కాలం చెల్లిన ఆరోపణలు

పి విక్టర్ విజయ్ కుమార్ అక్టోబర్ 21 ఆంధ్రజ్యోతిలో ‘కాలం చెల్లిన విరసం’ అంటూ విప్లవ రచయితల సంఘంపై విమర్శలు గుప్పించారు. నిజానికి ఈ విమర్శలు వేటిలో కూడా పసలేదని తెలుగులో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న అనేకమంది మేధావులకు, కార్యకర్తలకు తెలిసిన విషయమే. అయినా కొత్తగా ఆయా రంగాల్లోకి, ఉద్యమాల్లోకి వచ్చిన, వస్తున్న యువ ఉద్యమకారులకు ఈ వ్యాసం కొన్నయినా సందేహాలను కలిగిస్తుంది కనుక సంక్షిప్తంగానైనా ఆ వ్యాసంలోని అసంబద్ధమైన ఆరోపణలకు జవాబు జవాబు చెప్పడం ఇప్పుడు అవసరమవుతున్నది. ఒక సంస్థ పైన లేదా ఒక ఉద్యమం పైన ఆరోపణలను గుర్తించేటప్పుడు ముందుగా చరిత్రలో జరిగినదేమిటో ఆ వాస్తవాలను వాస్తవాలు గానే చెప్పాలి. కానీ అసలు వాస్తవాలను వక్రీకరించి లేదా వాటిని దాచిపెట్టి, పైగా వాటికి మరిన్ని అసత్య ప్రచారాలను జోడించి ఒక సుదీర్ఘకాలం తర్వాత ఆ సంస్థపై రాసే వ్యాసం కొందరిని గందరగోళ పరుస్తుందేమో గాని, చరిత్ర తెలిసిన, సాహిత్య రంగంలో ఆ సంస్థ యొక్క కృషి, పాత్ర తెలిసిన వారందరికీ ఆ వ్యాసంలోని డొల్లతనం సులభంగా తెలిసిపోతుంది. విరసం ఆవిర్భవించిన 1970 నుంచి నేటి వరకు విరసం పై నిరాధారమైన విమర్శలు పెడుతూ వచ్చిన అనేక వ్యాసాల లాగానే ఈ వ్యాసం కూడా నిజాయితీ లేని అబద్ధపు విమర్శగా మరొకసారి తెలుగు సాహిత్య లోకం ముందు నిరూపణై నిలుచుంది.

విరసం రచయితలు సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని ఒక ప్రగతిశీల సంస్థగా విరసం ఏనాడు భావించలేదు. ప్రభుత్వాలో, ఇంకెవరో భావిస్తే విరసానికి సంబంధం లేదు. అసలు ‘అల్లకల్లోలం’ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? సమాజాలు ఏర్పరచుకున్న అశాస్త్రీయ నియమాల పునాదులను అలాగే ఉంచి ఆ నియమాలను ఎక్కువ సంఖ్యలో విచ్చుకుపోయేలాగా చేయడమనే సందర్భంలో అది ‘అల్లకల్లోల పరచడం’ అవుతుంది. సమాజ నియమాల మూల పునాదులను అలాగే ఉంచడమనే విషయాన్నే విరసం అంగీకరించదు. చారిత్రక పరిణామ క్రమంలో మానవుని పుట్టుక తదనంతర కాలాల్లో సమాజాలు ఏర్పడ్డాక ఆయా సమాజాలకు ఆయా స్థలకాల పరిస్థితుల నేపథ్యాలలో ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి ఆ సామాజిక నియమాలన్నీ నేటి వరకు కూడా పూర్తిగా చలన సూత్రాలకు భిన్నంగా కొనసాగుతూ వస్తున్నవే. అందుకే సమాజాలు కాలక్రమేణ అనేక సంక్లిష్టతలతో, చిక్కులతో, ఆధిపత్యాలతో మరింత బిగుసుకుపోతూ వస్తున్నాయి. అయితే ప్రతి కాలంలోనూ ఈ ధోరణిని వ్యతిరేకించి సమాజాన్ని మార్చాలనే విధంగా అనేక సంస్కరణోద్యమాలు తలెత్తుతూ వచ్చాయి. మార్క్స్ దీనికి ఒక శాస్త్రీయరూపం ఇస్తూ సమాజాన్ని నిర్వచించడం, అర్థం చేసుకోవడం, ప్రతిఘటించడం మాత్రమే కాదు, దాని నియమాల మూలాన్ని పునాదులతో సహా మార్చివేయాలన్నాడు. ఆ పని ఎలా చేయాలో సాంస్కృతిక విప్లవ సమయంలో మావో కొంతవరకూ చేసి చూపించాడు. అందుకే మార్క్సిజాన్ని చదువుకున్న, మావో ఆలోచనల్ని అర్థం చేసుకున్న విరసం సమాజ నియమాలను కేవలం అల్లకల్లోలం చేసి ఊరుకోదు. ఆ పని పరిమిత లక్ష్యాలు పెట్టుకున్న సంస్కరణ వాదులు చేస్తారు. కానీ విరసం సమాజ నియమాలను సమూలంగా మార్చాలనే లక్ష్యంలో రచనలు చేస్తుంది. ఆ దిశగా కలిసి వచ్చే అన్ని సంస్థలను రచనలను అది కలుపుకుంటుంది. తన ప్రయాణంలో పరిమిత లక్ష్యాల సంస్కరణ వాదులకు కూడా తన మద్దతిస్తుంది. విక్టర్ ఉదాహరించిన ‘సామాజిక స్మగ్లర్లు’ దిక్కర ధోరణి ఉన్న పుస్తకమే అయినా, అది కేవలం ఒక అల్లకల్లోల పరిచే పుస్తకం. కానీ కులం విషయంలో విరసం పని అక్కడికి అయిపోదు. అగ్రకులాల చెర నుండి సమాజాన్ని విడిపించేందుకు పీడత కులాల ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే లక్ష్యంలోని ఆగ్రహాన్ని అర్థం చేసుకోవడం , మద్దతు ఇవ్వడం చేస్తూనే కులాన్ని అసలు పునాదుల నుండే లేకుండా చేసే కులరహిత సమాజాన్ని నెలకొల్పడం లక్ష్యంగా విరసం పనిచేస్తుంది. అంటే సంస్కరణలు నిర్వహించే అల్లకల్లోలంతోనే ఆగకుండా విరసం మరింత ముందుకెళ్లి సమాజ నియమాలను మూలాల నుండి మార్చే ప్రయత్నం చేస్తుంది ఆ దిశగానే తన భావజాల సాంస్కృతిక రంగాలను ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ పోతున్నది.

విరసం రచనల లో గత రెండు శతాబ్దాల నుండి సమాజాన్ని సమగ్రంగా పరిశీలించిన లేదా విమర్శించిన లేదా సంస్కృతిక యుద్ధం చేసిన నవల కాని, కవితా సంకలనం గాని, పత్రిక కాని ఒక్కటన్న లేదని భావించడం విరసం రచనల పట్ల కనీస పరిశీలన కూడా లేకపోవడమే. తాను ఎంచుకున్న రెండు దశాబ్దాల కాలపరిమితిలోనే చూసినా కూడా విరసం నుంచి ఎన్నో రచనలు ఆయా రంగాల్లో వచ్చాయి, వస్తున్నాయని తెలుసుకోకపోవడం అవగాహన రాహిత్యమే అవుతుంది. నిజానికి సమాజాన్ని సమగ్రంగా పరిశీలించడం, విమర్శించడం, సాంస్కృతిక యుద్ధం(సాంస్కృతిక యుద్ధం అనేదే తప్పుడు మాట. అది సాంస్కృతిక విప్లవం) లాంటి వాటిపై ఆయనకున్న వ్యక్తిగత అభిప్రాయాలను తృప్తి పరచడం లేదు కనుక విరసం నుండి అసలు అలాంటి రచనలే రాలేదని ప్రకటించడం సరైన విమర్శ అనిపించుకోదు. కానీ విరసం ఎవరి వ్యక్తిగత అభిప్రాయాన్ని బలపరచడానికో ఏనాడు తన రచనలను ప్రచురించదు. ఒకవేళ ఆ అభిప్రాయాలు సామాజిక సమూల మార్పుకు దోహదం చేసేవే అయితే ఆ రచనలు రాశిలో, వాసిలో విరసం నుండే ఎక్కువగా వస్తాయి. విరసం నుంచే వచ్చిన వాటి జాబితాను చెప్తే ఈ వ్యాస పరిధి సరిపోదు గాని, ఈ రెండు దశాబ్దాలలోనే చూస్తే పాణి, చెంచయ్య సంపాదకత్వంలో వచ్చిన ‘2004-12 విరసం సాహిత్య విమర్శ’ మొదలుకొని వచ్చిన అనేక సాహిత్య విమర్శ పుస్తకాలు, వివి రాసిన కవితల సంకలనాలతో పాటు విరసం తెచ్చిన ఇతర రచయితల కవితా సంకలనాలు, రాజయ్య నవలలు, ఇంకా అనేక వ్యాసాల, కథల సంకలనాలు, అరుణతార పత్రిక, వసంత మేఘం వెబ్ పత్రికలు మచ్చుకు కొన్ని.

నిజమే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం మార్గంలో విరసానికి బయట వ్యక్తులు ప్రభావంతమైన సాహిత్యాన్ని అందించారు. విక్టర్ వ్యాసంలో పేర్కొన్నట్లుగా పెంగ్విన్ లాంటి కొన్ని ప్రచురణ సంస్థలలోంచి ఆ పుస్తకాలు వచ్చాయి. ఆయా వ్యక్తులు రాసిన వాటితో విరసానికి భావజాలపరంగా పూర్తిగా గాని, పాక్షికంగా గాని ఏకీభవం ఉన్నా లేకున్నా ఆ పుస్తకాలను విరసం రచయితలు, సభ్యులు చదివారు, చర్చలు చేశారు, సాహిత్య విమర్శలో భాగంగా వాటిలోని అంశాలను ప్రస్తావించారు, వివిధ సందర్భాలలో ఉటంకించారు. అయితే మరోవైపు తన ప్రచురణలుగా అలాంటి పుస్తకాలను తేవడం విరసం ఏనాడూ ఆపలేదు. ప్రభావపూరితమైన సాహిత్యమంతా వ్యక్తుల సొంత ప్రతిభే గాని సంస్థల కృషి కాదనేది విరసానికి ఏనాడూ వర్తించని సూత్రీకరణ. తెలుగు సాహిత్యంలో వ్యక్తుల సొంత ప్రతిభతో ప్రగతిశీల సాహిత్యం వచ్చి ఉండవచ్చు గాని, 1970 ల నుండి విరసం ప్రచురణలుగా అంతకుమించిన గుణాత్మకమైన సాహిత్యం విరివిగా వచ్చింది, వస్తున్నది. ‘వ్యాపింప చేయడం’పై విక్టర్ గారి సానుభూతి విరసానికి అక్కర్లేదు. భావజాల వ్యాప్తిలో విరసం మిగతా అనేక సంస్థల కంటే వేగవంతమైన ప్రయాణాన్నే కొనసాగిస్తున్నది.

విరసం వెనక మావోయిస్ట్ అనే పదం ఉందని అన్న సందర్భంలో’ ‘మావోయిస్ట్’ అనే పదాన్ని పార్టి అర్థంలో వాడారా, ఆలోచన విధానమనే అర్థంలో వాడారా అనేది వ్యాసంలో స్పష్టత లేదు. పార్టి అర్థంలో అయితే విరసం మావోయిస్టు పార్టీకి అనుబంధ సంస్థ కాదు, ఫ్రంటల్ సంస్థ కాదు. మావోయిస్టు పార్టీ, దానికి మాతృక అయిన పీపుల్స్ వార్ పార్టీ పుట్టని నాటి నుంచే విరసం ఉంది. అయితే విరసం నూటికి నూరుపాళ్ళు మార్క్స్, లెనిన్, మావో ఆలోచన విధానాలను వ్యాప్తి చేసే మార్గంలో నడిచే సంస్థ కాబట్టి ఆ మార్గంలో కలిసివచ్చే ఏ రాజకీయపార్టీ నైనా, ఏ సామాజిక సంస్థనైనా విరసం భావజాల సారూప్యతతో అంగీకరిస్తుంది. విరసం నిలుచున్న పునాది అయిన ఈ ఆలోచన విధానం విరసం నుండి ఎప్పటికీ మాయం కాదు. అలా మాయమైతే విరసం యొక్క కనీస అస్తిత్వమే కనుమరుగవుతుందనే ఊహాగానాలు పిట్టకథలుగా చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి.

సమాజాన్ని సమూలంగా మార్చే భావనలను దళితవాదం ముందుకు తీసుకువచ్చిందన్నారు. సమాజానికి పునాది కులం అనే దిశగా మొదలై దళిత ఉద్యమాలు ఆధిపత్య కులాల స్థానంలో రాజ్యం, రాజ్యాధికారం, సమాజం అన్నీ పీడిత కులాల నిర్వహణలోకి రావాలనే దిశలో కొనసాగిన సందర్భాలలో కూడా, కులం పుట్ల తనకున్న ప్రాథమిక అవగాహనకు విరుద్ధమే అయినాకూడా విరసం ఆయా ఉద్యమాలకు సంఘీభావం ఇచ్చింది. ‘పునాది’ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ ఉద్యమాలన్నిటికీ భావజాలపరంగా తన తోడ్పాటునిచ్చింది. విక్టర్ అన్నట్టుగా సమూలంగా మార్చడం అంటే కులాన్ని మార్చడం కాదు. కులాన్ని నిర్మూలించడం. ఇందుకు మార్క్సిజం మాత్రమే ప్రాతిపదిక అవుతుందనే అవగాహనతో ఉన్నా కూడా, అయినంత మాత్రాననే దళిత స్త్రీవాద ప్రాంతీయ మైనారిటీ ఉద్యమాలు వేటినీ విరసం నిర్లక్ష్యపరచలేదు. విరసం వాటికి అండగా నిలిచింది. చరిత్ర పేజీలను ముప్ఫై ఏళ్ల వెనక్కి తిప్పి చూస్తే దళిత్ పాంథర్స్ ఉద్యమాన్ని తెలుగు నేలకు పరిచయం చేయడం దగ్గర నుండి వివిధ సందర్భాల్లో విరసం పోషించిన విశేషమైన పాత్ర కనిపిస్తుంది. కరపత్రంలోని పదాలను లెక్కించి చూసి నిరాధారమైన ఆరోపణకు దిగారు గానీ, అసలు 90 నాటి దళిత ఉద్యమాలకు ముందే బ్రాహ్మణీయతను రచనలలో దునుమాడింది విరసం. అరుణతార, సృజన 80ల నాటి సంచికలు ఇందుకు సాక్ష్యాలు.
‘బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం’ అనే మాటను విరివిగా ప్రచారంలోకి తెచ్చిందే విరసం. ‘బ్రాహ్మణీయత’ అనే పదాన్ని హెడింగ్ గా పెట్టి గతంలో కరపత్రాలు పంచింది, ప్రత్యేకంగా సభలు పెట్టింది విరసం. బ్రాహ్మణీయతకు మూలం భూస్వామ్యం, వర్గపునాదే అయినా, స్వభావాన్ని స్పష్టం చేసేందుకు ప్రతి సందర్భంలోనూ ‘బ్రాహ్మణీయత’ పదాన్ని ఎప్పటికప్పుడు జోడించి విరసం రచయితలు ఎన్నో వ్యాసాలు, కథలు, కవితలు రాశారు. కరపత్రాన్ని మాత్రమే చూసి గత రచనలన్నింటి విషయంలోనూ కళ్లు మూసుకుని అభియోగం మోపడం ఆమోదయోగ్యం ఎలా అవుతుంది? వ్యాసంలో అన్నట్టుగా సమయానుగుణమైన మార్పులను గమనించకుండా, స్పందించకుండా మిన్నకుండిపోతే విరసం తన ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ఎందరో రచయితలను కోల్పోయి ఉండకపోయేది. ఎన్నో నిర్బంధాలను, నిషేధాలను చవిచూడకపోయి ఉండేది. బ్రాహ్మణీయత, కులం విషయంలోనే చూస్తే వాటి కేంద్రంగా సభలు నిర్వహించకపోయేది. బ్రాహ్మణీయత అంటేనే ఫాసిజం అనే సూత్రీకరణను బలంగా ముందుకు తీసుకురాకపోయేది.

రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నాటికి వేణుగోపాల్ విరసం సభ్యుడు. ‘ఆ వెచ్చని కరస్పర్శ’ వ్యాసం విరసం క్రమశిక్షణ నియమావళికి పూర్తిగా వ్యతిరేకం. అందుకు విరసం ఆయనను సంస్థ నుండి బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ విరసం వైపు రాలేదు. అంటే సభ్యత్వం తీసుకోలేదు. విరసం కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన వీక్షణం పత్రిక తో వివిధ రాజకీయ ఆర్థిక అంశాలను ప్రచురిస్తూ అభ్యుదయ భావాలను ప్రసారం చేస్తూ వస్తున్నాడు. 2009 నుండి ఇప్పటివరకు ‘ఆ వెచ్చని కరస్పర్శ’ లాంటి తప్పులేవీ ఆయన చేయకపోయినా విరసం ఆయనను మళ్లీ ఆహ్వానించలేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. విరసం అనేక సందర్భాల్లో కొన్ని బయట సంస్థలతో, వ్యక్తులతో, ముఖ్యంగా సామాజిక, రాజకీయ ఆర్థిక అంశాలలో నిష్ణాతులుగా పేరుపొంది, వాటిలో పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులను ఆహ్వానించి తన వేదికపై ఉపన్యాసాలను ఇప్పిస్తూ వస్తున్నది. అలా ఉపన్యాసాల కోసం ఎంచుకున్నంత మాత్రాన ఆ వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలతో గానీ, ఆ వ్యక్తులు పనిచేసే సంస్థల అభిప్రాయాలతో గానీ, లేదా ఆ వ్యక్తులు గతంలో చేసిన పనులతో గాని విరసానికి ఏకీభావం ఉండదు. వేణుగోపాల్ కూడా అలాంటి అనేక సందర్భాల్లో విరసం వేదికపై ప్రసంగించాడు. విక్టర్ అన్నట్టుగా విమర్శ-ఆత్మ విమర్శ అనేదే విరసానికి లేకపోతే విక్టర్ వెటకారపు భాషలోనే చెప్పాలంటే పుష్కర స్నానం చేసినట్లో, అగ్నిపరీక్షలో పునీతమైనట్లో వేణుగోపాల్ ఎప్పుడో విరసం సభ్యుడుగా మారి ఉండేవాడు.

చలం, గురజాడలు ఆ కాలానికి గొప్ప వాళ్లే. అయితే ఈ కాలానికి వాళ్లు ఆ సందర్భం అనడమనేది మాత్రం వారిని, వారి సాహిత్యాన్ని అర్థం చేసుకోకపోవడమే. వాళ్లే కాదు వేమన కావచ్చు, జాషువా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.. ఆ కాలాలలో గొప్ప వారైన వాళ్లు ఆ తర్వాత అసందర్భం అయిపోరు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారిని అన్వయించుకోవడంలో లోపం ఉంటేనే వాళ్ళు అసందర్భం అనిపిస్తుంది. చలం కోరుకున్న స్త్రీ స్వాతంత్ర్యం, గురజాడ సామాజిక మార్పు, జాషువ కాంక్షించిన విముక్తి, వేమన సంస్కరణలు నేటికైనా సిద్ధించాయా? వాళ్లు ప్రదర్శించి, ఉదాహరించిన సమస్యలు, సందర్భాలు వాళ్ళ కాలాలకే వర్తించేవే అయినంత మాత్రాన వాటి రిలవెన్స్ ను మొత్తానికే తుడిచేయాలనుకుంటే ఎలా? ఆ సమస్యలు యధాతధంగా లేకపోవచ్చు గాక, రూపాలు మార్చుకొని అవే సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి కదా ! అలాంటప్పుడు గురజాడో చలమో వేమనో జాషువానో అసందర్భం ఎలా అయిపోతారు? ఏ రచయితను తీసుకోవాలనుకున్నా కూడా విరసానికి ఒక పరిమితి ఉంది. ఆ రచయిత లోని అభ్యుదయకరమైన, శాస్త్రీయమైన భావాలను మాత్రమే తీసుకొని అతని రచనల్లోని ప్రగతి నిరోధక విషయాలను విరసం ఎందరు రచయితల విషయంలోనో ఎన్నిసార్లో వ్యతిరేకించింది. ఆ విషయంలో విరసానికి ఒక స్పష్టమైన వైఖరి ఉంది.
గురజాడ, చలం విషయంలో కూడా విరసం చాలాసార్లు విమర్శ ధోరణి తీసుకుంది. త్రిపురనేని మధుసూదన్, చలసాని మొదలు అనేక సందర్భాల్లో సాహిత్య విమర్శ వ్యాసాలలో, పుస్తకాలలో చలం, గురజాడ రచనల్లోని అంశాలను విమర్శనాత్మకంగా విశ్లేషించినప్పుడు వారి రచనలలోని అసంబద్ధ అంశాలను ఆయా విరసం రచయితలు విమర్శించారు, తప్పుపట్టారు. అభ్యుదయ ఆలోచనలు ఉన్న ఎవరైనా సరే అశాస్త్రీయ అంశాల్ని తప్పకుండా వ్యతిరేకిస్తారు. విరసం దాకా ఎందుకు, చలం కు విపరీతమైన అభిమాని అయిన రంగనాయకమ్మ కూడా చలంలోని అశాస్త్రీయ అంశాలను కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించింది. అసలు ఎంత హాస్యాస్పదం అంటే, అప్పటికి విరసం సభల్లో చలం, గురజాల పేర్లు తప్ప ఇంకెవరి పేరు వినపడవని, వారి పేర్లే ‘మారుమోగుతూ’ ఉంటాయని మాట్లాడటం నవ్వు తెప్పించే మాట కాకపోతే ఇంకేమిటి? విరసం సభల వీడియోలు యూట్యూబ్ లో చాలానే ఉన్నాయి. చూసిన తర్వాత ఈ మాట రాస్తే బాగుండేదేమో!

అక్సాయ్ చిన్ కోసం ఇండో చైనా యుద్ధం జరిగింది 1962లో. విరసం ఆవిర్భవించింది 1970లో. 1970 లో పుట్టిన సంస్థ 1962 యుద్ద సమయంలో మౌనం వహించడం ఏమిటి? అది కూడా కన్వీనియెంట్ మౌనమట.. మార్క్స్ భావాలను సమకాలీన పరిస్థితులకు అనుభవిస్తూ మావో చూపిన ఆలోచన విధానం మీదనే ఏర్పడ్డ సంస్థగా విరసం నాటి నుండి నేటిదాకా ఆయన భావాల దారిలోనే తన రచనలు చేస్తూ వస్తున్నది. ఒక దేశ ప్రాంతాన్ని, భూభాగాన్ని మరో దేశం ఆక్రమించడం నిస్సందేహంగా సామ్రాజ్యవాదమే అవుతుంది. మార్క్సిజంలో ఓనమాలు మాత్రమే తెలిసిన ఎవరైనా సరే దాన్ని వ్యతిరేకిస్తారు. దానికి కన్వీనియంట్ గా మౌనం వహించడం ఏముంటుంది? అయితే రెండు దేశాల యుద్ధానికి దారి తీసిన పరిస్థితులలో ఆ ఆక్రమణ వెనుక ఎవరి వాదనలు ఏమిటి? ఎవరికోణం సహేతుకం? అనే దానిపైనే ఎవరి పక్షం వహించడం అనేది ఉంటుంది. ఆక్రమణ తప్పే అయినా, ఆక్రమణను సమర్థించకపోయినా దాని వెనుక కారణాలలో ఎవరి పాపం ఎంత? అనేదే అప్పటికి చర్చనీయాంశమైంది. దానిని కన్వీనియంట్ మౌనం అని ఊహించుకుంటే ఎలా?

ఈనాటికి కూడా సమాజంలో భూస్వామ్యం పోలేదు, బూర్జువ విధానం పోలేదు, సామ్రాజ్యవాదం అసలే పోలేదు. అలాంటప్పుడు రచనలలో ఆపదాలు కాక ఇంకా ఏ పదాలు వాడాలి? ఆ పదాలకు ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా డిక్షన్ ను విక్టర్ చూపిస్తే బాగుండేది మరి! భూస్వామ్యం, బూర్జువా, సామ్రాజ్యవాదం అనేది యాంత్రిక భాషా పదాలే అయితే ప్రాంతీయ ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, దళిత ఉద్యమాలలో విరివిగా వాడే కులం, మతం, నిర్మూలన,విముక్తి,పోరాటం, ఉద్యమం, విప్లవం లాంటివన్నీ కూడా పడికట్టు పదాలే అవుతాయి. భాష, పదాలు ఏమి వాడుతున్నదని కాదు, ఏ ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నదనేదే ఒక సంస్థ యొక్క అవసరాన్ని సమాజానికి చూపిస్తుంది.

విరసం వార్తల్లోకి వచ్చేది ఎల్లప్పుడు సాహిత్య ఉత్పత్తి వల్లనే.. దాన్ని నిరాంకరించడమే ఒక అక్కసు. గుణాత్మకమైన, పరివర్తనాత్మకమైన సాహిత్యాన్ని సమాజానికి అందించడంలో విరసం ముందుంది కనుకనే విరసం పై ఈ బురద. రియాక్టివ్ పరిస్థితుల్లో వార్తల్లోకెక్కడం మొదటి నుండి ఉన్నదే గాని, జనరేటివ్ గా ఎప్పటికప్పుడు సమాజానికి ప్రగతిశీల సాహిత్యం అందించడమే విరసం నిరంతర కార్యక్రమం. నిర్బంధాలు, అరెస్టుల సమయాల్లో మాత్రమే చూసి విరసానిది రియాక్టివ్ స్థితి మాత్రమే అనుకుని వ్యాసాలు రాసేస్తారు గానీ జనరేటివ్ సాహిత్యాన్ని చదవకపోవడం వల్ల విరసం గురించిన ప్రాథమిక విషయాలను కూడా తాము తెలుసుకోలేకపోతున్నామనే కనీస స్పృహను కూడా కోల్పోతుంటారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత ఏడాదిగా వేగవంతంగా ముందుకు వస్తున్నది. సాంప్రదాయిక సాంకేతికత యొక్క రూపంమారినతనం మేధో శ్రమను ఏ విధంగా శాసిస్తుంది? శ్రమ విలువను నిర్ణయించడంలో అది ఏ విధంగా కొత్త దారులలో పయనిస్తుంది? శ్రమ దోపిడీ ని ఏ ఇతర రూపాల్లో మన ముందుకు తెస్తుంది? శారీరక శ్రమలపై ఈ సరికొత్త మేదోశ్రమ యొక్క ఆధిపత్యం ఏ విధంగా ఉండబోతుంది? సమాజంలోని వివిధ రంగాలపై, రాజకీయార్థిక పరిస్థితులపై కృత్రిమ మేధ ఏ విధమైన ప్రభావం చూపబోతోంది? అనే అంశాలతోపాటు విక్టర్ ప్రస్తావించిన ప్లాట్ ఫామ్ లేబర్, గిగ్ ఎకానమీ లాంటి అనేక సమస్యలకు మూలం అయిన పునాది ఆర్థిక శాస్త్ర అంశాలపై విరసం ఒక స్పష్టమైన అవగాహనతో ఉంది. లోతుల్లో కాకపోయినా వాటిపై కొన్ని వ్యాసాలు ఇప్పటికే వచ్చాయి. మున్ముందు మరికొన్ని రచనలు కూడా తప్పకుండా వస్తాయి.

నిజానికి ఇవన్నీ విక్టర్ కో, విక్టర్ వ్యాసానికో విమర్శగా ఇస్తున్న సమాధానాలు కావు.. విక్టర్ ఉటంకించిన రాడికల్ గా ఎదుగుతున్న దళిత మేధావుల సమూహం విరసం వైపు రావడానికి విక్టర్ రాసిన లాంటి వ్యాసాలు ప్రతిబింబంధకంగా మారే అవకాశం ఉంటుంది కనుక, వారి అనుమానాలను దూరం చేయడం కోసం మాత్రమే రాస్తున్న వ్యాసమిది.

విరసం పుట్టిన తొలి రోజుల్లోనే ఈ సంస్థ ఎక్కువ రోజులు ఉండదనే మాటల దగ్గర నుండి, చెరబండరాజు చనిపోయాక విరసం పని అయిపోయిందని, నా శాశ్వత చిరునామా విరసం అని ప్రకటించిన శ్రీశ్రీ చనిపోయాక కూడా విరసం కూడా త్వరలో చనిపోతుందని ఎన్నిసార్లు జోస్యాలు చెప్పారో ! శివసాగర్ అయితే విరసం మరణించిందని ప్రకటించేశాడు కూడా. ఆయన మరణించాడు కానీ విరసం ఇంకా బతికే ఉంది. ఆయనే కాదు, విరసం కాలం చేసిందన్న ఎంతోమంది కాలం చేశారు కానీ విరసం ఇప్పటికీ తెలుగు సాహిత్య లోకంలో నిలిచే ఉంది. అడపాదడపా విరసానికి కాలం చెల్లిందనే మాటలు కూడా వినిపిస్తూనే వచ్చాయి. ఇప్పటి వ్యాసం కూడా ఆ దారిలోదే.. విరసానికి కాలం చెల్లిందనే మాటలు తప్పకుండా కాలం చెల్లిపోతాయి. కాలాన్ని ప్రశ్నిస్తూ, కాలాన్ని ధిక్కరిస్తూ, కాలాన్ని మలుపు తిప్పుతూ, కాల ప్రవాహంలో విరసం ఎప్పుడు శక్తివంతమైన సంస్థగా చరిత్రలో నిలిచిపోతుంది.. చరిత్రను నిర్మిస్తుంది.

విరసం నమ్ముతున్నట్టుగా..
‘విప్లవ మాగదు సత్యం చావదు’..
విరసానికి కాలం చెల్లదు..

విరసం సభ్యుడు.

One thought on “కాలం చెల్లిన ఆరోపణలు

Leave a Reply