హమ్ దేఖేంగే

నడిరోడ్డు మీద
కపట కాపలాదారుల
నారంగి నీడలు
తెల్లని పావురాయి రెక్కలు
తెంపిన ఛిన్నాభిన్నంలో
రేపటిని పచ్చగా చూపిన నిలువద్దం
పగిలి పటాపంచలయిన
చీకటి చప్పుడు
వేవేల ఆవేశాలని నిద్రలేపింది

ఏడు గంటలైనా కొట్టని
గడియారపు ముల్లు
ఎర్రటి గునపంలా మారి
గడపలోపలే ఆగిపోయిన
నాలికలేని పాదాలకింది
సంస్కారాలనీ సాంప్రదాయాలనీ
తవ్వి పారేసింది

స్వేచ్ఛ మీదున్న ఆశ
ఆకలి కడుపుకి అన్నం ముద్ద వాసన
పోరాటాల్లో చిగురించమనీ
అనుకున్న ఆకాశాలన్నీ ఆవహించేయమనీ
ఆడపిల్లలందరినీ ఆహ్వానించింది

కాలాలను దిగమింగిన
నదీప్రవాహంలోంచి
అణగదొక్కిన ఆక్రోశమంతా
ఒక్క ఉదుటున
గుండెల కట్టలు తెంచుకుని
నినాదాలుగా దూసుకొచ్చింది
మగాళ్ల మదాలని చిత్తుచేసింది
పితృస్వామ్య పునాదులను కదిలించింది
నోరారా కళ్లారా రీళ్ళారా

రాజుల రాజకీయాలు
ఎన్ని కుట్రలు పన్నినా
ఎన్ని కంబ్యాక్లు విసిరినా
జెన్ జీ ఆడపిల్లలు
మన భుజం తడిమి
“ఛిల్ బ్రో – హమ్ దేఖేంగే…” అంటుంటే
ఇంకా దేశం ఊపిరితోనే ఉందని
నమ్మకమొస్తోంది…

పుట్టినదీ, పెరిగినదీ, చదువుకున్నదీ హైదరాబాదులో. 'వచన కవితా పితామహుడు' కుందుర్తి ఆంజనేయులు గారి మనవరాలు. ఫ్రీవెర్స్ ఫ్రంట్ బాధ్యతను కొనసాగించిన కుందుర్తి సత్యమూర్తి గారి కూతురు. బాల్యం నుంచీ ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కార సమావేశాలకు వెళ్ళటం, ప్రముఖులైన కవులతో, వారి పుస్తకాలతో సంబంధబాంధవ్యాల వలనా, కవిత్వం రాయాలనే తపనతో కొంతకాలంగా కవిత్వం రాస్తున్నారు. పదిహేను వరకూ వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి. M.Com, M.B.A., P.G.D.C.A. చదివారు. ప్రస్తుతం సింగపూర్ లో నివాసం. migrant workers welfare కోసం పని చేసే ఒక N.G.O.లో పని చేస్తున్నారు. రంగవల్లికలు వేయడం, బొమ్మలు గీయడం, పెయింటింగ్ హాబీలు. డిసెంబర్ 2024లో ‘జస్ట్ ఎ హౌస్ వైఫ్’ పేరుతో తొలి వచన కవితా సంపుటి ప్రచురించారు.

Leave a Reply