భారతదేశంలో ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటు, పౌరుల ఓటు హక్కు అర్హతల నిర్ణయం మొదలైన అంశాలపై విధివిధానాల రూపకల్పన కోసం లార్డ్ సౌత్ బరో అధ్యక్షతన ఏర్పాటైన బ్రిటిష్ కమిటీ 1918-19 మధ్యకాలంలో భారతదేశంలో పనిచేసింది. అప్పుడు బొంబాయి కళాశాలలో పొలిటికల్ ఎకానమీ అధ్యాపకుడిగా ఉన్న అంబేద్కర్ 1919 జనవరి 27 న ఆ కమిటీ ముందు సార్వజనీన వయోజన ఓటు హక్కు ను, సామాజిక అణచి వేతకు గురవుతున్న అస్పృశ్యులకు ప్రత్యేక నియోజక వర్గాలను ప్రతిపాదిస్తూ వాంగ్మూలం ఇచ్చాడు. ఉన్నత విద్యవల్ల, విదేశాలలో అధ్యయనం వలన పెరిగిన విశాలదృష్టి, చదివిన పొలిటికల్ ఎకనామి వలన కలిగిన సమగ్ర అవగాహన మాత్రమే కాదు, అంత చదివినా పనిచేసేచోట అందరూ తాగే కుండ నీటికి, అందరికీ సేవలందించవలసిన ప్యూన్ సేవలు పొందటానికి తనను బహిష్కృతుడిగా చేసిన అస్పృశ్య అస్తిత్వం చేసిన గాయం కూడా అలాంటి ఒక రాజకీయ ఆకాంక్షాభివ్యక్తికి కారణమై ఉంటుంది.
ఆ మరుసటి సంవత్సరమే అంటే 1920 లో నోరులేని వర్గాల ప్రతినిధిగా తనను తాను సంభావించుకొని అస్పృశ్యుల ప్రయోజనాలకోసం చర్చకు వేదికగా ‘మూక్ నాయక్’ పత్రికను పెట్టాడు. కొల్హాపూర్ మహారాజు ఆర్ధిక సహాయంతో మళ్ళీ లండన్ వెళ్లి 1922 లో రెండవ పోస్ట్ గ్రాడ్యుయేషన్, న్యాయవిద్య పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చాడు. 1924 జులై 20 న చైతన్యపరచటం, సమీకరించటం, పోరాడటం అనే కార్యాచరణ ప్రణాళికతో బహిష్కృత హితకారిణీ సమాజాన్ని స్థాపించి భారతీయ సమాజంలో దీర్ఘకాలంగా అణచివేయబడుతున్న వర్గాల అభ్యున్నతికోసం సాంఘిక ఉద్యమాన్ని నడిపాడు అంబేద్కర్. ఉన్నత విద్యార్హతలు, ఆర్ధిక రాజకీయ అవగాహన, అణచబడ్డ వర్గాల సంక్షేమం,సమన్యాయంకోసమైన ఆరాటం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రభావశీలమైనదిగా నిర్మించాయి.
ఈ నేపథ్యంలో అంబేద్కర్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా నియమించబడ్డాడు. 1927 నుండి 34 వరకు ఆ బాధ్యతలలో ఉన్నాడు. అప్పటి నుండి 1936 లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏర్పరచి 1937 ఎన్నికలలో బొంబాయి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లో 13 రిజర్వ్డ్ స్థానాలకు 4 జనరల్ స్థానాలకు పోటీ చేసి 11 రిజర్వ్ డ్ స్థానాలను, 3 జనరల్ స్థానాలను గెలుచుకొని అసెంబ్లీ లోకి ప్రవేశించాడు. 1942 వరకు ఎంఎల్ ఎ గా కొనసాగాడు.1942 నుండి 1946 వరకు గవర్నర్ జనరల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు కార్యనిర్వాహక పరిషత్తులో రాజ్య ప్రతి నిధిగా కార్మికశాఖను నిర్వహించాడు. ఈ మూడు సందర్భాలలో కార్మిక చట్టాల చర్చ వచ్చినప్పు డల్లా ఆయన ప్రతిస్పందించిన,చర్చించిన తీరు ప్రాతిపదికగా అంబేద్కర్ కార్మిక సంక్షేమ దృక్పథం ఏమిటో నిర్ధారించవచ్చు.
భారతదేశానికి స్వాతంత్య్రం రావటంతో అంబేద్కర్ పార్లమెంట్ లో న్యాయమంత్రి అయి 1951 వరకు బాధ్యతలు నిర్వహించాడు కానీ ఆ కాలంలో కార్మిక సమస్యల మీద చర్చ ప్రధానం కాదు.
1
బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయ్యేనాటికే కార్మికవర్గ సమస్యల గురించిన అవగాహన ఉంది అంబేద్కర్ కు. 1924 లో బహిష్కృత హితకారిణీ సమాజాన్ని స్థాపించటం తోనే అంబేద్కర్ అధ్యయన శీలతకు ఆచరణ ముఖం సమకూడింది. అందులో భాగమే బొంబాయి టెక్స్ టైల్ పరిశ్రమకు సంబంధించిన కార్మికుల సమస్య విషయంలో అయన పనిచేయటం. బొంబాయి 19 వ శతాబ్దిలో టెక్సటైల్ పరిశ్రమకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. 1921 నాటికి 85 చిన్నా పెద్దా మిల్లులతో తూర్పు మాంచెస్టర్ గా ప్రసిద్ధి చెందింది. సగటున 146,000 మంది కార్మికులు పనిచేస్తుండేవారు. వారిలో చుట్టుపక్కల గ్రామాలనుండి అస్పృశ్యత అనే అవమానం నుండి బయటపడటానికో, భూమిలేని పేదరికం నుండి విముక్తికో మెరుగైన జీవితాన్ని ఆశించి నగరానికి వలసవచ్చిన మెహర్ తదితర అణచబడ్డ కులాల వారు కూడా ఉన్నారు.
అణచబడిన వర్గాల చైతన్య వికాసానికి , సాంఘిక ఉన్నతికి, ఆర్ధికాభివృద్ధికి ఏ విధమైన సహాయాన్నైనా చేయటం, సంస్థలను ఏర్పరచటం, ఉద్యమాలను నిర్మించటం బహిష్కృత హితకారిణీ సభ లక్ష్యాలలో ఒకటి. దానికి అనుగుణంగానే బొంబాయి వస్త్రపరిశ్రమలో కార్మిక రంగాన్ని కార్యక్షేత్రంగా చేసుకొన్నాడు. 16 నుండి 18 వరకు పనిగంటలతో , తక్కువ వేతనాలతో దోపిడీకి గురవుతున్న మిల్లు కార్మికుల కోసం బొంబాయిలో పనిచేయటానికి 1926 లో ఎన్. ఏం జోషి ,ఆర్ ఆర్ బాక్ల్ లే స్థాపించిన బాంబే టెక్స్ టైల్ లేబర్ యూనియన్ లో భాగమ య్యాడు.కార్మికవర్గం స్థితిగతులను సన్నిహితంగా పరిశీలిస్తూ, వాళ్లలో కులం వల్ల అణచబడ్డ వర్గాల వారి పరిస్థితి మరెంతో హీనంగా ఉండటాన్ని గుర్తించాడు అంబేద్కర్. అణచబడ్డ వర్గాల అస్పృశ్యత వాళ్ళతో పాటు నీడగా నగరాలలోకి ప్రవేశించి అద్దెకు ఇల్లు దొరకని పరిస్థితి,విడిగా షెడ్డులవంటి నిర్మాణాలలో ఒకటి రెండు గదుల నివాసాలలో సర్దుకు పోవలసి రావటం దగ్గర నుండి, పనిచేసేచోట పనిస్థలాల కేటాయింపు, మంచినీళ్లు తాగే నల్లాలు విడిగా ఉండటం మొదలైన వివక్షలతో గ్రామాలలోని శ్రేణీకృత కులవ్యవస్థ మిల్లులలోకి విస్తరించటం గమనించాడు. అణచ బడ్డవర్గాల కార్మికులకు నైపుణ్యాలు పెంచుకొనే అవకాశంలేని తక్కువ స్థాయి పనులలో పెట్టటం, మరీ ముఖ్యంగా నేత పనిలో వెఫ్ట్ బాబిన్స్ మార్చేటప్పుడు ముడివెయ్యటానికి దారాన్ని నోటి లోని లాలాజలంతో తడి చేయవలసిన పనికి అణచబడ్డవర్గాలను దూరంగా ఉంచటం గుర్తించాడు.
ఈ పరిస్థితులలో 1928 లో ఆరు నెలలపాటు డాంగే, రణదివె మొదలైన వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్న కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్ – గిర్ని కామ్ గర్ యూనియన్- ఆధ్వర్యంలో మెరుగైన పని పరిస్థితుల కోసం , వేతనాల కోతకు వ్యతిరేకంగా నడిచిన కార్మిక సమ్మె సందర్భాన్ని అణచబడ్డ వర్గ కార్మికులు ఎదుర్కొంటున్న అమానవీయమైన తరతరాల వివక్షను గురించి చర్చించటానికి అవకాశంగా తీసుకొన్నాడు. అణచబడ్డవర్గాల కుల సమూహాలకు మిల్లులో అన్నిరకాల ఉద్యోగాలలో సమాన అవకాశాల పరికల్పన అనే అంశాన్ని సమ్మె ఎజండాలోకి చేర్చేట్లు ఒత్తిడి తేగలిగాడు. విజయం సాధించాడు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా ఉంటూనే ఆయన ఈ ఉద్యమంలో భాగం అయ్యాడు.
అయితే 1929 లో మళ్ళీ 1934 లో గిర్ని కామ్ గర్ యూనియన్- కార్మిక సమ్మెల ను తలపెట్టినప్పుడు అంబేద్కర్ వ్యతిరేకించాడు. దీర్ఘకాలపు సమ్మెలు, వెంట వెంట సమ్మెలు కార్మికులను ఆర్ధిక సంక్షోభంలోకి నెడతాయన్నది ఒక కారణమైతే, అవి మిల్లులలలో దళిత కార్మికుల వివక్షను పట్టించుకోవటం లేదన్నది మరొక కారణం. ఈ సమ్మెల లో కమ్యూనిస్టులకు రాజకీయ ప్రయోజనాలు తప్ప కార్మిక సంక్షేమం , సంసిద్ధతల గురించి పట్టింపు లేదు అన్నది ఆయన ఆరోపణ. కార్మికులను చీల్చి ఐక్యతకు గండికొట్టటంగా దీనిని కమ్యూనిస్టులు భావిస్తే ఐక్యతకు సమానత్వం ప్రాతిపదిక అని, కులం వల్ల శ్రామికులమధ్య వచ్చిన విభజన రద్దుకాకుండా కార్మిక వర్గ సమ్మెలు ప్రభావశీలం కాలేవని అంబేద్కర్ భావిస్తాడు. ఈ అనుభవాలు, ఆలోచనలనుండే 1936 లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏర్పడింది.
దానిని రాజకీయ పార్టీ కన్నా ఎక్కువగా శ్రామిక వర్గ సంస్థగా , శ్రామిక సంక్షేమాన్ని వేగవంతం చేయటానికి అవసరమైన చట్టాలను ప్రవేశపెట్టటానికి నిబద్ధమైన సంస్థగా భావించాడు. ఫ్యాక్టరీలలో ఉద్యోగుల పని భద్రతకు, పదోన్నతులకు సంబంధించిన చట్టాలను, పనిగంటలు, వేతనాలు, జీతంతో కూడిన సెలవు, సౌకర్యాల పెంపు, జబ్బులు, ప్రమాదాలు మొదలైన అవసరాలకు సోషల్ ఇన్సూరెన్స్ మొదలైనవాటికి సంబంధించిన చట్టాలు తీసుకురావటం లక్ష్యం ఈ సంస్థకు.
ఈ ఆదర్శాల సంబంధంలో తనజీవిత కాలంలో అంబేద్కర్ కార్మికవర్గ సంక్షేమం కోసం చేసిన ఆలోచనలను, తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకొని చేసిన చట్టాలను తీసుకొన్న చర్యలను రెండు విభాగాలకింద వర్గీకరించి అధ్యయనం చేయవచ్చు. 1. సాధారణ కార్మిక వర్గ సంక్షేమం 2. మహిళాకార్మిక సంక్షేమం.
2
బొంబాయి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లో (1937-1942) కార్మిక సమస్యకు సంబంధించి అంబేద్కర్ దృష్టికోణాన్ని నిరూపించిన సందర్భం పారిశ్రామిక వివాదాల బిల్లుపై చర్చ( 1938, సెప్టెంబర్ 15). కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. పారిశ్రామిక వివాదాలు అంటే పరిశ్రమలలో యాజమాన్య వర్గానికి, కార్మికులకు మధ్యవచ్చే వివాదాలే. అందులో భాగమే సమ్మెలు. ఆ వివాదాల పరిష్కారానికి సంబంధించిన ఈ బిల్లు 1934 లో వచ్చిన బాంబే ట్రేడ్ డిస్ప్యూట్స్ కన్సీలియేషన్ స్థానంలో ప్రవేశపెట్టటానికి ఉద్దేశించబడింది కనుక దానితో పోల్చి ఇదెంత మెరుగయ్యిందో అంచనావేయాలని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. 1934 చట్టం వివాదాల సందర్భంలో రాజీ కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పరచటాన్ని ఉద్దేశించింది. 1934 చట్టం రాజీ స్వచ్చందం అంటుంది. కానీ ఈ కొత్తబిల్లు రాజీ తప్పనిసరి అని మార్పుచేసింది. ఇలా మార్చటానికి వాళ్ళను బలవంత పెట్టిన ఘటన 1934 – 1938 మధ్యకాలంలో ఏమి జరిగింది అని ప్రశ్నించాడు అంబేద్కర్.
రాజీ తప్పనిసరి అని చెప్పటానికి ప్రధానమంత్రి బిల్లులో భారతదేశంలో జరిగిన సమ్మెలను పేర్కొంటూ అవి తరచు జరుగుతున్నట్లు అభిప్రాయపడి దానిని అరికట్టటానికి ‘రాజీ’ ని తప్పనిసరి చెయ్యాల్సివచ్చిందని చెప్పారు. బాంబే నగరంవరకు చూసినా లేబర్ గెజిట్ ప్రకారం 1921 నుండి 1937 వరకు సమ్మెల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుందని పరిశ్రమలలో సంభవించే అవాంతరాల విస్థాపనల అంచనాకు సమ్మెలు ప్రాతిపదిక చేసుకొనటం సరైన పద్ధతి కాదని, కోల్పోయిన పనిదినాల సంఖ్య ఒక్కటే ప్రాతిపదిక కావాలని , ఆ రకంగా చూసినప్పుడు 1928 లో పోయిన పనిదినాలు చాలా ఎక్కువ అని, 1929 లో కాస్త తగ్గి ఆ తరువాత సమ్మెలో పాల్గొన్న వాళ్ళ సంఖ్య, నష్టపోయిన పనిదినాలు గణనీయంగా తగ్గాయని, 1934 చట్టం తరువాత అసలా సమస్యే లేదని 1937 లో అహమ్మదాబాద్ లో జరిగిన సాధారణ సమ్మె కారణంగా పనిదినాలలో కొంత నష్టం జరిగినా 1934 చట్టాన్ని మార్చి రాజీ నిర్బంధం అని చేర్చటం సరికాదని పేర్కొన్నాడు.
ఆ తరువాత ఆ బిల్లులోని నిబంధనలను గురించి చర్చిస్తూ కొన్ని పరిస్థితులలో సమ్మె చట్టవిరుద్ధం అన్న నిబంధనను వ్యతిరేకించాడు అంబేద్కర్. ఆ నిబంధన కింద సమ్మె ప్రారంభించటం, సమ్మెలో పాల్గొనటం, సమ్మె లో పాల్గొనమని ఇతరులను ప్రోత్సహించటం, సమ్మె ప్రయోజనాలకోసం నిధులు వసూలు చేయటం అన్నీ నేరాలే అవుతాయి. ఈనేరాలకు పారిశ్రామిక న్యాయస్థానం జైలు, జరిమానా, సర్వీసుల నుండి తొలగించటం వంటి శిక్షలు ఏవైనా వేయవచ్చు. 1857 నుండి వచ్చిన చట్టాలలో ఒప్పంద ఉల్లంఘన నేరంగా చెప్పబడినప్పటికీ ఆ సందర్భాలు వేరని, అరుదైన ఘటనలని, ఇప్పుడు భారత న్యాయం ప్రకారం ఒప్పంద ఉల్లంఘన అయితే పౌర తప్పిదం కావచ్చుగానీ నేరం మాత్రం కాదు అని వివరించి చెప్పాడు. భారత చట్టం ఒప్పంద ఉల్లంఘనను నేరం అని ఎందుకు అనలేదంటే తన ఇచ్ఛకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేయ వలసి రావటం బానిసత్వం అని భావించటం వల్లనే. సమ్మెను నేరంగా భావించి శిక్షకు కూడా సిద్ధపడటం అంటే శ్రామికులను బానిసలుగా చేయటమే అంటాడు అంబేద్కర్. ఈ సందర్భంలో ఆయన సమ్మెకు మరోపేరు స్వేచ్ఛా హక్కు అంటాడు. స్వేచ్ఛ స్వాతంత్ర్య హక్కులు దైవదత్తమైనవి అనుకొంటే సమ్మె చేసేహక్కు కూడా దైవదత్తమైనదేనని నిర్ధారించి చెప్పాడు. శ్రామిక సమూహాలు సమాఖ్యలు తమ పని పరిస్థితులలో, జీతాలతో, జీవితాలలో మెరుగుదల కోసం సమ్మెకు దిగటం కుట్ర అనే వాదం పునాదిలేనిదని ఆయన అనేక తార్కాణాలతో నిరూపించాడు.
ఈ బిల్లు, ఈ నిబంధనలు ఇలాగే అమలులోకి వస్తే శ్రామికుల బానిసత్వ స్థిరీకరణ జరిగి ఇక జీవితంలో సమ్మె చేసే అవకాశాలను వాళ్ళు కోల్పోవటం తధ్యం అంటాడు అంబేద్కర్. అందుకనే ఆయన ఈ బిల్లును ‘ది వర్కర్స్ సివిల్ లిబర్టీస్ సస్పెన్షన్ ఆక్ట్’ – శ్రామికుల పౌరహక్కుల బహిష్కరణ చట్టం- అనటానికి సందేహించలేదు.
1942 జులై నుండి 1943 సెప్టెంబర్ మధ్యకాలంలో అంబేద్కర్ కార్మిక సమస్యల మీద చేసిన ప్రసంగాలు ఆయన కార్మికవర్గ దృక్పథాన్ని స్పష్టం చేస్తాయి. వాటిలో మూడు కార్మిక సభలలో చేసిన ప్రసంగాలైతే ఒకటి రేడియో ప్రసంగం.
1942 జులై 9 న వైస్రాయ్ ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా చేరిన అంబేద్కర్ ఆగస్టు 7 న న్యూ ఢిల్లీలో జరిగిన సంయుక్త కార్మిక సభ ( జాయింట్ లేబర్ కాన్ఫరెన్స్ ) లో చేసిన ప్రసంగం మొదటిది.. భారతకార్మికుల సమస్యల పై ఏర్పడిన విట్లీ కమిషన్ (1929-1931) ప్రతిపాదనలను అనుసరించి 1934 ఫ్యాక్టరీ ఆక్ట్ , పేమెంట్ వేజ్ ఆక్ట్ 1936 వచ్చి కార్మికుల పని పరిస్థితులలో, వేతనాలలో కొంత మెరుగుదల వచ్చినప్పటికీ ఆ కమిటీ సిఫారసు చేసిన పారిశ్రామిక మండలి అనే శాశ్వత సంస్థ ఏర్పాటు చాలా కాలంగా అలావుండిపోయింది. దానికి మార్గం సుగమం చేయటం లక్ష్యంగా జాయింట్ లేబర్ కాన్ఫెరెన్స్ జరిగింది. ఆక్కడ చేసిన ప్రసంగంలో అంబేద్కర్ ఈ లక్ష్యం గురించి తన అభిప్రాయం ప్రకటించాడు. ఇది వరకు సభ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రాదేశిక ప్రభుత్వాలకు, కొన్ని భారతీయ సంస్థానాల ప్రభుత్వాల ప్రతినిధులకు మాత్రమే ప్రాతినిధ్యం ఉండగా యజమానులు, ఉద్యోగులు అనే అత్యంత ముఖ్యమైన అవసరమైన వారికి ప్రాతినిధ్యం కల్పించటం ఈ కొత్త సంస్థ నిర్మాణంలో కీలకమైన అంశం అని అంబేద్కర్ భావించాడు. ప్రజాస్వామికీకరణ వైపుగా సంస్థ విస్తరణ ఆయన ఉద్దేశం.
కార్మిక శాసనాలలో ఏకరూపత పెంపొందించటం అనే అంశం పై మాట్లాడుతూ అంబే ద్కర్ రాష్ట్రాల స్వతంత్ర శాసనలవల్ల కార్మిక శాసనాలలో భిన్నత్వం ఉంటున్నదని, అందువల్ల కలిగే అవాంతరాలను సరిదిద్దటానికి తగిన చర్యలు అవసరం అని భావించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం వలన ఏర్పడిన సమాఖ్య రాజ్యాంగం వల్ల , కార్మిక శాసనాలను ఉమ్మడి జాబితాలో చేర్చటం వలన ఈ సమస్య వచ్చిందని, కేంద్ర శాసనం అందరికీ వర్తిస్తుండగా ప్రాంతీయ అవసరాలు, ప్రాధమ్యతలవల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకొనే శాసనాలవల్ల భిన్నత్వం ఉంటుందని దానిని వీలైనంత తగ్గిస్తూ కార్మికశాసనాలలో ఏకరూపత సాధించటం లక్ష్యంగా ఆ సభ జరగాలని అయన భావించాడు. వివిధ పాలనావిధానాలు, ప్రాంతీయ పరిధులు ఉన్న భారతదేశం వంటి పెద్ద దేశాలలో ఏకరూప కార్మిక శాసనాల అవసరం ఎప్పటికీ ఉంటుంది అని భావించాడు.
ఆ కాన్ఫరెన్స్ లక్ష్యాలలో మరొకటి పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి ఒక విధానాన్ని రూపొందించటం.పారిశ్రామిక వివాదాలు శ్రమరంగానికి, పెట్టుబడి రంగానికి మధ్య ఘర్షణ కారణంగా ఏర్పడడతాయని సమ్మెల రూపం తీసుకొంటాయని తెలిసిన అంబేద్కర్ . రెండవ ప్రపంచయుద్ధ సందర్భంలో రెండు రంగాలవారు బాధ్యతగా ప్రవర్తించారని, సమ్మెలు పెద్ద ఎత్తున కలవరం కలిగించే స్థాయిలో లేవని మెచ్చుకున్నాడు. ప్రస్తుత యుద్ధం సరఫరాల యుద్ధం అని, సరఫరాలు పారిశ్రామిక శాంతిపై ఆధారపడి ఉంటాయి కనుక పారిశ్రామిక శాంతిసాధన మన ముందున్న జటిల సమస్య అని అంటాడు.పారిశ్రామిక వివాదాల తక్షణ పరిష్కారమే ఆ సమస్యకు పరిష్కారం అని ఆయనకు తెలుసు. పారిశ్రామిక వివాదాల మూలం ఉద్రేకాలను ప్రేరేపించే పరిస్థితులు. అవి చాలావరకు సాంఘిక సంక్షేమానికి సంబంధించినవే అయి ఉంటాయి. ఆ సమ స్యల పరిష్కారానికి సలహా ఇచ్చే యంత్రాగాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని అభిప్రాయ పడ్డాడు. అందుకోసం కార్మిక సభను శాశ్వత సంస్థగా ఏర్పాటుచేయాలని అందులో సర్వప్రతినిధుల సభ, స్థాయీ సలహా సంఘం అని రెండు భాగాలు ఉండాలని ప్రతిపాదించాడు.
1943 సెప్టెంబర్ 6 న ఢిల్లీ లో సర్వసభ్య కార్మిక సమావేశం జరిగింది. ఇది 1942 ఆగష్టు 7 సభ ప్రతిపాదనలనుండి ఏర్పడిన సర్వసభ్య కార్మిక సంస్థ మొదటి సమావేశం. ఇందులో మాట్లాడుతూ అంబేద్కర్ పారిశ్రామిక సమస్యలు కానీ, కార్మిక సంక్షేమానికి సంబంధించిన సమస్యలు కానీ ప్రభుత్వం, యజమానులు, ఉద్యోగులు ఈ మూడు వర్గాలు సమావేశమై చర్చిం చుకొంటే తప్ప పరిష్కారం కావని త్రైపాక్షిక చర్చల అవసరాన్ని నొక్కి చెప్పాడు. యుద్ధవొత్తిడుల మధ్య కూడా పారిశ్రామిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపిందని, కార్మికులకు వేత నాలు పెంచటం, సాంకేతిక శిక్షణ ఇప్పించటం, కార్మిక సంక్షేమమకోసం ఒక అధికారిని నియమించే నిర్ణ యం తీసుకొనటం ప్రభుత్వం వైపు నుండి సాహసోపేత చర్యలని అభిప్రాయపడ్డాడు. సరైన వేతన, పనిపరిస్థితులు కార్మికుల హక్కులుగా అంగీకరించటం అభినందించవలసినవి అన్నాడు.
అలాగే సాంఘిక భద్రత, కనీసవేతనాలు మొదలైన వాటితో పాటు శాసనసభల్లో తదితర సంస్థలలో కార్మిక ప్రాతినిధ్య గురించి కూడా ప్రస్తావించాడు అంబేద్కర్. ఈ సందర్భంలో ఆయన రెండు వైరుధ్యాల గురించి మాట్లాడాడు. ఒకటి పెట్టుబడిదారీ పారిశ్రామికవిధానానికి, పార్లమెం టరీ ప్రజాస్వామ్యానికి ఉన్న వైరుధ్యం.అది ధనవంతులు నిరుపేదలు మధ్య ఉన్న వ్యత్యాసం అని చెప్పి పనిచేయనివాళ్ళు ధనవంతులుగా, పనిచేసేవాళ్ళు నిరుపేదలుగా ఉన్న తీవ్రస్థాయి వ్యత్యా సంగా దానిని వివరిస్తాడు. రెండవ వైరుధ్యం రాజకీయ ఆర్ధిక వ్యవస్థలకు సంబంధించింది అని చెప్పి రాజకీయాల్లో సమానత్వం ఆర్ధికంగా అసమానతలు దాని లక్షణం అని చెప్పాడు. ఒక మని షికి ఒక ఓటు , ఒక ఓటుకు ఒకటే విలువ అనేది భారత రాజకీయ సూత్రం అని చెప్తూ ఆర్ధిక రంగంలో ఇది రాజకీయరంగానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నాడు. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని అంటాడు.
భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం ఒక్కటే లక్ష్యం కాకూడదని, అది సామాజికంగా ఒక స్థాయిలో జరగాలని అన్నాడు. కేవలం భారతదేశ ఉత్పత్తిని, సంపదలను పెంచటానికే మన శక్తిసామర్ధ్యాలను వినియోగిస్తే సరిపోదని భావించాడు. సంపదలను పంచు కొనటానికి భారతీయులందరికీ అవకాశం ఉండాలని, అభద్రతనుండి రక్షణ కూడా అవసర మేనని అభిప్రాయపడ్డాడు.
మూడవ ఉపన్యాసం 1943 సెప్టెంబర్ 8 నుండి 17 వరకు ఢిల్లీ లో జరిగిన అఖిలభారత ట్రేడ్ యూనియన్ వర్కర్ల అధ్యయన శిబిరం ముగింపుసభలో చేసినది. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం లోని వైరుధ్యాలను గురించి అప్పటికే ఆలోచిస్తున్న అంబేద్కర్ వాటిని గురించి మరింత వివరంగా చర్చించాడు ఈ ఉపన్యాసంలో. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంతకు ముందున్న ప్రభు త్వాలకన్నా ఉత్తమమైనదే అయినా ఒక శతాబ్దం పూర్తి కాకుండానే ప్రపంచ వ్యాప్తంగా దాని పట్ల అసంతృప్తి, ప్రత్యామ్నాయాల వెతుకులాట మొదలు కావటాన్ని ప్రస్తావిస్తూ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యాన్ని పొంది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో స్వపరిపాలన గురించి ఆశ పడుతున్న భారత సమాజానికి దాని గురించి చర్చించవలసిన అవసరం ఉందన్నాడు అంబేద్కర్. పైకి కనిపించేన్త అత్యుత్తమ వస్తువు కాదది అని హెచ్చరించాడు.
రాజకీయహక్కులు అందరికీ సమానంగా ఉండాలన్న అభిప్రాయం ప్రాతిపదికగా అభివృద్ధి చెందటం, సామాజిక ఆర్ధిక సమానత్వ నియమాన్ని ఆమోందించటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మౌలిక లక్షణమే అయినా అధిక సంఖ్యాకులైన ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ఆస్తి , సంతోషం పెంపొందించుకొనే హక్కును కల్పించటంలో అది విఫలం అయింది అంటాడు అంబేద్కర్. ఈ వైఫల్యానికి కారణాలు లోపభూయిష్టమైన సిద్దాంతాలలో , నిర్మాణాలలో ఉన్నాయంటాడు. స్వేచ్ఛ , ఒప్పందం అనే రెండు అంశాలతో ఆయన దానిని వివరించాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ విషయంలో నైనా ఒక ఒప్పొందం లోకి వచ్చే స్వేచ్ఛ అందరికీ సమానమే. కానీ ఇక్కడ సమాజంలోని ఆర్ధిక అసమానతలను దృష్టిలో పెట్టుకోకపోవడం వలన అసమానుల మధ్య ఏర్పడే స్వేచ్ఛ ఒప్పొందాలు బలవంతుల ప్రయోజనాలకు, బలహీనుల అణచివేతకు ఉపయోగపడే వాస్తవాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతిమ ఫలితం స్వేచ్చకు ప్రతీక అయిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేదవారిని, ఆస్తిలేనివారిని ఇబ్బందుల పాలు చేయటం అంటాడు అంబేద్కర్.
అలాగే సామాజిక ఆర్ధిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదు అని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. సామాజిక ఆర్ధిక ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యానికి కణజాలం, తంతువులు వంటివి అని ఆయన భావించాడు. సామాజిక ఆర్ధిక ప్రజస్వామ్యాలే రాజకీయ ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూరుస్తాయి అని గట్టిగా నమ్ముతాడు. రాజకీయ ప్రజా స్వామ్యం స్వేచ్ఛాకాంక్షను పెంచింది కానీ సమానత్వ ప్రాధాన్యతను గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ సమానత్వాన్ని కబళించి అసమానత్వాన్ని మిగిల్చింది అని వేదన పడ్డాడు.
ఇక నిర్మాణాల విషయాన్ని గురించి మాట్లాడుతూ అంబేద్కర్ రాజకీయ సమాజం పాలకులు – పాలితులు అనే రెండు వర్గాలుగా చీలిపోవటం గురించి చెప్పాడు. ఇది సమాజంలో శ్రేణీకృత వ్యవస్థను అభివృద్ధి పరుస్తూ పాలకవర్గం నుండే ఎప్పుడూ పాలకులు రావటానికి అప్రకటిత విధానాన్ని నిర్మిస్తుంది అని భావించాడు. ప్రజాప్రభుత్వ రూపాలక్షణాలు ఎన్ని ఉన్నప్పటికీ వాస్తవంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం శాశ్వత అనువంశిక పాలకులు , శాశ్వత ఆనువంశీక పాలితులు గల వ్యవస్థను తయారుచేస్తుందని ఆయన 1943 లో గుర్తించి చెప్పిన ప్రమాదం ఈ 82 ఏళ్ళ కాలం మీద ఎంత వికృతరూపం తీసుకొన్నదో చూపిస్తున్నది వర్తమాన పార్లమెంటరీ ప్రజస్వామ్యం.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బీదలకు శ్రామికులకు, అణచబడ్డ వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చ లేకపోవటానికి కారకులు ఆ బీదలు, శ్రామికులు, అణచబడ్డ వాళ్లే అంటాడు అంబేద్కర్. జీవనాన్ని ప్రభావితంచేసే ఆర్థికాంశం పట్ల అశ్రద్ధ చూపటాన్ని కారణంగా పేర్కొన్నాడు.ఈ సందర్భంలో కారల్ మర్క్స్ ను ప్రస్తావిస్తూ … ఆయన సిద్ధాంతం తో తనకు ఉన్న విభేదాలను కొనసాగిస్తూనే అవసరమైన తన వాదనకు మద్దతుగా ఒకోసారి అంగీకరిస్తూ చేసిన చర్చ ఆసక్తిక రంగా ఉంటుంది. మానవుడు కేవలం ఆహారంతోనే జీవించడు అని నమ్ముతూ మార్క్స్ వాదాన్ని ఖండిస్తాము కానీ పస్తులతో కునారిల్లుతున్న కార్మికవర్గం మొదట తమ తిండి గురించే కదా ఆలోచించాలి అంటాడు అంబేద్కర్. మళ్ళీ మార్క్స్ చరిత్రకు ఆర్థికపరమైన విశ్లేషణ చేసాడు కానీ దానిని సిద్ధాంతంగా కాకుండా కార్మికులు ఆర్థికాంశాలకు ప్రాముఖ్యం ఇయ్యటానికి దిశానిర్దేశంగా రూపొందించాడు అని పేర్కొన్నాడు. అది పెట్టుబడిదారీ వర్గం ఆర్ధికానికి, ఆస్తులకు ఇచ్చిన ప్రాధా న్యం వంటిది కాదని చెప్తూ మార్క్స్ చారిత్రక ఆర్ధిక సిద్దాంత వైఫల్యానికి శ్రామికుల ఆర్ధిక విషయా నికి ప్రాధాన్యత ఇయ్యకపోవటమే కారణం అన్నాడు.
అధికారాన్ని సంపాదించుకోవాలన్న ఆశయాన్ని రూపొందించుకోకపోవటం కార్మికులవైపు నుండి పెద్ద తప్పిదం అని అంబేద్కర్ భావన. కార్మిక సంఘాలు కొంతవరకు వాళ్ళ ప్రయోజనాలకు పనిచెయ్యవచ్చుగాక కార్మికుల రుగ్మతను తగ్గించటానికి అవి ఎంతమాత్రం సరిపోవని అంబేద్కర్ అభిప్రాయం. కార్మిక సంఘాలు శక్తిమంతంగా పనిచేయటానికి వారి వెనుక కార్మిక ప్రభుత్వం ఉండా లంటాడు. అదేసమయంలో జాతీయవాదాన్ని కార్మికుల లక్ష్యాన్ని పక్కదారి పట్టించే ప్రమే యంగా గుర్తించాడు అంబేద్కర్. సమానత్వ విలువ అనుభవానికి లేకుండా ఆకలి, ఆత్మగౌరవ ఆకాంక్షలు తీరకుండా భారతజాతి భావనలో సంలీనం కావటంలోని నష్టాన్ని గురించిన హెచ్చరిక అది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్మికవర్గాలు జీవించాలనుకొంటే దానిని తమప్రయోజనాలకు అనుగుణంగా నిర్మించుకోవాలని, అందుకు కార్మిక సంఘాలు ఏర్పరచు కొంటూ పోతే సరిపోదని కార్మికులు అధికారం చేపట్టటానికి వీలుగా ఒక కార్మిక రాజకీయ పార్టీ పెట్టుకోవాలని అంటాడు. హిందూ మహాసభ, కాంగ్రెస్ మొదలైన మతపరమైన పెట్టుబడిదారీ రాజకీయపక్షాలకు దూరంగా ఉండాలని సూచించాడు. అంతేకాదు విజ్ఞాన లేకుండా అధికారం లభించదని కూడా కార్మికులను హెచ్చరించాడు. రూసో సోషల్ కాంటాక్ట్ , మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టో , జాన్ స్టువర్ట్ మిల్ రచించిన ఆన్ లిబర్టీ వంటి పుస్తకాలు తప్పక చదవాలని చెప్పాడు.
అంబేద్కర్ ఆకాశవాణి ప్రసంగం 1943 జనవరి 1 నాటిది. యుద్ధంలో గెలవాలని భారతీయ కార్మికులు ఎందుకు దృఢనిశ్చయులయ్యారు? అన్నది ఆ ప్రసంగ వ్యాసానికి శీర్షిక. భారత జాతీయవాద నాయకులతో సంప్రదించకుండానే 1939 లో ప్రారంభమైన రెండవ ప్రపంచయుద్ధంలో భారతదేశం కూడా చేరినట్లు ప్రకటించింది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం. దానిని దేశ సార్వభౌమాధికారానికి భంగకరమైనదిగా భావించి జాతీయవాదులు బ్రిటన్ కు యుద్ధంలో ఎటువంటి సహకారం ఇయ్యకూడదని తీర్మానించారు. సహాయనిరాకరణ ఉద్యమంలో అది కూడా ఒక అంశం అయింది. కానీ ఆ సమయంలో కార్మికవర్గం మాత్రం బ్రిటన్ యుద్ధాన్ని తన యుద్ధంగా భావించి ఆ యుద్ధంలో బ్రిటన్ గెలుపును ఆకాంక్షించింది. అది ఎందుకో , ఎలా జరిగిందో తనదైన కోణం నుండి వివరించాడు అంబేద్కర్.
యుద్ధకాలంలో కార్మిక సంక్షేమ చట్టాలు అనేకం అమలయ్యాయని, కార్మికులు రక్షణ , భద్రత పొందారని అయితే అందువల్లనే వాళ్ళు యుద్ధానికి మద్దతునిచ్చి బ్రిటిష్ వారి విజయాన్ని కాంక్షించారని అనుకోనక్కరలేదని అంటాడు అంబేద్కర్. పనిలో మంచి స్థితిగతులు సాధించినంత మాత్రాన కార్మికులు సంతృప్తి చెందరని జీవితంలో మంచి స్థితిగతులుండాలని కోరుకొంటారని, అందుకు హామీ ఇయ్యగలిగిందిగా బ్రిటిష్ ప్రభుత్వం మీద ఉన్న ఆశ ఏదో యుద్ధంలో వాళ్ళు గెలు పును ఆశించటానికి కారణం అయివుంటుందని అంబేద్కర్ ఆంతర్యం. కార్మికులు మంచి జీవితం కోరుకొనటం అంటే ఏమిటో అంబేద్కర్ ఇచ్చిన వివరణను బట్టి అలా అనుకోవచ్చు.
కార్మికులు కోరుకొనే మంచి జీవితానికి ప్రధాన సూత్రాలు మూడు. స్వేచ్ఛ సమానత్వ సౌభ్రా తృత్వాలు. కార్మికుల స్వేచ్ఛ దృక్పథంలో సమాన అవకాశాల హక్కులు, ప్రతివ్యక్తికి అవసరాల మేరకు అభ్యున్నతికి పూర్తి సౌకర్యాలు కల్పించటం ప్రభుత్వం విధి అనే భావం ఇమిడి ఉంటుందని చెప్పాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళ దృష్టిలో ప్రజలచేత ప్రజలకొరకు ప్రభుత్వం అన్నది నామ మాత్రం కాకుండా వాస్తవికంగా ఉండేది. కార్మికులు కోరే సమానత్వంలో చట్టాలు, సివిల్ సర్వీసులు, పన్నులు, సైన్యం, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన వాటిలో ఉండే ప్రత్యేక సౌకర్యాలు రద్దు కావాలన్న ఆకాంక్ష ఉంటుందని, కార్మికులు కోరే సౌభ్రాతృత్వంలో మానవులపట్ల సహృదయత, భూమి మీద శాంతి అనే ఆదర్శాలతో అన్ని వర్గాలను, జాతులను ఏకంచేసే ఆదర్శం ఉంటుందని పేర్కొన్నాడు.ఈ ఆదర్శాల వ్యవస్థ నిర్మాణం మిత్రదేశాల విజయంతో ముడిపడి ఉందని కార్మికులకు తెలుసునంటాడు. మిత్రదేశాలు యుద్ధంలో ఓడిపోతే వచ్చే నాజీవ్యవస్థ శాశ్వతంగా స్వేఛ్ఛను అణచివేసేది, సమానతను నిరాకరించేది, సోదరభావాన్ని తుడిచిపెట్టేది కనుక కార్మికులకు బ్రిటన్ విజయం కోరదగినది అయింది అంటాడు. నాజీజం ఇదిమాత్రమే కాదు ఇది అందులో ఒకభాగం, జాత్యహంకారం అందులో అత్యంత ప్రమాదకరమైన అంశం అని కూడా అంటాడు. నాజీలను ఓడించటంలో కార్మికుల ప్రయోజనం విద్యావకాశాలు, అభివృద్ధి. యుద్ధం జరుగుతున్నప్పుడు విముఖంగా ఉంటూ పోరాటాన్ని నిరాకరించటం శాంతిప్రియుల కర్తవ్యం అనేది కార్మికుల అభిప్రాయం అని నిర్ధారించాడు అంబేద్కర్. పాత వ్యవస్థ కోసం కాక పాతవ్యవస్థతో పాటు నాజీజానికి వ్యవతిరేకంగా జరిగే యుద్ధం కనుక రెండవ ప్రపంచయుద్ధం కార్మికుల ప్రయోజనాలకు అనుకూలమైన కొత్త వ్యవస్థ నిర్మాణాన్ని గురించిన ఆశను గర్భీకరించుకొని ఉన్న కారణాన కార్మికులకు ఆ యుద్ధం ఆమోదయోగ్యమైనది అని అంబేద్కర్ తన వివరణలతో ధ్రువపరిచాడు.
భారతదేశ స్వాతంత్ర్యానికి ఎలాంటి హామీలు పొందకుండానే కార్మికులు బ్రిటిష్ ప్రభుత్వానికి యుద్ధంలో సహకరించటం జాతీయవాదులకు నచ్చలేదు. ఈ వైఖరి భారత జాతీయ వాదానికి హానికరమైనదని భావించారు. అందువల్ల శ్రామికవర్గానికి తీవ్ర ప్రత్యర్ధులు జాతీయ వాదులు అంటాడు అంబేద్కర్. జాతీయవాదానికి అర్ధం గతించిన పురాతనకాలాన్ని పూజించ టమూ మూలంలోనూ, రంగులోనూ , స్థానికమూ ,సొంతమూ కానీ అన్నిటినీ త్యజించటమూ అనుకొంటే కార్మికులు దానిని తమ సంప్రదాయంగా అంగీకరించలేరు అని, వర్తమానంలో పనికి రానిది, భవిష్యత్తుకు ఆశాజనకం కానిది, అయిన గతం రోజురోజుకు విస్తరిస్తున్న మానవ స్ఫూర్తి గొంతు నులిమేయ్యటాన్ని కార్మికులు సహించలేరని చెప్పాడు. కార్మికులకు జాతీయవాదం లక్ష్య సాధన మార్గమే కానీ జీవన సూత్రాలలో అత్యంత ముఖ్యమైనవాటిని ఒదులుకొనటం కాదు అని స్పష్టం చేసాడు. కార్మికుల మతం అంతర్జాతీయ వాదం అని ప్రకటించాడు.
బాహ్య స్వాతంత్య్రం అంతర్గత బానిసత్వంతో సహజీవనం చేస్తున్న సామాజిక నిర్మాణంలో కార్మికుల స్వాతత్య్రం పాక్షికమైనది, సాపేక్షమైనది అన్న అభిప్రాయం కూడా అంబేద్కర్ తర్కంలో కనబడుతుంది. ఈ దేశానికి నాయకత్వం ఇవ్వగలిగిన సత్తా కార్మికులకే ఉందని కూడా విశ్వసించాడు అంబేద్కర్. సరైన నాయకత్వానికి ఆదర్శవాదం, స్వేచ్ఛాయుత ఆలోచన రెండూ అవసరమని ప్రతిపాదించి అవి ఉన్నత మధ్యతరగతి వర్గాలలోకన్నా కార్మిక వర్గంలోనే ఉన్నాయని స్థాపించాడు.
కార్మిక వర్గ హక్కులగురించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి, జాతీయవాదం గురించి, స్వేచ్ఛ సమానత్వ విలువల పరస్పర సంబంధం గురించి, స్వేచ్ఛా ఒప్పొంద భావన గురించి కార్మిక వర్గపు శక్తి గురించి, కర్తవ్యాల గురించి అంబేద్కర్ చేసిన విమర్శనాత్మక పరిశీలనల, విశ్లేషణల వెలుగులో ఇటీవలి కాలంలో వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను, నాలుగు కార్మిక చట్టాలను, తీవ్ర జాతీయవాద ధోరణిని అధ్యయనం చేయవచ్చు.
3
కార్మిక చట్టాల చరిత్ర అధ్యయనశీలతే కాక అంబేద్కర్ కి కార్మికుల పనిప్రాంతాల , కార్మికుల జీవనవిధానాల ప్రత్యక్ష పరిశీలనానుభవం కూడా ఉంది. కౌన్సిల్ సభ్యుడుగా కార్మిక శాఖా బాధ్యుడుగా కార్మిక సంక్షేమ విధానాల రూపకల్పనకు అది ఎంతగానో పనికి వచ్చింది. 1943 లో అంబేద్కర్ కార్మిక శాఖ అధికారులతో కలిసి బొగ్గుగనులలో పని పరిస్థితులను అధ్యయనం చేయటానికి ధన్ బాద్ వెళ్ళాడు. (డిసెంబర్ 9 ) ఝరియా , తిస్ర , రాణిగంజ్ మొదలైన అనేక గనులను దర్శించాడు. భూగర్భంలో, ఉపరితలం లో రెండు చోట్లా కార్మికులతో వాళ్ళ పని పరిస్థితుల గురించి వేతనాల గురించి, ఆదాయాల గురించి మాట్లాడాడు. భూగర్భంలోకి 400 అడుగుల లోతుకు సీతా పూర్ గనిలో 1000 అడుగుల లోతుకు దిగి బొగ్గు ముక్కలు చేస్తున్న కార్మికులను చూసాడు. గనులలలోకి ఆడవాళ్ళ ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేయటం వలన ఆడవాళ్లు కూడా ఉన్నారు. కార్మికుల నివాసగృహాలలోకి వెళ్లి ఆహార నాణ్యత, అలవాట్లు, ఇంటి పరిస్థితులు, సామగ్రి మొదలైన వాటి గురించి తెలుసుకొన్నాడు. గని యాజమానులు కట్టించిన ఆసుపత్రిని. కార్మికులకు కట్టించిన ఇళ్లను పరిశీలించారు. ధన్ బాద్ కు తిరిగి వచ్చే టప్పడు బేగానియ గనుల వద్ద ఒంటి గది కార్మికుల నివాసాలు చూసి అవి చీకటి గుయ్యారా లుగా ఉండటం గమనించాడు. కార్మికుల ఇంటి అవసరాలకు తగిన బొగ్గు ఉచితంగా లభిస్తున్నట్లు కూడా తెలిసింది.
అప్పుడే ధన్ బాద్ లో బొగ్గు కొరత పై కేంద్రప్రభుత్వ ప్రతినిధులు, బెంగాల్ బీహార్ ప్రభు త్వాల ప్రతినిధులు , ఆ మూడు ప్రాంతాల బొగ్గు గని ప్రతినిధులు, కార్మికవర్గ ప్రతినిధులు పాల్గొన్న ఆ సమావేశానికి అంబేద్కర్ అధ్యక్షత వహించాడు. భారతదేశ పరిశ్రమలు, యుద్ధ అవసరాలకు బొగ్గు ఉత్పత్తిని అధికం చేయాలని అందుకు సలహాలు ఇమ్మని ప్రతినిధులను కోరాడు. బొగ్గు ఉత్పత్తి తరుగుదలకు కార్మికుల సంఖ్య తగ్గటం ఒక కారణంగా గుర్తించటం జరిగింది. వ్యవసాయ అవసరాల కోసం తరలివెళ్లటం, సైన్యంలో చేరటానికి పోటీ పడటం ఫలితంగా కార్మికుల సంఖ్య తగ్గినట్లు నిర్ధారణకు వచ్చారు.
కొద్దికాలం క్రితం కేంద్రప్రభుత్వం ప్రకటించిన రేషన్ పథకం చర్చకు వచ్చింది. గనుల్లో పనిచేసే స్త్రీపురుషులకు సరిపడేంత రేషన్ ఏర్పాటుచేయడం, కార్మికులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా రేషన్ ఇయ్యటం, వారానికి పనిదినాలు అయిదే అయినా ఆరు పనిదినాలకు రేషన్ ఏర్పాటుచేయడం వంటివి ఆ పథకంలో భాగం. బియ్యం , పప్పు దినుసు లు తో పాటు ఉప్పు, ఆవనూనె, వస్త్రాలు కూడా కలిపి పెద్ద మొత్తంలో గని సంఘాలకు చేరవేస్తే అక్కడినుండి గనులకు పంపిణీ చేయాలనీ ఈ పథకం చెప్తుంది. ఈ పథకం అమలు గురించిన చర్చతో పాటు వేతనాల పెంపు సమస్యకూడా చర్చకువచ్చింది ఈ సదస్సులో. కార్మికుల కోసం భోజన వసతి విరామ క్యాంటీన్ల పనితీరు ప్రగతి పై జరిగిన చర్చ లో అవి కార్మికుల ఆదరణ పొందాయని తేలింది.
1944 లో బొగ్గుగనుల కార్మిక సంక్షేమ ఆర్డినెన్స్ ప్రకటించబడింది. కార్మికుల సంక్షేమానికి నిధిని సమకూర్చటం దాని ఉద్దేశం. బ్రిటిష్ ఇండియాలోని బొగ్గుగనులనుండి రైళ్లద్వారా పంపిణీ అయ్యే బొగ్గు, బొగ్గు దినుసులపై టన్నుకు నాలుగు అణాలు మించకుండా , ఒక అణాకు తగ్గకుండా నిర్ణయించి వసూలు చేసే సుంకం ఈ నిధికి మూలవనరు. వసతి సౌకర్యం, నీటిసరఫరా, విద్యావైద్య అవసరాలు,పౌష్టిక ఆహరం, రవాణా సౌకర్యాలు, సాంఘిక పరిస్థి తుల మెరుగుదల, జీవనప్రమాణాల పెరుగుదల మొదలైన అంశాలకోసం ఈ నిధులను వెచ్చించటం జరుగుతుంది అని తెలియపరిచాడు.
అలాగే అంబెద్కర్ 1944 ఏప్రిల్ 28 న మైకా గనులలోకి 400 అడుగుల లోతుకు దిగి కార్మికుల పని పరిస్థితులను తెలుసుకొన్నాడు.మైకా కార్మికుల గుడిసెల కాలనీలో తిరిగి వాళ్ళ జీవిత పరిస్థితులను అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసాడు. గుడిసెల మధ్య ఒక చెట్టుకు ఆనించి వున్న రెండు జేగురు రంగు ముక్కోణపు రాళ్లను మైకా దేవతగా భావించి కార్మికులు పూజలు చేయటాన్ని ఆయన తెలుసుకొన్నాడు. కోడర్మా కర్మాగారంలో వేలమంది స్త్రీ పురుష కార్మికులు పెద్దపెద్ద వసరా గదుల్లో కూర్చుని మైకా అచ్చులతో పనిచేయటం, మైకాను పలకలుగా చేయటం, కత్తులతో సరిచేయటం,కొడవళ్ళతో పల్చని రేకులుగా విడదీయటం వంటి పనులను నైపుణ్యంతో వాళ్ళు చేయటం చూసాడు.
ఆ మర్నాడే బీహార్ లోని కోడర్మా లో జరిగిన మైకా గని భారత ప్రభుత్వప్రతినిధుల, బీహార్ ప్రభుత్వ ప్రతినిధుల, వృత్తి సంఘాల, మైకా గనికార్మిక ప్రతినిధుల సభలో పాల్గొని ప్రసంగించాడు. విద్యుత్ సాంకేతిక పరిశ్రమలు, యుద్ధ సామగ్రి తయారీ పరిశ్రమలు మైకా మీదనే ఆధారపడి ఉన్నాయని, ప్రపంచ ఉత్పత్తిలో 81 శాతం భారత దేశానిదే అని సగర్వంగా పేర్కొన్నాడు. 60 వేల మంది కార్మికులతో ఒక లక్ష కుటీర కార్మికులతో – అంటే ఇళ్లల్లో పనిచేసే కార్మికుల శ్రమతో నడుస్తున్న ఈ పరిశ్రమ దేశంలో చాలా కీలకమైనదని యుద్ధానంతర పరిస్ధితి గురించిన అనుమానంతో దానిని స్థిరం గా ఉంచడానికి భారత ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని,అందులో భాగంగా మైకా పరిశ్రమలోని తక్షణ సమస్యలను గుర్తించి, పరిష్కారమార్గాలు సూచించటానికి విచారణ సంఘాన్ని ఏర్పరచిందని చెప్పాడు. పత్తి నూలు, జనపనార వంటి పరిశ్రమల గురించి తెలిసినంత మైకా పరిశ్రమ గురించి తెలియక పోవటానికి ఉత్పత్తి అయిన మైకాను అంతా ఎగుమతి చెయ్యటం వలన భారతీయులకు మైకా తో సంబంధం లేకుండా పోవటమే నంటాడు.
4
1942 నుండి 1946 వరకు గవర్నర్ జనరల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కార్యనిర్వాహక పరిషత్తులో రాజ్య ప్రతినిధిగా కార్మికశాఖను నిర్వహించిన కాలంలో అంబేద్కర్ కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లులు , వాటి మీదచేసిన చర్చలు ఆయన కార్మికవర్గ దృక్పథాన్ని తెలుసుకొనటానికి అదే సమయంలో భారతదేశపు కార్మికవర్గ సమస్యలను ప్రభుత్వ పరంగా తీసుకోబడిన పరిష్కార చర్యల చరిత్రను తెలుసుకొనటానికి చక్కగా ఉపయోగపడతాయి. దానికి తార్కాణంగా కొన్నిటిని కాలక్రమ వరుసలో పరిశీలించటం ప్రయోజనకరం.
యుద్దగాయాల (పరిహార) బిల్లు ( 31-3-1943) యుద్ధంలో గాయపడ్డ కార్మికులకు నష్టపరిహారం ఇయ్యటం, దానిని చెల్లించే బాధ్యతను యజమానుల బాధ్యతగా చేయటం, ఆ బాధ్యతకు బద్ధులై యజమానులు ఇన్సూరెన్స్ తీసుకొనేట్లు ఆదేశించటం లక్ష్యంగా రూపొందింబిల్లు ఇది. దీనిని సభకు వివరించే క్రమంలో అంబేద్కర్ 1941 నాటి యుద్ధగాయల అత్యవసర చట్టంతో, 1936 నాటి యుద్ధగాయల చట్టంతో పోల్చి వర్తమాన బిల్లు అవసరాన్ని స్థాపించాడు.
కార్మికులు యుద్ధంలో గాయపడటం అంటే వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నారని కాదు. యుద్ధ ప్రాంతాలకు సమీపంలో ఉండే ఫ్యాక్టరీలలో పని చేసే కార్మికుల కోసం ప్రవేశ పెట్టిన బిల్లు ఇది. పని ప్రదేశంలో ఉన్నప్పుడు – ఏ బాంబులో పడటం వలన గాయపడిన వాళ్ళు , వాటి తీవ్రత వలన పని చేయలేని పరిస్థితిలో పడ్డవాళ్ళ ప్రయోజనాలకోసం రూపొందించింది. ఆ పరిధిలోకి అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులను , సముద్ర తీరప్రాంతాల కార్మికులను తీసుకు రావాలనే సూచనలతో సెలక్ట్ కమిటీ ముందర దానిని ఉంచటానికి సభ ఆమోదించింది. కార్మికు లతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి పారిశ్రామిక సంస్థలలో లేబర్ ఆఫీసర్ల నియామకం గురించిన చర్చకూడా వచ్చింది
ఆ బిల్లు సెలక్ట్ కమిటీ చేసిన చేర్పులు, మార్పులతో 13-8- 1943 లో మళ్ళీ సభలో ప్రవేశపెట్టబడింది. ఫ్యాక్టరీ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, ఫ్యాక్టరీ గుమస్తాలకు, తోటల కార్మికు లకు కూడా వర్తించేలా సమగ్రతను పొంది చర్చకు వచ్చింది. భారత యుద్ధ గాయాల పథకంలో అలవెన్స్ రేట్లను పురుషులతో సమానంగా స్త్రీలకూ వర్తింపచేయాలన్న చర్చ (1943 సెప్టెంబర్ 9 ) వచ్చింది. ఇంగ్లాండ్ లో స్త్రీ పురుష భేదం తొలగించిన నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.
భారత ట్రేడ్ యూనియన్ల ( సవరణ) బిల్లు ( 1943 నవంబర్ 13) 1926 భారత ట్రేడ్ యూనియన్ల చట్టాన్ని ఇంకా సవరించటానికి ప్రజాభిప్రాయసేకరణకు పంపిణీ చేయాలని ఈ బిల్లును అంబేద్కర్ ప్రవేశపెట్టాడు. ఈ బిల్లులో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. వాటిలో మొదటిది ట్రేడ్ యూనియన్ ను గుర్తించేందుకు యాజమాన్యంపై ఒత్తిడి తేవటం. రెండవది ట్రేడ్ యూనియన్ నిర్మాణానికి సంబంధించిన షరతుల విధింపు. ఆ పద్ధతిలో నిర్మాణమైన ట్రేడ్ యూనియన్లు యాజమాన్య గుర్తింపుకు అర్హమైనవి అవుతాయి. మూడవది అలా గుర్తింపుకు అవసరమైన అర్హతలు అన్నీ ఉన్నా గుర్తించ నిరాకరించే యాజమాన్యం శిక్షార్హం అవుతుంది. కార్మిక సంఘాలు ఆరోగ్యంగా ఎదగటానికి, యజమానులకు కార్మికులకు మధ్య శాంతియుత సంబంధాల కొనసాగింపుకు ట్రేడ్ యూనియన్లను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పిన రాయల్ కమీషన్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ అంబేద్కర్ సభ ఆమోదాన్నీ కోరాడు. రాయల్ కమీషన్ నివేదిక వచ్చి (1929) పన్నెండు ఏళ్లుగడిచినా యజమానులు తమంతట తాము కార్మిక సంఘాలను గుర్తిస్తారనే ఆశ లేకపోవటం వల్లనే ఈ బిల్లు అవసరమైంది అని చెప్పాడు.
ఫ్యాక్టరీల ( సవరణ )బిల్లు (1944 ఏప్రిల్ 4) 1934 ఫ్యాక్టరీ చట్టం లోని 9, 19, 23, 45, 54 నిబంధనల సవరణను ఉద్దేశించినబిల్లు ఇది. దీనిని సభలో ప్రవేశపెడుతూ అవి ఎందుకు సవరించాలో వివరించాడు. ఆ క్రమంలో నాలుగు సవరణలను ప్రతిపాదించాడు.ఒకటి- ఫ్యాక్టరీ లు ప్రారంభించేవాళ్ళు అవసరమైన సమాచారంతో ఒక నివేదికను ప్యాక్టరీ తనఖీదార్లకు సమర్పిం చవలసి ఉండగా దానిని నిరాకరించి ఫ్యాక్టరీ నిర్మాతలు పరిశీలకులకు జవాబుదారులం కామన్న ట్లుగా వ్యవహరించటానికి అవకాశం ఇస్తున్నందువలన సవరణ అవసరం అవుతున్నదని అంబేద్కర్ వివరించాడు. రెండవది స్నానపు గదుల ఏర్పాటు కార్మికులకు అందరికీ కాక దుర్గంధపూరితమైన , హానికరమైన పరిస్థితిలో పనిచేసే వాళ్ళకే పరిమితం చేయటం. మూడవది ఫ్యాక్టరీలో అగ్నిమాపక సాధనాల ఏర్పాటు ఏ సంఖ్యలో ఉండాలి అనేది యాజమాన్య నిర్ణయంగా కాక ప్రభుత్వ నిర్ణయంగా ఉండాలి. పరిశీలకుల సూచన మేరకు ఆ పని జరగాలి నాలుగవది స్త్రీలు పిల్లలు పనిచేసే సమయానికి సంబంధించింది. 13 గంటల పనికాలంలో ఏ మార్పూ లేదు కానీ పని సమయాన్ని ఉదయం 7.30 నుండి రాత్రి 8. 30 కి మార్చటం. కాలమానంలో మార్పు , విద్యుత్తు పొదుపు దృష్ట్యా ఈ సవరణ అవసరం అవుతున్నదని పేర్కొన్నాడు. ఫ్యాక్టరీల మీద ప్రభుత్వ నియంత్రణ, పరిశీలకుల హక్కులు ఇందులో కీలకం.
కర్మాగారాల (రెండవ సవరణ) బిల్లు (1944 నవంబర్ 1 ) ఇది కూడా 1934 ఫ్యాక్టరీ చట్టానికి సవరణే. ఈ సవరణలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి సెలవులకు సంబంధించింది. ఫ్యాక్టరీ కార్మికుల ఆరోగ్యం, సామర్ధ్యం పరిరక్షణకు వరుస శ్రమ తరువాత అవసరమైన విశ్రాంతికోసం నిర్దేశిత సెలవలు ఫ్యాక్టరీ చట్టాలలో భాగమే. అయితే ఫ్యాక్టరీ యజమానుల అవసరాలు నిర్దేశాల మేరకు కార్మికులు హక్కుగా పొందే తప్పనిసరి సెలవును ఉపయోగించుకొనే అవకాశం కోల్పోయి నప్పుడు నష్టపరిహారం సెలవులకు సంబంధించిన నిబంధనలు చేర్చటం మొదటి సవ రణ లక్ష్యం. రెండవది వేతన సెలవులకు సంబంధించినది. 1936 అంతర్జాతీయ కార్మిక సదస్సులో వేతన సెలవులకు సంబంధించిన తీర్మానం రూపొందిన సంగతి గుర్తు చేసి భారత ప్రభుత్వం ఆ సదస్సును ఆమోదించలేదు కానీ అందులోని కొన్ని అంశాలనైనా ఆమోదించటానికి ఉన్న అవకా శాలను పరిశీలించటానికి సిద్ధపడిందని ఈ ఏడెనిమిదేళ్ళుగా వివిధ స్థాయిలలో జరిగిన చర్చల ఫలితం వేతన సెలవు విషయాన్ని పరిగణనలోకి తీసుకొనటం అని వివరించాడు అంబేద్కర్.
నిరంతరం పనిచేసే ఫ్యాక్టరీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్తూ ఏడాదిపాటు నిరం తరం పనిచేసిన కార్మికులు ఏడురోజులు వేతనంతో కూడిన సెలవుకు అర్హులని, అంతర్జాతీయ కార్మికసదస్సు నిర్దేశించిన ఆరు రోజుల సెలవుకన్నా ఇది మెరుగైందని చెప్పాడు. వారాంతపు సెలవు దినం ఎలాగూ ఉన్నదే. ఏడాదికాలపు నిరంతర పనిలో అనారోగ్యం, ప్రమాదం, ఆధికారిక సెలవు, లాకౌట్ కాలం, చట్ట బద్ధ సమ్మె కాలం మొదలైన వాటివల్ల ఏర్పడే అవాంతరాలకు మినహా యింపు ఉంటుందని, అలాగే ఫ్యాక్టరీ యజమాని తన ఇచ్ఛానుసారం ఫ్యాక్టరీ మూసివేసినప్పుడు కలిగే అవాంఛిత నిరుద్యోగ కాలం ముప్ఫయి రోజులకు మించనప్పుడు అది కూడా వేతనంతో కూడిన సెలవు పొందటానికి అవరోధం కాదని ఈ బిల్లులో పొందుపరచటం జరిగిందని అంబేద్కర్ వివరణ ఇచ్చాడు. ఈ ఏడురోజుల వేతన సెలవును రెండేళ్ల కాలంలో 14 రోజులు సమకూర్చుకొని ఉపయోగించుకోవచ్చు అన్న షరతు కూడా ఇందులో చేర్చారు. కార్మికులకు సెలవు ఇవ్వటంతో పాటు దానిని వినియోగించుకొనటానికి కొంత నగదు ఇప్పించే ఏర్పాటు, అందులో సగం ముందుగా చెల్లించాలనే షరతు ఈ బిల్లులో చేర్చబడ్డాయి.
అయితే కార్మికులు ఈ వేతనంతో కూడిన సెలవు సంపాదించుకోకుండా 12 నెలల పనికాలం పూర్తి కావటానికి ముందే యజమానులు వాళ్ళను తొలగించటం, అలా కాకపోయినా సంపాదించుకొన్న సెలవలు ఉపయోగించుకోనీయకుండా ఒత్తిడి పెట్టటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాదా అని సందేహం కలగవచ్చు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడే రాదన్న నమ్మకంతో ప్రభుత్వం వాటిని ఈ బిల్లులో ప్రస్తావించలేదని చెప్పి అంబేద్కర్ అలాంటి ఘటనే జరిగితే అవి పునరావృత్తం కాకుండా చట్టంలో సవరణ తేవచ్చని అన్నాడు.
సెలెక్ట్ కమిటీ నివేదిక ను అనుసరించి 1934 సంవత్సరపు కర్మాగారాల చట్టాన్ని మరింత సవరించటానికి 1935 మార్చ్ 29 న సభముందు పెట్టాడు అంబేద్కర్. సెలెక్ట్ కమిటీ చేసిన ముఖ్యమైన సవరణలను సభ దృష్టికి తీసుకువస్తూ మాట్లాడాడు. 1. ఈ చట్టంలో కల్పించిన సెలవలు కాక ఇతర చట్టాల ప్రకారం గానీ, ఒప్పొందాల వలన గానీ అనుమతించబడిన సెలవులు సర్వీసు నిబంధనల ప్రకారం లభించిన సెలవులు కార్మికులు హక్కుగా కలిగివుండే అవకాశాన్ని పరిరక్షించటం 2. వేతనంతో కూడిన సెలవుని బాలలకు కూడా వర్తింపచేయటమే కాక కార్మికులకు ఉన్న ఏడురోజుల వేతనంతో కూడిన సెలవును బాలలకు పద్నాలుగు రోజులకు పెంచటం. 3. వేతనంతో కూడిన సెలవు వినియోగించుకొనే అవకాశాన్ని కార్మికులు వినియోగించకుండా నిర్ణీత సంవత్సర కాలం కంటే ముందే వాళ్ళను యజమానులు పని నుండి తొలగించినా , సెలవు ఫలితంగా పొందవలసిన వేతనం పొందకపోయినా వచ్చే కార్మికవివాదాల పరిష్కారం రాజ్యం బాధ్యతగా నిర్ధారించి కార్మికుల పక్షాన వ్యవహరించటానికి ఇన్స్పెక్టర్లకు అధికారాలు ఇయ్యటం. 4. బిల్లు అమలుకు అవసారమైన నియమావళి రూపకల్పనకు రాష్ట్రాలకు అవకాశం ఇయ్యటం వలన దేశమంతా ఇది అమలయ్యేటప్పుడు ఏకరూపత లేకుండా పొయ్యే ప్రమాదాన్ని నివారించటానికి నియమాల రూపకల్పన బాధ్యత భారత ప్రభుత్వమే తీసుకొనటం.
ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు (1946, ఫిబ్రవరి 21) దీనిని ఫ్యాక్టరీల సవరణ చట్టం 1934 కి తదుపరి సవరణ బిల్లు అన్నాడు అంబేద్కర్. పనికాలాన్ని తగ్గించటం , అదనపు పనికాలానికి చెల్లింపులు అనే రెండంశాల పై కేద్రీకరించబడిన బిల్లు. ఏడాది పొడుగునా నడిచే కర్మాగారాల్లో వారానికి 54 అలాకాక ఆయా కాలాలకు పరిమితమై నడిచేవాటికి 60 పనిగంటలుగా ఉండగా వాటిని 48 పని గంటలకు, 54 పనిగంటలకు తగ్గించటం దీని ఉద్దేశం. ఈ సందర్భంగా ఆయన కార్మికుల పని గంటల గురించిన చర్చ 1919 లో వాషింగ్టన్ లో జరిగిన సదస్సులో చర్చకువచ్చిందని, అక్కడ ఫ్యాక్టరీ కార్మికుల పనిగంటలు 40 అని నిర్ణయమైనా భారతదేశ పరిస్థితుల దృష్ట్యా 60 అని నిర్ణయించి కొనసాగించటం జరిగిందని, ఆ తరువాత రాయల్ కమీషన్ సిఫారసుమేరకు 1934 చట్టం ద్వారా 54 గంటల పనికాలాన్ని అమలులోకి తెచ్చిందని ఇప్పుడు యుద్ధకాలంలో పెరిగిన పనిగంటలవల్ల కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను, ఒత్తిడిని, భారతదేశ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పనిగంటలు తగ్గించటానికి ఈ చర్య తీసుకొంటున్నదని చరిత్ర ను ప్రస్తావిస్తూ వివరించాడు. ఇక అధికపనిగంటల చెల్లింపులో సీజనల్ కర్మాగారాలలో 60 గంటల పనికాలానికి ఒకటిన్నర రేట్లు చెల్లింపు ఉంటే పూర్తికాలపు కర్మాగారాలలో 54 నుండి 60 పనిగంటలకు ఒకటింపావు రేట్లు, పనిగంటలు 60 దాటితే ఒకటిన్నర రేట్లు చెల్లింపు ఉంటున్నదని ఈ తేడాలు అన్యాయమని భావించి అన్నిరకాల పనిగంటలకు ఒకటిన్నర రేట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది ఈ బిల్లు.
ఫ్యాక్టరీల ( సవరణ) బిల్లు ( 1946 ఏప్రిల్ 4) ఇది కూడా 1934 చట్టానికి సంబంధించినదే. పూర్తికాలం పనిచేసే ఫ్యాక్టరీలో పనిగంటలు రోజుకు 10 1/2 గంటలుగా, ప్రత్యేక సీజన్ లో నడిచే ఫ్యాక్టరీలో 11 ½ గంటలుగా ప్రతిపాదించబడితే అధ్యక్షుడు వాటిని 12 గంటలుగా సవరించాలని చెప్పినప్పుడు అంబేద్కర్ దానిని తిరస్కరిస్తూ చేసిన వాదం ఆసక్తికరమైనది.ఈ సవరణ ప్రతి పాదనలో ఆయా ఫ్యాక్టరీలలో కార్మికుల పనికి సంబంధించి అమలులో ఉన్న విధానాలకు అను కూలంగా చట్టం రూపొందాలి అన్న ఉద్దేశం కనబడుతుంది అది తప్పు అంటాడు అంబేద్కర్. యజమానుల ఆచరణకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టం చేయరాదు. ఎందుకంటె యజ మానులు ఆచరణ తరచు వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటుంది. అలాగే 12 గంటల పని గంటలు విరామ సూత్రానికి విరుద్ధం అని కూడా చెప్పాడు. చట్టం విధించిన గరిష్ట కాలానికి మించి ఎక్కువకాలం కార్మికుడికి ఫ్యాక్టరీ లో ఉండే అగత్యం కలిగించకపోవటం. ఈ బిల్లు గరిష్ట కాలాన్ని రోజుకు తొమ్మిది గంటలుగా నిర్ణయిస్తున్నది. పన్నెండు గంటల సవరణను ఆమోదిస్తే అదనంగా మూడుగంటలు కార్మికులను ఫ్యాక్టరీ ఆవరణలో ఉంచవలసి వస్తుంది. నిజం చెప్పవలసివస్తే ఫ్యాక్టరీ బృందావనం ఏమీ కాదు. ఉండవలసిన సౌకర్యాలు అక్కడేమీ లేవు. అందువలన కార్మికులను సాధ్యమైనంత త్వరగా ఫ్యాక్టరీ నుండి ఇంటికి పంపించి స్వేచ్ఛగా గాలిపీల్చుకొంటూ తనకున్న సరదాలు తీర్చుకొంటూ చట్టం ఇచ్చిన విశ్రాంతి సమయాన్ని సద్విని యోగ పరుచుకొనటానికి అనుమతించటం వాంఛనీయం అంటాడు అంబేద్కర్. కార్మికులను సంపద సృష్టించే యంత్రాలుగా కాక సహజ స్వేచ్ఛాకాంక్షలు ఉన్న మానవులుగా సంభావించటంలో ఉన్నది అంబేద్కర్ ప్రత్యేకత.
కార్మికుల సంక్షేమం – సాంఘికభద్రత ( 1946 మార్చ్ 11) కు సంబంధించిన చర్చ సందర్భంలో అంబేద్కర్ నిరుద్యోగ భృతి, దినబత్తెం, సాంఘిక భద్రతా సౌకర్యాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగులైన కార్మికులకు మాత్రమే వర్తించేవిగా ఉంటే తద్వారా గౌరవనీయమైన కార్మికవర్గం ఒకటి రూపొందే ప్రమాదాన్ని శంకించి నిరాకరించాడు. భారతదేశంలో కార్మికులకు ప్రభుత్వమే కాక ప్రయివేటు వ్యక్తులు కూడా పనికల్పిస్తున్నారు. భారతప్రభుత్వం రూపొందించే విధానాలు అందరికీ సమానం గా వర్తించేవిగా ఉండటమే న్యాయం అంటాడాయన. కార్మిక శాఖ సరిగా పనిచేయటం లేదన్న విమర్శ వచ్చినప్పుడు, ఉద్యోగుల జీతభత్యాలలో వివక్ష గురించి ఆరోపణలు వచ్చినప్పుడు అంబేద్కర్ కార్మిక సంఘాలు, నాయకులూ తమ బాధ్యతలను సరిగా నిర్వహించకపోవడం వల్లనే అందుకు అవకాశం ఏర్పడుతున్నదని సమాధానం ఇయ్యటం చూస్తాం.
ఏ పరిమితులలోనైనా కార్మికుల సంక్షేమం గురించి ఆ నాటి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తున్నదో ఈ బిల్లులు చెప్తాయి. అవి సభలో చర్చకువచ్చినప్పుడు అంబేద్కర్ ఎంత అధ్యయనంతో , చారిత్రక అవగాహనతో మెరుగైన వర్తమాన నిర్మాణం కోసం తన ప్రతివాదాన్ని వినిపించాడో కూడా ఈ సందర్భాలు స్పష్టం చేస్తాయి.
వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు ( 1944 నవంబర్ 16) 1936 వేతన చెల్లింపు చట్టంలోని పాలనాపరమైన ముఖ్య లోపాల సవరణకు ఉద్దేశించిన బిల్లు ఇది. వేతనాల చెల్లింపు , వేతనాలలో కోత మొదలైన విషయాలలో కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు రూపొందించటం ఇందులో ప్రధానం.
కార్మికుల నష్టపరిహారం (సవరణ) బిల్లు (1946, ఫిబ్రవరి 8) కార్మికుల నష్టపరిహార చట్టం 1923 ను బట్టి నెలకు 300/ రూపాయలు వేతనం పొందుతున్న కార్మికులకు నష్టపరిహారం పొందే హక్కు పరిమితం. యుద్ధ అలెవెన్స్, కరువుభత్యం, బోనస్ , సత్ప్రవర్తన వేతనం మొదలైన వాటిని కూడా కలిపి వేతనంగా పరిగణించటం వలన చాలామంది ఈ నష్టపరిహారహక్కు పొందే పరిధిలోకి రాకుండా పోయారు. ఈ అన్యాయాన్ని సవరించటానికి కార్మికుల వేతన పరిమితిని 400 రూపాయలకు పెంచటానికి ఈ సవరణ బిల్లు అవసరమైంది. అంతేగాక ఈ నష్టపరిహార చట్టంలోని 4వ షెడ్యూల్ సవరణ ద్వారా మరణం, శాశ్వత లేదా తాత్కాలిక అంగ వైకల్య సందర్భాలలో నష్టపరిహారం పొందే హక్కు కల్పించటం కూడా ఈ సవరణ బిల్లులో చేర్చబడింది.
భారతగనుల (సవరణ) బిల్లు (1946 ఫిబ్రవరి 8) గని కార్మికులకు గని సొరంగ ముఖ ద్వారాలవద్ద స్నానపు గదులు నిర్మించేట్లు యాజమాన్యాన్ని నిర్దేశించటానికి ఉద్దేశించిన బిల్లు ఇది. గనులలలో పనిచేసే కార్మికులకు జల్లుల కొళాయి ( షవర్బాత్ నల్లాలు ) సౌకర్యంతో స్నానాల గదులు , లాకర్ గదులు, ప్రత్యేక స్థలాలలో మహిళా గని కార్మికులకు కూడా స్నానపు గదులు ఏర్పాటు చేయాలి. 12 నెలలలోపు ఈ నిర్మాణాలు చేసే గని యజమానులకు ఖర్చులో పది శాతం ఇవ్వటానికి భారతప్రభుత్వం తనంతట తానే ముందుకువచ్చింది. బొగ్గు గనులలోపల గాలి ఆడని వేడిలో పనిచేసి చెమటోడ్చి బట్టలు శరీరమూ మురికి అయి గని బయటకువచ్చే శ్రామికులు అలసట, నిస్సత్తువతో మనుషులు గుర్తించలేనంతగా మసిబారి ఇళ్లకు ఎలా నడచి వెళ్తుంటారో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి మొదలైన వాళ్ళ కథలు చదివితే కళ్ళకు కడతారు. భూగర్భంలోకి చొచ్చుకువెళ్లి సంపద సృష్టించే కార్మికుల అటువంటి స్థితి అన్యాయం, అమాన వీయమూ అనిపించింది అంబేద్కర్ కి. జల్లుల కొళాయి స్నానాలతో సేదదీరి శుభ్రమైన శరీరంతో బట్టలతో ఇల్లు చేరటం కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది అని భావించాడాయాన.
ఈ క్రమంలో శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయం కూడా కార్మికుల పట్ల అంబేద్కర్ వైఖరి తెలుసుకొనటానికి ఉపయోగపడుతుంది. 1944 నవంబర్ 20 న మలేరియా వల్ల బొగ్గుగనులలలో శ్రామిక కొరత ఏర్పడుతున్నదన్న సభ్యుల ఆరోపణ కు అంబేద్కర్ సమాధానాలు ఇచ్చాడు. రేణుకా రే ఆగస్టు సెప్టెంబర్ నెలలలో మలేరియా సోకి, మందుల సరఫరా, తగిన వైద్య సహాయం లేకపోవటం వలన బొగ్గు గనుల్లో శ్రామికుల కొరత ఏర్పడిందని, తీవ్రంగా రోగపీడితులు కావటం, పౌష్టికాహార లోపం వల్లా శ్రామికుల సామర్ధ్య తగ్గిన వాస్తవం మీకు తెలుసా అని నిలదీస్తూ వాటి నివారణాలకు మీరేమి చర్యలు తీసుకొన్నారు అని అడిగింది.
1944 ప్రారంభం నుండి అంబేద్కర్ బొగ్గుగనులలలో శ్రామికుల కొరత గురించి మాట్లాడు తూనే ఉన్నాడు. గనుల భూగర్భంలో పనికి మహిళల పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయటానికి దానినే కారణంగా చెప్తున్నాడు. ఆ సందర్భంగా జరిగిన చర్చలలో శ్రామికుల కొరతకు వాళ్ళు వ్యవసాయ రంగంలోకో , అధిక వేతనాలు గల సైనికోద్యోగాలలోకి వెళ్ళటమో కారణంగా చెప్తున్నాడు. బహుశా దానికి సవాల్ గా శ్రామికుల కొరతకు మలేరియాను కారణంగా ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ముందుకు తెచ్చారు సభ్యులు. ఆయా కాలాలలో వచ్చే మలేరియాకు కార్మికులు అతీతులు కాదని , తరచువచ్చే మలేరియా రోగాన్ని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి కార్మికులలలో లేదని వారి చికిత్సకు అవసరమైన చర్యలు – మందుల సరఫరా వంటివి – తీసుకొంటూనే ఉన్నామని, ఉన్న ఆసు పత్రులు సరిపోవటం లేదని , వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే కార్మిక సంక్షేమ నిధిని ఏర్పర చటం జరిగిందని ఆయన చెప్పాడు.పౌష్టికాహార లోపం వల్ల శ్రామికుల కొరతతో పాటు వ్యక్తిగత ఉత్పాదకత కూడా తగ్గిందన్న ఒక సభ్యుడి ఆరోపణకు సమాధానంగా ఉత్పాదకత తగ్గుదలకు యంత్రాల లేమిని కారణంగా చెప్పాడు అంబేద్కర్.
అదే 1944 నవంబర్ 20 న గనుల అంతర్భాగంలో బాలకార్మికులను నిషేధించే చట్టాలను ఉల్లంఘించిన సందర్భాల గురించి రేణుకారే లేవనెత్తిన ప్రశ్నకు అంబేద్కర్ గనుల శాఖ అధికారులు తరచు తనిఖీలు చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉంటె తగిన చర్య తీసుకొం టారని, సభ్యులు నిర్దిష్ట గనులకు సంబంధించి నిర్దిష్ట దృష్టాంతాలు దృష్టికి తెస్తే తగిన చర్య తీసు కొంటానని హామీ ఇచ్చాడు.
అదేరోజు బీహారులో బొగ్గుగని పనివారికి బియ్యం సరఫరా ఏర్పాట్లమీద ప్రశ్నోత్తరాలు నడిచాయి. నియంత్రిత ధరకన్నా ఎక్కువ వసూలు చేయటం , బియ్యంలో నాణ్యత లోపించటం చర్చకు వచ్చాయి. బీహార్ ప్రభుత్వం కార్మికులకు సరఫరా చేయవలసిన బియ్యాన్ని నేపాల్ నుండి నియంత్రిత ధరకన్నా ఎక్కువకు కొనుగోలు చేసిందని ఆ మేరకు కార్మికులకు నియంత్రిత ధరకన్నా కాస్త ఎక్కువకు అమ్మటం జరిగిందని , నాణ్యత విషయం ఇంకా నిర్ధారించవలసి ఉందని జవాబు ఇచ్చాడు.
1945 ఫిబ్రవరి 21 నాడు బొగ్గు గనులలో ఘోరక్ పూర్ కార్మికులకు సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు అంబేద్కర్ ఇచ్చిన సమాధానాలు వలస కార్మిక వ్యవస్థ నిర్మాణం గురించి తెలియ చేస్తాయి.గోరఖపూర్ శ్రామిక సరఫరా విభాగం బొగ్గు గనులలలో, ఇతర ప్రభుత్వ సంస్థలలో పనిచేయటానికి కార్మికులను భర్తీ చేస్తుంది. వేలమంది ఇలా పంపబడుతుంటారు. ప్రతి యాభైమంది జట్టుకు ఒక గిర్దావర్ 250 మందికి ఒక యూనిట్ పర్యవేక్షకుడు,1000 మంది ఉన్న ప్రతిశిబిరానికి ఒక శిబిర పర్యవేక్షకుడు, ఒకటిని మించిన శిబిరాలకు ప్రాంతాన్ని బట్టి ఓకే గ్రూప్ అధికారి ఉంటారు. ఈ పనిశిబిరాలకు బాధ్యత వహించే అధికారి ఉపసంచాలకుడు. ఈ విస్తృత నిర్మణపు కేంద్ర కార్యాలయం ధన్ బాద్.
ఈ పనివాళ్లను పనిజేరిగే స్థలంలో ఆరునెలలకు లేదా ఒక సంవత్సరానికి లేదా పని పూర్తయ్యేవరకు ఏది తక్కువకాలం అయితే ఆ కాలానికి భర్తీ చేస్తారు. కూలీలకు కొంతబయానా, ఉచిత నివాసం, వంటచెరుకు, దినవెచ్చాలు, ఒక జత బట్టలు, కంబళి ఇచ్చి పనిలో చేరుస్తారు. వాళ్ళ పనికి నిర్ణీత వేతనం , మంచి పనికి దీర్ఘకాలిక బోనస్ లభిస్తాయి అని చెప్పాడు అంబేద్కర్. అప్పటికి అలాంటి పనివాళ్ళు 15 వేలమంది ఉన్నట్లు చెప్పాడు. బొగ్గు క్షేత్రాలలో పనిచేస్తున్న వారికి రోజుకు 12 అణాలు మూల వేతనం, ఉత్పత్తి బోనస్ రోజుకు 4 అణాలు, భూగర్భంలో పనిచేసినందుకు అదనంగా నాలుగు అణాలు ఇస్తారు. స్థానిక పనివాళ్ళకన్నా ఇది మెరుగైన వేతనం. గోరఖ్ పూర్ పనివాళ్ళు పనికి బాగా అలవాటుపడి నైపుణ్యంతో చేస్తున్నట్లు సమాచారం ఉందని కూడా ఆయన చెప్పాడు.
5
అంబేద్కర్ మహిళా కార్మిక శ్రమ శక్తి ప్రాధాన్యతను గుర్తించిన వాడు. 1944 లో మైకా గనుల కార్మిక సమస్యలను చర్చిస్తూ బెంగాల్ రూబీ గా పేరుబడ్డ బీహార్ మైకా వల్ల ప్రపంచ మార్కెట్లో భారతదేశ మైకాకు ప్రాధాన్యత ఉందని చెప్తూ ప్రధానంగా ఆదివాసీల పనివల్ల , అందులోనూ ఎక్కువ సంఖ్యలో ఉన్న స్త్రీల పనివల్ల మైకాకు నాణ్యత , విలువ వచ్చాయని చెప్పటంలో స్త్రీ శక్తి ఎంతకళాత్మక శ్రమ సంయుతమో చెప్పినట్లయింది.
అట్లాగే ఆయన మహిళా కార్మిక సంక్షేమానికి కట్టుబడి కూడా ఉన్నాడు.మహిళా కార్మిక సమస్యల పై అంబేద్కర్ ఆలోచనలు బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా (1927- 1934) ఉన్న కాలంలోనే వ్యక్తమైనాయి. 1938 లో ఎంఎల్ ఏ పదవీకాలంలోనూ ఆ తరువాత గవర్నర్ జనరల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆందునా కార్మిక శాఖ నిర్వాహకుడిగా మహిళా సమస్యలపై చర్చలో ఆయన ప్రభావ వంతమైన పాత్ర నిర్వహించాడు. ఆ కాలపు చర్చ ప్రధానంగా రెండు అంశాలమీద కేంద్రీకృతం అయింది. ఒకటి ప్రసూతి ప్రయోజన బిల్లు. రెండు- బొగ్గు గనుల లోపలి పనులకు స్త్రీలను నియమించటం, నిషేధించటం అనే రెండు విరుద్ధ అంశాల మీద సంవాదం.
ప్రసూతి ప్రయోజనాల బిల్లు .
1928 జులై 28 న ప్రసూతి ప్రయోజన బిల్లుకు మద్దతుగా ఆయన చేసిన వాదం కీలకమైనది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ప్రసూతి ప్రమాదం లాంటిది కాదు .. పరిహారం అవసరం లేదన్నట్లు ఒక సభ్యుడు మాట్లాడిన దాన్ని ఖండించటంతో తన వాదం ప్రారంభించాడు. అది ప్రమాదంకాదనుకున్నా ఈ బిల్లు వల్ల కలిగే ప్రయోజనాలకు స్త్రీలు అర్హులు కాకుండా పోరు అంటాడాయన. తల్లిపై ప్రభావం చూపే ప్రసూతి పూర్వ పరిస్థితులు, తరువాత బిడ్డను పెంచటం ఈ బిల్లులో ముఖ్యమైన అంశాలని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కాన్పుకు ముందూ తరువాత కూడా తల్లికి కొంత విశ్రాంతి అవసరమన్న సూత్రం మీద ఈ బిల్లు ఆధారపడి ఉందని పేర్కొన్నాడు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అనటం వల్ల అంబేద్కర్ బిడ్డను కనటం స్త్రీల వ్యక్తిగత సమస్య అన్న భావనను నిరాకరించినట్లయింది. అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని కూడా ఆయన భావించాడు. ప్రభుత్వ ప్రజాసంక్షేమ బాధ్యతలో స్త్రీల ప్రసూతి ప్రయోజనాల పరిరక్షణను భాగంగా సూచించాడు.
అంతమాత్రాన స్త్రీలను పనిలో పెట్టుకొనే యజమానికి ప్రసూతి సదుపాయాల బాధ్యత లేదు అని అర్ధం కాదని కూడా స్పష్టం చేసాడు. కొన్ని పరిశ్రమలలో పనిలోకి పురుషులను తీసు కొనటం కన్నా స్త్రీలను తీసుకొనటం లాభకరం అని వాళ్లనే ఎక్కువగా తీసుకొంటున్నారు. అందువల్ల లాభాలు పొందుతున్నప్పుడు కొంతవరకన్నా యజమానులు ప్రసూతి వేతన బాధ్యత వహించటం సమంజసం అని అంబేద్కర్ అభిప్రాయం. ఇందువల్ల పరిశ్రమలమీద పడే భారం వేతనాల తగ్గుదలకు కారణమవుతుందని ఈ బిల్లుపై వచ్చిన ఒక అభ్యంతరాన్ని తోసిపుచ్చుతూ ఈ భారం బహుళ వినియోగదారుల పైకి మళ్లుతుందని, ఉత్పత్తిదారులైన స్త్రీలకు ప్రయోజనకర మైనప్పుడు, వారు తయారుచేసే వస్తువుకు ఎక్కువధర చెల్లించటానికి సమాజానికి అభ్యంతరం ఉండకూడదు అంటాడు అంబేద్కర్.
అప్పటినుండి చట్టసభలో తనబాధ్యతల నిర్వహణలో భాగంగా ఆయన ప్రసూతి ప్రయోజనాలు సాధ్యమైనంత విస్తృతంగా లభించేట్లు ఎప్పటికప్పుడు సవరణలు ప్రతిపాదిస్తూ చర్చిస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలో 1943 జులై 29 న గని కార్మికుల ప్రసూతి సదుపాయాల సవరణ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడాడు. రోజుకి ఎనిమిదణాల చొప్పున 8 వారాల ప్రసూతి ప్రయోజనం పొందే హక్కు గని కార్మికులకు యియ్యబడింది. అందులో నాలుగువారాలు ప్రసూతికి ముందు మిగిలిన నాలుగు ప్రసూతికి తరువాత ఉపయోగించుకోవచ్చు. ప్రసవానికి ముందు నాలుగువారాల సెలవు స్త్రీల ఐచ్ఛిక నిర్ణయం. ఆ కాలంలో పనిచేసి పూర్తి జీతం కూడా పొందే అవకాశం వుంది. ప్రసవం తరువాత మాత్రం విశ్రాంతి తప్పనిసరి. అప్పడు పని చెయ్యలేరు. అలా చెయ్యటం చట్ట విరుద్ధం కూడా అందువల్ల రోజుకి ఎనిమిది అణాల చొప్పున నాలుగు నెలల సెలవు తీసుకో వలసిందే. అయితే ఇందులో కొన్ని పదాల ప్రయోగం సందిగ్దతకు తావు ఇస్తుండటం వలన వాటి సవరణకు ఈ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదం పొందాడు అంబేద్కర్.
1944 నవంబర్ 20 న రేణుకారే ప్రశ్నోత్తరాల సమయంలో గనులలోపల మహిళలు తొమ్మిది నెలలు నిండేవరకు పని చేస్తున్నట్లు, మళ్ళీ ప్రసవించిన 15 రోజులనుండే పనిలోకి వస్తున్నట్లు, భూగర్భంలో పనిచేసే స్త్రీలు తరచు ప్రమాదాలకు లోనవుతున్నట్లు చెప్తూ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించి ప్రశ్నించింది. ఇది నిరాధార ఆరోపణ అని గనుల ప్రసూతి చట్టం ప్రకారం ప్రసవానికి ముందు, ప్రసవానికి తరువాత నాలుగు వారాల సెలవకు వాళ్ళు అర్హులని ఈ చట్టం నిర్దేశించిన మేరకు దానిని అమలు పరచటానికి వైద్యులతో కూడిన అధికార యంత్రాంగం క్రమంగా తప్పకుండా తనిఖీలు చేస్తుంటుందని జవాబిచ్చాడు అంబేద్కర్. చట్టం కింద లభించే హక్కుల గురించి మహిళా కార్మికులకు తెలియచెప్పటం కూడా జరుగుతున్నదని చెప్పాడు. మహిళా కార్మికులకు ప్రమాదాలు జరిగాయి కానీ వాళ్లలో గర్భిణీ స్త్రీలు ఎందరో సమాచారం లేదని ,కానీ ఘటనలు జరిగినచోట్ల అవన్నీ నమోదు అయిఉంటాయని చెప్పాడు. గనులలలో గర్భిణీ స్త్రీలను పనిచేయకుండా నిరోధించటానికి మంచి మార్గం భూగర్భంలో స్త్రీల పని నిషేధాజ్ఞలను పునరుద్ధ రించటమే కదా అని రేణుకారే అన్న మాటలతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలి అని అంబేద్కర్ భావించాడు.
1945 ఫిబ్రవరి 9 న అసెంబ్లీ చర్చలలో గనుల్లో పనిచేసే స్త్రీలకు తలస్నానపు గుంటల ఏర్పాటు, వారి పిల్లలకు శిశుసదనాల ఏర్పాటు గురించి ప్రశ్న వస్తే అంబేద్కర్ ఒక బొగ్గు క్షేత్రంలో తలస్నానపు గుంటలు, ఎనిమిది క్షేత్రాలలో శిశుసదనాలు ఏర్పరచినట్లు సమాచారం ఇచ్చాడు. ఇది చాలా తక్కువ అని తెలుసుకనుకనే గనులలలో చేర్చుకొనే యజమానులు విధిగా శిశు సదనాలు ఏర్పాటుచేసేట్లు భారత గనుల చట్టంలో సవరణ తేవాలన్నది పరిశీలనలో ఉందని చెప్పాడు.
1945 మార్చ్ 13న అసెంబ్లీ చర్చలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అంబేద్కర్ 1943 లో గనుల్లో పనిచేసే స్త్రీ కార్మికులు 72, 403 మంది అని 1944 లెక్క అందు బాటులో లేదని , భారతీయ గనుల చట్టం ప్రకారం పిల్లలను గనులలోకి తీసుకొనే పద్ధతే లేదుకనుక బాలకార్మికుల సంఖ్య ఎంత అనే ప్రస్తావనకే తావే లేదని అంబేద్కర్ జవాబు.
అదే రోజు ఢిల్లీ ఫాక్టరీలలో స్త్రీ కార్మికుల వేతన సౌకర్యాల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ అంబేద్కర్ మహిళా సగటు వేతనం గురించి సమాచారం సిద్ధంగా లేదని, కొన్ని ఫ్యాక్టరీలలలో నెలవారీ వేతనం ఇస్తుండగా మరికొన్ని ఫ్యాక్టరీలలో రోజువారీ వేతనం ఉందని, కరువు భత్యం 10 నుండి 32 రూపాయలవరకూ ఉందని, ఒకేరకం పనిచేస్తున్న స్త్రీపురుషుల మధ్య తనకు తెలిసినంతవరకు వేతన వ్యత్యాసాలు లేవని, రెండు ఫ్యాక్టరీలు ప్రసూతి శిశు సంక్షేమ సదుపాయాలు కల్పించాయని , రెండు ఫ్యాక్టరీలలలో స్త్రీలు పనిలో ఉంటే ఆ సమయంలో వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా చూసుకొనటానికి క్రెచ్ లు ఏర్పరచాయని , ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగుల పిల్లలకు ఉచిత స్నానాల ఏర్పాటు, బలహీనంగా ఉన్న పిల్లలకు రోజుకు అర్దశేరు పాలు ఉచితంగా ఇయ్యటం ఉన్నాయని మరొక ఫ్యాక్టరీ ఉద్యోగుల పిల్లలకు పాఠశాల పట్టి ఉచితవిద్య అందియ్యటంతో పాటు పిల్లలకు రోజుకు అర్ధసేరు పాలు కూడా ఇస్తున్నదని పూర్తి సమాచారం ఇచ్చాడు. ఫ్యాక్టరరీలలో చేర్చుకొన్న స్త్రీలు నేరుగా చేర్చుకోబడ్డావాళ్లే కానీ కాంట్రాక్టర్ల ద్వారా ఏర్పాటైనవాళ్లు ఎవరూ లేరని కూడా ఆయన స్పష్టం చేసాడు.
1941 గని కార్మికుల ప్రసూతి సదుపాయ (సవరణ) బిల్లులో మరికొంత సవరణను ఉద్దేశించి 1945 మార్చ్ 29 న ప్రవేశపెట్టబడింది. గని ఉపరితల కార్మికులకే కాదు, ఇప్పుడు గని లోపలి పనిలో స్త్రీలు కూడా ఉన్నారు కనుక వాళ్లకు కూడా ఆ ప్రయోజనాన్ని వర్తింపచేయటానికి అవసరమైన మార్పులు సూచించటం ఇందులో ప్రధానం. గనిలోపలి పని తాత్కాలికమైనదీ, త్వరలో మళ్ళీ నిషేధింప తగినదే అయినా అంత వరకు పనిచేసే స్త్రీల సంక్షేమ బాధ్యత దృష్ట్యా ఈ సవరణలు చేయబడ్డాయి. చట్టప్రకారం ఇంతకు పూర్వం ప్రసవానంతరం నాలుగు వారల సెలవు ఉంటే ఈ చట్ట ప్రకారం ఇప్పుడు భూగర్భంలో పని చేసే స్త్రీకి ప్రసవానికి ముందర నాలుగువారాలకు కూడా దానిని విస్తరించటం జరిగింది. ప్రసవానికి పదివారాల ముందునుండి గనిలో పనిచేయరాదు. ఈ కాలానికి రోజుకు పన్నెండు అణాల చొప్పున ప్రసవానంతరం నాలుగు వారాలకు కూడా కలుపుకొని ఈ చెల్లింపు ఉంటుంది. ఈ సదుపాయాన్ని పొందటానికి 6 నెలల కాలంలో 90 రోజులు భూగర్భంలో పనిచేయటం షరతు.
1945 ఫిబ్రవరి 21 తేదీన గనులలలో స్త్రీ కార్మికుల పిల్లల సంరక్షణ ఏర్పాట్ల గురించి కె. రాధాబాయి సుబ్బరాయన్ వేసిన ప్రశ్నలకు అంబేద్కర్ ఇంతవరకు నిర్దిష్టమైన ఏర్పాట్లు ఏమీ జరగలేదని కొన్ని గనులలలో పరిచారికలు గల శిశుసదనాలు ఏర్పాటైనాయని, కొన్ని బొగ్గు క్షేత్రాలలలో శిశు చికిత్సాలయాలు ఉన్నాయని, అక్కడ పిల్లలకు పాలు పంచుతారని, ప్రభుత్వం శిశు సదనాలకు సంబంధించిన నిబంధనలను పరిశీలిస్తున్నదని చెప్పాడు. గనిలో పనిచేసే బాలిం తలకు క్రమబద్ధంగా పాలియ్యటానికి ఏర్పాట్లు ఏమున్నాయన్న ప్రశ్నకు పిల్లలను భూగర్భంలోకి అనుమతించరు గనుక అక్కడ ఆ సౌకర్యాలు అవసరం లేదని బయటకువచ్చి పాలిచ్చే సౌకర్యాల గురించి సమాచారం తెప్పించటానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. స్త్రీలు గని ఉపరితలానికి వచ్చి పిల్లలకు పాలియ్యటానికి, శిశుసదనాల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసేవరకు భూగర్భ పనులలలోకి స్త్రీల ప్రవేశాన్ని నిలిపివేస్తారా అని రాధాబాయి ప్రశ్నించటం పాలిస్తున్న తల్లులను భూగర్భంలో పనిచెయ్యనివ్వటానికి ప్రభుత్వం అఖిలభారత వైద్యమండలి సలహా తీసుకుంటుందా అని అడగటం అంబేద్కర్ ను ఇరుకున పెట్టేవిగా ఉండటం గమనించవచ్చు.
అదేరోజు గనుల తవ్వకపు ప్రాంతాలలో గనుల ప్రసూతి సౌకర్యాల చట్టం అమలు కోసం ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించి రాధా సుబ్బరాయన్ , రేణుకా రే, ఎన్ .జి రంగా వేసిన ప్రశ్నలకు అంబేద్కర్ ప్రసూతి సౌకర్యాల గురించి గనులలలో పనిచేసే స్త్రీలకు సహాయపడటానికి వైద్యులుగా అర్హతగల ఒక సీనియర్ కార్మిక ఇన్స్పెక్టర్, ఇద్దరు జూనియర్ కార్మిక ఇనస్పెక్టర్లు, భారతగనుల చీఫ్ ఇన్స్పెక్టర్ అధీనంలో నియమించబడ్డారని, ఈ చట్టం అమలుపై ప్రభుత్వానికి నివేదికలు ఏవీ లేవుగానీ ఇన్స్పెక్టర్లు క్రమంగా తప్పకుండా చీఫ్ ఇన్స్పెక్టర్లకు నివేదికలను పంపిస్తున్నారని గనుల శాఖవారు అవసరమైన చర్యలు తీసుకొంటుంటారని , ప్రసూతికి ముందూ వెనక నాలుగువారాల సెలవు ఫ్యాక్టరీ శాసనం ప్రకారమే ఉందని, భూగర్భంలో పనికి నియమి తులైన మహిళా కార్మికుల విషయంలో ప్రసవానికి ముందు కాలాన్ని పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరణ ఇచ్చాడు. ప్రసూతి తరువాత సెలవు పెంపుసంగతి ఏమిటన్నా అనుబంధప్రశ్నకు అవసరం లేదు , బాలింతలను గనిపనిలోకి తీసుకొనటంపై పూర్తి నిషేధం ఉందని చెప్పాడు. ప్రసూతి సదుపాయాల చట్టం కింద ప్రసూతికి ముందూ వెనుక కూడా రెండు మాసాలు ఉండాలని అంతర్జాతీయ కార్మిక సమావేశం లో తీర్మానించిన సంగతిని సభ్యులు ప్రస్తావించారు.
1945 మార్చ్ 29 న శాసనసభలో ప్రవేశపెట్టబడిన 1941 గని కార్మికుల ప్రసూతి సదుపాయ( సవరణ ) బిల్లు సెలెక్ట్ కమిటీ సవరణలతో , సూచనలతో తిరిగి 1945 ఏప్రిల్ 11 న చర్చ లోకి వచ్చింది. ప్రసవానంతరం నాలుగువారాల సెలవును సెలక్ట్ కమిటీ 36 వారాలకు పెంచింది. 36 వారాల కాలంలో నాలుగు వారాల నుండి 26 వారల వరకు పూర్తి నిషేధ కాలంగా పదివారాలను పాక్షిక నిషేధ కాలంగా నిర్ణయించింది. పని ప్రాంతంలో శిశు నిలయం లేకపోతే ఆ కాలంలో వాళ్ళు భూగర్భంలో నాలుగు గంటలను మించి పనిచేయనక్కరలేదు. ఈ సౌకర్యాలు పొందటానికి మొదటి షరతు ప్రసవానికి ముందర ఆరునెలలలో 90 రోజులు భూగర్భంలో పనిచేసి ఉండాలి. ప్రసూతి ప్రయోజనం పొందే మహిళలకి వేతనం రోజుకు పన్నెండు అనాలని కాక వారానికి ఆరురూపాయలుగా సవరించింది. అందువల్ల రోజుకు దాదాపు పద్నాలుగు అణాలు వేతనం పొందుతారు. ఇది అంతకు ముందు ప్రతిపాదనలకన్నా ఎక్కువ. ప్రసూతిసెలవు ప్రయోజన వినిమయ కాలాన్ని అధీకృత సెలవుగా ప్రకటించటం ద్వారా ఆ కాలంలో మహిళా కార్మికుల తొలగింపుకు అవకాశం లేకుండా చేసింది సెలక్ట్ కమిటీ. భూగర్భంలో ప్రసవానంతరం 36 వారాల వరకు పని చేయటాన్ని నిషేధించిన సెలక్ట్ కమిటీ మొదటి నాలుగువారాల సెలవు తరువాత ఇతరత్రా పనిచేసి ఆదాయం పొందే వెసులుబాటు ఇచ్చింది.
బొగ్గు గనుల లోపలి పనులకు స్త్రీల నియామక నిషేధ చట్టాల వివాదం
బొగ్గు గనుల లోపలి పనులకు స్త్రీలను నియమించటం, నిషేధించటం అనే రెండు అంశాల మీద చట్ట సభలో చర్చలు తరచు జరగటం చూస్తాం. భారతదేశం బొగ్గుగనుల లోపలి పనులకు స్త్రీలను నియమించడంపై నిషేధాన్ని ఎత్తివేయటాన్ని గురించి 1944 ఫిబ్రవరి 8 న లెజిస్లేటివ్ అసెబ్లీ లో జరిగిన చర్చలో అంబేద్కర్ సుదీర్ఘంగా తన వాదాన్ని వినిపించాడు. బొగ్గు గనుల లోపలి పనులకు స్త్రీలను నియమించటం, నిషేధించటంమధ్య వైరుధ్యాల చరిత్రను ఆయన వివరించాడు. 1939 నుండి ఇది చర్చలో ఉంది అన్నట్లు మాట్లాడిన సభ్యులకు – భారత బొగ్గు గనుల చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టబడిన సందర్భంలో 1923 లో తొలిసారి ఈ చర్చ మొదలైందని గుర్తు చేశాడు. బొగ్గుగనులలలో రక్షణ ప్రమాణాల మెరుగుదల గురించి ప్రవేశ పెట్టబడిన ఆ బిల్లును సెలక్ట్ కమిటీ పంపినప్పుడు గనులలలో స్త్రీలతో పని చేయించటాన్ని నిషేధిస్తూ చట్టానికి మరికొన్ని అధికారాలు ఇయ్యవచ్చునని సూచన వచ్చిందని, భారత ప్రభుత్వం దానిని అంగీకరించి స్త్రీల నియామకాన్ని తగ్గించేందుకు నియమావళి రూపొందించి, అది ఇంకా సభలో ఆమోదించ బడ టానికి రెండేళ్ల ముందునుండే ఆ దిశగా కార్యక్రమాలు కూడా తీసుకొందని చరిత్రను వివరించాడు.
అయితే ఇప్పుడీ నిషేధాన్ని ఎత్తివేయాలని భారతప్రభుత్వం భావించటం నిందకు గురి అవుతున్నదని చెప్పి నిషేధం ఎత్తివేయటం ఎందుకు అవసరమో వివరించాడాయన.. బొగ్గు అత్య వసర పారిశ్రామిక వస్తువు, సాధారణ జన వినియోగ వస్తువు కూడా కావటం, దాని ఉత్పత్తిని పెంచవలసిన అవసరం తప్పనిసరి కావటం దృష్ట్యా ప్రభుత్వం గనులలో స్త్రీల ప్రవేశం మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయటాన్ని ఉద్దేశించిందని వివరించాడు.
బొగ్గు కొరత కార్మికుల కొరత కారణంగా ఈ నిర్ణయం తప్పనిసరి అయిందని చెప్తూ కార్మికుల కొరతకు భారతప్రభుత్వం ప్రారంభించిన ‘అధిక ఆహారోత్పత్తి ప్రచారం’, సైన్యం పనుల లో ఉపాధి అవకాశాలు పెరగటం కారణమంటాడు.బొగ్గుగని కార్మికులు చాలావరకు వ్యవసాయ రంగం నుండే వచ్చినవాళ్లు కావటం ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్న నేపథ్యం లో వ్యవసాయం వైపు మళ్లటం సహజం అనీ అదేవిధంగా అధిక ఆదాయం పై ఆశ కార్మికులను సైన్య సంబంధ ఉద్యోగాల మీద ఆసక్తి చూపించేలా చేస్తున్నదని చెప్పి ఈ పరిస్థితులలలో స్త్రీలను గనులలో పనికి అనుమతించటం అవసరం అవుతుందని, సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం అమలు చేయటం,ఐదడుగుల లోతున్న గనులలోకి దిగాల్సిన అవసరం లేకుండా పనుల కేటాయింపుకు జాగ్రత్త తీసుకొనటం జరుగుతూనే ఉన్నదని యుద్ధ కాలపు తాత్కాలిక ఏర్పాటు ఇది అని ఆ బిల్లు కు అనుకూలంగా వాదన వినిపించాడు.
1944 ఫిబ్రవరి 7 న , 16 న శాసనా సభా చర్చలలో బొగ్గు గనులలలో స్త్రీ కార్మికుల ప్రవేశం మీద ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. బొగ్గుగనులలలో స్త్రీ కార్మికులను తిరిగి ప్రవేశ పెట్టటం,బొగ్గు గనులలలో స్త్రీకార్మికుల రద్దుకు ప్రజల ఒత్తిడి, స్త్రీ పురుష కార్మికులకు సమానవేతనం, వంటి వాటిమీద వచ్చిన ప్రశ్నలకు అంబేద్కర్ కేంద్ర పరగణాలైన బీరార్, బెంగాల్ , బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలలో బొగ్గుగనుల లోపల పని చేయటానికి ఇప్పుడు అనుమతిస్తున్నారని, బొగ్గు గనులలోకి స్త్రీల ప్రవేశ నిషేధం 1923 చట్టంలో ప్రస్తావనకు వచ్చిందని, దానికి కట్టుబడి భారత ప్రభుత్వం 1929 నుండి గని పనులనుండి స్త్రీలను మినహాయిస్తూ 1937 నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేసిందని, అయితే ఇప్పుడు పురుష కార్మికుల తీవ్ర కొరతవల్లనే స్త్రీలను గనులలలో పనిచేయటానికి అనుమతించవలసి వచ్చిందని చెప్పాడు. పురుష కార్మికులతోనే అవసరానికి తగినంత బొగ్గు ఉత్పత్తి అయితే స్త్రీల ను తీసుకో బోమని చెప్పాడు. అప్పటికే ఇతరప్రాంతాలనుండి కార్మికులను తెప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు పేర్కొన్నాడు. ఆరోగ్యం పాడవుతు న్నప్పటికీ కుటుంబాలు చితికి పోతున్నప్పటికీ ఎక్కువ కష్టం చేస్తూ తక్కువకూలీకి తృప్తి పడతారనా స్త్రీ కార్మికులను తీసుకొంటున్నారు అన్న నిష్టుర పూర్వక ప్రశ్నకు కాదు అన్నది ఆయన సమాధనం. స్త్రీపురుషులకు కలిపి జంట కూలీ ఇచ్చే పద్ధతి అమలవుతున్నప్పుడు సమానవేతనం సమస్యకు స్థానం ఉండదు కదా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు లేకుండింది.
1944 మార్చ్ 30 న బొగ్గుగనుల భూగర్భంలో మహిళల ఉపాధి అనే అంశం మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకు అంబేద్కర్ సమాధానం ఇచ్చాడు. బొగ్గుగనులలలో పనిచేసేవారికి ఆహార దినుసులు తక్కువ ధరకు అందించబడుతున్నాయని, బొగ్గుగనులలలో అవసరమైనం తమంది పురుషులు దొరకక పోవటం వల్లనే స్త్రీలను అనుమతించటం జరుగుతున్నదని, గనులలో పనిపరిస్థితులను,కార్మికుల జీవన పరిస్థితులను మెరుగుపరచటానికి, తగిన వేతనం చెల్లించ టానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, యంత్రాంగం బ్రిటన్, అమెరికాలలో వలే పురోగమిం చలేదు కానీ ఇతర దేశాలతో పోల్చినప్పుడు రక్షణ ఏర్పాట్లు ఇక్కడ ఎక్కువ అని చెప్పుకువచ్చాడు.
1944 ఏప్రిల్ 15 న శాసన సభాచర్చలలో భారతప్రభుత్వ కార్మిక విధానం గురించి మాట్లాడుతూ అంబేద్కర్ అందులో భాగంగా బొగ్గు గనులలలో మహిళలను ప్రవేశ పెట్టటం గురించి రాధా సుబ్బరాయన్ ప్రస్తావించిన అంశాలకు సమాధానంగా బొగ్గు ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో బొగ్గు గనులలలోకి కార్మికులను ఎక్కువగా తీసుకొనే అవకాశాలన్నిటినీ వినియోగిం చుకొంటానని, అందులో భాగంగానే మహిళలను గని లోపలి పనులకు తీసుకొనటం జరుగు తున్న దనిఅని చెప్పాడు. త్వరలో నిషేధాన్ని తిరిగి ప్రవేశ పెట్టటానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చాడు.
1944 నవంబర్ 10 ప్రశ్నోత్తరాల సెషన్ లో అంబేద్కర్ బొగ్గు గనులలలో శ్రామిక కొరతకు కొంతవరకు సైనిక కాంట్రాక్టర్లు కూలీలలను ఎక్కువ వేతనం మీద నియమించటం కార్మికులకు ఇస్తున్న వేతనాలకు పెరుగుతున్న జీవనవ్యయాలకు పొంతన కుదరకపోవడం కారణాలని పేర్కొన్నాడు. 1943 నుండి బేవార్ , బెంగాల్, బీహార్, ఒరిస్సా గనులలలో పురుష కార్మికుల సంఖ్య తగ్గటంవలన గనుల భూగర్భ పనులకు మహిళలను తీసుకోవాల్సి వచ్చిందని , బొగ్గు ఉత్పత్తి తగినంత పెరగగానే వీలయినంత త్వరలో మళ్ళీ గనులలలోకి స్త్రీల ప్రవేశాన్ని నిషేధించటం జరుగుతుందని నొక్కి చెప్పాడు. ఒక ప్రశ్నకు జవాబుగా అప్పటికి 16 వేలమంది స్త్రీలు గనులలలో పనిచేస్తున్నారని పురుషులతో సమానవేతనం – ఉచిత బియ్యం రాయితీ ఇస్తున్నట్లు రోజుకు 12 నుండి 15 అణాల వరకు కూలీ ఉంటుందని చెప్పాడు. అయిదున్నర అడుగుల లోతుకు ఎక్కువగా వున్న చోట స్త్రీలను నియమించట్టం లేదని గనుల ప్రసూతి సౌకర్యాల ప్రయోజనాలు అమలవు తున్నాయని చెప్పాడు. యుద్ధవాసరాల పేరుచెప్పి ఏ దేశంలో లేనిది ఇక్కడ స్త్రీలను భూగర్భ పనిలోకి పంపించే అవమానకరమైన పనిలో భాగస్వాములయ్యారని సభ్యులు నిలదీసినప్పుడు బొగ్గు కొరత తక్షణం పరిష్కరించవలసిన సమస్య కనుక ఇదొక మార్గంగా ఎంచుకోవటం అనివార్యమైనదని సమాధానం ఇచ్చాడు.
జీవన వ్యయానికి తగ్గట్లు వేతనాల పెంపుకు , ఆహారపదార్ధాల సరఫరా లో రాయితీ ఇయ్యటానికి 1943 డిసెంబర్లో ధన్ బాద్లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశం నిర్ణయం తీసుకొ న్నట్లు చెప్పి వాటి అమలుకు ప్రయత్నిస్తున్నది ప్రభుత్వం అని తెలియచేసాడు.
1944 నవంబర్ 20 న సభలో రేణుకా రే బొగ్గు గనులలలో పనిచేసే స్త్రీల పరిస్థితుల గురించి నిష్పాక్షిక అధ్యయనం జరపటానికి అఖిలభారత మహిళా సభ వేసిన దర్యాఫ్తుకమిటీకి అనుమతి ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. సమయం తగినది కాదని ఆయన జవాబు. అదే సమయంలో రేగే కమిటీకి ఆరోగ్య సర్వ్ కమిటీకి అనుమతిచ్చి స్త్రీ సంక్షేమాన్ని కోరే అఖిల భారత మహిళా సభకు అనుమతివ్వకపోవటం వివక్ష గా ఆమె అభిప్రాయపడింది. రేణుకారే కు మద్దతుగా యెన్ ఏం జోషీ వంటివాళ్ళు చర్చలో పాల్గొన్నారు.
అదే రోజు రేణుకా రే గనులలలో స్త్రీల పని నిషేధాన్ని పునరుద్ధరించడం గురించి కూడా ప్రశ్న లేవనెత్తింది. ఇంతకు పూర్వం వాగ్దానం చేసిన ప్రకారం బొగ్గుగని బావులలో స్త్రీలు పనిచేయటాన్ని ప్రభుత్వం ఎప్పుడు నిషేధిస్తుంది అని అడిగింది. బొగ్గుబావులలో పనికి స్త్రీలను చేర్చుకొన్న తరు వాత పెరిగిన ఉత్పత్తి ఎంత అని కూడా ఆమె ప్రశ్న. బొగ్గు ఉత్పత్తి కావలసిన మేరకు పెరిగిన తరు వాత నిషేధాన్ని పునరుద్ధరించటానికి ప్రభుత్వం ఆతృతగా ఉందని, స్త్రీల నియామకం తరువాత ఉత్పత్తి పెరిగిందని అందుకు ఇతరేతర కారణాలు కూడా ఉండటం వల్ల ప్రత్యేకించి స్త్రీల చేరికవల్ల ఎంతపెరిగిందో చెప్పలేం అన్నాడు. నిషేధాన్ని తిరిగి ప్రకటించటానికి ప్రభుత్వం దృష్టిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎంత అన్న ప్రశకు అంబేద్కర్ జవాబు ‘తెలియదు’ అని.
రేణుకా రే గనులలలో స్త్రీల నియామకం వల్ల ఉత్పత్తి స్వలంగానే పెరిగిందని , దానికోసం ప్రభుత్వం అంతర్జాతీయ నియమావళిని , నైతిక మర్యాదను ఉల్లంఘించటం సమంజసమా అని ప్రశ్నించింది. గనులలలో పురుష కార్మికులు బొగ్గును పగలగొడుతుంటే స్త్రీ కార్మికులు తొట్టిని నింపు తారని, అది నెమ్మదిగా జరుగుతుండటంతో పురుషకార్మికుల పనివేగానికి దీటుగా ఉండక పోవ డంతో పురుషకార్మికులు పని ఆపుకోవలసి వస్తున్నదని చేసిన అభియోగం పై అంబెద్కర్ అందు లోని నిజానిజాలగురించి తానప్పుడు ఏమీ చెప్పలేననని అన్నాడు.
1945 ఫిబ్రవరి 9 న ప్రశ్నోత్తరాల సమయంలో గనులలలోపల స్త్రీలు పనిచేయటంపై ఉన్న నిషేధాన్ని తిరిగి విధించటం గురించి ప్రభుత్వం ఏమి ఆలోచిస్తున్నది? ప్రస్తుతం గనులలలో పనిచేస్తున్న స్త్రీలు ఎంతమంది ? గనులలలో పనిచేసేటప్పుడు స్త్రీలు సభ్యతగా వస్త్ర ధారణ చేసుకొనే వీలు లేదు కనుక ఆ దృష్ట్యా ఆ పనిలోకి స్త్రీల ప్రవేశాన్ని నిషేదించటమే భావ్యం కదా? అన్న ప్రశ్నలు వచ్చాయి. నిషేధాన్ని తిరిగి విధించటం గురించిన సమీక్ష జరిగింది కానీ పరిస్థితులు అనుకూలించాలి అని చెప్పి గనులలలోపల , బయట పనిచేసే స్త్రీలకు సంవత్సరానికి రెండు చీరెలు తక్కువధరకు ఇస్తున్నారని, కొన్ని చోట్ల ఉచితంగా కూడా ఇస్తున్నారని చెప్పాడు దానికి సభ్యులు కట్టుకొనటానికి వాళ్లకు చీరెలు లభిస్తున్నాయా లేదా అన్నది అసలు విషయమే కాదని, గనులలలో వాళ్ళసలు చీరె కట్టుకొనటమే సాధ్యపడదని అభ్యంతరం తెలిపారు. పరిస్థితులు అనుకూలించటం అంటే ఏమిటి? ఆ పరిస్థితులు ఏమిటి? ఎప్పుడు అనుకూలిస్తాయి ? అన్న ప్రశ్నల కు అంబేద్కర్ అవి తన అధీనంలో లేవని చెప్పాడు.
అదే రోజు గనుల భూగర్భంలో పనిచేసే స్త్రీ కార్మికుల గురించి ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ అంబేద్కర్ 1942 లో స్త్రీ కార్మికులు ఎవరూ చేరలేదని 43 లో 7,000 మంది , 44లో 16000 మంది గనులలలో పనిచేసారని సమాచారం ఇచ్చాడు. నిండు చూలాళ్లను గనిగర్భంలో పనికి నియమించటంవలన గని గర్భంలోనే పిల్లలు పుడుతున్నారన్న ఆరోపణను ఖండిస్తూ ఇంత వరకు అలాంటి ఘటన జరగలేదని , ఆ విషయం పై ఎలాంటి ఫిర్యాదులు కూడా రాలేదని , ఏడవనేల గర్భం లో స్త్రీలు గనులలలో పనిచేయటాన్ని నిషేధించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని పేర్కొన్నాడు.
అయితే గనుల భూగర్భాలలో స్త్రీల నియామకంపై నిషేధాన్ని ఎత్తివేయటం పట్ల దేశంలో ఎంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ అనుకూలమైన చర్య ఏదీ ఇంతవరకు చేపట్టలేదన్న ఆరోపణతో 1945 మార్చ్ 13 న శాసనసభా చర్చలలో రేణుకా రే ఈ అంశం మీద చర్చ ప్రారంభించింది. అఖిల భారత మహిళా సమావేశం అభ్యర్ధన మేరకు నిషేధం తిరిగి విధించాలని ప్రతిపాదించింది. దాని మీద అంబేద్కర్ సుదీర్ఘంగా తన వాదన వినిపించాడు. ఇది ఒక రకంగా ఇంతకుముందు చేసిన వాదన వంటిదే. ఈ సారి బొగ్గు ఉత్పత్తిలో, కార్మికుల సంఖ్యలో మరీ ముఖ్యంగా బొగ్గు తవ్వటానికి నియమించబడిన కార్మికుల సంఖ్యలో తగ్గుదలను గణాంకాలతో వివరించాడు. ఇదివరకు లాగానే ఈ తగ్గుదలకు బొగ్గు గనిలో కన్నా ఎక్కువ వేతనాలకు లభిస్తున్న ప్రత్యామ్నాయ ఉద్యోగాల లభ్యత, ఇతర పనులలలో తనతో పాటు భార్యకు కూడా అవకాశం ఉండటం కారణాలని పేర్కొన్నాడు. అందువలన బొగ్గుతవ్వకం పనికి కార్మికులను ఆకర్షించటానికి గనులలలో స్త్రీల నియామకం మీద ఉన్న నిషేధమే అవరోధం అవుతున్నప్పుడు ఆ నిషేధం ఎత్తివేయటమే ఇప్పటి అవసరం అని అభిప్రాయపడ్డాడు. గని భూగర్భ కార్మికుల పని చేసే వాతావరణం స్త్రీలకు అనుకూలం కాదు కనుక గనులలలో వాళ్ళ నియామకాన్ని నిషేధం అవసరం అంటున్నాము కానీ నిషేధంవల్ల వల్ల గృహ పరిస్థితుల మీద పడే ప్రభావం తీవ్రమైంది అంటాడాయన.
గనిగర్భాలలో స్త్రీల పని నిషేధం గురించి శాసన సభా సభ్యులు పదేపదే ప్రశ్నలువేయటం, అది నిరంతర పరిశీలనలో ఉందని అంబేద్కర్ చెప్పటం పరిపాటి అయింది.( 1945, మార్చ్ 16) మహిళల సంక్షేమం కోసం ప్రభుత్త్వం అన్ని గనుల్లోనూ ఒకే రకమైన ఏర్పాట్లు చేయాటానికి పరిశీలి స్తున్నదని అంబేద్కర్ అంటే అందుకే స్త్రీలను భూగర్భ పనులలలో నియమించటానికి సభ వ్యతిరేకించిందని సభ్యులు ప్రతిసమాధానం ఇచ్చినప్పుడు అంబేద్కర్ సభానిర్ణయం ఔచిత్య నిర్ణయంగా కాక రాజకీయపథకంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు.
ఈ విధంగా అంబేద్కర్ రాధా సుబ్బరాయన్ , రేణుకా రే వంటి మహిళా సభ్యులనుండి,ఎ న్.జి. రంగా వంటి ఇతర సభ్యులనుండి సభలో తరచు ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది.తన వివరణలు, వాదనలు వినటానికి అసహనం చూపుతూ తనను నిర్దయుడైన పెట్టుబడిదారీ యజమానిగా, శ్రామిక మహిళా వ్యతిరేకిగా దోషిని చేస్తూ బోనులో నిలబెట్టినట్లు మాట్లాడే సభ్యులకు సహనంతో సంక్షిప్తంగా సూటిగా సమాధానం చెప్పే పని చేసాడు అంబేద్కర్. ఒక్కొక సారి తగిన సమాచారం తన వద్ద లేదనో , పరిశీలిస్తామనో చెప్పి ఊరుకొనటం కూడా జరిగేది.
ఈ పదునైన చర్చలు , ప్రశ్నలు, వివరణలు, సమాధానాలు శాసన సభా సభ్యులకు ప్రభుత్వ భాగస్వామికి జరిగినవి కనుక ప్రజాభిప్రాయం , చట్టాలకు సంబంధించిన సంప్రదాయానికి , నైతికతకు అధికార ప్రభుత్వ ప్రయోజనాలకు మధ్య ఘర్షణగా మాత్రమే మనకు అర్ధం అవుతాయి. అసలు బొగ్గుగనులలలో పనిచేసిన మహిళల అవసరాలు, పరిస్థితులు, వేతనాల వ్యవస్థ డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు (సంపుటం 2) ఎటువంటివో , వాటి గురించి మహిళలు ఏమనుకున్నారో అది ప్రస్తుతానికి విస్మృత చరిత్రే.
ఉపయుక్త గ్రంథాలు
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు (సంపుటం 2)
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు (సంపుటం 10- భాగం 1)
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు (సంపుటం 10- భాగం 2)
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు (సంపుటం 10- భాగం 3)
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు (సంపుటం 10- భాగం 4)
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు (సంపుటం 17- భాగం 1)
- డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు (సంపుటం 17 – భాగం 2)
- Dr. Avkash Jadhav -The forgotten history of the Dalit textile workers in Bombay in the pre independent era and the economic philosophy of Dr. Ambedkar ( Bodhipath 2023 July issue , volume 25, page no 34-39( from internet source)
- Sanjoy Ghose -The unknown Ambedkar : India’s First Labour Minister , News click, 2023 may 1( from internet source)