద్వారా వర్గాంతరాలను అంతమొందించడానికి, కార్మిక వర్గం అచంచల దృఢ సంకల్పంతో, ఎనిమిది గంటల పని దినం కోసం మే ఒకటిన జరిపబోయే ప్రదర్శనకు సంసిద్ధం కావాలనీ, అది అక్కడి సకల ప్రజలకు శాంతిని మాత్రమే గాక, అంతర్జాతీయ కార్మికులందరి శాంతి, శ్రేయస్సులకు మార్గం కలిగించాలనే సూచనతో అంతర్జాతీయ కార్మిక సంస్థ మహాసభ తీర్మానం చేసింది.
ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళిక నాల్గవ జర్మన్ ప్రచురణకు 1890 మే ఒకటిన పీఠిక రాస్తూ, అంతర్జాతీయ కార్మిక సంఘం ప్రాముఖ్యతను సమీక్షించారు. దేశ దేశాల కార్మిక వర్గాలు ఒక జెండా కింద సమీకృతమై పోరాడుతున్న వైనాన్ని మన ముందుంచారు. ఇప్పుడు గనక మార్క్స్ నాతో ఉండి ఉంటే ఎంత బాగుండేది అని ఆర్ధ్రంగా గుర్తు చేసుకున్నారు!
1990 లో పారిస్ లో జరిగిన మహాసభ పూర్వపు మహాసభలు చేసిన తీర్మానాలను పునరుద్ఘాటించి, తిరిగి ఆమోదించింది.
మే డే –లెనిన్
మే డే అంటే హక్కుల సాధన కోసం ప్రదర్శనలు, పోరాటాలు చేసే దినంగా రష్యన్ కార్మికులు గుర్తించే విధంగా లెనిన్ కృషి చేశారు. 1896 లో అలతి అలతి పదాలతో, అక్షరాలు మాత్రమే తెలిసిన అతిసాధారణ చదువున్న శ్రామికుడికి సైతం అర్ధమయ్యే భాషలో 2000 కరపత్రాలను రహస్య జీవితంనుండే లెనిన్ రాశారు. అవి నలభై కార్ఖానాల లోని కార్మికులకి పంపిణీ చేయబడి, కార్మికుల్ని ఉత్తేజ పరిచి, విప్లవోన్ముఖుల్ని చేశాయి. లెనిన్ నాయకత్వంలో కార్మికులు “ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల విరామం, ఎనిమిది గంటల వినోదం” అని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాల కార్మికులందరూ చేస్తున్న డిమాండ్ కూడా ఇదే!
మే డేకి ఇంత సుదీర్ఘమైన, త్యాగాల మయమైన పోరాట చరిత్ర ఉంది. కానీ ప్రస్తుతం ఎనిమిదిగంటల పనిని, పది, కొన్నిచోట్ల పదహారు గంటలకు కూడా పెంచూతున్నారు. ఇకముందు కార్పొరేట్ల ప్రైవేట్ పాలనలో మన ముందు తరాల త్యాగాల్ని వృధా చేస్తూ ఇంకెన్ని అమానవీయ చర్యలు చేపట్టనున్నారో?
మనల్ని వారసుల్ని చేస్తూ మన పూర్వులు మనకోసం ఆర్జించి పెట్టిన ఇప్పటి సౌఖ్యాలూ, సుఖ శాంతులూ స్మరించుకున్నా, తెల్లారి లేస్తే మనం వాడుతున్న ప్రతి వస్తువూ ప్రపంచంలోని ఏదో ఒక మూలలో ఎవరో మన ఆత్మబంధువుల్లాంటి శ్రామికులే ఉత్పత్తి చేశారనే ఎరుక కలిగినప్పుడు మానవాళి పట్ల అపూర్వమైన ప్రేమ కలుగుతుంది! మన బంధం అవిభాజ్యంగా, విడదీయరాని విధంగా ముడిపడి ఉందనే అపురూపమైన భావనతో ఉద్వేగంతో మనసంతా నిండిపోతుంది!
మనం ఒకరినొకరం కామ్రేడ్స్ అని పిలుచుకుంటుంటాము కదా! అసలు కామ్రేడ్ కున్న అసలైన అర్ధం, అతను నిజానికి సమాజంలో ఎవరి పక్షవైపు ఉండాలి అనే విషయం గురించి ప్రపంచ మేధావుల ఆలోచనలేమిటో తెలుసుకుందాం.
“కామ్రేడ్” అంటే ఏమిటి? అతని కర్తవ్యాలేమిటి?
ఉద్యోగులుగా, కార్మికులుగా, శ్రామికులుగా – మనం యూనియన్లలో పని చేస్తున్నప్పుడు ఒకరినొకరం “కామ్రేడ్” అని పిల్చుకుంటుంటాం. మనం చాలా అలవాటుగా వాడుతున్న ఈ “కామ్రేడ్” అనే పదానికి అసలైన అర్ధమేమిటి? కామ్రేడుల బాధ్యతలు, కర్తవ్యాలేమిటి? మనం నిత్య జీవితంలో వాడుతున్న ఈ పదునైన స్ఫూర్తి నిచ్చే కామ్రేడ్ పదం గురించి మే డే సందర్భంగా ఒకసారి మననం చేసుకుందాం!
ప్రజల్లో కొందరు కొన్ని పదాల అర్ధాలు నిర్ధిష్టంగా తెలియకపోయినా అలవోకగా వాడేస్తుంటారు! ఉదాహరణకి రాజకీయ నాయకులు తమ ఉపన్యాసాల్లో ఊతపదాల్లా ఉదరగొట్టే ‘ప్రజాస్వామ్యం’, ‘స్వేచ్ఛ’, ‘సౌభ్రాతృత్వం’ మొదలైన పదాల అర్ధాలు వాటి అసలైన అర్ధంలో వాళ్ళకి తెలియనే తెలియదు! కానీ మనవాళ్ళు వేల, వందల సంవత్సరాల తరబడి పోరాడి సాధించి పెట్టిన సమానత్వాన్ని సూచించే ఈ పదాల అర్ధాలు బాధ్యత గల పౌరులుగా మనం తెలుసుకోవాలి! యూనియన్లలో పనిచేసే ఉద్యోగులుగా, విపవోద్యమ లక్ష్యంతో మనం ఒకరి నొకరం “కామ్రేడ్” అని సంబోధించుకుంటుంటాం. ఉద్యోగులందరికీ కామ్రేడ్ అనే పదానికి అసలైన అర్ధం తెలిస్తే ఇంకా బాధ్యతాయుతంగా పని చెయ్యడానికి స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ చైతన్యంతో పనిచేసే కార్మికుల్నే కామ్రేడ్స్ అనవచ్చు!
ఇంకా కొంచెం వివరాల్లోకి వెళ్లి చెప్పుకొవాలంటే, చరిత్రలో చాలామంది ఈ పదానికి చాలా రకాల అర్ధాలు చెప్పారు. కానీ పోరాట స్ఫూర్తిని కలిగించే అర్ధం ‘కెవిన్ “రషీద్” జాన్సన్’ అనే ఆయన చెప్పారు. “రషీద్” న్యూ ఆఫ్రికన్ బ్లాక్ పాంథర్స్ పార్టీలో పని చేస్తున్నారు. ఈ పార్టీ మార్క్సిస్ట్ భావజాలానికి చెందిన ఒక సామ్యవాద సంస్థ. ఈ పార్టీ సభ్యులందరూ అన్యాయంగా జైలుశిక్షను అనుభవిస్తున్నవారే! రషీద్ స్వయంగా జైలులో ఉండగా అధికారుల నుండి అన్ని రకాల హింసలను, అణచివేతలను అనుభవించాడు! ఆయన అనేక వ్యాజ్యాలను దాఖలు చేసి జైలు సంస్కరణలను సాధించాడు. ఈనాటి పాలకులు “ఖైదీలు చేస్తున్న శారీరక శ్రమను ఆధునిక బానిసత్వానికి ఒక కొత్త రూపంగా రూపొందిస్తున్నారు” అని ‘ది గార్డియన్’ కిచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ పేర్కొన్నారు. అద్భుతమైన రాజకీయ నవలలను రచించి ప్రచురించారు. రషీద్ గొప్ప చిత్రకారుడు కూడా. కాలిఫోర్నియా ఆకలి సమ్మెలను గురించి అత్యంత భావస్ఫోరకంగా, ప్రభావవంతంగా పలుచిత్రాలను చిత్రీకరించారు. వీరి బృందాలు ఆఫ్రికన్ – అమెరికన్ సంస్కృతి మీదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దోపిడీ-పీడనలకు గురవుతున్న సమాజాల సమూహాల మీద కూడా తమ దృష్టిని కేంద్రీకరించి పని చేస్తారు. కాబట్టి రషీద్ సృష్టించిన కామ్రేడ్ పదం ప్రపంచ పీడితులందరితో పాటు మనకీ వర్తిస్తుంది!
అసలు “కామ్రేడ్” అంటే ఏమిటి? మనం ఈ పదాన్ని ఏ యే సందర్భాలలో, ఎందుకు ఉపయోగిస్తున్నాం? అని ప్రశ్నించి విప్లవాత్మక పోరాటాలలో కామ్రేడ్ భావనకు ఒక ప్రత్యేకమైన అర్థం, ప్రాముఖ్యత కలిగి ఉంటాయని చెప్తారు రషీద్. మనకు తరచుగా వినబడే అమ్మ, నాన్న, అక్క, అన్న, తమ్ముడు, అత్త, మామా లాంటి బంధువుల తాలూకు పిలుపులు, ‘మిస్టర్’, ‘మిస్ట్రెస్’, ‘యువకుడు’, ‘యువతి’, ‘స్నేహితుడు’, ‘స్నేహితురాలు’ మొదలైన ఇంకా ఎన్నో నిత్య జీవితంలో వాడే పదాల్లాంటిది కాదు ఈ కామ్రేడ్ పదం. కొత్తగా యూనియన్లలోకీ, ఉద్యమాల్లోకీ, విప్లవ సంస్థల్లోకీ వచ్చేవారు ఈ పదం విశిష్టత గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉబలాటపడుతుంటారు!
సమానత్వ సంస్కృతి మీద ఆధారపడి ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని ఆశించే వారందరూ ఒక బృందంగా ప్రత్యేకమైన సంబంధాలు కలిగి ఉంటారు. వారు భౌతికంగా, మానసికంగా విప్లవాత్మక రూపాంతరం చెందుతున్న క్రమంలో ఎవరికివారు తమని తాము ప్రక్షాళన చేసుకుంటూ, తమ భావజాలంతో ఏకీభవిస్తున్న తమతోటి సమూహాల లోని మనుషులను సంబోధించటానికి ఉపయోగించే పిలుపు “కామ్రేడ్”. ఒక పురుషుడు కావచ్చు. ఒక స్త్రీ కావచ్చు. “కామ్రేడ్” అంటే ఒక వ్యక్తి. ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏ సంస్కృతి నుంచి వచ్చిన వారైనా కావచ్చు. కానీ అన్ని రకాల అసమానతలకూ అన్ని రకాల అణచివేతలకూ వ్యతిరేకంగా తోటి కార్మికులతో, సహచరులతో, శ్రామిక జనంతో భుజం భుజం కలిపి పోరాడే దృఢమైన మనస్తత్వం కలిగినవారే కామ్రేడ్స్!
కామ్రేడ్స్ అందరూ ఒకరికొకరు అన్ని సందర్భాల్లో, ఎటువంటి ఒడిదుడుకుల్లోనైనా “నీకు తోడుగా నేనుంటాను. మనం మనం ఒకటి” అనే స్ఫూర్తిమంతమైన భరోసాతో పరస్పర గౌరవంతో ఉండాలి. కామ్రేడ్స్ ఏ షరతులూ లేకుండా నిబద్ధతతో, నిజాయితీగా తాము నమ్మిన సిద్ధాంతం కోసం ఐక్యంగా జీవితాంతం నిలబడాలి. అల్పమైన ఇతరేతర పోరాటాల మీద కాక విప్లవాత్మకమైన వివిధ పోరాటాల సంఘీభావాన్ని సాధించాలి. మనం ప్రాతినిధ్యం వహించే ఈనాటి పోరాటాల అంతిమ లక్ష్యం సమ సమాజం కావాలి!
“నేను మిమ్మల్ని “సోదర సోదరీ మణులారా” అని పిల్చేకంటే “కామ్రేడ్స్” అనే పిలుస్తాను. సోదర సోదరీలకు ఏమాత్రం సమానత్వ నిబద్ధత ఉండదు. నువ్వు నా కామ్రేడ్ వైనప్పుడు అసంకల్పితంగా నేనూ నీ కామ్రేడ్ నైపోతాను. ఇద్దరం ఒక నికార్సైన నిబద్ధతకూ, బాధ్యతకూ కట్టుబడి ఉంటాం. కామ్రేడ్ కి నిజమైన రాజకీయ అర్ధం ఇదే! వ్యక్తుల మధ్య పరస్పర సహకారం, గౌరవం, నమ్మకం, పోరాట నిబద్ధత అనే సుగుణాలు కామ్రేడ్ లను బంధించి ఉంచుతాయి. ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉండే ఈ స్వభావమే సంస్థల్లో మరింత బలపడి ప్రజలందరి మధ్యా పరస్పర విశ్వాసాన్ని పెంపొందించి, పోరాట ప్రక్రియలో ఇది కాంక్రీట్ సిమెంట్ పునాదిలా గట్టిపడి, బిగుసుకుని పటిష్ఠమైన ఐక్యపోరాటాలుగా ఆవిర్భవిస్తాయి. శాఖోపశాఖలుగా అనేక చోట్ల వ్యాపించి ఉన్నఈ సంస్థలన్నీ ఏకమై, ఎటువంటి ప్రమాదాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి ప్రజలందరి సామాజి న్యాయం కోసం నిలబడతాయనీ, సమ సమాజాన్ని నిర్మిస్తాయ” నీ రషీద్ ధృవీకరిస్తారు! ఇదంతా ‘కెవిన్”రషీద్”జాన్సన్’ తన న్యూ ఆఫ్రికన్ బ్లాక్ పాంథర్స్ పార్టీ సభ్యులకి చెప్పినప్పటికీ అక్షరాలా ఇది సమసమాజాన్ని బలంగా కోరుకునే వారందరికీ కూడా ఆచరణీయమైనదే!
ప్రభుత్వాలు అవసరమైనప్పుడు “మీరు ఉద్యోగులు-ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వం కోసమే పని చెయ్యాలి” అంటూ చాలా స్నేహపూర్వకంగా హితవు చెప్పినట్లు చెప్తాయి. టాక్సులు, బిల్లులు వడ్డించేటప్పుడు మాత్రం మీరు ప్రజల్లో భాగం అంటూ పెద్ద పెద్ద వ్యాపారస్తులకంటే ఎక్కువగానే, ఆ మాటకొస్తే జీవితాంతం సేవలందించిన పింఛను దారులతో సహా ఇన్ కంటాక్సు బిల్లులు, ఎలెక్ట్రిసిటీ బిల్లులు, జి ఎస్ టీ బిల్లులు మొదలైన సమస్త బిల్లులన్నీ ప్రజలతో పాటే చక్కగా వడ్డిస్తాయి. కాబట్టి ఉద్యోగులుగా ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవచెయ్యాలనీ, ప్రజల సంక్షేమంకోసం మాత్రమే పని చెయ్యాలనీ, విశాల ప్రజానీకంతో పాటు కామ్రేడ్స్ కూడా ప్రజల విభాగంలోకే వస్తారనీ ప్రధానంగా గుర్తించాలి!
మనది ప్రజాస్వామ్య, లౌకిక, సర్వసత్తాక గణతంత్ర దేశమని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అంటే దేశంలోని ప్రజలందరూ స్వయంసమృద్ధితో ఉండడాన్నే గణతంత్ర దేశమంటారు. స్వావలంబన అంటే (మన ప్రధాని ఉద్ఘాటించే ఆత్మ నిర్భర్ భారత్) స్వీయ వనరులు, స్వీయ పరిజ్ఞానం, సొంత శ్రమతో దేశం మొత్తానికవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసుకొని వినియోగించుకోవడం. మరి మనదేశంలో ప్రజలందరికీ వీటిలో ఏ ఒక్క లక్షణమైనా ఉండి సంతోషంగా ఉన్నారా? స్వయంసమృద్ధి సరే కనీసం కూడూ, గుడ్డా, గూడూ లేని జనం జనాభాలో మూడొంతులమంది ఉన్నారు. ఇంకో పక్క గుప్పెడుమంది ప్రపంచ కుబేరుల జాబితాలో కెక్కి క్షణ క్షణానికీ వాళ్ల సంపద పాపం పెరిగినట్లు పోతుంది. బెర్నార్డ్ షా “ధనవంతుల ఆస్థులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల నుంచి దోచుకున్నవే” అన్నారు. అవును కదా? మరి ఇంత అసమానతలున్న దేశం ప్రజాస్వామ్య,లౌకిక, సర్వసత్తాక గణతంత్ర దేశమేనా?
ప్రజాస్వామ్యదేశంలో ప్రజలే నిర్ణయాత్మక శక్తులుగా ఉండాలి. పాలకులు వారికి జవాబుదారీగా ఉండాలి. జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన ప్రభుత్వరంగానికి సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సులే లక్ష్యంగా కొంతమేరకు పని చేసింది. ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, దేశ సంపదను పెంచింది. అంకితభావం కలిగిన కార్మికులే ప్రభుత్వరంగ సంస్థలను కాపాడారు. మొదటి మూడు దశాబ్దాల్లో బలమైన కార్మికోద్యమం, త్యాగాలు చేసిన కార్మిక నాయకులు ఒక నూతన చరిత్రను సృష్టించారు. ఇలాంటి ఉద్యమంలో నుండి శంకర్ గుహ నియోగి లాంటి ఎంతోమంది అరుదైన నాయకులు వచ్చారు. అలా నిజాయితీ కలిగి అత్యున్నత విలువలను ఆచరించి, వ్యక్తిగత త్యాగాలు చేసిన వారు ప్రతి ప్రభుత్వరంగ సంస్థలోనూ, చరిత్ర పొడవునా మనకు కనిపిస్తారు. ఫలితంగా ఇవ్వాళ దేశంలో దాదాపు 400 ప్రభుత్వరంగ సంస్థలు పని చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రహదారులు, భారీ నీటి ప్రాజెక్టులు, స్టీలు, బొగ్గులాంటి సహజ వనరులు, డిఫెన్స్ ప్రొడక్షన్, ఔషధాల ఉత్పత్తి, రైళ్లు, విమానాలు, బస్సులు, విద్య, వైద్యం, ప్రతిష్ఠ కలిగిన ఐఐటిలు, విశ్వవిద్యాలయాలు – ఒకటి కాదు సామాజిక అవసరాలకు, అలాగే మార్కెటు ఆటుపోటులను తట్టుకోవడానికి భిన్నమైన ప్రభుత్వరంగ సంస్థలు ప్రారంభించబడ్డాయి. బలహీన వర్గాలు, స్త్రీలు రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పొంది ఆర్థికంగా ఎదిగారు. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే ఈనాటి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి!
2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలంటూ బూటకపు ప్రచారాలతో దాసోహపడుతూ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది. “అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా ఏ శషబిషలూ లేకుండా నిస్సిగ్గుగా సెలవిచ్చింది. దేశభక్తి అంటూనే దేశద్రోహం తలపెడుతుంది. మరోవైపు ఆత్మనిర్భర్ అంటూనే సర్వసంపదలు పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తోంది. ప్రభుత్వ రంగమన్నదే లేకపోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు? ప్రభుత్వ కంపెనీలన్నీ అమ్మేసేవాడు ప్రజలకు ఉద్యోగాలెక్కడినుంచి ఇవ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా, వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు చదువు కొనగలిగిన వారి సంగతి సరే, కొనలేని భావి పేద బాల బాలికల విద్యకు గతేమిటి? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతో పాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా? వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతో పాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు? భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమ రాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగం అనేదే లేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా?
దేశంలో మేడిపండు స్వాతంత్ర్యమే వర్ధిల్లుతోంది! ఈ మేడిపండును విప్పి లోపలి లుకలుకలను చూపించి చెప్పవలసిన గురుతరమైన బాధ్యత కామ్రేడ్స్ దే! రైతు ఉద్యమాలు, రైతు ఆత్మ హత్యలు, చేనేత ఆత్మ హత్యలు, స్త్రీలపై అత్యాచారాలు, గోమాంసం తింటున్నారనే నెపంతో సొంత మనుషుల్ని నిలువునా నరకడం, ఎక్కడ చూసినా కనిపిస్తున్న భీభత్స పరిస్థితుల్ని గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు కామ్రేడులుగా మనం వివరించాలి! గోవులకు, నదులకు పవిత్రతను ఆపాదించి ప్రజలకు మతం మత్తు కలిగించే స్వాములు, గురువులను నెత్తికెక్కించుకునే ప్రభుత్వాల గుట్టు విప్పి చెప్పాలి! “కోరికల్ని చంపుకో, కష్టాలు పూర్వజన్మ పాపఫలితం, పరోపకారమే జీవిత పరమార్ధం. యజమానులు చెప్పింది చేస్తే తిండి దొరుకుతుంది. ఏదీ, దేన్నీ ప్రశ్నించకూడదు”- మొదలైన మనుధర్మశాస్త్రం లోని నీతులు నిరుపేదలకు మతగురువుల ద్వారా ప్రభుత్వం చెప్తుంది. దీని వెనక ఉన్న రాజకీయాల్ని మనం స్పష్టంగా విప్పి చెప్పాలి. నిజమైన సంపద సృష్టికర్తలకు నిత్య దారిద్ర్యం సృష్టిస్తున్నదెవరో కష్టజీవులకు కామ్రేడ్స్ తేటతెల్లం చెయ్యాలి!
సాధారణ ప్రజలకు ఏది, ఏమిటి అనే వాస్తవ చైతన్యం రానంతవరకే ఈ కార్పొరేట్ శక్తుల ఆటలు సాగుతాయి. ఒకసారి ప్రజలకు నిజమైన చైతన్యం వచ్చిందంటే ఇప్పుడు విజృంభిస్తున్నదుష్టశక్తులన్నీ శలభాల్లా మాడిపోతాయి! ఈ శ్రామిక శక్తులకు చైతన్యాన్నీ, దిశా నిర్దేశాన్నీ కలిగించడంలోనే కామ్రేడ్స్ కీలకమైన బాధ్యత ఉంటుంది. సాధారణ ప్రజలు, అసంఘటిత రంగాలలోని శ్రామికులు, ఉద్యోగులు పడుతున్న కష్టాల్నీ, సమాజంలో జరుగుతున్న మార్పుల్నీ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ప్రజలను ఓట్ల కోసం పాలకులు, తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం కోసం కార్పొరేట్ శక్తులు మానసికంగా, సాంస్కృతికంగా లొంగదీసు కుంటున్నప్పుడు వాళ్ళను చైతన్యపరిచే విధంగా కామ్రేడ్స్ పని చెయ్యాలి. లెనిన్ తన ప్రజల్ని పోరాటాల కనువుగా మార్చు కోవడానికి అతి తేలికైన పదాలతో వారికోసం ఆర్తిగా కరపత్రాలు రాశారు కదా, అలాగే మనం కూడా వారి కర్ధమయ్యేటట్లు తేలికగా వారి వాడుక భాషలో ఉండే పదాలను ఉపయోగిస్తూ అసలు కిటుకులనూ, కుట్రలనూ విప్పి చెప్పాలి.
కర్షకులకు రుతువులు, పంటలు, ఎరువులు, వర్షాభావ సూచనలు వీటి గురించిన జ్ఞానమే తప్ప సామాజిక స్పృహ ఉండదు. చిన్న చిన్నకూలి పన్లు చేసుకునే వారికి ఈరోజు రెండు పూట్లా గడిచే దిక్కేది? అన్న ధ్యాసలోనే ఉంటారు. వారికి సమాజం గురించి పట్టదు. మేధావులు సమాజాని కవసరమైన జ్ఞానాన్నందిస్తారు గానీ వాళ్ళు ప్రజలకు నేరుగా విశదపరిచే పరిస్థితుల్లో అందుబాటులో ఉండరు. ఇక మిగిలింది పాలకులకూ ప్రజలకూ మధ్య అనుసంధాన కర్తలైన కార్మికులే! భావి తరాల, ప్రపంచ మేధావులకు మేలైన భవిష్యత్తును నిర్మించగలరనే ఆశలన్నీ కామ్రేడ్స్ మీదే! అందుకే మార్క్స్, ఏంగెల్స్-కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో “ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖీగా నిలబడిన వర్గాలన్నిటిలోకీ కార్మిక వర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి, క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి. ఆధునిక పరిశ్రమల అతి ముఖ్య సృష్టి” – అని అన్నారు.
కనీస వేతన చట్టాలు, నిర్ణీత పని గంటలు, సంఘాలు పెట్టుకునే హక్కు, యూనియన్ల పోరాటాలు, కార్మికుల ఐక్య కార్యాచరణ, స్త్రీల హక్కులు, ప్రజా సంక్షేమ చట్టాలు మొదలైనవన్నీ నామామాత్రంగా నైనా ఈనాటి వరకూ వ్యవస్థలో ఇంకా బతికి ఉండడానికి కారణం మన ముందుతరాల త్యాగధనులు సాధించి పెట్టిన బలమైన ఉద్యమ ఫలితాలైన హక్కులే! ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటిని కూడా నిలవనిస్తాయన్న నమ్మకం రోజు రోజుకీ అడుగంటిపోతుంది!
వ్యాపార సామ్రాజ్యంలో కుట్రలూ, కుతంత్రాలూ పన్నగలిగిన ధనిక వర్గపు చేతిలో సమాజాన్ని నడిపించే పగ్గాలుంటాయి! పెట్టుబడిదారీ విధానమే ఒక పెద్ద దుష్ట శక్తి. అది వ్యక్తి వాదాన్నీ, వ్యక్తి ప్రయోజనాన్నీ కృత్రిమ కోరికల్నీ ప్రేరేపిస్తుంది. మనిషిని సహజీవనానికి దూరం చేస్తుంది. ప్రభుత్వబలగాలన్నీ ఈ ధనస్వామ్యానికి సర్వదా తమ సేవలందిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాయి! భౌతికంగా తమ దౌర్జన్యం కొనసాగించడానికి యాజమానుల వద్ద సైన్యం, పోలీసులు, ఆయుధాలు, తూటాలు, జైళ్ళు ఉంటాయి. ఇంకా ఆలోచనల్ని అణచడానికి వివిధ రాజకీయపార్టీలూ, ప్రణాళికలూ, విద్యాసంస్థలూ, గుళ్ళూ, స్వామీజీలూ, దొంగ బాబాలూ, పత్రికలూ, సాహిత్యం, సినిమాలూ ఉంటాయి!
ఈ ధనిక వర్గానికి ప్రత్యామ్నాయంగా మనుషులందరూ ఒక్కటే, అందరూ ముఖ్యమే అన్న మానవ స్వభావంలో పుట్టుకతోనే ఉన్న భావనను ప్రచారం చెయ్యాలి. కళ్ళముందు కనిపించే కఠోర వాస్తవాల పట్ల అప్రమత్తంగా ఉండి చుట్టూ సమాజాన్ని నిరంతరం మేల్కొల్పుతుండాలి. జీత భత్యాలకోసం చేసే పోరాటాలే కాకుండా సామాజిక స్పృహతో శ్రీ శ్రీ అన్నట్లు ప్రపంచపు బాధని మన బాధగా సహానుభూతితో అర్ధం చేసుకుంటూ పాలకులు ప్రచారం చేస్తున్న వ్యక్తి వాదానికి ప్రత్యామ్నాయంగా సమిష్టి భావనను పెంపొందించాలి! సకల సంపదలు సృష్టిస్తూ పీడనకు గురవుతున్న శ్రామికుల పోరాటాలను కార్మికవర్గం లోని కామ్రేడ్స్ నిర్మించాలి.
“మన ప్రజలు మనకు పర్వతాలంత ఉన్నతమైనవాళ్ళు” అని అంటారు “అమిల్కర్ కాబ్రాల్”. హిమాలయాలంత పర్వతశక్తి గలిగిన ఈ కష్టజీవుల నుంచే మనకి అపరిమితమైన బలం వస్తుంది. కామ్రేడ్స్ ఈ బలాన్ని సవ్యమైన రీతిలో ఆచరణలో పెట్టడానికి కృషి చెయ్యాలి. సమ సమాజాన్ని కాంక్షించే ప్రపంచ మేధావులందరూ కార్మికులే నూతన సమాజ మార్గదర్శకులని నమ్ముతున్నారు! కార్మిక, కర్షక, మేధావి ఐక్యత వర్ధిల్లాలి అన్న అద్భుతమైన వాక్యంలో కార్మికుల (కామ్రేడ్స్) బాధ్యతే గురుతరమైనది!
“ఆదివాసీ సామూహిక మారణ కాండతో మనం జీవిస్తున్న ఈ శతాబ్దం ముగిసే అవకాశం ఉందన్నారెవరో!”- అని సుధా భరద్వాజ్ అన్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇప్పుడు మనం ఆ ఆదివాసీ జాతుల హననాన్ని కళ్ళారా చూస్తున్న దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే మనమందరం పోరాడే ప్రజలతో కలిసిపోవాలి.
ఇప్పుడు కార్మికుల హక్కులను అన్నిటినీ హరించివేస్తూ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లూ దేశంలోని ఉత్పాదక కార్మిక శక్తినీ, సమస్త శ్రామిక శక్తినీ అధఃపాతాళానికి తొక్కేయడానికి దుష్ట పన్నాగాలు పన్నుతోంది. దీనిని ప్రతిఘటించడానికి దేశంలోని పోరాడే శక్తులన్నీ ఏకం కావాలి. నీపార్టీ, నాపార్టీ అనే యూనియన్ల నాయకుల అహాలను వదిలేసి అట్టడుగు, అణచివేతలకు గురవుతున్న శ్రామికులందరితో కలిసి పని చేయాలి. అంచులకు నెట్టివేయబడుతున్న వర్గాలను సమీకరించగలగాలి. సమాజంలోని కింది పొరల నుంచి గొప్ప కుదుపులు తేగలగాలి. ఆ సమరశీల పోరాటాలు ఉధృతంగా దావానలంగా వ్యాపిస్తాయి. అప్పుడే దున్నపోతు చర్మా లున్న ఏలికలకు సెగ తగులుతుంది. అలాంటి పోరాటాలకు మనల్ని మనం “కామ్రేడ్” లుగా సంసిద్ధులను చేసుకోవడమే అసలైన దేశభక్తి!