“పుట్టుకతో కండ్లులేకున్న పుట్టుగుడ్డిగా బతకగలం. ఎవరైనా మన కన్నులను పొడిచేసినా గుడ్డివారిగా బతకగలం, బతుకుతో పోరాడగలం. కండ్లు, చూపు మన సొంతం. కానీ మనం కనే కలలు ఉంటాయి కదా సార్. అవి మాత్రం మన ఒక్కరివి కావు. మన ఒక్కరి సొంతం కాదు. అవి మన అందరి ఆలోచనలు, ఆశలు, ఊహలు, , కలిసి చేయాలనుకునే మంచి ప్రయత్నాల ప్రతిఫలాలు. మనకి కండ్లు లేకున్నా సరే, ఆ కలలు మాత్రం మిగిలి ఉండాలి సార్. ఆ అందమైన చందమామలాంటి కలలు సాకారం చేసుకోవడం కోసమే మనం ఈ సమాజంలో కలిసిమెలిసి బతుకుతం. అందుకే ఆ కలలు మిగిలి ఉండాలి. ఆ కలలని కూడా చిదిమేసే, తుంచేసే పాడు కాలం ఒకటి వస్తే లోకం అంతా పిచ్చివాల్లుగా మారుతుంది. మానవ జాతి నశిస్తుంది”- తిరుపతి.
వల్లెపు తిరుపతి. చామన ఛాయలో ఐదున్నర అడుగుల ఎత్తుకుతగ్గ కొంచెం బరువు తక్కువ ఉండి నిటారుగా నిలబడి ఎంతో ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతున్న ఇరవై ఐదేండ్ల యువకుడు. కట్రౌతు రాయిలా మెరుస్తున్నడు. నా ముందే, నా టేబులుకి దూరంగా నిలబడి నేను కూర్చున్న తహసీల్దార్ సీట్ వెనక గోడపై ఉన్న అంబేద్కర్ బొమ్మ వైపు చూస్తూ మాట్లాడుతున్నట్లు ఉన్న వల్లెపు తిరుపతి.
24 ఫిబ్రవరి, 2026. తెల్లవారుజాము నాలుగు గంటల సమయం. ఎందుకో ఆ రోజు రాత్రి 12 గంటల వరకు సరిగా నిద్రపట్టలేదు. మళ్ళీ ఈ లోపు ఈ కల. కల చెదిరిపోయింది. కానీ, కలలో వల్లెపు తిరుపతి అట్లనే గుర్తున్నడు.
పెరుగుతున్న వయసునో లేదా పెరుగుతున్న ఆందోళననో తెల్వదుగానీ … ఆ తెల్లవారుజామున నా భార్యను నిద్రలేపి ఆ కల గురించి చెప్పిన. ఎపుడో 2013ల జరిగిన సంఘటన. ఆ సంఘటనలో భాగమైన వ్యక్తి ఇపుడు కలలోకి రావడమేంది? అపుడు యథాలాపంగా మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు హెచ్చరికలాగ అనిపించి నాకు నిద్రలో భయమవుడేంది? నా భార్య కాస్త విసుగ్గానే “పొద్దు పోయే దాకా ఆ టీవీలో ఏవో వార్తలు చూసినవు. మళ్ళీ ఫోనులో చూసినవు. అందుకే నిద్ర సరిగ పోతలేవు. కళ్ళు మÖసుకొని సప్పుడు చేయక పడుకో” అని ఆమె పడుకుంది. నాకు ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. మనసంతా తిరుపతి ఆలోచనలు. 13 ఏండ్ల కిందటి ఆ సంఘటన యాదికొచ్చింది.
**
అది- 2013, ఏప్రిల్ నెల. మంచిర్యాల్ తహసీల్దార్ ఆఫీస్‌లో తహసీల్దార్‌గా నేను. రాలిపోయిన కాగితపు పూలను నిర్దయగా తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్న జనం. ‘జై తెలంగాణా’ నినాదాలతో రోడ్డు మీద వెళ్తున్న పెద్ద గుంపు. ఆ రోజు ఉదయం వల్లెపు తిరుపతి ఒక్కడే నా ఛాంబర్‌లోకి వచ్చిండు. నేను కూర్చున్న చోటు నుండి ‘T’ ఆకారంలో టేబుల్ చివర నాకు దాదాపు నాలుగు మీటర్ల దూరంలో ఉండి నమస్కారం పెట్టిండు. అతను మాట్లాడుతుంటే చూపులు నా మీదుగా ఉండేసరికి కొంచెం అనుమానంగా, అమర్యాదకరంగా అనిపించింది. తన వివరాలు చెప్పేసరికి నాకు అర్థం అయింది, తన పరిస్థితి. అతను స్వయంగా చెప్పే వరకు నేను అతను గుడ్డివాడు అని గుర్తు పట్టలేకపోయిన. అతని చేతిలో ఉండే కర్ర కూడా బయటే పెట్టి వచ్చిండు.
**
వల్లెపు తిరుపతయ్య, అప్పటి నల్గొండ ప్రస్తుత సూర్యాపేట జిల్లా కోదాడలో రాళ్లు, కంకర కొట్టి బతికే వడ్డెర కులానికి చెందిన గురుస్వామి, పద్మలకు 1986-90 ప్రాంతంలో మొదటి సంతానం. అతని తర్వాత ఒక చెల్లె, ఇంకో తమ్ముడు. పుట్టుకతో- తలలో నీరు ఎక్కువ చేరి, తల పెద్దగా ఉండే Hydతీశీcవజూష్ట్రaశ్రీus సమస్యతో తిరుపతి పుట్టిండు. ఇది ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోయే సమస్య. కానీ, పేద కుటుంబం కావడం వల్ల తిరుపతి నానమ్మ భయపడి ఆ చిన్నారి తలని పదేపదే దగ్గరగా నొక్కింది. అట్లా నొక్కితే చిన్నగ, సహజంగ మారొచ్చు అని ఆమె ఆలోచన. కానీ, ఆ ఒత్తిడి చిన్నారి తల, కణతులమీద పడి చూపుకి సంబంధించిన నరాలు దెబ్బతిని శాశ్వతంగా కంటిచూపుని కోల్పోయిండు. ఆ విషయం కొంచెం పెద్దగా అయి అటు ఇటు నడుస్తూ పడిపోయే దాకా ఎవరూ గుర్తించలేక పోయిండ్రు. తర్వాత దగ్గరి ప్రభుత్వ దవాఖానల్లో చూపించినా ఫలితం లేదు.
ఊరనక, పల్లెనక, చెట్టనక, పుట్టనక గుట్టలు, గ్రానైట్ క్వారీల దగ్గర ఎక్కడ బండ, కంకర కొట్టే పనులు దొరికితే అక్కడికి వలసపోతూ బతికే కుటుంబం వాళ్ళది. తిరుపతిని చిన్నతనంలో గుడ్డివాడు కావడం వల్ల, పనిచేసే దగ్గర ఉంచుకోలేక ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వ బడికి పంపేటోల్లు. కానీ, కండ్లు కనిపించకపోవడంతో అక్షరం ముక్క వచ్చేది కాదు. ఐదారు ఊర్లు తిరిగితే మూడేండ్లు అట్లా గడిచిపోయింది. చదువు శూన్యం. మహబూబ్‌నగర్‌లో గుడ్డివాళ్లకు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఉన్నదనే విషయం తన మేనమామకి తెలిసి అక్కడ తిరుపతిని చేర్పించిండ్రు. అక్కడ వేయడం తప్ప, వలసపోయే తన కుటుంబం కనీసం సెలవుల్లో కూడా చూడడానికి రాకపోయేటోల్లు. ఎప్పుడన్నా వచ్చి తీసుకెళ్తే దేశమంతా తల్లితండ్రులతో వలసగా తిరిగి మళ్లా ఎపుడో హాస్టల్‌కి పోయేటోడు. సరిగ్గా దొరకని తిండి, ఘోరమైన వసతుల మధ్య అక్కడ బ్రెయిలీ లిపిలో మొత్తానికి చదువు మీద పట్టు దొరికింది తిరుపతికి. అటుఇటు అని తన ఏడో తరగతి పూర్తయింది. కానీ, దానికి సంబంధించిన రికార్డ్స్ సరిగ లేవు. ఆ తర్వాత ఉందాం అన్నా, చదువుదాం అన్నా అక్కడ అవకాశం లేదు. దానితో భ్రమణజీవి అయిన తిరుపతి, కోదాడలో తన పరిస్థితి దృష్ట్యా ‘పాఠశాలకి రెగ్యులర్‌గా రాలేను, కేవలం పరీక్ష ఫీజు మాత్రమే కట్టగలను’ అని ఒప్పించి, ప్రైవేట్‌గా పదవ తరగతి పరీక్ష రాసి థర్డ్ క్లాస్‌లో పాస్ అయిండు.
ఇంటర్మీడియెట్ కోసం కోసం హైదరాబాద్‌లోని అలియాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరిండు. ‘స్పెషల్ బ్లైండ్ హాస్టల’లో ఉండేవాడు. తిరుపతి వయసు పెరిగేకొద్దీ ఆకలి మంటలు పెరిగాయి. హాస్టల్‌లో రోజూ రెండు పూటలు మాత్రమే తిండి ఉండేది. అటు కాలేజీలో కూడా బ్లైండ్ వాళ్లకు ప్రత్యేక బోధన పద్ధతులు, వసతులు లేవు. కానీ, తన పరిస్థితిని చూసి కాలేజీ పూర్తయ్యాక వినోదిని, గీత అనే ఇద్దరు మేడమ్‌లు (లెక్చరర్స్) ప్రత్యేక శ్రద్ధపెట్టి చదువు చెప్పడం, ఆడియో రికార్డింగ్ చేసి ఇచ్చేవాళ్లు. అంతే కాదు, ఒక రకంగా తిరుపతి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మళ్లీ అంతలా ఆదరించిన వ్యక్తులు వీళ్లు. ఇక్కడ ఇంటర్మీడియెట్ పూర్తయినంక, ‘డిగ్రీలో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో సీటు వచ్చేలా చదవాలి’ అని ప్రోత్సహించిండ్రు. దాంతో కష్టపడి హెచఈసి (హిస్టరి, ఎకనామిక్స్, సివిక్స్) గ్రూపులో 721 మార్కులతో పాసయిండు. ఆ గ్రూప్‌లో అది చాలా పెద్ద స్కోర్.
డిగ్రీ చదువు కోసం నిజాం కాలేజీలో తెలుగు సాహిత్యం పట్ల తన అభిరుచి మేరకు బీఏ (స్పెషల్ తెలుగు)లో జాయిన్ అయిండు. తెలుగుతో పాటు హిస్టరీ, పాలిటికల్ సైన్స్ ఇతర సబ్జెక్ట్స్. జీవితంలో మొదటిసారి మÖడు పూటలా తిండి దొరికింది. తిరుపతిలో చదువుతో పాటు సామాజిక చైతన్యం పెరిగింది. విద్యార్థి సంఘాల్లో పనిచేయడం మొదలు పెట్టిండు. తను ఇంటర్‌లో గడిపిన స్పెషల్ బ్లైండ్ హాస్టల్‌లోని ఆకలి గుర్తుకు వచ్చి కోపంతో దహించుకపోయేటోడు. ఆ హాస్టల్‌లో ఉండే 150మంది పిల్లల్ని కూడగట్టి రెండు రోజులు గృహకల్పలోని ‘డిసేబుల్డ్ కమిషనరేట్ ఆఫీసు’ని ముట్టడించి, ధర్నా చేసి బ్లైండ్ హాస్టల్‌లో మూడు పూటలు తిండి పెట్టేలా ప్రభుత్వ నిర్ణయం వచ్చేలా చేసిండు.
డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా తిరుపతికి, జీవితంలో తన కాళ్లపై తను నిలబడాలనే ఆలోచన వచ్చింది. టీటీసీ (టీచర్ ట్రైనింగ్ కోర్స్) ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ సాధించిండు. ప్రభుత్వ కాలేజీలో ఐతే నిబంధనలు కఠినంగ ఉంటయని, ఎలాగూ అప్పటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీ యింబర్స్‌మెంట్ ఇస్తుందని మల్లేపల్లిలోని ‘అన్వర్-ఉల్`ఉలూమ’ ప్రైవేటు కాలేజీల చేరిండు. అక్కడచేరి తన బతుకు గడవడం కోసం డబ్బున్నవాళ్ళ బ్లైండ్ పిల్లలకి బ్రెయిలీ లిపిలో ప్రైవేట్‌గా ట్యూషన్‌లు చెప్తూ బతికిండు.
టీటీసీ పూర్తయింది. తిరిగి డిగ్రీలో జాయిన్ అయిండు. ఈ లోపల వలస పక్షుల వలె తిరిగే తన కుటుంబం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నస్పూర్ గ్రామానికి చేరుకుంది. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద బండ, కంకర కొట్టే కూలీ పనులు దొరికినయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 2012లో డిఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటి) ప్రకటించింది. తిరుపతి ఆదిలాబాద్‌లో అప్లయ్ చేసిండు. మంచి మార్కులతో ఉద్యోగ అర్హత సాధించిండు. కౌన్సిలింగ్ జరిగింది. కానీ, ఉద్యోగాన్ని హోల్డ్‌లో పెట్టిండ్రు. కారణం, కులం సర్టిఫికెట్‌తో పాటు లోకల్ క్యాండిడేట్ అని నిర్ణయించే స్థానికత ప్రధానమైన సమస్య అయి కూర్చున్నది. అసలు తను పుట్టి పెరిగిన వడ్డెర కులం అనేది భారత సమాజంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక బీసీ కులం కింద వస్తుందనే విషయం కూడా ఆ కుటుంబానికి తెల్వదు. ఇప్పటి దాకా తను గుడ్డితనం అనే ఒక వెనకబాటుతనం కిందనే పరిగణించబడ్డడు. ఇపుడు మరో వెనుకబాటుతనం కులం. నేటివిటి అనే సమస్య ముందుకు వచ్చింది. శారీరక వైకల్యం కల పోస్ట్‌ల కింద తనకి వచ్చే పోస్ట్‌కి తను తప్ప కనీసం అర్హులు అయిన మరో మనుషులు కూడా లేరు. కానీ పై సర్టిఫికెట్‌లు లేకపోవడం వల్ల తనకి ఉద్యోగం వచ్చే అవకాశం లేకుండా పోయింది. శానా తిప్పలుపడి తన తండ్రి తను పుట్టిన ఊరు నుండి అంతా తిరిగి తన కులం సర్టిఫికెట్ సంపాదించగలిగిండు. కానీ, అసలు సమస్య తనకు రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలె. లోకల్ క్యాండిడేట్‌గా నిర్ధారించే స్థానికత కావాలె. అప్పటికే నాలుగు నెలల నుండి తిరిగి తిరిగి ఆశలు వదులుకొని కొత్త తహసీల్దార్ వచ్చిండు అని ఒక ఆశతో తహసీల్దార్ ఆఫీస్‌కి చేరిండు.
లిలిలి
బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో వైపు చూస్తున్నట్లు ఉన్న చూపులతో నిలబడ్డ తిరుపతి. నుదుటిపై చిరు చెమట. ముట్టుకుంటే చినిగిపోయే దశలో ఉన్న అంగి చెమటతో శరీరానికి అతుక్కుపోయింది. నాకు అన్ని విషయాలు వివరించి చెప్పకున్నా గానీ అతని అవసరం అర్థమైంది. నేను ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజు ఇచ్చిన స్పీచ్ లోకల్ సిటీ కేబుల్‌లో వచ్చి అది తనకి చేరిందట. అట్లా నా పట్ల కొంత నమ్మకంతో వచ్చిండు. నేను తనని కూర్చొమ్మన్న. తను కూర్చోలేదు. నిజానికి నాకు అతనితో అంత సేపు మాట్లాడే టైమ్ లేదు. కానీ ఎందుకో అతనిలో ఉన్న విశేషం నన్ను ఆకర్షించింది. తన మాటలో స్పష్టత, దాపరికం లేకుండా, చేతులు దాచుకోకుండా స్తంభం లెక్క నిటారుగా ఉన్న ఆ బాడీ లాంగ్వేజ్, మృదువుగా ఒక తాత్వికుడి నోటి నుండి వెలువడే లాంటి తన పలుకుల్లో వినిపించే నిజాయితీ. ముఖ్యంగా భాష మీద, సమాజం మీద ఉన్న ఆ జ్ఞానం, పట్టు, ఆ మర్యాదపూర్వక ప్రవర్తన, నన్ను తనతో ముచ్చటలోకి దిగేటట్టు చేసింది.
తన పరిస్థితి గురించి రెండు మంచి విశేషణాలతో వివరించిండు. ఒకటి తమ వలస జీవితం, స్థానికత. రెండోది కులం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్న ఆ రోజుల్లో ‘స్థానికత’ అనే మాట బయట కూడా కామన్‌గా వినబడుతున్నది.
“సార్, తమరికి హై స్కూల్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టులో ‘బర్డ్స్ మైగ్రేషన్ అనే పాఠం గుర్తుందా?” అని అడిగిండు. తల పైకి ఎత్తి, చేతులు గాల్లో వదిలి, ఛాతీ ఉబ్బించినట్లు ఉండే అతని విగ్రహం మొఖం మీద కొట్టినట్లే అడిగినట్లు ఉంది.
“హా… గుర్తుంది” అన్న.
“అందులో నవరంగ్ అనే పక్షి ఉంటుంది సార్. అది భారతదేశం మొత్తం తిరుగుతుంది. దేశమంతా కాలాన్నిబట్టి ఒకచోట నుంచి ఇంకో చోటుకి వలస పోతుంది. ఆ నవరంగ్ పక్షిది మన దేశంలో ఏ రాష్ట్రం అంటే ఏమి చెప్పగలం సార్ ? అది భారత దేశ పక్షి. రంగు రంగుల్లో, నవ రంగుల్లో ఉండే భారతదేశపు పక్షి. మేం అలాగే సార్, వడ్డెరోల్లం. వలస బతుకులు మావి. ఒక పక్షి తన ఆకలిని తీర్చుకోవడం కోసం పండ్లు ఫలాలు తిని ఎగిరిపోయి ఎక్కడో విసర్జిస్తే అక్కడ మొలకెత్తే మొక్కలం మేం. ఎవరైనా మమ్ముల్ని మోసం చేస్తే, దాడి చేస్తే, ఒక తేనె తుట్టెను కదిపితే అప్పటిదాకా తమ కష్టంతో కూడబెట్టిన, సంపాదించిన తేనెపట్టుని విడిచి ఎగిరిపోయి, దేశమంతా విస్తరించి, మళ్లీ శ్రమించి, కష్టపడి కొత్త తేనెపట్టుని తయారుచేసే వృత్తి సార్ మాది. వలస జీవులం సార్ మేం. గుట్టలు కరిగించి ఆ గుట్టల కింద, రోడ్లు వేసి ఆ రోడ్ల పక్కలకి, ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల కొసకి బతికేటోల్లం. వడ్డెరోల్లం సార్ మేం. నా ‘స్థానికత’ అంటే ఏమని చెప్పాలి సార్… వలస జీవులం మేం. మా స్థానికత అంటే మీరే నిర్ణయించాలి. మీరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్. మీరు కాకుంటే ఎవరు చెప్తారు సార్?”
తిరుపతి మాటల్లో ఎంత స్పష్టత! గల గలా మాట్లాడుతుండు. అతని ఆవేదన నాకు అర్థమైంది. నేను వెంటనే సమాధానం చెప్పలేక అతన్ని డైవర్ట్ చేయడానికి తెలుగు సాహిత్యం మీద తనకున్న అభిరుచి వైపు మరల్చాను. ఆధునిక కవిత్వ సాంప్రదాయాల వరకు మా చర్చ సాగింది. మాటలో భాగంగా నేను ఒక కవిత చదవమని కోరితే శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’లోని ‘బాటసారి’ కవితని గొంతెత్తి చదివిండు.
“కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని తల్లిమాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి, మండురోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక
నడి సముద్రపు నావ రీతిగా
సంచరిస్తూ, సంచరిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే చండ చండం, తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే, భయం వేస్తే, ప్రలాపిస్తే
మబ్బు పట్టి, గాలి కొట్టి,
వాన వస్తే, వరద వస్తే,
.
.
.
.
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటుంది
పల్లెటూళ్ళో తల్లికేదో
పాడు కలలో పేగు కదిలింది!” చదుతున్నప్పుడు తన చూపులు బిల్డింగ్ పైకి , ఆకాశం వైపు ఉన్నయి. కవిత చివరలో తన గొంతు జీర పోయింది. ఆవేదనతో మనసు లగ్నం చేసి చదివిండు కవిత.
**
నేను తిరుపతి కోరిన విధంగా రెండు రోజుల్లో మా గిర్ధావర్‌తో ఎంక్వైరీ చేయించి తాను గత నాలుగు సంవత్సరాలుగా మంచిర్యాల మండలం నస్పూర్ గ్రామంలో నివాసం ఉంటున్నట్లు ‘లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట’ ఇచ్చిన. తిరుపతి పరమానందభరితుడు అయి నాకు నమస్కరించి, “మీ మేలు ఈ జన్మలో మర్చిపోను సార్… జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొని మొదట మీ దగ్గరకే వచ్చి చూపించి వెళ్లి జాబ్‌లో జాయిన్ అయితాను సార” అన్నడు.
వారం రోజుల తర్వాత మళ్లీ ఆఫీస్‌కి వచ్చిండు. నేను ఆఫీస్‌కి వచ్చేసరికే తను వేచి ఉన్నాడు. కానీ నేను ఊహించిన ఉత్సాహం తనలో లేదు. లోపలికి వెళ్లగానే తిరుపతిని పిలిపించుకున్న.
అతడు చాలా వినయంగా, బాధగా “సార్ డిఈవో ఆఫీస్‌వాళ్ళు ఏడేళ్లు లోకల్ / రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలంటున్నరు సార” అన్నడు బాధగా. నేను ఇవ్వలేను అంటనేమో అనే భయం తనలో. నేను వెంటనే మా స్టాఫ్‌ను పిలిపించి మళ్లీ ఎంక్వైరీ చేసి రేపటికల్లా సర్టిఫికెట్ రెడీ ఉంచమని చెప్పిన. ఆ మరునాడే సర్టిఫికేట్ ఇచ్చినం.
పదిహేను రోజులు తర్వాత మళ్లీ నా గదిలో వచ్చి ఉన్నడు. దీనంగా ఉంది అతని ముఖం. వర్షంలో తడిచివచ్చి, చిన్నగా వణుకుతున్నడు. నేను బయటి నుండి లోపలి వస్తూ ఉత్సాహంగా “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అని చదువుతూ, ‘ఏం సంగతి?’ అని అతని భుజం తట్టి అడిగిన.
తన భుజం మీది నా చేతిని అట్లనే పట్టుకున్నడు. ఒక చల్లబడిన పేదరికపు చేతిస్పర్శ.
“సార్, ఏమి చెప్పాలి నా బాధను. విధి నాతో ఆడుకుంటుందో లేదా మనుషులు నాతో కావాలని ఆడుకుంటున్నారో తెలియడం లేదు సార్… ఇప్పటి నుండి వెనుకకి ఏడేండ్లు కాదు, నా పదో తరగతికి ముందు ఇక్కడ ఏడేండ్లు ఉన్నట్లు లోకల్ సర్టిఫికెట్ తీసుకుని రావాలంటున్నారు సార” అన్నడు. మనిషి కుంగిపోయినట్లున్నడు.
నేను నా కుర్చీలోకి వెళ్లి దృఢంగా చెప్పిన, “తిరుపతీ… ఇది నీ ఒకడి సమస్య మాత్రమే కాదు. ఇది నా వ్యక్తిగత సమస్య కూడా. ఇది మనందరి సమస్య. ఇది ఒక జాతి సమస్య. దీనికి పరిష్కారం చూపనిదే నేను కూడా తృప్తిగా ఉండలేను. నువ్వు దేనికి భయపడకు. నీతో నీ సమస్య పరిష్కారం అయ్యే వరకు నీకు ఉద్యోగం వచ్చే వరకు నీ వెంట నేను ఉంట” అని చెప్పిన. ఆ తర్వాత మళ్లీ అతని పదో తరగతికి ముందు కేవలం నాలుగేండ్లు ఉన్న సర్టిఫికెట్ అడిగిండ్రు. ఆ విధంగానే ఇచ్చిన కూడా.
తిరుపతి వెళ్లి సర్టిఫికెట్ సబ్మిట్ చేసి డిఈవో (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ) ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నడు. డిఈవో అక్రముల్లా ఖాన్‌ను కలిసిండు. ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్‌ని కలిసిండు. మధుసూదన్ కొద్ది రోజులు అయ్యాక “నీ పోస్ట్ ను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. నువ్వు ఎన్ని సర్టిఫికేట్స్ తెచ్చినా ఈ జాబ్ ఐతే నీకు రా
దు” అని మొఖం మీద చెప్పేసిండు.
తిరుపతి నా దగ్గరికి మళ్లీ రాలేదు. తన దగ్గర ఫోన్ లేదు. నాకు ఫోను కూడా చేయలేదు.
ప్రపంచాన్ని పరిపూర్ణంగా చూడగలిగి, స్నేహితులు, బంధువులు, సంపద, కులం, మతం… అన్నిఆధారంగా ఉన్న వ్యక్తి కూడా ఇటువంటి కష్టాలు వస్తే ఎంతగా దు:ఖిస్తడో మనం ఊహించుకోగలం. బతుకంతా కటిక చీకటిలో గడుపుతున్న , అసలు ఈ భౌతిక ప్రపంచం ఎట్లా ఉంటుందో కూడా సరిగా అంచనా లేని వ్యక్తికి ఇన్ని కష్టాలు ఉంటే ఏం తట్టుకుంటడు?
తిరుపతి సత్యాగ్రహమే తన మార్గం అనుకున్నడేమో ఒక రోజు డీఈవో ఆఫీసులో కూర్చుని తనకి ఉద్యోగం ఇచ్చేవరకు అక్కడి నుండి వెళ్లేది లేదు అని ఆఫీస్‌లోనే కూర్చున్నడు. సాయంత్రం అయ్యాక స్టాఫందరూ వెళ్లిపోయిండ్రు. తను మాత్రం రాత్రంతా తిండి లేకుండా ఆఫీస్ ముందే కూర్చొని ఉన్నడు. బయట ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెగని వర్షం.
“ఇల్లేమో దూరం
అసలే చీకటి
గాఢ అంధాకారం
దారి అంతా గతుకులు
చేతిలో దీపం కూడా లేదు
కానీ గుండెల నిండా ధైర్యం ఉంది” – దేవరకొండ బాలగంగాధర తిలక్
తెల్లారి వెళ్ళి కలెక్టరేటులో కూర్చున్నడు. తిండి లేదు తిప్పలు లేవు. పొద్దంతా అతని నిరశన చూసి కలెక్టర్ అహ్మెద్ బాబు “అతని సమస్య ఏంటో వారం రోజుల్లో ఏదో ఒకటి పరిష్కరించి చెప్పండి” అని డిఈవో, డిఆర్‌వోలకి చెప్పిండు.
**
వారం రోజులు దగ్గరకు వచ్చింది. ఈ లోపు మా ఆఫీసుకి నాకు జిల్లా కలెక్టర్ నుండి ఒక మెమో పంపించిండ్రు. దానికి మÖడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణకు హాజరు కావాల్సిందిగా ఒక తేది ఇచ్చిండ్రు. మెమోలో ఉన్న అభియోగాలు ఏమిటి అంటే- ‘ఎలా అడిగితే అలా అన్ని తప్పుడు సర్టిఫికెట్స్ ఎలా ఇచ్చావు?’ అని, ‘ఏ ఆధారాలతో ఇచ్చావు?’ అని, ఇంకా కొన్ని అభియోగాలున్నయి. అందులో నాతోపాటు తిరుపతిని కూడా ఆ విచారణకు సరైన పత్రాలతో హాజరు కమ్మన్నరు.
**
విచారణ రోజు నేను మెమోకి సమాధానం రాసుకొని, ఫైల్‌లో అన్ని డాక్యుమెంట్స్ సరిచూసుకొని ఆదిలాబాద్‌కి బయల్దేరిన. తిరుపతి బస్‌లో పొద్దునే వెళ్లిపోయిండు. కార్‌లో వెళ్తుంటే మనసంతా ఒక రకమైన ఆవేదనతో నిండిపోయింది. నల్లమద్ది చెట్టులాంటి రోడ్డుకు రెండువైపులా చెట్లతో నిండి బొయ్యుమని వీస్తున్న ఈదురుగాలి. న్యాయం, చట్టం ఏదైనా అది సహజ న్యాయ సూత్రాలకి అనుగుణంగా ఉండాలి. మనం సహజ న్యాయసూత్రాలకి అనుగుణంగా పనిచేస్తూ పోతే అదే న్యాయంగా నిలబడుతుంది. చట్టంగా మారుతుంది. ఈ రోజు మనం ఓడిపోయినా గాని, ప్రజలు పోరాడి అయినా దాన్ని సాధించుకుంటరు. సత్యం కాబట్టి రేపు అయినా చట్టంగా మారక తప్పదు.
**
విచారణ ప్రారంభం అయింది.
డిఆర్‌వో (డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్) చాంబర్‌లో. డిఆర్‌వోతో పాటు డిఈవో మరో ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నరు లోపల.
మొదట నా వివరణతో పాటు తగిన డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించిన. నేను చెప్పదలచుకున్న విషయం వినయంగా విన్నవించుకున్న.
డిఆర్‌వో నా మీద నిప్పులు కక్కినంత పని చేసిండు. “సర్వీస్‌లోకి కొత్తగా వచ్చావు. ఇలాంటి ప్రవర్తనే ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు” అని కోప్పడ్డడు.
ఆ తరువాత తిరుపతిని అడిగిండ్రు. తిరుపతి కొంచెం ముందుకు జరిగి నిలబడిండు. అతని అంగి బటన్ కింద మీద పెట్టుకోవడం వల్ల పొట్ట మీద ఎత్తుగా ఉంది. వేసుకున్న పాయింట్‌కి మోకాలి దగ్గర కొంచెం చినిగి రంధ్రం కనపడుతున్నది. కాళ్ళకి చెప్పులు లేవు. చాలా వినయంగా, మార్దవంగా మాట్లాడడం మొదలుపెట్టిండు.
“పెద్దలకు నమస్కారాలు సార్… దయ ఉంచి నా మాటలు వినండి. నా తల్లిదండ్రులు కంకర కొడుతారు. ఎక్కడ ఆ పని దొరికితే అక్కడికి వెళ్లిపోతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జిల్లాలో ఉండి ఆ పని చేస్తున్నారు. నా తల్లి ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా సుత్తెలు, సమ్మెటతో రక్తం కారుతుండగా బండలను పిండిచేస్తది. ఆ పనిలో ఆమె రక్తం అంతా చెమటగా మారుతది. అంతే కాదు, పెద్ద కొడుకు అయిన నేను గుడ్డివాడిని అయి పుట్టానని రోజూ ఏడుస్తూ ఆమె కన్నీరుతో ఆ బండలను తడుపుతది”. తిరుపతి కొద్ది సేపు ఆగిండు. “సార్ నేను పుట్టుగుడ్డివాడిని. ఎందువల్ల నేను గుడ్డి వాడిని అయ్యాను అంటే ఈ సమాజం వల్ల, ప్రభుత్వాల వల్ల. ఐనా నా తల్లిదండ్రులు ఇప్పటికీ కనీస జీవిత అవగాహన లేని స్థాయిలో ఉన్నరు. 65 ఏండ్ల స్వతంత్ర దేశం అందరికీ కనీసం విద్య, వైద్యం అందించలేని స్థితిలోఉంది. ప్రతీ శిశువు జననం గురించి ప్రభుత్వానికి పట్టింపు, పరిగణన ఉంటే నన్ను పుట్టినప్పుడే పట్టించుకుంటే నాకు ఈ స్థితి ఉండేది కాదు. నా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితం, కూడు, గూడు అందివుంటే ఇంకా వలస పక్షుల వలె ఏ గుర్తింపూ లేకుండా, ఎటు కాని వారిగా గూడు లేని పక్షుల వలె దేశమంతా తిరిగేవాళ్ళు కాదు…”
“అది అంతా కాదు బాబు, ఇక్కడికి పిలిపించింది నీ స్టొరీ వినడానికి కాదు. నీ నేటివిటీని ప్రూఫ్ చేసుకోమ్మంటున్నాం. అంతే. దాని మీద మాట్లాడు”, డిఈవో సార్ అడ్డు చెప్పిండు.
“సార్… అదే చెప్పబోతున్నాను. నేను ఈ జిల్లా లోకల్ క్యాండిడేట్‌ని మాత్రమే కాదు సార్, మా వడ్డెరల వలస బతుకులు చూస్తే… స్టేట్ యÖనిట్‌గా తీసుకొని, ఏ జిల్లాలో అయినా మమ్ముల్ని లోకల్‌గా గుర్తించాలి. దానికి అదనంగా నా గుడ్డితనం ఒకటి ఉంది. నా జీవితం ఏదో ఇలా అయిపోయింది. నేను సమాజం లోపానికి గుడ్డి వాడిని అయిపోయాను. కానీయండి సార్, నేను అనుభవిస్తాను. కానీ, తహసిల్దార్ సార్ ఒక కల కన్నాడు సార్… అది నా కల. మీ కల. మన అందరి కల. ఒక ఏ ఆధారం లేకుండా తిరుగుతున్న మనిషికి, సమాజానికి ఒక ఆధారం, భరోసా ఇవ్వాలనే కల. మన కళ్లు పోనీయిండి సార్. గుడ్డి వాడిని కానీయండి. కానీ, కలలని మాత్రం చిదిమేయొద్దు సార్… కనీసం కలల్లోనైనా మనం బతకాలి. ఆ కలలకు ఒక ఆధారం, ఒక భరోసా మిగలనివ్వాలి. ఆ భరోసా కూడా లేకుండా ఆ కలలని నలిపేస్తాం అంటే లోకం పిచ్చిది అయిపోతది సార్. నాకు ఆ ఉద్యోగం ఇవ్వకండి. నన్ను ఇలాగే శాశ్వత గుడ్డివాడిగా ఉండిపోనివ్వండి. కానీ, తహసీల్దార్ సార్‌ని మాత్రం శిక్షించకండి. ఎందుకంటే, కనీసం కలలు అయినా మిగిలుండాలి. అవి ఈ రోజు కాకున్నా రేపు అయినా నిజం అవుతాయి. ఆ కలలు కనే స్వేచ్ఛని ఇవ్వండి. సార్‌ని వదిలిపెట్టండి. అంతే నేను కోరుకునేది.” చివరలో తిరుపతి గొంతు పూడుకుపోయింది. రెండు చేతులు ఎత్తి ఏడుస్తున్నడు. కదిలిపోతున్నడు. నా కళ్ళు కూడా తడిచినయి.
డిఆర్‌వో సార్ గొంతు సవరించుకుని, “కిషన్… యు కెన్ లీవ్ దా ఛాంబర్, బాబు నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. ఏమైనా పేపర్స్ యిచ్చేది ఉంటే అతనికి ఇచ్చి వెళ్ళు” అంటూ అసిస్టెంట్ వైపు చూపిస్తూ విచారణ ముగించిండు.
**
వారం రోజుల తర్వాత నాకు తెల్వని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
‘హలో’ అన్న. అవతలి నుంచి ఉద్విగ్నంగా ఉన్న శ్వాస చప్పుడు విన్పిస్తున్నది.
“పతితులార
భ్రష్టులార
బాధా సర్పద్రష్టులార
ఏడవకండేడవకండి
వచ్చేశాయ్ వచ్చేశాయ్
జగన్నాథ
జగన్నాథ
జగన్నాథ రథచక్రాల్
రథ చక్రాల్
రథ చక్రాల్
రథ చక్రాల్ రథ చక్రాల”. తిరుపతి గొంతు. నేను వెంటనే సమాధానంగా అందుకున్న, ఉత్సాహంగా ఉల్లాసంగా…
“రారండో… రండో… రండో
ఈ లోకం మీదేనండీ
ఈ రాజ్యం మీరేలండీ…”
ఎనిమిది నెలల కష్టఫలితం వల్లెపు తిరుపతికి టీచర్ జాబు అప్పాయింట్మెంట్ లెటర్ వచ్చింది.
**
ఇన్నేండ్ల తర్వాత ఈ 2026లో నాకు మళ్లీ తిరుపతి కలలోకి వచ్చిండు. కలల గురించి చెప్పిండు. ఇపుడు అతను మంచిర్యాల్ జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ , తనలాగే పుట్టుగుడ్డి అయి మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని కులాంతర వివాహం చేసుకొని ఆరు, నాలుగు తరగతి చదువుతున్న అమ్మాయి, అబ్బాయిలతో కలిసి బతుకు బండి నడిపిస్తున్నడు.
నాకు ఈ సంక్షోభ కాలంలో, ఈ నిరాశామయ వాతావరణంలో అతని దగ్గరికి వెళ్ళాలని ఉంది. తిరుపతిని కలిసి కమ్మని టీ తాగి మాట్లాడి, తత్వపూరితమైన తన గొంతు నుంచి జర్మన్ కవి బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసిన`
“చీకటి కాలంలో కూడా
పాటలు పాడుతారా?
అవును, పాడుతారు-
ఆ చీకటి కాలం గురించే పాటలు పాడుతారు” అనే కవితని పూర్తిగా వినాలని ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలు సత్యం పలుకుడు ఆపరు. భవిష్యత్తు మీద ఆశను నిలబెట్టుకోవడం విడిచిపెట్టరు అనే విశ్వాసాలని, కలలని నా కళ్లల్లో నింపుకుని రావాలని ఉంది.
**