నేను మనిషిగా నుంచోటానికి
కాళ్ళు నాటుకునేంత చోటు కావాలి
నేను స్వేచ్ఛనై మాట్లాడటానికి
గొంతు దాటే మాటలు రానివ్వాలి
నేను హుందాగా నడిచేందుకు
ముళ్ళు లేని దారులు ముందుకెళ్లాలి !
నా దేహదేశం
భూమి మీద గీసిన గీతల ప్రదేశం కాదు
నేలసాళ్ళల్లో మరిగించిన రక్తమాంసాల మహోపదేశం
నా నవ నాగరిక నగరం
ఎత్తు భవనాల మత్తు వ్యాపార కూడలి కాదు
బహు సమూహాలల్లిన సామాజిక శ్రమహారం
బతుకు ఊహల ఉయ్యాల మా ఊరు
ఆసాముల ఆధీన బీడు పొలం కాదు
మట్టి జాతుల చెమట పూల పరిమళం !
నేనూపిరూదిన రాజ్యమే
నన్ను నడిరోడ్డు మీద నులిపేస్తుంది
వళ్ళంతా అక్రమ నియంత్రణ వాతలే
నన్ను నన్నుగా మాట్లాడనివ్వడు
గొంతు నిండా అధికార గునపాలే
నా దేశంలో నేను అరాచక నిషేధాన్ని
నా నగరంలో నేను అవిశ్వాస నిర్బంధాన్ని
నా ఊరిలో నేను శాసించిన బానిసత్వాన్ని
రాజధాని రహదారిలో ఉరితీయబడ్డ స్వతంత్రాన్ని!
నిలిపేసిన రాజధాని రైలులో
మూసేసిన విద్యాలయ మెట్రో స్టేషన్లో
ఆపేసిన జంతర్ ఇంటర్నెట్లో
తలుపులేసిన కన్నాట్ దారుల్లో
అలుపెరగని ఆగ్రహంతో నడుస్తూనే !
గుప్పెడు గాలి మిగలని దేశబందీ గదిలో
ఓట్లు లేని యంత్రాలమంత్ర ఎన్నికల్లో
రాజ్యాంగంలేని రాచరిక రాజ్యంలో
పోరాట హక్కులు పోగొట్టుకున్న పౌరులు
గణతంత్ర దేశమై, నిరసన నగరమై
ప్రజావేశం ఒక నడుస్తున్న రహదారై
మానవ గౌరవ జెండాని ఒళ్ళంతా కప్పుకొని!
కవిత బాగుంది కేశవా!నీ డిక్షన్ లో ప్రత్యేకత ఉంది. అభినందనలు
నడకను కేవలం ప్రయాణంగా కాకుండా, అస్తిత్వం కోసం సాగించే పోరాటంగా చిత్రించిన కవిత ఇది. అధికార నిర్బంధాల మధ్య కూడా స్వేచ్ఛ, మానవ గౌరవం, ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల అడుగులు ఆగవని కవి కేశవకుమార్ అక్షరాలతో అద్భుతంగా ఆవిష్కరించారు.
కవిత్వంలో నీదైన ఉనికిని చాటుకుంటున్నావ్
పేరు చూడకుండా కవిత్వం చదివితే, ఇది కేశవ్ కవిత్వం అని చెప్పొచ్చు. కవితలో వర్తమానం ప్రతిఫలించింది.. బాగుంది.
Keshava garu — nice one
80 years independence —still
Nothing changed