వినాశాత్మక వ్యవస్థ అంతం ఎప్పుడు ?          

గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘిఎన్, పీటర్ హోవిట్ లకు 'సృజనాత్మక విధ్వంసం' అనే సిద్ధాంతం అభివృద్ధి చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది. పెట్టుబడిదారి విధానం స్వయంగా పాత టెక్నాలజీలు, పని పద్ధతులు నాశనం చేసి నవ కల్పనలతో ఉత్పత్తి శక్తులను పెంచి నిరాటంకంగా అభివృద్ధి పథంలో సాగుతూ చివరికి సోషలిజం లోకి మారుతుంది అని జోసెఫ్ షుంపీటర్ “పెట్టుబడిదారీ విధానం , సోషలిజం, ప్రజాస్వామ్యం” (1942) గ్రంథంలో రాశారు. అయితే వ్యవస్థ లో సమూల మార్పు అనేది దానంతట అదే ప్రజా పోరాటం లేకుండా రాదు.

పెట్టుబడిదారీ వ్యవస్థ లో ఉత్పత్తి శక్తుల అరాచక వృద్ధి, ప్రజలలో పెరిగే పేదరికం మధ్య ఒక పరిష్కారం కాని వైరుధ్యం ఉంది. ఇది సోషలిస్ట్ సమాజంలోనే ప్రణాళిక బద్ధ ప్రగతి వల్ల పోతుంది సామ్రాజ్య వాదం మార్కెట్ కోసం, రాజకీయ, సైనిక ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తుంది. అమెరికా కూటమి మద్దతుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న ప్రతీకార యుద్ధంలో 6 అక్టోబర్, 2026 నాటికి 74,237 మంది పాలస్తీనియన్లు ఆహుతి అయ్యారు. 1, 75 ,206 మంది గాయపడ్డారు. వీరిలో 70 శాతం పైన స్త్రీలు, చిన్న పిల్లలు ఉన్నారు. 2025 అక్టోబర్ లో కాల్పుల విరమణ తర్వాత కూడా కనీసం 1,454 మంది చనిపోగా, 5,090 మంది గాయాల పాలయ్యారు.పాఠశాలలు, ఆసుపత్రులు, నివాసాలపై ఆగని దాడులు.

అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు రావటం లేదని తెలిసినా , తీవ్ర ఆర్థిక అసమానతలు పెరుగుతున్నా కొనసాగే ఈ వ్యవస్థ లో అమానవీకరణ, అప్రజాస్వామిక ధోరణి , ప్రకృతి విధ్వంసం , అసమానతల విజృంభణ ప్రమాదం పెరుగుతుంది. ఈ అసహజ , మానవ నిర్మిత అభివృద్ధి నమూనా హింస ద్వారానైనా సరే నిలబెట్టాలని పాలక వర్గాలు , వాటి పార్టీలు యత్నించడం శోచనీయం. ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ( ఓ పీ హెచ్ ఐ) అధ్యయనం బట్టి మన జనాభాలో 34 కోట్ల 35 లక్షల మంది (28.5 శాతం) బహుళ కోణాల్లో అతి దారిద్ర్యం అనుభవిస్తున్నారు.

రోడ్లు, రైళ్ళు, బ్రిడ్జిలు నిర్మించడమే అభివృద్ధి అయితే భారతీయులు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా పోరాటం ఎందుకు చేసినట్లు? అదే శైలిలో పార్టీలు పాలిస్తే, నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిరాకరిస్తే ‘ క్విట్ పవర్ ‘ అని ప్రజలు ఎందుకు అడగకూడదు?

ఒకవైపు సుందర్ పిచ్చాయి ఏడాది వేతనం 850 కోట్ల రూపాయలు కాగా మరో వైపు నిరుద్యోగంతో అలమటించే కోట్లాది మంది యువత. ఈ ఆర్థిక అసమానతలు తగ్గటానికి పెట్టుబడిపై ప్రోగ్రెసివ్ పన్ను సాధనమని, ఆదాయం పై వేసే ప్రోగ్రెసివ్ పన్ను గత శతాబ్ది నాటిదని థామస్ పికెటీ తన పుస్తకం “కేపిటల్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ” లో రాశారు. “దీర్ఘ కాలంగా జాతుల మధ్య కల అసమాన సంపద కన్నా, జాతుల్లోనే టీఉండే అంతర్గత అసమాన సంపద మరింత ఆందోళనకరంగా ఉంటుంది.” (పే.546) పికెటీ భావన ప్రకారం జాతీయ ఆదాయంలో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే పన్నుల రూపంలో వస్తే సంప్రదాయ బాధ్యతల నిర్వహణ చేయడఅసాధ్యం. పోలీసు, న్యాయ వ్యవస్థలకు తగు చెల్లింపులు పోను విద్య, ఆరోగ్య రంగాలకు ఎక్కువగా మిగలదు. ఇంతే కాక అతి పెద్ద సంపదల పై ప్రోగ్రెసివ్ పన్ను వేయటం ఒకటే ప్రమాదమున్న ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా నియంత్రిస్తూ మరో వైపు వ్యవస్థాపక క్రియాశీలత మరియు అంతర్జాతీయ ఆర్థిక పారదర్శకతలను కాపాడుతుంది.

ప్రముఖ ఆర్థిక వేత్త జోసెఫ్ ఇ స్టిగ్లిజ్ “ది రోడ్ టు ఫ్రీడమ్”(2024) అనే పుస్తకంలో ఫ్రీడమ్ హౌస్ 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో 80 శాతం మంది ప్రజలు పూర్తి లేదా పాక్షిక నిరంకుశత్వ పాలనలో ఉన్నారని రాశారు. ఓట్ల కొనుగోలు విధానం వల్ల ఫాసిజానికి దారి పడుతుంది. ఈ శతాబ్దిలో కార్పొరేట్ ప్రాబల్యం బాగా పెరిగి శ్రామికులపై ఎక్కువ అధికారం (మోనోప్సానీ) వచ్చి శ్రామిక చట్టాలను యజమానికి అనుగుణంగా మార్చటం, సమ్మె చేస్తే కర్మాగారాలు వేరే దేశాలకు తరలిస్తామని బెదిరింపులు మామూలు అయ్యాయి.

గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి కంపెనీలు డిజిటల్ మార్కెట్లో పోటీ పెంచే చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తుంటాయి. మేధో ఆస్తి హక్కుల పేరుతో కోవిడ్ కాలంలో సైతం కోవిడ్ -19 సంబంధిత మేధో ఆస్తి హక్కును వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎత్తివేయనందున వేరే కంపెనీలకు అనుమతి లేక తగు టీకాల లేమితో లక్షల మంది మృతి చెందగా ఫైజర్, మోడర్నాలాంటి కంపెనీలు బాగుపడ్డాయి. చట్టాల్లో మార్పులు, న్యాయ తీర్పులు, ఆర్ధిక వ్యవస్థలో మార్పులు వల్ల యూనియన్లు బలహీన పడ్డాయి.అమెరికాలో 1950లలో 35 శాతం ఉన్న యూనియన్ సభ్యత్వం 1973 లో 25 శాతానికి, 2026లో మొత్తం శ్రామిక వర్గంలో 10 శాతానికి , ప్రైవేటు రంగంలో 5 శాతానికి మాత్రమే చేరింది.

భారత్ లో ఒక అంచనా ప్రకారం 1950ల లో 10% కంటే తక్కువ,1980లలో సుమారు 7–8% , 2000లలో 8-9%, 2026 లో 7-10% మాత్రమే ఫార్మల్ సెక్టార్‌లో యూనియన్ సభ్యులు ఉన్నారు. సుమారు 90 – 93% శాతం శ్రామికులు అసంఘటిత రంగంలో ఉన్నారు.

జోసెఫ్ ఇ స్టిగ్లిజ్ చెప్పినట్లు నయా ఆర్ధిక వ్యవస్థ వైఫల్యం మరో వైపు అసహనానికి దారి తీసింది.కార్పొరేట్ హస్తగతమైన మీడియా ఈ అసహనాన్ని పెంచి పోషిస్తోంది. “ స్వీయ అభిప్రాయాల కన్నా భిన్నంగా ఉన్న అభిప్రాయాల పై సహనం అతి తక్కువగా ఉన్నప్పుడు ఘర్షణ అనివార్యం. అదే బాటలో అసహనవంతుల పట్ల అతి సహనం ఉన్నా ఘర్షణ తప్పదు.” (పే.203) ఈ విధ్వంసం ఆర్థిక కోణంలోనే కాక భావ జాల కోణంలో మరింత ఆందోళనకరంగా మారింది. ఒక వైపు సమానతా భావజాలాన్ని విదేశీయమని తిరస్కరిస్తూ మరో వైపు ఆ భావన మన సంస్కృతిలోనే ఎప్పటి నుంచో ఉందని కొందరి వాదన. అది నిజమైతే సమానత్వ భావనను ఎవరూ వ్యతిరేకించకూడదు. అంతర్జాతీయ భావన పనికి రాదంటూనే మరో వైపు ‘విశ్వ గురు’ స్థానం కోసం ప్రయత్నం. అయితే జాతీయ సంస్కృతిని నిహిలిస్టిక్ ధోరణిలో పూర్తిగా నిరాకరించకుండా , విదేశీ అనుభవాన్ని భయద్వేషాలతో గుడ్డిగా తోసిరాజనకుండా సమ సమాజాన్ని సాధించాలి.

జె. రవీంద్రనాథ్  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో  డాక్టరేట్ డిగ్రీ పొంది తరువాత విశాఖపట్నంలో గాయత్రి ఇంజినీరింగ్ కాలేజీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా చేసి 2022 లో రిటైర్ అయ్యారు.  వివిధ  జర్నల్స్, పుస్తకాలలో 35 వ్యాసాలు ప్రచురించారు.  ఇండియన్ సోషల్ సైన్స్ అకాడమీ నుంచి బసంత్ సర్కార్ మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు.ఎనిమిది  సృజనాత్మక రచనలు -- Sow the Spring, Dove and the Mother Earth , Suburban Sparrows , Empathy as Life , రష్యన్ గీతాలు, ఎద లోతుల్లో, నల్ల కలువ,   ఏకాంత యానం ప్రచురించారు.

Leave a Reply