గెడ్డం కృష్ణారెడ్డి గారు జవహర్ లాల్ యూనివర్సిటీలో చదువుకుని, ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరుగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సెంటర్ ఫర్ సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ ఇన్క్లూసివ్ స్టడీస్ లో ప్రొఫెసర్ గా, ఇండియన్ కౌన్సెల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ సంస్థ హైదరాబాద్ కేంద్ర డైరెక్టర్గా పనిచేశారు. ఆయన మేధోపర ఆలోచన తెలంగాణలోని ప్రజా ఉద్యమాల నేపథ్యంలో JNU, OU,HCU ల అకడమిక్, విద్యార్థి రాజకీయాల్లోంచి పరిణతి చెందింది. ఈ మూడు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా పేరుతో బాటుగా, దేనికదే ప్రత్యేక మేధో రాజకీయ వాతావరణం కలిగివున్నాయి. ఇవి కృష్ణారెడ్డిగారిని ఎంతగానో ప్రభావితం చేసినవి అనుకుంటున్నాను. ఆయనతో నాకున్న ఆప్యాయ సంబంధం రాజకీయ నమ్మకాలలోంచి పుట్టింది. ఆయనతో మాట్లాడే ప్రతి సందర్భంలో, ఆయన ఫ్యాకల్టీగా నిర్వహించిన అకడమిక్ కార్యక్రమాల నుంచి, ఆయన తయారుచేసిన పరిశోధక విద్యార్ధులతో నాకున్న సన్నిహిత రాజకీయ సంభాషణలోంచి కృష్ణారెడ్డి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం అర్థమైంది. ఆయన సమసమాజం కోసం తపనపడ్డ మనిషి. ఈ సమాజం మారాలని, దాన్ని మనం మార్చాలని కోరుకుని ఆ దిశగా ఒక ఆలోచనా పరుడుగా పయనించినవాడు.తెలుగు సమాజంలో నక్సలైట్ ఉద్యమాల నుండి, దళిత, స్త్రీ వాద, తెలంగాణా ఉద్యమాలు వరకు దగ్గరిగా చూసి, తన ఆలోచనలకి పదునుపెట్టినవాడు. ఈ ఉద్యమాల పట్ల సానుభూతే కాదు, తనకు తోచిన విధంగా మమేకమై,వాటితో ముందుకు సాగిన కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకోవటం, ఆయన స్మరణలో ఈ ఉపన్యాసం ఏర్పరచుకోవడం అంటే, నేటి సమాజం గురించి, మన కళ్ళెదుట జరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమాలు గురించి మాట్లాడుకోవటమే! కృష్ణారెడ్డి ప్రజాస్వామిక ఉద్యమాలుగా ఉన్న విప్లవ, అస్తిత్వ ఉద్యమాలతో ఐడెంటిఫై అయ్యి, వాటి మధ్య ఆరోగ్యకరమైన డైలాగ్ ఉండాలని ఆశించారు. ఈ క్రమంలో అభివృద్ధి నమూనాలు, పాపులిస్ట్ రాజకీయాలు, పబ్లిక్ స్పియర్ , మీడియా మీద పదునైన విశ్లేషణలు చేసి పరిశోధక పత్రాలను ప్రచురించారు. ఆయన అనేక మంది విద్యార్థుల్ని ప్రభావితం చేశాడు. మంచి పరిశోధక విద్యార్థుల్ని తయారుచేశాడు.
ఆయన స్మారక ఉపన్యాసంలో ఆయన లేని ఈ పదేళ్లలో జరిగిన రాజకీయ మార్పులు, ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తి, అశాంతి, ప్రభుత్వ విధానాలపై వెల్లువెల్లిన ప్రజాగ్రహం, మెరుగైన సమాజం కోసం అలలు అలలుగా వేర్వేరు రూపాల్లో, భిన్న సామాజిక వర్గాలు ప్రభుత్వ అణిచివేతల్ని లెక్కచేయకుండా వీరోచితంగా జరిపిన పోరాటాలు, వాటి రాజకీయ స్వభావం, సందర్ధం, ఎత్తుగడలు,విజయాలు, పరిమితులను సూత్రప్రాయంగా ప్రస్తావిస్తాను.
చరిత్రలో సామాజిక ఉద్యమాలు కొత్త విలువలు, లక్ష్యాలు, ఆలోచనలను సృష్టిస్థాయి.ఈ కొత్త విలువల ప్రభావంతో సామాజిక సంస్థలు, చట్టాలు, నిబంధనలు మార్పు చెందుతాయి.తద్వారా సమాజ జీవన విధానాన్ని నిర్వహించే కొత్త ప్రమాణాలు ఏర్పడతాయి. గత ఇరవయ్యేళ్లలో ప్రపంచ వ్యాప్తంగానూ, మన దేశంలోనూ అనేక నూతన ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయి. ఇవి భావజాలం, నిర్మాణం, సంఘటితం, పాల్గొన్న సామాజిక సమూహాల పరంగాను, ఉద్యమాలు నడిపే తీరులోనూ అంతకు ముందున్న ఉద్యమాలకు భిన్నంగా ఉన్నాయి. ఈ ఉద్యమాలన్నీ ప్రపంచీకరణ , డిజిటల్ మీడియం వ్యాప్తి చెందిన సందర్భాలలో యువతరం ముందుండి నడిపించినవి.
ముందుగా ప్రపంచ వ్యాప్త ఉద్యమాల ప్రత్యేకతను ప్రస్తావించి, మన దేశంలో ఇటీవల జరిగిన నిర్భయ ఉద్యమం(2012), షాంబాగ్ ముస్లిం స్త్రీల ఉద్యమం(2019-2020), డిల్లీ శివార్లలో రైతుల ఉద్యమం (2020-2021), నేటి కాక్రోచ్ జెన్ జీ ఉద్యమం(2026) గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. ఇవి భారతీయ ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరిచిన / పరుస్తున్న విధం గురించి మాట్లాడుతాను. ఇవి నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో, ప్రపంచీకరణతో అతలాకుతలమైన సందర్భంలో, మార్కెట్టు, మీడియా, మత రాజకీయాలు కలిసిపోయిన వేళ, అసమర్థ అవినీతి రాజకీయాలు అందేలమెక్కి ప్రజాశ్రేయస్సు మరుగునపడినప్పుడు, ప్రజలు రోడ్లెక్కి జరిపిన పోరాటాలు. అంతకు ముందున్న ఉద్యమ రూపాలకు, భావాలకు కూడా భిన్నంగా ఉన్న కొత్త రాజకీయ సామాజిక ఉద్యమాలు. అన్నిటికీ మించి, డిజిటల్ యుగ ఉద్యమాలు. ప్రజల్ని సంఘటితం చేసేందుకు సోషల్ మీడియాని సమర్థవంతంగా ఉపయోగించుకున్న ఉద్యమాలు.
ఒక పక్క సాంప్రదాయక మార్క్సిస్టు ప్రజా ఉద్యమాలను ,మిలిటెంట్ ఉద్యమాలను ఉక్కుపాదంతో తొక్కివేస్తున్న సందర్భం , మరో పక్క ఇలాంటి కొత్త ఉద్యమాలు ఎగిసిపడటం చూస్తున్నాం. ఈ నేటి తరం నూతన ఉద్యమాలు ప్రజాస్వామిక కలను ఎంత వరకు సార్ధకం చేస్తాయి, వీటి సైద్ధాంతిక భూమికను ఎలా అర్ధం చేసుకోవాలో చేద్దాం.
భారత దేశంలో 1990 తర్వాత అమలులోకి వచ్చిన నూతన్ ఆర్థిక విధానాలతో రాజ్యం తీరులోనూ, సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. గ్లోబలైజేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ప్రభావంగా ఆర్థికంగా, సాంస్కృతికంగా అనేక పరిణామాలు జరిగాయి. ప్రజా శ్రేణుల్లో అసమానతలు, అసంతృప్తి పేరుకుపోయి, ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం వదిలేసి వారి సామాజిక ఆకాంక్షలమీద నీళ్ళుపోసి, వాళ్లును అణిచివేసే మార్గాన్ని ఎంచుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాల మీద ప్రజా నిరసనలు జరిగినవి. సాంప్రదాయ రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్ కి సంబంధం లేకుండా అప్పటికప్పుడు సమస్యలపై ప్రజా ఉద్యమాలు పుట్టుకొచ్చినవి. యువతరం,స్త్రీలు, ముస్లిం స్త్రీలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత వీధుల్లోకి వచ్చిన పోరాటాలు. వీళ్ళంతా డిజిటల్ మాధ్యమంతో సంబంధం కలిగివున్నారు. నేటి తరం ఉద్యమాలను సంఘటితం చేసేందుకు డిజిటల్ టెక్నాలజీ,ముఖ్యంగా సోషల్ మీడియా ఎంతగానో దోహదం చేసింది.
డిజిటల్ యుగం లో ప్రజాస్వామిక ఉద్యమాలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. డిజిటల్ కాలమంటే, సోషల్ మీడియా ఉద్యమాలను ఎలా ఉద్యమాలకు ఉపయోగపడిందనే దాని గురించి మాత్రమే కాదు. ఈ డిజిటల్ మీడియా కాలంకి ప్రపంచీకరణకి విడదీయరాని సంబంధం ఉంది. ఇందులో ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సంబంధాలు మిళితమైవున్నాయి. ఆర్థిక అసమానతలతో సామాజిక సంఘర్షణ అనివార్యమైంది. వ్యవస్థలు మారుతున్న ప్రపంచీకరణ కాలానికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మూల ధనం. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అటు ఆర్థికంగానూ, ఇటు రాజకీయంగానూ పనిచేస్తుంది. మన ఆలోచనల్ని , మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఎంతగా ఈ కంప్యూటర్లు,ఇంటర్నెట్, సెల్ ఫోన్లు ప్రభావితం చేస్తున్నాయో మనం చూస్తూనే వున్నాం.
ఒక్క పక్క కళ్లముందు కొత్త ప్రపంచం. కన్స్యూమర్స్ సొసైటీ. మార్కెట్ లోకి వచ్చిన ప్రతి వస్తువూ అవసరంగానే అనిపిస్తుంది. అందుకునే ఆసరా, ఆదాయం లేకపోవడం. ఆర్థిక , అసమానతలు, సాంస్కృతిక సంక్షోభం. ఎక్కడో లాస్ ఆఫ్ సెల్ఫ్ అనే ఫీలింగ్. సంస్కృతి, సంప్రదాయం, మతం పేర ఆత్మవిష్కరణ ప్రయత్నం. కొత్త తరం. రాజకీయాలంటేనే అసహ్యం,అవి అవినీతితో బ్రష్టు పట్టిపోయాయనే కంప్లైంట్. ఊపందుకున్న సాంస్కృతిక జాతీయవాద రాజకీయాలు. అధికారంలోకి హిందూమత తత్వ జాతీయవాదం ఒక కొత్త పరిష్కారంగా. మార్కెట్, మతం, జాతీయత కలిసిపోయి చివరికి ఒక నిరంకుశ ప్రభుత్వంగా అవతారం. హిందూ మెజారిటీరియన్ రాజకీయాలు మనమెంచుకున్న ప్రజాస్వామ్యంను ఓడించడం కోసమే పనికట్టుకున్నట్టున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రజాస్వామిక ఉద్యమాలు
మన దేశంలో గత పదిహేనేళ్లలో జరుగుతున్న ఉద్యమాలు గురించి మాట్లాడుకునే ముందు, మారుతున్న ప్రపంచ పరిణామాలు, పెరుగుతున్న ఆర్థిక సామాజిక అసమానతలు, నూతన పెట్టుబడిదారీ వ్యవస్థకు దాసోహమై, విశ్వసనీయత కోల్పోయి, ప్రభుత్వాలు నిరంకుశంగా తయారవుతున్నవేళ ప్రపంచ వ్యాప్తంగా 2000-2015 మధ్య కాలంలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలు దేనికవి స్థానిక సమస్యలతో ముడిపడివున్నటు కనిపించినా, కొంత సారూప్యత కూడా ఉంది. ఒక చోట జరిగిన ఉద్యమం, అగ్గిలా మిగిలిన దేశాల్లోనూ అంటుకుపోయింది. ఉత్తర ఆఫ్రికా , మధ్య ఆసియా దేశాల్లో మొదలైన అరబ్ స్ప్రింగ్ , స్పెయిన్ లో Indignitas, అమెరికాలో Occupy Wall Street, ఆ తర్వాత లాటిన్ అమెరికాలో ఒకదానివెంట మరొకటి నడిచి సాగినై.
ఈ ఉద్యమాలన్నీ కొత్త తరం ముందుండి నడిపిన ఉద్యమాలే, అన్నింటా డిజిటల్ మొబిలైజేషన్లే. నాయకత్వం లేకుండానే నడిపిన సంఘటిత పోరాటాలే. పాత కాలం ఉద్యమాలకు, రాజకీయ పార్టీలకు దూరంగా జరిగిన యువ పోరాటాలే. భావజలపరంగా ఇంతకు ముందు మనకి తెలిసిన చట్రాల్లో బిగించడం కష్టమే. మార్క్సిస్టు పంధా నుంచి కన్సర్వేటివ్ రాజకీయాలవైపు మొగ్గు చూసినట్టు ఉంటాయి. అట్లని అప్పటికే బలంగా వున్న కన్సర్వేటివ్ రాజకీయాలకి భిన్నంగానూ, ప్రజాస్వామ్య లక్ష్యంగా ఉంటాయి. ఇవి అవలంబించే ఎత్తుగడలు కూడా మరింత సృజనాత్మకంగా ఉంటాయి.
డిసెంబర్ 17, 2010. ట్యునీషియాలోని సీదీ బౌజీద్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల పండ్లు అమ్ముకునే వీధి వ్యాపారి మొహమ్మద్ బువాజిజీని స్థానిక మున్సిపాలిటీ అధికారులు వేధించి ,తన బండిని స్వాధీనం చేసుకున్న అవమానానికి నిరసనగా అదే ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకున్న సంఘటన అరబ్ స్ప్రింగ్ ఉద్యమానికి నాంది పలికింది. మొహమ్మద్ బువాజిజీ ఆత్మాహుతి అవమానం, నిరుద్యోగం, పేదరికం, అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి సమస్యలతో విసిగిపోయిన ట్యునీషియా ప్రజల అసంతృప్తికి ప్రతీకగా మారింది. అతని చర్య దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారితీసి 23 ఏళ్లు తిరుగులేకుండా అధికారంలో ఉన్న బెన్ అలీని దేశం వదిలి పారిపోయేలా చేసి ప్రజాస్వామ్య పరివర్తనకు బాటలేశారు. ట్యునీషియా నిరసనలు తరువాత ఈజిప్టు, లిబియా, యెమెన్, సిరియా,జోర్డాన్, అల్జీరియా వంటి దేశాలకు వ్యాపించి “అరబ్ స్ప్రింగ్” (Arab Spring) అనే చారిత్రక ఉద్యమంగా మారాయి.
ట్యునీషియా ప్రజల తిగుగుబాటు వెనువెంటనే ఈజిప్ట్ యువతరానికి స్ఫూర్తి నిచ్చింది. ఈజిప్ట్ యువత పోలీసు దౌర్జన్యాలు, ప్రభుత్వ అవినీతి వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ‘ట్యునీషియా ప్రజలు ఒక నియంతను కూల్చగలిగితే, ఈజిప్టు ప్రజలు ఎందుకు చేయలేరు?’ ప్రశ్న వేసింది. ఈ ఈజిప్ట్ విప్లవానికి 2011 జనవరిలో అస్మా మహ్ఫూజ్ అనే కైరో యూనివర్సిటీ అమ్మాయి ఫేస్బుక్ సందేశం, ‘నేను జనవరి 25న తహ్రీర్ స్క్వేర్‌కు వెళ్తాను. మీరు పురుషులైతే, గౌరవం ఉంటే, నాతో కలిసి రండి’ ఎంతగానో ప్రేరేపించింది. ఈ సందేశం లక్షలాది ప్రజలకు చేరింది. వేలాదిమందిని తహ్రీర్ స్క్వేర్ జనవరి 25 నిరసన ప్రదర్శనకి తరలించింది. 18 రోజులపాటు నిరసనలు కొనసాగి, చివరకు ఫిబ్రవరి 11, 2011న 30 ఏళ్లుగా అధికారంలో ఉన్న హోస్ని ముబారక్ ను కూలదోసింది. ఈజిప్ట్ లో అవినీతి, నిరుద్యోగం, పేదరికం విస్తృతంగా పెరిగిపోవడం, ముఖ్యంగా చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, దీనికి తోడు పోలీసు అణచివేత, రాజకీయ స్వేచ్ఛల లేమి ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి ఈ తిరుగుబాటుకు కారణంగా ఉంది.
ఈజిప్ట్ విప్లవం ఉత్తర ఆఫ్రికాలోని ఇతర దేశాలకి, మధ్య ప్రాచ్య దేశాలకి పాకింది. అస్మా మహ్ఫూజ్ సోషల్ మీడియా మెసేజ్ ఈజిప్టు విప్లవంకి కీలక మలుపుగా భావిస్తారు. అది ప్రజల్లో ఉన్న భయాన్ని సవాలు చేసింది.ఆమె పిలుపు భయాన్ని అధిగమించమనేదిగా, అవమానాన్ని తిరస్కరించమనేదిగా, గౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం పోరాడమనే పిలుపుగా తలచేరు. ఒక ఆన్‌లైన్ అసంతృప్తి వీధి నిరసనగా మారింది. యువతను పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనేలా చేసింది.సోషల్ మీడియా రాజకీయ సమీకరణానికి ఎంత శక్తివంతమైన సాధనమో చూపించింది.
కొత్త ప్రజాస్వామిక సమీకరణల అవగాహన
పాల్ మసన్ , ‘Why It’s Kicking Off Everywhere -The New Global Revolutions.”(2012) అనే పుస్తకంలో 2000ల చివరనుండి 2010ల మొదటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎగిసిపడిన ప్రతిఘటన ప్రజాస్వామికోద్యమాలను విశ్లేషిస్తాడు. ముఖ్యంగా అరబ్ స్ప్రింగ్(Arab Spring), ఆక్యుపై వాల్ స్ట్రీట్ (Occupy Wall Street), గ్రీస్, స్పెయిన్ దేశాల్లో ప్రభుత్వ పొదుపు విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా నిరసనలు, యునైటెడ్ కింగ్డమ్ లో విద్యార్థి నిరసనల స్వభావాన్ని, ఉద్దేశ్యాలను వివరిస్తాడు. దృష్టిలో, ఈ ఉద్యమాలు పరస్పరం సంబంధం లేని విడివిడిగా జరిగిన సంఘటనలు కావు. ఇవన్నీ ఒకే ప్రపంచవ్యాప్త సామాజిక, రాజకీయ పరిణామానికి చెందినవిగా మేసన్ చెబుతాడు. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, పెరిగిన అసమానతలు, నిరుద్యోగం, ఉన్నత విద్య ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత లేని యువత సంఖ్య పెరగడం వంటి పరిస్థితులు కొత్త ప్రజా ఉద్యమాలకు నేపథ్యంగా నిలిచాయి. అదే సమయంలో ప్రజల్లో విస్తృతంగా వ్యాపించిన డిజిటల్ కమ్యూనికేషన్ సాంకేతికత, సోషల్ మీడియా ఈ ఉద్యమాలకు కొత్త శక్తిని అందించాయి. ముఖ్యంగా, ప్రజలను వేగంగా సమీకరించడం, సమాచారాన్ని పంచుకోవడం, ఉద్యమాలను సమన్వయం చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొంటాడు.
ఈ ఉద్యమాల వెనుక, ప్రభుత్వాల పట్ల తీవ్రమైన యువతరం అసంతృప్తి ఉందని పసిగడతాడు.‘భవిష్యత్తు లేని పట్టభద్రుడు’ (‘The Graduate with no future’) అనే భావన ఉంది. మంచి విద్య, నైపుణ్యాలు, ఆశయాలు ఉన్న యువత ఉద్యోగ భద్రత లేకపోవడం.విద్యా అర్హతలకు, వాస్తవ జీవిత అవకాశాలకు మధ్య ఉన్న వైరుధ్యమే అసంతృప్తిని, రాజకీయ అశాంతిని రాజేసి నిరసన ఉద్యమాలవైపు నడిపించిందని మేసన్ వాదిస్తాడు. మేసన్ ప్రధానంగా చెప్పేదేమిటంటే, ఆర్థిక అస్థిరత మరియు డిజిటల్ అనుసంధానం కలయిక ఒక కొత్త రకమైన రాజకీయ శక్తిని సృష్టించింది.
ఫిలిప్ హోవర్డ్ మరియు ముజమ్మిల్ హుస్సేన్ ‘డెమోక్రసీస్ ఫోర్త్ వేవ్ ? డిజిటల్ మీడియా అండ్ ది అరబ్ స్ప్రింగ్’ అనే రచనలో అరబ్ స్ప్రింగ్ ఉద్యమాలలో డిజిటల్ మీడియా పాత్రను విశ్లేషించారు. డిజిటల్ మీడియా ఒక్కటే అరబ్ స్ప్రింగ్‌కు కారణం కాదు. కానీ ప్రజాస్వామ్య ఉద్యమాల విజయానికి అది అత్యంత ముఖ్యమైన, అవసరమైన అంశాలలో ఒకటి. సోషల్ మీడియా వ్యక్తిగత అసంతృప్తిని సామూహిక రాజకీయ చైతన్యంగా మార్చింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వేదికలు ప్రజలను వేగంగా సమీకరించాయి.డిజిటల్ నెట్‌వర్క్‌లు నియంతృత్వ ప్రభుత్వాలను ఆశ్చర్యానికి గురిచేసే కొత్త నిరసన వ్యూహాలను అందించాయి అని విశ్లేషిస్తారు.
మాన్యూల్ క్యాస్టెల్స్ ‘నెట్వర్క్ సొసైటీ’, నెట్వర్క్ ఆఫ్ ఔట్రేజ్ అండ్ హోప్ – సోషల్ మూవ్మెంట్స్ ఇన్ ఇంటర్నెట్ ఏజ్ అనే గ్రంథాల్లో నెట్వర్క్ సమాజ ఆవిర్భావాన్ని చెబుతూ, ఆ తర్వాత ఆ సమాజంలో వచ్చిన సామాజిక ఉద్యమాలను విశ్లేషిస్తాడు. కొత్త తరం యువ ఉద్యమకారులు కార్పొరేట్ సంస్థలు, రాజకీయ అధికార వర్గాల సాంప్రదాయ నియంత్రణ పద్ధతులకు అతీతంగా, ఒక స్వతంత్రంగా కమ్యూనికేట్ చేస్తూ సంఘటితం కాగలిగే కొత్త రాజకీయ మార్గాలను కనుగొన్నారు. ఈ కొత్త మార్గాలు ప్రధానంగా ఇంటర్నెట్, సోషల్ మీడియా మరియు డిజిటల్ నెట్‌వర్క్‌ల ద్వారా అభివృద్ధి చెందాయి.
నిజానికి, టెక్నాలజీ సామాజిక ఉద్యమాలను, సామాజిక ప్రవర్తనను నిర్ణయించలేదు. అయితే, ఇంటర్నెట్ మరియు మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కేవలం సాధనాలు మాత్రమే కావు. అవి సంఘటనా రూపాలు , సాంస్కృతిక వ్యక్తీకరణల మాధ్యమాలు. రాజకీయ స్వయంప్రతిపత్తి కోసం ప్రత్యేక వేదికలు అంటాడు. కేవలం సమాచార సాధనాలు మాత్రమే కాకుండా, సామాజిక మరియు రాజకీయ మార్పుకు మౌలిక మౌలిక సదుపాయాలు కూడా పనిచేశాయి అని వివరిస్తాడు.
జైనెప్ టుఫెక్సీ మాత్రం ‘ట్విట్టర్ అండ్ టియర్ గ్యాస్’ అనే రచనలో అరబ్ స్ప్రింగ్, ఆక్యుపై వాల్ స్ట్రీట్, టర్కీ లోని గెజీ పార్క్ నిరసన డిజిటల్ ఆధారిత ఉద్యమాలుగా చూస్తుంది. డిజిటల్ యుగంలో సామాజిక ఉద్యమాల బలాలు, బలహీనతలను ఇందులో వివరిస్తుంది. గతంలో కంటే, సోషల్ మీడియా ఉద్యమాలను వేగంగా నిర్మిస్తుంది. కొద్ది రోజుల్లోనే లక్షల మందిని సమీకరించడం సాధ్యమవుతోంది.కానీ స్థిరమైన రాజకీయ మార్పు కోసం సంస్థాగత సామర్థ్యం, వ్యూహం, నాయకత్వం కూడా అవసరం. ఈ ఉద్యమాలు భారీ జనమద్దతు సంపాదించినా, దీర్ఘకాలిక రాజకీయ మార్పులను సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి.భారీ జనసమూహాలు వీధుల్లో కనిపించినా, ఉద్యమాల వెనుక బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోతే అధికార వ్యవస్థలను మార్చడం కష్టం. దీనినే ఆమె ఈ ఉద్యమాల్లో ఉన్న సామర్థ వైరుధ్యంగా చెబుతుంది. ఒక విధంగా కనిపించే బలం, కనిపించని బలహీనత , రెండూ ఈ ఉద్యమాలకు లక్షణంగా ఉన్నాయి అంటుంది.
భారతదేశంలో సమకాలీన ప్రజా వుద్యమాలు
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కొత్త ఉద్యమాల క్రమంలోనే, భారతదేశంలో కూడా అనేక వైవిధ్యమైన నిరసన ఉద్యమాలు జరిగాయి. స్త్రీలపైన జరుగుతున్న అత్యాచారానికి నిరసనగా ‘నిర్భయ ఉద్యమం,’ కార్పొరేట్ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం, పౌరసత్వ పరిరక్షణ కోసం ముస్లిం స్త్రీల ‘షాహిన్బాగ్ ఉద్యమం,’ విద్యావ్యవస్థలో అవకతవకలకు, అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన జెన్ జీ ల ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం పేర్కొనదగ్గవి.
లైంగిక హింసపై పోరాటంగా నిర్భయ ఉద్యమం
డిసెంబర్ 12, 2012న దేశ రాజధాని నగరంలో జ్యోతి సింగ్ అనే 23 అమ్మాయిపై బస్సులో సామూహిక అత్యాచారం చేయగా మరణించిన దానికి ప్రతిఘటనగా వచ్చిన నిర్భయ ఉద్యమం. రాజధాని నగరం ఢిల్లీలో స్టూడెంట్స్ చలిలో , వాటర్ కెనాన్స్, బాష్పవాయు ప్రయోగాల్ని లెక్క చేయకుండా రాజధానిని దిగ్బంధం చేసి అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని వణికించిన ఉద్యమం. రాష్ట్రపతి భవనం ముందు, ఇండియా గేట్ నుండి విజయ చౌక్ దాకా నిరసనలతో ఢిల్లీ ప్రతిధ్వనించింది. రేపిస్టులని ఉరితీయండని నినాదాలతో , కాండిల్ లైట్ ప్రదర్శన, శాంతియుత నిరసనలు ఢిల్లీ లోనే కాక, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నిరసనలు జరిగాయి. ఈ ఉద్యమం స్త్రీల పై రోజువారీగా జరిగే అత్యాచారాల తీవ్రతని , అందుకు ప్రభుత్వ యంత్రాంగ అసమర్థతను బయటపెడుతూ , ఇటువంటి సంఘటనలు జరగకుండా అరికట్టేలా చట్టాల్ని, శిక్షలను అమలుచేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠినతర చట్టాలతో నిర్భయ చట్టం తీసుకు వచ్చేలా యువ ఉద్యమం చూసాం. ఈ ఉద్యమం వల్ల, 2013లో విచారణ న్యాయస్థానం నేరస్తులకు మరణదండన విధించింది. మార్చి 20, 2020 తీహార్ జైల్లో ఈ నేరానికి పాల్పడిన అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముకేశ్ సింగ్‌లకు తీహార్ జైల్లో ఉరి తీశారు. రామ్ సింగ్ జైలులోనే మరణించాడు. ఇది నిర్భయ ఉద్యమ ఫలితం.
అయితే ఈ ఉద్యమ తీవ్రతను, ఉద్రిక్తతలను గమనించిన ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. మెట్రో స్టేషన్లను మూసివేసి నిరసనకారుల రాకపోకలకు ఆటంకం కలిగించింది. పోలీసులు బారికేడ్లు, వాటర్ కెనాన్స్, బాష్పవాయు ప్రయోగాలు ఇలా అన్నిరకాలుగా హింసాయుత అణిచివేసే పద్ధతులు అమలుపర్చింది. ఉద్యమ యువత ధృడ నిశ్చయంతో ఉద్యమాన్ని నడిపేరు.
నిర్భయ ఉద్యమంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేసేందుకు , ప్రజల్ని సమీకరించి, సంఘటితపరిచేందుకు సోషల్ మీడియాను ఎంతగానో ఉపయోగించుకోవడం జరిగింది. సోషల్ మీడియా ప్రభావాన్ని సరిగా అర్థం చేసుకోలేని ప్రభుత్వం నగర ప్రజల మనోభావాన్ని తప్పుగా అంచనా వేసింది. టెక్స్ట్ సందేశాలను నిరోధించడంతో ప్రజలు సెల్యులార్ నెట్‌వర్క్‌కు బదులుగా ఇంటర్నెట్‌ను ఉపయోగించే వాట్సాప్ యాప్‌ను ఆశ్రయించారు.ట్విట్టర్ను ప్రజలను సమీకరించడానికి, పోలీసులు అవలంబిస్తున్న హింసాత్మక పద్ధతుల గురించి అవగాహన కల్పించడానికి విస్తృతంగా ఉపయోగించారు. ఈ ఉద్యమాన్ని నడపటంలో ఇంటర్నెట్ కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంలో సాంప్రదాయక వార్తా మాధ్యమాలు, వార్తా సంస్థలు, వార్త వ్యాఖ్యాతలు లింగ వివక్షతో వ్యవహరిస్తూ, రాజకీయ పార్టీల ప్రభావానికి లోనయ్యాయని విమర్శించారు. ప్రధాన మీడియా స్రవంతి మీద తీవ్ర అసంతృప్తిని వెల్లడించారు. ప్రెస్ వైఖరి పట్ల ‘#ShameOnTimesNow,’ ‘#Presstitutes’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఈ ఉద్యమంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. #TheekHai (‘అంతా బాగానే ఉంది’) అనే హ్యాష్‌ట్యాగ్‌ను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నిరసనలపై మౌనం పాటించడాన్ని, అలాగే ఆయన ప్రభుత్వం సమస్యలపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఎగతాళి చేయడానికి ఉపయోగించారు. #StopThisShame, #death4rape, #inhumanebastards వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ప్రజలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు విస్తృతమైన అనుసంధాన వేదికగా ఉపయోగించేరు . ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం, నిరాశ వంటి ఉమ్మడి భావోద్వేగాల చుట్టూ ఒక సామూహిక ఐక్యతను ఏర్పరిచింది.
విద్యావంతులైన పట్టణ ప్రజల్లో కూడా అత్యాచారం లేదా లైంగిక దాడి వంటి విషయాలపై మాట్లాడటం కంటే మౌనం పాటించడమే మంచిదని భావించేవారు. అలా మాట్లాడితే తమ గౌరవం దెబ్బతింటుందని వారు అనుకునేవారు. ఈ ఉద్యమం, లైంగిక హింస పబ్లిక్ లో చర్చించటానికి తటపటాయించే మౌనాన్ని బద్దలుకొట్టింది. బాధితురాలు ‘నిర్భయ’ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన జ్యోతి సింగ్ పేరును బహిర్గతం చేయడాన్ని ఆమె తల్లిదండ్రులు సమర్థించారు. తమ కుమార్తె పేరుపట్ల తాము సిగ్గుపడటం లేదని, సిగ్గుపడాల్సింది బాధితురాలు కాదు, నేరస్థులేనని వారు స్పష్టం చేశారు.
పితృస్వామ్య దృక్పథంలో బాధితురాలే తనపై జరిగిన అత్యాచారానికి బాధ్యురాలిగా భావించబడుతుంది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు సామాజిక విషయాలుగా కాకుండా, వ్యక్తిగత జీవితానికి చెందినవిగా పరిగణించబడేవి. ఈ “వ్యక్తిగత” సమస్యలు సోషల్ మీడియా అనే ప్రజా వేదికపై చర్చకు రావడం ప్రారంభమైనప్పుడు, తమ స్వరాన్ని వినిపించాలనుకున్న వేలాది మంది గొంతుకలు పరస్పరం అనుసంధానమయ్యాయి. ఈ విధంగా ట్విట్టర్ వ్యక్తిగతాన్ని రాజకీయంతో, వ్యక్తిగత రంగాన్ని ప్రజా రంగంతో అనుసంధానించడమే కాకుండా, లక్షలాది మందికి మాట్లాడే వేదికను కూడా అందించింది. జంతర్ మంతర్, ఇండియా గేట్ వంటి ప్రదేశాలను నింపిన వేలాది మంది మధ్యతరగతి, ఉన్నతవర్గ నిరసనకారులు కేవలం అణచివేతకు గురైన వర్గాల తరపున మాత్రమే కాకుండా, తమ స్వంత అనుభవాలు, ఆందోళనల తరపున కూడా మాట్లాడారు.
ఢిల్లీలో లైంగిక హింసకు వ్యతిరేకంగా జరిగిన నిర్భయ ఉద్యమ నిరసనలు సాంస్కృతిక మార్పు పరంగా ఇంకా అనేక పరిమితులను కలిగి ఉన్నప్పటికీ, అవి స్పష్టమైన చట్టపరమైన మార్పులకు దారితీశాయి. ఈ ఉద్యమం ఫలితంగా లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలలో సవరణలు జరిగాయి; మహిళల భద్రత, న్యాయం వంటి అంశాలు జాతీయ చర్చల కేంద్రంగా మారాయి. ఈ ఉద్యమం తర్వాత హత్రాస్ దళిత స్త్రీ పై అత్యాచారం, హత్య లాంటి అనేక సంఘటనలు జరిగాయి. ప్రభుత్వం వీటిని అరికట్టగలిగిందా, బాధితులకు న్యాయం జరుగుతుందా అనే విషయాలు పక్కన బెడితే, ప్రజల్లో ఈ విషయాల పట్ల చైతన్యం వచ్చింది. ప్రభుత్వాలు వీటిని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే పబ్లిక్ డిమాండ్ పెరుగుతుంది.
షాహిన్బాగ్ ముస్లిం స్త్రీల ఉద్యమం
అవినీతి ఆరోపణలు, అసమర్థ పాలన, ఆర్థిక సంక్షోభం లాంటి కారణాలతో గుజరాత్ ఆర్థిక నమూనా పేరు తో కాంగ్రెస్ ను కూలదోసి బీజేపీ అధికారం లోకి వచ్చింది. డిమానిటైజేషన్, జీఎస్టీ లాంటి ఆర్థిక విధానాలకు పరిమితమైన బీజేపీ, 2019 లో మళ్లీ అధికారంలోకి వచ్చేక, హిందుత్వ ఎజెండా ను అమలుచేసే పనిలో పడింది. ముఖ్యంగా, మైనారిటీ సముదాయాలపై ప్రభావం చూపే చట్టాలను అమలు చేసే ప్రయత్నం చేసింది. జమ్మూ–కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019, పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరుల నమోదు(NRC), జాతీయ జనాభా నమోదు(NPR) వంటి చట్టాలను చేసింది. బహుళసాంస్కృతిక భారత ప్రజాస్వామ్యంలో బహుళత్వం, లౌకికవాదం, సమానత్వం వంటి విలువలకి చట్టబద్ధంగా గడ్డుకాలమెచ్చిపడిందని మేధావులు అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత కోల్పోతుందనే భావన ఏర్పడింది. ప్రజల హక్కులు, స్వేచ్ఛలు పరిమితం చేయబడ్డాయి. మేధావులు, స్వతంత్ర మీడియా స్వరాలు అణచివేయబడ్డాయి. ఎన్నికల నిర్వహణలోనూ, రాజ్యాంగాన్ని మార్చే యోచనలోనూ, ప్రజల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. మొత్తంగా ప్రజాస్వామ్య రక్షణ వ్యవస్థలు సంక్షోభంలోబడిన కొత్త వాతావరణం ఏర్పడింది.
2019 డిసెంబర్ 11న Citizenship Amendment Act (CAA) అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మత ఆధారంగా పౌరసత్వాన్ని కల్పిస్తోందని, ముఖ్యంగా ముస్లిం వలసదారులను వివక్షకు గురిచేస్తోందని విమర్శలు వచ్చాయి. అదనంగా ప్రభుత్వం National Register of Citizens (NRC) ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి పౌరుడు తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. పౌరసత్వాన్ని మంజూరు చేయాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వ అధికారుల విచక్షణాధికారంపై ఆధారపడుతుంది. CAA, NRCలను కలిపి పరిశీలిస్తే, భారతదేశంలోని ముస్లిం పౌరులు మరియు ఇక్కడ ఇప్పటికే నివసిస్తున్న ముస్లిం వలసదారులు తీవ్ర వ్యవస్థాగత అణచివేతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని విమర్శకులు వాదించారు. కొందరు తమ పౌరసత్వ హోదాను కూడా కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సామాజిక వర్గాల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సామాజిక వర్గం కేంద్రీకృతమైన ప్రదేశాల్లో ఆందోళనలు జరిగాయి. 2019 డిసెంబర్ 15న ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీలో CAA- NRCకి వ్యతిరేకంగా విద్యార్థుల చేసిన నిరసన పైన పోలీసులు యూనివర్సిటీలోకి ప్రవేశించి లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది.జామియా విద్యార్థుల ఉద్యమం యూనివర్సిటీ సమీపంలో ఉన్న షాహిన్ బాగ్ ప్రాంతంలో జరిగిన మహిళల నిరసనలకు స్ఫూర్తినిచ్చింది. ఇది పోరాసత్వం చట్టాలకు వ్యతిరేకంగా ముస్లిం స్త్రీలు చేసిన వీరోచిత పోరాటంగా ఈ దేశ చరిత్రలో నమోదు చేయబడింది. షహీన్ బాగ్ లో ఒక ప్రధానమైన రోడ్డుమీద కొచ్చి 104 రోజులు తమ పోరాటాన్ని నడిపేరు.
2019 డిసెంబర్ 17న ఢిల్లీలోని Shaheen Bagh ప్రాంతం, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ప్రారంభించిన నిరవధిక ధర్నాకు కేంద్రంగా మారింది. Jamia Nagar ప్రాంతంలో ఉన్న షాహీన్ బాగ్, Batla House, Zakir Nagar, Ghaffar Manzil, Noor Nagar వంటి ప్రాంతాలకు సమీపంలో ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.
షాహీన్ బాగ్ ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ వివిధ ఆర్థిక నేపథ్యాల ప్రజలు నివసిస్తున్నారు. వలస కూలీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, వీధి వ్యాపారులు వంటి శ్రామిక వర్గాలతో పాటు, Jamia Millia Islamia విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు, మేధావులు, చిన్న మరియు పెద్ద వ్యాపారులు కూడా అక్కడే ఉంటారు
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను రాసిన కవితలో ఒక భాగం:
‘అలలుగా నడుస్తున్న ‘ఆమెలు’
ఈ దేశం పౌరులుగా
మొదటిసారిగా
మొహానికున్న పరదాల్ని
దేశ దురాక్రముల మీదికి విసిరి
ఆక్రమించుకొన్న స్వదేశ రహదారి
బతుకుదారులన్నీ మూసుకున్న వేళ
ఈ కాస్త దారినైనా
పదలకుండా పట్టుకుందామని
రాజధాని రాజకీయ రోడ్డులో
షాహీన్ బాగ్ నాగరిక పోరులో
ఆకాశంలోంచి విరిగిపడ్డ చందమామలు!
రాజ్యాంగం చివరి పేజీని
మూక మతోన్మాదుడు చింపేయక ముందే
మన హక్కులన్నీ లాగేసుకుని
మనల్ని ఈ దేశ వారసత్వంలోంచి
బయటికి తోసేయక ముందే
మూడు రంగుల జెండా రెపరెపలుగా
చేతినుండి వదలని అంబేద్కర్ ప్లకార్డులతో
ఈ దేశం మాదంటూ నినాదంతో
ముస్లిం మహిళా దిగ్భందమైన షాహీన్ బాగ్’
షాహీన్ బాగ్ ఉద్యమం ప్రముఖంగా ముస్లిం స్త్రీలు చేసిన నిరసన ఉద్యమం. వాళ్ళెవరూ ఇంతకు ముందు ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు. ఏ రాజకీయాలతో సంబంధం లేని సామాన్య స్త్రీలు. అన్ని వర్గాల స్థానిక ముస్లిం స్త్రీలు ఇందులో భాగమయ్యారు. వయో వృద్ధురాలైన బిల్కిస్ దాదీ నుండి చిన్న పిల్లలు దాకా ఇందులో పాల్గొన్నారు. ఇది ఒక క్రమశిక్షణతో, ఎంతో సృజనాత్మకత తో కూడిన మహిళ ఉద్యమం. ఇది ఒక నాయకురాలి ఆధ్వర్యంలో నడిచిన ఉద్యమం కాదు. ఇది వేలాది స్థానిక మహిళలు, విద్యార్థులు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన వికేంద్రీకృత ముస్లిం స్త్రీల ఉద్యమం. ఈ నిరసన ఉద్యమానికి విద్యార్థుల నుండి, దళిత, బహుజన, ఆదివాసీ వర్గాల నుంచి మంచి సంఘీభావ స్పందన వచ్చింది.
షాహీన్ బాగ్ ఉద్యమం ప్రధానంగా ముస్లిం మహిళల చేత నిర్వహించబడింది, నడిపించబడింది, కొనసాగించబడింది. భారతదేశంలో ఇంతకుముందు ప్రజా నిరసనల్లో ముస్లిం మహిళలకు పెద్దగా కనిపించే స్థానం లేకపోయినా, ఈ ఉద్యమంలో వారు కేంద్ర పాత్ర పోషించారు. షాహీన్ బాగ్ మహిళలు ప్రభుత్వ మత పక్షపాతాన్ని సవాలు చేస్తూ రాజ్యాంగ విలువలకి కట్టుబడి గాంధీ, అంబేద్కర్, మౌలానా అజాద్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ , జాతీయ జెండాలు పట్టుకుని, రాజ్యాంగ పీఠికను చదువుతూ, లౌకిక జాతీయవాదాన్ని పదే పదే ప్రస్తావించేవారు.
29 ఏళ్ల నిరసనకారిణి జమీలా మాటల్లో, ‘ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు, ఈ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవి. షాహీన్ బాగ్‌లో పీఠికను చదవడం ద్వారా ఇది ఒక లౌకిక నిరసన అని మేము తెలియజేస్తున్నాం. ఈ జాతీయ జెండాలను చూడండి. ఇక్కడ వివిధ మతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. బీజేపీ ముస్లిం వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక విధానాలు చివరికి అందరికీ, దేశానికే నష్టం చేస్తాయని వారు అర్థం చేసుకున్నారు. మన దేశం మతాధారిత దేశం కాదు; ఇది లౌకిక దేశం.’
షహీన్ బాగ్ నిరసన పోరాటంలో స్త్రీలు ప్రధాన రహదారిని ఆక్రమించి తమ నిరసన ప్రదేశంగా ఎంచుకోవటం, ఆ నిరసన పోరాటం కొన్ని నెలలు పాటు ఎటువంటి రవాణా రాకపోకలు లేకుండా స్తంభింపచేయటం ఈ నేల మాది, ఈ దేశం మాది అనే ప్రతీకాత్మక ధ్వని కూడా ఉంది. సహజంగా పురుషాధిక్య వ్యవస్థలో ప్రజా ప్రదేశాలు కఠినంగా నియంత్రించబడతాయి. అక్కడ మహిళల ప్రవర్తనపై నిరంతర నిఘా, నియంత్రణ మరియు క్రమశిక్షణ విధించబడుతుంది. ఈ సందర్భాన్ని ఓ 45 ఏళ్ల మహిళా నిరసనకారిణి మాటల్లో విందాం :
‘ఈ వీధులు, ఈ ప్రదేశాలు మీవైనంతగా మావి కూడా. ప్రజలకు చెందిన ప్రతిదానిపై మాకూ సమాన హక్కులు ఉన్నాయి. ముఖ్యంగా ముస్లింలు, అందులోనూ మహిళలు, ఇంట్లోనే ఉండాలని, బయటకు రాకూడదని, కనిపించకూడదని బలవంతపెట్టబడుతున్నారు. మేము హిజాబ్ లేదా బుర్ఖా ధరించడం వారికి ఇష్టం ఉండదు. ఎందుకో నాకు తెలుసు. ముస్లిం మహిళలు వీధుల్లో కనిపిస్తే, ఈ వీధులు కూడా మావేనని, ఈ దేశం కూడా మాదేనని వారికి గుర్తుకు వస్తుంది. మేము ఇళ్లకే పరిమితమైతే, ప్రజా ప్రదేశాలు మావి కావు. అందుకే ఈ వీధుల్లో నిలబడటం మాకు చాలా ముఖ్యమైనది. వారు మమ్మల్ని కనిపించనివ్వాలనుకోవడం లేదు. మమ్మల్ని ఇంట్లోనే ఉంచాలనుకున్నప్పుడు, వారు మమ్మల్ని మరచిపోవాలనుకుంటున్నారు. మేమున్నామనే విషయాన్ని వారు మరచిపోతే, మా హక్కులను కూడా హరించగలరు.’
ఈ నిరసన పోరాటంలో సోషల్ మీడియాను ఎంతో ప్రతిభావంతంగా ఉపయోగించుకున్నారు. ఒక వైపు ప్రధాన మీడియా సృష్టించిన ప్రతికూల చిత్రణలను సవాలు చేస్తూ, మరో వైపు తమదైన ప్రత్యేక ఉనికిని తెలియజేస్తూ, ప్రజల్ని సంఘటితం కోసం సోషల్ మీడియాపై దృష్టి పెట్టేరు. షాహీన్ బాగ్ ఉద్యమంలో అనేక సోషల్ మీడియా వినియోగదారులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, కార్యకర్తలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలను ఉపయోగించి ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. వారు నిరసనల సమాచారాన్ని విస్తృతంగా పంచి, భారతదేశం వెలుపల ఉన్న ప్రజలకు కూడా ఉద్యమ స్వరాన్ని చేరవేశారు. సోషల్ మీడియా షాహీన్ బాగ్ ఉద్యమాన్ని కేవలం ఢిల్లీలోని ఒక స్థానిక నిరసనగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చర్చించబడిన పౌరసత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, మైనారిటీ హక్కుల ప్రశ్నగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.
ప్రధాన మీడియా ఛానెళ్లు ఈ ఉద్యమం పట్ల ప్రభుత్వ అనుకూలతతో, తప్పుడు ప్రచారంతో ఈ నిరసన ఉద్యమం పట్ల ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేక భావనని ప్రచారం చేశాయి. అర్ణబ్ గోస్వామి తన టీవీ కార్యక్రమంలో, ‘షాహీన్ బాగ్ అనేది హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక, డబ్బు కోసం నడిచే, అవకాశవాద, పూర్తిగా రాజకీయ ఉద్యమానికి కేంద్రబిందువు” అని గట్టిగా ప్రకటించాడు. అక్కడి నిరసనకారులు ప్రజలను “భయభ్రాంతులకు గురి చేస్తున్నారని’ పదేపదే నొక్కిచెప్పాడు. నిరసనలను విమర్శించడం ఒక విషయమైతే. ట్రాఫిక్ సమస్యల గురించి మాట్లాడటం, ప్రభుత్వానికి మద్దతుగా, నిరసనలకు వ్యతిరేకంగా టీవీ చర్చల్లో అభిప్రాయాలు వ్యక్తం చేయడం మరో విషయం. ప్రధాన మీడియా దిగజారుడుతనాన్ని పసిగట్టిన నిరసనకారులు స్పష్టమైన వైఖరితో “గోదీ మీడియా గో బ్యాక్” అని నినదించారు. తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు చేరవేస్తూ, ప్రజాభిమానాన్ని కూడగట్టగలిగారు. ప్రధాన మీడియాలో కొందరు పనిగట్టుకుని దీనిని దేశవ్యతిరేక ఉద్యమంగా చిత్రీకరించగా, పౌర సమాజంలోని అనేక వర్గాలు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంగా సమర్థించాయి.
కోవిడ్ నివారణ చర్యలుగగా 2020 మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రజా సమావేశాలు నిషేధించబడ్డాయి. సుప్రీం కోర్టు నిరసన హక్కును గుర్తిస్తూనే, ప్రజా మార్గాలను శాశ్వతంగా దిగ్బంధించడం సరికాదని తీర్పునిచ్చింది. వీటికి తోడు ఈ ఉద్యమం పట్ల ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది. వీటన్నిటి ఆధారంగా చేసుకుని ఢిల్లీ పోలీసులు నిరసన స్థలాన్ని ఖాళీ చేయించారు.2020 మార్చి 24న పోలీసులు నిరసన ప్రాంతాన్ని ఖాళీ చేయించి టెంట్లు, వేదికలు, పోస్టర్లు తొలగించారు.
భారతీయ చరిత్రలో షాహీన్ బాగ్ ఉద్యమం ఎవరికీ తలవంచని స్త్రీల ఉద్యమంగా, ముఖ్యంగా ముస్లిం స్త్రీల అస్తిత్వ ఉద్యమంగా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంగా, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన ఉద్యమంగా, వికేంద్రీకరణ నాయకత్వంతో , పౌర సమాజం లోని అన్ని వర్గాలనుండి మద్దతు సాధించిన ఉద్యమం గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
“షాహీన్ బాగ్‌లో రాజకీయ నాటకం కొనసాగుతోంది. అక్కడ ధర్నాలో పాల్గొంటున్న వారికి ఉపాధి దొరికింది; జేబులో 500 రూపాయలు, కడుపులో బిర్యానీ.”
ఢిల్లీశివార్లలో రైతు ఉద్యమం
షహీన్ బాగ్ పోరాటం జరిగిన వెనువెంటనే దేశంలో మరో విన్నూతమైన, వీరోచితమైన రైతుల పోరాటం జరిగింది. సెప్టెంబర్ 20,2020న ప్రభుత్వం పార్లమెంట్ లో వ్యవసాయ రంగాన్ని, మార్కెట్ అనుకూలంగా సరళీకృతం చేసే చట్టాలను చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, విక్రయం, నిల్వలకు సంబంధించిన మూడు వ్యవసాయ సంస్కరణ బిల్లులను, రైతు సంఘాలతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండా తీసుకురావటవం జరిగింది. వీటి ప్రకారం ప్రైవేటు సంస్థలు పంటలను మార్కెట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు, పన్నులు చెల్లించకుండా వ్యాపారం చేయవచ్చు, నిత్యావసర వస్తువులను అపరిమితంగా నిల్వ చేసుకోవచ్చు, రైతులతో కాంట్రాక్ట్ చేసుకుని వ్యవసాయం చేయవచ్చు. రైతులకు చట్టపరమైన రక్షణ లేదా న్యాయపరమైన పరిహారం పొందే అవకాశాలు పరిమితం చేయబడ్డాయి. బీజేపీ ప్రభుత్వం ఈ సంస్కరణలు రైతులకు మరిన్ని ఎంపికలను కల్పిస్తాయని, సంప్రదాయ టోకు మార్కెట్లైన “మండీలు” మీద ఆధారపడకుండా ప్రైవేటు కంపెనీలకు నేరుగా అమ్ముకునే స్వేచ్ఛను ఇస్తాయని నచ్చి చెప్పబోయింది. అయితే అనేక మంది రైతులు ఈ చట్టాల వల్ల తమ పంటలకు ధరలు తగ్గిపోతాయని, నిత్యావసర వస్తువుల నిల్వ పెరుగుతుందని, వ్యవసాయం కార్పొరేట్ పరమై అసలుకే మోసమొస్తుందని గ్రహించేరు. ఈ సంస్కరణల వల్ల ప్రస్తుత మండీ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని రైతులు భావించారు. ప్రస్తుతం మండీ వ్యవస్థ రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇస్తోంది. సంస్కరణల ప్రారంభ దశలో ప్రైవేటు కంపెనీలు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసి మార్కెట్‌పై గుత్తాధిపత్యం సాధించే అవకాశం ఉంది. ఒకసారి ఆ గుత్తాధిపత్యం ఏర్పడిన తర్వాత, కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువ ధరలను నిర్ణయించే పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో సుమారు 85 శాతం రైతులు ఐదు ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు. ఇప్పటికే అప్పుల భారంతో, రైతుల ఆత్మహత్యలతో సతమతమవుతున్న ఈ రైతులు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన మార్కెట్‌లో పోటీ పడాల్సి వస్తుంది. ఫలితంగా అనేక మంది రైతులు తమ భూమిని, జీవనోపాధిని, సంప్రదాయ జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భావించారు. దీనికి ప్రతిస్పందనగా రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా చట్టబద్ధమైన కనీస మద్దతు ధర హామీ ఇవ్వాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యాలను సాధించడానికి అవసరమైతే సంవత్సరాల తరబడి ఢిల్లీలోనే ఉండేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఈ రైతు చట్టాలకి వ్యతిరేకంగా నలభై రైతు సంఘాలతో కూడిన ఐక్య సంఘటన దేశవ్యాప్తంగా చక్కా జామ్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ తర్వాత పంజాబ్, హర్యానా, కొంత ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ ని చుట్టుముట్టి ఒక కొన్ని నెలలబాటు, కోవిడ్ ను కూడా లెక్క చేయకుండా ఎముకలు కొరికే చలిని, ఉక్కపోతతో కూడిన తీవ్రమైన వేడిని, మధ్య మధ్యలో కురిసిన భారీ వర్షాలను లెక్క చేయకుండా ఒక చారిత్రిక సంఘటిత రైతు ఉద్యమం చేశారు. ఒక సంవత్సరానికి పైగా రైతులు ఢిల్లీ శివార్లలోని టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల్లో భారీ ధర్నాలు నిర్వహించారు. దాదాపు మూడు లక్షల మంది మద్దతుదారులు ఈ శిబిరాల్లో పాల్గొన్నారు. రాజధాని నగరాన్ని దిగ్బంధనం చేశారు. ప్రభుత్వం రైతులు చొరబడకుండా డిల్లీ కి చేరే ప్రధాన రహదారులన్నీ మేకులు కొట్టి, విపరీతమైన పోలీసు బలగాలను ప్రయోగించారు. రైతులు ఇవేమీ లెక్కచేయకుండా ట్రాక్టర్లు తో ఢిల్లీ నగరంలోకి చొరబడి పెద్ద ప్రదర్శన జరిపారు. 2021 జనవరి 12న సుప్రీంకోర్టు ఈ వ్యవసాయ చట్టాల అమలుపై తాత్కాలిక స్టే విధించింది. ఇదే అదునుగా రైతుల ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం ఈ చట్టాలని అమలు చేయకుండా వెనక్కి తీసుకుంది. రైతుల ఉద్యమం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యామ్నాయ దృష్టిని అందించింది. ఈ ఉద్యమంలో అనేక మంది పౌర సమాజ ప్రముఖులు, రచయితలు, కళాకారులు, మేధావులు భూస్వామ్యమై, తమ సంఘీభాన్ని అందచేశారు.
ఈ ఉద్యమానికి సంఘీభావంగా నేను రాసిన కవిత లోని పంక్తులు:
‘పంటంతాకోసి కార్పొరేట్ గొడౌన్లలోకి
కారుచవకగా కుమ్మరించలేక
బతుకు భరోసా దొరకక
మోసపు చట్టాలు చేసినప్రభువుల
చొక్కా పట్టుకుందామని
పంటపొలం సేద్యగాడు
విరగపండిన చేనులా
కడుపు మండిన రైతులతో
పాలక పట్టణానికి పోయే దారులన్నీ
అదిరిపడిన రాజ్యమోడు
బారీకేడ్లతో బాష్పగోళాలతో
నీళ్ల తుపాకులతో దూసుకెళ్లినా
చల్లారని నిరసన ప్రదర్శనపోరు
ఆకుపచ్చజెండా ట్రాక్టర్లతో
ముట్టడయి పోయిన మహా నగరం
న్యూసెన్సుగాల్లుగా , నేరస్తులుగా,
దేశ విద్రోహులుగా
కార్పొరేట్ జేబు మీడియాగాడి ప్రచారం’
(కేశవ కుమార్, నల నల్లని పాట)
రైతుల ఉద్యమానికి సంబంధించిన ప్రధాన మీడియా కథనాల్ని సవాలు చేయడానికి, అలాగే ఉద్యమం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి సోషల్ మీడియాను ఒక విద్యా సాధనంగా ఉపయోగపడింది. రైతుల నిరసనలు ట్రాలీ టైమ్స్ , కిసాన్ ఏక్తా మోర్చా, ట్రాక్టర్ టు ట్విట్టర్ వంటి వేదికలను, అలాగే కొంతమంది వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి పలు కీలక కార్యక్రమాలు చేపట్టాయి. ఇవి కేవలం విభజనాత్మక సమాచార వ్యవస్థతో పోరాడడమే కాకుండా, రైతుల గొంతుకలను, వారి సమస్యలను ముందుకు తీసుకువస్తూ, ఉద్యమానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేశాయి.
రైతుల ఉద్యమంలో #ChakkaJam వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ప్రజలను సమీకరించే ఉత్ప్రేరకాలుగా పనిచేశాయి. నిరసనల లక్ష్యాలు, కార్యక్రమాల వివరాలు, రవాణా మరియు సమీకరణ ఏర్పాట్లు, అలాగే రైతుల ఉద్యమం యొక్క విస్తృత రాజకీయ-సామాజిక నేపథ్యం గురించి సమాచారాన్ని పంచుకోవడానికి అవి ఒక వేదికగా నిలిచాయి.
ఈ ఉద్యమంలో ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్‌లు సమాచారాన్ని సులభంగా శోధించగలిగేలా చేయడం, వర్చువల్ సమాజాల నిర్మాణానికి తోడ్పడటం, సామాజిక-రాజకీయ ఉద్యమాలకు బలాన్ని చేకూర్చడం వంటి అనేక విధులను నిర్వర్తించాయి. సామాజిక ఉద్యమాలకు హ్యాష్‌ట్యాగ్‌లు నినాదాలుగా మారి, ఉద్యమంలో పాల్గొనే వారిని ఏకం చేయడంతో పాటు ముఖ్యమైన సందేశాలను వేగంగా వ్యాప్తి చేస్తాయి. హ్యాష్‌ట్యాగ్‌లు ఉద్యమానికి సంబంధించిన వార్తలు ప్రధాన మీడియా ద్వారా నిరోధించబడుతున్నాయని గ్రహించిన కొందరు కార్యకర్తలు, 2020 డిసెంబర్ 18న ట్రాలీ టైమ్స్ అనే పత్రికను ప్రారంభించారు. దాని మొదటి పేజీపై “మనం ఐక్యమవుతాం, పోరాడుతాం, గెలుస్తాం!” అనే నినాదం తో ఉంది. దీనిని స్త్రీలే నడిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు 5,000 ముద్రిత ప్రతులను పంపిణీ చేయడం ద్వారా అది విలువైన పాత్ర పోషించినప్పటికీ, దాని అసలు బలం సోషల్ మీడియా వేదికల నుంచే వచ్చింది. ట్విట్టర్‌లో 11,500 కంటే ఎక్కువ మంది, ఫేస్‌బుక్‌లో 13,400 కంటే ఎక్కువ మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 55,800 కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉండటం వల్ల ట్రాలీ టైమ్స్ తన సందేశాన్ని చాలా వేగంగా విస్తరించగలిగింది.
ప్రధాన స్రవంతి మీడియా మాత్రం నిరసన చేస్తున్న పౌరుల ఉద్యమాలను చట్టబద్ధత లేనివిగా చిత్రీకరించే అనేక కథనాలను ప్రచారం చేశారు.నిరసనల్లో పాల్గొన్న రైతులను ‘ఖలిస్థానీయులుగా’, ‘డబ్బులు తీసుకుని నిరసనలు చేస్తున్న వ్యక్తులు’ గా చిత్రీకరించారు. భారత ప్రధానమంత్రి అంతటివాడు పార్లమెంట్ రాజ్యసభలో నిరసన వ్యక్తం చేస్తున్న పౌరులను ఉద్దేశిన్ “ఆందోళన్ జీవులుగా” “పరాన్నజీవులుగా” అభివర్ణించారు. 2019లో తీసుకువచ్చిన పౌరసత్వ సవరణల చట్టాలకు వ్యతిరేకంగా దేశప్రజలు వీధుల్లోకి వచ్చినప్పుడు, వారిని పాలకపక్ష నాయకులు ‘ఉగ్రవాదులు’, ‘పాకిస్తానీయులు,’ గా చిత్రించడం చూసాం. జెఎన్యూలో ప్రభుత్వ జోక్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిఘటించినప్పుడు, వారిని “టుక్డే-టుక్డే గ్యాంగ్”, దేశద్రోహులు గా ముద్ర వేయటం చూసాం.
ఈ రైతు ఉద్యమం సోషల్ మీడియా ను ఎంతగా ఉపయోగించుకున్నదో , విరివిగా ఉన్న ఖాతాలు, వాటి ఫాలోవర్స్ ను గమనిస్తే అర్ధమవురుంది.2021 మార్చి 1 నాటికి ఒక్క కిసాన్ ఏక్తా మోర్చాకే ఇన్‌స్టాగ్రామ్‌లో 2.23 లక్షల అనుచరులు,యూట్యూబ్‌లో 12.3 లక్షల మంది సభ్యులు,ఫేస్‌బుక్‌లో 3.58 లక్షల లైకులు, 4.71 లక్షల అనుచరులు,ట్విట్టర్‌లో 2.8 లక్షల అనుచరులు ఉన్నారు. ఒక వివాదాస్పద హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారనే ఆరోపణలతో 250కిపైగా సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసింది. వీటిలో పత్రిక ట్విట్టర్ ఖాతా, కిసాన్ ఏక్తా మోర్చా ట్విట్టర్ ఖాతా కూడా ఉన్నాయి.
రైతు ఉద్యమం ఉద్యమం వ్యవసాయరంగం ప్రైవేటీకరణను, కార్పొరేట్ చేతుల్లోకి పోవటాన్ని పోరాటం ద్వారా వ్యతిరేకించగలిగారు. కనీస మద్దతు ధర, రైతు రుణ మాఫీ లాంటి డిమాండ్లను బలంగా వినిపించడమే గాక రైతుల సంక్షేమం కోసం వేసిన స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ను ప్రభుత్వం అమలుపరచాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఉద్యమం రైతులు దేనికీ దడవకుండా, అనేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ లక్ష్యం అందుకునే దాకా పట్టుదలతో ఉద్యమించడం స్ఫూర్తిదాయక విషయం. ప్రజాస్వామ్య అర్థాన్ని మరింత విస్తృత పరిచిన పోరాటంగా ఈ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
కాక్రోచ్ జనతా పార్టీ జెన్ జీ పోరాటం
విద్యావ్యవస్థ అవకతవకలు NEET paper leak, నిరుద్యోగం,సోషల్ unrest సూచిక. ఫాలోవర్స్ తో పుట్టిన ఉద్యమం, నేడు జంతర్ మంతర్ వేదికగా విద్యా శాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని ప్రధానంగా వున్న, ఈ దేశం లో యువతరం కొత్త రాజకీయాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అహింసా పద్ధతిలో అంబేద్కర్, bhagatsingh ప్లేకార్డ్స్ పట్టుకుని పౌర సమాజాన్ని మద్దతుగా కూడగడుతూ ముందుకెళ్తోంది. భవిష్యత్తు పై అసనువేపింది.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ మన దేశ Gen-Z మార్కు యువ రాజకీయం. బద్ధకస్తులు,పనీపాటలేని పరాన్నజీవులు అని ఒక కేసు సందర్భాన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యకి ప్రతిగా ఆన్లైన్ లో పుట్టిన యువ పార్టీ. ప్రభుత్వం, దాని యంత్రాంగం పైన నిరసన లోంచి వచ్చిన సంఘటిత స్వరం. ఈ ఉద్యమానికి నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షా పత్రం లీక్ మరియు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణలో అవకతవకలు అనే కారణాలు పైకి కనిపిస్తున్నా ఒక కొత్త రాజకీయాలకి దారులు వేయాలన్న genZ ల బలీయమైన ఆకాంక్ష కూడా కనిపిస్తుంది. నీట్ మెడికల్ ప్రవేశ పరీక్ష దేశంలో ప్రతిష్టాత్మక పరీక్ష, కనీసం రెండు లక్షల విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించింది. ప్రశ్న పత్రాలు లీకు తో పరీక్షల్ని రద్దుచేసి మళ్లీ జరిపించాల్సి వచ్చింది. ప్రభుత్వం, దాని యంత్రాంగం బాధ్యత రాహిత్యాన్ని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. అభిజిత్ దీప్కే అనే విద్యార్థి ఆన్లైన్ లో స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీకి వెనువెంటనే 29 మిలియన్ ఫాలోవర్స్ తోడయ్యారు. ఉద్యమం ఆన్లైన్ లోంచి వీధుల్లోకి వచ్చింది. జంతర్ మంతర్ వద్ద చేరి పెద్ద ఎత్తున యువతరం నీట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ జవాబుదారీతనం కోరుతూ , కేంద్ర విద్యాశాఖ రాజీనామా చేయాలని నిరసన దీక్షలు మొదలేశారు. ప్రధాన నగరాల్లో పౌర సమాజ పెద్దలు, విద్యార్థుల తో పెద్ద సభలు జరిపేరు. అటు పిమ్మట జంతర్ మంతర్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉదృతం చేశారు. లడఖ్ కు చెందిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నాయకత్వం వహించిన సోనం వాంగ్‌చుక్ పాల్ విద్యార్థులతో విద్యామంత్రి రాజీనామా చెయ్యాలని ఆమరణ నిరాహార దీక్ష కి కూర్చోవటం జరిగింది. ఈ ఉద్యమం ఏవైపుకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. కాకుంటే, అవినీతిమయమైన, నిరంకుశత్వంగా, ప్రజల్ని పట్టించుకోకుండా, నిరుద్యోగం పెరుగుతూ, భవిషత్తు చీకటవుతుందని భావించిన తరుణంలో ఈ విద్యార్థి ఉద్యమం ఈ దేశ రాజకీయాల్లో ఒక మెరుపు లాంటింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ప్రస్తుతం ఒక నిర్దిష్ట భావజాలన్నీ, నిర్మాణాన్ని సంతరించుకోక పోయినా, రాజకీయాలు సంక్షోభంలో ఉన్న సమయంలో ఒక చిరు ఆశ. నియంతృత్వ ధోరణులను యువతరం ప్రశ్నిస్తుందనే భరోసా.యధాస్థితిలో మార్పు తీసుకొస్తుందేమోనని ఒక నమ్మకం. ఉద్యమం ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఒక ఆశలా కనిపించింది. రేపటి పై ఒక బరోసా నిచ్చినట్టు అనిపించింది.
తగ్గని అవినీతి, అసమర్థ విద్యావిధానం, నిరుద్యోగం తో బాటు ప్రతి విషయం మీద ఆంక్షలు, కనీస స్వేచ్ఛకి భంగం లాంటి విషయాలు ఈ జనరేషన్ ను ఆత్మపరిశీలన లోకి నెట్టి వేశాయి. ఊదరగొట్టే జాతీయ వాదం, హిందూ మత మహోన్నతం రోజు వారీ బతుకు పోరుకు పరిష్కారం ఇవ్వలేక పోతుందని అర్థమవుతుంది. ప్రశ్నించిన వాళ్ళని దేశ ద్రోహులుగా ముద్ర వేయడం, పౌరులు తమ భావాల్ని వ్యక్త పరిచే ప్రజాస్వామిక స్వేచ్ఛ లేక పోవడం గమనిస్తున్నారు.
ప్రతి సమస్యకూ దేశ భక్తి ని పరిష్కారం గా చెబుతూ, ఉద్యమించిన యువతను ఎగతాళి చేస్తున్నదానికి వ్యంగ్యంగా రాసింది:
‘పనీ పాట లేని బొద్దంకుల్లారా!
అయిందానికీ కానిదానికీ అరవకండహే
ఆకలితో చావడమే దేశభక్తని తెలుసుకోండి!
యుద్ధ దొర కాళ్ళ మీద సాగిలపడటం
విశ్వ బానిస భజన కానేకాదని మలుసుకోండి
దేశమసలే లేవలేని క్లిష్ట పరిస్థితో ఉంది! ‘ (కేశవ కుమార్, క్లిష్ట పరీక్ష)
కాక్రోచ్ జనతా పార్టీ పేర యువతరం ఒక చోట సంఘటితమై, పుస్తకాలు, పూలూ పట్టుకుని,అంబేద్కర్, భగత్ సింగ్ ప్లకార్డులు పట్టుకుని , గాంధేయ పద్ధతిలో మా ఉద్యమం వుంటుందని ఒక కొత్త రాజకీయ ఒరవడిని ప్రవేశపెట్టడం జరిగింది. సోషల్ మీడియాను ఎంతో సృజనాత్మకంగా పోస్టర్స్, రీల్స్, AI చిత్రాలు, AI సాయంతో ఉద్యమసంభాషణలు అన్ని భాషలలో అనువాదం అయి అందరికీ చేరేలా ఉపయోగిస్తున్నారు. ఈ ఉద్యమం ప్రధాన మీడియా పట్ల స్పష్టమైన వైఖరితో ఎంతో అప్రమత్తంగా ఉంటూ, గోడీ మీడియా గో బ్యాక్ అంటూ నిలదీస్తూ అడ్డుకుంటున్నారు. ఈ ఉద్యమం నిర్మాణం లో ఏ రూపు తీసుకుంటుందో అప్పుడే అంచనా వేయలేం. కాకుంటే ఉద్యమంగా నిలబెట్టుకునేందుకు అనేక సవాళ్లను అధిగమించాల్సి వస్తుంది. ఫేక్ (సోషల్ ) మీడియా దాడులు నుండి , పాలక రాజకీయాలు కో ఆప్ట్ ఆఫర్ల నుండి రక్షించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కాక్రోచ్ ఉద్యమం మీద అన్నివైపుల నుండి దాడుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వైపు ప్రధాన మీడియా పట్టించుకోనట్టుగా నటిస్తుంది. అధికార పార్టీ కి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు తప్పుడు రాతలతో, విపరీతమైన ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. ఉద్యమ ప్రదేశాల్లో చొరబడి ఒక విధమైన ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎప్పటిలానే, ఉద్యమిస్తున్న విద్యార్థుల్నుదేశించి విద్యామంత్రి లాంటి వాడు తుక్డే తుక్డే గ్యాంగ్ అని, ప్రచారం మొదలెట్టేరు.
ఈ కాక్రోచ్ ఉద్యమానికి ఈ దేశ రాజకీయాల్ని మార్చే శక్తి ఉంది. ఇది మొదటి అడుగు మాత్రమే. ఉద్యమిస్తున్న యువతకి ఈ నిరంకుశ వాతావరణాన్ని మార్చి ప్రజాస్వామీకరణ కోసం పోరాడాలనే పట్టుదల ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఉద్యమిస్తున్న యువత ఏకీకృత సమూహం కాదని, అనేక ఆకాంక్షలు, గుర్తింపులు కోరుకొనే యువ సమూహమని గుర్తెరగాలి. తమలోని వైరుధ్యాలను గుర్తించి ఒక ప్రజాస్వామికంగా సంఘటితమయ్యే రాజకీయ ప్రయత్నం చేయాల్సివుంటుంది.అవి కుల వ్యతిరేకంగా, స్త్రీల సమస్యల పట్ల కార్యాచరణ, కార్పొరేట్ విధానాల పట్ల అప్రమత్త, అభివృద్ధి పేర జరిగే విధ్వంసం, పౌరసత్వమే ప్రశ్నార్థకమైన మైనారిటీలకి రక్షణ, అనేక జాతుల మధ్య సామరస్యం లాంటి విషయాల పట్ల ఆచరణకి అనుకూలమైన స్పష్టతతో ఐక్యంగా సాగాలి. నేటి నిరంకుశ రాజకీయాల్ని ఎదిరించి సృజనాత్మకంగా నిలబడటం ఈ జెన్ జీ నిబద్ధత, సాహసం, త్యాగంతో ముడిపడి ఉంది.
మెరుగైన రేపటి ప్రజాస్వామిక సమాజం కోసం!
ఈ ఉద్యమాలను గమనిస్తే ఇవన్నీ ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని,చేతకానితనాన్ని ప్రశ్నించాయి. మార్కెట్ తో మిలఖతయిన ప్రభుత్వాలు, ప్రజలకు దూరమవటమే కాక, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. ఇంతకు ముందున్న రాజకీయాలు ఒక ఎత్తయితే, 2014 తర్వాత బీజేపీ పార్టీ అధికారం లోకి వచ్చేక, దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. మతతత్వ జాతీయ రాజకీయాలు, కార్పొరేట్ మార్కెట్ శక్తులతో, మీడియా తో కలవటమే గాక, పౌర సమాజం లో హిందుత్వ/ భారతీయ జాతీయత పేర ఒక పద్ధతి ప్రకారం మొబైలైజ్ చేసి, మైనారిటీ ల పేర, క్రింది కులాల మీద, స్త్రీల మీద సంస్కృతిక దాడిని వేగవంతం చేసింది. ఎటువంటి ప్రజాస్వామిక ఉద్యమాన్నయినా, అసమ్మతి స్వరాలనైన దేశ ద్రోహులుగానో , టెర్రరుస్తులుగాని ముద్ర వేసి అణిచివేటం జరుగుతుంది.
ఈ ఉద్యమాలు ప్రభుత్వ అణిచివేతను ఏ మాత్రం ఖాతరు చేయకుండా, అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. Deepening the democracy అని చెప్పవచ్చు. ఈ ఉద్యమాలు ఏ మేరకు విజయం సాధించారు అని చూసే కన్నా, ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోసం తిరుగుబాటు చేసి, ఎంతో శక్తివంతమని తలచే ప్రభుత్వాలను గడగడ లాడించి ప్రజల్లో ధైర్యాన్ని మింపేరు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేశారు. ఈ ఉద్యమాలు జనాన్ని సమీకరించడంలో, సంఘటిత పోరాటానికి సన్నద్ధం చేయటంలో సృజనాత్మక పద్ధతులు అనుసరించారు. సోషల్ మీడియా ను ఒక ఎఫెక్టివ్ సాధనంగా ఉపయోగించారు. ఈ ఉద్యమాలు అహిందయుతంగా, చట్టబద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు తీవ్రమైన హింసా పద్ధతులు అవలంబించేరు. భౌతిక హింస కన్నా మీడియా కథనాల ద్వారా, తప్పుడు సమాచారం ద్వారా, పార్టీల సొంత ఐటీ సెల్స్ ఫేక్ ప్రచారం ద్వారా ఉద్యమాల మీద, అందులో పాల్గొన్న వారి మానసిక ధైర్యం దెబ్బతినేలా, ఈ ఉద్యమాలను డిమీనింగ్ చేయడం పెద్ద ఎత్తున్న ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఉద్యమాలు చేస్తున్న రైతులను ఖలిస్తాన్ టెర్రరిస్టు లని, షాహిన్ బాగ్ స్త్రీల ఉద్యమాన్ని యాంటీ నేషనల్ గా, పాకిస్తానీ ప్రోద్భల ఉద్యమంగా , కాక్రోచ్ ఉద్యమం దేశాన్ని విచ్చిన్నం చేసే తుక్డే తుక్డే గ్యాంగ్ గా, లేకుంటే మావోయిస్ట్, అర్బన్ నక్సల్ పేర ఈ ఉద్యమాలను అణిచివేయటం చూస్తాం. ఈ ఉద్యమాలు స్వతంత్ర మీడియా వ్యవస్థను సృష్టించుకోవడం అవసరం అయింది. ఈ ఉద్యమాలన్నీ, ‘గోడీ మీడియా గో బ్యాక్’ అనే నినాదం బలంగానే వినిపించాయి. ఈ ఉద్యమాలు దేశాన్ని ఎంతగానో ప్రభావితం చేసినా, బలమైన నిర్మాణాన్ని, నాయకత్వాన్ని ఏర్పరచుకునే దానిలో కొంత వెనుకబడి ఉంది. ఈ ఉద్యమాలు ఒక దాని తర్వాత ఒకటి వచ్చి, దేనికదే ప్రత్యేక స్వతంత్ర ఉద్యమంగా కనిపించినా, ఇవన్నీ ఒకే ప్రభుత్వం పైన భిన్న నిరసన రూపాలు. వీటిని ఒక ప్రజాస్వామిక ఆలోచనా కొనసాగింపుగానే చూడాలి. ఈ ఉద్యమాల్ని అణిచివేశామని ప్రభుత్వాలు భావించినా, అది తాత్కాలికమే. ఈ ఉద్యమాల స్ఫూర్తి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక విప్లవాన్ని సృష్టించే సత్తా ఉందని మర్చిపోరాదు.
ఈ యుద్ధ సమయంలో ఆర్థిక సంక్షోభం ఉందని ప్రభుత్వమే చెబుతుంది. ఆర్థిక అసమానతలు తీవ్రమయ్యాయి. పెద్ద చదువువులు చదివినా ఉద్యోగాలు,ఉపాధి లేక ఏళ్ళతరబడి నిరుద్యోగులుగా ఉండాల్సివస్తుంది. రోజువారీ జీవనానికి బతుకుదెరువు కరువైంది.సమాజంలోని అన్ని వర్గాల్లో నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం పట్ల,పాలకుల పట్ల అసంతృప్తి, అసహనం ఎక్కువైంది.నిన్నటికి వరకు ఈ ప్రభుత్వం పట్ల ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి భ్రమలు తొలిగి పక్కకు జరుగుతున్నాయి. దేశ భక్తి, దైవ భక్తి, మన మతం, మన సంస్కృతి, సంప్రదాయాలు అన్ని సమస్యలకు సమాధానంగా చూపి, ఎవరన్నా సమస్యలు గురించి మాట్లాడితే బలంతో, దబాయింపుతో వాళ్ళ నోళ్ళు మూయించే ప్రయత్నం చేశారు.సమాజంలోని వైరుధ్యాలను మత జాతీయతతో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు సమస్యలు జీవితాన్ని శాసించే క్రమంలో ఈ మాయ నుండి బయటపడి రోడ్లెక్క వలసిన పరిస్థితి. ప్రభుత్వాలు ఎప్పటిలానే యాంటీ నేషనల్, యాంటీ సోషల్, యాంటీ హిందూ పేర విరుచుకుపడే ప్రయత్నంలో ఉన్నా , ప్రభుత్వ కధనాల డొల్లతనాన్ని ఎండగడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలకు తోడుగా వచ్చి ప్రజాఉద్యమాలకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న ప్రధాన మీడియా స్రవంతిని ప్రజలు డీకోడ్ చేసుకుంటున్నారు. ఆ న్యూస్ ను తిప్పికొడుతూ, సోషల్ మీడియా ద్వారా సరైన సమాచారాన్ని ప్రజలకు చేరేలా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలక వర్గం ఎలాగోలా ట్రిక్స్ ద్వారా, పోల్ మేనేజ్మెంట్ ద్వారానో, ప్రతిపక్షాలను బలహీన పరచడం ద్వారానో తిరుగు లేని రాజకీయ శక్తిగా చెప్పుకుంటున్నా, నైతికంగా, ప్రజల్లో పట్టుకోల్పోయింది.ఏ క్షణంలోనైనా ప్రజలు అవకాశం తీసుకుని తిరబడేలా, నివురుగప్పిన నిప్పులా ఉన్నారు.అందుకే ఈ ఉద్యమాలు పైకి చిన్నవిగా, ఏదో ఒక ప్రత్యేక సమస్య గురించి పోరాడుతున్నట్టు కనిపించినా, ప్రజల్లో పేరుకున్న అసంతృప్తికి ఒక ఆశగా, ఒక సంఘటిత ఉద్యమం గా ఉన్నాయి. ఈ ప్రజా ఉద్యమాలు ఆరోగ్యకరమైన రేపటిని వాగ్దానం చేస్తున్నాయి.ఇవి కేవలం ఆ యా సామాజిక సమూహాలకు పరిమితం కాక, విస్తృతిని పెంచుకున్న ఉద్యమాలుగా చూస్తాం. ఇప్పుడు ప్రజల మీద యుద్ధం ప్రకటించిన ప్రపంచంలో, పౌరుల్ని అడ్డుతొలగించే రాజ్యంలో, మనుషుల్లేని దేశంలో, మనుషుల మీద గౌరవం లేని సందర్భాల్లో, వివక్షత, అణిచివేత వున్న చోట సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్యాన్ని ఎట్టిపట్టేలా మరో ప్రపంచాన్ని, మరో మన దేశాన్ని ఊహిద్దాం. ఆశిద్దాం.అందుకు ధైర్యంగా ముందు నిలుద్దాం.
చివరగా ప్రజాస్వామిక స్ఫూర్తితో వీరోచితంగా నిలబడి పోరు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ:
‘బహుళజాతి మార్కెట్
బందీఖానాలో రాజ్యం
సామాజిక దోపిడీ శాస్త్రబద్ధం
అన్యాయం దైవసమ్మతం
మతమూ మార్కెట్టూ పాలనా
పర ద్వేషమూ ఏకమైన
రాజకీయ శాసనం
బహుళ క్రూరత్వాన్ని
భగ్నం చేస్తూ నిలిచిన నినాదమై
మాములు మనుషులే
మంచు తుఫానులవటం
క్రూర హింసని ఎగతాళి చేస్తూ
నవ్వుతూ ఉరితాళ్ల మీద నడవటం
పంజరాలని పగలగొట్టి
సీతాకోకచిలుకలై ఎగరటం
నిరంకుశ రాజ్యంలో
నిప్పుల మీద నాట్యం
చేసిన తరమొకటుందని
చెప్పుకునే రేపటి
చందమామ కతల కోసం.’
(కేశవ కుమార్, ఇప్పుడు వీస్తున్న గాలి, డిసెంబర్ 30, 2020).
(ప్రొఫెసర్ జి.కృష్ణారెడ్డి పదవ స్మారక ఉపన్యాసం, జూన్ 26,2026.)