రొట్టెలు కాల్చడానికి
పెంకలో సగమైనా
ఇల్లొకటి ఉండేది
ఎండకూ వానకూ తల దాచుకోడానికి
తల్లి అరచేతులంత కాకపోయినా
నయనమంత ఇల్లొకటి ఉండేది
హృదయాన్ని పొరలు పొరలుగా విప్పుతూ
ప్రేమను ఆవిష్కరించడానికి
సహచరి చిరునవ్వంత కాకపోయినా
నుదిటిపై గాయమంత ఇల్లొకటి ఉండేది
దుఃఖాన్ని కుప్పబోసుకోడానికి
కనుబొమ్మంత కాకపోయినా
కన్నీటి చుక్కంత ఇల్లొకటి ఉండేది
హోమ్ వర్క్ రాసుకోడానికి
పుస్తకమంత వెడల్పు కాకపోయినా
పగిలిన అద్దం ముక్కంత ఇల్లొకటి ఉండేది
నిద్రించడానికి
ఆరడుగులు కాకపోయినా
బియ్యం గింజంతైనా ఇల్లొకటి ఉండేది
శ్వాసను కాపాడుకోడానికి
ఆక్సీజన్ సిలిండరంత కాకపోయినా
పోలీసు తూటాలు దిగిన
పసిపాప శవమంత దేశమైనా ఉండేది
మనిషీ ఇల్లూ దేశమూ ఇప్పుడేదీ లేదు
ఈ నేల మొత్తం బుల్డోజర్ల రాజ్యం.
హృదయం లేని బుల్డోజర్లకు
హృదయం లేని పాలనకు
కూల్చే శక్తులుంటాయి గానీ
ప్రేమనూ మానవత్వాన్ని నిర్మించే శక్తులెక్కడివి