మణిపూర్ మానవత్వం

మొట్టమొదలు ఒక పీడకలలో
మరణిస్తున్న మనిషి గావుకేక
తర్వాత రేడియో, వార్త పత్రికలో వార్త

ఆరుగుర్ని కాల్చి చంపారు
ఇరువై అయిదు ఇళ్లు నేలమట్టం చేసారు
ఒక చర్చి లోపల పదహారుమంది చేతులు
వెనక్కి విరిచికట్టి శిరచ్ఛేదం చేసారు

రోజులు గడుస్తూ ఉంటే
విజేతలు, వారి బాధితుల సంఖ్య
పెరుగుతూ పోయింది
మందమైపోతున్న తోలు
లోలోపల నేను కఠినమైపోయాను;
నా బలహీనమైన మానవత్వం
కోల్పోయేదాకా

వదిలేసిన పిల్లలు మండుతున్న
గుడిసె లోపల ఇంకా తలిదండ్రుల కోసం
నిరీక్షిస్తుంటారని
ఆలోచించడం మానేసాను

ఎన్నో చలికాలాలు
కుంపట్ల దగ్గర అమ్మమ్మలు చెప్పిన
కథలు వాళ్లకు గుర్తొచ్చాయా

నిద్రపోతున్న మృత్యువేళ
నేను తెలుసుకోవాలనుకోవడం లేదు
వాళ్లు అక్షరాల మాంత్రిక శక్తిని
నేర్చుకున్నారా అని

విత్తనాలు మోస్తున్న స్త్రీలు…
వాళ్ల మృదువైన దేహాలను
పంటకోతల మధుర స్వరాలపుడు
వరిమొక్కల వలె కోసేశారు.

వాళ్లు తమ పురుషుల కోసం
ఎదురుచూసినపుడు
తమ శిరోజాల్లో
అడవిపూలు అలంకరించుకున్నారో లేదో
అది నేనింక ఎంతమాత్రమూ పట్టించుకోను

వాళ్లతో పాటే నేనూ నా సత్యాన్ని
దహనం చేసాను
వాళ్లతోపాటే కలవరపెట్టే
మానుషత్వాన్ని పాతరేసాను

ఏదో ఒక సుదూర దినాన
నేను గొణగకపోలేదు
“దేనికైనా పరిమితులుంటాయి”
కాని కాలం హంతకులను
క్షమించినపుడు
నేను ఏమీ జరగనట్లే
జీవనం కొనసాగిస్తున్నాను

*

(మణిపూర్ రచయిత : రోబిన్ న్గాంగామ్
ఇంగ్లిష్ నుంచి : ఫెలో ట్రావెలర్
(శీర్షికతో సహా స్వేచ్ఛానువాదం))

Leave a Reply